[సంచిక కోసం ‘శంతనూ – శర్మిష్ఠ’ ప్రత్యేకంగా రచిస్తున్న సినిమా పాటల శీర్షిక.]
అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం
ఆత్మ తృప్తికై మనుషులు ఆడుకునే నాటకం
వింత నాటకం
‘తాతా మనవడు’ సినిమా పేరు చెప్పగానే జ్ఞాపకం వస్తుందీ పాట. జీవితంలో ‘నా’ అనుకున్న వారు మోసం చేస్తే వెంటనే తలపులో మొదలుతుందీ పాట. మనవారు మనల్ని మోసం చేస్తే కన్నీటి కన్నా ముందు వస్తుందీ పాట పెదవులపైకి. డా. సినారె రాసిన ఈ పాటను స్వరబద్ధం చేసిన వారు రమేశ్ నాయుడు. ఈ పాట ఇంత మరపురానిదిగా ఎదగటంలో గేయ రచయిత, గాయకుడు, సంగీత దర్శకుడుతో పాటు దర్శకుడు దాసరి నారాయణరావు పాత్ర కూడా ఉంది.
నిజానికి ఈ పాటను గుర్తుంచుకునేందుకు సినిమా చూడనవసరం లేదు. కానీ సినిమా చూస్తే ఈ పాటను మరచిపోయే ప్రసక్తి లేదు. మన సినిమాల్లో ఏ పాత్ర పాడని ‘నేపథ్య గీతాల’కు ఎంతో ప్రాధాన్యం ఉంది. పాత్రలు తమ పనులు తాము చేసుకుపోతుంటాయి. బాధలు పడుతుంటాయి. వారి పరిస్థితిని వివరిస్తూ వారి బాధలను వేదనలను ప్రేక్షకులకు చేరువచేస్తూ, నేపథ్యంలో వినిపిస్తాయి పాటలు.
పయనించే ఓ చిలుకా ఎగిరిపో
పాడై పోయెను గూడూ
‘కులదైవం’లోని ఈ పాట ఎన్నో విషయాలు చేప్తుంది. పాత్రల పరిస్థితి, మానసిక స్థితిని ప్రేక్షకులకు చేప్తూనే, పాత్రలను సముదాయిస్తూ వేదాంతం బోధిస్తుంది.
రాదోయీ సిరి నీ వెనువెంట
త్యాగమే నీ చేదోడూ
అని స్వంత ఇంటిని వదలి వెళ్తున్న వారికి తత్వం బోధిస్తుంది.
ఎవరికి వారే ఏదో నాటికి ఎరుగుము ఎటునో ఈ బదిలీ
మూడు దినాల ముచ్చటయే ఈ లోకంలో మన మజిలీ
నిజాయితీగా ధర్మ పథాన దైర్యమే నీ తోడు
వేదాంతంతో పాటు స్పూర్తినిచ్చి నిజాయితీగా దైర్యంగా ఉండాలని నీతి చెప్తుంది.
(‘పయనించే ఓ చిలుకా ఎగరిపో’ పాటను యూట్యూబ్‌లో చూడవచ్చు:
https://www.youtube.com/watch?v=QGMcw5ic-CE )
ప్రేమ కోసమై వలలో పడెనే పాపం పసివాడు
అయ్యో పాపం పసివాడు, అయ్యో పాపం పసివాడు
వేమరు దేవుల వేడుకుని తన కొమరుని క్షేమం కోరుకుని
ఏయ్యాడో ఏమౌనోయని కుమిలే తల్లిని కుములుమనీ
ప్రేమ కోసమై వలలో పడినే పాపం పసివాడు, అయ్యో పాపం పసివాడు
‘పాతాళ భైరవి’లో ఈ నేపథ్య గీతం కీలకమైన సన్నివేశంలో వస్తుంది. మాయల మరాఠీ వెంట అమాయకంగా వెళ్తున్న నాయకుడి పట్ల ప్రేక్షకులలో జాలి, సానుభూతి కలిగిస్తూ అతడి పరిస్థితి ఏమౌతుందోనని ఉత్కంఠను కూడా కలిగిస్తుంది. పైగా సందర్భంలోని సంవేదనను ఉద్దీపనం చేయటంలో పాట మరపుకు రాదు. దీనికి తోడు గాయకుడు వర్మ గొంతు విభిన్నంగా ఉండటంతో పాట మరింతగా ఆకర్షిస్తుంది.
(‘ప్రేమ కోసమై వలలో పడెనే పాపం పసివాడు’ పాటను యూట్యూబ్‌లో చూడవచ్చు:
https://www.youtube.com/watch?v=OOpO-tLmQ1E )
ఊరు మారినా ఉనికి మారునా
మనిషి దాగినా మమత దాగునా
మరలి రాని పయనంలో మజిలీ లేదు
ఆడదాని కన్నీటికి అంతే లేదు
‘మూగనోము’ సినిమాలో ఈ పాట నాయిక మనస్థితిని, పరిస్థితిని, ప్రేక్షకునికి చేరువ చేస్తుందీ పాట.
తలపులే వీడవు, వీడేది మనిషే
వలపులే వాడవు వాడేది తనువే
‘అబ్బ’ అనిపించే భావం చిన్న చిన్న పదాలలో అద్భుతంగా వివరించాడు ఆరుద్ర. నేపథ్య గీతాలలో ఇలాంటి ‘ఆహా’ అనిపించే భావాలుంటే పాట మరింత సులభంగా ప్రేక్షకుడిని మెప్పిస్తుంది. అధిక శాతం నేపథ్య గీతాలు తాత్వికతను ప్రదర్శిస్తాయి. జీవన సత్యాలను ప్రకటిస్తాయి. సార్వజనీక భావనలతో అలరారుతాయి.
(‘ఊరు మారినా ఉనికి మారునా’ పాటను యూట్యూబ్‌లో చూడవచ్చు:
https://www.youtube.com/watch?v=NvMNy5AsOu4 )
కలిమి నిలవదు లేమి మిగలదు కలకాలం ఒక రీతి గడవదు
నవ్విన కళ్ళే చెమ్మగిల్లవా, వాడిన బ్రతుకే పచ్చగిల్లదా
ఇంతేరా ఈ జీవితం తిరిగే రంగుల రాట్నము
తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనుక
మంగళ సూత్రం అంగడి సరుకా కొనగలవా చేయి జారాక
లాభం ఎంతోచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేశాక
‘శుభలగ్నం’ సినిమాలో నేపథ్యలో వచ్చే ఈ పాట, డబ్బు కోసం భర్తని అమ్మేసిన మహిళను లాభం ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేశాక అని ప్రశ్నించి ఆమె పరిస్థితిని ప్రేక్షకులకు దగ్గర చేస్తుంది.
అమృతమే చెల్లించి ఆ విలువతో
హాలాహలం కొన్నావే అతి తెలివితో
కురిసే ఈ కాసుల జడిలో తడిసి నిరుపేదైనావే
మానవ సంబంధాలకు ధనం కన్నా పెద్ద పీట వేసి అనురాగం మమకారాలు అమూల్యం అని స్పష్టం చేస్తుందీ పాట.
(‘చిలకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక’ పాటను యూట్యూబ్‌లో చూడవచ్చు:
https://www.youtube.com/watch?v=LtS5c3vSAPY )
గంభీరమైన సన్నివేశాలలో, విషాదం సన్నివేశాలలో వినిపించే నేపథ్య పాటలు, ఇటీవలి కాలంలో నాయికా నాయికుల ఆనందాన్ని ప్రదర్శించటంలో, వారి అనుబంధాన్ని, రొమాన్స్ ను చూపించేందుకు వాడుతున్నారు. అంటే ఒక రకంగా నేపథ్య పాటల వాడకం, విలువ తగ్గిందన్న మాట. ‘సీతా కల్యాణం’ సినిమా మొత్తం నేపధ్యంలో పాటల ద్వారా చెప్పించి దేశ విదేశాలకు సినిమా పాఠాలు నేర్పించాడు బాపు.
‘తాత మనవడు’ సినిమాలో ‘అనుబంధం ఆత్మీయత’ పాట కోసం సందర్భాన్ని ఎంచుకోవటంలోనే సగం విజయం సాధించారు.
అమ్మనాన్నలను మోసం చేస్తాడు కొడుకు. ధనం కల భార్యకు దాసోహం అంటాడు. అమ్మ తన ఇంట్లో పనిమనిషిగా ఉంటే ‘ఆమె తన అమ్మ’ అన్న నిజం దాచి పెట్టమంటాడు. అమ్మ పడిపోతే పాకలో పడుకోబెట్టినా నోరు మెదపడు. తల్లి మరణించిందని తెలిసినా వెళ్లడు. షష్టిపూర్తి ఉత్సవాలలో పాల్గొంటాడు. ఆ సందర్భంలో వస్తుందీ పాట.
ఒక పక్క తల్లి శవయాత్ర. మరో వైపు షష్టిపూర్తి, ఒక వైపు చావు. మరో వైపు వివాహం తంతు. ఈ రెండింటిని సమాంతరంగా చూపుతూ గొప్ప సెంటిమెంటల్ పాటగా నిలిపాడీ పాటను దర్శకుడు.
ఇటువంటి పాటల చిత్రీకరణలో అంత గొప్ప టెక్నిక్కులు అవసరం లేదు. పాత్రలను, హావభావాలను చూపిస్తే చాలు. కానీ ఈ పాటను నారాయణ రెడ్డి ఎంత గొప్పగా రాసేడంటే, పాటలోని భావాలకనుగుణంగా తెరపై దృశ్యం కనబడకపోతే పాట అభాసుపాలై పోతుంది. అలా పాటలో భావాలనుగుణంగా దృశ్యం కనబడటం వల్ల పాట విలువ పెరుగుతుంది. సినిమాలో సెంటిమెంటల్ విలువ పెరుగుతుంది. ప్రతి ఒక్కరూ స్పందించే రీతిలో పాట ఉండటంతో సినిమా పరిధి దాటి ప్రత్యేకంగా నిలుస్తుంది పాట.
కస్మె వాదే ప్యార్ వఫా సబ్
బాతేఁ హైఁ బాతోం కో క్యా
కోయీ కిసీ కా నహీ యే
ఝూఠే నాతే హైఁ నాతోం కా క్యా
‘ఉపకార్’ సినిమాలో ప్రాణ్ పాత్ర పాడిన ఈ పాట మానవ సంబంధాలలోని డొల్లతనాన్ని స్పష్టం చేస్తుంది. ‘తాత మనవడు’ సినిమాలో పాట వినగానే ఈ పాట పల్లవి గుర్తుకు వస్తుంది. అయితే రెండు పాటల సందర్భాలు వేరే. ధోరణి వేరే.
(‘కస్మె వాదే ప్యార్ వఫా సబ్’ పాటను యూట్యూబ్‌లో చూడవచ్చు:
https://www.youtube.com/watch?v=19Y9N3xUviM )
నిజానికి మానవ సంబంధాలన్నీ బూటకం అన్న ఆలోచన వేదాలు, ఉపనిషత్తుల్లోనూ కనిపిస్తుంది. యాజ్ఞవల్క్యుడు తన భార్యకు జ్ఞానం బోధిస్తూ ఈ ప్రపంచంలో భార్య భర్తను, భర్త భార్యను పిల్లలు తల్లిదండ్రులను, తల్లిదండ్రులు పిల్లలను.. అంటూ ఓ పెద్ద జాబితా చదివి వీరంతా ఒకరినొకరు ప్రేమించటం అంతా బూటకం. ఎవరిని ఎవరు ప్రేమించినా అంతా తన స్వార్థం కోసమే అంటాడు. ఆత్మ తృప్తికై మనుషులు ఆడుకునే నాటకం, వింత నాటకం అన్నమాట.
పాటకు సన్నివేశం కుదిరింది, పాట బాగా కుదిరంది. రమేశ్ నాయుడు బాణీలను ఢోకా లేదు. కానీ గాయకుడి దగ్గర సమస్య వస్తుంది. ఎందుకంటే ఇలాంటి గంభీరమైన పాటలకు నేపథ్యలో ఘంటసాల పాడితే అద్భుతంగా ఉంటుంది. కానీ అప్పటికే ఘంటసాలకు ప్రత్యామ్నాయంగా భావిస్తున్న రామకృష్ణను ఈ పాట పాడేందుకు ఎంచుకున్నారు. రామకృష్ణ వీలయినంత వరకూ ఘంటసాలలా పాడాలని ప్రయత్నించాడు. పాట సూపర్ హిట్ అవటంతో ఆ గాంభీర్యం ధ్వనింపచేయటంలో విజయం సాధించాడనవచ్చు. ఇదే సమయానికి ‘జీవన తరంగాలు’ సినిమాలో శవయాత్ర పాట ‘ఈ జీవన తరంగాలలో’ కూడా విడుదలైంది. రెండు పాటలూ సూపర్ హిట్ లయ్యాయి.
‘ఈ జీవన తరంగాలలో’ పాటలో ‘టచ్’ ఒకటి అద్భుతంగా ఉంటుంది. కృష్ణంరాజు పాత్ర దొంగ. అతని తల్లి శవానికి నిప్పు పెట్టేందుకు శోభన్ బాబు వెళ్తూంటాడు, శవంతోపాటు. కృష్ణంరాజును పోలీసులు వెంబడిస్తూంటే అతడు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు పాడెను కాసేపు మోస్తాడు.
మమతే మనిషికి బంధిఖానా
భయపడి తెంచుకు పారిపోయినా
తెలియని పాశం వెంటబడి
రుణం తీర్చుకోమంటుంది
నీ భుజం మార్చుకోమంటుంది.
సినిమాలో ఈ దృశ్యంలో కృష్ణంరాజు పాత్ర భుజం మార్చుకుంటున్నప్పుడు హాలు చప్పట్లతో మార్మోగుతుంది, అప్పుడు, ఇప్పుడు కూడా.
(‘ఈ జీవన తరంగాలలో’ పాటను యూట్యూబ్‌లో చూడవచ్చు:
https://www.youtube.com/watch?v=HMqdD5DmM-8 )
అయితే ‘అనుబంధం ఆత్మీయత’ పాటంతా ఇలాంటి సెంటిమెంట్లను అడుగడుగునా ఉద్దీపితం చేస్తాడు దర్శకుడు. ‘ఈ జీవన తరంగాలలో’ పాటలో ఒక చరణంలో ప్రేక్షకులు చప్పట్లు కొడతారు. కానీ ‘అనుబంధం ఆత్మీయత’ పాటలో ప్రతి క్షణం ప్రేక్షకుల కళ్లు చెమరుస్తాయి. గుండె బరువెక్కుతుంది. విషాదం వెల్లువవుతుంది.
పాట ఆరంభంకన్నా ముందు ‘నిప్పు’ను క్లోజప్పులో చూపిస్తాడు. నిప్పును రెండు వైపులా డప్పులు పట్టుకుని ‘చావు డప్పు’ ఆరంభిస్తారు. ఇది శవయాత్రలో వాయించే సాంప్రదాయక లయను అనుసరిస్తుంది. ఇక్కడే రమేష్ నాయుడు ప్రతిభను గమనించవచ్చు.
‘దేవుడు చేసిన మనుషుల్లారా’ పాట సినిమా చివరలో వచ్చేటప్పుడు సాంప్రదాయిక నృత్య సంగీతాన్ని సందర్భోచిత పాశ్చత్య సంగీతంతో జతపరుస్తూ అద్భుతమైన ఎఫెక్ట్ సాధించాడు. అదే ఈ పాటలో కూడా కనిపిస్తుంది. ఒక వైపు చావు యాత్రకు ఔచితీమంతమైన సంప్రదాయ సంగీతం ఇస్తూ, షష్టిపూర్తి పార్టీలో ఆ సందర్భానికి తగ్గ సంగీతం మ్రోగిస్తూ, రెండింటినీ ఎలాంటి తేడా కనిపించకుండా కలపటం గొప్పగా అనిపిస్తుంది. పాట మరింతగా ప్రభావవంతం అయిందీ సంగీత రచన వల్ల.
పాటను ఎస్వీరంగారావు పాత్ర మనసులో మాటగా చూపించారు. క్లోజప్పులో తెర క్రింద వైపు ఓ మూల వంగి పైకి చూస్తూన్నట్టు, మరోసారి పై నుంచి క్రిందకు చూస్తున్నట్టు చూపించి ఖాళీ స్థలంలో పాత జ్ఞాపకాల దృశ్యాలను చూపించారు.
ఎస్వీరంగారావును ఎప్పుడూ క్లోజప్పులో చూపించినా ఆయన వదనం అనేకానేక భావాలను సందర్భోచితంగా ప్రదర్శిస్తుంది. ఈ పాట అందుకు భిన్నం కాదు. ఆత్మ తృప్తికై అంటున్నప్పుడు ఆమోదించినట్టు తల ఊపి ఒక నవ్వు నవ్వుతాడు. అద్భుతమైన భావన కలిగిస్తుంది అది. విరక్తి, నిర్వేదం, ఆమోదం, అవగాహనలన్నీ కనిపిస్తాయి. చివరికి ఆనంద విషాదల కతీతమైన స్థితిని ప్రదర్శిస్తాడు.
తరువాత దృశ్యంలో షష్టిపూర్తి సంగీతం మారుతుంది. మూడ్ మారుతుంది. కానీ ప్రేక్షకుడికి గేయ రచయిత చెప్పిన భావం మరింత స్పష్టమౌవుతుంది. ఇక్కడ తల్లి శవం అనాథలా.. అక్కడ కొడుకు వేడుకులలో పాల్గొనటం, ఐశ్వర్యం నడుమ అనుబంధం ఆత్మీయత అంతా ఒక నాటకం అంటుంది మనసు.
వెంటనే మళ్లీ నిప్పు, డప్పు, శవం, విషాదం.
ఎవరు తల్లి? ఎవరు కొడుకు? ఎందుకు ఆ తెగని ముడి?
కొన ఊపిరిలో ఎందుకు అణగారని అలజడి
కరిగే కొవ్వొత్తిపై కనికరం ఎవ్వరికీ
అది కాలుతున్న వెలుగులె కావాలి అందరికీ..
‘కరిగే కొవ్వొత్తి వెలుగు కావాలి అందరికీ’ – తల్లి గురించి ఈ పాట చెప్పినంతగా ఇతర ఏ పాట చెప్పలేదు. కొవ్వొత్తి వెలుగులు కావాలి. అది అది కాలుతుందన్న ధ్యాస లేదు. అది స్వాభావికం. తల్లి రాత్రింబవళ్ళు సేవలు చేస్తుంది. కోరినవి అందిస్తుంది. కానీ ఆమె గురించిన ధ్యాస ఎవరికీ ఉండదు. ‘అడగక ముందే అమ్మ ఇస్తుంద’న్న భరోసా. కానీ ఆమె ఎంత కష్టపడుతోంది? ఏమిటీ? ఎవ్వరికీ అవసరం లేదు. ఇది సందర్భంలో ‘అమ్మ’ అయినా, నిస్వార్ధ సేవ చేసే ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది. ఒక కళాకారుడు ఎంత కష్టపడి కళను సృజించాడో అనవసరం. క్షణాలలో పెదవి విరిచిపోతారు. లేకపోతే ‘ఆహా’ అని ముందుకు సాగుతారు. మరచిపోతారు.
అక్కడ వందేళ్లు బ్రతుకమని అశీర్వదిస్తుంటే ఇక్కడ కాలం అగిపోయింది. అయుశ్శు అయిపోయింది. అక్కడ నృత్యాలు, ఇక్కడ ఏడుపు.
కొడుకంటు నీకూ ఒకడున్నాడు
వాడు గుండెను ఏనాడో అమ్ముకున్నాడు
నిన్ను కడసారైనా చూడరాలేదు
వల్లవాటికైనా వస్తాడను ఆశలేదు
ఎవరమ్మా వినేది నీ ఆత్మ ఘోషనూ
ఏ తల్లీ కనకూడదు ఇలాంటి కొడుకునూ
పాటలో పదాల భారం తెరపై కనిపిస్తుంటే చాలు, సరిపోతుంది. దర్శకుడు అదే చేశాడు.
చివరి చరణంలో పెళ్లి ఊరేగింపునూ, శవయాత్రనూ పక్కపక్కనే చూపిస్తాడు. గొప్ప ఎఫెక్ట్ వస్తుంది. ముఖ్యంగా నేపథ్యలో వినిపిస్తున్న పాట కత్తితో కోసినట్టుంటుంది.
కానివారి ముచ్చటకై కలవరించు మూఢునికి
కన్నవారి కడపుకోత ఎన్నడైన తెలిసేనా
తారాజువ్వల వెలుగుల తల తిరిగిన ఉన్మాదికి
చితిమంటల చిటపటలు వినిపించేనా?
చివరి చరణంలో చితిమంటలకు దూరంగా ఎస్వీఆర్‌ను చూపించేప్పుడు ‘అనుబంధం ఆత్మీయత’ అంటూ పాట వినపడటం అనేక భావాలు కలిగిస్తుంది. మానవ సంబంధాలు ఎంత ‘క్షణికం’ అనిపిస్తుంది. చివరికి ‘ఈ కట్టెను కట్టలు కల్చక మానవు, ఆ కన్నీళ్లకు చితిమంటలారవు’ అన్న భావన కలిగిస్తుందీ దృశ్యం. అందుకే ఈ పాట మరపురాని గీతం అయింది. తనవారి వల్ల దెబ్బ తగిలినప్పుడల్లా సాంత్వననిస్తుంది.
(‘అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం’ పాటను యూట్యూబ్‌లో చూడవచ్చు:
https://www.youtube.com/watch?v=U5XkB8nwmq4 )
నేపథ్యంలో వినిపించే గీతాల అవసరం ఒక రకంగా ఇప్పటి సినిమాల్లో వేరు. ఒకప్పుడు సినిమాల్లో ఇవి గంభీరమైన సన్నివేశాలు, విషాద సన్నివేశాలలో అవసరమౌతాయి. ‘సుజాత’ సినిమాలో ఇరువురి హృదయాలలో ప్రేమ జనించే సందర్భంలో నేపథ్య గీతం వినిపించి ఆ దృశ్యాన్ని అమరం చేశాడు బిమల్ రాయ్.
సున్ మేరే బంధూరే, సున్ మేరే మిత్‌వా
సున్ మేరే సాథీరే
ఎస్డీ బర్మన్ నేపథ్య గీతాలు, తాత్వికత ఉన్న గీతాలే పాడేవాడు. తన పాటలు ఏ నటుడిపై చిత్రించవద్దన్న నిబంధన విధించేవాడు. అందుకే ఆయన పాటలు ప్రత్యేకంగా నిలుస్తాయి, ‘గైడ్’ లో ‘వహాఁ కౌన్ హై తెరా’, ‘బందీనీ’లో ‘మెరె సాజన్ హై ఉస్ పార్’, ‘ఆరాధన’లో ‘కాహే తూ రోయే’, ‘అమర్ ప్రేమ్’ లో ‘డోలీ మే బిఠాయ్ కే కహార్’, ‘ప్రేమ్ పూజారి’లో ‘ప్రేమ్ కే పూజారీ హమ్ హై’.. ఇలా ఎస్డీ బర్మన్ నేపథ్య గీతాల స్పెషలిస్ట్ గాయకుడిగా నిలిచాడు. అతని పాటలన్నీ ఉచ్చస్థాయి గేయరచనతో, అత్యున్నత భావాలతో ఉంటాయి.
ఇటీవలి కాలంలో కైలాష్ ఖేర్ ‘వైసా భీ హోతా హై 2’లో పాడిన నేపథ్య గీతం చాలా చక్కనిది.
టూటా టూటా ఏక్ పరిందా ఐసే టూటా
కే ఫిర్ జుడ్ నా పాయా
లూటా లూటా కిస్నే ఉస్కో ఐసే లూటా
కే ఫిర్ ఉడ్ నా పాయా
గిరతా హువా వో ఆసమాన్ సే
ఆకర్ గిరా జమీన్ పర్
ఖ్వాబోం మే ఫిర్ భీ బాదల్ హీ థే
వో కహ్తా రహా మగర్
కే అల్లాహ్ కే బందే హస్ దే
జో భీ హో కల్ ఫిర్ ఆయేగా
అల్లాహ్ కే బందే హస్ దే
జో భీ హో కల్ ఫిర్ ఆయేగా
(‘టూటా టూటా ఏక్ పరిందా ఐసే టూటా’ పాటను యూట్యూబ్‌లో చూడవచ్చు:
https://www.youtube.com/watch?v=KSwd2fYX9vg )
నేపథ్య గీతాలు తరిగిపోవడం ఏ ఒక్క నేపథ్య గీతం వ్యక్తపరచలేని విషాదం.
(మళ్ళీ కలుద్దాం).
