Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మాయా శశిరేఖ-7

[రాయపెద్ది హనుమంతరావు – సంజీవ లక్ష్మి స్మారక కథల పోటీ 2025 లో సైన్స్ ఫిక్షన్ విభాగంలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ ‘మాయా శశిరేఖ’. రచన శ్రీ రాచపూటి రమేష్. ఇది 7వ, చివరి భాగం.]

“మశ్చీంద్ర గారి కండిషన్‌ క్రిటికల్‌గా ఉంది. ఆయనకు ఆపరేషన్‌ చేసి తలకు స్టిచెస్‌ వేశాం. కానీ ఆయన కోమాలోకి జారుకున్నారు. మరో రెండు రోజులు గడిస్తేనే కానీ ఏమీ చెప్పలేం” ఆపరేషన్‌ థియేటర్‌ నుండి బయటకు వచ్చి చెప్పాడు డాక్టర్‌ భరత్‌. థియేటర్‌ బయట ఆత్రుతతో కాచుకొని ఉన్న మశ్చీంద్ర కుటుంబ సభ్యుల ముఖాలు పాలిపోయాయి, ఆ మాటలకు.

“శుభమా అని పెళ్లి జరగాల్సిన ఇంట్లో ఇటువంటి దారుణం జరిగింది. అన్నెం పున్నెం ఎరుగని మనిషిపై ఇటువంటి దారుణానికి ఒడిగట్టడానికి వాడికి మనసెలా వచ్చింది” కళ్ల నీళ్లు పెట్టుకుంటూ చెప్పింది వర్ధనమ్మ.

“ఆ వీరమణి గాడి అంతు చూస్తాను. ఇప్పుడే వెళ్లి వాడి కాళ్లూ చేతులూ విరగొడ్తా” అని ఆవేశంతో ఊగిపోతూ అన్నాడు శశికాంత్‌.

“పద అన్నయ్యా, నేనూ నీతో వస్తాను. వాడి అంతు చూద్దాం” కోపంతో రెచ్చిపోతూ పైకి లేచింది రేఖ.

“సార్‌, మీరు ఊరుకోండి. నాన్నగారికిలా ఉన్నప్పుడు మీరిలా మరో కేసులో ఇరుక్కుంటే ఫాదర్‌ను చూసేదెవరు? పోలీస్‌ కంప్లైంట్‌ ఇచ్చాముగా, పోలీసులు వాడి సంగతి చూసుకుంటారు” శశికాంత్‌ చేతులు పట్టుకొని చెప్పాడు శివరామ్‌.

“ఔనురా, శివరామ్‌ చెప్పింది నిజం. నాన్నగారిని ఇప్పుడు మనం దగ్గరుండి చూసుకోవాలి. దేవుడే ఆ దుర్మార్గుల సంగతి చూసుకుంటాడు” అని పిల్లలిద్దర్నీ శాంతపరచింది వర్ధనమ్మ.

***

ఆరోజు ఉదయం నుండీ శశికాంత్‌కు తలనొప్పిగా, తల తిరుగుతున్నట్లుగా ఉంది. రేఖకు కూడా జ్వరం వచ్చినట్లు నీరసంగా ఉంది. వర్ధనమ్మకూ తలదిమ్మూ, వాంతులు. ఇంటికి వచ్చిన శివరామ్‌ వాళ్ల పరిస్థితి చూసి కంగారు పడ్డాడు.

“హఠాత్తుగా మనకూ ఇలాంటి లక్షణాలు దాపురించాయేమిటి? నాన్నగారితో బాటూ మనమూ హాస్పిటల్లో చేరాల్సినట్లుగా ఉంది” అంది రేఖ.

“నాన్నగారి గురించి మీరు ఎక్కువగా ఆలోచించి దిగులు పెట్టుకోకండి. టెన్షన్‌తోనే మనకీ తలనొప్పి, ఒళ్లునొప్పులూ” అన్నాడు శశికాంత్‌.

శివరామ్‌కు మాత్రం వాళ్ల అనారోగ్యానికి కారణం అది కాదని తెలుసు. వర్ధనమ్మ అన్న వెంకట్రావు కూడా తనకూ అవే లక్షణాలు ఉన్నట్లు వాళ్లకు ఫోన్‌ చేసి చెప్పాడు. అంటే జైనోమ్‌ ఇంజక్షన్‌ తాలూకు సైడ్‌ ఎఫెక్ట్స్‌ వారిపై పని చేస్తూ ఉన్నాయి. విరుగుడు మందు వెంటనే ఇవ్వకపోతే ఆ నలుగురూ ఉన్మాదానికి లోనయ్యే ప్రమాదం ఉంది.

హఠాత్తుగా తానెంత ప్రమాదం తెచ్చిపెట్టాడో అర్థమయ్యింది శివరామ్‌కు. ఆ ఇంజక్షన్‌ వీళ్లకిచ్చి దారుణమైన పొరబాటు చేశాడు, తన అత్సుత్సాహంతో. సలహా చెప్పడానికి మశ్చీంద్ర కూడా ఆరోగ్యంగా లేడు, డైరీ మాయమయింది. వీరమణి పోలీసులు ఎంత వెతుకున్నా దొరకడం లేదు.

‘మశ్చీంద్ర గారు ఆఖరు రోజున తానేదో చారిత్రాత్మకమైన విజయం సాధించబోతున్నానని చెప్పాడు. అంటే జైనోమ్‌ ఇంజక్షన్‌కు యాంటిడోట్‌ ఆయన కనిపెట్టాడా? కనిపెట్టి ఉంటే దాన్ని లాబ్‌లోనే పెట్టి ఉంటాడు. ఆ విరుగుడు ఇంజక్షన్‌ ఇచ్చి ఈ నలుగురిలో జైనోమ్‌ ప్రభావాన్ని తగ్గించవచ్చు’ అని తలపోస్తూ శివరామ్‌ లాబ్‌లో అణువణువూ వెతికాడు. కానీ ఎక్కడా అతనికి ఆ జైనోన్‌ మందు తాలూకు విరుగుడు మందు కనిపించలేదు. ‘ఒకవేళ మశ్చీంద్ర గారు ఆ మందును ఏదైనా రహస్య ప్రదేశంలో దాచాడా? తనకు కూడా తెలియని ఆ రహస్య ప్రదేశం లాబ్‌లో ఎక్కడుంటుంది?’ హఠాత్తుగా శివరామ్‌కు మనోజ్‌ గుర్తుకు వచ్చాడు. మనోజ్‌ చాలా కాలం మశ్చీంద్రకు అసిస్టెంటుగా పనిచేశాడు. అటువంటి సీక్రెట్‌ ప్లేస్ ఉంటే అతనికి తప్పక తెలిసి ఉంటుంది అనుకుంటూ మనోజ్‌కు ఫోన్‌ చేసి జరిగిందంతా వివరించాడు.

“అరె, ఎంతపని జరిగింది. ఇరవై రోజుల శలవుపై నేను ఈ రోజు సాయంత్రమే ఇక్కడ బయలుదేరి రేపటికి ఇండియా చేరుతాను. అటువంటి రహస్య ప్రదేశం ఏదైనా ఉంటే గుర్తు తెచ్చుకొని నీకు ఫోన్‌ చేసి చెబుతాను” అన్నాడు మనోజ్‌, గాబరాగా.

***

శివరామ్‌ ఇంటి ముందు కారు ఆగింది. అందులోంచి ఖద్దరు ధోవతీ, తెల్లని చొక్కా, నుదుట వీభూతి రేఖలతో ఉన్న ఒక బట్టతల శాల్తీ దిగాడు. యాభైఏళ్లుంటాయేమో అతనికి. చూడ్డానికి పురోహితుడిలా ఉన్నాడు.

“శివరామ్‌ గారుండేది ఇక్కడేనా” ఇంట్లోంచి బయటకు వచ్చిన అతని తల్లి సరోజమ్మను అడిగాడు.

“ఔనండీ, ఇప్పుడే బయట నుండి వచ్చి ముఖం కడుక్కుంటూ ఉన్నాడు. మీరు ఎక్కడ నుండి వచ్చారు? లోనికి రండి” అన్నది ఆ పెద్దావిడ.

“నా పేరు సదాశివమూర్తి. అనకాపల్లెలో నాకు మేరేజ్‌ బ్యూరో ఉంది. మీ కులానికి చెందిన చంద్రశేఖరం అనే బ్యాంకాఫీసరు ఢిల్లీలో ఉంటున్నాడు. అతనికి సరళ అని ఒక్కతే అమ్మాయి. డిగ్రీ పాసై, టీచరు ట్రైనింగు చేసింది. అతనికెవరో మీ అబ్బాయి పెళ్లికున్నాడని చెప్పారట. కానీ రేపు ఉదయాన్నే అనకాపల్లికి వచ్చిన చంద్రశేఖరం, కుమార్తెతోబాటూ మళ్లీ ఢిల్లీకి వెళ్లిపోవాలి. అందుకే శివరామ్‌ను వెంటబెట్టుకొని అనకాపల్లికి వెంటనే రమ్మని నన్ను పంపించాడు” సోఫాలో కూర్చుని చెప్పాడు బట్టతల వ్యక్తి.

“ఇంతర్జంటుగా పెళ్లిచూపులంటే ఎలా? ఆ చంద్రశేఖరం గారిని వెంటబెట్టుకొని రాలేకపోయారా” అంది సరోజమ్మ.

“లేదమ్మా, ఆయన ప్రయాణపు హడావిడిలో ఉన్నాడు. ఫోన్‌ చేసి ఇస్తాను. ఆయనతో మాట్లాడండి” అని మూర్తి ఎవరికో ఫోన్‌ చేసి సెల్‌ఫోన్‌ సరోజమ్మకు ఇచ్చాడు. సరోజమ్మ ఫోన్లో మాట్లాడి అవతల వ్యక్తి చెప్పిన విషయాలకు సంతృప్తి చెందింది. ఆ సరికే అక్కడకు వచ్చిన శివరామ్‌ మూర్తితో మాట్లాడాడు.

“అబ్బాయితో బాటూ నేనూ రావాలి. కానీ నాకు నిన్నటి నుండీ జ్వరం. అబ్బాయిని మీవెంట బెట్టుకొని వెళ్లండి” అన్నది సరోజమ్మ.

“మీరు రెస్టు తీసుకోండమ్మా, ముందు అమ్మాయి, అబ్బాయి ఒకరినొకరు చూసుకొని ఇష్టపడాలి. తరువాత మీరు అమ్మాయిని చూస్తురు లేండి” అన్నాడు మూర్తి.

పెళ్లిచూపులనగానే శివరామ్‌ సంబరపడుతూ తయారై వచ్చాడు. సదాశివమూర్తి సరోజమ్మకు నమస్కరించి కారెక్కాడు. శివరామ్‌ మూర్తి పక్కన కూర్చోగానే కారు కదిలింది. కాసేపు వెళ్లాక కారు సింహాచలంవైపు టర్న్‌ తీసుకోవడం చూసి శివరామ్‌ ఆశ్చర్యపోతూ “ఇటెక్కడికి” అన్నాడు. మూర్తి తన లెదర్‌ బేగ్‌లోంచి రివాల్వర్‌ తీసి, శివరామ్‌ తలకు ఎక్కు పెట్టి “నోరెత్తితే చంపేస్తాను. కదలకుండా కూర్చో” అన్నాడు. శివరామ్‌ పైప్రాణాలు పైనే పోయాయి. కారులో ఉన్న మరొక బలాడ్యుడూ, మూర్తి కలసి శివరామ్‌ కళ్లకూ, నోటికి గంతలు కట్టారు. అర్ధగంట ప్రయాణం తరువాత కారు ఆగింది. శివరామ్‌ను ఎవరో ఒక ఇంటిలోకి తీసుకెళ్లి మేడమీది ఓ మూలగదిలో బంధించారు. అతని నోటికి, కళ్లకు ఉన్న బంధనాలు తొలగించారు. తన ఎదురుగా నిలుచుని ఉన్న నాగముత్తు, వీరమణిని చూసి శివరామ్‌ భయంతో బిక్కచచ్చిపోయాడు.

***

పదినిమిషాల పాటూ ఆలోచించాక మనోజ్‌కు తానిదివరకూ పనిచేసిన మశ్చీంద్ర గారి లేబ్‌లో ‘ఏవైనా విలువైన కెమికల్స్‌ కానీ, వస్తువులు గానీ దాచడానికి ఉపయోగించే రహస్య ప్రదేశం ఎక్కడుందో’ గుర్తొచ్చింది. వెంటనే శివరామ్‌ నంబరుకు ఫోన్‌ చేశాడు. కాని శివరామ్‌ సెల్‌ స్విచ్ఛాఫ్‌ చేసి ఉంది. మళ్లీ మళ్లీ ప్రయత్నించినా, ‘స్విచ్ఛాఫ్‌’ అనే వస్తోంది. దాంతో ఖంగుతిన్న మనోజ్‌ తన ఇండియా ప్రయాణానికి బ్యాగేజి సర్దుకొని, తన షెడ్యూలు ప్రకారం ఫ్లైట్‌ ఎక్కడానికి ఏర్‌పోర్టుకు బయలుదేరాడు.

***

“పెళ్లి చూపులనగానే ఎగేసుకుంటూ బయలుదేరావు. నీ పెళ్లి నేను చేస్తాను” అని శివరామ్‌ దవడపై లాగి ఒక్కటిచ్చాడు వీరమణి. శివరామ్‌ దవడ పగిలి రక్తం కారసాగింది. భయంతో చిగురుటాకు లాగా వణికిపోతూ ఉన్నాడు. అప్పటికే అతడి నుండి సెల్‌ఫోన్‌ ఆ ముఠా సభ్యులు లాగేసుకున్నారు.

“నువ్వు బతికి బట్టకట్టాలంటే ఒక్కటే మార్గం. ఈ డైరీ లోని కోడ్లకు అర్థమేమిటో చెప్పు” నాగముత్తు శివరామ్‌ చేతికి డైరీ ఇచ్చాడు. దాన్ని చూడగానే అది మశ్చీంద్ర డైరీ అని బోధపడింది శివరామ్‌కు.

శివరామ్‌ ఆ డైరీ చూసి, “ఈ డైరీలోని కోడ్లకు నాకు నిజంగా అర్థం తెలియదు. మశ్చీంద్ర సార్‌ నాతో ఎప్పుడూ చెప్పలేదు” అన్నాడు. మళ్లీ అతని దవడ పేలింది.

“సాయంత్రం ఆరింటి వరకూ నీకు సమయమిస్తున్నాం. ఈలోగా నువ్వు ఆలోచించుకొని ఆ కోడ్లకు వివరణ ఇవ్వు. లేకపోతే పరలోక ప్రయాణానికి సిద్ధంగా ఉండు” అని వీరమణి శివరామ్‌ను గదిలో బంధించి వెళ్లిపోయాడు.

***

ఇండియాకు తన ప్రయాణం సాగినంత సేపు మనోజ్‌ ఉద్విగ్నంగా ఉన్నాడు. తన ఉన్నతికి కారణం మశ్చీంద్ర గారే. ఎమ్మెస్సీ పీహెచ్‌.డీ చదివి నిరుద్యోగిగా ఉన్న తనను చేరదీసి, తనకు జీవశాస్త్రంలో ఎన్నో మెలకువలు, రహస్యాలు చెప్పి, తన విజ్ఞాన పరిధిని అపారంగా పెంచుకొనేలా చేశాడు. తత్ఫలితంగానే తనకు విదేశాల్లో మంచి అసైన్‌మెంట్‌ దొరికింది. భవిష్యత్తులోనూ తనకు దేశవిదేశాల్లో విస్తారమైన అవకాశాలున్నాయి. తనకు మంచి జీవితాన్ని ప్రసాదించిన మశ్చీంద్ర గారూ, అతని కుటుంబం ఇంత క్లిష్టపరిస్థితిలో ఉండడం మనోజ్‌ను కలచి వేసింది. ఏర్‌పోర్టులో దిగాక తన బేగేజి ఇంటి వద్ద దింపి, నేరుగా మశ్చీంద్ర గారింటికి వెళ్లాడు. అక్కడ పరిస్థితి హృదయ విదారకరంగా ఉంది.

హాల్లో వరుసగా ఉన్న మంచాల్లో శశికాంత్‌, రేఖ, వర్ధనమ్మలు ఉన్నారు. అంజి వారికి సపర్యలు చేస్తూ బిజీగా ఉన్నాడు. శశికాంత్‌ తనలో తాను ఏదో మాట్లాడుకుంటూ అయోమయ స్థితిలో ఉన్నాడు. మశ్చీంద్రగారు ఇది వరకు పనిచేసిన సైన్స్‌ ఇన్స్‌టిట్యూట్‌ తాలుకు డైరెక్టర్‌ శరత్‌చంద్ర వారిని చూడడానికి అప్పుడే ఒక డాక్టర్‌ను పిలుచుకొని వచ్చాడు. డాక్టర్‌ వారిని పరిశీలించి, “ఇటువంటి కేసులు నా జీవితంలో చూడలేదు. పరిస్థితి ఇలాగే ఉంటే వెంటనే వీరినందరినీ ఏ మంచి నర్సింగ్‌ హోంకో తరలించడం మంచిది” అన్నాడు. అంజి మనోజ్‌ను శరత్‌చంద్రకు పరిచయం చేశాడు. మనోజ్‌ కాసేపు ఆయనతో మాట్లాడి, లేబరేటరీ తాళాలు అంజి నడిగి తీసుకొని లేబ్‌లోకి వెళ్లాడు.

అప్పుడే అంతు పట్టని వింతలక్షణాలతో బాధపడుతున్న వెంకట్రావును తీసుకొని అతని భార్య తాయారు అక్కడికొచ్చింది. శశికాంత్‌ సాయంతో భర్తను మంచి హాస్పిటల్లో చూపించాలనుకొని విజయనగరం నుండి వచ్చిందావిడ. కానీ ఇంట్లో అందరి పరిస్థితీ చూసి ఆందోళన పడింది. పక్క గదిలో వెంకట్రావునూ ఒక మంచంపై పడుకోబెట్టాడు అంజి.

మనోజ్‌ లాబ్‌ తాళాలు తీసుకొని లోనికి వెళ్లాడు. తాళాల గుత్తిలో మశ్చీంద్ర ఛాంబర్‌ తాలూకు తాళాలు కూడా ఉన్నాయి. ఛాంబర్‌ తలుపు తెరచి లోనికి వెళ్లాడు మశ్చీంద్ర అసిస్టెంట్‌ మనోజ్‌. మశ్చీంద్ర బీరువా తెరచి అందులోని లాకర్‌ ఓపెన్‌ చేశాడు. లాకర్‌లో ఉన్న ఒక తాళం చెవి తీసుకొని గది మూలకు నడిచి, ఒక చిత్రపటాన్ని తొలగించి, దాని వెనుక ఉన్న గోడను తడిమాడు. జాగ్రత్తగా ఆ గోడకమర్చిన పెయింట్‌ను బ్లేడుతో తొలగిస్తే ఒక తాళం చెవి పట్టే కంత కనిపించింది. అందులో తాళం చెవి ఉంచి రెండు సార్లు గట్టిగా తిప్పేసరికి, ఆ రహస్య సొరుగు తెరచుకొంది. అందులో ఒక చిన్న సీసాలో ఏదో ద్రవం ఉంది. ఆ సీసాకింద ఏదో కాగితం కూడా ఉంది. తమ గురువు గారు రాసిన ఆ పేపర్‌ చదివేసరికి మనోజ్‌ ముఖం వికసించింది. ఆ ద్రవాన్ని తీసుకొని చిత్రపటం యథాస్థానంలో ఉంచి, ఛాంబరును, లేబ్‌ను లాక్‌ చేసి మళ్లీ ఇంట్లోకి నడిచాడు మనోజ్‌ ఆనందంగా.

అప్పుడే శరత్‌చంద్ర డాక్టరును సాగనంపి లోనికి వచ్చాడు. మనోజ్‌ తాను తెచ్చుకున్న కిట్‌బేగ్‌లోంచి కొన్ని డిస్పోజబుల్‌ సిరంజులు తీసుకొని సీసాలోని ద్రవాన్ని ఆ సిరంజీలలో నింపాడు. “వీరికందరికీ ఒక ఇంజక్షన్‌ ఇస్తాను. ఖచ్చితంగా రేపటికి వీరు కోలుకొంటారు” అన్నాడు.

శరత్‌చంద్ర అతడి వంక అనుమానంగా చూసి “నువ్వు చెప్పేది నిజమని ఎలా నమ్మగలం, డాక్టర్లకే అర్థం కాని కేసు, కొంచెం జాగ్రత్తగా..” అంటూ ఉండగా అంజి ఆయన మాటలకడ్డు తగిలి,” “సార్‌, ఈయన మా పెద్దాయనకు నమ్మినబంటు లాంటివాడు, గుండమ్మ కథలో సూర్యకాంతానికి ఎన్టీవోడు లాంటి పనోడు. ఈయన ప్రయత్నం ఈయన చేస్తాడు. చేయనివ్వండి” అనడంతో శరత్‌ సమాధాన పడ్డాడు. మనోజ్‌ జాగ్రత్తగా నలుగురికీ వేరు వేరు ఇంజక్షన్లు ఇచ్చాడు. పేషెంట్ల కలవరింతలు, మూలుగులు ఆగిపోయాయి. గాఢమైన సుషుప్తిలోకి జారుకున్నారు వారంతా. “ఇంకేమీ భయం లేదు, రేపటికి వీళ్లంతా మామూలు మనుషులు కాగలరు” అని మనోజ్‌ రిలీఫ్‌గా పైకి లేచి “నేను మశ్చీంద్ర గారిని చూడ్డానికి హాస్పిటల్‌కు వెళ్తున్నాను. మీరూ నాతో వస్తారా?” అని శరత్‌ చంద్రను అడిగాడు. “లేదు, నేను పొద్దున్నే ఆయన్ను హాస్పిటల్లో చూశాను. మశ్చీంద్ర గారిపై దాడి చేసిన వీరమణిని పోలీసులు ట్రేస్‌ చేశారో లేదో కనుక్కోవాలి. అందుకే పోలీస్‌ స్టేషన్‌కు వెళ్తున్నాను” అన్నాడు శరత్‌ చంద్ర.

***

“వీరమణే ఈ దాడి చేశాడని మీరెలా చెప్పగలరు?” శరత్‌చంద్ర కళ్లలోకి సూటిగా చూస్తూ అడిగాడు సర్కిల్‌ ఇన్స్‌పెక్టరు రామ్మోహన్‌.

“అదేమిటి ఇన్స్‌పెక్టరు గారూ, వీరమణి పర్సు ఘటనాస్థలంలో దొరికింది కదా, అందులోని డ్రైవింగ్‌ లైసెన్సు, ఎటియం కార్డూ వీరమణే ఆ ఘాతుకానికి ఒడిగట్టాడని రుజువు చేస్తూ ఉన్నాయి గదా” ఆశ్చర్యంగా అడిగాడు శరత్‌చంద్ర.

“ఆ మాటకొస్తే వీరమణి పూర్ణామార్కెట్‌ దగ్గర తన పర్సు ఎవరో కొట్టేశారని రెండు రోజుల క్రితమే మా స్టేషన్‌కొచ్చి కంప్లెయిన్‌ చేశాడు. సమయానికి రైటర్‌ లేక ఎఫ్‌ఐఆర్‌ రిజిస్టర్‌ చేయలేదు. ఎవరో తెలివిగా ఈ నేరాన్ని వీరమణిపైకి నెట్టుతున్నారని నా అనుమానం” అన్నాడు రామ్మోహన్‌ బింకంగా.

“పోనీ వీరమణిని అరెస్ట్‌ చేసి, అతని వేలిముద్రలనూ, లేబ్‌లో దొరికిన వేలిముద్రలనూ కంపేర్‌ చేసి చూడరాదా?” అనుమానంగా అడిగాడు శరత్‌.

“మీరు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఈ నేరానికి కారణం వీరమణి కాదనీ, మరొకరనీ మావద్ద ఖచ్చితమైన ఆధారాలున్నాయి” కోపంగా అన్నాడు సీఐ.

“ఏమిటా ఆధారాలు?” కఠినంగా అడిగాడు శరత్‌చంద్ర.

“అవన్నీ మీకు చెప్పవలసిన అవసరం మాకు లేదు. మాకవతల బోలెడు పనులున్నాయి. యుకెన్‌ లీవ్‌” పైకి లేస్తూ చెప్పాడు రామ్మోహన్‌.

శరత్‌చంద్ర కోపంగా స్టేషన్‌ నుండి బయటకు వస్తూ ఉంటే బయట పోలీస్‌ కానిస్టేబుల్‌తో వాదిస్తున్న ఒక బక్కపలచటి వ్యక్తి కనిపించాడు.

“నా పేరు కన్నబాబు. మశ్చీంద్రపై జరిగిన దాడి విషయంలో నాకొకడిపై అనుమానంగా ఉంది” అంటూ ఉన్నాడతను కానిస్టేబుల్‌ అతడిని లోపలకు పంపడం లేదు.

“నువ్వు లోపలికి వెళ్లి ఏమీ ప్రయోజనం లేదు. నాతోరా” అని శరత్‌చంద్ర కన్నబాబును తన కారులో తీసుకొని పోలీసు కమిషనర్‌ ఆఫీసుకు దారి తీశాడు.

కమిషనర్‌ ఆఫీసులో కమిషనర్‌ ఛాంబర్‌ ముందున్న సెంట్రీకి తన విజిటింగ్‌ కార్డు ఇచ్చాడు. మశ్చీంద్ర, వెంటనే ఆయనకు కమిషనర్‌ అపాయింట్‌మెంట్‌ దొరికింది.

“నమస్కారం సార్‌, మీ ఇన్స్‌టిట్యూట్‌ గురించి విన్నాను. అటువంటి సంస్థ మన నగరంలో ఉండడం మనంకందరికీ గర్వకారణం” అంటూ పైకి లేచి శరత్‌చంద్రతో కరచాలనం చేసాడు కమిషనర్‌ సమీర్‌. కాసేపు శరత్‌నడిగి ఆ సంస్థలో జరుగుతున్న పరిశోధనల గురించి కనుక్కొన్నాడు.

శరత్‌చంద్ర మశ్చీంద్రపై జరిగిన దాడి విషయం కమిషనర్‌కు చెప్పి “సార్‌, ఈ విషయంలో నాకెందుకో మీ సి.ఐ. సరిగ్గా దర్యాప్తు చేయకుండా, విషయాన్ని పక్కదారి పట్టిస్తూ ఉన్నాడన్న అనుమానం ఉంది” అని పోలీస్‌ స్టేషన్లో జరిగిన ఉదంతాన్ని కమిషనర్‌కు వివరించాడు.

“సరే, మీకీ విషయంలో ఎవరిపై అనుమానంగా ఉంది?” అన్నాడు కమీషనర్‌ సాలోచనగా.

“ఇంకెవరు, ఆ నాగముత్తు, వీరమణిల మీదనే. నిర్దోషులైతే వాళ్లెందుకు పరారీలో ఉంటారూ?” అన్నాడు శరత్‌.

“సరే, వాళ్లను ట్రేస్‌ చేస్తాము. వాళ్ల గురించి మీకు మరేమైనా వివరాలు తెలుసా?” అన్నాడు కమిషనర్‌.

అంతవరకు నిశబ్దంగా ఉన్న కన్నబాబు కల్పించుకొని “సార్‌, ఈ వీరమణి ఫ్రెండు వినోద్‌ అని ఉన్నాడు. వాడు మశ్చీంద్ర కూతురు రేఖను ఎప్పుడూ అల్లరి పెడ్తూ ఉంటాడట. ఈ విషయం ఆ అమ్మాయే మా నాన్నగారితో చెప్తుండగా విన్నాను” అన్నాడు, ఆత్రంగా.

“ఆ వినోద్‌ ఎక్కడ తిరుగుతుంటాడో నీకు తెలుసా?” అన్నాడు కమిషనర్‌. “తెలుసు సార్‌” అన్నాడు కన్నబాబు.

“పదండి వెల్దాం” అని పైకి లేచాడు కమీషనర్‌ సమీర్‌.

***

“మీరెన్ని సార్లు అడిగినా ఆ కోడ్సు గురించి నేను మీకేమీ చెప్పలేను. మా గురువు గారు నాకెప్పుడూ ఆ వివరాలు చెప్పలేదు” దీనంగా అన్నాడు శివరామ్‌. వీరమణి శివరామ్‌ రెండు దవడలు వాయించి, కిందికి తోసి బూటుకాలితో బలంగా తన్నాడు.

“వీడిని రాత్రంతా హింసించైనా వివరాలు రాబట్టండి” అని అనుచరులను ఆజ్ఞాపించాడు వీరమణి. నాగముత్తు వికటంగా నవ్వుతూ జరిగేది చూస్తూ ఉన్నాడు.

ఇంతలో ఇంటి ముందు రెండు పోలీస్‌ వేన్లు ఆగాయి. బిలబిలలాడుతూ కమిషనర్‌ సమీర్‌, పది మంది కానిస్టెబుల్స్‌ ఇద్దరు సర్కిల్‌ ఇన్స్‌పెక్టర్లు ఇంట్లోకి ప్రవేశించారు. వారి వెంట దీనంగా కనిపించారు వినోద్‌, చేరన్‌లు, పోలీసులు క్షణాల్లో నాగముత్తు, వీరమణిలను అరెస్టు చేసి, శివరామ్‌ను విడిపించారు. పోలీస్‌ కస్టడీలో లేబ్‌లో దొరికిన వేలిముద్రలు వీరమణివని తేలడంతో నాగముత్తు, వీరమణులు జైలు పాలయ్యారు.

***

హాస్పిటల్‌ నుండి వారం రోజుల్లో డిస్చార్జైన మశ్చీంద్ర సంపూర్ణ ఆరోగ్యవంతుడై మరో రెండు రోజుల్లో జరిగిన అంతర్జాతీయ సెమినార్లో తన పరిశోధనల గురించి సమగ్రంగా ఒక పేపర్‌ ప్రెజెంట్‌ చేశాడు. ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన శాస్త్రవేత్తలు మశ్చీంద్ర పరిశోధనలను శ్లాఘించారు. విదేశాల నుండి వచ్చిన విలువైన ఆఫర్లను సున్నితంగా తిరస్కరించి మశ్చీంద్ర “నా పరిశోధనల ఫలితాలన్నింటినీ ముందుగా నా మాతృదేశానికే అందజేస్తానని” ప్రకటించాడు. ప్రభుత్వం మశ్చీంద్రకు పరిశోధనారంగంలో అతి విలువైన ఒక అవార్డు అందజేస్తున్నట్లు ప్రకటించింది.

మశ్చీంద్ర ఇంట్లో అతనికి ఘనస్వాగతం లభించింది. అతడి కోసం ఆతృతతో ఎదురు చూస్తున్నారు అతడి భార్య వర్ధనమ్మ, శశికాంత్‌, ఆలేఖ్య, రేఖ, సుధీర్‌. వారితోబాటూ వెంకట్రావు, తాయారులు కూడా ఉన్నారు. అప్పుడే కార్లోంచి దిగారు మనోజ్‌, శివరామ్‌లు, ఇంటి ముందు.

“గుండమ్మ కథలో ఫస్ట్‌హాఫ్‌లో జమున లాంటి మా అమ్మగారు సెకండాఫ్‌ జమునలా ఒద్దికగా తయారై రేఖమ్మ గారూ, శశికాంత్‌గారూ కోరుకున్న వారితో వారి పెళ్లి జరిపించడానికి ఒప్పుకున్న శుభసందర్భంలో స్పెషల్‌గా జీడిపప్పుతో హల్వా చేశాను. ఆరగించండి” అని అందరికీ అంజి ప్లేట్లలో హల్వా, పకోడి అందజేశాడు.

“అంతా ఈ మాయా మశ్చీంద్ర మహిమ” నవ్వుతూ అన్నాడు మనోజ్‌. “అందుకే మనం మాయా శశిరేఖను చూడగలిగాం” విషయాలన్నీ తెలిసిన శివరామ్‌ అందుకొన్నాడు.

“మరి నీ మాటేమిటి పెళ్లి కాని ప్రసాదూ?” అని శివరామ్‌ని ఉడికించాడు అంజి. అందరూ గట్టిగా నవ్వారు.

(సమాప్తం)

Exit mobile version