Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మబ్బులు వీడిన మౌనం

[కాళీపట్నపు పేర్రాజు గారు రచించిన ‘మబ్బులు వీడిన మౌనం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక – బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026లో సాధారణ ప్రచురణకి ఎంపికైన కథ.]

గడియారం రాత్రి ఒంటిగంట చూపిస్తోంది.

రామయ్యకు నిద్ర పట్టలేదు. వరండాలోకి వచ్చి నిలబడ్డాడు.

ఆకాశమంతా మబ్బులు కమ్ముకున్నాయి. కానీ గాలిలేక ఉక్కబోతగా ఉంది. కరెంట్ పోవడంతో ఊరంతా నల్లటి చీకటి దుప్పటి కప్పుకున్నట్టుంది. అప్పుడప్పుడు కుక్కల అరుపులు, దూరంగా వెళ్తున్న వాహనాల చప్పుళ్లు తప్ప అంతా నిశ్శబ్దం.

లోపల పిల్లలు నిద్రలో మధ్య మధ్యలో కదులుతున్నారు. మెలకువ వచ్చినప్పుడల్లా సుశీల విసనకర్రతో విసురుతూ.. మరుక్షణంలోనే మళ్లీ నిద్రలోకి జారిపోతోంది.

అతనికి ఆఫీసులో ఉదయం జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది.

ఫైల్‌లో ఒక ఎంట్రీ తప్పిపోయింది.

“ఈ పని కూడా సరిగా చేయలేవా?” అంటూ అందరి ముందు ఫైల్‌ను టేబుల్‌పై విసిరేశాడు మేనేజర్.

రామయ్య ఫైల్ తీసుకుని చూసాడు. అది తన తప్పు కాదు.

ఆ క్షణం –

“ఇది నా తప్పు కాదు..” అని చెప్పాలనిపించింది.కానీ ఆ మాట గొంతులోనే ఆగిపోయింది.

మౌనంగా ఫైల్ సరిచేశాడు.

ఉదయం తాను చేసినది తప్పా.. ఒప్పా.. అనే మీమాంసలో పడ్డాడు.

అప్పుడే అతనికి చిన్నప్పటి సంఘటన ఒకటి గుర్తుకొచ్చింది.

ఒకరోజు తన స్నేహితుడు చేసిన తప్పు గురించి వాదించుకుంటుండగా, తాను చెప్పింది నిజమే అయినప్పటికీ ఆ స్నేహితుడు వినకుండా మొండిగా వాదించాడు. మాటల్లో ఒప్పించలేక అసహనంతో అతనికి ఒక లెంపకాయ కొట్టి ఇంటికి వచ్చేశాడు.

కొద్దిసేపటికి ఆ స్నేహితుడి తల్లిదండ్రులు ఇంటికి వచ్చారు. బామ్మ వాళ్లకు సర్ది చెప్పి పంపించింది.

తర్వాత అతన్ని దగ్గర కూర్చోబెట్టుకుని అంది –

“ఎవరితోనూ తగాదాలు పెట్టుకోకూడదు రా.. ఎదుటివాళ్లు తప్పుగా మాట్లాడినా ప్రతి మాటకు జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. వాదించాల్సిన పరిస్థితి వస్తే మౌనంగా ఉండటం మంచిది. అవసరంలేని గొడవలతో మనశ్శాంతి పోగొట్టుకోవద్దు. ఎవరు తప్పు చేస్తే.. వాళ్ల పాపాన్ని వాళ్లే మోస్తారు.”

ఆ మాటలు చిన్నప్పుడే అతని మనసులో బలంగా కూరుకుపోయాయి. కాలక్రమేణా అవే అతని స్వభావంగా మారిపోయాయి.

సహజంగా ఉన్న మొహమాటం..

దానికి తోడు భయం..

చివరికి మౌనం అతనికి అలవాటైపోయింది.

అవసరమైన సమయంలో కూడా ఎదురు మాట్లాడలేకపోవడం.. బాధలను లోపలే మింగేయడం..

ఈ మధ్యకాలంలో అదే అతన్ని ఎక్కువగా వేధిస్తోంది.

తన మౌనం వల్లనే ఇంట్లోనూ, బయటా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు.

ఎక్కడో చిన్న మెరుపు మెరిసింది. ఆ వెంటనే పెద్ద ఉరుము వినిపించింది.

సుశీలకు అలికిడి అయింది.

“ఏమండీ.. ఎక్కడున్నారు? ఇంకా పడుకోలేదా? బాగా పొద్దుపోయినట్టుంది.. పడుకోండి. అన్నట్టు.. చెప్పడం మరిచాను. ఈ వారంలో పిల్లల స్కూల్ ఫీజు ఖచ్చితంగా కట్టాలి..” అని చెప్పి మళ్లీ పడుకుంది.

ఆ మాటతో అతని ఆలోచనలు తన ఆర్థిక పరిస్థితులపైకి మళ్లాయి.

దేనికీ కాదనలేకపోవడం..

ఇంటికి పెద్దవాడవడం..

అక్కాచెల్లెళ్ల రాకపోకలు, పెళ్లిళ్లు, పేరంటాళ్లు, పండుగలు..

ఎప్పుడూ ఏదో ఒక ఖర్చు.

ఉద్యోగరీత్యా అకౌంట్స్ అసిస్టెంట్‌గా రోజంతా కూడికలు, తీసివేతల మధ్యే గడుస్తుంది. ఆఫీసు లెక్కల్లో బ్యాలెన్స్ షీట్ సరిచేయగలుగుతున్నాడు. కానీ తన జీవితంలో జీతం తాలూకు బ్యాలెన్స్ షీట్ మాత్రం ఎప్పుడూ సరిపోదు.

జీతం వచ్చిన రోజు సాయంత్రానికే అది ఎవరిదో అయిపోతుంది.

అద్దె..

పిల్లల పుస్తకాలు, ఫీజులు..

కిరాణా..

ఇతర ఖర్చులు..

ఒక్కొక్కటి వచ్చి తమ వాటా తీసుకుపోతాయి.

చివరికి మిగిలేది ఖాళీ జేబు కాదు – ఋణం.

ఏళ్ల తరబడి ఇదే జీవితం.

మళ్లీ అతనికి ఆఫీసు విషయాలు, గతంలో తన మౌనం వల్ల ఎదురైన అవమానాలు గుర్తుకొచ్చాయి.

మొదట్లో మౌనంగా ఉండడమే మంచిదని అనుకున్నాడు. దాని వల్ల ఎవరితోనూ గొడవలు రావని భావించి తన చుట్టూ ఒక గోడ కట్టుకున్నాడు.

కానీ కాలం గడిచేకొద్దీ ఆ గోడే తన మీదకు వాలుతున్నట్టుగా అనిపిస్తోంది.

తన కింద పని చేసే ఉద్యోగులకు చెప్పలేక వాళ్ళ పని కూడా తానే చేసుకుంటూపోవడం వలన భారం పెరిగి ఒత్తిడికి గురవుతున్నాడు.

రోజూ ఆఫీసులో అడుగుపెట్టగానే నీటిలోంచి బయటపడేసిన చేపలా అతని మనసు గిలగిలలాడేది.

అక్కడ హోదాకే గౌరవం.

పని కంటే మాటల తీరు ముఖ్యం.

మేనేజర్ శ్రీనివాస్ గారి స్వరం ఎప్పుడూ కర్కశంగానే వినిపించేది. పై అధికారుల ముందు మాత్రం అతను కూడా తలవంచుకుని నిలబడడం రామయ్య చాలాసార్లు గమనించాడు.

ఒక సాయంత్రం ఆఫీసు నుండి వస్తున్నపుడు బస్సులో తోపులాట జరిగింది. ఎవరో అతని కాలు తొక్కి తిరిగి రామయ్యపైనే అరిచాడు.

రామయ్య స్పందించలేదు. అయినా కూడా గట్టిగా మాట్లాడిన అతనికే అక్కడున్నవాళ్లు సపోర్ట్ ఇవ్వడం చూసి ఆశ్చర్యమేసింది.

ఈ ప్రపంచం మౌనంగా ఉండే వాళ్లను మంచి వాళ్లుగా కాదు.. బలహీనులుగా చూస్తుందేమో అన్న భావన అతనిలో మొదలైంది.

అయినా మౌనం వీడే ధైర్యం మాత్రం ఎప్పుడూ చేయలేకపోయాడు.

“నేను ఎందుకు మౌనంగా ఉంటున్నాను? ఇది భయమా? లేక బాధ్యతా?” అని తనతోనే ప్రశ్నించుకున్నాడు.

సమాధానం మాత్రం దొరకలేదు.

ప్రతి రోజు ఒకే రకం పోరాటం. నిశ్శబ్దంగా సాగిపోయే యుద్ధం.

ఇంతలో సుశీల బయటికి వచ్చి –

“టైం ఎంత అయింది అనుకున్నారు..! రెండవుతోంది. పదండి పడుకుందురు గానీ.. ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే ఆరోగ్యం పాడవుతుంది. ఇబ్బందులకు పరిష్కారాలు వెంటనే దొరకవు..” అంటూ రామయ్య చెయ్యి పట్టుకుని బలవంతంగా లోపలికి తీసుకెళ్లింది.

రామయ్య కూడా ఒక్కసారి నిట్టూర్చి పడుకున్నాడు.

మరుసటి రోజు ఆదివారం.

గదిలో మంచం మీద పడుకుని రామయ్య పుస్తకం చదువుకుంటున్నాడు.

సుశీల ఎండలో ఆరిన బట్టలు మడత పెడుతోంది.

కార్తీక్ మూలగా కూర్చుని హోంవర్క్ రాస్తున్నాడు.

ఇంతలో కార్తీక్ క్లాస్మేట్ హరీష్ వచ్చాడు.

“ఏరా.. నిన్నటి విషయం ఇంట్లో చెప్పావా?” అని అడిగాడు.

కార్తీక్ తల అడ్డంగా ఊపి మళ్లీ హోంవర్క్‌లో మునిగిపోయాడు.

“ఏమైంది?” అని సుశీల అడిగింది.

హరీష్ కార్తీక్ వైపు చూశాడు.

కార్తీక్ మాత్రం తలవంచుకుని రాసుకుంటూనే ఉన్నాడు.

“ఇంతకీ ఏమైంది? నువ్వే చెప్పు హరీష్,” అంది సుశీల.

“నిన్న మేడం హెచ్ఎం రూమ్‌కి వెళ్లినప్పుడు రాజేష్ అటెండెన్స్ బుక్ తిరగేస్తూ ఉండగా అది చిరిగిపోయింది. ఆ సమయంలో కార్తీక్ కూడా అక్కడే ఉన్నాడు. మేడం అడిగినా ఏమీ చెప్పలేదు. రాజేష్ ‘నేను చేయలేదు మేడం’ అన్నాడు. మేడం కార్తీకే పుస్తకం చింపి ఉంటాడని కొట్టారు. ఇంటర్వెల్ టైమ్‌లో నేను అడిగితే అప్పుడు కూడా మౌనమే. తర్వాత మళ్లీ మళ్లీ అడిగేసరికి అసలు విషయం చెప్పాడు. రాజేష్ చేతిలోనే పొరపాటున రిజిస్టర్ చిరిగిపోయిందని. నేను వెళ్లి మేడంకి చెప్తానంటే.. ‘వద్దురా.. మేడం గారికి చెప్తే రాజేష్‌ని కొడతారు. దాని వల్ల మాకు తగువులు వస్తాయి’ అని నన్ను కూడా చెప్పనివ్వలేదు,” అన్నాడు హరీష్.

“కానీ నేను ఊరుకోలేదు. రాజేష్‌కి తెలియకుండా మేడంకి చెప్పేశాను. మేడం గారు రాజేష్‌ని పిలిచి ఏదో మాట్లాడారు,” అంటూ కార్తీక్ వైపు చూశాడు.

“మేడం గారు నీతో ఏం చెప్పారు?” అని సుశీల అడిగింది.

కొద్దిసేపు తలవంచుకుని ఉన్న కార్తీక్ మెల్లగా అన్నాడు –

“మౌనంగా ఉండడం మంచిదే.. కానీ అన్నివేళలా కాదు. ఎవరో చేసిన తప్పుకి శిక్ష నువ్వు అనుభవించాల్సి వచ్చినప్పుడు కూడా మౌనం వహించడం సరైన పద్ధతి కాదు. ఇలా అయితే సమాజంలో రోజు చస్తూ బతకాల్సి వస్తుంది. మౌన వ్రతం కన్నా.. సత్య వ్రతం గొప్పది.. అని చెప్పారు.”

“థాంక్యూ హరీష్,” అంది సుశీల మెచ్చుకోలుగా అతని వైపు చూస్తూ.

“థాంక్యూ ఎందుకు ఆంటీ.. వీడు నా బెస్ట్ ఫ్రెండ్,”అంటూ కార్తీక్ భుజంపై చెయ్యివేశాడు హరీష్.

కార్తీక్ కూడా అతని వైపు చూసాడు. అతని కళ్లల్లో హరీష్ పట్ల కృతజ్ఞత కనిపించింది.

విషయం అంతా వింటున్న రామయ్య చేతిలోని పుస్తకం మెల్లగా కిందికి జారింది.

ఆ మాటలు కార్తీక్‌కు చెప్పినట్టుగా కాక.. ఎన్నాళ్లుగానో తనలో తాను దాచిపెట్టుకున్న భయాన్ని ఎవరైనా ఎదురుగా నిలబెట్టి ప్రశ్నించినట్టుగా అనిపించింది అతనికి.

“ఎవరో చేసిన తప్పుకి.. శిక్ష నువ్వు అనుభవించడం..” ఆ వాక్యం అతని మనసులో మళ్లీ మళ్లీ మార్మోగింది.

ఆఫీసులో జరిగిన అవమానాలు.. తాను చేయని తప్పులకు తలవంచిన సందర్భాలు..అన్నీ ఒక్కసారిగా గుర్తుకొచ్చాయి.

కార్తీక్ తలవంచుకుని కూర్చున్న తీరు చూస్తుంటే తన చిన్నప్పటి నీడనే చూస్తున్నట్టనిపించింది రామయ్యకు.

మనసులో ఎక్కడో చిన్న అసౌకర్యం మొదలైంది.

ఇన్నాళ్లు తాను పిల్లలకు నేర్పింది సహనమా..

లేక భయమా..?

అతను మెల్లగా కిటికీ బయటికి చూశాడు.

ఎండలో ఆరేసిన బట్టలు గాలికి స్వల్పంగా కదులుతున్నాయి.

కానీ అతని లోపల మాత్రం ఏదో నిశ్శబ్దం కదలడం మొదలైంది.

సోమవారం ఆఫీసులో ఆడిట్ జరుగుతోంది.

అకౌంట్స్‌లో తప్పులు బయటపడ్డాయి అవి మేనేజర్ చేసినవే. కానీ బాధ్యత మాత్రం రామయ్యపై పడేలా పరిస్థితి మారింది.

ఈసారి మౌనం తనను కాపాడదనిపించింది.

ఇన్నాళ్లు అతను మౌనాన్ని ఒక గోడలా వాడుకున్నాడు. అవమానాలు.. తిట్లు.. అన్యాయాలు..

అన్నింటినీ ఆ గోడ వెనక్కి నెట్టేస్తూ బతికేశాడు. బయట ప్రపంచం ఎంత గట్టిగా అరిచినా తాను మౌనంగా ఉంటే తుఫాను దాటిపోతుందని నమ్ముకున్నాడు.

కానీ ఆ రోజు మొదటిసారి అతనికి భయం వేసింది.

ఇన్నాళ్లు తనను కాపాడిన అదే గోడ.. ఇప్పుడు నెమ్మదిగా తన మీదకే కూలిపోతున్నట్టనిపించింది.

అంతేకాదు –

“మౌన వ్రతం కన్నా.. సత్య వ్రతం గొప్పది..” కార్తీక్ వాళ్ళ టీచర్ చెప్పిన మాటలు కూడా గుర్తుకొచ్చాయి.

మీటింగ్ రూమ్‌లో మూలన ఉన్న గడియారం టిక్‌టిక్‌మంటూ గట్టిగా వినిపిస్తోంది. సమయం తనకోసం ఆగదని గుర్తు చేస్తున్నట్టుంది.

ప్రతి శబ్దం అతని గుండెలో మోగుతున్నట్టుంది.

అంతే..

రామయ్య నెమ్మదిగా లేచాడు. తన దగ్గర ఉన్న రికార్డులన్నీ టేబుల్‌పై పెట్టాడు.

గళం గట్టిగా లేదు – కానీ నిజం స్పష్టంగా ఉంది.

ఒక్కసారిగా గది నిశ్శబ్దమైంది.

మేనేజర్ శ్రీనివాస్ ముఖం మారిపోయింది.

ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు.

కొద్దిసేపటికి నిజం బయటపడింది.

కంపెనీ ఓనర్ రామయ్యను మెచ్చుకోలుగా చూశాడు.

ఆ రోజు సాయంత్రం ఆఫీసు ముగిసిన తర్వాత బయటకు వచ్చాడు.

సహచరులందరూ మేనేజర్ బాధితులే. అందుకే ఒక్కొక్కరుగా వచ్చి రామయ్యను అభినందించి వెళ్లిపోయారు.

ఆకాశం ఒకవైపు నెమ్మదిగా తేలికపడుతోంది.

మరోవైపు మబ్బులు మళ్లీ అలుముకుంటున్నాయి.

గాలి ఇంకా భారంగానే ఉంది.

తన సహచరుడు మధు కోసం ఎదురు చూస్తూ అక్కడే ఉన్న చిన్న రాయిపై కూర్చున్నాడు.

మధ్యాహ్నం జరిగిన సంఘటనలు గుర్తుకొచ్చాయి.

మొదటిసారి –

తన మౌనం కాదు..

తన మాట తనను కాపాడిందన్న భావనతో రామయ్య నెమ్మదిగా కిందికి చూశాడు.

అతని కాళ్ల దగ్గర కొన్ని చీమలు వరుసగా నడుస్తున్నాయి.

ఒక చీమ చిన్న ఆహార ముక్కను మోసుకుంటూ ముందుకు వెళ్లడానికి ప్రయత్నిస్తోంది.

ఆ ముక్క ఒక్కదానితో కదలలేదు. కొద్దిసేపటికే ఇంకొన్ని చీమలు దానికి తోడయ్యాయి. అన్నీ కలిసి దాన్ని తమ పుట్టవైపు మోసుకెళ్లాయి.

రామయ్య ఆ దృశ్యాన్ని చాలాసేపు నిశ్శబ్దంగా చూశాడు.

వర్షపు చినుకులు పడటం మొదలయ్యాయి.

చీమలు మాత్రం ఆగలేదు.

అతని మనసులో కొత్త ఆలోచనలు రూపుదిద్దుకుంటున్నాయి.

ఆ రాత్రి రామయ్య ఇంటికి ఆలస్యంగా చేరుకున్నాడు.

పిల్లలు అప్పటికే నిద్రపోయారు. సుశీల వంటగదిలో పాత్రలు కడుగుతోంది.ఆమె వచ్చి మౌనంగా అతనికి భోజనం వడ్డించింది.

రామయ్య కూడా ఏమీ మాట్లాడకుండా భోజనం ముగించాడు.

తర్వాత నెమ్మదిగా డాబాపైకి వెళ్లాడు.

వర్షం ఆగిపోయింది.

కానీ గాలి ఇంకా తడిగానే ఉంది.

పగలంతా తలవంచుకుని తిరిగిన సహచరుల ముఖాలు అతని కళ్లముందు మెదిలాయి.

మధు..

శేఖర్..

టైపిస్ట్ లక్ష్మి..

తప్పు చేయకపోయినా మందలింపులు భరించే వాళ్లు.

పని పెరిగినా జీతం అడగలేని వాళ్లు.ఇన్నాళ్లు తన బాధ తనదే అనుకున్నాడు.

కానీ ఇప్పుడు అర్థమైంది –

ఆ ఆఫీసులో మౌనం ఒక్కరిది కాదు..

అందరిదీ.

కిటికీ అద్దాలపై నుంచి జారుతున్న వర్షపు నీళ్లు చిన్న చిన్న దారులుగా కలిసి కిందికి పారుతున్నాయి.

రామయ్య వాటిని చూస్తూ నెమ్మదిగా నవ్వుకున్నాడు.

చుక్కలన్నీ కలిసి ప్రవహిస్తే..

తమ దారిని తామే సృష్టించుకుంటాయి.

ఆ క్షణంలోనే –

ఆఫీసులో తాను చేయాల్సిన పని ఏమిటో రామయ్యకు స్పష్టంగా అర్థమైంది.

అతను నెమ్మదిగా కిందికి దిగాడు.గదిలో నిద్రపోతున్న భార్యా పిల్లలను ఒకసారి తృప్తిగా చూసాడు.

చాలా రోజుల తర్వాత..

ఆ రాత్రి రామయ్య ప్రశాంతంగా నిద్రపోయాడు.

Exit mobile version