Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మధురగీతాలు – మనోహరదృశ్యాలు-38

[సంచిక కోసం ‘శంతనూ – శర్మిష్ఠ’ ప్రత్యేకంగా రచిస్తున్న సినిమా పాటల శీర్షిక.]

ఇంతకన్న మంచి పోలికేది నాకు తట్టలేదు గానీ అమ్ము..
ఈ లవ్వనేది బబులు గమ్ము.. అంటుకున్నాదంటే పోదు నమ్ము..
ముందు నుంచి అందరన్నమాటే గానీ మళ్లీ అంటున్నానే అమ్ము..
ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము.. ప్రేమనాపలేవు నన్ను నమ్ము..
ఎట్టాగా అనే ఎదురు చూపుకి తగినట్టుగా నువ్వు బదులు చెబితివే..
ఓరి దేవుడా ఇదేందనేంత లోపటే పిల్లడా అంట దగ్గరై నన్ను చేరదీస్తివే..
బుట్టబొమ్మా బుట్టబొమ్మా నన్ను సుట్టుకుంటివే..
జిందగీకే అట్టబొమ్మై జంట కట్టుకుంటివే

ఒక అయిదారేళ్ల క్రితం తెలుగు సినీ ప్రేమికులనందరినీ, ముఖ్యంగా కథనాయకుడు అల్లు అర్జున్ అభిమానులందరినీ ఊర్రూతలూపేసిన, ఈ పాట ‘అలవైంకుఠపురంలో’ సినిమాలోనిది. ఇటీవలి కాలంలో పాటలకు ‘సందర్భం’ అన్నది ప్రత్యేకంగా సృజించే పద్ధతి తగ్గిపోయింది. స్క్రిప్టు ఆధారంగా పాటలకు సందర్భాలను ఏర్పాటు చేసి పాటలను కథలో అంతర్భాగం చేయటం అడుగంటి పోయింది. అసలు కథ అన్నది మిథ్యావస్తువయిపోయింది.  పాటలు అర్థవంతంగా ఉండి పాత్రల వ్యక్తిత్వలను ప్రతిబింబిస్తూ సినిమా కథనానికి ఊపునివ్వటం అన్నది దాదాపుగా అంతరించింది. పాటలో పదాలకు అర్థం ఉంటుందన్న ఆలోచన అదృశ్యమై పదాలు రైమ్ అయితే చాలు. ‘అర్థమెవడికి కావాలి?’ “ఔచిత్యమేమిటసలు?” అన్న ధోరణి అధికంగా కనిపిస్తున్నది. అయినా పాటలు, హిట్,  సూపర్ హిట్ అయి ప్రేక్షకులను ఉర్రూతలూపటం వెనుక హీరో ఇమేజ్, పాట బాణీతో పాటు చిత్రీకరణలు అత్యంత ప్రధానమైన పాత్ర పోషిస్తున్నాయి.

ముఖ్యంగా ‘చిత్రీకరణ’ ఇటీవలి కాలంలో సందర్భం స్థానాన్ని ఆక్రమించింది. హీరో ఇమేజ్‌కి తగ్గట్టు శరీరాన్ని ఊపే రీతిలో నటనను సృజించే ‘కొరియోగ్రాఫర్’,  ‘నృత్యదర్శకుడి’ ప్రాధాన్యం హెచ్చింది. సందర్భం అవసరం లేదు. పాటలో సాహిత్యం ఊసు అక్కరలేదు. లయబద్ధంగా ఉండాలి. హీరో ఇమేజ్‌కి తగ్గట్టు నృత్యం ఉండాలి. గతంలో  ప్రతి హీరోకీ కొన్ని సెప్టులుండేవి. ఎన్టీరామారావు స్టెప్పు, ఏఎన్నార్ స్టెప్పు, కృష్ణ స్టెప్పులా,  ఆ హీరో ఆ స్టెప్పు వేస్తే ప్రేక్షకులు సంతృప్తి పడేవారు. కనక వర్షం కురిపించేవారు.

కానీ ఇప్పుడు ప్రతి సినిమాకూ హీరో అంతకు ముందు ఎవ్వరూ వేయని ప్రత్యేకమైన స్టెప్పులు వేయాల్సి వస్తోంది. దానితో కొరియోగ్రాఫర్ల  బాధ్యత పెరిగింది. ఇలా, ప్రతి సినిమాలో వినూత్నమైన డాన్స్ స్టెప్పుల ద్వారా ప్రేక్షకులను అలరించి, అభిమానులకు సంతృప్తినిచ్చే నటుల్లో అల్లు అర్జున్ ఒకడు. ‘బుట్టబొమ్మా’ పాట చిత్రీకరణ సమకాలీన తెలుగు సినిమాల్లో హీరో ఇమేజ్‌కి తగ్గట్టు పాట, చిత్రీకరణలు  ఉండాల్సిన స్థితికి చక్కటి నిదర్శనం.

సందర్భం మామూలే. హీరో హీరోయిన్ల నడుమ ప్రేమ ఉందని నిర్ధారణ అవుతుంది. హీరో పట్ల తన ప్రేమను నాయిక ప్రదర్శిస్తుంది. అంతే పాట ఆరంభమవుతుంది. మణిరత్నం ఎంటివీ  తరహా దృశ్య శకలావళి సంకలన చిత్రీకరణపై తెర తీసినప్పటి నుంచీ పాటల చిత్రీకరణ స్వరూపం మారిపోయింది. ఒక పాట చిత్రీకరణ అనేక దృశ్యాల సమాహారం అయింది. ఆ పంథానే అనుసరిస్తుందీ పాట చిత్రీకరణ.

పాట చిత్రీకరణ మొత్తం ఒక సెట్‌లో జరుగుతుంది. ఈ పాట చిత్రీకరణలో గమనించాల్సిన ప్రధానాంశాలు నాయకుడి నృత్య కదలికలు. అయినా వాటిని ప్రదర్శించటంలో అత్యద్భుతమైన ప్రజ్ఞను ప్రదర్శిస్తుంది  కెమేరా పనితనం.

పాట పలు చిన్న చిన్న దృశ్యాల సంకలనం కాబట్టి, పాటలో ‘బుట్ట బొమ్మా’ అన్న పదం ఉంది కాబట్టి పాట ఆరంభంలోకి సూచనగా తెరపై కీచైన్ బొమ్మను క్లోజప్పులో చూపిస్తారు. ప్రిల్యూడ్ సంగీతం ఆరంభమవుతుండగానే తెరపై నాయకుడు కనిపిస్తాడు. గోడకు కూర్చున్న నాయకుడు కీచైన్ తిప్పుతూ కూర్చున్న వాడు లేచి నిలబడతాడు. కూర్చుంటాడు. అలా కూర్చుని నిలబడుతూ  లయబద్దంగా కాళ్లు కదపటం నృత్యం.

ఈ పాట చిత్రీకరణలో కెమేరా పనితనం అడుగడుగునా కనిపిస్తుంది. ముఖ్యంగా కొరియోగ్రఫీ, గొప్పతనాన్ని ప్రస్ఫుటం చేసే రీతిలో కెమేరా పనితనాన్ని నిర్దేశించటంతో పాట కన్నులకు విందుగా అనిపిస్తంది. పాటలో పదాలు నచ్చకపోవచ్చు. బాణీ నచ్చకపోవచ్చు.  హీరో హీరోయిన్లు నచ్చకపోవచ్చు. కానీ తెరపై శుభ్రంగా చక్కగా అలరించే రంగులతో, కనబడుతున్న దాన్ని మరింత అందంగా చూపించే లైటింగ్‌తో, కనబడే దృశ్యాన్ని చూసి ఆనందించకుండా, అభినందించకుండా ఉండటం కష్టం.

ఈ పాట ఆరంభ దృశ్యం గమనిస్తే ‘ఫోర్‌గ్రౌండ్’లో ఉన్న హీరో స్పష్టంగా కనిపిస్తుంటాడు. నేపథ్యమంతా బూజు బుజూగా (diffused) ఉంటుంది. ఇలా తెర ముందున్నది స్పష్టంగా కనిపిస్తూ, నేపథ్యంలోది బూజుగా కనిపించేట్టు చేసే ప్రక్రియను shallow Depth of Field or shallow Focus technique అంటారు. ఈ ఇలాంటి చిత్రీకరణా  తెరపై కనబడే దృశ్యానికి ఒక అందమైన కలలాంటి లక్షణాన్నిస్తుంది. ఈ పాటలో కావాల్సినది అదే. పాట మొత్తం ఒక కలలాంటి భావన కలుగుతుంటుంది. సెట్లలో వాడిన రంగులు, నాయికానాయకుల దుస్తుల రంగులూ అన్నీ ఇదే భావనను కలిగించే రీతిలో ఉంటాయి. అందుకే పాట ఓ స్వప్నలోకంలో ఉన్న భావననిస్తుంది. ఇలాంటి ఎఫెక్టును ‘BOKEH EFFECT’ అంటారు.

పాట ఆరంభమయ్యే సమయానికి నాయిక వదనాన్ని క్లోజప్పులో చూపే సమయంలో కూడా చుట్టూ   గలాబీపూలు, ఇతర రంగులు ఈ ‘స్వప్నలోక’ భావనను బలపరుస్తాయి. ఇక పాట మొత్తం కెమేరా ‘డైనమిక్ ట్రాకింగ్ షాట్’, మీడియం ఫుల్ షాట్స్ మధ్యలో స్టడీకామ్ పనితనం, దృశ్యం తరువాత దృశ్యం వెంటనే రావటం వంటి  ఎడిటింగ్ టెక్నిక్కులతో , దృశ్యం పాట లేకుండా నిశ్శబ్దంగా చూస్తూన్నా  అలరించే రీతిలో రూపొందింది.

సాధారణంగా, మన పాటల చిత్రీకరణలో, పాట లేకుండా కేవలం దృశ్యాలను చూస్తే, వాళ్ల కదలికలు హాస్యం కలిగిస్తాయి. పిచ్చివాళ్ల చేష్టల్లా అనిపిస్తాయి. కానీ ‘బుట్టబొమ్మ’ దృశ్యాలను పాట లేకుండా చూసినా, అవి అందంగా అనిపిస్తాయి. ఇందుకు కారణం కెమేరా పనితనం.

కెమేరా తరువాత కొరియోగ్రఫీ, ముఖ్యంగా అల్లు అర్జున్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన స్టెప్స్ అల్లూ అర్జున్ ప్రత్యేకతను నిరూపిస్తూ, పాటనూ ప్రత్యేకంగా నిలుపుతాయి.  స్టెప్సు అందమైన దృశ్యాలే ‘అద్భుతమైన పాట’ అనుకునే వారందరినీ త్పపకుండా అలరిస్తాయి. ముఖ్యంగా కెమేరా హీరో కదలికలను వీలయినంత స్పష్టంగా దృష్టిపథం నుండి ఏ మాత్రం ఏమారకుండా చూపించటంతో హీరో అభిమానులకు ఆనందం అధికమౌతుంది. అంత వరకూ ఇలాంటి భావన లేని వాడూ హీరో ‘ఫాన్’ అయ్యే వీలూ కలుగుతుంది.

పాటలో కొరియోగ్రాఫర్ హీరో కోసం ప్రత్యేకమైన స్టెప్పులను రూపొందించాడు. కూర్చుని లేవటం, లేచి కూర్చోవటం, బెంచిపై కూర్చుని పక్కకు కదలటం, బండి మీద నుంచి జారి చంద్రమండలంలో నడిచినట్టు నెమ్మదిగా పెద్ద అంగలు వేయటం, మెట్ల మీద కాలు పెట్టి, ఎగిరి రెయిలింగ్ నుంచి జారటం, ఇలా అడుగడుగునా హీరో ప్రతి కదలికను ఒక నవ్యమైన నృత్య భంగిమగా, నృత్య కదలికగా రూపొందించటం చూడవచ్చు. ఇంకా ‘ఫ్లూట్ హ్యండ్స్’ స్టెప్పు, అక్కడక్కడా ఆలోచిస్తున్న ఫోజు, క్రాస్ స్టెప్పింగ్ ఇలా ఎన్నెన్నో స్టెప్పులను ఎంతో జాగ్రత్తగా ఏర్పాటు చేశారు. అయితే అన్నటికన్నా, ‘బుట్టబొమ్మా’ అన్నప్పుడు ఒక చేతి ‘అభయ ముద్ర’లో, మరో చేయి ‘వరదముద్ర’తో  ఉంచి నడుమును బొమ్మలా తిప్పే  స్టెప్పు ఈ పాటకు ప్రత్యేక గుర్తింపు నిచ్చింది. తరువాత ఈ స్టెప్పు వేయటం నేర్పే వీడియోలు ఎన్నో వచ్చాయి.

ఈ పాట కోసం రూపొందించిన స్టెప్పుల్లో ‘డస్టింగ్ ఆఫ్ఫ్ స్టెప్ ’(Dusting off step) అంటే దుమ్ము దులుపుకునే స్టెప్పు కూడా ఉంది. అటూ ఇటూ నడుస్తూ తల పై దమ్ము దులుపుకుంటున్నట్టు చేయటం అన్నమాట. ‘కత్తెర స్టెప్పు’ కూడా పాటలో భాగమే. ఇలా అనేకానేక చిత్ర విచిత్రమైన స్టెప్పులతో కూడుకుని ఉన్న  పాట ప్రజలను ఆకర్షించటంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే హీరోయిజం ప్రదర్శననే సినిమా అన్న అభిప్రాయంతో ఎదిగిన తరాలకు   అసలు ‘సినిమా’ అంటే ఏమిటో, ‘ఔచిత్యం’ అంటే ఏమిటో అవగాహన ఉండటం కష్టం. వారికి హీరోఇజమే అర్ధమవుతుంది.  కాబట్టి వ్యక్తిత్వం లేని పాత్రల వ్యక్తిత్వం లేని గీతాల ఔచిత్యం లేని చిత్రీకరణలనే ఉత్తమ ‘కళ’గా భావించటంలో వారి  తప్పులేదు.

‘మందార మకరంద మాధుర్యమున తేలు మధుపమ్ము వోవునే మదనములకు’.

తెలుగు సినిమా హీరోలు, స్టార్లు గుడ్డివాళ్లను చేసే ధగధగల వెలుతురు దాటి ‘సినిమా’ను మానవ జీవితాన్ని ప్రతిబింబించే కళాత్మక ప్రక్రియగా ప్రేక్షకులు గుర్తించనంత వరకూ ‘గుడ్డిలో మెల్ల’ లాంటి కళాప్రదర్శననే ‘వృక్షాల్లేని చోట’ చందాన మెచ్చుకోవాల్సిన దానిని  మెచ్చుకుంటూ, ఉన్న దాంట్లో మంచిని చెప్తూ ముందుకు సాగుతుండాల్సి ఉంటుంది.

ప్రేమను బబుల్‍గమ్‌తో, చెప్పకుండా వచ్చే తుమ్ము తో పోల్చటమే సృజనాత్మకపుటాలోచనలకు పరాకాష్ఠ అనుకుంటే ఈ సినిమాలో మరో పాటలో ‘చిల్డు బీరు మెరిసినట్టు, పొట్లం గట్టిన బిర్యానికి బొట్టు బిళ్ళ పెట్టినట్టు’న్న చందమామ ఆగం చేసి పానం తీయటం ఇంకా గొప్ప పరాకాష్ఠ. ఔచితీరహిత, అర్ధరహిత ఆలోచనలే సాహిత్యం అనుకునే తరాలు ఈ సాహిత్యాన్ని ఆదరించటంలో ఆశ్చర్యంలేదు.   కానీ అందంగా చిత్రీకరించిన కెమేరామేన్, చక్కని స్టెప్పులు కూర్చిన కొరియోగ్రాఫర్, పాట లయబద్ధంగా ఉండి శరీరాన్ని ఊపే బాణీని రూపొందించిన సంగీత దర్శకుడినీ, అశ్లీలంగా అనిపించని రీతిలో పాటను రూపొందించిన దర్శకులను అభినందించక తప్పదు.

~

‘బుట్టబొమ్మా బుట్టబొమ్మా’ పాటని యూట్యూబ్‌లో చూడవచ్చు:
(https://www.youtube.com/watch?v=2mDCVzruYzQ )

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version