[సంచిక కోసం ‘శంతనూ – శర్మిష్ఠ’ ప్రత్యేకంగా రచిస్తున్న సినిమా పాటల శీర్షిక.]
దిల్ కే ఝరోకే మే తుఝ్‌కో బిఠాకర్
యాదోం కో తేరీ మై దుల్హన్ బనాకర్
రఖూంగ మై దిల్ కే పాస్
మత్ హో మెరీ జాన్ ఉదాస్
(‘దిల్ కే ఝరోకే మే’ పాటని యూట్యూబ్‌లో చూడవచ్చు.
https://www.youtube.com/watch?v=zxtp-DuwuGE )
‘బ్రహ్మచారి’ సినిమాలో ఈపాట హిందీ సినిమాపాటల ‘స్వర్ణయుగం’లో అత్యుత్తమ పియానో పాటకు అతి చక్కని తార్కాణం. ఒక రకంగా చూస్తే, పియానో పాటల ప్రాధాన్యం తగ్గిపోయేముందు, గుప్పున వెలిగిన ఉత్కృష్ట దీపశిఖ లాంటిదీపాట.
హిందీ సినీ సంగీత ప్రపంచంలో 1950-60 దశకం, పియానో పాటలకు స్వర్ణయుగం. అంతకు ముందు చక్కటి సూపర్ హిట్ పియానో పాటలు వచ్చాయి. వాటి కోసం చక్కటి సందర్భాలను సృష్టించారు. కానీ అధికంగా పియానో పాటలు ప్రేమ వ్యక్తీకరణ పాటలే.
మిల్తే హి ఆంఖే దిల్ హువా దివానా కిసీకా
అఫ్సానా మెరా బన్ గయా, అఫ్సానా కిసీకా..
తలత్ మహమూద్ సుతిమెత్తని పూరేకులాంటి స్వరం, శంషాద్ బేగం బంగారు గంట లాంటి స్వరం కలసి ఈ పాటను మరపురాని పాటగా నిలిపాయి.
దాంతో ‘పియానో’ అన్నది ప్రేమ పాటల పేటీగా మారింది.
మై దిల్ హు ఎక్ అర్మాన్ భరా
తూ ఆకె ముఝే పహెచాన్ జరా
‘కోరికలు నిండిన నా హృదయాన్ని గుర్తించు’ అంటూ రాజ్ కపూర్ నర్గీస్ పై తన ప్రేమను ప్రతీకాత్మకంగా ప్రకటించింది ‘అన్‌హోనీ’ సినిమాలో పియానో పైనే.
(‘మై దిల్ హు ఎక్ అర్మాన్ భరా’ పాటని యూట్యూబ్‌లో చూడవచ్చు.
https://www.youtube.com/watch?v=NaUFkc09fgI )
మై ఖుష్ నసీబ్ హుఁ, ముఝ్ కో కిసీ కా ప్యార్ మిలా
బడా హసీన్ మెరే దిల్ కో రాజ్‌దార్ మిలా
పియానోపై ఈ అందమైన పాట పాడుతూ అజిత్, షకీలాపై ‘టవర్ హౌస్’ అంతటి తన ప్రేమను అతి మధురంగా ప్రకటించాడు. ఇదే పాటను లత గొంతులో షకీలా, తిరిగి అజిత్‌కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తుంది.
ఇలా ప్రేమ ప్రకటనకు చక్కని మాధ్యమంగా ఎదిగిన పియానో పాటలు సినిమా వ్యాపార విలువలను పెంచటంతో, ఏ మాత్రం అవకాశం ఉన్నా సినిమాలో పియానో పాటలు అనవాయితీ అయ్యాయి. పియానో పాట కోసం ఓ పుట్టినరోజు పాట ఉండేది. అంతకు ముందు కానీ తరువాత కానీ పియానో సినిమాలో కనబడదు.
‘బచ్పన్ కే దిన్ భీ క్యా దిన్ థే’, ‘తుం జియో హజారో సాల్‘ (సుజాత), ‘బార్ బార్ దిన్ యే ఆయే’ (ఫర్జ్) వంటి పాటలు పుట్టినరోజులను పాటల మయం చేశాయి. పుట్టినరోజు పాటలకు మరో కోణాన్ని చూపించింది ‘ఏక్ ఫూల్ దో మాలి’ సినిమా పాట.
హీరో సంజయ్ ఖాన్, సాధన ప్రేమించుకుంటారు. నాయిక గర్భవతి అవుతుంది. నాయకుడు మరణించాడనుకుంటారు. ఆ సమయంలో పిల్లలు పుట్టే అవకాశం లేని బాల్రాజ్ సహానీ పాత్ర అన్నీ తెలిసి సాధనను వివాహమాడుతుంది. అంతా ఆనందంగా సాగుతున్న తరుణంలో హీరో మళ్లీ వస్తాడు. పిల్లవాడి పట్ల ఆకర్షితుడవుతాడు. అతడికి తప్ప అందరికీ ఆ పిల్లవాడికి తండ్రి హీరోనే అని తెలుసు. ప్రేక్షకులకూ తెలుసు. దాంతో పుట్టిన రోజు, ఆనందంగా పాడే బదులు ‘నీ పట్ల ఎందుకు ఆకర్షితుడవుతున్నానో తెలియదు. నీ పట్ల ఎందుకు ప్రేమ కలిగిందో తెలియదు. నిన్ను చూడకుండా ఎందుకు ఉండలేక పోతున్నానో, నిన్ను దగ్గర తీసుకోవాలని ఎందుకనిపిస్తుందో’ అంటూ పాట పాడితే సన్నివేశం పండుతుంది. డ్రమటిక్ ఎలిమెంట్ పెరుగుతుంది. కెమేరా, మాటిమాటకీ గిల్టీగా భావిస్తూ తల దించుకుంటున్న వాళ్లని చూపిస్తుంటే పాట ఇంకా బాగా నచ్చుతుంది.కానీ ఆనందకరమైన సందర్భంలో విషాదకరమైన పాటపాడటం ఔచిత్యమా? అన్న ప్రశ్న రానివ్వవు, సందర్భం, రఫీ స్వరం, పాట భావాలు.
ఓ నన్హే సే ఫరిష్తే తుఝ్ సే యే కైసా నాతా
కైసే యే దిల్ కె రిష్తే
పాటను మహమ్మద్ రఫీ పరమాద్భుతంగా పాడేడు. సూపర్ హిట్ అయింది.
తన మనసులో బాధను మహ్‌ఫిల్‍లో ప్రకటించేందుకు కూడా ‘దో బదన్’ సినిమాలో హీరో పియానోను, రఫీ గొంతును ఎంచుకుంటాడు.
భరీ దునియా మె అఖిర్ దిల్ కో సమ్‌ఝానే కహా( జాయెఁ
మోహబ్బత్ హో గయీ జిన్‌కో వో దివానే కహా( జాయేఁ
తాను గర్భవతినయ్యానని, పిల్లవాడు తమ జీవితంలో అడుగు పెట్టబోతున్నాడని తెలిసి అతడిని పియానో పాటతో అహ్వానిస్తుంది సురేఖా పండిత్ ‘అనుపమ’ సినిమాలో.
ధీరే ధీరే మచల్ ఏయ్ దిల్-యే-బేకరార్
కోయీ ఆతా హై
యూఁ తడప్‌కే న తడపా ముఝే బార్ బార్
కోయీ ఆతా హై..
(‘ధీరే ధీరే మచల్ ఏ దిల్-యే-బేకరార్’ పాటని యూట్యూబ్‌లో చూడవచ్చు.
https://www.youtube.com/watch?v=e3RiMIAZ1vY&t=2s )
తానెంత ప్రయత్నించినా, రాయిలా ఎలాంటి భావాలు కనబరచకుండా స్పందన లేకుండా ఉన్న నాయికను ‘ఉసీ కే సామ్‌నే ఉస్‌కీ షికాయత్ కా ఇరాదా హై’ అంటూ అద్భుతమైన పాట పియానో పాట పాడతాడు నాయకుడు ‘హమ్‌రాజ్’ సినిమాలో.
కిసీ పత్థర్ కీ మూరత్ సే ముహబ్బత్ కా ఇరాదా హై
పరస్థిష్ కీ తమన్నా హై, ఇబాదత్ కా ఇరాదా హై
‘రాతిమూర్తి’ని ప్రేమిస్తున్నాడట అతడు.
రాతి మూర్తిని ప్రేమిస్తున్నానని ఒకాయన గర్వంగా, కవితాత్మకంగా ప్రకటిస్తూంటే, మరో ప్రేమికుడు పియానో వాయిస్తూ ‘అయ్యో! ఎంత తప్పు చేశాను నేను? ఏమనుకున్నాను? ఏం తెలుసుకున్నాను? రాతి లాంటి ప్రేయసిని ప్రేమించి? ఆమెను ప్రేమ దేవతగా భావించి?’ అని గొంతెత్తి గానం చేశాడు ‘పథ్థర్ కే సనం’ సినిమాలో ‘ పథ్థర్ కె సనం తుఝే హమ్నే ముహబ్బత్ కా ఖుదా జానా” అని రోదిస్తూ.. రెండూ షికాయత్ పాటలే! రెంటిలో ఎంత తేడా!
పియానో పాట ద్వారా దేవ్ ఆనంద్ ‘మాయ’ సినిమాలో ఐశ్వర్యవంతమైన జీవితం పట్ల తన నిరసనను తెలుపుతాడు. హృదయమున్న మనిషి లభించని ఆ జీవితం తనది కాదని ప్రకటిస్తాడు. ‘హై తో సనం, లేకిన్ పథ్థర్ కే సనం యహా(” అంటూ ‘ మహఫిల్ యే నహీ తెరీ దీవానే కహీన్ చల్’ అని ఆ వాతావరణాన్ని వదలి వెళ్లిపోవాలన్న నిర్ణయాన్ని పాట ద్వారా తెలుపుతాడు.
కోయి సోనే కె దిల్‌వాలా, కోయి చాందీ కే దిల్‌వాలా
శీషే కా హై మత్‌వాలే తెరా దిల్
మహఫిల్ యే నహీ తెరీ, దీవానే కహీఁ చల్
(‘కోయి సోనే కె దిల్‌వాలా’ పాటని యూట్యూబ్‌లో చూడవచ్చు.
https://www.youtube.com/watch?v=Z1AeQmwRoyg )
ఇదే దేవ్ ఆనంద్, ‘దునియా’ సినిమాలో పియానోపై పాట ఆరంభించి, గది అంతా నాయకను వెంబడిస్తూ ‘ప్రేమ తత్వం నీకేం తెలుసు? ’ అని ప్రశ్నిస్తూ పాటపాడతాడు.
ఫల్సఫా ప్యార్ తుమ్ క్యా జానో
తుమ్ నే కభీ ప్యార్ న కియా
కభి ఇంతజార్ న కియా..
(‘ఫల్సఫా ప్యార్ తుమ్ క్యా జానో’ పాటని యూట్యూబ్‌లో చూడవచ్చు.
https://www.youtube.com/watch?v=g8t76WtSNIY )
అయితే, ఓ పియానో పాట ద్వారా ఇద్దరు నాయికలనూ తాను ప్రేమిస్తున్నాన్న భ్రమ వాళ్లల్లో కలిగిస్తాడు ‘తీన్ దేవియాఁ’ సినిమాలో ఇదే దేవ్ ఆనంద్. నిజానికి ఇది ‘అందాజ్’ సినిమాతో ఆరంభమయింది. తరువాత అందరూ దాన్ని అనుసరించారు. ‘డర్ న మొహబ్బత్ కర్లే‘ అంటూ ఇద్దరు నాయికలు నాయకుడి గురించి పాడితే, ‘తూ కహే అగర్’ అంటూ ‘నువ్వు అడిగితే జీవితమంతా నీకు పాట వినిపిస్తూనే ఉంటాన’ని ఒక నాయికతో హీరో అంటూంటే, మరో నాయికకు నిజం అర్ధమయి బాధ పడుతుంది. అదే పియానో దగ్గర దేవ్ ఆనంద్ ‘తీన్ దేవియాన్’ లో ఇద్దరి దేవీల ముందు పాట పాడితే ఇద్దరూ ఎవరికి వారు తన గురించి అనుకుంటారు. చుట్టూ ఉన్నవారు ఇద్దరి గురించి అనుకుంటారు.
ఖ్వాబ్ హో తుమ్ యా, కోయీ హఖీకత్
కోన్ హో తుమ్ బత్‌లావో
దేర్ సె కిత్ నీ దూర్ ఖడీ హో
ఔర్ కరీబ్ ఆ జావో..
(‘ఖ్వాబ్ హో తుమ్’ పాటని యూట్యూబ్‌లో చూడవచ్చు.
https://www.youtube.com/watch?v=Jw4wLVnFJ-E )
ఇలాంటి భ్రమలే కలిగిస్తాడు ధర్మేంద్ర ‘బహరేఁ ఫిర్ భీ ఆయేంగీ’ సినిమాలో పరమాద్భుతమైన పియానో పాటతో.
ఆప్ కే హసీన్ రుఖ్ పే ఆజ్ నయా నూర్ హై
మేరా దిల్ మచల్ గయాతో మేరా క్యా కుసూర్ హై..
(‘ఆప్ కే హసీన్ రూఖ్ పే’ పాటని యూట్యూబ్‌లో చూడవచ్చు.
https://www.youtube.com/watch?v=iiP8GF6iQFs )
ఇప్పుడు తాము ప్రేయసి ప్రియులం కాదు, పరిస్థితి మారింది. కాబట్టి ‘అపరిచితులమైపోదాం’ అంటూ ఆమె భర్త ముందే నాయికను హెచ్చరిస్తాడు సునీల్ దత్ ‘గుమ్రాహ్’ సినిమాలో. ఈ పాట చిత్రీకరణ కన్నా పాటలో సాహిర్ పొదిగిన సున్నితమైన భగ్న ప్రేమికుల సార్వజనీనమైన భావనలు, జీవిత సత్యాల వల్ల అమరగీతంగా మిగిలింది.
చలో ఏక్ బార్ ఫిర్సే
అజ్‌నబీ బన్ జాయేఁ హమ్ దోనోం
తన గేయ రచనా సంవిధానంతో పాటను మరపురాని పాటగా ‘సాహిర్’ ఎదిగించిన మరో పియానో పాట ‘ఆద్మీ ఔర్ ఇన్‍సాన్’ లోని పాట.
జిందగీ ఇత్తెఫాక్ హై
కల్ భీ ఇత్తెఫాక్ థీ, ఆజ్ భీ ఇత్తెఫాక్ హై
(‘జిందగీ ఇత్తెఫాక్ హై’ పాటని యూట్యూబ్‌లో చూడవచ్చు.
https://www.youtube.com/watch?v=_ZIcJyCVKqY )
‘చలో ఏక్ బార్ ఫిర్సే’ పాట ప్రేరణతో అలాంటి సన్నివేశంలోనే ముకేష్ తన స్వరంలో ప్రపంచంలోని ఆక్రోశమంతా నింపి, పియానో వద్ద కూర్చున్న హీరో కోసం ‘ఆబ్రూ’ సినిమాలో పాడిన సూపర్ హిట్ విషాద గీతం ‘జిన్హే హమ్ భూల్ నా చాహే, వో అక్సర్ యాద్ అతే హైఁ’.
‘ది మాన్ హు న్యూ టూ మచ్’ లో ‘కే సెరాసెరా’ పాటతో కిడ్నాపర్లను పట్టుకునే వీలు నాయిక కల్పించినప్పటి నుంచీ అలాంటి సందర్భాలు మన సినిమాలలో బోలెడన్ని సృజించారు. ‘ప్యార్ కా మౌసమ్’ సినిమాలో నాయికకు గుడ్ బై చెప్పేందుకు హీరో ‘తుమ్ బిన్ జావూ కహాఁ’ అని విషాదంగా పాడుతూంటే, ఆపాటవిని ‘పిచ్చిదాని’గా ముద్ర వేసి బంధించి ఉన్న అమ్మ బయటకు వస్తుంది..
తాను ప్రేమించిన అమ్మాయి తన స్నేహితుడిని ప్రేమించిందని తెలియక ఆమెని వివాహం చేసుకుని, పియానో దగ్గర కూర్చుని హీరో ‘ఆద్మీ’ సినిమాలో ‘కైసీ హసీన్ బహరోం కీ రాత్ హై’ అంటూ పాడతాడు. స్నేహితుడు కూడా మహేంద్ర కపూర్ గొంతుతో గొంతు కలుపుతాడు పక్కనే ఉన్నా విషాదంతో, సినిమాలో మాత్రమే. బయట రికార్డులో తలత్ మహామూద్ గొంతుతో పాడతాడు విషాదంగా.
‘తక్దీర్’ సినిమాలో భరత్ భూషణ్ పిల్లలను పడుకోబెట్టేందుకు పియానో వాయిస్తూ ‘జబ్ జబ్ బహార్ ఆయే’ అనే మధురమైన గీతాన్ని మహమ్మద్ రఫీ స్వరంతో పాడతాడు. మళ్లీ అందరూ వేరైన తరువాత పిల్లలు పాడే ఈ పాటతోటే వారిని గుర్తిస్తాడు భరత్ భూషణ్. పెద్ద అయిన తరువాత పిల్లలు పాడే పాటను ఇక్కడ వినండి.
తన స్నేహితుడి ఇంటికి వచ్చిన హీరో, తన ప్రేయసి ఆ స్నేహితుడి సోదరి, ఇంకా నిద్రిస్తున్నదని తెలుసుకుని ‘నువ్వు నిద్రలేస్తే, నా అదృష్టం కూడా నిద్ర లేస్తుంద’ని పియానోపై పాట పాడతాడు ఎంతో మధురంగా, ‘మేరే మహబూబ్’ సినిమాలో.
ఏయ్ హుస్న్ జరా జాగ్ తఝే ఇష్క్ జగాయె
బద్‌లే మెరి తక్దీర్ జో తూ హోష్ మే ఆయె
పాట చిత్రీకరణ సాధారణంగా ఉంటుంది. కానీ, పాట మధ్యలో నాయిక లేచి వచ్చి పరదా చాటు నుండి పాట వింటుంటుంది. పాట వింటున్న అన్నయ్య లేచి పియానో దగ్గరకు రాగానే నాయిక చల్లగా అక్కడి నుంచి జారుకోవటం ఈ పాట గుర్తొచ్చినపుడల్లా గుర్తు వస్తుంది. పెదవులపై చిరునవ్వు నిలుపుతుంది.
(‘ఏయ్ హుస్న్ జరా జాగ్’ పాటని యూట్యూబ్‌లో చూడవచ్చు.
https://www.youtube.com/watch?v=1O6DmnrNn14 )
‘సంగం’ సినిమాలో రాజ్ కపూర్ పియానో పాటలకు తలమానికం అనదగ్గ రెండు పాటలను అందించాడు. సినిమా కథ, పాత్రలు, వ్యక్తిత్వాలను సర్వం తెలిపే పాట ‘హర్ దిల్ జో ప్యార్ కరేగా, వో గానా గాయేగా’ పియానో, అకార్డియన్‍ల పాట. ముక్కోణపు ప్రేమ కథను మూడు చరణాల్లో చెప్పేస్తుంది. తెరపై చూపిస్తుంది. ఈ సినిమాలో అసందర్బంగా అనిపించే, అతి గొప్ప సందర్భంలో పియానోపై రాజ్ కపూర్ ‘దోస్త్ దోస్త్ న రహా’ అనే చేదు జీవిత సత్యాలను, నమ్మకద్రోహాలను మరపురాని రీతిలో చెప్పే పాట పాడతాడు. ఈ పాట పాడే సందర్భంలో నాయకుడికి నాయికపై అనుమానం ఉండదు. కానీ ‘యద్భావం తద్భవతి’ అన్న సత్యాన్ని తరువాత సినిమా నిరూపిస్తుంది.
స్వీయ సంగీత దర్శకత్వంలో కిశోర్ కుమార్ ‘దూర్ కా రా. హీ’ సినిమాలో సులక్షణా పండిట్‌తో కలసి అద్భుతమైన పాట పాడేడు. ‘బేకరార్ దిల్ తూ గాయే జా’ పాట చిత్రీకరణ కూడా సస్పెన్స్ కలిగిస్తూ, సినిమా పట్ల ఆసక్తి పెంచుతుంది. ఈ పాట కిషోర్ కుమార్ పాడితే అశోక్ కుమార్ నటిస్తాడు. అతి అరుదైన సందర్భం ఇది.
‘షరారత్’ సినిమాలో పియానో పాట ‘ అజబ్ హై దాస్తాన్ తెరీ ఐ ఏయ్ జిందగీ‘ ద్వారా నాయకుడు నాయిక అపోహను తొలగిస్తాడు, వదినను ఉద్దేశ్యించి ‘తుమ్ ఆయి మా కి మమతా లియేతో ముస్కురాయె హమ్’ అని పాడుతూ. ఈపాట రఫీ అద్భుతంగా పాడేడు, కిశోర్ కుమార్ కోసం!
‘షగూన్’ సినిమాలో నివేదితపై చిత్రీకరించిన సాహిర్ పాట ‘తుమ్ అప్నా రంఝ్-ఓ -ఘమ్’ ఎన్నటికీ మరపురాని పాట. నటి నివేదిత ముద్దుమొహం, జగ్జీత్ కౌర్ విలక్షణమైన స్వరంతో పియానోపై ఈ పాట పాడుతుంటే, నాయికా నాయకుల హృదయాలను కాదు ప్రేక్షకులను రంపంతో కోస్తున్నట్టుంటుంది. ఈమెను వివాహం చేసుకోవాల్సిన హీరో, నాయికను వివాహం చేసుకుంటాడు. కానీ వారిద్దరికీ కుదరదు.
వో దిల్ జో మైనే మాంగా థా మగర్ గైరోం నే పాయా థా
బడీ షై హై అగర్ ఉస్‌కీ పషేమానీ ముఝే దేదో
కానీ, ఈపాటలో వెలిబుచ్చిన భావాలు ప్రతి పురుషుడు తన స్త్రీ తన కోసం ప్రదర్శించాలని కోరుకుంటాడు. అతడి కష్టాలూ, కన్నీళ్ళూ, ఆందోళనలూ తనకు ఇచ్చేయమని అడుగుతున్నదామె. తెలుగులో ‘నేనున్నానని నిండుగపలికే తోడు’ ను కోరితే, హిందీలో అలాంటి తోడు ‘నేనున్నా’నంటోంది.
మై దేఖూం తో సహీ దునియా తుమ్హే కైసే సతాతీహై
కోయీ దిన్ కే లియే అప్నీ నిగేహ్ బానీ ముఝే దేదో
పురుషుడు తానెంతో బలశాలినని అహంకరిస్తాడు కానీ, బాల్యంలో తల్లి రక్షణ, ఎదిగిన తరువాత భార్య తోడు లేకపోతే, అసంపూర్ణుడిగానే మిగిలిపోతాడు. దారి తప్పి గుడ్డివాడి ప్రయాణం చేస్తూనేవుంటాడు జీవితాంతం. అందుకే, ఆమె అతడి ‘నిగేహ్ బానీ’ ( సంరక్షణ) ను తనకు అప్పగించమంటుంది.
మరపురాని అర్ధవంతమయిన గేయాలు రాశాడు సాహిర్.
అయితే 1960 దశకంలో పియానో పాటలెన్నో సూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా ‘లవ్ ఇన్ టోక్యో’ సినిమాలో ‘ముఝే తుమ్ మిల్ గయే హమ్‌దమ్’ పాట అత్యంత మధురమైనది. నాయికా నాయకుల వివాహం నిశ్చయమౌతుంది. సంతోషంతో నాయకుడు పియానో వాయిస్తుంటే, నాయిక పాటందుకుంటుంది. పాట మధ్యలో పిల్లవాడిని విలన్ ఎత్తుకుపోయి బెదిరిస్తాడు. అదే పాట బాణీ మార్చకుండా భావం మారుతుంది.
ఉధర్ దిల్ హై ఇధర్ జాన్ హై
అజబ్ ముష్కిల్ కా సామాన్ హై
లబోం పర్ ముస్కురాహట్ హై
మగర్ సాసోం మే తూఫాన్ హై
‘సాజన్ బినా సుహాగన్’ లోని పియానో పాట ‘మధుబన్ ఖష్బూ దేతా హై’; ‘బడే దిల్‌వాలా’ లోని పియానో పాట ‘జీవన్ కే దిన్ చోటే సహీ’; ‘కస్మే వాదే’ సినిమాలో ‘ఆతే రహేంగీ బహారే’; ‘మాయా మేమ్‌సాబ్’ సినిమా ‘ఖుద్‌సే బాతే కర్తే రహెనా’; ‘మేరీ జంగ్’ సినిమాలో జీవితం ప్రతి క్షణం ఒక యుద్ధం అని తెలిపే కీలకమైన పాట ‘జిందగీ హర్ కదమ్ ఎక్ నయీ జంగ్ హై’; ‘గర్దిష్’ సినిమాలో ‘యే మేరా దిల్ తో పాగల్ హై’; ‘అకేలే హమ్ అకేలే తుమ్’లో ‘దిల్ మేరా చురాయా క్యూ’; ‘ఖామోషీ’లో ‘మౌసమ్ కీ సరగమ్ కో’; ‘పరిణీత’లో ‘పియు బోలే పియా బోలే’; ‘సాజన్’ సినిమాలో ‘బహుత్ ప్యార్ కర్తే హై తుమ్ కో సనమ్’; ‘అంధాధున్’ సినిమాలో ‘నైనా దా క్యా ఖసూర్’ వరకూ పియానో పాటలు ఎన్నెన్నో రూపాలు ధరించాయి. ఎన్నెన్నో మధురమైన మరపురాని గీతాలను పియానోపై అందించాయి. హీరోయిన్‌కు బాధ కలిగితే పియానో ‘కీస్’ నొక్కతూ ‘తెరా జానా’ అంటూ పాడింది. హీరోకు ప్రేమ వస్తే ‘దిల్ హై కి ధడక్తా రహాతా హై’ అన్నాడు. లేకపోతే ‘ఝూమ్ కే గా యూఁ ఆజ్ మెరే దిల్’ అని గొంతెత్తి పాడేడు. ప్రేమను ప్రకటించేందుకు ‘దీవానోం సే యే మత్ పూఛో’ అన్నాడు. సినీ కళాకారులు ‘గీత్ గాతా హుఁ మై గున్‌గునాతా హుఁ మై’ అని ప్రతిజ్ఞ పట్టినట్టు అత్యద్భుతమైన పియానో పాటలు సృజించారు. ఎక్కడికి వెళ్లినా ఏం చేస్తున్నా మనను వదలకుండా వెంట ఉండి ఆనందింప చేసి ‘తూ జహా జహా చలేగా మెరా సాయా సాథ్ హోగా’ అనేటటువంటి పియానో పాటలను సృజించారు.
హిందీ సినీ సంగీత ప్రపంచంలోని పియానో పాటల గురించి చర్చించాలంటే ఓ పుస్తకమే రాయాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రస్తావించినవి కొన్ని పాటలే. ఇంకా ఎన్నో మరపురాని మధురమైన గీతాలున్నాయి. వీటన్నిటి చిత్రీకరణలో పెద్ద ప్రయాస అవసరం లేదు. ఎలాగో పియానో పాటలు అర్థవంతమూ, భావాత్మకమూ కాబట్టి పాట భావం ఎవరికి సరిపోతుందో వారిని చూపిస్తే సరిపోతుంది. కాని రెండు పాటల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సి ఉంటుంది.
‘బ్రహ్మచారి’ సినిమాలో ‘దిల్ కే ఝరోకే మే’ పాట సందర్భం మామూలే అయినా పాటలో పొదిగిన భావాలు, శమ్మీ కపూర్ నటన, మహమ్మద్ రఫీ గానం పాట స్థాయిని ఎంతో ఎత్తుకు పెంచుతాయి. నాయిక వేరేవాడిని పెళ్లి చేసుకుంటుంటే హీరో ఆమెపై తరగని తన ప్రేమను ప్రకటిస్తూ పాడే పాటే అయినా పాటలో హస్రత్ ప్రదర్శించిన భావాలు , ఆ భావాలకు రఫీ గొంతు హై పిచ్‌లో ప్రాణం పోసిన విధానం, శమ్మీ కపూర్ నటన పాటను మదిలో స్థిరపడే పాటగా ఎదిగించాయి. ముఖ్యంగా పాటలో వాడిన ఆర్కెస్ట్రా అద్భుతం. ఒక సింఫొనీకి ఏ మాత్రం తీసిపోని స్థాయిలో వినిపిస్తాయి వయోలిన్లు. వయోలిన్లు విహ్వలంగా, విషాదంతో భోరున గొంతెత్తి ఆక్రోశిస్తున్నట్టు, దానికి పియానో ఆగ్రహావేశ దుఃఖ విషాదాలు తోడవుతాయి. Fury of Violins and Piano అని ఓ విశ్లేషకుడు ఈ పాట ఆర్కెస్ట్రాను అభివర్ణించాడు. అవి రఫీ గొంతుతో పోటీ పడుతున్నట్టుంటాయి ‘త్రిగళ్ బందీ’లా.
మేరీ ముహబ్బత్ కో ఠుక్‍రాదే చాహే,
మై కోయీ తుఝసే నా షిక్వా కరూంగా
ఆంఖోం మే రహతీ హై తస్వీర్ తేరీ,
సారీ ఉమర్ తేరీ పూజా కరూంగా
‘కళ్లల్లో ఆమె రూపం నిలుపుకుని జీవితాంతం ఆమెని పూజిస్తూంటాడట’. ఏరీ అలాంటి ప్రేమికులీనాడు? అలాంటి మృదువైన లోతైన భావనలేవీ? అలాంటి తీవ్రమైన ప్రేమ ఏదీ? సినిమాల్లో పియానోతో పాటూ ఇలాంటి సున్నిత భావనలు కూడా అదృశ్యమైపోయాయి.
ఇలాంటి భావననే కలిగిస్తుంది. ‘ఆర్జూ’లో పియానో పాట ‘అజీ రూఠ్‌కర్ అబ్ కహాఁ జాయీయెగా, జహాఁ జాయీయెగా హమే పాయీయెగా’.
ఈ పాట ఆరంభంలో పియానో అద్భుతంగా వినిపిస్తుంది. తరువాత పాటంతా సాక్సోఫోన్ మరోలోకానికి లాకేళ్తుంది. లతా స్వరంతో పోటీపడుతుంది. చిలిపిగా నవ్వుతూ, ధీమాగా ‘నన్ను వదలి ఎటు పోతావోయ్’ అని ప్రేమ పట్ల విశ్వాసాన్ని ప్రకటిస్తున్న సాధన అందానికి నిర్వచనంలా ఉంటుంది. ఈ పాటలో గమనించాల్సింది లతా పాడిన విధానం.
అజీ లాఖ్ పర్దోమ్ మే చుప్ జాయీయేగా
నజర్ ఆయీయెగా, నజర్ ఆయీయెగా
లత హైపిచ్‌కి వెళ్లటం ఒక ఎత్తయితే, అక్కడ భావం స్ఫురింపచేస్తూ అలంకారాలు వేయటం మరో ఎత్తు. మానవ మాత్రులెవరూ పాడలేరలాగ. ముఖ్యంగా ‘పర్దోమే’ అని రెండుమార్లు అనటంలో తేడాను గమనిస్తే చాలు, లతా భక్తులైపోయేందుకు. పాట ప్రతి పదంలో లత స్వరం అల్లరి చేస్తూనే ఉంటుంది. నాయికుడిని ఛాలెంజ్ చేస్తూనే ఉంటుంది. నటి చేయాల్సిందల్లా ముఖంలో ఆ భావం ప్రదర్శించటం. అంతే..
ఈ పాటను మళ్లీ రఫీ ఒక చరణం పాడతాడు. అక్కడ పియానో ఉండదు. కానీ పాట చిత్రీకరణ రొమాంటిక్ గా ఉంటుంది.
యే కైసా నషా హై, యే కైసా అసర్ హై
నా కాబూ మే దిల్ హై, నా బస్ మే నజర్ హై
జరా హోష్ ఆ లే, చలే జాయీయెగా
ఠహర్ జాయీయెగా, ఠహర్ జాయీయెగా
(‘అజీ రూఠ్‌కర్ అబ్ కహాఁ జాయీయెగా’ పాటని యూట్యూబ్‌లో చూడవచ్చు.
https://www.youtube.com/watch?v=yXTEkxnlOtk )
సూర్యాస్తమయంలో, సూర్యాస్తమయ రంగులు అలంకరించుకున్న సరస్సు నీటిలో, ‘సిల్హౌట్’గా రెండు పడవలు వదలలేక వదలలేక వదలి వేరయి వెళ్తుంటాయి. ఆ అద్భుత దృశ్యాన్ని చూస్తూ, వదలలేక వదలలేక ఎన్నెన్నో.. పియానో పాటలను వదలి ముందుకు సాగాల్సి ఉంటుంది.
‘అజీ హమ్ సే బచ్కర్‘ పాటను ఇక్కడ చూడవచ్చు. సుందరమైన, సున్నితమైన శృంగార భావనల సరస్సు నీటిపై , హృదయ నౌకలో విహరించవచ్చు. మహమ్మద్ రఫీ స్వరంలోని నషా నూ, దాని అసర్ నూ అనుభవిస్తూ, హోష్ పోగొట్టుకుని బ్రహ్మానందాన్ని అనుభవించవచ్చు.
(మళ్ళీ కలుద్దాం)
