Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మధురగీతాలు – మనోహరదృశ్యాలు-49

[సంచిక కోసం ‘శంతనూ – శర్మిష్ఠ’ ప్రత్యేకంగా రచిస్తున్న సినిమా పాటల శీర్షిక.]

ఉడ్ జా కాలే కావాఁ తేరే ముహ్ విచ్ ఖండ్ పావాఁ
లే జా తూ సందేశా మేరా, మై సద్‌కే జావా

‘గదర్ – ఏక్ ప్రేమ్ కథ’ మొదటి భాగం లోని ఈ పాట విడుదలయినప్పటి నుంచీ ఈనాటి వరకూ ఏ మాత్రం ప్రజాదరణ తగ్గకుండా ప్రజలను అలరిస్తూనే ఉంది. ఎంతగా అంటే, 2023లో, మొదటి భాగం వచ్చిన 22 ఏళ్ల తరువాత రెండవ భాగం నిర్మించినప్పుడు, ఈ పాట లేకుండా సినిమాను ప్రేక్షకులు ఊహించలేనంతగా.  రెండవ గదర్‌లో కూడా ఈ పాట తప్పనిసరిగా వినిపించారు. మహమ్మద్ రఫీ, కిశోర్ కుమార్‌ల మరణం తరువాత,పాత కాలపు సంగీత దర్శకులు అదృశ్యమైన తరువాత రూపొందిన పాటలలో    iconic పాటగా ఎదిగిన అరుదైన పాటలలో అగ్రస్థానంలో ఉంటుందీ పాట.

ఉదిత్ నారాయణ్, గాయకుడిగా, అత్యుత్తమ స్థాయిలో పాడిన పాట ఇది. ఉదిత్ నారాయణ్ గానానికి పర్యాయపదంగా నిలుస్తుందీ పాట. ఎన్నెన్ని హిట్ పాటలు వస్తున్నా, ప్రేక్షకులను ఉర్రూతలూపుతున్నా   ‘ఉడ్ జా కాలే కావాఁ’ పాట మాత్రం ప్రేక్షకాదరణలో ఉన్నత శిఖరం పైనే ఉంటుంది.

‘గదర్ – ఏక్ ప్రేమ్ కథ’ దేశ విభజన కాలం నాటి సినిమా. విభజన సమయంలో భారత్‌లో మిగిలిపోయిన ముస్లిం యువతిని రక్షించి, ప్రేమలో పడి వివాహమాడతాడు ‘తారాసింగ్’. పాకిస్తాన్‌లో ఉన్న ఆమె తండ్రికి అమ్మాయి బ్రతికి ఉన్నదని తెలియగానే అమ్మాయిని పాకిస్తాన్ పిలిపించుకుని నిర్భంధించి, మళ్లీ పెళ్లి చేయాలని ప్రయత్నిస్తాడు. పిల్లవాడిని వెంట తీసుకుని భార్యను వెతుకుతూ పాకిస్తాన్ చేరతాడు తారాసింగ్. పాకిస్తాన్‌లో పోరాటాలు జరిపి భార్య పిల్లవాడితో క్షేమంగా భారత్ చేరటం టూకీగా సినిమా కథ.

ఈ సినిమాలో ‘ఉడజా కాలే కావాఁ’ పాట మూడు విభిన్నమైన సందర్భాలలో వస్తుంది. ఇలా ఒకే పాటను సినిమాలో విభిన్నమైన సందర్భాలలో వినిపించటం మన సినిమాలకు కొత్త కాదు. ఇలా సినిమా అంతా వినిపించే పాటలు హిట్ కావటం కూడా కొత్త కాదు. ‘తక్దీర్’ సినిమాలో ‘జబ్ జబ్ బహర్ ఆయీ’ పాట ముందు పిల్లలను నిద్రపుచ్చుతూ తండ్రి పాడతాడు. ఎదిగిన తరువాత పిల్లలు పాడతారు. ‘ప్యార్ కా మౌసమ్’ సినిమాలో ‘తుమ్ బిన్ జావూ కహాఁ’ పాటను ముందు తండ్రి పాడతాడు అదే పాటను ప్రేయసిని మురిపిస్తూ కొడుకు పాడతాడు. చివరిలో, తల్లిని గుర్తించేందుకు మళ్లీ అదే పాట కొడుకు పాడతాడు.’ మేరీ జంగ్’ సినిమాలో ‘జిందగీ హర్ కదం ఎక్ నయీ జంగ్ హై’, ‘ప్యార్ ఝక్తా నహీ’ సినిమాలో ‘ తుమ్ సే మిల్కర్, నా జానే క్యూం’ పాటలు మూడు సార్లు వేర్వేరు సందర్భాలలో వస్తాయి.

‘యాదోం కీ బారాత్’ సినిమాలో ‘యాదోం కీ బారాత్ నిక్లీ హై ఆజ్’ పాట ముందు తల్లి పాడుతుంది. తరువాత తిరిగి గాయకుడైన పిల్లవాడు ప్రతి ‘షో’ ముందు ఆ పాట పాడి ఎవరైనా పాటను గుర్తుకు పడతారేమోనని ఎదురు చూస్తాడు. చివరలో ఈ పాట పాడుతున్నప్పుడు ఓ సోదరుడు ఆ పాట అందుకుంటాడు. ఇలా ఒకే పాట సినిమాలో రెండు మూడు మార్లు, వేర్వేరు సందర్భాలలో రావటం, ప్రేక్షకులను అలరించటం కొత్త కాదు. ‘సాజన్’ సినిమాలో ‘బహుత్ ప్యార్ కర్తే హై తుమ్ కో సనమ్’ పాట కూడా మూడు ప్రధాన పాత్రలు వేర్వేరుగా పాడతాయి.

గదర్ సినిమా వచ్చేసరికి  చిన్నప్పుడు తప్పిపోవటం, పాట ద్వారా కలవటం అన్న పద్ధతి పాతదై అదృశ్యమయిపోతోంది. ఇప్పుడు కుటుంబాలు చిన్నప్పుడు తప్పిపోవటం లేదు. సినిమాల్లోంచి కుటుంబాలు దాదాపుగా అదృశ్యమై పోయాయి. సినిమాల్లోంచి ‘టాండెమ్’ పాటలు, అంటే నాయిక ఒకసారి, నాయకుడు ఒకసారి ఒకే పాటను పాడటం కూడా దాదాపుగా అదృశ్యం అయిపోయాయి. అంటే, ఒకప్పటి ఆదరణ పొందిన ప్రక్రియను గదర్ పునర్మించిందన్నమపాట.

‘గదర్’ సినిమాలో మూడు భిన్న సందర్భాలలో ఈ పాట వస్తుంది. ఈ సందర్భాలు కూడా కొత్తవి కావు. మొదటిసారి, నాయిక కాలేజీలో పాడతాడు హీరో. ఉత్సాహంగా, ఆనందంగా, ఆడుతూ పాడుతాడు. సంతోషంగా ఉంటుందీ పాట.

రెండోసారి ఇదే పాట పాడేసరికి వివాహం అవుతుంది. నాయిక కోరికను అనుసరించి పాట పాడుతాడు. నాయిక స్వరం కలుపుతుంది. పాటను వాళ్ళ పిల్లవాడు పూర్తి చేస్తాడు.

మూడోది విషాద సందర్భం. నాయికకు బలవంతంగా పెళ్లి చేస్తుంటారు. ఆ సమయంలో హీరో, కొడుకుతో పాడతాడు. పాట విని తప్పించుకుని వచ్చిన నాయిక పాట అందుకుంటుంది. విషాదగీతం ప్రేమ విప్లవ గీతంలా మారిపోతుంది. చివరికి ఆనంద గీతంలా నిలుస్తుంది.

ఈ మూడు సందర్భాలలో పాట బాణీ ఒకటే. వాయిద్యాలలోనూ పెద్దగా మార్పు లేదు. మూడవ సందర్భంలో తప్పించి పదాలలో తేడా లేదు. కానీ ఈ పాట ఇంతగా హిట్ అయ్యేందుకు తోడ్పడతాయి సందర్భోచితమైన గేయ రచన, గానం, చిత్రీకరణలు. ఈ మూడూ కలగలసి పాటను ఉన్నత స్థాయిలో నిలుపుతాయి.

ఈ సినిమా దేశ విభజన కాలానికి సంబంధించింది కావటంతో గేయ రచయిత, సంగీత దర్శకులు పాటను రూపొందించటంలో గొప్ప చమత్కారం చేశారు. దేశ విభజన సమయంలో పంజాబ్, హర్యానా, ఇప్పుడు పాకిస్తాన్ ఉన్న పశ్చిమ పంజాబ్ లన్నీ కలసి ‘పంజాబ్’‌గా చలామణీ అయ్యేవి. విభజన తరువాత పంజాబ్, హర్యానాలు తూర్పు పంజాబ్‌లా 1966 వరకూ చలామణీ అయ్యీయి. పంజాబ్, హర్యానా, రాజస్థాన్‍లకు దగ్గర సంబంధం ఉంది. అందుకని ఆ కాలంలో పంజాబ్, హర్యానా ప్రాంతాలలో ఎంతో ప్రచారంలో ఉన్న జానపద గీతం ‘ఉడ్ జా కాలే కావాఁ తేరే ముహ్ విచ్ ఖండ్ పావాఁ’ను పల్లవిలోకి తీసుకున్నారు. ఈ పాటకు signature tune లా, సారంగిని తలపించే ‘రావణహట్ట’ వాయిద్యాన్ని వాడేరు. ఇది రాజస్థాన్‌కు చెందిన జానపదుల వాయిద్యం. దాంతో పాటకు అటు పాతకాలపు వాసన, ఇటు, ఈకాలపు రంగు రెండూ అబ్బేయి.

గేయ రచయిత విభజన ముందు ఈ ప్రాంతానికి చెందినవాడే కావటంతో ఈ పాటకు పల్లవిలో అప్పటి జానపదగీత  పాదాన్ని వాడటం స్వాభావికం. దాన్ని కొనసాగిస్తూ, ‘లేజా తూ సందేశా’తో పల్లవిని పూర్తి చేశాడు. దాంతో పాట జానపదగీతంలా అలరిస్తుంది. పంజాబ్ ప్రాంతంలో కాకి అశుభసూచకం కాదు. సంతోషం కలిగితే కాకి నోరు తీపి చేస్తామంటారు. కాకి సందేశాలు మోసుకొస్తుందని నమ్ముతారు. ముఖ్యంగా ప్రేమ సందేశాలు.

పాటకు ముందు ‘రావణహాట్ట’ వాయిద్యం మోగుతుంది. ఈ వాయిద్యం మేవార్, జోధ్‌పూర్ ప్రాంతాలలో జానపద గీతాలలో విరివిగా వాడతారు. ఈ వాయిద్యం శ్రీలంకకు చెందింది అంటారు. వయోలిన్‌కు ‘తల్లి’ లాంటిదీ వాయిద్యం.ఈ వాయిద్య స్వరం సారంగిని పోలివుంటుంది. రొమాన్స్, విషాదం కలసి ధ్వనిస్తాయి.  అటు జానపద పదాలు, వాయిద్యం, బాణీ కలగలసి పాటను ఈ లోకానికి చెందని అద్భుతమైన పాటగా భావించేట్టు చేస్తాయి. అందుకే ఈ పాటను కేవలం ‘రావణహట్ట’పై వాయించినా అద్భుతం అనిపిస్తుంది. సినిమా హంగులు లేకుండా జానపదులు పాడేట్టు పాడినా అద్భుతం అనిపిస్తుంది. అందుకే ఈ పాట అటు పంజాబ్ లోనూ, ఇటు రాజస్థాన్ లోనూ ఈనాటికీ వీధి వీధినా మార్మ్రోగుతున్నది.

రాజస్థాన్ వీధుల్లో ఉడ్జా కాలే కావా

 

‘నల్లకాకి నోరు తీపి చేయటం’ అన్నది పంజాబుకు ప్రత్యేకమైన సామెత. కాకితో సందేశం పంపటం అక్కడి జానపద గాథలతో ముడిపడి ఉంటుంది. దాంతో ఈ పాట వింటుంటే, మామూలు సినిమా పాట వింటున్నట్టు అనిపించదు. అందుకే శరీరాన్ని దాటి, హృదయలోతుల్లో దూరి అక్కడి కూడా అంగుళ పరిమాణంలో ఉన్న దాన్ని సృశిస్తుందీ పాట. ఇదంతా ప్రిల్యూడ్ సంగీతం, పల్లవిలోనే జరిగిపోతుంది. ఇక్కడే కళాకారులు ఘన విజయం సాధించారు. సినిమా పాటను హృదయాన్ని కదిలింపచేసేంత శక్తివంతమైన సంగీతంగా మలచారు.

పాటను కాలేజీలో పాడినప్పుడు కాలేజీ బయట మెట్లపై, మైదానంలో పాడతాడు హీరో. అందరూ యువతుల నడుమ పాడతాడు. ఆ ఉత్సాహం వేరు. అప్పుడు వాయిద్యాలు అదే బాణీలో ధ్వనించినా, వాటి నుండి వెలువడే ఉత్సాహం వేరు. గాయకుడి స్వరంలో దొర్లే అత్యుత్సాహం వేరు. సందర్భంలో గాయకుడిగా ఉదిత్ నారాయణ్ పరిణతి స్పష్టమవుతంది. పదాలను ఉత్సాహంగా పలకటం, పట్టి పట్టి, అమ్మాయిలను చూస్తే యువకుడిలో కలిగే ఉత్సాహాన్ని పదాలు ధ్వనించేట్టు పలకటం, ఊపిరిపై నియంత్రణ వంటివి సులభంగా తెలుస్తాయి.

కెమెరా కూడా చక్కటి వెలుతురుతో నాయకుడిని, నాయకను చూపుతూ ఆనందకరమైన వాతావరణాన్ని ప్రదర్శిస్తుంది.

(‘ఉడ్ జా కాలే కావాఁ’ వెర్షన్ 1 యూట్యూబ్‌లో:
https://www.youtube.com/watch?v=mzNc6qxUqpo )

రెండవసారి పాట గదిలో ఆరంభమవుతుంది. నాయిక వివాహపు దుస్తుల్లో ఉంటుంది. ఇప్పుడు ప్రిల్యూ‌డ్ సంగీతం బాణీ అదే అయినా రొమాన్స్ ఉట్టి పడుతుంది. గాయకుడి స్వరంలో గతంలోని ఉత్సాహం స్థానాన్ని ఇప్పుడు శృంగారం ఆక్రమిస్తుంది. ఇంతకు ముందు పలికిన పదాలే ఇప్పుడు పలికే విధానం మారిపోతుంది. ఉచ్చారణలోనే వాటి అర్థం మారిపోతుంది.

బాగోం మే ఫిర్ ఝూలే పడ్ గయె
పక గయే మిఠాయాఁ అంచియాఁ
యే ఛోటీ సీ జిందగీ తే
రాతాం లంబియా లంబియా
ఓ ఘర్ ఆజా పరదేశీ,
కి తేరీ మేరీ ఏక్ జిందగీ

మొదటిసారి పాడినప్పుడు ప్రేమ ఋతువు వస్తున్నదన్న భావన కలుగుతుంది. ఇప్పుడు పాడేప్పుడు ప్రేమ ఋతువు వచ్చేసిందన్న భావన కలుగుతుంది. అప్పటి ఉత్సాహం, ఇప్పుడు ఆనందంలా ధ్వనిస్తుంది.

ఛమ్ ఛమ్ కర్తా ఆయా మౌసమ్
ప్యార్ కే గీతోం కా
రాస్తే పే అఖియా రస్తా దేఖీ, బిఛ్‌డే మీతోం కా
సారీ సారీ రాత్ జగాయె ముఝ్‍కో తేరీ యాదేఁ
మేరె సారే గీత్ బనె మేరె దిల్ కీ పరియాదేఁ

పాటలో పదాలు, భావాలు మామూలే. చిత్రీకరణలో సంఘటనలే ప్రాధాన్యం, భావ ప్రదర్శన కన్నా.  కానీ గాయనీ గాయకులు పదాలలో పలికించిన భావం పాటకు చిక్కదనం అపాదిస్తుంది. పాట వింటుంటే ఎంతో ఆనందం కలుగుతుంది. పాటలో వాడిన హార్మోనియం, తబలా, ఢోలక్, బాన్సురీ, వయెలిన్లు, చెల్లోలు, గిటార్లు, synth pad లు పాటను ఒక అందమైన కలగా మలుస్తాయి. అందుకే చూస్తుంటే కన్నా వింటుంటే పాట మరో లోకాలకు తీసుకువెళ్తుంది.

‘ఓ ఘర్ ఆజా పర్‌దేశీ’ నుంచీ ‘తేరి మేరి ఏక్ జిందగీ’ వరకూ పాటలో మళ్లీ మళ్లీ వస్తూ ఉత్సాహాన్ని ఇనుమడింప చేస్తుంది. సంగీత దర్శకుడు ఉత్తమ్ సింగ్, ఈ పాటను ‘పీలూ’ రాగంలో రూపొందించాడు. పంజాబీయులకు అత్యంత ప్రియమైన రాగం ఇది. పంజాబీలకు పీలూ ప్రాధాన్యం పవిత్రమైన ‘గురుగ్రంథ్ సాహెబ్’ వల్ల తెలుస్తుంది. గురుగ్రంథ్ సాహిబ్‌లో కీర్తనలలో  వాడిన 31 రాగాలలో ‘పీలూ’ లేదు. కానీ కీర్తనల సాంప్రదాయ బాణీల నడుమ వాటిని కలిపేందుకు ‘పీలూ’ రాగం వాడతారు. ఉదయం పాడే ‘ఆసా’ కీర్తనలు, సాయంత్రపు ‘సోరథ్’ కీర్తనలు, ‘తిలాంగ్’ రాగంలోని కీర్తనల నడుమ ‘శబద్’ (శబ్దం) లా వినిపిస్తారు ‘పీలూ’ రాగాన్ని. ఆ రాగం ఆధారంగా ఈ పాటను రూపొందించటంతో పాట మరింత ఆకర్షణీయమవటమే కాదు అర్థవంతం అయింది కూడా.

(‘ఉడ్ జా కాలే కావాఁ’ వెర్షన్ 2 యూట్యూబ్‌లో:
https://www.youtube.com/watch?v=Sdb7xpdBRtU )

మూడోసారి పాట వినిపించేది గంభీరమైన సన్నివేశం. ఇప్పుడు ఉదిత్ నారాయణ్ పదాలను పలికే తీరు మారుతుంది. ఇప్పడు ఆవేశం, ఆగ్రహం, ఉద్విగ్నతలు స్వరంలో ధ్వనిస్తుంటాయి. నిస్సహాయత కూడా తెలుస్తుంటుంది. పాట బాణీ మారలేదు.  నేపథ్యంలో ఆనందంగా పెళ్లి నృత్యాలు చేస్తుంటారు. ఆ నృత్యాల లయను అనుసరిస్తూ విషాదం ధ్వనించేలా రూపొందించారు పాటను. సన్నివేశం వల్ల పాట ఆర్ద్రంగా ధ్వనిస్తుంది కూడా. ఇప్పుడు రాగం కూడా ఆగ్రహంలా ధ్వనిస్తుంది.

కిత్నీ దర్ద్ భరీ హై తేరి మేరి ప్రేమ్ కహానీ
సాత్ సముందర్ జిత్నా అప్నీ ఆంఖోం మే హై పానీ
మై దిల్ సే, దిల్ ముఝ్‌సే కర్తా హై జత్ తేరి బాతేఁ
సావన్ అనేసే పహలే హో జాతీ హై బర్సాతేఁ

ఈ బాణీలో ఆనంద్ బక్షి లోని ‘కవి’ తొంగిచూస్తాడు. సముద్రంలో ఎన్ని నీళ్లున్నాయో కళ్లల్లో అన్ని నీళ్లున్నాయట. ఆమెను తలచుకుంటే వర్ష ఋతువు కన్నా ముందే వర్షాలు కురుస్తాయట! బాణీ మారలేదు. సందర్భం మారింది. పదాలు మారాయి. భావం మారింది. గాయకుడి స్వరం పలికే భావం మారింది. చుట్టు పెళ్లి నృత్యాలు. మధ్యలో విషాదావేశం.

పాట చిత్రీకరణలో ఉద్విగ్నత కలిగించేందుకు ఆమె తండ్రికి హీరో గురించి తెలుస్తుంది. ఆ నాయికను బంధిస్తారు. పాట విని ఆమె తలుపులు విరగొట్టి వచ్చేస్తుంది. తనూ పాట అందుకుంటుంది.

పర్వత్ కితనే ఊంచే కితనే గహరే హోతే హైం
కుఛ్ మత్ పూఛో ప్యార్ పే కితనే, పహరే హోతే హైఁ
ఇష్క్ మే జానే క్యా హో జాతా హై యే రబ్ హీ జానే
తోడ్ కే సారీ దీవారేఁ మిల్ జాతే హైఁ దీవానే

ప్రేమ ఎత్తులు లోతులు అడ్డంకులు అన్నీ చూపించి  అన్నీ దాటుకుని, అధిగమించి,  విరిచి తీసుకుపొమ్మంది నాయిక. తీసుకుపోతాడు నాయకుడు.

మొత్తం సినిమా ఈ పాట చుట్టు తిరుగుతుందన్న మాట. అందుకే పలు సందర్భాలలో నేపథ్యంలో, కొన్నిసందర్భాలో నేపథ్యంలో  కూడా ‘ఉడ్‌జా  కాలే కావాఁ’ బాణీ వివిధ వాయిద్యాలతో వినిపిస్తూనే ఉంటారు. సమ్మోహనమైన బాణీ. అమోఘమైన పాట ఇది. విన్న కొద్దీ మరింత వినాలనిపిస్తుంది. వింటూనే ఉండాలనిపిస్తుంది.

(‘ఉడ్ జా కాలే కావాఁ’ వెర్షన్ 3 యూట్యూబ్‌లో:
https://www.youtube.com/watch?v=YJ70xDuUlt8 )

ఈ పాట ప్రజల హృదయాలలో ఎంతగా స్థిరపడిపోయిందంటే 2023లో గదర్ రెండవ భాగం నిర్మిస్తున్నప్పుడు ఈ పాట లేని సినిమాను ఊహించలేకపోయారు. కానీ పాటను రాసేందుకు ఇప్పుడు ఆనంద్ బక్షి లేడు. ఉత్తమ్ సింగ్ సంగీతం ఇవ్వటం లేదు. ఉదిత్ నారాయణ్‌కు 65 ఏళ్లు. అయినా సరే, ఉదిత్ నారాయణ్‌తో ‘ఉడ్‌జా కాలే కావాఁ’ను పాడించారు. సినిమాలో నాయికా నాయకులు నడివయసు వారు.  పిల్లవాడు వేరే ప్రాంతంలో చదువుకుంటుంటాడు. కాబట్టి గదర్-2 ‘ఉడ్‍జా’ పాటలో ఉద్వేగం, ఉత్సాహం, శృంగారం వంటివి ఉండవు. పరిణతి చెందిన భావన ధ్వనిస్తుంటుంది. కొండ దాటి మైదాన ప్రాంతంలో నిండుగా ప్రవహిస్తున్న నది గతిలో ఉంటుంది పాట.

పాట చిత్రీకరణ కూడా చక్కగా ఉంటుంది. హీరో కూర్చుని పాడతాడు. నాయిక లయబద్ధంగా నృత్యం చేస్తుంటుంది. లైటింగ్ కూడా నడివయస్సును సూచిస్తూ మరీ వెలుగుతుండదు. మరీ చీకటిగా ఉండదు. అదీ గాక పాట వింటూన్న ప్రతి వారికీ 2001లో ఇదే పాట విన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. పాత పాట మాధుర్యం ఇంకా స్వచ్ఛంగా ఉంది. వెన్నాడుతూనే ఉంది. దాంతో గదర్-2 లోని ‘ఉడ్‌జా కాలే కావాఁ’ కూడా అద్భుతంగా అనిపిస్తుంది. 65 ఏళ్ల వయసులో కూడా ఉదిత్ నారాయణ్ స్వరం స్వచ్ఛంగా, బలంగా పరిణతి చెంది వినిపిస్తూ ఆకర్షిస్తుంది. పాటను తిరిగి రూపొందించిన వారు కూడా ఎలాంటి పిచ్చి వేషాలు వేయకుండా పాత పాట పంథాలోనే చక్కగా పాటను రూపొందించారు.

(గదర్-2 లోని ‘ఉడ్‌జా కాలే కావాఁ’ యూట్యూబ్‌లో:
https://www.youtube.com/watch?v=7VppHj0Rue0 )

అందుకే గదర్-2 మొదటి భాగాన్ని మించి హిట్ అయింది. పైగా 2001కీ, 2023కీ నడుమ ప్రజల మారిన దృక్కోణాన్ని, సామాజిక పరిస్థితులను ప్రతిబింబిస్తూ, ప్రేక్షకులు దేశభక్తి నినాదాలు చేస్తూ సినిమాను చూస్తూ ఆనందించారు. “నువు మీ దైవం చూపిన దారిలో ప్రయాణిస్తే ‘గజ్వా-ఎ-హింద్’ కాదు, ‘జజ్బా-ఎ-హింద్’ గురించి మాట్లాడుతావు” అన్న డైలాగ్ ఈనాటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంది. ‘గజ్వా-ఎ-హింద్’ అంటే భారతదేశంపై దాడి. ‘జజ్బా-ఎ-హింద్’ అంటే హిందూ దేశాన్ని ఉత్సాహపరచటం, పొగడటం. అన్ని  తాత్కాలిక ఆవేశాలు, రాజకీయాలు అన్నిటినీ దాటి నిలుస్తుంది కేవలం  ఉత్తమ సాహిత్యంతో కలగలసిన ఉత్తమ  సంగీతం. అది నిరూపిస్తుంది  ‘ఉడ్‍జా కాలే కావాఁ తేరే ముహ్ విచ్ ఖండ్ పావాఁ’ పాట.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version