Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మధురగీతాలు – మనోహరదృశ్యాలు-32

[సంచిక కోసం ‘శంతనూ – శర్మిష్ఠ’ ప్రత్యేకంగా రచిస్తున్న సినిమా పాటల శీర్షిక.]

మెరె దేశ్ కి ధర్తీ సోనా ఉగ్లే
ఉగ్లే హీరే మోతీ, మెరె దేశ్ కి ధర్తీ..

సినిమాలలో దేశభక్తి పాటల కోసం ప్రత్యేకంగా సన్నివేశాలు సృష్టించాల్సిన అవసరం లేదు. సినిమా ఆరంభంలోనే హీరో పాట పాడుతూ తెర పైకి రావచ్చు. తెర పైకి వస్తూనే ‘నా జన్మభూమి ఎంత అందమైన దేశము’ (సిపాయి చిన్నయ్య) అంటూ పాట ఆరంభించేయవచ్చు. కాబట్టి దేశభక్తి పాట కోసం ప్రత్యేకంగా సందర్భం అవసరం లేదు.

‘భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు’ అంటూ ‘బడిపంతులు’ స్కూల్లో ప్రార్థనా గీతం ఆలపించవచ్చు. కాలేజీ పిల్లలు ‘పాడవోయి భారతీయుడా’ అంటూ దేశ  పరిస్థితుల ‘వెలుగు నీడల’ గురించి పాట పాడవచ్చు. ‘నీ సంఘం, నీ ధర్మం, నీ దేశం, నీవు మరవద్దు’ అంటూ పిల్లలకు పాఠలు బోధిస్తూ పాడవచ్చు, ‘కోడలు దిద్దిన కాపురం’లోలా. ‘తెలుగు వీర లేవరా, దీక్షబూని సాగరా, దేశమాత స్వేచ్ఛ కోరి తీరుగుబాటు చేయరా’ అంటూ విప్లవ వీరుడు ఉద్భోధించే గీతం పాడచ్చు. ఇలాంటి గీతాలలో సందర్భం కన్నా పాటలో ప్రదర్శించిన దేశభక్తి భావాలు, అది ప్రదర్శించిన విధానం ప్రాధాన్యాన్ని వహిస్తాయి. బాణీ కూడా బాగా కుదిరితే ఇంకా మంచిది. పాటకు సందర్భం ఉంటే, చిత్రీకరణ ప్రాధాన్యం వహిస్తుంది. ఇవన్నీ సరిగ్గా, సమపాళ్లలో అమరిన పాట ‘మెరె దేశ్ కి ధర్తీ’

నిజానికి ఈ పాటకు సందర్భం ప్రత్యేకంగా ఏర్పాటు చేయటం కన్నా పాట సినిమా గమనంలో చక్కగా ఒదిగింది. పాట కోసం పెద్దగా ప్రత్యేకమైన సందర్భం లేదు. కానీ సినిమా గమనం ఒక కీలక దశలో ఉన్నప్పుడు వచ్చే పాట సినిమా గమనానికి ఊపు నిస్తుంది. అంటే పాట కోసం సందర్భాన్ని సృజించే కన్నా పాటను స్క్రిప్ట్ లో ఒక భాగం చేశారన్న మాట. ఇది అత్యత్తుమ స్క్రిప్టు రచనకు అతి చక్కని ఉదాహరణ.

సాధారణంగా, స్క్రిప్టులో పాటలకు కొన్ని అనువైన స్థానాలుంటాయి. హీరో, హీరోయిన్‌ని చూడగానే ఒక పాట. హీరోయిన్ ఇంట్రడక్షన్ ఒక పాట. తరువాత ఒక రెండు యుగళ గీతాలు. ఒక విరహ గీతం. ఇలాంటి రొటీన్ పాటల సందర్భాలు స్క్రిప్టులో ఉంటాయి. కానీ ఆలా కాక, కొన్ని ప్రత్యేక సందర్భాలు సృష్టించి ఆ సందర్భంలో పాటను పెట్టటం వల్ల కథ గమనానికి ఊపునివ్వటం, సన్నివేశ బలం పెంచటంతో పాటు, వ్యాపారాత్మక విలువను పెంచటం మరో పద్ధతి. ఇటు రొటీన్ పాటల సన్నివేశాలను కాదని,  అటు, ప్రత్యేక సన్నివేశాలు సృష్టించకుండా, పాటకు కథ గమనంలో ప్రాసంగిత ఉండే రీతిలో రూపొందించటం చక్కని స్క్రిప్టు రచనకు సూచన. ‘ఉప్‌కార్’ సినిమాలో ‘మెరె దేశ్ కి ధర్తీ’ పాట అలా సినిమా గమనంలో భాగమయి, కథ నడిచే రీతిపై ప్రభావం చూపించే పాట.

‘జై జవాన్, జై కిసాన్’ సందేశం ఆధారంగా రూపొందించిన సినిమా ఇది అని  నిర్మాత, దర్శకుడు, నటుడు మనోజ్ కుమార్ ప్రకటించాడు. ఆ కాలంలో సినిమాల్లో పల్లెటూరు ఆనందాల గని. పట్నం అన్యాయాల పుట్ట. పల్లెటూరి వాళ్లు మంచివాళ్లు, అమాయకులు. పట్నంవాళ్లు కుటిలులు, మోసగాళ్లు. ఇలాంటి అలవాటయిన మూస పాత్రలు, ఆలోచనలను జోడించి అతి చక్కని పాటలతో సుపర్ హిట్ సినిమాను సృజించి ‘మిస్టర్ భారత్’గా తన ఇమేజ్‌ని స్థిరపరచుకున్నాడు.

భరత్, పూరన్‌లు అన్నదమ్ములు. తమ్ముడిని పట్నంలో చదివిస్తూ తాను పల్లెలో వ్యవసాయం చేస్తూంటాడు భరత్. సకల సద్గుణాల రాశి పల్లెలో ఉన్న భరత్. పట్నం వెళ్లిన తమ్ముడు అన్ని దుర్గుణాలకు బానిస అవుతాడు. ఇలా అలవాటయిన రీతిలో సాగుతుంది కథ. ఈ గమనంలో కీలకమైన సన్నివేశంలో వస్తుంది పాట.

తమ్ముడు పట్నంలో చెడు సావాసాలకు అలవాటు పడుతూంటాడు. అతడి మనసు కలుషితమవుతుంటుంది. పల్లెలో అన్న మనసులో  మలినాలు లేవు అంటూ పాటకు ముందరి సన్నివేశంలో, వీళ్ల శ్రేయోభిలాషి పాత్ర ‘కస్మే వాదే ప్యార్ వఫా సబ్ బాతేఁ హైఁ బాతోంకా క్యా’ అంటూ మానవ సంబంధాలలోని డొల్లతనాన్ని హీరోకు చెప్తుంది. చివరికి “చీకటైంది పోయి పడుకో. మళ్లీ ప్రొద్దున్నే పొలం పనులకు పోవాలి” అంటుంది. ఆ దృశ్యం అక్కడ కట్ అయిపోతుంది.

‘జల్దీ జానా హై’ అనగానే కెమెరా పక్కకు ఉన్న ‘దీపం’ వైపు వెళ్తుంది. ఆ దీపం ఉదయిస్తున్న సూర్యుడిలో డిజాల్వ్ అవుతుంది. అతి చక్కటి స్క్రీన్ ప్లే, ఎడిటింగ్.  సూర్యుడు, నిర్మలమైన సరస్సు, సరస్సుకు దూరంగా మందిరం, సరస్సు నీటి ఉపరితలం నుంచి ఎగిరే పిట్టలు ఇలా పల్లెటూరి ప్రశాంత, అందమైన వాతావరణాన్ని తెరపై చూపిస్తుంటే నేపథ్యంలో వేణువుపై ‘భూపాల’ రాగం మ్రోగుతూ ఆహ్లాదకరమైన భావననిస్తుంది. ‘భూప్’ ఉదయరాగం. పూల పైన వాలుతున్న సీతాకోక చిలుకల క్లోజప్పుతో   దృశ్యం అయిపోతుంది.

ఆకాశం కనిపిస్తుంది. రాగం మారుతుంది. లయ మారుతుంది. లయబద్ధంగా అడుగులు వేస్తూ వస్తున్న పల్లె పడుచుల కాళ్లు కనిపిస్తాయి. నెమ్మెదిగా ఒక్కో వాయిద్యం తోడవుతుంది. కోరస్ మొదలవుతుంది. పల్లె యువతులు నీళ్ల కోసం,  పురుషులు వ్యవసాయానికి పనిముట్లు పట్టుకుని పోతుంటారు.

ఈ పాట అటు పల్లె, ఇటు పట్నాన్ని చూపిస్తూ సాగుతుంది. పల్లెలో వాళ్లు ఉదయాన్నే లేస్తారు. పనులకు పోతారు అన్నది చూపించటం లక్ష్యం. పట్నంలో వాళ్లు క్లబ్బులకు వెళ్తారు. తాగుతారు. డాన్సులు చేస్తారు అన్నది చూపటం. అందుకే ఉదయమే ఎగిరే పక్షులను చూపి, పంటనీ నీళ్లను వెళ్లే మహిళను, పనులుకు వెళ్తున్న పురుషులను చూపించారు. ఇక హీరో పాట అందుకుంటాడు, ఓ నాగలి భుజం మీద వేసుకుని.

అందరూ పొలంలో పనులు చేస్తుంటారు. హీరో పాటకు వంత పాడుతారు. ఇదంతా కెమెరా చూపిస్తుంది. ఈ దృశ్యాలలో ఎడ్లబండి చక్రం కదలుతూంటుంది. యువతి పాదాలు ఉంటాయి. కెమెరా చూపే ఈ దృశ్యం ఎందుకో ‘మేరె దేశ్ కీ ధర్తీ’ పాటకు గుర్తింపు దృశ్యంలా ఎదిగింది.

బాణీ చక్కగా కుదిరింది. ముఖ్యంగా ఎడ్ల బళ్లు పరుగు పెట్టే లయకు కుదరటం గొప్పగా అనిపిస్తుంది. చిత్రీకరణలో కూడా ఎడ్ల బళ్లు పరుగులు పెడుతూంటే, నేపథ్యంలో వాటి లయకు తగ్గ సంగీతం వినివిస్తుంటే ఎంతో చక్కగా అనిపిస్తుంది.

బైలోం కె గలే మే జబ్ ఘుంఘరూ జీవన్ కా రాగ్ సునాతే హై
ఘమ్ కోస్  దూర్ హోజాతా హై, ఖుశియోం కె కంవల్ ముస్కాతే హైఁ
సున్ కె రహట్ కీ ఆవాజే  యూం లగే కహీఁ శహనాయీ బజే
ఆతే హీ మస్త్ బహారోం కే దుల్హన్ కీ తరహ్ హర్ ఖేత్ సజే

1940-50 నడుమ స్వతంత్ర పోరాటానికి సంబంధించిన పాటలు దేశభక్తి పాటలు. 1950 నుండి 1960 నడుమ స్వతంత్ర వీరుల త్యాగాలను వర్ణిస్తూ, దేశం కోసం త్యాగలకు సిద్దంకండని, స్వతంత్ర వీరుల కలలు ఫలించేట్టు చేయండని ఉద్భోదించే పాటలు అధికంగా దేశభక్తి పాటలుగా గుర్తింపు పొందాయి. 1950 దశకం చివరి నుండి స్వతంత్రం సాధించిన తరువాత ఒరిగిందేముంది? నుంచి దేశం ఎటు పోతోందని ఆందోళన వ్యక్తపరచే పాటలు, నిరుద్యోగం, అవినీతి వంటి సమస్యలను ఎత్తి చూపిస్తూ నిరాశను ప్రదర్శించే పాటలు ఒక వైపు, మరో వైపు దేశం అభివృద్ధి చెందుతోంది, నూతన ఉత్సాహంతో నిర్మాణాలు సాగుతున్నాయని అశాభావం ప్రకటించే పాటలు దేశ భక్తి పాటలుగా చలామణీ అయ్యాయి.

ఈలోగా ప్రభుత్వ పథకాలు ఫలితాలు చూపటం, పంటలు బాగా పండటం, మరో వైపు దేశం చైనా యుద్ధంలో దెబ్బతిన్న గాయాన్ని మరపించకున్నా తీవ్రత తగ్గించే విధంగా పాకిస్తాన్‌పై యుద్ధంలో విజయం సాధించటం ఆశాభావాన్ని పెంచింది. ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఆత్మగౌరవాన్ని తట్టి లేపింది. ఈలోగా ప్రభుత్వం ఆరంభించిన అనేక కార్యక్రమాలు ఫలితం ఊపించటం ఆరాంభించాయి.  ‘మెరె దేశ్ కి ధర్తీ’ ఆ నూతనోత్సాహాన్ని, విశ్వాసాన్ని ప్రదర్శిస్తుంది. అందుకే అప్పుడే కాదు, ఇప్పుడు, ఎప్పుడూ ఎన్ని దేశభక్తి పాటలున్నా ముందుగా గుర్తుకు వచ్చేది, ‘మేరె దేశ్ కి ధర్తీ’ పాటనే.

పాటలో భావం కూడా, వ్యవసాయ సంబంధం. ఎద్దుల మెడల్లోని గంటల శబ్దం జీవన రాగం వినిపిస్తుందట. అది వింటుంటే ఆనంద కమలం వికసిస్తుందట. నీళ్లు తోడి పోసే యంత్రం శబ్దం షహనాయి మోగినట్టుంటుదట. వసంతం రాగానే ప్రతి పంట పెళ్లికూతురిలా అలంకృతమవుతుందట. చక్కటి భావం. దాన్ని ఉద్దీపితం చేసే ఉత్సాహభరితమైన సంగీతం, అంతే  ఉత్సాహభరితమైన గానం, వీటన్నింటినీ ఔచితీభరితంగా ప్రదర్శించే దృశ్యం.. అన్నీ కలగలసి ‘మెరె దేశ్ కి ధర్తీ’ పాట.

జబ్ చల్తే హైఁ ఇస్ ధర్తీ పే హల్, మమతా అంగ్డాయియా లేతీ హై
క్యూం నా పూజే ఇస్ మాటీ కో జో జీవన కా సుఖ్ దేతీ హై
ఇస్ ధర్తీ పే జిసనే జనమ్ లియా, ఉస్‌నే హీ పాయా ప్యార్ తేరా
యహాఁ అప్నా పరాయా కోయీ నహీఁ హై సబ్ పే హై మా ఉపకార్ తేరా

శుద్ధమైన జాతీయ భావనలతో కూడిన దేశభక్తి. సందేహాలకు, సంశయాలకు తావు లేదు. ఈ దేశం అలాంటిది, సమాజం ఇలాంటిది. మనం ఎందుకు పనికిరాము అన్న పరాజితుడి మనస్తత్వాన్ని ప్రదర్శించే భావజాలమే దేశభక్తి అన్న ఆలోచన ప్రచారానికి వస్తున్న సమయంలో నిర్ద్వంద్వంగా సంపూర్ణ అర్పిత భావనతో ఉన్న ఈ పాట తరతరాల ప్రజలను ఆకర్షించటంలో ఆశ్చర్యం లేదు. అయితే ‘యహాఁ అప్నా పరాయా కోయి నహీ’ అన్న ఆలోచనకు మరీ విస్తృతార్థం ఇవ్వటంతో భారతదేశం అడ్డు అదుపు లేని సత్రంలా అయి, పరాయి దేశం వాళ్లు తమకీ  దేశంపై హక్కున్నట్టు ప్రవర్తించటం, వారికి ఇక్కడవారి  సమర్థన లభించటం అనుభవిస్తున్నాం.

యే బాఘ్  హై గౌతమ్ నానక్ కా ఖిల్తేహై అమన్ కే ఫూల్ యహాఁ
గాంధీ, సుభాష్, ఠాగూర్, తిలక్, ఐసే హైఁ చమన్ కే  ఫూల్ యహాఁ
రంగ్ హరా హరీసంగ్ నల్వేసే, రంగ్ లాల్ హై లాల్ బహదూర్ సే
రంగ్ బనా బసంతి భగత్ సింగ్ రంగ్ అమన్ వీర్ జవాహర్ సే

ఈ చరణంలో మహేంద్ర కపూర్ ఎంత అవేశంతో, ఉద్వేగంతో, గొంతు చించుకుని పాట పాడతాడో, చిత్రీకరణ కూడా అంత వేగంగా, ఉత్తేజితంగా ఉంటుంది. మూడవ చరణం ఆరంభానికి ముందు పట్నంలో క్లబ్బులో నృత్యాలు డ్రమ్స్ మోతలు వినిపిస్తూంటాయి.  అది కట్ చేసి డప్పుల శబ్దంతో జానపదుల లయ వినిపించగానే తేడా తెలుస్తుంది. మ్రోగిస్తున్న డప్పులను లో ఆంగిల్  షాట్‌తో చూపిస్తూ, పూజకు వస్తున్న మహిళల పళ్లాలను క్లోజప్పులో క్రింది నుండి చూపిస్తూ, జీపులో వచ్చిన సైనికుల దగ్గరకు తీసుకుపోవటం అద్భుతమైన దృశ్యం. పంట, నృత్యం, పూజ, రక్షణ మనిషికి కావాల్సింది ఈ నాలుగే. సాధారణంగా భౌతిక విషయాల పైనే దృష్టి ఉన్న వారు కూడు, గుడ్డ, ఇల్లు ఉంటే చాలంటారు. కానీ భారతీయ సమాజంలో ఈ మూడు ధర్మంతో పడుగులో పేకలా పెనవేసుకున్నాయి. ఆహారం సేవించటం ఒక యజ్ఞం. వస్త్రం ధరించటం ధర్మంతో ముడిపడి ఉంది. పూజ గది లేనిదే ఇల్లే కాదు. ఇలా భారతీయ ధర్మం మానవ జేవితంలోని ప్రతి అంశంతో ముడిపడి ఉందన్న భావన కలిగిస్తుందీ చిత్రీకరణ.

అటు క్లోజప్పులో జాతీయజెండా, అంచులో హీరో నిలబడి దేశభక్తి వీరులను స్మరిస్తూంటే ఆ స్మరణలో ఉన్న ఆవేశం, ఆవేగం, హై పిచ్ గానం కలగలసి ఉత్తేజితులను చేస్తాయి. కెమెరా కదలికలు ఆ ఉద్వేగానికి ఊపునిస్తాయి. ‘రంగ్ అమన్ కీ బసంతీ భగత్ సింగ్’ అన్నప్పుడు పూల హారం లోంచి హీరోను చూపిస్తారు. మనోజ్ కుమార్ ‘షహీద్’ అనే సినిమాలో భగత్ సింగ్ వేషం వేసి మెప్పించాడు.

‘రంగ అమన్ కే వీర్ జవాహార్ సే’ అన్నప్పుడు నెహ్రు విగ్రహానికి పూలమాల వేయటం చూపుతారు. ఈ కాలంలో కొందరికి ‘నెహ్రు’ పేరు చెప్పగానే ఆయన పొరపాట్లు కనిపిస్తాయి. కానీ జవహర్ లాల్ నెహ్రు 17 ఏళ్ల సుపరిపాలనను, సుస్థిర  ఇవ్వటం వల్లనే భారత  ప్రజాస్వామ్యం ఈనాడు ఉచ్చస్థాయిలో ఉంది. దేశం ఏర్పడగానే అధికారం విషయంలో అనిశ్చత పరిస్థితి ఎలాంటి దుష్పరిణామాలకు దారితీస్తుందో, దేశం ఏర్పడిన ఆరు నెలల్లో ‘సర్వాధికారి’ని కోల్పోయిన పాకిస్తాన్ సాక్ష్యం చెబుతుంది. ఈనాడు వెనుతిరిగి చూస్తూ  మనం తీర్పులు చెప్తున్నాం కానీ, ఆనాడు వారు ఏ నిర్ణయాలు తీసుకున్నా అవి దేశ క్షేమం కోరే తీసుకున్నారు. మంచి మనస్సుతో తీసుకున్నారు. అందుకే వారు ఆ కాలంలో అంతగా ప్రజాదరణ పొందారు. ప్రజల అభిమానం చూరగొన్నారు. అందుకే పాట చివరలో ‘మెరె దేశ్ కి ధర్తీ’ అని పాడే సమయంలో నెహ్రు విగ్రహం చుట్టు కెమెరా తిరుగుతుంది.

ఆ కాలంలో సినిమాలలో నెహ్రు రీల్ చూపించటం ఒక ఆనవాయితీగా ఉండేది. సినిమాలో ఏదో సందర్భంలో నెహ్రును చూపించేవారు. సినిమా హిట్ అయ్యేది. తనను వ్యాపారం కోసం వాడుకుంటున్నారని గ్రహించిన నెహ్రు సినిమాలో తనను చూపించకూడదని నియమం విధించాడు. ఫలితంగా ఢిల్లీ వెళ్ళి నెహ్రును కలవటం కేంద్ర బిందువుగా రూపొందించిన ‘అబ్ ఢిల్లీ దూర్ నహీ’ సినిమా దెబ్బతిన్నది. ‘మేరీ ఆవాజ్ సునో’ కథ మార్చి చివరిలో నెహ్రు మరణాన్ని చూపించాల్సి వచ్చింది, టైటిల్ పాటతో.

సూర్యోదయంతో ఆరంభమయిన ‘మెరె దేశ్ కి ధర్తీ’ పాట సూర్యాస్తమయంతో పూర్తవుతుంది. ఈ పాట చివరలో మిలటరీ అధికారులు వస్తారు. భవిష్యత్తులో హీరో వ్యవసాయం వదలి సైన్యంలో చేరాలనుకున్నప్పుడు సహాయం అందేందుకు పాట చివరలో నాందీ ప్రస్తావన జరిగింది.

పాటలో దేశం గొప్పతనం, పల్లె జీవన సౌందర్యం, వ్యవసాయంలోని ఆనందం, ‘క్యూ నా పూజే ఇస్ మాటీ కో జో జీవన్ కా సుఖ్ దేతీ హై’ అని నిరూపించటంతో పాట వినేందుకు, చూసేందుకు కూడా అతి గొప్పగా ఉండటం, సినిమా వ్యాపార విలువలు పెంచటమే కాదు, తరతరాలకు దేశభక్తి భావనను అత్యంత ఆరోగ్యకరమైన, ఆసక్తికరమైన, ఆకర్షణీయమైన రీతిలో అందిస్తున్నది.

(‘మెరె దేశ్ కి ధర్తీ’ పాటను యూట్యూబ్‌లో చూడవచ్చు:
https://www.youtube.com/watch?v=8Hi1Dy5ylKw )

(మళ్ళీ కలుద్దాం).

Exit mobile version