[శ్రీమతి యం. ధరిత్రీ దేవి రచించిన ‘మధుర క్షణాలు.. అమ్మలతో..’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
బ్రేక్‌ఫాస్ట్ పూర్తి చేసి ఈజీ చైర్‌లో పడుకుని ఆ రోజు దినపత్రిక అందుకున్నారు రామారావుగారు. శాంతమ్మ డైనింగ్ టేబుల్ సర్దేసి, భర్తకెదురుగా ఓ పక్కగా కుర్చీలో కూర్చుని మోకాళ్ళు మర్దనా చేసుకోసాగింది. అరవై అయిదేళ్లు దాటిన ఆవిడకు బీపీ, థైరాయిడ్ లాంటి పిలవని చుట్టాలు వచ్చి మీద పడిపోయాయి. వాటికి తోడు ఈ మోకాళ్ల నొప్పులు ఒకటి!
భార్య అవస్థ గమనించిన రామారావు, “ఏమిటీ, టాబ్లెట్స్ వేసుకుంటున్నావా సరిగా..?” అన్నారు.
“ఆ.. ఆ.. అయ్యాయిలెండి. ఇంతకీ.. ఆదివారానికంతా పిల్లలందరూ వస్తారంటారా..?” కాళ్లు వత్తుకుంటూనే అడిగింది భర్త వేపు చూస్తూ.
“ఎందుకూ..! ఇంత అవస్థ పడుతున్నావ్, వాళ్ళు వస్తే మాత్రం ఏం చేసి పెట్టగలవు? అదేమన్నా ఆలోచించావా?..” కాస్త విసుగ్గా అన్నారాయన.
“అలాగని ఊరికే ఎలా ఉంటామండి.. ఏదో అమ్మానాన్న ఉన్నారనే కదా వాళ్ళయినా వస్తారు..!”
“సరే సరేలే.. అరిసెలు, లడ్లు చేయడం మొదలు పెడతావా ఏంటి !? నువ్వు మరీ హైరానా పడిపోయి బీపీ పెంచేసుకోకు.. ఆనక నాకు తిప్పలు..”
చిన్నగా నవ్వేస్తూ అన్నారాయన. ఇంతకీ వాళ్లు అనుకుంటున్న ఆదివారం మదర్స్ డే.. మాతృ దినోత్సవం అన్నమాట..! ఓ గవర్నమెంట్ ఆఫీసులో హెడ్ క్లర్క్‌గా చేసి రిటైర్ అయిన రామారావు సర్వీస్ అయిపోయేలోగా ఓ చిన్న ఇల్లు కట్టుకోగలిగారు. కొడుకు సుదర్శన్, ఇద్దరు కూతుళ్లు కమల, కావేరి పెళ్లిళ్లు అయిపోయి వాళ్ల సంసారాల్లో సెటిల్ అయిపోయారు. కొడుకు తన వద్దకు వచ్చి ఉండమన్నా సొంతిల్లు వదిలి రాలేమంటారు వీళ్ళు. పండగలకు పిల్లలంతా తమ వద్దకే వస్తే సందడిగా ఉంటుందని వీళ్ళ వాదన. వాళ్లకూ ఆటవిడుపు.. అనుకుంటారు ఇద్దరూ.!! మొదట్లో.. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అన్ని పెద్ద పండగలకూ కొడుకు, కూతుళ్లు, అల్లుళ్ళు.. అంతా వచ్చేవాళ్ళు. కానీ.. రాను రాను పిల్లలు పెరిగే కొద్దీ బాధ్యతలు వాళ్లకూ ఎక్కువైపోయి రావడం బాగా తగ్గిపోయింది. కాకపోతే కొద్ది సంవత్సరాలుగా మనవళ్ళు, మనవరాళ్ళు కాలేజీ చదువులకొచ్చాక మదర్స్ డే అన్నది వాళ్ల దృష్టిలోకొచ్చి, ప్రతీ సంవత్సరం మే నెలలో తప్పకుండా రావడం వాళ్లకో అలవాటుగా మారిపోయింది. కొడుక్కి, అల్లుళ్లకు తీరకున్నా.. ఇద్దరు కూతుళ్లు, కోడలు పిల్లలతో కలిసి తప్పకుండా వస్తుంటారు. సంతోషమేగానీ, శాంతమ్మకే విపరీతమైన పని ఒత్తిడి! కూతుళ్లు, కోడలు వంటల్లో అవీ ఇవీ అందివ్వడం వరకే గానీ.. పూర్తి వంట మాత్రం శాంతమ్మ పైనే. అందుకే వాళ్లంతా వెళ్ళిపోయాక, వారం రోజులపాటు మంచం పట్టేస్తుంది. అదే రామారావుగారికి బాధగా ఉంటుంది.
***
“సుష్మా, ఈసారి నేనొకటి ప్లాన్ చేశా.. చెప్పనా..” సాయంత్రం స్నాక్స్ తింటూ చెల్లితో అన్నాడు సాగర్.
“చెప్పు చెప్పు..” అంది సుష్మ ఉత్సాహంగా. సాగర్, సుష్మ.. రామారావు కొడుకు సుదర్శన్ పిల్లలు. సాగర్ బీటెక్ ఫైనల్ ఇయర్‌లో, సుష్మ డిగ్రీ ఫైనల్‌లో ఉన్నారు.
“వచ్చే సండే మదర్స్ డే కదా.. ప్రతీసారి అందరం నానమ్మ, తాతయ్య వాళ్ళ ఊరు వెళ్లే వాళ్ళం కదా.. ఈసారి కూడా వెళ్దాం.. కానీ అక్కడ ప్రోగ్రాం మాత్రం వెరైటీగా చేద్దాం..”
“అదెలా.!?” ముందుకు వంగి అడిగింది సుష్మ.
“ఇలా..” అంటూ తననుకున్న ప్లాన్ వివరించాడు సాగర్.
“భలే భలే.. చాలా బాగుంది. కానీ తాతయ్య వాళ్ళను ఇక్కడికే.. అంటే మన ఇంటికే రమ్మనొచ్చు కదా..”
“వద్దురా.. పెద్దవాళ్ళు.. ఈ ఎండలకు ప్రయాణం అంటే ఇబ్బంది పడతారు. అదీకాక మనం అక్కడికెళ్లి సర్ప్రైజ్ ఇస్తే థ్రిల్లింగ్‌గా ఉంటుంది కదా..”
“అవునవును..” చప్పట్లు కొడుతూ అంది.
“సరే.. ఈ విషయం వెంటనే కార్తీక్, కావ్యలకు.. ఇంకా మన బుజ్జి.. విజ్జీకి ఫోన్ చేసి చెప్పాలి మరి..” అంటూ సెల్ అందుకున్నాడు సాగర్.
ఆ ముగ్గురూ రామారావుగారి కూతుళ్ళు కమల, కావేరి పిల్లలు. కార్తీక్ బీటెక్ సెకండ్ ఇయర్, కావ్య డిగ్రీ ఫస్ట్ ఇయర్, విజ్జి జూనియర్ ఇంటర్ చదువుతున్నారు.
“మరి సన్మానం నాకు లేదా..” వెనక నుండి వస్తూ నవ్వింది సరోజ.
“వావ్! మమ్మీ.. వినేశావా! అయ్యో! సీక్రెట్ అప్పుడే రివీల్ అయిపోయిందే !! మమ్మీ మమ్మీ.. ప్లీజ్, ఎవ్వరికీ చెప్పకే..” తల్లి చేయి పట్టుకున్నాడు సాగర్.
“చెప్పనులేరా..” నవ్వుతూ లోపలికెళ్ళిపోయింది సరోజ.
***
అన్నట్లుగానే మరుసటి రోజు సాయంత్రం ఐదుగురూ ఓ చిన్న రెస్టారెంట్లో కలుసుకున్నారు. వాళ్ల తండ్రుల ఉద్యోగాల రీత్యా వాళ్లంతా హైదరాబాదులోనే ఉండటం వాళ్లకు కలిసొచ్చింది. అప్పుడప్పుడు అలా కలుస్తూ ఉండడం వాళ్లకు అలవాటే.
“అన్నయ్యా, నీ ప్లాన్ సుపర్బ్! మరి ఆరోజు అమ్మలందరికీ సన్మానం అంటే ఎలా చేయాలి? దేనితో చేయాలి? ఏమేం రెడీ చేయాలి?..” తన సందేహం లేవనెత్తుతూ ప్రశ్నల వర్షం కురిపించాడు కార్తీక్.
“ఏముందీ.. అమ్మలందరికీ శాలువాలు కప్పేద్దాం. పూల దండలు వేసేద్దాం. ఇంకా బొకేలూ.. అవీ ఇవీ..” కావ్య ఠక్కున అందుకుని అనేసింది. సన్మానం అంటే ఆ పిల్ల దృష్టిలో అదే! స్కూల్లో, కాలేజీల్లో అలాగే చూసింది మరి!
సుష్మ కిసుక్కున నవ్వి, “ఆ సన్మానం వేరు కావ్యా.. అలా కాదు.. అమ్మలందరికీ మంచి చీరలు కొందాం. ఎప్పుడూ వాళ్లు మనకు కొనివ్వడమే గానీ, మనం ఎప్పుడూ వాళ్ళకేమీ ఇవ్వడం లేదు.. ఏరా అన్నయ్య..?”
సాగర్ వేపు చూస్తూ అంది సుష్మ.
“గుడ్.. బాగుందిరా..” వెంటనే ఓకే చేశాడు సాగర్. కార్తీక్ సుష్మ వైపు సూపర్ అన్నట్లు ప్రశంసగా చూశాడు.
“మరి స్వీట్స్..!” విజ్జి లేవనెత్తింది మరో పాయింట్.
“అవునవును.. భలే గుర్తు చేశావురా.. మంచి పుల్లారెడ్డి స్వీట్స్ కొన్ని ప్యాకెట్స్ కొనేద్దాం. అలాగే మిక్సర్. ఎప్పుడూ మనకు ఇష్టమని అరిసెలు, లడ్లు కష్టపడి చేస్తూ ఉంటుంది నానమ్మ..” అన్నాడు కార్తీక్.
“సరే, అదీ ఓకే..” అన్నాడు సాగర్.
“కానీ.. ట్రెడిషనల్ స్వీట్స్.. అదే అరిసెలు, లడ్లు అయితే బాగుంటుంది కదా..” బుంగమూతి పెట్టింది విజ్జి.
“అవి మనకు చేయడం రాదు కదా..” వెంటనే అందుకున్నాడు కార్తీక్ తనూ తోడుగా బుంగమూతి పెడుతూ..
“ఐడియా!” చిటికేసింది సుష్మ.
“స్వగృహ ఫుడ్స్‌లో ఇవన్నీ దొరుకుతాయి.. ఆర్డర్ చేద్దాం..”
“అయితే ఇంకేం.. అదీ సాల్వ్‌డ్..” సాగర్, కార్తీక్ ఒకేసారి అనేశారు.
“అంతా సరే.. మరి బడ్జెట్!?” కావ్య అసలు పాయింట్ లేవదీసింది.
“ఏముంది మనందరి పాకెట్ మనీ అంతా తీసేద్దాం.. ఓకేనా..?”
ఏమంటారు అన్నట్టు ముగ్గురి వైపు చూశారు సాగర్, సుష్మ. అంతా పిడికిలి బిగించి సై అన్నట్లు అంగీకారం తెలిపారు.
అలా అలా మరో పావుగంట డిస్కషన్ కొనసాగింది. ప్రోగ్రాం ఫిక్స్ చేసుకుని సాగర్ అన్నాడు,
“ఈ రాత్రికే తాతయ్యకు ఫోన్ చేసి చెప్తాను, నానమ్మను హైరానా పడొద్దని చెప్పమని.. స్వీట్స్ ప్రిపరేషన్ అంటూ ఏదీ పెట్టుకోవద్దని.. అంతా మేము చూసుకుంటామని.. చెప్పేస్తాను..”
“కానీ, అన్నయ్యా, సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాం కదా..”
“సుష్మా, ఈ సర్ప్రైజ్ నానమ్మకు.. నానమ్మకు చెప్పకుండా సీక్రెట్ గా ఉంచమని తాతయ్యతో చెప్పేస్తా..”
“అలాగైతే ఓకే..”
“ఇట్స్ గుడ్..” అంతా బై చెప్పుకుని లేచారు.
***
ఆ రోజు ఆదివారం. ఇల్లంతా సందడి సందడిగా కళకళలాడుతూ నవ్వులతో, అచ్చట్లు ముచ్చట్లతో సంతోషంగా ఉంది. అనుకున్న ప్రకారం పిల్లలంతా వాళ్ల పేరెంట్స్‌తో కలిసి ముందు రోజే అమ్మమ్మ వాళ్ళ ఊరు చేరిపోయారు. ఆఫీసులో పెండింగ్ పనులున్నాయని, కుదరదనీ చెప్పినా.. పిల్లల ప్రోద్బలంతో అల్లుళ్ళు.. ప్రసాద్, శంకర్ కూడా ఈసారి వచ్చేశారు. ఇక శాంతమ్మ సంతోషానికి అవధులన్నవి లేకుండా పోయింది.
ఉదయం నుండీ రకరకాల పనులతో అందరూ బిజీ బిజీగా ఉన్నారు. శాంతమ్మను వంటింట్లోకి రానీయకుండా ఓ పక్కగా కూర్చోబెట్టారు.
“అయ్యో! ఎందుకర్రా! పిల్లలు.. మీకెందుకు ఈ పనులు?” ముందు రోజే విషయం విన్న శాంతమ్మ, రామారావు ఇద్దరూ అన్నారు.
“ఇది అమ్మలకు పిల్లలు చేయాల్సిన పని తాతయ్యా..” అంటూ ఇల్లంతా అలంకరించడం మొదలుపెట్టారు అందరూ. అలాగే ఉదయం బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్.. అమ్మలందరి సహకారంతో సుష్మ, కావ్య, విజ్జి పూర్తి చేశారు. సాగర్, కార్తీక్ బయటి పనులన్నీ చూసుకున్నారు.
ఆ మధ్యాహ్నం పులిహోర, పాయసం, పప్పు, వేపుడు, సాంబార్, గడ్డపెరుగుతో చక్కటి లంచ్ చేశాక, కాసేపు విశ్రమించారంతా. సాయంత్రం ఆరింటికి తయారయి.. అమ్మమ్మను, సరోజ, కమల, కావేరిలను సోఫాలో కూర్చోబెట్టి, పూలదండలు వేశారు. అమ్మాయిలు ట్రే లో చీరతో పాటు పళ్ళు, పూలు, పసుపుకుంకుమలు పెట్టి, ముందుగా శాంతమ్మకు తర్వాత మిగతా ముగ్గురికి అందించారు.
“బాబోయ్!! ఇవన్నీ ఎప్పుడు తెచ్చారే!! ఎంత బాగున్నాయో చీరలు! అసలు ఇంత బాగా ఎలా సెలెక్ట్ చేసారే తల్లీ!” బుగ్గలు నొక్కుకున్నారు నలుగురూ.
“అదంతా ఇదిగో.. ఈ ముగ్గురు మోడరన్ అమ్మాయిల పనిలేండి..” అన్నాడు కార్తీక్ నవ్వుతూ. శాంతమ్మతో పాటు కమల, కావేరి కూడా ఉబ్బితబ్బిబ్బయ్యారు, పిల్లల అనూహ్య చర్యను చూసి..! ఎప్పటిలా అమ్మనాన్నల పాదాలకు దండం పెట్టి ఆశీస్సులు అందుకుంటారు అనుకున్నారు.. కానీ.. ఇలా చీరలతో సర్ప్రైజ్ ఇస్తారనుకోలేదు వాళ్ళు. సరోజ మాత్రం గుంభనంగా నవ్వుకుంది నాకు తెలుసులే అన్నట్లు..
“మొత్తానికి అమ్మాయిలనిపించారు..” శాంతమ్మతో పాటు కోడలు, కూతుళ్లు మెచ్చుకున్నారు. ఆ తర్వాత రామారావుగారినీ, వాళ్ల ముగ్గురు నాన్నల్ని పిలిచి అందరికీ పాదాభివందనం చేశారు. అక్షింతలు చల్లి ఆశీర్వాదం అందించారు పెద్దవాళ్ళు.
తర్వాత అమ్మాయిలు ముగ్గురూ ప్లేట్స్‌లో అరిసెలు, లడ్లు కారప్పూస సర్ది అందరికీ అందిస్తూ మరోసారి హ్యాపీ మదర్స్ డే అంటూ గట్టిగా చెప్పేశారు. సాగర్ లేచి నిలబడి అందరినీ ఉద్దేశిస్తూ,
“ప్రతీ సంవత్సరం ఇలాగే మదర్స్ డే.. అదీ మేమే సెలబ్రేట్ చేస్తాం..” అని అనౌన్స్ చేశాడు.
“భేష్! చిన్నవాళ్ళయినా చక్కగా ఆలోచించారు..” మెచ్చుకున్నారు రామారావుగారు.
“ఇంకా వీళ్ళు చిన్నపిల్లలేంటి నాన్నా, సాగర్‌కు క్యాంపస్ సెలెక్షన్స్‌లో మంచి కంపెనీలో జాబ్ వచ్చింది. కార్తీక్ కూడా నెక్స్ట్ ఇయర్ కొట్టేస్తాడు..” నవ్వుతూ అన్నాడు సుదర్శన్.
“వెరీ గుడ్, మనవరాళ్ళూ, మీరు కూడా వీళ్ళతో పోటీ పడి తెచ్చుకోవాలి చూడండి..” ముగ్గురి వైపు చూస్తూ అన్నారాయన.
“షూర్ తాతయ్య..” అన్నారు ముగ్గురూ.
“అలాగే, నాకు చాలా సంతోషం అనిపించిన విషయం.. యువత విలువలు మరిచి ప్రవర్తిస్తున్న ఈ రోజుల్లో అమ్మల సేవల్ని, శ్రమను గుర్తించారు చూడండీ.. అదీ.. హార్ట్ టచింగ్‌గా ఉంది. పేరెంట్స్ పట్ల, పెద్దలపట్ల ఈ గౌరవాభిమానాలు ఎప్పటికీ ఇలాగే ఉండాలి మరి..” అని చెప్తూ పిల్లలందర్నీ దగ్గరికి తీసుకున్నారాయన.
కార్తీక్ ముందుకు వచ్చి, “ఓకే.. ఈ మధురక్షణాల్ని శాశ్వతంగా సెల్ఫీలో బంధించేద్దాం.. ఏదీ, ఓసారి నవ్వండి అందరూ..” అంటూ సెల్ తీశాడు. అందరి నవ్వుల మధ్య ఆరోజు మాతృదినోత్సవపు మధురక్షణాలు ఫోటోలో నిక్షిప్తమయ్యాయి.
వాళ్లందరిమధ్య కూర్చుని, తన అనారోగ్యం.. కాళ్ల నొప్పులు.. అన్నీ మరిచిపోయి, హాయిగా నవ్వుతూన్న భార్యను చూసిన రామారావుగారికి ప్రతీ పండుగా ఇలాగే గడిచిపోతే ఎంత బాగుంటుందో కదా.. అనిపించింది..
యం. ధరిత్రీ దేవి విశ్రాంత అధ్యాపకురాలు. వీరి కవితలు, కథలు, వ్యాసాలు కొన్ని ప్రింట్ పత్రికల్లో, అంతర్జాల పత్రికల్లో ప్రచురింపబడినవి.
