[ఇటీవల స్వర్గస్థురాలైన ప్రముఖ గాయని ఎస్. జానకి స్మృతిలో ప్రత్యేకంగా అందిస్తున్న వ్యాసం. రచన శ్రీమతి శారద వేలూరి.]
చల్లటి సాయంత్రం ఆహ్లాదంగా ఉన్నప్పుడు ఒక కోయిల తీయని గానం వినిపిస్తూ ఉంటే మనసు ఎంతో మైమరిచిపోతూ ఉంటుంది. ఒక శ్రామికుడు పొద్దుట నుంచి చెమటోడ్చి సాయంత్రం తన గూటికి చేరినప్పుడు అలసట తీర్చే గొంతే ఆ కోయిల.
ఆమె ఎవరో కాదు. శిష్లా జానకి. ఆమె మన ఎస్. జానకి.
జానకి 1938 ఏప్రిల్ 23న గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పల్లమట్ల గ్రామంలో శ్రీరామ్ మూర్తి, సత్యవతి దంపతులకు జన్మించారు. తండ్రి ఉపాధ్యాయుడు, ఆయుర్వేద వైద్యులు కూడాను. ఉద్యోగరీత్యా ఆయన కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్లలో ఉండేవారు. జానకి తన చిన్నతనం నుంచి సంగీతం మీద మక్కువతో ఎంతో ఉద్దండులైన సంగీత విద్వాసుల దగ్గర శిష్యరికం చేశారు. ఎన్నో కచేరీలు చేసేవారు. కానీ సినీ సంగీతంపై మక్కువతో లతా మంగేష్కర్ , సుశీల, జిక్కీ పాడిన పాటలు పాడేవారు. మేనమామ ప్రోత్సాహంతో చెన్నై వెళ్లి అక్కడ తన 19వ ఏట ఏవీఎం స్టూడియోలో పాడడం ప్రారంభించారు.
తొలినాళ్లలో ఏవీఎం స్టూడియో గాయనిగా ఉండి, 1957 లో టీ. చలపతిరావు సంగీత దర్శకత్వంలో తమిళ చిత్రం ‘విధియిన్ విలా యత్తు’ లో మొదటిసారిగా పాడారు. తెలుగులో ‘ఎమ్మెల్యే’ చిత్రం ద్వారా తెలుగువారికి దగ్గరయ్యారు. అలా మొదలైన ఆమె పాటల ప్రస్థానం అప్రతిహతంగా ముందుకు సాగిపోయింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషలలో అనేక వేల పాటలు పాడారు.
సినిమా పాటలే కాకుండా ‘మీరా’ పై అనేక భక్తి గీతాలు పాడారు. ఆమె స్వతహాగా కృష్ణ భక్తురాలు. అందుకే తన కుమారుడికి మురళీకృష్ణ అని పేరు పెట్టుకున్నారు. సాయిబాబా అన్నాఎనలేని దైవభక్తి.
పాటల్లో మిమిక్రీ ని మిక్స్ చేసి సినీ సంగీత ప్రియులని ఓలలాడించారు.
‘పదహారేళ్ళ వయసు’ చిత్రంలో పండు ముసలావిడ గొంతు, సప్తపదిలో ‘గోవుల్లు తెల్లన, గోపయ్య నల్లన’ పాటలో చిన్నపిల్లాడి గొంతు. ఒక్కటేమిటి ఆ గొంతులో ప్రేమతత్వం, ఆర్ద్రత, ఆవేదన, ఆక్రోశం, అల్లరి ఆమె స్వరంలో ప్రతి ఫలించేవి. ఇవి ఆమె భావ వైవిధ్యానికి తార్కాణాలు.
ఆమె 55 ఏళ్ల సుదీర్ఘ కాలం పాటు ఐదారు తరాల హీరోయిన్లకి అన్ని రకాల భావాలను వ్యక్తీకరిస్తూ నేపధ్యగానం అందించారు. వేలకొద్దీ పాటలు పాడారు.
ఆమెకు ఎన్నో అవార్డులు, రివార్డులు వచ్చాయి. ఎంతోమంది సంగీత దర్శకులతో పనిచేశారు. ఎంతోమంది సంగీత దర్శకులు జానకి గారి చేతే పాడించాలని ఆవిడ డేట్స్ కోసం ఎదురుచూసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి.1970 నుండి ఆమె దక్షిణాది నాలుగు భాషల్లోనూ ప్లే బ్యాక్ పరిశ్రమను శాసించారు.
ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకత్వంలో ‘సంగమం’ సినిమాకు గాను జానకి గారికి తమిళనాడు ప్రభుత్వం చే ఉత్తమ నేపద్యగాయిని అవార్డు లభించింది.
సంగీత దర్శకుడు హంసలేఖతో కలిసి 40 కి పైగా చిత్రాలలో పనిచేశారు.
ఇక ఇళయరాజా జానకి గార్ల ప్రయాణం రెండు దశాబ్దాలకు పైగా సాగింది. ఇళయరాజా సంగీత దర్శకత్వంలో జానకి గారికి తమిళనాడు ప్రభుత్వం చే నాలుగు రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు లభించాయి. ఇళయరాజానే స్వయంగా జానకి గారితో కలిసి దాదాపు 200 డ్యూయెట్లు పాడారు.
జీ.కే. వెంకటేష్, ఎం. రంగారావు, ఎం. ఎస్. బాబు రాజ్, రాజన్ నాగేంద్ర, విజయ భాస్కర్ మొదలైన ఎందరో సంగీత దర్శకులతో జానకి గారు పనిచేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఆమె ఉత్తమ నేపథ్య గాయనిగా పది నంది అవార్డులు గెలుచుకున్నారు.
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మహత్యం, సప్తపది, సాగర సంగమం, సితార, ప్రతిఘటన, సిరివెన్నెల, శృతిలయలు, జానకి రాముడు, సీతారామయ్యగారి మనవరాలు, అంతఃపురం సినిమాలకే కాకుండా, రెండు టెలివిజన్ సీరియల్స్ పాటలకు కూడా నంది అవార్డులు లభించాయి.
‘నీ లీల పాడెద దేవా’.. అనే పాట సన్నాయితో కలిసి పోటీపడి పాడారు.
ఆమెకు నాలుగు జాతీయ పురస్కారాలు, 11 కేరళ రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు,
తెలుగులో నంది పురస్కారాలు 10, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు ఆరు, ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వ అవార్డు ఒకటి లభించాయి.
ఇంకా కలైమామణి, ఫిలింఫేర్ అవార్డు, గౌరవ డాక్టరేట్, సైమా లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు, కేరళ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ గాయనిగా 11 అవార్డులు,
కర్ణాటక బసవ భూషణ్ అవార్డు లభించాయి.
ఒకసారి జానకి గారి గురించి ఇళయరాజా మాట్లాడుతూ, “జానకమ్మకి తేనె ఖర్చు ఎక్కువ. ఆమె దినమూ కొన్ని లీటర్ల తేనె తాగుతుంటాది. లేకపోతే ఆమె గాత్రంలో అంత మాధుర్యం ఎట్టా వచ్చునప్పా” అని చమత్కరించారు.
జానకి గారు ఎస్పీ బాలసుబ్రమణ్యం, జేసుదాస్, మనో తో ఎన్నో హిట్ సాంగ్స్ పాడారు.
ఇక వ్యక్తిగత జీవితానికి వస్తే వి .రాంప్రసాద్ ను వివాహమాడి, చెన్నైలో స్థిరపడ్డారు. వారికి ‘మురళీకృష్ణ’ అనే ఏకైక కుమారుడు ఉన్నాడు. రాంప్రసాద్ గారు 1990లో మరణించారు. ఆమె కుమారుడు ఇటీవలే జనవరి 22న మరణించారు.
వయోభారంచే జూలై 11 న ఆ గాన కోకిల సుదూర తీరాలకు తరలిపోయింది.
ఆ గానామృతం ఆగిపోయింది.
