[శ్రీ గంగాధర్ వడ్లమన్నాటి రచించిన ‘మాయరోగం..’ అనే కథని పాఠకులకి అందిస్తున్నాము.]
నెమ్మదిగా బావురు పిల్లిలా నడుస్తూ, హాల్లో ఎంతో ఏకాగ్రతతో టీవీ చూస్తున్న మధు దగ్గరకి వచ్చిన లలిత, “ఏవండీ మరి, మరేమో మరేమో” అంటూ తెగ మెలికలు తిరిగిపోతూ ఉండడంతో, మధుకి ఏవీ అర్థం కాక, కాస్త కంగారూ పడిపోతూ “ఏమైంది! ఒంట్లో గానీ బాలేదా, ఏమైనా ఇబ్బందా? హాస్పిటల్‌కి వెళ్ళొద్దామా” అడిగాడు.
అతని మాటలకి నెత్తి కొట్టుకుని, “సరిపోయింది మీ వరస, మీరు మనిషిగా కాదు మర మనిషిగా పుట్టాల్సిన వ్యక్తి. సరసానికీ, విరసానికీ కూడా తేడా తెలియదు మీకు. నేను ఇలా మెలికలు తిరిగి సిగ్గుపడుతున్నానంటే, అది సరసం. ఇది కూడా తెలియలేదా”, అని మళ్ళీ నెత్తి కొట్టుకుని, “మన పక్కింటి షర్మిషగారు, షాపింగ్‌కి వెళుతుందట. వాళ్ళ అమ్మాయి పెళ్ళికి వివిధ రకాలైన చీరలు, రకరకాల నగలూ కొనుక్కుంటుందట. మమ్మల్ని కూడా రమ్మంది. ఊరికినే అలా ఆవిడతో వెళ్ళి వచ్చేస్తే బాగుండదు కదా, అందుకే అందరూ కూడా ఎవరికి వారు చీరలు కొనుక్కోవాలనుకుంటున్నారు. అందరూ కొనుక్కుని నేను కొనుక్కోకపోతే, మిగిలినవారు గొణుక్కుంటారు. అందుకని నేను కూడా నాకు నచ్చిన ఓ చీర కొని తెచ్చుకోవాలి. కనుక ఒక రెండువేలు ఇవ్వండి” అడిగింది.
“అందరూ కొనుక్కుంటే నువ్వు కొనుక్కోవడం సబబే. కానీ కొనుక్కోవద్దు. వారితో పాటు ఊరికే అలా వెళ్ళి ఇలా వచ్చెయ్. వాళ్ళు నిన్ను చీర కొనుక్కోమని అడిగితే, మొన్ననే మా వారు కొన్నారు అని చెప్పేయ్, అంతే” అన్నాడు.
“అలా అనకండి, నా పరువు పోతుంది. ఎందుకంటే, అందరూ కొనుక్కుని నేను మాత్రం కొనుక్కోకపోతే, నువ్వు డబ్బులు తెచ్చుకోలేదా, పోనీ మేము డబ్బులు ఇస్తాం కొనుక్కో. లేకపోతే ఇప్పుడు కొనుక్కుని తర్వాత నీ దగ్గర డబ్బులు ఉన్నపుడు ఇవ్వు, లేదంటే లేదు. నువ్వు ఇవ్వక పోయినా పర్లేదు అని చీప్‌గా మాట్లాడతారు. అవన్నీ నాకు అవసరమా. మీరు ఇవ్వకపోతే ఇక నేను వెళ్ళను, నాకు ఒంట్లో బాలేదనో, కంట్లో బాలేదనో చెప్పేస్తానులెండి” అంది మూతి ముడుచుకుంటూ.
“ఈ ఐడియా ఏదో బాగుంది. ఒంట్లో బాలేదని నువ్వు ఎందుకు చెప్పడం, నేనే నాకు ఒంట్లో బాలేదని చెప్పేస్తాను. వాళ్ళు రానీ. కానీ నిన్ను వెళ్ళమని నేను ఐదు వేలు ఇస్తాను. కానీ నువ్వు వెళుతుండగానే నేను గుండె పట్టుకుంటాను. అప్పుడు పరవాలేదులే నువ్వెందుకు, ఉండిపో అంటారు. దాంతో వాళ్ళు నిన్ను విడిచిపెట్టి షాపింగ్‌కి వెళ్లిపోతారు, దాంతో నాకు ఒక రెండు వేలు మిగిలిపోతుంది, ఎలా ఉంది నా ఐడియా” కనుబొమ్మలు ఎగరేస్తూ అడిగాడు.
“బానే ఉంది, సరే మీ ఇష్టం. కానీ భార్యకి రెండు వేల రూపాయలు చీర కొనడానికి మీరింతలా మొహం చూసుకుంటారని నేను అనుకోలేదు సుమీ. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. మీరు బలవంతంగా ఇస్తే మాత్రం నేను వెళతానా, ఏమిటి! నాకు మనస్కరించదు” చెప్పింది నిష్ఠూరంగా.
ఇంతలో పక్కింటి షర్మిష ఓ నలుగురితో కలిసి రానే వచ్చింది. “కార్ రెడీ, వెడదామా లలితా” అంది.
“అది, మరి తప్పకుండా వెళదాం, ఏవండీ నేను చీర కొనుక్కొస్తాను, వెళ్ళనా మరి” అంది లలిత.
“సరే తప్పకుండా వెళ్ళిరా” అంటూ జేబులో చేయి పెట్టి పర్సు తీసి, అందులోంచి స్టయిల్‌గా కొంత డబ్బు తీసి “ఇదిగో ఐదు వేలు” అని ఇస్తూ, “ఏదైనా మంచి చీర కొనుక్కో,కావాలంటే నా క్రెడిట్ కార్డు కూడా పట్టికెళ్లు” అన్నాడు అది పర్సులోంచి తీయబోతూ.
‘దొంగ బడవ, ఎంత బాగా నటిస్తున్నాడో’ అని మనసులోనే మధుని తిట్టుకుని, “చాలు చాలు, ఈ ఐదు వేలు చాలు. మీ కార్డు మీరే ఉంచుకోండి” అంది.
సరే అని పర్సు మళ్ళీ జేబులో పెట్టేసుకుని, ఇబ్బందిగా సోఫాలో కూర్చుని చాతి మీద చేయి పెట్టుకున్నాడు.
ఆ పక్కింటావిడ మధు వంక ఆశ్చర్యంగా చూస్తూ, “అరెరే ఏవైంది మధుగారూ” అడిగింది.
“మాయ రోగం” అని లలిత నాలుక్కరుచుకుని, “ఏవిటండీ ఈ మాయరోగం, ఏవైంది” అడిగింది.
“చాతిలో కొంచెం నొప్పిగా ఉంది. కొంచెం ఊపిరి కూడా అందడం లేనట్టుగా ఉంది. అయినా పర్లేదు లలితా, ఆ ఐదు వేలు తీసుకు వెళ్ళి చీర కొనుక్కో” అన్నాడు ఇంకాస్త గట్టిగా పట్టుకుంటూ.
“మీకు ఇలా ఉంటే నేను ఎలా వెళ్తాను” అంది లలిత.
“ఏదో అజీర్తి నొప్పి అయుంటుందిలే నువ్వెళ్ళు” అన్నాడు.
“అవును, మీకు ఇలా ఉంటే తను మాతో ఎలా వస్తుంది, పరవాలేదులెండి. మేము వెళ్ళి వచ్చేస్తాం. పర్వాలేదు లలిత నువ్వు ఉండు, మీ ఆయనని జాగ్రత్తగా చూసుకో. ఎందుకు వచ్చింది” అందామె.
తర్వాత వాళ్ళందరూ వెళ్ళిపోయారు.
“చూసావా నా తెలివితేటలు, ఐదు వేలు ఇచ్చినట్టు నటించి, రెండు వేల రూపాయలు మిగిలేలా చేశాను” అన్నాడు.
“పోనీలెండి, మీరు అనుకున్నారు, డబ్బు మిగుల్చుకున్నారు. మనకు మాత్రం డబ్బులు ఊరికినే వస్తాయా” అంది.
ఒక పది నిమిషాల తర్వాత పక్కింటావిడ షర్మిష, లలితకి వీడియో కాల్ చేసింది.
లలిత ఫోన్ ఎత్తగానే, “మీ ఆయనికి ఇపుడు ఛాతీ నొప్పి ఎలా ఉంది” అడిగింది షర్మిష.
“ఆ, ఆ బానే ఉంది షర్మిష. టీవి చూస్తున్నారు. అజీర్తి నొప్పే” చెప్పింది.
“నేను, మీ ఆయన ఎడం వైపుకి బదులు, కుడి వైపు పట్టుకున్నప్పుడే అనుకున్నాను అది అజీర్తి నొప్పని” అంటూ షర్మిష మధు వంక వంకరగా చూడ్డంతో గతుక్కుమన్నాడు మధు.
“ఇక అసలు విషయం ఏంటంటే లలితా, నువ్వు రాలేకపోయావని మా అందరికీ లోటు. అందుకనే మీ ఆయన ఐదు వేలు ఇవ్వబోవడం చూసాను. కనుక ఈ వీడియోలో కనిపించే చీరలన్నీ ఐదు వేలవే. నీకు నచ్చిన చీర ఏదో చెప్పు, తీసుకుంటాను. ఐదు వేలు ఫోన్ పే చేసేయి. లేదంటే నేను మీ ఇంటికి వచ్చి, చీర ఇచ్చి డబ్బు తీసుకుంటాను. సరేనా” అంది.
“సరే” అని లలిత తప్పక, ఓ చీర ఎంచుకుంది.
అది చూసిన మధు, ఈసారి నిజంగానే చాతీ మీద చేయి పెట్టుకున్నాడు.
