Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మధురగీతాలు – మనోహరదృశ్యాలు-30

[సంచిక కోసం ‘శంతనూ – శర్మిష్ఠ’ ప్రత్యేకంగా రచిస్తున్న సినిమా పాటల శీర్షిక.]

దేవుడు చేసిన మనుషుల్లారా!
మనుషులు చేసిన దేవుళ్లారా!
వినండి మనుషుల గోల
కనండి దేవుడి లీల!

కొన్ని సినిమాల్లో పాటల సందర్భాలను ఎలా రూపొందిస్తారంటే, సినిమా ఏ పాటతో ఆరంభమవుతుందో, అదే పాటతో అంతమవుతుంది. అలాంటి అరుదైన పాట ‘దేవుడు చేసిన మనుషులు’ సినిమాలో కీలకమైన, టైటిల్ సాంగ్ ఇది.

సినిమా పేరును పల్లవిలో వినిపించే పాటలను టైటిల్ గీతాలంటారు. ఇలాంటి గీతాలు ప్రేక్షకులను సులభంగా ఆకర్షిస్తాయి. పాట వల్ల సినిమా, సినిమా వల్ల పాటలు ఆకర్షణీయంగా ఎదుగుతాయి. ఒకే పాటను సినిమాలో వేర్వేరు సందర్భాలలో వేర్వేరు పాత్రలు పాడతాయి. వాటిని టాండెమ్ పాటలంటారు. ఇలాంటి పాటలు ఒకసారి ఆనందం, మరోసారి విషాద గీతాలు కావచ్చు. కానీ ఏ పాటతో  సినిమా ఆరంభమయిందో, అదే పాటతో (కాస్త మార్పుతో) సినిమా పూర్తవటం చాలా అరుదైన విషయం. అలాంటి అరుదైన టైటిల్ సాంగ్ ఈ పాట. సినిమా మొత్తాన్ని సినిమా గమనాన్ని అత్యంత సుందరంగా ప్రదర్శిస్తుందీ పాట. ఆరంభంలో దొంగ తనాలు చేసేందుకు పాటను పాడినవాడు , సినిమా చివరకు వచ్చేసరికి దొంగతనాలను చేసేవారిని పట్టించేందుకు  ఈ పాట పాడతాడు.

‘దేవుడు చేసిన మనుషులు’ సినిమా ఆరంభమే తెరపై గుడిగంట కనిపిస్తుంది. అది మ్రోగుతుంది. దైవ విగ్రహం కనిపిస్తుంది. వివేకానంద గెటప్‌లో‌ తెర ఓ వైపు ఎన్టీ రామారావు కనిపిస్తాడు. ఘంటసాల గంభీర స్వరంలో పాట ఆరంభమవుతుంది.  సినిమా పూర్తయినతరువాత మళ్ళీ చూస్తే( ఈ సినిమా ఒకటి రెండుసార్లు చూసినా సరిపోదు) మొదటి దృశ్యాలలో సినిమా కేంద్రబిందువును చక్కగా దర్శకుడు స్థిరపరచటం తెలుస్తుంది.

సినిమాలో పేర్లు వస్తున్నప్పుడు తెరపై పలు రకాల విగ్రహాలు కనిపిస్తుంటాయి. చక్కటి సంగీతం వినిపిస్తుంటుంది. ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. అది కాగానే, తెరపై, ఎన్టీరామారావు, వివేకానందగా, మనోహరంగా ఉంటాడు. ప్రేక్షకుడు ఎన్టీరామారావును వివేకనందగా ఊహించడు. పాటనూ ఊహించడు. దాంతో సంతోషకరమైన అశ్చర్యం కలుగుతుంది. తొలి దృశ్యంలోనే అనూహ్యమైనది అందించి ప్రేక్షకుడిని మురిపిస్తాడు దర్శకుడు. ఇది చాలా చక్కని ప్రతిభావంతమైన టెక్నిక్. చాలా అరుదుగా ఇలాంటి ప్రభావం  చూపే  ఆరంభ దృశ్యం అమరుతుంది.

ప్రేక్షకులు ఇంకా  సీట్లలో స్థిరపడుతుంటారు. సినిమాలో ఏం చూడబోతున్నామో ఊహిస్తూనే ఉంటారు. ఎన్టీరామారావు పట్ల ప్రేక్షకులకున్న అభిమానం, ప్రేక్షకులపై ఆ నటుడికి ఉన్న పట్టు, ఇమేజ్ ఆధారంగా అనూహ్యమైనది అందించి ప్రేక్షకులను మెప్పించాడు దర్శకుడు తొలి దృశ్యంలోనే.

సినిమాను పాటతో ఆరంభించటం వల్ల అనేక ప్రయోజనాలు ఒనగూడాయి. ఇక్కడ పాటను ఉంచటం ఒక రకంగా ‘మాస్టర్ స్ట్రోక్’ అవవచ్చు.

పాటలో ప్రధాన పాత్ర ‘దొంగ’ అనీ, ‘విగ్రహాల దొంగ’ అనీ తెలిసిపోతుంది. అతనితో ఉన్న అనుచరులలో మరో ప్రముఖ నటుడు ‘కాంతారావు’ దుష్ట పాత్రధారి అని తెలిసిపోతుంది.

ప్రధాన పాత్ర బహువేషగాడని,  మోసగాడని, విగ్రహాలదొంగ అనీ  అర్థమవుతుంది. పాట చివరలో  నాయిక పరిచయం కూడా అవుతుంది. ఇదంతా మనోరంజకమైన పాట ద్వారా సాగుతుంది.  పాట పూర్తయిన తరువాత జరిగిన సంఘటనవల్ల, హీరో మంచివాడేకానీ తప్పనిసరి పరిస్థితుల్లో దొంగతనాలు చేస్తున్నాడని అర్ధమవుతుంది.  దాంతో సందర్భం విలువ మరింత పెరుగుతుంది. పాట వల్ల దృశ్యాలు ఆసక్తికరంగా, ఉత్సాహభరితంగా ఎదుగుతాయి. దృశ్యాల వల్ల పాట ఆకర్షణ పెరుగుతుంది. కథ ముందుకు సాగుతుంది. దాదాపుగా 10 నిమిషాల పాట, నాలుగు చరణాల పాట ఇది. కానీ పాట చూస్తున్న ప్రేక్షకుడికి సమయం తెలియదు. తెరపై జరుగుతున్న చర్యలను ఆసక్తిగా చూస్తూ,  పాట మాధుర్యాన్ని అనుభవిస్తూ, పాటలో భావాన్ని అనుభవించి అనుసరిస్తూండటంతో తనకు తెలియకుండానే ప్రేక్షకుడు సినిమాలో లీనమైపోతాడు. పైగా పాట ఆకర్షణను పెంచేందుకు విభిన్నమైన వేశాలువేస్తూ మెప్పించేందుకు ఎన్టీరామారావు ఎలానో వున్నాడు.

ఒకప్పుడు సినిమా ఆరంభంలోనే పాట వచ్చేది. అధిక శాతం అవి పాత్రల వ్యక్తిత్వ పరిచయం పాటలై ఉండేవి. దాంతో, ప్రేక్షకుడు అతి సులువుగా  ప్రధాన పాత్రతో తాదాత్మ్యం చెందుతాడు. సినిమా ఆసక్తికరమవుతుంది. ఈ పాటలో ప్రధాన పాత్ర తనగురించి ప్రత్యక్షంగా చెప్పుకోడు, కానీ, ప్రతీకాత్మకంగా ఎంతో చెప్తాడు.

సందర్భం చక్కగా రూపొందించారు. కథ గమనం కుంటుపడదు. ముందుకు సాగుతుంది. ప్రధాన పాత్రదారి పలు విభిన్నమైన వేషాలు వేయటంతో ఆకర్షణీయంగా చిత్రించే వీలు దొరుకుతుంది. ఇక కుదరాల్సింది చక్కని బాణీ. చక్కని పదాలతో కూడిన భావం. ఘంటసాల ఎలాగో తన గాత్రంతో పాట స్థాయిని ఎదిగిస్తాడు. ఇక్కడే సంగీత దర్శకుడు రమేష్ నాయుడు, గేయ రచయిత శ్రీశ్రీల  ప్రతిభ ప్రస్ఫుటమయ్యేది.

నాలుగు చరణాలను సందర్భోచితంగా నాలుగు విభిన్న రూపాలుగా రూపొందించాడు రమేష్ నాయుడు. తెలుగు సినీ సంగీత దర్శకులలో రమేష్ నాయుడు ప్రత్యేక స్థానాన్ని ఆక్రమిస్తాడు. ఆయన ధోరణి, బాణీలు రూపొందించే విధానాలలో ‘సూపర్ హిట్’ బాణీలను సృజించాలన్న తపన కన్నా ‘సందర్భోచితంగా’ మధురమైన మెలోడీ సృజన పైనే ఆయన దృష్టి కేంద్రీకృతమయి ఉంటుంది. ఈ పాట అందుకు భిన్నమైనది కాదు.

పాట ఆరంభంలోనే శ్రీశ్రీ తీవ్రమైన విప్లవాత్మకమైన ప్రతిపాదన చేశాడు. అది వెంటనే అకర్షిస్తుంది. దేవుడే మనుషులను తన ప్రతిరూపంగానే సృష్టించాడని అంటాడు. తన రూపంలోనే మనుషులు దేవుడిని సృష్టించారంటాడు. ఒక వాదన ప్రకారం గాడిద దేవుడు గాడిద రూపంలో, ఏనుగు దేవుడు ఏనుగు రూపంలో, చీమ దేవుడు చీమ రూపంలో ఉంటాడు. అంటే దేవుడు మనిషిని తన రూపంలో సృష్టించాడా? మనిషి దేవుడిని తనలాగా సృజించాడా? అన్నది తేలని వాదనాంశం. ఆ వాదనాంశంతో పాటను ఆరంభించటం అటు సినిమా పరంగా, ఇటు పాత్రల పరంగా ఔచితీమంతం. అందులో ఘంటసాల గంభీరంగా ఆరంభించటం ‘దేవుడు చేసిన మనుషుల్లారా’ అని పిలుపునివ్వటం, అది వివేకానంద వేషంలో ఉన్న ఎన్టీరామారావు కావటం గుండె ఝల్లుమనిపిస్తుంది.దృష్టి  దృష్టి తెరకు అతుక్కుపోతుంది.

‘వినండి మనుషుల గోల, కనండి దేవుడి లీల’ అంటున్నప్పుడు ఘంటసాల గొంతులో ఒక playfulness ధ్వనిస్తుంది. ఎన్టీరామారావు వదనంపై అటు చిలిపితనం, ఇటు కొంటెతనం, రెండూ కనిపిస్తాయి. ప్రేక్షకుడికి ఇక్కడే అర్థమైపోతుంది, ఈ పాత్ర కాషాయం వేస్తున్నది కాని ‘భక్తి’ లేనిదని.

ఇంతలో కాంతారావు పాత్ర కనిపిస్తుంది. అది వచ్చి నుంచున్న తీరు, ముఖంలో భావం దౌష్ట్యాన్ని చూపిస్తుంది. భక్తి లేశమాత్రం కూడా కనబడదు. అంటే పల్లవిలోనే పాత్రల వ్యక్తిత్వాలను, వారి దుష్ట లక్షణాన్ని ప్రేక్షకులకు తెలిసేట్టు చేశాడన్న మాట దర్శకుడు.

ఇక పాటలో భక్తికి, మాధుర్యానికి లోపం లేదు. ఘంటసాల ‘గోవింద’ అంటూ రాగం తీస్తుంటే మాధురీ స్రవంతిలో మునకలేస్తుంది మనసు.

ఇక పాటలో చిలిపితనం,  ద్వంద్వార్ధం ధ్వనించేట్టు రాసి శ్రీశ్రీ తన చమత్కారంతో మురిపిస్తాడు. పైకి భక్తి కనిపిస్తుంది. సందర్భంలో ఒదిగి నాయకుడి లక్ష్యాన్ని తెలుపుతుంది.

వెన్నదొంగ.. మా తొలి గురువు
తొలి నుంచి మా కుల గురువు
కోరిన కోరిక తీరాలంటే
కోరక మోక్షం రావాలంటే
గోపాలునే సేవించాలి
గోవిందునే ధ్యానించాలి.

‘శ్లేష’ బాగా పండుతుంది. చరణం పూర్తయ్యేసరికి వాళ్ల కోరిక తీరుతుంది. ఇక్కడ ‘గోవిందా హరి గోవిందా, గోవిందా భజగోవిందా’ అర్థం మారుతుంది. పాట కూడా మారుతుంది. ఎన్టీరామారావు నటన పదాలలోని ‘శ్లేష’ను ఎత్తి చూపిస్తుంది.

వినండి దేవుడి గోల
కనండి మనుషుల లీల..

మొదటి చరణం పూర్తయ్యేసరికి ప్రధాన పాత్రధారిని ప్రేక్షకులు మెచ్చుతారు. అతడి దొంగతనాలను ఆమోదిస్తారు.

ఆ కాలం నాటి కవులు ఆదర్శవాదులు. అవకాశం దొరికినప్పుడల్లా తమ సిద్ధాతాన్ని నమ్మకాలనూ, ఆలోచనలనూ పాటల్లో పొదిగారు.

పేదల నెత్తురు తాల్చిన రూపం
బలసిన జలగలు దాచిన పాపం
మానవులను పీడించే జబ్బు
దేవతలను అడించే డబ్బు
తెలుపో నలుపో జానేదేవ్
ఆ తేడాలిక్కడ లేనే లేవ్..

ఈ చరణం చిత్రీకరణలో ఓ పెళ్లి ఊరేగింపులో బ్యాండ్ బాజాలు వాయిస్తూ, దొంగతనానికి పాల్పడతారు. సంగీతం సందర్భోచితంగా ఉంటుంది. తెరపై యాక్టివ్‌‌గా ఉన్న ఎన్టీరామారావుల పాటను నడిపిస్తాడు.

ఈ పాటలో గమనించాల్సిందేమిటంటే సంగీత దర్శకుడు సందర్భోచితంగా సంగీతాన్ని మారుస్తూ, మళ్లీ అసలు పాటలో సంగీతాన్ని కలిపిన తీరు. ముఖ్యంగా పాట బాణీని సాక్సోఫోన్ పై వినిపిస్తూ, మామూలు పాట బాణీలోకి రావటం. మళ్లీ సాక్సో‌ఫోన్‍పై ‘బారాత్’ సంగీతాన్ని వినిపిచటం.. చరణంలో ప్రతి వాక్యానికీ నడుమ వాక్య భావాన్ని ప్రతిబింబిస్తూ వచ్చే సంగీతం కూడా పాట ప్రభావాన్ని పెంచుతుంది. చాలా అత్యద్భుతమైన సంగీత రూపకల్పన ఇది. ప్రతి చరణాన్ని భిన్నమైన పాటగా రూపొందించి ఆ పాటను ప్రధాన బాణీలో భాగం చేసిన తీరు సంగీత దర్శకుడి ప్రతిభను, పాటను అత్యత్తుమ రీతిలో సందర్భోచితం చేయాలన్న తపనను చూపిస్తుంది.

మూడో చరణం క్లబ్బులో, మత్తు మందుబాబుల నడుమ సాగుతుంది. ఎన్టీరామారావు వేషం మళ్లీ మారుతుంది. ఈసారి బాణీకి తగ్గట్టు నృత్యం లాంటి ఆకర్షణీయమైన కదలికలతో అలరిస్తాడు ఎన్టీరామారావు. ఈ పాట ఎంతగా సందర్భానిదో, ఎంతగా సంగీత దర్శకుడు, గేయరచయితదో అంతగా గాయకుడిది, నటుడిది. ఇక్కడ కూడా సందర్భోచితమైన నృత్య సంగీతం అందిస్తూ, మళ్లీ అసలు పాటలో కలసిన తీరు ముగ్ధులను చేస్తుంది. ఇక్కడ గేయ రచయిత ఈ  ఈ క్షణమే మనకున్నది, దాన్ని కోల్పోకుండా అనుభవించేయాలన్న హెడోనిజం  తత్త్వాన్ని వివరిస్తాడు.

వినండి గ్లాసుల గోల
కనండి మనుషుల గోల

అంటూ సమాప్తమవుతుందీ చరణం.

చివరి చరణం ఈ పాటలో హైలైట్.

పాట సాగుతూనే ఉందనేందుకు సూచనగా నేపథ్యంలో సందర్భోచితమైన లయాత్మకమైన సంగీతం వినిపిస్తూంటుంది. నాయకుడు విమానంలో సీట్లో కూర్చోవటంతో నాయిక పరిచయం అయిపోతుంది. విమానంలోకి విగ్రహాన్ని ఎక్కిస్తుండటం చూపించటంతో మన దొంగ హీరో ప్రయాణ పరమార్థం బోధ పడిపోతుంది. అంటే, తెరపై కనిపించే దృశ్యాలు కథను చెప్తున్నాయి. పాట వినోదాన్ని అందిస్తూ కథను ముందుకు సాగిస్తున్నది. అత్యద్భుతమైన దృశ్య, శ్రవణ మాధ్యమాల సమన్వయం ఇది.

ఆలయాలలో  వెలుతురు లేదు
ఆకాశంలో చీకటి లేదు
విమానాలలో విహరిస్తూంటే
సముద్రాలనే దాటేస్తూంటే
గుడిలో ఎందుకు రామయ్యా
నిను విడుదల చేస్తాం రావయ్యా..

సందర్భోచితంగా సిద్దాంతాన్ని గుమ్మరించాడు శ్రీశ్రీ. గుడి నుంచి విడుదల చేయటమంటే విగ్రహాన్ని అపహరించటం అన్న అర్థం సినిమా సందర్భాన్ని బట్టి వస్తుంది. కానీ శ్రీశ్రీ నమ్మిన సిద్ధాంతం ప్రకారం దేవుడి అవసరం లేదు. దేవుడే లేనప్పుడు గుడి అవసరం అసలే ఉండదు. గుడి నుంచి దేవుడిని, దేముడి నుంచి ప్రజలను విముక్తం చేయటం అన్నమాట. ‘దేవుడు చచ్చిపోయడ’న్న ‘నీషే’ నుంచి ‘మతం మత్తుమంద’న్న ‘మార్క్స్’ వరకు దేవుడిని గుడి నుంచి విముక్తం చేయాలనే ప్రయత్నిస్తున్నారు. వారికి ఈమధ్య నాస్తిక స్వేచ్ఛా మతంమారిన  అభ్యుదయవాదులు తోడయి దేవుడిని చర్చి ముందు చెమటలు కక్కిస్తూ, మసీదు మెట్ల పై ముక్కలు పరచిపెట్టాలని ఆశిస్తున్నారు. ఈ పాటలో ఆకాశంలో చీకటి లేదు సమర్థనీయమే.. కానీ ఆలయంలో వెలుతురు లేదు అన్నది పాట బాణీలో ఒదిగింది,  సందర్భానికి సరిపోయింది, కానీ అనృతం. గర్భగుడిలో చీకటి ఉండదు. అఖండ  జ్యోతి నిరంతరం వెలుగుతూ ఉంటుంది. గర్భగుడిలో ఆ దీపాన్ని ఆత్మకు ప్రతీకగా భావించి, హృదయంలోని ఆత్మ జ్యోతిని వెలుగించటం ద్వారా జ్ఞాన వెలుతురు మయం అవుతుంది మనస్సు.  ఇది తెలియక కాదు శ్రీశ్రీ ‘ఆలయంలో వెలుతురు లేదు’ అని రాసింది. బాణీలో ఒదిగింది. దేవుడిని గుడి నుంచి విముక్తం చేసేందుకు చరణం బాగుంది.  సిద్ధాంతానికి సరిపోయింది. అసలు నిజం, అన్వయం ఎవరికి కావాలి?

ఈ పాటలో సంగీత దర్శకుడు రమేష్ నాయుడు ప్రతిభకు రెండు సందర్భాలలో నీరాజనాలర్పించక తప్పదు.

 పాటల్లో ‘refrain’ అని ఉంటుంది. పల్లవి చివరలో పునరావృతం అయ్యే పదమో వాక్యమో అది. ఇటీవలి కాలంలో దాన్ని ‘hook line’ అంటున్నారు. ‘Hook line’ అన్నది అత్యంత ఆకర్షణీయంగా ఉండి సులభంగా ప్రేక్షకుడి దృష్టిని ఆకర్షిస్తుంది. Refrain అన్నది పల్లవి చివరిలో వస్తుంది. Hook line పాట మధ్యలో వస్తుంది. ఒకోసారి అది refrain లోనే ఉంటుంది. ఈ hook line ను ‘కోరస్’ పదే పదే పాడుతుంటుంది. ఈ పాటలో హుక్ లైన్, రిఫ్రెయిన్‌లు కలసి ఉంటడమే కాదు ప్రతి చరణంలో వీటిని భిన్నంగా వాడిన విధానం పరమాద్భుతం అనిపిస్తుంది.

మొదటి చరణంలో ‘గోవిందా  హరి గోవిందా, గోవింద గోవింద హరి గోవింద గోవింద గోవంద భజ గోవింద’ ఈ hook line, refrain ల కలగలసిన ప్రయోగం. పాటలో పలికిన ప్రతి సారీ అర్థం మారుతుంది కూడా. భక్తి నుంచి, వ్యంగ్యం నుంచి విగ్రహం పోయింది అన్న అర్థం వరకూ ఈ గోవింద స్మరణ ప్రతిబింబిస్తుంది.

రెండో చరణంలో ‘లేనే లేవు’ అంటూ పాట పల్లవికే వచ్చేస్తాడు. అక్కడ ప్రయోగానికి అవకాశం లేదు.

మూడవ చరణంలో ‘ఆనందం పరమానందం, ఆనందం బ్రహ్మానందం’ మరి పదే పదే అనిపిస్తూ ‘ఆనందం ఆనందం’ అని మధ్య మద్యలో అనిపిస్తూండటం అతి గొప్ప ఎఫెక్టునిచ్చే ప్రయోగం. ఈ ఆనందం, గోవింద, స్థానంలో వస్తుంది.

చివరి చరణంలో ‘రాం’ ‘రాం’ అనిపిస్తూ రామనామ భజన పాటలోకి దారి తీసిన విధానం అత్యద్భుతమైన చమత్కారం. లయబద్ధంగా జరుగుతుందిదంతా. ఒక ఉపనది మహానదిలో కలిసేప్పుడయినా చిన్న తేడా వస్తుందేమో కానీ ఈ రామనామ జపం పాటగా మారటంలో ఎలాంటి ‘జర్క్’ లేదు.

చివరిలో ‘రామయ్య, రామయ్య’ను ‘లేవయ్య, లేవయ్య’గా మార్చటం అదీ లయబద్దంగా జరగటం పాట రూపకల్పన వెనుక ఉన్న శ్రమను సమన్వయాన్ని తపనను ఎత్తి చూపిస్తుంది.

ఇదే పాట సినిమా క్లైమాక్స్‌లో మార్పులతో వస్తుంది.

అప్పుడు నాయకులిద్దరూ పాడతారు. బాణీ అదే అయినా ధ్వని మారుతుంది. సంగీతం మారుతుంది. గంభీరమైన ఘంటసాల గొంతు మృదువైన బాలసుబ్రమణ్యం స్వరం కలసి గొప్ప ఎఫెక్టునిస్తాయి. పాట చిత్రీకరణ కూడా క్లోజప్పులు, లాంగ్ షాట్‌లు, హై యాంగిల్ షాట్‍లు, ఏరియల్ షాట్‌లతో, సంబరాల విస్తృతిని చూపిస్తూ ఉద్విగ్నతను పెంచుతుంది. ఈ సందర్భంలో రమేష్ నాయుడు గొప్ప చమత్కారం చేశాడు. సంబరాల నృత్యాల, సాంప్రదాయిక సంగీతం- పాట బాణీ సంగీతంలో మిళితమైపోతుంది. పగలు సాయంత్రంగా గ్రహించే వీలు లేకుండా ఎలా మారుతుందో అలా మారుతుంది. అద్భుతం అనిపిస్తుంది. అందుకే ఈ పాట ఎన్ని మార్లు విన్నా తనివి తీరదు. వింటున్న కొద్దీ సంగీతం పరంగా, చేసిన సరికొత్త చమత్కరాలు కొత్తకొత్తగా  గుర్తింపుకు  వస్తూనే ఉంటాయి.

ఎంతో గొప్పవీ మన ఆచారాలూ, స్వార్ధపరులకవి అవకాశాలూ‘ అంటూ, రెండువైపులా పదునైన కలాన్ని ఝళిపిస్తాడు శ్రీశ్రీ, రెండవ సారి వచ్చే పాటలో.

పాపాలను ఉండ్రాళ్ళుగ చేసీ, మోసాలను  జిల్లేళ్ళుగ  పోసీ

ఇలవేలుపుగా ఊరేగించారు, ఈ మహానుభావులు ప్రజల కళ్ళకే గంతలు కట్టారు.

శ్రీశ్రీ విజృంభించి రాశాడీపాట. పాటంతా నేపథ్య సంగీతం ఆశ్చర్యాన్ని కలిగిస్తూనేవుంటుంది. అందరు కళాకారులూ అత్యుత్తమ కళాప్రదర్శనకీ సినిమాను వేదిక చేసుకున్నట్టనిపిస్తుంది.

ఇలా ఆరంభం పాట తోటే, ముగిసే సినిమాలు అరుదు. ఇలా చేయాలంటే ఎంతో చక్కటి స్క్రీ‍న్‌ప్లే రచననే కాదు, దర్శకుడికి తాను రూపొందించాలనుకున్న సినిమాపై స్పష్టమైన అవగాహన ఉండాలి. అది ‘దేవుడు చేసిన మనుషులు’ సినిమాలో ప్రతీ దృశ్యంలో కనిపిస్తుంది.

ఈ సినిమా కథకు ఈ పాట ప్రాధాన్యాన్ని సినిమా ‘హిట్’ అవటంలో ఈ పాట పాత్రను అర్థం చేసుకోవాలంటే, ‘దేవుడు చేసిన మనుషులు’ హిందీ ‘రీమేక్’ అయిన ‘టక్కర్’ సినిమా చూడాలి. హిందీలో ఆరంభంలో పాట ఉండదు. అంటే చివర్లో కూడా పాట ఉండదు. సినిమా, రైల్లో దేవుడి విగ్రహాన్ని ఎక్కించటంతో ఆరంభమవుతుంది. రైల్లోనే నాయిక పరిచయమవుతుంది. సినిమా మామూలుగా సాగుతుంది. తెలుగు సినిమాల్లో, సినిమా సూపర్ హిట్ అయ్యేందుకు పునాది వేసిన మొదటి 10 నిమిషాల పాట ప్రభావం స్పష్టమవ్వాలంటే హిందీ సినిమా మొదటి 10 నిముషాలు చూస్తే చాలు. మనుషులు నిర్మించే సినిమాల్లో కళాకారులు రూపొందించే పాటల ప్రాధాన్యం సినిమా జయాపజయాలను ప్రభావం చేస్తాయి.

(‘దేవుడు చేసిన మనుషుల్లారా’ పాటని యూట్యూబ్‍లో చూడవచ్చు:
https://www.youtube.com/watch?v=KNj8zDzvOkU )

(మళ్ళీ కలుద్దాం).

Exit mobile version