Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మధురగీతాలు – మనోహరదృశ్యాలు-26

[సంచిక కోసం ‘శంతనూ – శర్మిష్ఠ’ ప్రత్యేకంగా రచిస్తున్న సినిమా పాటల శీర్షిక.]


తకిటతక తకతకిట చకిత పదయుగళా
వికట గంగాఝరిత మకుటతట నిగళా
హరిహరాంచిత కళాకలిత నీలగళా
సాంద్రచ్ఛటాపటల నిటల చంద్రకళా
జయజయ మహాదేవ శివశంకరా
హరహర మహాదేవ అభయంకరా

భక్త కన్నప్ప’ సినిమా ఆరంభంలోనే వచ్చే ఈ పాట ఒక ‘కథా గీతం’ లాంటిది. కిరాతార్జునీయం కథను గీతంగా  చెప్తూ, తెరపై దృశ్యరూపంలో ప్రదర్శిస్తుందీ సన్నివేశం. భక్త కన్నప్ప శివభక్తి,  పూర్వజన్మ సుకృతం అని గత జన్మ గాథను తెలిపి, సినిమా కథలో ప్రేక్షకులు తాదాత్మ్యం చెందటంలో ఎంతగానో తోడ్పడుతుంది ఈ పాట.

‘పాట’ తో ఆరంభంలోనే సినిమాకు ప్రాతిపదికను ఏర్పాటు చేయటం మన తెలుగు సినీ కళాకారులకు వెన్నతో పెట్టిన విద్య. ‘బాల భారతం’ సినిమా ఆరంభంలోనే పాట పూర్తయ్యేసరికి సినిమా కథ ఆరంభమవుతంది. ‘భక్త కన్నప్ప’ సినిమాలోని ‘కిరాతార్జునీయం’ పాట కూడా అసలు సినిమాకు ప్రాతిపదికను ఏర్పాటు చేసే పాట. ‘సీతాకళ్యాణం’ సినిమా ఆరంభంలో వచ్చే ‘మా జానకి చెట్టబట్టగా’ త్యాగరాజు కీర్తన ఇలాంటిదే. ఇదే సినిమాలో ‘సీతారాముల శుభ చరితం’, ‘నారాయణ నీ లీల’ పాటల వంటిది.

గమనిస్తే, ‘భక్త కన్నప్ప’, ‘సీతాకళ్యాణం’ రెండూ బాపు సినిమాలే. రెండూ ఒకే సంవత్సరంలో విడుదలయ్యాయి. ‘సీతాకళ్యాణం’లో అధిక శాతం కథాగీతాలతోనే నడుస్తుంది. గంగావతరణం, దశావతారాలు, విశ్వమిత్రుడి కథ.. ఇలా పలు గాథలను ఒక మాలలా గుచ్చి ప్రదర్శించటంలో ‘కథాగీతం’ ప్రధాన పాత్ర వహిస్తుంది. ఇంతకన్నా ముందు ‘సంపూర్ణ రామాయణం’లో ఈ కథాగీతాలకు ‘బీజం’ కనిపిస్తుంది. ముఖ్యంగా సీతా వియోగం సమయంలో వచ్చే ‘వెడలెను కోదండపాణి’ పాట చూస్తుంటే ‘సీతాకళ్యాణం’ సినిమా చిత్రీకరణ పద్ధతికి ‘బీజం’ కనిపిస్తుంది.

ఒక ఆలోచన జన్మించి అది మహా వృక్షంలా ఎదిగి ఆకాశాన్ని తాకటం, కథా గీతాల చిత్రీకరణ విషయంలో ‘బాపు’ సినిమాల్లో చూడవచ్చు. అయితే, ‘సంపూర్ణ రామాయణం’ సినిమాలో కానీ, ‘సీతాకళ్యాణం’లోని కథా గీతాలకు భిన్నంగా నిలుస్తుంది – ‘భక్త కన్నప్ప’ సినిమాలోని ‘కిరాతార్జునీయం’ గాథను ప్రదర్శించే పాట.

బాపు సినిమాల్లోని ఇతర కథా గీతాలు సాహిత్యపరంగా, చిత్రీకరణ పరంగా అత్యుత్తమ స్థాయిలో ఉన్నా, అవి కూడా ఒక గాథను సంపూర్ణంగా ప్రదర్శించినా, ‘భక్త కన్నప్ప’ లోని ‘కిరాతార్జునీయం’ పాటలా ప్రజాదరణను పొందటమే కాదు, ప్రతి ఒక్కరూ పదే పేద పాడుకూంటూ, పరవశించి, సినిమాను పాట కోసం చూడాలని తపించే రీతిలో ఎదగలేదు. నిజానికి ‘సీతాకళ్యాణం’ సినిమాకు విదేశాలలో ప్రశంసలు లభించిన తరువాతనే ఆ సినిమా గొప్పదనం ఇక్కడివారు గుర్తించటం ప్రారంభించారు.

కదిలింది కదిలింది గంగ..
కదిలి ఉప్పొంగింది గంగ..
పరమ రాజసభావ పరిచుంబితనితాంగ
కదిలింది కదిలింది గంగ..
కదిలి ఉప్పొంగింది గంగ..
ఆకాశమే అదరగా.. ఐరావతం బెదరగా
నందనవనం ప్రిదులగా.. బృందారకులు చెదరగా
సాగింది సాగింది గంగ.. సాగి చెలరేగింది గంగ..
ఊగింది ఊగింది గంగ.. ఉద్వేగాభినేకాంతరంగ..
హరుణి శిరమున పోటులెత్తగా.. బ్రహ్మాండ భాండము బీటలెత్తగా..

‘గంగావరతరణం’ పాట కోసం ‘సినారె’ రాసిన పాట ధ్వని ‘కిన్నెరసాని’ గతికి ఏ మాత్రం తీసిపోదు. అతి సుందరమైన భావం.  ఆనందింపచేసే పదాలు. సాహిత్యపరంగా మేలిముత్యం ఈ పాట. ఇదే కాదు, ‘సీతాకళ్యాణం’ సినిమాలోని పాటలు సాహిత్యపరంగా ‘మహా సాగరాలు’ కానీ, ఆ పాటలు ‘కిరాతార్జునీయం’లా పాడుకునేట్టు ఎదగలేదు.

‘భక్త కన్నప్ప’ సినిమాలో ‘కిరాతార్జునీయం’ పాట వేటూరి గేయ రచన నైపుణ్యానికి విశ్వరూప ప్రదర్శన లాంటిది. భారవి సారాన్ని, శ్రీనాథుడి పద ప్రయోగ వైశిష్ట్యాన్ని, భారతీయ ధర్మ లక్షణాలను కలగలిపి తనదైన ప్రత్యేక సృజనాత్మక ప్రతిభను మేళవించి సృష్టించిన ఏడు నిమిషాల ‘కథాకావ్యగీతం’ కిరాతార్జునీయం.

పాట ఆరంభంలోనే శివతాండవం సంగీతం వస్తుంది. ఆ లయను అనుసరిస్తూ శివతాండవ వర్ణన అత్యద్భుతమైన రీతిలో ఉంటుంది. దేవతలు శివుడిని కొనియాడతారు, శివతాండవాన్ని వర్ణిస్తూ.  తరువాత కథ చెప్పటం మొదలవుతుంది.

‘వేటూరి’ ఈ గీతాన్ని రచించిన విధానం చూస్తే, ఒక అత్యంత నిపుణుడయిన కథకుడు, అతి చక్కని ఎత్తుగడతో కథను ఆరంభించినట్టు పాటను రూపొందించటం తెలుస్తుంది. ‘కిరాతార్జునీయం’ భారవి భారతంలోని వనపర్వంలోని కథను తీసుసుకని వీరరసానికి ప్రాధాన్యత ఇస్తూ 18 సర్గలలో రచించిన కావ్యం. కవిత్వ సౌందర్యానికి, అర్థగాంభీర్యానికి, లోతైన తాత్వికతకు, భాషానైపుణ్యానికి ప్రసిద్ధి చెందిన కావ్యం ఇది. సినిమాకు కేవలం అర్జునుడు పాశుపతాస్త్రాన్ని సాధించే ఘట్టం అవసరం. అందుకని అర్జునుడు పాశుపతాస్త్రాన్ని ఎందుకు సాధించాలి అనుకున్నాడు? నేపథ్యమేమిటి? వంటి విషయాల జోలికి పోలేదు. మహాభారత కథ అందరికీ తెలుసు. అర్జునుడు అందరికీ తెలుసు. కాబట్టి తిన్నగా ‘శివతాండవం’తో ఆరంభించాడు కవి. అదీ ఎలా? ఒక ఊపు, ఉద్వేగము, అద్భుతమూ కలగలసిన లయాత్మకమైన పదావళితో, ‘సంగీత నృత్య సాహిత్య సమలంకృతే’ అన్న రీతిలో నృత్యగతిని, గీతగతిని పదాల ధ్వనితో సమన్వయ మొనర్చి ప్రదర్శించాడు.

దేవతలు కొనియాడటం కాబట్టి సంస్కృతం వాడాడు. సంస్కృతం దేవభాష మరి! వెంటనే సరళమైన సామాన్య భాషలో కథ చెప్పటం ఆరంభించాడు.

అని దేవతలు శివుని కొనియాడ
పరవశమ్మున శివుడు తాండవమ్మాడగా
కంపించెనింతలో కైలాసమావేళ
కనిపించెనంత అకాల ప్రళయ జ్వాల

దృశ్యం కళ్ల ముందు నిలబడుతుంది. శివుడు నృత్యం చేస్తున్నాడు. దేవతలు పొగడుతున్నాడు. దాంతో పరవశించి మరింత ఆనందంగా నృత్యం చేస్తున్నాడు. ఇంతలో కైలాసం కంపించింది. అకాల ప్రళయజ్వాల కనిపించింది. ఎందుకు? ఏమిటి?

పాటను సస్పెన్స్ కథలా మలచి అందించటం గమనించవచ్చు. అది అర్జునుడి తపస్సు వల్ల జనించిన  అగ్ని  అని చెప్తే సస్సెన్స్ లేదు. మాములు గేయ రచయితలు కథలు అలా చేప్తారు. కానీ మహామాయగాళ్లకు మాయగాడైన కథా రచయిత తెలిసినదాన్నే నోరు తెరచి ఉద్విగ్నతతో వినేట్టు చేస్తాడు. పదాల శక్తి తెలిసిన కవి, పదాల వాడకంతో, పదాల కలయికతో ఉద్విగ్నతని సృష్టిస్తాడు. ఉత్తేజితం చేస్తాడు. నిశ్బబ్ద దృశ్యాన్ని చూస్తుంటే కలగని భావాన్ని నేపథ్య సంగీతంతో కలిగించవచ్చు. ఇక్కడ వేటూరి అక్షరాలతో దృశ్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. భావంతో నటనను దర్శింపచేస్తున్నాడు. పదాల ధ్వనితో నేపథ్య సంగీతం వినిపిస్తున్నాడు. లయతో శ్రోత శరీరాన్ని ఉపేస్తున్నాడు. అన్నిటినీ కలగలిపి హృదయాన్ని ఉప్పొంగింప చేస్తున్నాడు.

జగమునేలిన వాని సగము నివ్వెరబోయె
సగము మిగిలిన వాని మొగము నగవైపోయె

ఇక్కడ ఒక స్క్రిప్టు రచయితలా దృశ్యాన్ని చిత్రించటమే, కాదు, నటీనటులకు దర్శకుడిలా నటననూ నేర్పిస్తున్నాడు. పాటలో చెప్పినట్టు హావభావాలు ప్రదర్శించటమే నటుల పని. వారి భావనలను క్లోజప్పులో చూపటం కెమేరా పని.

ఇక్కడ ‘సగము’తో పూర్తి చమత్కారం చేశాడు వేటూరి. ‘జగము నేలిన వాని సగము, సగము మిగిలిన వాని మొగము’ పదాలు పలుకుతుంటే నోరు తీపి అవుతుంది. ఖండశర్కర, పుట్ట తేనల రుచిని పదాలు స్ఫురింపచేస్తాయి. భావం మనస్సును మురిపిస్తుంది. ఇక్కడే ఎంతో సున్నితంగా, సూక్ష్మంగా అర్ధనారీశ్వర తత్వాన్ని ప్రదర్శిస్తూ దాంపత్య ధర్మాన్ని బోధించాడు. అర్ధనారీశ్వరుడు శివుడు. కానీ ఒకే సంఘటనకు ఒకరు నివ్వెరపోయారు, మరొకరు నవ్వారు. కానీ వారిద్దరూ ఒకటే. పరస్పర విభిన్న స్పందనలున్నా, కలసి మెలసి అర్థం చేసుకుని, అవగాహనలతో జీవించటమే దాంపత్యం. అహంకారాలు లేవు. హక్కుల పోరాటాలు లేవు. భిన్నత్వంలో ఏకత్వం. ఏకత్వం అర్ధనారీశ్వర తత్వం.

ఓం నమః శివాయ. ఓం నమః శివాయ

ఇంత వరకూ అల్లకల్లోలానికి కారణం తెలియలేదు. వేటూరి ‘సగము మిగిలిన వాని మొగము నగమైపోయె’ దగ్గర పాటను మలుపు తిప్పటం సస్పెన్స్ రచనకు పరాకాష్ఠ. అంత కల్లోలంలో శివుడు నవ్వాడు. కారణం అతడికి తెలుసు. పార్వతికి తెలియదు. ప్రేక్షకుడికీ తెలియదు. ఇది నవల రచయితలు అతి ఇష్టంగా వాడే వాక్యం – ‘ఆ క్షణంలో భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఆమెకు తెలియదు, అతడికి తెలుసు’ లాంటిది. ఇప్పుడు గుప్పెట విప్పి చూపిస్తాడు. కథ నేపథ్యం ఒక్క ముక్కలో చెప్తాడు.

అతడే అతడే అర్జునుడు..
పాండవ వీర యశోధనుడు
అనితరసాధ్యము పాశుపతాస్త్రము
కోరి ఇంద్రగిరి చేరి శివునికై
అహోరాత్రములు చేసెను తపస్సు
ఇది సృష్టించెను దివ్య మహస్సు

అసలు ఆ పదాలు, ఆ లయ, పాట బాణీ పదాలను అనుసరించి మెలికలు తిరుగుతోందా, బాణీని అనుసరించి పదాలు పరుగులిడుతున్నాయా.. అర్జునుడు చేసే తపస్సును ఒక పెయింటింగ్ లా చూపించాడు దర్శకుడు. భారవి రచనలో శివుడు అర్జునుడి తపస్సును భంగం చేసేందుకు ప్రయత్నిస్తాడు. అవన్నీ వదిలాడు వేటూరి. ఇది సినిమా…ఎన్ని పర్వాల కావ్యాన్నయినా, ఎన్ని అద్భుత వర్ణనలనయినా రెండు గంటల్లో చూపించేయాలి. అవసరమైన వాటినే ఎన్నుకోవాలి. సినిమాకనవసరం అనిపించినవాటిని వదలాలి. ఒక గొప్ప స్క్రిప్ట్ రచయితలా కిరాతార్జునీయంలో సినిమాకవసరమయిన విషయాలనే ఎంచుకున్నాడు వేటూరి పాటలో ప్రదర్శించేందుకు.

వేటూరి అర్జునుడి వర్ణన వినగానే మనసులో శ్రీశ్రీ పాట ‘ధర్మక్షేత్రం, ఇది కురుక్షేత్రం’ మొదలుతుంది.

కపిధ్వజాంచిత సితాశ్వరంజిత రథస్థితులు కృష్ణార్జునులు
విజయుడు రథి గోవిందుడు సారథి
ఉభయులు నరనారాయణులు..

కవికి ప్రాచీన సాహిత్యంపై పట్టు ఉంటే మాటలు పాటలవుతాయి. పాటలు భావి తరాలకు ప్రేరణనిచ్చే పాఠాలవుతాయి. ధర్మ భాష్యాలవుతాయి.

ఇక్కడి నుంచి పాట లయ మారుతుంది. దృశ్యం మారుతుంది. గమనిస్తే ‘వేటూరి’ పాటలో స్క్రిప్టు రచనను చూడవచ్చు. కైలాసం దృశ్యం చూపించాడు. అల్లకల్లోలం చూపించాడు. కారణం చూపించాడు. కారణానికి ప్రతిస్పందనను చూపిస్తున్నాడు. ఒక ఘటన మరో ఘటనకు దారితీస్తోంది, ఒక దృశ్యం మరో దృశ్యానికి దారితీసేట్టు.

నెలవంక తలపాగ నెమలి ఈకగ మారే
తలపైని గంగమ్మ తలపులోనికి  జారె
నిప్పులుమిసే కన్ను నిదురోయి బొట్టాయే
బూదిపూతకు మారు పులితోలు వలువాయే
ఎరుక గల్గిన శివుడు ఎరుకగా మారగా
తల్లి పార్వతి మారే తానె ఎరుకతగా

ఓంకార ధనువుగా ఒదిగె త్రిశూలమ్ము
కైలాసమును వీడి కదలి వచ్చెను శివుడు
కైలాసమును వీడి కదలి వచ్చెను శివుడు

భావంతో దృశ్యం చూపించాడు. చిత్రీకరణకు సూచనలు పొందుపరచాడు. దర్శకుడు చేయవలసింది చెప్పేదాన్ని దృశ్యంగా చూపించటమే. ఇక పద ప్రయోగాలతో, ఊహాశక్తితో, సృజనాత్మక నైపుణ్యంతో మనసును మనోహర సాహిత్య సృజన వల్ల జనించిన  ఉత్కృష్ట రస  తరంగాల శృంగాలపై ఓలలాడిస్తాడు. ఒక్కో వర్ణన ఒక్కో ఆనంద లోకానికి అల శృంగాలపైన మోసుకుని  తీసుకువెళ్తుంది. ఔచిత్యం, సృజనాత్మక శిఖరంతో, ఉత్తమ సాహిత్యంతో చెట్టపట్టాలు వేస్తే ఎలా ఉంటుందంటే, నిప్పులు ఉమిసే కన్ను నిద్రబోయి బొట్టవటంలా ఉంటుంది. బొట్టు కూడా అగ్నివర్ణమే. అగ్ని ఎక్కడికీ పోలేదు. తాత్కాలికంగా బొట్టులో ఉంది. ఆ బొట్టు మూడో కన్ను. ఏమి రచన ఇది! ఈ పదాలు పలుకుతూ, పాట వింటూ, భావాన్ని అనుభవిస్తూ చెలరేగే ఆనందపు అర్ణవంపుటలలతో ఉక్కిరిబిక్కిరి అవుతాము. ఈ ఆనందపు అలల తాకిడిలోని మహదానందాన్ని అనుభవిస్తూ ప్రాణం పోతే అంతకన్నా గొప్ప ఆనందకరమైన మరణం మరొకటి లేదనిపిస్తుంది.

ఈ సందర్భంలో వేటూరిలో శ్రీనాథుని దర్శించే వీలు కలుగుతుంది. ఇంతవరకూ  భారవి శివతాండవం చేశాడు. ఇప్పుడు శ్రీనాథుడు పాలకడలిలో అలల ఆనందాన్ని అనుభవింపచేస్తున్నాడు. ఈ సందర్భంలో శ్రీనాథుడి సీస పద్యం ‘వికటపాటల జటామకుటికా భారంబు’ను అనుసరిస్తూ తనదైన ప్రత్యేక పోకడలు పోయాడు వేటూరి. ‘ఓంకార దివ్యచాపము’ – ‘ఓంకార ధనువుగా ఒదిగె త్రిశూలమ్ము’ అయింది. ‘జారు సుధాధామశకలావతంసంబు’ – ‘నెలవంక తలపాగ’ అయింది. ‘ఘనలలాటంబున గనుపట్టు కనువిచ్చు గైరికద్రవ తిలకంబు గాగ’ – ‘నిప్పులుమిసే కన్ను నిదురోయి బొట్ట’యింది. ఏమి రచన ఇది! ఎన్ని నీరాజనాలు, ఎన్ని సాష్టాంగ ప్రమాణాలు, ఎన్నెన్ని భాషల్లో అత్యుత్తమ  పొగడ్తలు సరిపోతాయి!

శివుడు బయలుదేరాడు పార్వతితో. సందర్భోచితమైన సంగీతం వస్తుంది. ఇంతలో గేయరచయిత ఈ దృశ్యాన్ని కట్ చేసి మరో దృశ్యాన్ని ప్రదర్శిస్తాడు కథ చెప్తూ.

శివుని ఆనతిని శిరమున దాల్చి
మూకాసురుడను రాక్షసుడు
వరాహ రూపము ధరించి వచ్చెను
ధరాతలమ్మే అదిరిపోవగా..

పాటను అనుసరించి దృశాన్ని చిత్రించటం తప్ప చేసేదేమీ లేదు.

చిచ్చరపిడుగై వచ్చిన పందిని
రెచ్చిన కోపముతో అర్జునుడు
మట్టుబెట్టగా పట్టె బాణము
ధనువొక చేతను అందుకొని
చూసిన కంటను చూడకనే
గురి చూసినంతనే.. వేసినంతనే..

మళ్లీ సస్పెన్స్ సృష్టించి బాణీ మార్చాడు. పదాల శక్తి, ధ్వని బలం, పదాలకు ధ్వనికి భావానికి నడుమ ఉన్న సంబంధం తెలిసిన కవి మాత్రమే ఇలాంటి పదాలు వాడగలడు. పాట పాడుతుంటే తెలియకుండానే లయలోకి వచ్చేస్తాము. పదాలు పలుకుతుంటేనే ఆయా ‘రసాలు’ ఉత్పన్నమవుతాయి.

తలలు రెండుగా విలవిలలాడుచు
తనువు కొండగా గిర గిరతిరుగుతూ
అటు ఇటు తగిలిన రెండు బాణముల
అసువులు వీడెను వరాహము..

దృశ్యం ఎలా ఉండాలో, ఏం చూపించాలో చెప్తాడు. పదాల ధ్వనులతో నేపథ్య సంగీతాన్ని వినిపించాడు. తరువాత ప్రస్తావించే వేయి చేతుల కార్తవీర్యార్జునిడిలా అంతా తానే అయి, అన్ని తానే అయి విజృంభించి విశ్వరూప ప్రదర్శన చేశాడు వేటూరి ఈ పాటలో.

కొట్టితి నేనని అర్జునుడు, పడగొట్టితి నేనని శివుడు
పట్టిన పట్టును  వదలకనే తొడ గొట్టిన వీరంబుతో అప్పుడు

మళ్లీ బాణీ మారుతుంది. పదాల ధ్వని భావాన్ని ఇనుమడింప చేస్తుంది. రస- ఉప్పెనను సృష్టిస్తుంది.

వేట నాది వేటు నాది వేటాడే చోటు నాది
ఏటి తగవు పొమ్మని విలుమీటి పలికె శివుడు
చేవ నాది, చేతనాది, చేటెరుగని ఈటె నాది
చేవుంటే రమ్మని కనుసైగ చేసే అర్జునుడు

మళ్లీ బాణీ మారుతుంది.

గాండీవ పాండిత్య కళలుగా బాణాలు కురిపించె అర్జునుడు
కానీ.. అపుడతడు వేయి చేతుల కార్తవీర్యార్జునుడు
ఓంకార ఘన ధనుష్ఠంకారముల తోడ శర పరంపర కురిసే హరుడు,
అయినా నరుని కాతడు మనోహరుడు!

ఏం భావం! ఏం వర్ణన! ఏమి పదాలు! మళ్లీ బాణీ మారుతుంది. లయ మారింది. పదాలు మారుతున్నాయి. మూడ్‌కి తగ్గట్టు పదాలు, మూడ్‌ని సృజిస్తూ పదాలు, రసాన్ని సృజిస్తూ ఔచితీవంతమైన పదాలు!

చిత్రమేమో గురిపెట్టిన బాణమ్ములు మాయమాయే
విధివిలాసమేమో పెట్టిన గురి వట్టిదాయే
అస్త్రములే విఫలమాయే, శస్త్రములే వికలమాయే
సవ్యసాచి కుడియెడమై సంధించుట మరచిపోయే

పాట పాడటంలో బాలసుబ్రమణ్యం సంధర్భోచితంగా, భావాన్ని ఒకసారి రౌద్రాన్ని, ఒక సారి భక్తిని, ఒక సారి విస్మయాన్ని, మరోసారి అద్భుతాన్ని తన స్వరంలో ప్రదర్శిస్తాడు. సంగీతం కూడా పాటకు ఊపునిస్తుంది. చిత్రీకరణ సందర్భోచితంగా, తగ్గట్టుగా ఉంటుంది. నటీనటులు తగ్గట్టు నటిస్తారు. కానీ అందరినీ నడిపించి, ఆడించి, ఊపి ఆనందింపచేసి నిర్దేశించేది వేటూరి కలం.

జగతికి సుగతిని సాధించిన తల
దిగంతాల కవతల వెలిగే తల
గంగకు నెలవై.. కళాకాదరువై
హరి బ్రహ్మలకు తరగని పరువై
అతి పవిత్రమై.. అఘ లవిత్రమై
శ్రీకరమై.. శుభమైన శివుని తల
అదరగా.. సృష్టి చెదరగా

ఇక్కడ వేటూరి వాడిన ఒక్కో పదానికి కొన్ని వందల పేజీల వ్యాఖ్య రాయవచ్చు. వాటి నేపథ్యం చెప్తూ పౌరాణిక గాథలను చెప్పవచ్చు. తత్వం చెప్పవచ్చు.  అది ఈ వ్యాస పరిధికి బాహిరం.  గేయ రచయితకు సంపూర్ణ స్వేచ్ఛ లభిస్తే, ఆయన తన ప్రతిభతో, నైపుణ్యంతో పాండిత్యంతో, లోతైన భావనా బలంతో గీతాన్ని, దృశ్యాన్ని,  ఏ రకంగా మరుపురాని మహాద్భుతమైన అనుభవంలా మలచగలడో ఈ పాట నిరూపిస్తుంది.

అందరికీ అర్థం కావాలి, ఈ పదం సామాన్యులకు అర్థం కాదు, ఇది వాడకూడదు, అది తెలియదు అంటూ పేదవాళ్లలా ప్రవర్తించే వాళ్ల పేదరికం వారి కళలో ప్రతిబింబిస్తుంది. తనకు సంతృప్తి నిచ్చేరీతిలో విశృంఖల సృజనాత్మక వీరవిహారం చేసే స్వేచ్చను కళాకారుడికిస్తే,  కళాకారుడికి ఆత్మసంతృప్తి కలగటమే కాదు ఉచ్చస్థాయి కళ సమాజానికి అందుతుంది. భావితరాలకు అనంతకాలం మార్గదర్శనం చేస్తుంది. ఆనందింపచేస్తుంది.

తల్లిదండ్రుల చలువ తనువైన దేవుడు
కోరిన వరాలిచ్చు కొండంత దేవుడు
ఎదుట నిల్చెను శివుడుఎదలోని దేవుడు
పదములంటెను నరుడు భక్తితో అపుడు

‘కిరాతార్జునీయం’ కథ కవులకే కాదు విభిన్నమైన కళాకారులకు ప్రేరణనిచ్చింది. ముఖ్యంగా బాదామి గుహలలోని ‘అర్జున శివ ద్వంద్వయుద్ధం’; మహాబలిపురంలో ‘అర్జునుడి తపస్సు’ చిత్రం; ‘పట్టాదక్కల్’లో శివార్జునులు పందిపై బాణాలు విసిరే దృశ్యం; ‘హలెబీడు’ లోని శివార్జున ద్వంద్వయుద్ధం దృశ్యం; అమృతేశ్వర మందిరంలో ‘శివార్జనుల ముష్ఠియుద్ధం’; బృహదీశ్వరాలయంలో ‘కిరాతార్జునీయ గాథా శిల్పం’ తారాశూరంలో ‘కిరాతార్జునీయ గాథ’ దృశ్యాల శిల్పాలు; కపిలేశ్వర మందిరంలోని కిరాత కిరాతి విగ్రహాలు; లేపాక్షిలో ‘పాశుపతాస్త్ర మూర్తి’ దృశ్యం; కిరాతార్జునీయ గాథ ఎంతగా కళాకారుల సృజనాత్మకత ఉచ్చస్థాయిలో ప్రదర్శితమయ్యేందుకు ప్రేరణగా నిలచిందో నిరూపిస్తాయి.

భారవి ‘కిరాతార్జునీయం’, శ్రీనాథుడి ‘హరవిలాసం’లో కిరాతార్జునీయం చదివే శక్తి లేని అధునికులకు ఆ కావ్యాల సారాన్ని, అత్యంత ఉన్నతమైన భాషలో ,  భావాలంకారాలతో అతి గొప్పగా అందిస్తుందీ వేటూరి రచన. ఈ పాటలో పదాల అర్థాలు, ప్రయోగాలు తెలుసుకుంటే సామాన్యుడు కూడా భాష నేర్వటంలో ఒక మెట్టు ఎక్కినట్టే. ముఖ్యంగా ఆనాటి పౌరాణిక సినిమాలలో ‘కథాగీతా’లను అధ్యయనం చేస్తే చాలు, ఆధునిక కాలంలో సులభంగా పండితుడిలా చలామణీ అయిపోవచ్చు.

భారతీయ సినీ గేయ రచన ప్రపంచంలో సంపూర్ణమైన గీత రచయితల జాబితాలలో అగ్రశ్రేణి గేయ రచయితల సరసన అలవోకగా నిలుస్తాడు వేటూరి. వేటూరి పాటలను పరిశీలిస్తే ఆయనను హిందీ సినీ గేయ రచయితలలో ‘మజ్రూహ్ సుల్తాన్‌పురి’ తో పోల్చవచ్చు. మజ్రూహ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు లభించింది. వేటూరిని తెలుగు వారే విమర్శిస్తారు.

కర చరణ కృతంవా కర్మవాక్కాయజంవా
శ్రవణ నయనజంవా మానసంవాపరాధం
విహిత మవిహితంవా సర్వమేతత్ క్షమస్వా
శివశివ కరుణాబ్ధేశ్రీ మహాదేవ శంభో!
నమస్తేనమస్తేనమస్తే నమః!

(‘భక్త కన్నప్ప’ సినిమాలోని ‘కిరాతార్జునీయం’ పాటని యూట్యూబ్‍లో చూడవచ్చు:
https://www.youtube.com/watch?v=bLuDC8RRAeU )

(మళ్ళీ కలుద్దాం).

Exit mobile version