Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మధురగీతాలు – మనోహరదృశ్యాలు-33

[సంచిక కోసం ‘శంతనూ – శర్మిష్ఠ’ ప్రత్యేకంగా రచిస్తున్న సినిమా పాటల శీర్షిక.]

అచ్ఛాజీ మై హారీ చలో మాన్ జావోనా
దేఖీ సబ్కీ యారీ మేరా దిల్ జలావోనా

సాధారణ సన్నివేశాలను అసాధారణమైన పాట సందర్భంగా, మరుపురాని పాటగా,  దృశ్యంగా మలచటంలో దర్శకుడి ప్రతిభ స్పష్టంగా తెలుస్తుంది. అయితే,  ‘పాట’ బాగుండాలి. ఆకర్షణీయంగా ఉండాలి. పాటలో పదాలు, భావాలు సందర్భోచితంగా ఉండాలి. సన్నివేశాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకుని, నటీనటులు పాత్రల్లో ఒదిగిపోవాలి. పాట సందర్భం అవగాహన చేసుకుని, పాటతో నటీనటులు మమేకమైపోవాలి. ఇవన్నీ కుదిరినా సరే, పాట మరపురానిదిగా ఎదగటం దర్శకుడి పై ఆధారాపడి ఉంటుంది.

హిందీ సినీ ప్రపంచంలో పాటల చిత్రీకరణ అవగానే రాజ్ కపూర్, బిమల్ రాయ్, శాంతారాం, విజయ్ ఆనంద్ వంటి దర్శకుల పేర్లు ముందుగా వినిపిస్తాయి. వీరి సరసన సగర్వంగా నిలబడగలవాడు రాజ్ ఖోస్లా. సినిమాలో పాటలకు సందర్భాలను ఏర్పాటు చేయటంలో, చక్కటి పాటలను ఎంచుకోవటంలో, ఆయా పాటలను ప్రేక్షకులకు మరపురాని రీతిలో చిత్రీకరించటంలో రాజ్ ఖోస్లా ప్రఖ్యాతి పొందాడు. అందుకే రాజ్ ఖోస్లా దర్శకత్వం వహించిన సినిమాలు అధికశాతం సంగీత పరంగా హిట్ అయినవి. పాటలు ఈనాటికీ సజీవంగా ఉండి రోజూ వినిపిస్తుంటాయి.

మన సినిమాల్లో హీరోకి కోపం వస్తే హీరోయిన్, హీరోయిన్‌కి కోపం వస్తే హీరో బ్రతిమిలాడటం ఒక అలవాటయిన సన్నివేశం. ఇలాంటి సన్నివేశాల కోసం ప్రేక్షకులు ఎదురు చూసే రీతిలో అత్యద్భుతమైన పాటలు రూపొందాయి. మజ్రూహ్ సుల్తాన్‌పురి ఇలాంటి సన్నివేశాల్లో పలు చక్కటి పాటలు రాశాడు. ‘దేఖో కసమ్ సే’ (తుమ్‌సా నహీ దేఖా) ‘ఓ మేరి సోనారె సోనారె సోనా’ (తీస్రీ మంజిల్) ‘సోనీ మేరీ సోనీ’ (యాదోంకి బారాత్), ‘యే లడ్కా హాయే అల్లా’ (హమ్ కిసీసే కమ్ నహీ), ‘ఆనా మేరే ప్యార్ కొ నా తుమ్ ఝూటా సంఝో జానా'( కభి హాన్, కభి నా) ఇలాంటి ఎన్నో సూపర్ హిట్ పాటలను, హీరో హీరోయిన్లు అలగ వద్దని, స్నేహం చేయమని బ్రతిమాలాడుతూ పాడే పాటలను రచించాడు. ప్రతి పాటనూ విభిన్నంగా, వైవిధ్యంగా రాశాడు. కానీ వాటన్నింటికీ భిన్నమైన పాట ‘కాలాపానీ’ లోని ‘అచ్ఛాజీ మై హారీ’.ఇది నాయికా నాయకుల నడుమ వాదన పాట. నాయిక క్షమించమని అడిగిన ప్రతి దానికీ నాయకుడు సమాధానం ఇస్తాడు. నాయకుడి ప్రతి మాటకు నాయిక ఓ మెలిక పెడుతుంది. ఇలా సాగుతుంది పాట.

సినిమాలో సందర్భం మామూలే. నాయిక నాయకుడిని అపార్ధం  చేసుకుంటుంది. నిజం తెలిసి పశ్చాత్తాప పడుతుంది. తన తప్పును క్షమించమని వేడుకుంటుంది. హీరో వినడు. మొండిపట్టు పడతాడు. చివరికి నాయిక పాటను అందుకుంటుంది. పాట పూర్తి అయ్యేసరికి నాయికా, నాయకలు ఇద్దరూ కలసిపోతారు. ఇలాంటి పాటలు మన సినిమాలకే ప్రత్యేకం.

ఇలాంటి పాటల చిత్రీకరణ కూడా సాధారణం. హీరో ముందు కోపంగా వెళ్తుంటాడు. నాయిక వెనుక పాడుతుంటుంది. లేకపోతే, నాయిక కోపంగా ఉంటుంది. నాయకుడు చుట్టూ తిరుగుతూ పాడతాడు. ఇలాంటి సందర్భాన్ని మరపురాని దృశ్యంగా ఎదిగించాడు రాజ్ ఖోస్లా.

రాజ్ ఖోస్లా, దేవ్ ఆనంద్‌కు సన్నిహితుడు. అతడిని గురుదత్ దగ్గర అసిస్టెంట్ డైరక్టర్‌గా నియమించాడు దేవ్. పాటల చిత్రీకరణలో గురుదత్‌ది ప్రత్యేకమైన శైలి. ‘ఆర్ పార్’ సినిమాలో ఇలాంటి సందర్భం ఉంటుంది. నాయిక బ్రతిమిలాడుతూ ‘యేలో మై హారీ పియా’ అంటూ పాడుతుంది. ఆ పాట రాసింది కూడా మజ్రూహ్ సుల్తాన్‌పురియే. ‘నవకేతన్’ నిర్మాణ సంస్థకు( దేవ్ ఆనంద్ స్వంత నిర్మాణ సంస్థ) ఆస్థాన సంగీత దర్శకుడు ఎస్డీ బర్మన్. ఎస్డీ బర్మన్‌కు ఆ కాలంలో సహాయ సంగీత దర్శకులు , తరువాత కాలంలో అత్యద్భుతమైన పాటలను రూపొందించిన ‘జయదేవ్’, ‘ఆర్డీ బర్మన్’లు. ఎస్డీ బర్మన్ అత్యద్భుతమైన మెలోడీలను సృజించిన కాలం అది. కాబట్టి పాట ఆకర్షణీయంగా ఉండటంలో ఆశ్చర్యం లేదు.

పాటను మరింత ఆకర్షణీయం చేసింది రఫీ, ఆశాలు పాట పాడే విధానం. రఫీ ఎంత గొప్ప గాయకుడంటే, తనతో పాడే గాయనిని అనుసరించి ఆయన పాటను పాడే విధానం ఉంటుంది. లతతో ఎంతో డిగ్నిఫైడ్‌గా, జెంటిల్మెన్ లాగా పాడతాడు. అదే ఆశా భోస్లేతో పాడేప్పుడు, ఆమెకు తగ్గట్టుగా నఖరాలు చేస్తూ పాడతాడు. అదే గీతాదత్‍తో పాడేప్పుడు అతను పాడే విధానం వేరేగా ఉంటుంది.

ఈ పాటలో ఆశా భోస్లేకు అల్లరి చేసే అవకాశం అధికంగా లభిస్తుంది. హీరోను బ్రతిమాలడటమే కాదు ఏడిపిస్తూ, రెచ్చగొట్టినట్టు పాడాలి. ఈ సినిమాలో నాయిక మధుబాల ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం కల అమ్మాయి. పత్రికాఫీసులో పని చేస్తుంటుంది. కాబట్టి, ఆమె బ్రతిమిలాటడంలో కూడా డిగ్నిటీ ఉంటుంది. అందుకే పాటలో ఆశా భోస్లే బ్రతిమిలాడుతున్నట్టు పాడుతూనే  వ్యంగ్యం ప్రదర్శిస్తుంది. అందుకు తగ్గట్టుగా కోపం, చిరాకు స్వరంలో ధ్వనింపచేస్తూ ఆశా నఖ్రాలకు నఖ్రాలు సమాధానంగా పాడతాడు రఫీ.

అచ్ఛాజీ మై హారీ చలో మాన్ జావోనా’ అనటంలో ‘మాన్ జావోనా’ ను ఆశా ప్రతిసారీ ప్రత్యేకంగా పలుకుతుంది. దానికి తగ్గట్టుగా మహమ్మద్ రఫీ కూడా ప్రతిసారీ ఆశాకు సమాధానం ఇస్తున్నట్టు భిన్నంగా పలుకుతాడు ‘మెరా దిల్ జలావోనా’ అంటూ. అవమానానికి గురైనవాడు కాబట్టి కాస్త బెట్టుగా, కోపంగా పాడతాడు. సగం పని గాయనీ గాయకులు చేసేశారు. వారు పాడిన దానికి తగ్గట్టుగా నటించాలి నటులు.

మధుబాలకు నవ్వు అందం. ఆమె చలాకీగా నటిస్తుంది. ఇదే సమయానికి కామెడీ సినిమా  ‘చల్తీ కా నామ్ గాడీ’లో కిషోర్ కుమార్‌తో నటిస్తోంది. దాంతో ఆ అల్లరి, చలాకీతనం అంతా  ఈ పాటలో ప్రదర్శించింది. ఆమె నడక, పెదవి విరుపు, కళ్లు మూసి తెరవటం, తల ఎగరేయటం, ముఖంలో క్షణంలో మార్చే భావాలు పాటకు జీవం పోశాయి. పాట ఆమెనే పాడుతున్న భ్రమ కలిగిస్తుంది. దేవ్ తనకి అలవాటైన రీతిలో సందర్భానికి తగ్గట్టు పాటకు తగ్గట్టు నటించాడు. ఈ పాట చిత్రీకరణలో ‘రాజ్ ఖోస్లా’ పై కాస్త విజయ్ ఆనంద్ ప్రభావం కనిపిస్తుంది. చలనచిత్రంలో ‘పాత్రలు’ కదలకున్నా పరవాలేదు. కానీ కెమెరా కదలుతూ ఉండాలి అంటారు. విజయ్ ఆనంద్ ఈ పద్దతిని అనుసరిస్తూ అనేక మరపురాని దృశ్యాలను, అందించాడు. ఈ పాటలో తెరపై ఒక్క క్షణం కూడా కదలిక లేని క్షణం ఉండదు.నిజానికి  ఈ పాటను చూస్తూంటే  అంతకు ముందు నిర్మించిన నవకేతన్ సినిమాలోని అత్యద్భుతంగా చిత్రీకరించిన పాట’ ఆంఖోమే క్యాజీ’ గుర్తుకువస్తుంది. కెమేరా కదలికలు ఒకే రకంగా ఉంటాయి. ఈ రకమైన చిత్రీకరణ్ రాజ్ ఖోస్లా మరే ఇతరపాటలోనూ కనబడదు. కాస్త, ‘బంబయ్ కా బాబు’ సినిమాలో ‘దీవానా మస్తానా’ పాట చిత్రీకరణలో కొద్దిగా ఈ పాట చిత్రీకరణ  ఛాయలు కనిపిస్తాయి.

పాట చలాకీ పాట. వేగవంతమైన పాట. పాటలో పాత్రల భావాలు, వారి మధ్య మారుతున్న సంబంధం ప్రేక్షకుడికి తెలియాలి. అందుకని  ‘క్లోజ్ అప్ షాట్స్’ వాడేడు రాజ్ ఖోస్లా. సినిమాకు సినిమాటోగ్రాఫర్ వి. రాత్రా. ఈయన పలు నవకేతన్ సినిమాలలో పని చేశాడు. సినిమాటోగ్రాఫర్, దర్శకుడు కలసి, అద్భుతం సృష్టించారు.

క్లోజ్ అప్ షాట్ల ద్వారా మధుబాల అందం, అల్లరి చిలిపితనం, మారే భావాలు అన్నీ ప్రేక్షకుడికి చేరువ చేయవచ్చు. అలాగే దేవ్ ముఖంలో ప్రదర్శించే భావాలను కూడా చూపించవచ్చు. ఈ సినిమాలో దేవ్‌కు అన్నీ నల్ల దుస్తులే వాడటం ఓ ప్రత్యేకత. నల్లదుస్తుల్లో అతడు మరింత అందంగా ఉంటాడని, ఆయన నల్లబట్టలు వేసుకోవద్దని కోర్టు తీర్పు ఇచ్చిందంటారు.

క్లోజ్ అప్‌తో పాటు ఇద్దరూ ఒకే ఫ్రేమ్‌లో ఉన్న షాట్స్, వారిద్దరి వేర్వేరు భావాలను, స్పందన, ప్రతిస్పందనలను ప్రదర్శించేందుకు వాడేరు. నటీనటుల కదలికలు చూపేందుకు మీడియమ్ షాట్స్ వాడేరు. ‘ఐ లెవెల్’ షాట్స్ వాడకం వల్ల పాటలో రోమాన్స్ మరింత ప్రస్ఫుటమయింది.

పాట ఆరంబంలోనే ‘ట్రెండ్’ స్థిరపడిపోతుంది. క్రింద నుంచి ఓ రాయి తీస్తుంది నాయిక. ఆ రాయిని ఆమె క్రింద నుంచి తీసి, విషాదంగా చూసి, నాయకుడి వైపు చూస్తుండగానే ఆమె వదనంలో కొంటె నవ్వు చిన్నగా వెలుస్తుంది. అది పెద్దదవుతుంది. ఆమె నాయకుడి వైపు రాయి విసురుతుంది. ఆమె క్షమార్పణలు వేడుకుంటున్నది. కానీ అది లొంగుబాటు కాదు. ఆమె అతడిని ఏడ్పించి, రెచ్చగొట్టి మరీ ప్రసన్నం చేసుకోబోతున్నదని అర్థమవుతుంది.

పిల్లలు ఏడుస్తారు. అలుగుతారు. అప్పుడు వాళ్లని బ్రతిమిలాడతాం. హాస్యం చేస్తాం. నవ్విస్తాం. ఆమె రాయి తీసి విసరటం పాటకు ప్రిల్యూడ్ సంగీతానికి తావిచ్చింది.  ‘అకార్డియన్’,  మధుబాల నవ్వు అంత అందంగా ధ్వనిస్తుంది. ఆమె అతడిని బ్రతిమిలాడటం కూడా రాయితో కొట్టి తన వైపు చూసేలా చేసుకుని ఆరంభిస్తున్నది. ఆ చిలిపితనమంతా ఆశా స్వరంలో, మధుభాల వదనంలో కనిపిస్తుంది. దేవ్ ఆనంద్ వదనం లోని సీరియస్‌నెస్ రఫీ స్వరం ధ్వనిస్తుంది.

రాయి విసిరింది. తిరిగి చూస్తాడు హీరో కోపంగా. ‘మాన్ జావో నా’ అని ఆశా ఎలా అంటుందో ఆ బ్రతిమిలాడటానికి  కాస్త చిలిపితనం జోడించి ప్రదర్శిస్తుంది మధుబాల వదనం. ఈపాటికే పాట అందరికీ నచ్చేస్తుంది. ఒక విభిన్నమైన, ప్రత్యేకమైన పాటను చూడబోతున్నాం అని అర్థమైపోతుంది.

రెండోసారి ‘అచ్ఛాజీ మై’ అనేప్పుడు మధుబాల వదనంలో పదం పదానికి మారిపోయే భావాలు ఎన్ని సార్లు చూసినా తనివి తీరదు. ‘అచ్ఛా’ అంటు నవ్వటం, ‘హారీ’ అన్నప్పుడు కళ్లు దించుకోవటం, ‘మాన్ జావోనా’ అన్నప్పుడు ‘మాన్’ నుంచి ‘నా’ వచ్చే వరకు ఏడుపు ముఖం పెట్టం, ఇదంతా క్లోజప్పులో చూపటం, అద్భుతం. అనాటి కళాకారులు, మామూలు కమర్షియల్ సినిమాలుగా భావించే సినిమాను, ఎంత నిజాయితీగా, ప్రతి సెకను సెకనునూ  ఎంత జాగ్రత్తగా రూపొందించారో అర్థమవుతుంది. ‘దిల్ జలావోనా’ దగ్గర రఫీ స్వరం, దేవ్ నటన ఇంతకన్నా ‘అద్భుతం’ అనిపిస్తాయి. ఒక పిల్లవాడు అలిగినట్టే బుంగ మూతి, కళ్లల్లో విషాదం, పెదవులపై కోపం..

చరణం కన్నా ముందు వచ్చే ఇంటర్ల్యూడ్‌లో ఆమె నడుస్తూ అతడిని తట్టటం, అతడు కోపంగా  లేచి వెళ్తూ పడబోయి నిలద్రొక్కుకోవటం, అంత బ్రతిమిలాడుతున్న ఆమె నవ్వటం,  ఎలాంటి వారికయినా నవ్వు తెప్పిస్తుంది. ఆనందం కలిగిస్తుంది. ఈ సందర్భంగా కెమెరాకు వాడిన ఫిల్టర్లు, మధుబాలను దేవకన్యలా వెలిగింపచేస్తాయి.

ఛోటే సే కుసూర్ పే ఐసే హో ఖఫా’ లో చివరికి ‘ఖపా’ అని దీర్ఘం తీయటంలోనే వ్యంగ్యం కనిపిస్తుంది. ఆ సమయంలో మధుబాల కూడా ‘ఖఫా’ ఓ రకంగా చూస్తుంది. ఒక్క పదానికి ఆమె వదనంలో ప్రదర్శితమయ్యే భావాలు, నటన, మనసును దోచేస్తాయి. ‘చోటీ’ అన్నప్పుడు ‘ఎంత చిన్నది’ అన్నట్టు చూసి, ‘కుసూర్ పే’ అన్నప్పుడు భుజాలెగరేసి, ‘ఐ సీ హో’ అన్నప్పుడు కళ్లు పెద్దవి చేసి, పాటను అత్యంత ఆకర్షణీయంగా, ఆహ్లాదకరంగా ఎన్ని రకాలుగా మలవచ్చో అన్ని రకాలుగా మలచటం కనిపిస్తుంది.

గాయనీ గాయకులు నటీనటులు, దర్శకుడు, కెమేరామెన్, సంగీత దర్శకుడు, గేయ రచయిత కలసి ఒక మామూలు పాట సన్నివేశాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దటం చూడవచ్చు. ఈ పాటలో గమనించాల్సిందేమిటంటే, పాదం రిపీట్ అయినప్పుడు, మొదటి సారికీ రెండోసారికీ అదే భావం అయినా నటన లోనూ, పాడే విధానంలోనూ మార్పు కనిపిస్తుంది. ఇది పాటలో ప్రతి చరణంలో, ప్రతి పాదంలో గమనించ వచ్చ.

రూఠే తో హూజూర్ థే, మేరీ క్యా ఖతా’ అన్నప్పుడు దేవ్ ఆనంద్ ముఖం కెమెరా వైపుంటుంది. కోపంగా చూస్తూ జేబుల్లో చేతులు పెట్టుకుని దేవ్ పాడుతుంటే ఆ కాలంలో ప్రేక్షకులు వెర్రెక్కిపోయారు. మధుబాల అందంతో చలాకీతనంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటే, దేవ్ తన స్టయిల్‍తో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టాడు.

‘దేఖో దిల్ నా తోడో’ అని ఆశా ఎంత జాలిగా అంటుందో, అంతే బేలగా ముఖం పెడుతుంది మధుబాల. ‘ఛోడో హాథ్  ఛోడో’ అని రఫీ ఎంత కోపంగా విసురుగా అంటాడో అంతే విసురు ప్రదర్శిస్తాడు దేవ్. ఇదంతా క్లోజప్పులు, ‘టూ షాట్’ టెక్నిక్స్‌తో ప్రేక్షకులకి చేరువ చేస్తుంది కెమెరా. మధుబాల కెమెరా వైపు వస్తూ ఉంటే, దేవ్ కెమెరాకు దూరంగా వెళ్తుంటాడు. ఇది వారిద్దరి బేధాభిప్రాయాన్ని మరింత దగ్గరగా చూపిస్తుంది.

రెండవ చరణం చిత్రీకరణలో మరో చమత్కారం చేశాడు దర్శకుడు. సినిమాలో హీరో చేయని నేరానికి జైలులో ఉన్న తండ్రి అమాయకత్వం నిరూపించేందుకు బొంబాయి నుంచి హైదరాబాదు వస్తాడు. హైదరాబాదులో అతడు ఏ అతిథి గృహంలో ఉన్నాడో ఆ అతిథి గృహంలో మరో ముగ్గురుంటారు. ఆ అతిథి గృహం యజమాని మధుబాల. రెంటు కట్టలేదని అందరినీ బయటకు పంపించేస్తే పార్కులో ఉంటుంటారు. అదే పార్కులో ఇప్పుడు హీరో హీరోయిన్లు పాడుతుంటారు. ఆరంభంలో ఈ ముగ్గురూ మధుబాల వెంట పడతారు. దేవ్ అడుగు పెట్టినప్పుటి నుంచీ దేవ్ మధుబాలల నడుమ ఏదో ఉందని వీరికి అనుమానం.

ఈ చరణంలో లయబద్దంగా ఒక్కొక్కరు మెట్లు దిగి వచ్చి వీరు పాడటం చూస్తారు. ముందుగా జానకీ దాస్ వస్తాడు. లయననుసరిస్తూ రెప్పలు కొడతాడు. తరువాత ముక్రీ వస్తాడు. చివరికి అఘా వస్తాడు. ముగ్గురూ పాట లయ ప్రకారం కదులుతారు. అంటే, లయను అనుసరించి ప్రతి ఒక్క పాత్రనూ ప్రవర్తింపచేశాడన్న మాట. ఈ ముగ్గురూ నటన ప్రేక్షకులకు హాస్యం కలిగిస్తుంది.

రెండవ  చరణం ఇద్దరి నడుమ సంవాదంలా సాగుతుంది. ఈ సందర్భంలో క్లోజప్ షాట్లు, లైటింగ్ అద్భుతంగా ఉంటాయి. నాయికా నాయకలను చరణం చివరి దాకా కలిపి చూపరు. నాయిక నవ్వుతూ ‘చార్ కదమ్ భీ’ అంటున్నప్పుడు కెమెరా ఆమె వైపు దూసుకెళ్తూ క్లోజప్‌గా మారటం చక్కటి ఎఫెక్ట్ ఇస్తుంది. ఇలా కెమెరా తనదైన రీతిలో పాటను మరింత చరుకుగా అద్భుతంగా చేయటం అధికంగా విజయ్ ఆనంద్ పాటల చిత్రీకరణలో కనిపిస్తుంది. ఈ పాటలో కెమెరా క్షణం సేపు నిశ్చలంగా ఉండదు. కెమెరా షాట్లు మారుస్తూనే ఉంటుంది. గమనిస్తే, మధుబాలను వీలయినంత ఎక్కువగా క్లోజప్పులో చూపటం, దేవ్ ఆనంద్‌ను మీడియమ్ షాట్‍లో చూపటం వల్ల ఆమె భావనలు, ఇతడి స్పందనలు ప్రేక్షకులను మరింత దగ్గరవుతాయి. అంతే కాదు, ఇద్దరూ స్వయంగా పాడుతున్న భ్రమ కలుగుతుంది.

పాట చివరలో మధుబాల మెట్లపై కూర్చుంటే, దేవ్ ఆమె వైపు వెళ్లి వేలు తుపాకీలా చూపుతూ,   ‘దిల్ జలావోనా’ అనటం ఆమె చేతులు రెండు ఎత్తి ‘అచ్ఛాజీ’ అని పాడటం ఇద్దరూ కలసిపోవటంతో సినిమాలో ఒక ప్రత్యేక సినిమా చూసిన భావన కలుగుతుంది. అందుకే ఈ పాట సినిమాతోనే కాక తనదైన ప్రత్యేక అస్తిత్వం సాధించింది. ఈ పాట ఒక కథగా ఎదిగింది.

‘కాలా పానీ’ ఏ. జి. క్రోనిన్ నవల ‘Beyond This Place’ కు సినిమా రూపం. ‘కాలా పానీ’ తరువాత ఇదే నవల ఆధారంగా ఇదే పేరుతో ఇంగ్లీషు సినిమా విడుదలయింది. ఈ రెండు సినిమాలు చూస్తే, ‘ఎమోషనల్’ గా, సస్పెన్స్ ప్రకారంగా ఇంగ్లీషు సినిమా బాగున్నదనిపించినా, హిందీ సినిమా కూడా సస్పెన్స్ గానే సాగుతుంది.’ ఆసక్తికరంగా ఉంటుంది. కానీ పాటల వల్ల హిందీ సినిమాను పదే పదే చూస్తాము. ఎన్ని సార్లు చూసినా పాటలు ఇంకోసారి చూడాలనిపిస్తుంది. ఈ పాటను ఇంత వరకూ వినని వారు కూడా ఒక్కసారి చూసి సంతృప్తి పడలేరు. అదీ సరైన పాట, నటన, చిత్రీకరణలు తోడయితే పాటలు చేయగల మహాద్భుతమైన మాయాజాలం!

(‘అచ్ఛాజీ మై హారీ’ పాటను యూట్యూబ్‌లో చూడవచ్చు:

https://www.youtube.com/watch?v=cwBdFom1X30 )

ఆంఖోంమే క్యాజీ పాటను ఈ క్రింద లింకులో చూడవచ్చు.

https://www.youtube.com/watch?v=36vOzr8S-iE

(మళ్ళీ కలుద్దాం).

Exit mobile version