Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మధురగీతాలు – మనోహరదృశ్యాలు-25

[సంచిక కోసం ‘శంతనూ – శర్మిష్ఠ’ ప్రత్యేకంగా రచిస్తున్న సినిమా పాటల శీర్షిక.]

తకిటతక తకతకిట చకిత పదయుగళా
వికట గంగాఝరిత మకుటతట నిగళా
హరిహరాంచిత కళా కలిత నీలగళా
సాంద్రచ్ఛటా పటల నిటల చంద్రకళా
జయ జయ మహాదేవ శివ శంకరా
హర హర మహాదేవ అభయంకరా

‘భక్త కన్నప్ప’ సినిమాకు ప్రాతిపదికను ఏర్పాటు చేసే ఈ పరమాద్భుతమైన ‘కిరాతార్జునీయం’ ఘట్టం భారతీయ సినిమా చరిత్ర లోనే ఒక అపూర్వ ఘట్టం. ఇలాంటి పాటల సందర్భాలు మన సినిమాలకు, ముఖ్యంగా తెలుగు సినిమాలకే ప్రత్యేకం. ‘కన్నప్ప’ శివభక్తికి భూమిక ఏర్పడిన సందర్భాన్ని వివరించే ఈ పాట తెలుగు పాటల ప్రపంచంలో అద్వితీయమైనది.

ఒక పౌరాణిక గాథను సంగీతనృత్య రూపకంలా ప్రదర్శించిన సందర్భాలు పౌరాణిక సినిమాలలో ఉన్నాయి. ఈ సందర్భాలు చిత్రీకరణ విషయంలోనే కాదు, గేయ రచనలో కూడా అత్యుత్తమ స్థాయి కన్నా ఉత్తమ స్థాయిలో ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే, గేయ రచయితల ప్రతిభకు పరీక్ష లాంటివి ఇలాంటి సందర్భలు. కొన్ని వేల శ్లోకాలలో ప్రదర్శితమయిన  గాథలను మూడు నాలుగు నిమిషాలలో కుదించి ప్రదర్శించటమే కాదు, అందరికీ తెలిసిన కథలనే ‘అద్భుతం’ అనిపించే రీతిలోనే కాదు, పదే పదే పాడుకుంటూ పరవశించి మైమరచి పోయే రీతిలో రచించటం అంత సులభమైన పనికాదు. ‘సృష్టికి ప్రతిసృష్టి చేయటం లాంటిది’ ఇది. కానీ కొన్ని వందల వేల శ్లోకాలలో నిత్యం పారాయణం రీతిలో ఉన్న ‘స్పష్టి’కి, సరళమైన, సూక్ష్మమైన ‘ప్రతిసృష్టి’ ఇది. సముద్రం లాంటి మూల కథను ఒక బిందువులో ప్రదర్శిస్తూనే ఆ బిందువులోనే సప్తవర్ణాలను దర్శింపచేస్తూ, సముద్రాన్ని దర్శించిన అనుభూతిని కలిగించాలి.

‘పాండురంగ మాహాత్మ్యం’  సినిమాలో ‘జయ కృష్ణా ముకుందా మురారి’ పాట  శ్రీకృష్ణుడి లీలా కేళీ విలాసాలను వర్ణిస్తూ దృశ్యరూపంలో ఆ మహిమలను ప్రదర్శిస్తూ శ్రీకృష్ణుడి గొప్పతనాన్ని, భక్తులకు మోక్షాన్ని అందించే శక్తిని ప్రదర్శిస్తూ భారతీయ తాత్విక మర్మాలను సున్నితంగా వివరించే పాట. భక్తుడు పరవశమై గానం చేస్తూ, భగవంతుడి కేళీ విలాస దృశ్యాలను మనస్సులో దర్శిస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ పాడే పాట అది.

‘భూకైలాస్’ సినిమాలో ‘రాముని అవతారం’ పాట భవిష్యత్తుకు దృశ్య రూపం ఇచ్చేపాట. నిజానికి ‘భూకైలాస్’లో రాముడి ప్రసక్తి ఈ సందర్భంలో తప్ప మరెక్కడా రాదు. రావణాసురుడి సినిమాలో రాముడి ప్రసక్తి లేకపోతే ఎలాగ? అన్న ఆలోచనతో కాబోలు ఈ పాటకు సందర్భాన్ని కల్పించారు. కానీ సముద్రాల సీనియర్ రచనా ప్రతిభ, ‘సుదర్శనం – గోవర్ధనం’ సంగీత వైదుష్యం, ఘంటశాల గాన ప్రావీణ్యం ఈ పాటను నిత్యం పాడుకుని పరవశించి భక్తి సముద్రపు  అలలపై తేలియాడ చేసే అత్యద్భుతమైన గీతంగా ఎదిగించింది.

ద్వారపాలుర మరల దరితీయు కృపయో
ధరలోన ధర్మము నెలకొల్పు నెపమో
రాముని అవతారం, రవికుల సోముని అవతారం

ఆరంభంలో రామాయణ తత్వసారం తెలిసిపోయింది. ఎంత సులభంగా, సరళంగా పురాణ గాథను, రావణుడి పూర్వ జన్మ శాపాన్ని, భవిష్యత్తులో రామ అవతార లక్ష్యాన్ని రెండు పాదాలలో విశదపరచాడు గేయ రచయిత. మానవమాత్రులకు సాధ్యం కాని గేయ రచన ఇది. భగవంతుడి ఆశీస్సులు, సరస్వతీదేవి కటాక్షం ఉంటే తప్ప ఇలా రాయటం సాధ్యం కాదు. ‘కృప’, ‘నెపం’ పదాల నడుమ రామాయణం మొత్తాన్ని ఒదిగింప చేశాడు కవి.

‘భూకైలాస్’ సినిమా కథకూ, రామాయణ గాథకూ నడుమ ఉన్న సంబంధాన్ని అతి గొప్పగా ప్రదర్శిస్తుందీ పాట. పాట చిత్రీకరణ కూడా అత్యంత సందర్భోచితంగా ఉంటుంది. పాట ఆరంభంలో పార్వతి ఒక్కర్తి ఆందోళన నిండిన వదనంతో కనిపిస్తుంది. కెమెరా దూరం జరిగి పక్కనే ఉన్న నారదుడిని చూపిస్తుంది.

తరువాత నెమ్మదిగా నారదుడినే క్లోజప్పులో చూపిస్తుంది. ‘రాముని అవతారం’ అనేసరికి భక్తి భావనతో కళ్లు మూసుకుని చేతులు జోడిస్తాడు నారదుడు. రాముని పేరు వినపడుతూంటేనే పవిత్ర భావన నారదుడి వదనంలో ద్యోతకమవుతుంది. సందర్భోచిత నటన ఇది.

రాముని అవతారం రవికుల సోముని అవతారం
సుజన జనావన ధర్మాకారం
దుర్జన హృదయ విదారం

ఏ అవతార పరమార్థమయినా ‘దుష్ట శిక్షణ, శిష్ణ రక్షణ’యే. ఈ నిజాన్ని చక్కని పదాలతో కవి ప్రదర్శించాడు. ఇక్కడే చిత్రీకరణలో గొప్పదనం తెలిసేది. గేయరచయిత, సంగీత దర్శకుడు, దర్శకుల నడుమ అవగాహన, ఆలోచనలలో సామరస్యము ఉంటే ఎంత గొప్ప పాటలు రూపొందుతాయో, ఎంత గొప్ప సినిమా దర్శనానుభవాలు తరతరాలు ఆనందం అనుభవించే రీతిలో ఎదుగుతాయో, సమాజానికి అత్యున్నత కళా ప్రదర్శనలో ప్రామాణికాలు ఏర్పరుస్తాయో తెలుస్తుంది.

‘రాముని అవతారం’ ప్రస్తావన రావటంతో నారదుడి పని అయిపోయింది. సినిమాలో పాట భవిష్యత్తుకు సంబంధించినది. పాటలో నారదుడు చెప్పే విషయాలను పార్వతి పాత్ర మనోయవనికపై దర్శించాలి. అoటే, భవిష్యత్తు కళ్ల ముందు కనిపించాలి. ఆమె కళ్ళకు కనబడే భవిష్యత్తు   ఘటనలు ప్రేక్షకుడికి  తెరపై కనబడాలి. అందుకని, సంగీత దర్శకుడు ప్రస్తావన నుండి పాట ఆరంభానికి నడుమ సంగీతాన్ని జోడించాడు.

ఈ సంగీత కాలాన్ని దర్శకుడు వర్తమానం నుంచి ప్రేక్షకుడిని భవిష్యత్తుకు తీసుకువెళ్లేందుకు వాడుకున్నాడు.

కళ్లు మూసుకుని భక్తితో నమస్కారం చేస్తున్న నారదుడి నుంచి కెమెరా ఆకాశంలో మేఘాలను చూపిస్తుంది. కదలుతూ కాలాన్ని  తలపింప చేసే మేఘాల  పొగలోకి వెళ్తుంది. కాల చక్ర గమనాన్ని తలపింపజేస్తూ భవిష్యత్తులోకి డిజాల్వ్ అవుతుంది.

రాజభవనంలో నాలుగు ఉయ్యాలలూగుతుంటాయి. ‘రాముని అవతారం’ అంటూ పాట ఆరంభమవుతుంది. బాల రాముడు కనిపిస్తాడు. మళ్ళీ ఉయ్యాలూపుతుంటారు. దృశ్యం ‘కట్’ అయి ఆకాశం నుంచి దేవతలు భూమిపై పూలు చల్లుతూ కనిపిస్తారు. ఒక్క మాట చెప్పకుండా కథ అర్థమైపోతూ ఉంటుంది.

దాశరధిగ శ్రీకాంతుడు వెలయు
కౌసల్యాసతి తఫము ఫలించు
జన్మింతురు సహజాతులు మువ్వురు
లక్ష్మణ, శతృఘ్ను, భరత..

నిజానికి పాట లేకుండా సంగీతం వినిపిస్తూ దృశ్యం చూపించినా, ప్రేక్షకులంతా ఎవరు ఎవరో గుర్తుపట్టేయగలరు. కథ అందరికీ తెలుసు. తెలిసిందే, కొత్తగా, మరింత మెప్పించే రీతిలో ఆసక్తికరంగా చెప్పటమే, కళా ప్రతిభకు నిదర్శనం. అది ఈ సందర్భంలో పుష్కలంగా పొంగిపొర్లుతోంది. కథను చెప్పిన విధానం గొప్పగా ఉంటుంది. అంతా ‘భవిష్యత్తు కాలం’లో చెప్తున్నాడు. వెలయు, ఫలించు, జన్మింతురు.. ఔచిత్యాన్ని పాటిస్తూ అద్భుతాన్ని సృష్టించేందుకు శృతి చూసుకుంటున్నాడు కవి.

పిల్లలు పెద్దవాళ్లయ్యారు. చదువుతున్నారు. ఇది రెండవ చరణానికి ప్రాతిపదికను ఏర్పాటు చేసింది.

చదువులు నేరుచు మిషచేత
చాపము దాలిచి చేత
విశ్వామిత్రుని వెనువెంట
యాగము కావగ చనునంట
అంతము చేయునహల్యకు శాపము
ఒసగును సుందర రూపం

మొదటి రెండు పాదాల  నడుమ వచ్చే సంగీతం సమయంలో  పిల్లలు పెద్దవాళ్లయిపోతారు. ‘విశ్వామిత్రుని వెనువెంట’ అంటూ మళ్లీ పాట ప్రారంభమవుతుంది.

అంటే, గేయ రచయిత రాసినదాన్ని దృశ్యం ద్వారా చూపుతున్నాడు. పాటలో పదాలు వదలిన  ఖాళీలను దృశ్యం భర్తీ చేస్తుంది. కథ ముందుకు సాగుతున్నది. దృశ్యాన్ని పాట వర్ణిస్తూ, మళ్లీ దృశ్యం ద్వారా చెప్పగలిగినదాన్ని వదులుతూ కథను ముందుకు నడుపుతున్నది. పరమాధ్భుతమైన సమన్వయం ఇది. దృశ్యం పాటను నడిపిస్తుంది. పాట దృశ్యానికి ఊపునిస్తున్నది. రెండూ కలసిమెలసి కథను ముందుకు నడిపిస్తున్నాయి.

తెరపై ధనస్సు కనబడగానే ప్రేక్షకులకు సంఘటన తెలుస్తుంది. కానీ ఆ సంఘటనలో ఒదిగి ఉన్న భావాలు, గాథలను అత్యంత సూక్ష్మంగా ప్రదర్శిస్తూ సంఘటనలోని మార్మికతను తెలియచెప్తాయి పాటలో పదాలు.

ధనువో జనకుని మనసున భయమో
ధారుణి కన్యా సంశయమో
దనుజులు కలగను సుఖగోపురమో
విరిగెను మిధిలా నగరమున

‘దనుజులు కలగను సుఖగోపురమో’ ఎంత అద్భుతమైన ప్రయోగం! ‘దనుజులు’ అంటే రాక్షసులు. ‘దనువు’ నుండి పుట్టినవారు. ధర్మకార్యాలకి విరుద్ధమైనవి చేసేవారు అని అర్థం. అలాంటి వారు కనే కలలకు పరాకాష్ఠ ‘సుఖగోపురము’. అది మిథిలానగరంలో విరిగింది. రాక్షసుల కలలు భగ్నమవటానికి నాందీ ప్రస్తావన జరిగింది. ఇదొక్కటే కాదు, జనకుని భయము, కన్య సంశయము, రాక్షసుల సుఖగోపురము – అన్నీ శివధనుర్భంగంతో మిథిలానగరంలో భంగమయ్యాయి. సృజన అంటే ఇది. తెలిసిన విషయాలని ఊహించని కోణాలలో, అందమైన అర్థాలతో, చక్కని పద ప్రయోగాలతో ‘ఆహా’ అని మనస్సు ఉప్పొంగే రీతిలో చెప్పగలగటాన్ని మించిన సృజనాత్మకత ఏముంది? ధనువు, ధారుణి, కన్య, దనుజులు.. చివరి పాదంలో  ‘మోక్షం’ లభించింది .

అహల్యకు సుందర రూపం ఒసగటంతో దృశ్యం మారింది. గమనిస్తే రెండవ చరణంలో tense మారింది. కళ్ల ఎదురుగా దృశ్యాలు జరుగుతున్నాయి. భవిష్యత్తు వర్తమానంలో   కళ్ల ఎదురుగా జరుగుతోంది. అందుకే ‘విరిగెను’ అన్నాడు కవి.

కపట నాటకుని పట్టాభిషేకం
కలుగును తాత్కాలికా శోకం
భీకర కానన వాసారంభం
లోకోద్ధరణకు ప్రారంభం

నాలుగు పాదాలలో రాముడి అరణ్యవాసారంభాన్ని ఇమిడ్చేశాడు కవి. కవి చెప్పని వాటిని దృశ్యం చూపించింది. దశరథుడి విలాపం, కైక కోరిక సర్వం ప్రేక్షకుడికి తెలిసిపోతాయి. రాముడు, సీత దశరథుడికి, కైకకు మ్రొక్కుతారు. లక్ష్మణుడు ఆమె వైపు కోపంగా చూస్తాడు.  పాట చెప్పనిది దృశ్యం చెప్పింది. పాట భవిష్యత్తు చెప్పింది.

‘భీకర కానన వాసారంభం, లోకోద్ధరణకు ప్రారంభం’. ఇక్కడ ‘కపట నాటకుని పట్టాభిషేకం’ అన్న పదం పట్ల ఆ కాలంలో పలు చర్చలు, అభ్యంతరాలు, వాదోపవాదాలు సంభవించాయి. ఇక్కడ కవి రాముడి అవతారం గురించి చెప్తున్నాడు. నారదుడు భూత భవిష్యత్, వర్తమానాల దర్శి. అందరి అంతరంగాల లోని అంశాలు తెలిసినవాడు. శ్రీ మహా విష్ణువు రాముడి అవతారం ఎత్తబోతున్నాడు. రాముడు జన్మించింది లోకోద్ధరణ కోసం. దుర్జన హృదయ విదారంగా జన్మించాడు కాబట్టి అతడికి పట్టాభిషేకం జరగదు. అది రాముడికి తెలుసు. రాముడి అవతారం ఎత్తిన విష్ణువుకు తెలుసు. అందుకని పట్టాభిషేకం ‘కపట నాటకం’. ప్రజలలో ఆశలు కలిగించాడు. తండ్రికి ఆశ కల్పించాడు. జరగని పని అని తెలిసి అంతా జరిగేట్టు నాటకం ఆడాడు. ఇక్కడ కపట నాటకుడు అన్నది దూషణ కాదు. అభినందన. అంతా తెలిసినవాడి లీల అని అర్థం.

భరతుని కోరిక తీరుచు కోసం
పాదుక లొసగే ప్రేమావేశం
నరజాతికి నవ నవ సంతోషం
గురుజన సేవకు ఆదేశం

తెరపై కనబడే దృశ్యాన్ని పాట చెప్పాల్సిన అవసరం లేదు. ఆ దృశ్యం పరమార్థాన్ని వివరిస్తుంది గీతం.  ఆ దృశ్యంలో ఒదిగిన జీవితసత్యాన్ని, ఆదర్శాన్ని, అంతరార్థాన్ని తెలుపుతుంది. వెంటనే రాగం మారుతుంది. పాట మారుతుంది. దృశ్యం మారుతుంది.

అదిగో చూడుము బంగరు జింక
మన్నై చనునయ్యో లంక
హరనయనాగ్ని పరాంగనవంక
అడిగిన మరణమె నీ జింక.

దృశ్యాలు పాటలో వదిలిన సంఘటనలు ప్రదర్శిస్తాయి. మళ్లీ బాణీ మారుతుంది. పాట మారుతుంది. ఘంటసాల స్వరం పలికే భావం మారుతుంది.

రమ్ము రమ్ము హే భాగవతోత్తమ
వానర కుల పుంగవ హనుమా

హనుమంతుడి కోసం వాడిన విశేషణాలు హనుమ గాథను చెప్తాయి. ‘భాగవతోత్తమ’, ‘వానర కుల పుంగవ’ – రాముడు హనుమకు సీతకు చూపేందుకు ‘ముద్రిక’ని ఇస్తాడు.

ముద్రిక కాదిది భువన నిదానం
జీవన్ముక్తికి సోపానం

‘భువన నిదానం’.. ‘భువన’ అంటే ప్రపంచం, లోకం. ‘నిదానం’ అంటే కారణం, మూలం, వివరణ అనే అర్థాలు వస్తాయి. భారతీయ తత్త్వంలో జీవి స్థితిని వివరిస్తుంది ‘నిదానం’ పదం. బౌద్ధంలో కార్యకారణ సంబంధాన్ని వివరించేందుకు ‘నిదాన’ పదం వాడతారు.

‘భువన నిదానం’ అన్న పదం విశ్వం మూలాన్ని, తీరుతెన్నులను, జీవన విధానాన్ని వివరించే లోతైన తాత్త్విక అవగాహనను సూచిస్తుంది. రాముడు అందించిన ముద్రిక విశ్వమూలాన్ని వివరించే మహత్తు కలది. సమస్త జ్ఞానానికి ప్రతీక. అందుకే తరువాతి పాదంలో ‘జీవన్ముక్తికి సోపానం’ అన్నాడు. మామూలు గేయ రచయితలు ఇలాంటి భావనలను గీతాలలో ప్రదర్శించలేరు. ఎలాగయితే పిల్లవాడు కాకరుపూవొత్తులు వెలిగించి ఎంతో ఘనకార్యం సాధించినట్టు పొంగిపోతాడో, అలాగ మామూలు గేయ రచయితలు ఏదో తాత్త్విక భావం రాసేసి పొంగిపోతారు. గ్రాంథిక పదాలు గుప్పించి విర్రవీగుతారు.  కానీ, ‘ముద్రిక కాదిది భువన నిదానం’ రాయాలంటే పైపై చదువులు సరిపోవు. “చదివినవి గలవు పెక్కులు/చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రీ” అనగలగటమే కాదు, ఆ మర్మాన్ని అలతి అలతి పదాలలో ప్రదర్శించగల నైపుణ్యం, విద్య కూడా ఉండాలి.

హనుమంతుడు ఆకాశంలో ఎగురుతూ లంకకు చేరే సమయంలో ‘జీవన్ముక్తికి సోపానారోహణ’ త్రోవ కూడా చూపిస్తాడు, వినిపిస్తాడు పాటలో.

రామరామ జయ రామరామ
జయ రామరామ రఘుకుల సోమా
సీతాశోక వినాశనకారి
లంకా వైభవ సంహారి

ఇక్కడ కూడా పాటలో చెప్పనిదాన్ని దృశ్యం చూపించటం, దృశ్యం పరమార్థాన్ని పాట  వివరించటం చూడవచ్చు. దృశ్యం ప్రదర్శించే గాథలో ఒదిగిన మర్మాన్ని పాట వివరిస్తుంది.

అయ్యో రావణ భక్తాగ్రేసర
అమరం బౌనిక నీ చరిత
సమయును పరసతిపై మమకారం
వెలయును ధర్మ విచారం

రెండువైపులా పదుననిన కత్తిలాంటిది ‘సమయును పరసతిపై మమకారం’ అన్న పదం. పార్వతిని మోహించిన రావణాసురుడి సంహారం భవిష్యత్తులో సంభవిస్తుందని పార్వతికి చెప్పినట్టవుతుంది. అయినా, పరసతి సీతను మోహించటం వల్ల రావణుడు మరణిస్తాడు, దాంతో పరసతిపై మమకారం నశించి అందరూ ధర్మ బద్ధంగా ఆలోచిస్తారు అని చెప్పినట్టయింది. రావణ సంహారంతో  ‘ధర్మ విచారం’ వెలుస్తుందని ఆశించాడు. కానీ ‘ధర్మం’ విచారించే పరిస్థితులు నెలకొనటం చూస్తున్నాం. రావణాసురుడిని దేవుడిగా భావించే అసుర అధర్మ  విచారాన్ని చూస్తున్నాం. పరసతిపై మమకారాన్ని న్యాయస్థానాలు చట్టబధ్ధం చేయటం అనుభవిస్తున్నాం. ప్రపంచంలో భారతీయ ధర్మానికే ప్రత్యేకం ‘దాంపత్య ధర్మం’, ఆధునిక అభ్యుదయ భావ పరంపరల సంస్కరణల పథానికి గురయి విడాకుల మాలలతో, సహజీవన తోరణాలతో అలంకృతమవటం అనుభవిస్తున్నాం. ఇలాంటి పాటలు, దిగజారిన సృజనాత్మక ప్రతిభ పాండిత్యం వంటి అంశాలతో పాటు మనం కోల్పోతున్న మన తనాన్ని, మన ధర్మాన్ని జ్ఞప్తికి తెస్తాయి.

రాముని అవతారం పాట సినిమా పాట కాదు. ఎలాగయితే కలియుగంలో వేదాలు చదివి అర్థం చేసుకునే శక్తి లేని వారి కోసం వ్యాసుడు ‘భాగవతం’ రచించాడో, అలా ఆధునిక సమాజంలో, పైపైన స్పృశించడమే పాండిత్యంగా స్థిరపడుతున్న సమయంలో,  ప్రాచీన వైభవ ప్రభల  ప్రబల  మెరుపు స్పృహ కలిగించి చైతన్యవంతులను చేయటం కోసం సినీ కళాకారులు అందించిన ‘దృశ్య గాథా కావ్యం’ ఈ పాట. సంక్షిప్త రామాయణ పాఠ్యపుస్తకం ఈ పాట, దృశ్యం.

(‘రాముని అవతారం రవికుల సోముని అవతారం’ పాటని యూట్యూబ్‌లో చూడవచ్చు:
https://www.youtube.com/watch?v=Y5w5RQXDfkI )

పౌరాణిక గాథలకు దృశ్య, గాన రూపాలిచ్చిన పాట. ‘భూకైలాస్’ రామాయణాన్ని ప్రదర్శిస్తే, ‘జయ కృష్ణా ముకుందా మురారి’  ‘భాగవతాన్ని’ ప్రదర్శిస్తుంది. ‘భక్త కన్నప్ప’ సినిమాలో ‘కిరాతార్జునీయం’ గాథ వర్తమానానికి గతంలో జరిగిన సంఘటనను ప్రదర్శిస్తుంది. కర్మ సిధ్ధాంతాన్ని, కార్యకారణ సంబంధాన్ని ప్రదర్శిస్తుంది. ‘భక్తకన్నప్ప’ ఆరంభం  దృశ్య, శ్రవణ రూపం ప్రదర్శన పాటకు ఇంత వారసత్వం ఉంది.

(మిగతా వచ్చే వారం).

Exit mobile version