Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మధురగీతాలు – మనోహరదృశ్యాలు-11

[సంచిక కోసం ‘శంతనూ – శర్మిష్ఠ’ ప్రత్యేకంగా రచిస్తున్న సినిమా పాటల శీర్షిక.]

మెరిసింది మేఘం మేఘం..
ఉరిమింది మేఘం మేఘం
ముద్దిచ్చే వానంట, మురిపించే వానంట
గోర్వెచ్చ గోర్వెచ్చ వయసంత వానంట
జల్ జల్ జల్ జల్జల్ జల్జల్
నన్నారె నన్నారె నన్నారె నన్నారె

గురుకాంత్’ (హిందీలో ‘గురు’) మణిరత్నం సినిమా. ఈ పాటను రాసింది వేటూరి. ఇదే మణిరత్నం వేటూరిలకు ఇళయరాజా తోడయినప్పుడు సినిమాల్లో వాన పాటల చిత్రీకరణకు ప్రామాణికమనదగ్గ పాట, భవిష్యత్తులో అనేక వానపాటలకు ప్రేరణగా నిలిచిన పాట రూపొందింది.

జల్లంత కవ్వింత కావాలిలే
ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే
ఉరుకులు పరుగులు ఉడుకు వయసు దుడుకుతనము నిలవదు
తొలకరి మెరుపులా
ఉలికిపడిన కలికి సొగసు
కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే
ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే..

గీతాంజలి’ సినిమాలో గిరిజ వర్షంలో నృత్యం చేస్తూ పాడే  ఈ పాట వానపాటల చిత్రీకరణకు నూతన ద్వారాలను  తెరిచింది.

పాటల చిత్రీకరణలో మణిరత్నం పంథా వేరు. ‘ఎం టీవీ’ ప్రభావం అతని పాటల చిత్రీకరణపై కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అంత వరకూ పాటను ఒక యూనిట్‍గా భావించేవారు. కొన్ని షాట్‍లలో పాటను చిత్రీకరించేవారు. ఆ చిత్రీకరణ విధానాన్ని సంపూర్ణంగా రూపాంతరం చెందించాడు మణిరత్నం.

పాట సందర్భం, ఔచిత్యం, లాజిక్ వంటి వాటికన్నా పాటను ఆకర్షణీయంగా, అందంగా అందించటం, అతి వేగంగా దృశ్యాలు మారిపోవడం ద్వారా వేగాన్ని కలిగించటం, పలు సుందరమైన కెమెరా కోణాలు, లైటింగ్ మార్పిళ్ళతో ఉద్వేగాన్ని కలిగించటం వంటి టెక్నిక్‍లను అతి పెద్ద ఎత్తున వాడటం ద్వారా పాటల చిత్రీకరణలో నూతన పద్ధతికి శ్రీకారం చుట్టాడు మణిరత్నం. మణిరత్నం పాటల చిత్రీకరణ పద్ధతి విపరీతమైన ప్రజాదరణ పొందడంతో అతడి పద్ధతి ‘ట్రెండ్ సెట్టింగ్’ పద్ధతి అయిపోయింది. పాట లయను తెరపై ప్రదర్శించటానికి ఉన్న ప్రాధాన్యం ఇంక దేనికీ ఉండదు. ‘ఎం టీవీ’ పాటల ప్రదర్శన పద్ధతిలో. మణిరత్నం మొదటి సినిమా నుంచి ఈ చిత్రీకరణ పద్ధతి కనిపిస్తుంది.   ‘ఘర్షణ’ (తమిళంలో ‘అగ్నినక్షత్రం’) సినిమాలోని ‘నిన్ను కోరి వర్ణం’ పాటలో ఇది కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అయితే పాట మొత్తం ఒకే గదిలో చిత్రీకరించాల్సి రావటంతో కెమెరా గదికే పరిమితమవ్వాల్సి వచ్చింది. అంతలోనే  ఎన్నో షాట్‍లు ఉంటాయా పాటలో.

పాట ఆరంభంలో సంగీతం ఆరంభమవుతున్నప్పుడు నాయకుడిని దూరం నుంచి చూపి కెమెరా దగ్గరకు వెళ్తుంది. కట్ అయి  silhouette లో నాయిక కనిపిస్తుంది. మళ్ళీ కట్ అయి నాయకుడి ఆశ్చర్యాన్ని చూపిస్తాడు. మళ్ళీ కట్ చేసి నాయిక silhouette లో నృత్యం చేయటం చూపుతాడు.

మళ్ళీ నాయకుడికి కట్ చేస్తాడు. మళ్ళీ నాయికను చూపిస్తాడు. తరువాత నాయిక నాయకుడి వైపు పరుగెత్తుకు రావటం ఒక షాట్. పాట ఆరంభించిన తరువాత ఒక పాదం పాడే వరకూ కెమెరా నాయికను అనుసరిస్తుంది. రెండో పాదానికల్లా కట్ చేసి నాయిక క్లోజప్‍లో నృత్యం చేస్తుంది. మరో పాదానికల్లా కుర్చీ నెట్ లోంచి క్లోజప్‍లో కనిపిస్తుంది. మళ్ళీ నాయిక నాయకుడి దగ్గరకు వస్తుంది. తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ షాట్‍లో ఇద్దరూ కనిపిస్తారు. నాయిక నాయకుడి దగ్గరకు వెళ్తుంది. మళ్ళీ ‘నిన్ను కోరీ’ అన్నప్పుడు నాయకుడి వెనుక నుంచి నాయిక క్లోజప్పు.

ఇక ఆ తరువాత లయబద్ధంగా వెలిగి ఆరే లైట్లలో నాయిక నృత్యం. కెమెరా నాయికను అనుసరించటం ఒక ఉద్వేగాన్నికలిగిస్తుంది. ఇలా, పాట పల్లవిలోనే ఎన్నో చిన్న చిన్న షాట్‍లతో పాటను రూపొందించటం మణిరత్నం పంథా అయింది. మోంటేజ్ షాట్స్, ఫాస్ట్ కట్, ఎడిటింగ్ లతో పాటల చిత్రీకరణలో మ్యాజిక్ సృష్టించాడు మణిరత్నం.

(‘నిన్ను కోరి వర్ణం’ పాటని యూ ట్యూబ్‍లో చూడవచ్చు:

https://www.youtube.com/watch?v=2MfBF8opCFM )

అయితే, నిజంగా మణిరత్నం పంథాకు పెద్ద ఎత్తున ఆమోద ముద్ర లభించటమే కాదు, అత్యంత ప్రజాదరణను ఇచ్చింది ‘గీతాంజలి’ లోని ‘జల్లంత కవ్వింత’ పాట.

ఈ పాటలో ఒక కల లాంటి దృశ్య ప్రదర్శనకు కెమెరామాన్ ఎంతో శ్రమపడ్డాడు. ప్రాకృతిక లైటింగ్‍ను వాడేడు. వైడ్ యాంగిల్ లెన్సులు వాడేడు. అందమైన ఊటీ దృశ్యాలు, పచ్చని చెట్లు, పచ్చికబయళ్ళు, ఆపై వర్షం, వర్షంలో అమాయకురాలు, అందమైన యువతి, చక్కటి బాణీకి చక్కటి పదాలు పొదిగిన అర్థవంతమైన పాట పాడుతూ, లయబద్ధంగా నృత్యం చేసే పాటను చూడటం ఒక ప్రత్యేకమైన అనుభవంగా మలుస్తుంది. అంతకుముందు కూడా పాటలలో పలు విభిన్నమైన చిత్రీకరణ పద్ధతులను పాటించి  montage దృశ్యాలను fast cut చేస్తూ, సంగీతం లోని లయకు అనుగుణంగా దృశ్యాలను కదపటానికి ప్రాతిపదికను  ఏర్పాటు చేసింది ఈ పాట. అయితే, ‘రోజా’ సినిమాలోని ‘చిన్ని చిన్ని ఆశ’ పాట చిత్రీకరణలో పెద్ద ఎత్తున భారతీయ సినిమాలో ఈ మాంటేజ్ (ఒక దాని తరువాత మరో దృశ్యం వెంటనే రావటం, ఒక్కో దృశ్యం కొన్ని సెకన్లే ఉండటం) దృశ్యాల కలయిక, ఫాస్ట్ కట్ లతో సందర్భంతో ఔచిత్యంతో, కాలంతో సంబంధం లేకుండా ఆకర్షణీయమైన చిత్రీకరణతో ప్రేక్షకులను అలరించటం ఆనవాయితీ అయింది.

చిన్ని చిన్ని ఆశ’ పాట ఆరంభ సంగీతంలో ఒక రెండు సెకన్లు ప్రశాంతంగా వంపులు తిరిగే నది, ఒడ్దున అందమైన చెట్లు, సూర్యోదయం ఆరంభానికన్నా కొన్ని సెకన్ల ముందరి స్థితి చూపిస్తాయి. అంతకు ముందు కశ్మీరులో తీవ్రవాదుల కార్యకలాపాలను చూపి, వెంటనే హాయిగొలిపే సంగీతంతో ప్రశాంతమైన దృశ్యం చూపటంతో అద్భుతమైన ఎఫెక్ట్ సాధించాడు మణిరత్నం. ఇంకో రెండు సెకన్లలో రెండు మూడు దృశ్యాలు మారుతాయి. సూర్యోదయం కాస్త తీరికగా అయిదారు సెకన్లు కనిపిస్తుంది. మళ్ళీ రెండు బీట్‍లకో దృశ్యం చొప్పున మారుతుంది. ఇలా పాట ఆరంభమయ్యే సరికే ప్రేక్షకుడు ఆ సుందర దృశ్యాల వలలో చిక్కుకుంటాడు. మారుతున్న ప్రతి దృశ్యం కొన్ని సెకన్లే ఉండటంతో మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. పాటలో కూడా నాయిక ఓ సారి జలపాతం వద్ద ఉంటుంది. మరోసారి ఇంట్లో అమ్మమ్మతో అల్లరి చేస్తుంది. మరోసారి నది ఒడ్డున ఉంటుంది. ఇంకోసారి.. ఇలా పలు విభిన్నమైన దృశ్యాలను ఔచిత్యం, లాజిక్ లేకుండా కలిపి ఒక ఉద్వేగాన్ని వేగాన్ని సృజిస్తాడు పాట చిత్రీకరణలో. పాట కొన్ని సెకంలు చూసే సరికి ఎంతో చూసిన భావన కలుగుతుంది. వేగంగా ప్రయాణిస్తున్న వాహనంలోచి దృశ్యాలను చూస్తున్నట్టనిపిస్తుంది.  పాటలో ఒకదానితో ఒకటి సంబంధం లేని దృశ్యాల ద్వారా నాయిక ఎంత చలాకీయో, ఎంత చురుకో, ఎంత హాయిగా, ఎంత అమాయకంగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తుందో చూపిస్తాడు. ఇదే పద్ధతి ‘జల్లంత కవ్వింత కావాలిలే’ పాటలో ఇంతకన్నా ముందు వాడేడు. కానీ అంత వేగంగా కాదు.

(‘చిన్ని చిన్ని ఆశ’ పాటని యూ ట్యూబ్‍లో చూడవచ్చు:

https://www.youtube.com/watch?v=WJtmZ4LUq8c )

జల్లంత కవ్వింత కావాలిలే’ పాటలో ఒక్క రెండు సెకన్లలో నేలపై వర్షపు జల్లు పడటం చూపించటంతో వర్షం పడుతున్నదన్నదని ప్రేక్షకుడు గ్రహిస్తాడు. అంతే, క్లోజప్పులో వర్షపు జల్లులో తడుస్తున్న నాయిక వదనం, ఆమె ఆనందం కనిపిస్తుంది. సంగీతం వేగవంతమవుతుంది. వెంటనే దృశ్యం మారి బురద నీటిని తన్నుతూ నాయిక తుళ్ళటం, మళ్ళీ దృశ్యం మారి నాయిక నడుము, మరో దృశ్యంలో నాయిక తడవటం, చుట్లు తిరగటం, లాంగ్ షాట్‍లో పచ్చటి మైదానంలో నాయిక హాయిగా నృత్యం చేయటం, మళ్ళీ క్లోజప్పులో ఎగరటం, ఆపై పాట.. ఇలా ఎన్నెన్నో చిన్న చిన్న దృశ్యాల కలయికతో, నాయిక తన్మయత్వాన్ని, వాన వల్ల ఆమె చిన్న పిల్లలా ఆనందించటాన్ని ప్రేక్షకుడికి చేరువ చేస్తాడు దర్శకుడు, కెమెరామాన్ సహాయంతో.

ఊటీని ఎంతో అందంగా, వానను ఒక కలల జల్లుగా దర్శింపజేస్తాడు కెమెరామాన్. చెట్ల మధ్యలో నుంచి నాయిక నృత్యం, వర్షంలో చేతులు ఊపుతూ, లయబద్ధంగా నృత్యం చేయటం, క్షణం క్షణం మారే దృశ్యం పాటను మనోహరం చేస్తాయి. ఈ పాటలో సెకనుకు 48 ప్రేమ్ లను వాడడం ద్వారా దృశ్యాలు ప్రవహిస్తున్న భావన కలుగుతుంది. దాంతో గతంలో పాట చిత్రీకరణ అంటే నాయికా నాయకుల హావభావాలు, పాట భావం వంటి విషయాలపై దృష్టి నిలిచినట్టు ఇప్పుడు నిలవదు.

లయబద్ధంగా నృత్యం, దృశ్యం మారటం, మారిన దృశ్యం ఎంత అందంగా ఉంది అన్నదానిపైనే ఉంటుంది. గుర్రాలు అన్ని ఎందుకు పరిగెత్తి వస్తున్నాయి? ఎక్కడకు పోతున్నాయి? ఆ ఆవు సంగతేమిటి? ఒకసారి పచ్చిక బయలులో విచ్చలవిడిగా నృత్యం చేసిన అమ్మయి, తరువాత దృశ్యంలో చెట్టు క్రిందకు ఎలా వచ్చింది? ఇంతకీ ఆ వాయిద్యకారుడు ఎవరు? వానలో విదేశీ నృత్యం చేస్తున్న వాడెవడు? లాంటి ప్రశ్నలు తట్టిన వాడు మూర్ఖుడయితే, బహిరంగంగా అడిగినవాడు ఇంకా మూర్ఖుడు?

(‘జల్లంత కవ్వింత కావాలిలే’ పాటని యూ ట్యూబ్‍లో చూడవచ్చు:

https://www.youtube.com/watch?v=1CNI4HmV4fc )

పాట మొత్తం ఒక కథలాగా కాక, లయబద్ధమైన దృశ్యాల కలయికగా చూడాల్సి ఉంటుంది. పాటలలో వదనం ప్రతిఫలించే  భావం కన్నా లయబద్ధమైన శారీరిక కదలికలకే  ప్రాధాన్యం ఉంటుంది. ఔచిత్యం, లాజిక్‍ల వంటివి పాట బాణీ, పాటలో దృశ్యాల నడుమ అనవసరమైనవి అవుతాయి. ముఖ్యంగా తరువాతి కాలంలో గ్రూపు డాన్సులు వానలో ప్రాధాన్యం వహించటంతో లాంగ్ షాట్‌లు, శరీర అంగాంగ ప్రదర్శనపై దృష్టి తప్ప, పాటలో నాయికానాయకుల మనోభావాలపై దృష్టిపోదు. ఎప్పుడయినా నాయిక ముఖం క్లోస్ అప్ లో చూపించినా అది ఆమె సిగ్గుపడటానికో, సౌఖ్య భావన ప్రదర్శనకే అవటంతో పాటలో నటీనటుల మనోభావాల ప్రసక్తి అప్రస్తుతం అయిపోయింది.  అందుకే గతంలో లాగా ఫలానా గాయకుడు ఫలానా నటుడి స్వరం, ఫలానా నాయిక స్వరం ఫలానా గాయిక అని స్థిరపడటం లేదు. ఒకే సినిమాలో ఒకే నటుడికి పరస్పర భిన్నమైన స్వరాలు పాటినా, ఎబ్బెట్టుగా, ఇబ్బందిగా అనిపించటం లేదు. ఎవ్వరూ పట్టించుకోవటంలేదు. గాయకుడు, నటుల అనుబంధం తెగిపోయింది.

గతంలోనూ ఒకే సినిమాలో ఒకే నటుడికి ఇద్దరు ముగ్గురు గాయకులు పాడినా, ఆ ముగ్గురూ నటుడే పాడిన భ్రమను కలిగించగలిగేవారు. సన్నివేశ బలం, పాట మాధుర్యం, నటీనటుల నైపుణ్యం వంటివి ఆ భ్రమను కలిగించేవి. కానీ ఇప్పుడు దృశ్య బలం, కెమెరా వేగం, ఎడిటింగ్ నైపుణ్యం, బృంద నాట్యాలు పాటను ప్రేక్షకులకు చేరువ చేస్తున్నాయి. సందర్భానికీ పాటకూ నడుమ సంబంధం తెగిపోయింది. ఇది ‘గురుకాంత్’ సినిమాలో ‘మెరిసింది మేఘం మేఘం’ పాట స్పష్టం చేస్తుంది.

అదే మణిరత్నం, అదే వేటూరి అయినా, పాట బాణీ ఆకర్షణీయంగా ఉన్నా, ఐశ్వర్యా రాయ్ నృత్యం చేసినా, ‘జల్లంత కవ్వింత కావాలిలే’ పాట చూస్తుంటే కలిగే ఒక అలౌకిక ఆనందం, ఈ పాట చూస్తుంటే కలగదు. ‘జల్లంత కవ్వింత కావాలిలే’ పాట కన్నా ఎక్కువ కట్‍లు ఉన్నాయీ పాటలో. పాట ఆరంభంలో ప్రకృతి దృశ్యాలు అలరిస్తాయి. హీరోయిన్ పాట ఆరంభించినా దృశ్యాల మాంటేజ్ నడుస్తూ ఉంటుంది.

టాప్ యాంగిల్ షాట్‌లో నాయికను, వర్షాన్ని చూపుతూ క్లోజప్పులో తెచ్చి, ఎన్ని కట్‌లు ఎంత వేగంగా చేసినా, నాయిక ఎంత వేగంగా నృత్యం చేసినా, పాట వింటున్నప్పుడు కలిగిన ఆనందం చూస్తున్నప్పుడు కలగదు. పైగా జలపాతాల దగ్గర నడుం ఊపుతూ చేసే నృత్యం కన్నా, ఆ జలపాత ధారనో, ప్రకృతి దృశ్యాన్నో చూడటం హాయి అనిపిస్తుంది.

మణిరత్నం పాట చిత్రీకరణలో – ‘జల్లంత కవ్వింత కావాలిలే’ నుంచి ‘మెరిసింది మేఘం మేఘం’ వరకూ ఎంతో మార్పు వచ్చింది. మౌలిక పద్ధతి మారకున్నా, పాట చిత్రీకరణలో ‘నవ్యత్వం’ పోయింది. పైగా చిత్రీకరణలో ప్రకృతి దృశ్యాల నుంచి నాయిక శరీరం వైపు సాగటం కూడా పాట ప్రభావాన్ని తగ్గిస్తుంది. దీనికి తోడుగా, నాయిక ఇల్లు వదిలి వెళ్ళే గంభీర సన్నివేశం కూడా ఈ పాటలో ఒక భాగం కావటం అనౌచిత్యంగా అనిపిస్తుంది. ‘ఇల్లు వీడిపోతున్నా’ అని చెప్పటం కూడా హాస్యాస్పదంగా అనిపిస్తుంది. ఒక అమ్మాయి ఎంత ప్రేమించినవాడి దగ్గరకు పోతున్నా, అంత హాయిగా ఎలాంటి బాధలేకుండా , నన్నారెనన్నారే’ అనిపాడుకుంటూ పోవటం నాయిక వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తుంది. ఇది  పాట ప్రభావాన్ని దెబ్బ తీస్తుంది. తీవ్రవాద చర్యల అలజడి తరువాత ప్రశాంత ప్రకృతి దృశ్యాలతో అక్కడికి ఇక్కడికి తేడాను అద్భుతంగా చూపిన దర్శకుడే ఇలాంటి దృశ్యం పాటలో భాగం చేశాడంటే నమ్మటం కష్టం.

(‘మెరిసింది మేఘం మేఘం’ పాటని యూ ట్యూబ్‍లో చూడవచ్చు:

https://www.youtube.com/watch?v=S40C-VaOtrs )

ఇన్నాళ్ళకు గుర్తొచ్చానా వాన’ సూపర్ హిట్ పాట. నాయికా నాయకులకూ వర్షానికీ సంబంధం ఉంటుంది. పైగా ఈ పాట సినిమాకు కీలకమైనది. విలన్ నాయికను చూస్తాడు. హీరో నాయికకు నచ్చుతాడు. సినిమా కథ ఏర్పడిపోయింది. ఇద్దరి నడుమ ఘర్షణకు ప్రాతిపదిక తయారయిపోయింది ఈ పాట ద్వారా.

ఆరంభంలో జానపద గీతంలా మొదలవుతుంది. రైల్లోంచి నాయిక దిగుతుంది. రాగం తీస్తుంది ‘ఇన్నాళ్ళకు గుర్తొచ్చానా వాన’ అంటూ. అంతకు ముందు హీరో తన చొక్కాపై ఉన్న పెదవులను తాకడం, వర్షంలో తడుస్తూ నాయిక దానికి తగ్గట్టు అభినయించటం చూపిస్తారు.

ఇందులో అనేక కట్‍లు ఉంటాయి. ఓసారి అటు, ఓసారి ఇటు. పాట చిత్రీకరణలో ఔచిత్యం, అర్థం కన్నా లయబద్ధమైన నృత్యం, పాట లయకు తగ్గట్టు కెమెరా కదలటంపైనే దృష్టి ఉంటుంది. నాయిక కోతిలాగా చేస్తుంది, ఎందుకో అర్థం కాదు. కోతులు కూడా వర్షం వస్తే చెట్ల నీడలో దాక్కుంటాయి. ఇక మధ్యలో గుంపు వచ్చి నృత్యం చేయటం – ఇదంతా సాంకేతికంగా ఉన్నత స్థాయిలో ఉన్నా,  సినిమాలో సందర్భానికీ ఏ రకంగానూ తోడ్పడదు. కేవలం విలన్ హీరోలు నాయికను చూడటానికి తప్ప సినిమాకు ఎందుకూ పనికిరాదు.  ఈ పాట ‘జానపద’ గీతంలా ఆరంభమవుతుంది, కానీ సినిమా పాటలా మారిపోతుంది.

(‘ఇన్నాళ్ళకు గుర్తొచ్చానా వాన’ పాటని యూ ట్యూబ్‍లో చూడవచ్చు:

https://www.youtube.com/watch?v=K9LaZqmIXpM )

కృష్ణార్జున యుద్ధం’ సినిమాలోని ‘దారి చూడు దుమ్ము చూడు’ పాట పూర్తిగా జానపద పాట. జానపద పాటల్లోని మాధుర్యం, సౌందర్యం, అమాయకత్వం, గడుసుదనం, కవిత్వం, పదాలు సర్వం అత్యద్భుతంగా ప్రదర్శిస్తుందీ పాట.

దారి చూడు దుమ్ము చూడు మామ
దున్నపోతుల బేరే చూడు
కమలపూడి కట్టమీద మామ
కన్నె పిల్లల జోరే చూడు

‘పెంచల దాస్’ స్వయంగా ఈ పాట రాసి, పాడటంతో పాటకు సినిమా వాసనలంట లేదు. జానపద గీతంలా శుద్ధంగా, శుభ్రంగా ఉంది.

కానీ చిత్రీకరణే అసంతృప్తి కలిగిస్తుంది. ఇప్పటి దృష్టితో చూస్తే లయబద్ధమైన నృత్యాలు, లయను అనుసరించే కెమెరా కోణాలు మెచ్చవచ్చు. కానీ పాట భావం చూస్తే చిత్రీకరణ, నృత్యాలు అసంతృప్తి కలిగిస్తాయి. కానీ ఇప్పటి తరం – నాయకుడి నృత్యాన్ని మెచ్చుతుంది.

కురసా కురసా అడివిలో నా పిలగా
కురిసెనే గాంధారి వాన..

ఈ చరణం ఆరంభంలో వర్షం వస్తుంది. అయితే పాట గొప్పతనాన్ని చిత్రీకరణ ఏ మాత్రం పెంచదు. విడిగా వింటేనే పాట అద్భుతం అనిపిస్తుంది. ఎన్ని మార్లు విన్నా, తనివి తీరదు. కాని ఒక్కసారి చూడటం కూడా కష్టం అనిపిస్తుంది. కారణం పాట కోసం సరైన సందర్భం, పాట భావాన్ని ప్రస్ఫుటం చేసే అర్థవంతమైన చిత్రీకరణలు లేకపోవటం.

(‘దారి చూడు దుమ్ము చూడు మామ’ పాటని యూ ట్యూబ్‍లో చూడవచ్చు:

https://www.youtube.com/watch?v=yYHzwDhUxvY )

ఇక, ‘రూప్ తేరా మస్తానా’ తరువాత వర్షంలో తడుస్తూ నాయికానాయకులు పాడటం సాధారణమైన తరువాత యుగళగీతాలు వినటానికి బాగున్నా, చూటటం ఇబ్బందిగానే మారింది. ముఖ్యంగా శ్రీదేవి వర్షంలో తడిసి ‘కాటే నహీ కట్‍తే దిన్ యే రాత్’ (మిస్టర్ ఇండియా, 1987) అంటూ దాదాపుగా కెమెరాతో లైంగిక సంబంధం నెరపిన స్థాయిలో నృత్యం చేయటం, అది సూపర్ హిట్ కావటంతో పాటల్లో నాయిక శరీరంపై, కదలికలపై ఉన్న దృష్టి ఔచిత్యం, సభ్యతలను పట్టించుకోకపోవటంతో – కొండా కోనలు తుళ్ళిపోయేంతగా వాన పాటలు హిట్ అయినా, పాడుకోవటానికి తప్ప చూసేందుకు ధైర్యం సరిపోవడం లేదు. వానపాటలు నాయికను తడిపి అంగాంగ ప్రదర్శనకు ‘రాచబాట’ అని స్థిరపడిన తరువాత వాన పాటల దృశ్యాలలో వర్షపు జల్లు మిగిలి, తేనె మాధుర్యపు జల్లులు తగ్గాయి.

అందుకే ఒక్కోసారి వర్షాల యుగళ గీతాలు, బృంద నృత్యాల ప్రదర్శనలు చూస్తుంటే నాయికా నాయకులు గుహలు వదిలి బయటకు రాకుంటే బాగుండేదేమో  అనిపిస్తుంది. నాయిక ‘ఓ సజ్‌నా, బర్ఖా బహార్ ఆయీ, రస్ కీ పుహార్ లాయీ, అఖియోం మే ప్యార్ లాయీ’ (పరఖ్, 1960) అని పాడుతుంటే కలిగే తీపి తేనె జల్లుల మధురమైన అమృత తుల్య రసప్రవాహాల వృష్టిలో తడిసి ముద్దయిపోవటాన్ని మించి మరేమీ ఉండదనిపిస్తుంది.

(‘ఓ సజ్‌నా, బర్ఖా బహార్ ఆయీ’ పాటని యూ ట్యూబ్‍లో చూడవచ్చు:

https://www.youtube.com/watch?v=v0cN4AXHiW4 )

వర్షం రాగానే నాయికా నాయకులు గుహలో తల దాచుకున్నప్పుడు నాయిక ‘మియా కీ మల్హార్’ అనే మల్హార్ రాగ కుటుంబానికి చెందిన రాగంలో ‘బోలే రే పపీహరా’ అని గొంతెత్తి హృదయం నిండుగా గానం చేస్తుంటే (గుడ్డి, 1971), ఆ రస వృష్టి ప్రవాహంలో కొట్టుకుపోతో తల మునకలవటాన్ని మించి మరేం ఉంటుంది?

(‘బోలే రే పపీహరా’ పాటని యూ ట్యూబ్‍లో చూడవచ్చు:

https://www.youtube.com/watch?v=56AUdC9mn4E )

కానీ కాలం ముందుకే తప్ప వెనక్కు నడవదు. కాబట్టి గతాన్ని అర్థం చేసుకుంటూ, వర్తమానాన్ని ఆస్వాదిస్తూ భవిష్యత్తు వైపు సాగిపోక తప్పదు.

వర్షపు జల్లులలో ప్రపంచమంతా వరదల తాకిడికి గురవుతున్న సమయంలో వర్షాల పాటలను ఇంకా కొనసాగనిస్తే ప్రమాదం, కాబట్టి, ఇతర విభిన్నమైన పాటల వైపు దృష్టి మరల్చాల్సి ఉంటుంది. మళ్ళీ వర్షాల కాలం వస్తుంది ఎలాగూ!

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version