[సంచిక కోసం ‘శంతనూ – శర్మిష్ఠ’ ప్రత్యేకంగా రచిస్తున్న సినిమా పాటల శీర్షిక.]
మాతృత్వం లోనే ఉంది ఆడజన్మ సార్థకం
అమ్మా అనిపించుకొనుటే స్త్రీమూర్తికి గౌరవం
1972లో విడుదలయిన ‘కులగౌరవం’ సినిమాలోదీ పాట. అప్పుడయితే ఈ పాట సూపర్ హిట్ అయింది. క్లాసిక్‌గా గుర్తింపు పొందింది కానీ, ఇదే పాట ఇప్పటి సమాజంలో వివాదాస్పదమౌతుంది. తీవ్రమైన విమర్శలకు గురవుతుంది. చివరికి పాట నిషేధానికి గురయినా ఆశ్చర్యం లేదు. ఇంతకీ ఈ పాటలో పొరపాటేమైనా ఉందా? ఎవరినైనా అవమానిస్తున్నదా? అంటే అదేమీ లేదు. ఒక విశ్వజనీన సత్యాన్ని స్పష్టంగా చెప్తోంది అంతే.
‘మాతృత్వం లోనే ఉంది ఆడజన్మ సార్థకం’ అనే పాట మాతృత్వం గురించి, ఒక స్త్రీ జీవితం మాతృత్వం తోటి సార్థకతను సాధించటం గురించి పల్లవిలోనే ప్రస్తావిస్తుందీ. నిజానికి పాటలో ఆక్షేపించేది కానీ, ఆవేశపడేది కానీ ఏమీ లేదు.
సమాజ గతి నది గతి లాంటిది. నిత్య చలనశీలి. అందుకే సమాజంలో కొన్ని తాత్కాలిక సత్యాలుంటాయి. కొన్ని శాశ్వత సత్యాలుంటాయి. తాత్కాలిక సత్యాలు తరాలను బట్టి, సామాజిక పరిస్థితులను బట్టి మారుతుంటాయి. కొన్ని శాశ్వత ప్రాకృతిక సత్యాలు ఉంటాయి. అవి ఏ యుగంలోనైనా మారవు. స్థిరంగా ఉంటాయి. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. పశ్చిమాన అస్తమిస్తాడు. ఇలాంటి ప్రాకృతిక సత్యాలకు సమాజంతో, తరాలతో, సమాజంలో పొడచూపుతున్న సిద్ధాంతాలతో, మార్పులతో సంబంధం లేదు. ఏవి ఎటు పోయినా అవి మారవు. అలాంటిదే మాతృత్వం కూడా.
ప్రకృతిలో జీవులు ప్రధానంగా రెండు రకాలు. స్త్రీలు, పురుషులు. మూడవ రకం ఉన్నా సృష్టి కొనసాగటంలో వారి పాత్ర లేదు. కాబట్టి ప్రకృతి దృష్టిలో ప్రధానమైన వారు స్త్రీ, పురుషులు మాత్రమే (“మేరీ లింగ్ మేరీ మర్జీ” అని ఎవరెంత గొంతు చించుకుని అరిచినా అది వారి ఇష్టం. ఇది ప్రాకృతిక సత్యం). స్త్రీ, పురుషుల ప్రాధాన్యం సృష్టిని కొనసాగించటం. ఇందులో పురుషుడి పాత్ర కన్నా స్త్రీ పాత్రకే అత్యంత ప్రాధాన్యం. మనుషుల్లోనే కాదు లైంగికంగా సంతానోత్పత్తి చేసే ఏ జీవిలోనయినా స్త్రీ పాత్రనే ప్రాధాన్యం. బాధ్యతలు అధికం. ఇది ప్రకృతి. మనిషి కాక ఇతర జీవులలో కూడా స్త్రీజీవి సంతానం బాధ్యతను స్వీకరించటం కనిపిస్తుంది. అలాగని, బాధ్యతనంతా స్త్రీపై వదిలే మనిషి పశువుకన్నా హీనుడవుతాడు. ఒక రకంగా మాతృత్వం అన్నది ప్రకృతి నిర్దేశించిన బాధ్యత. పూలు పూయటం పూల చెట్టు విధి. అది ప్రకృతి. ఎవరెన్ని సిద్ధాంతాలు చేసినా ఎన్ని రాధ్ధాంతాలు చేసినా ఎన్నెన్ని దూషణల ఆర్భాటాలు చేసినా, ఎన్నెన్ని కష్టాల కడలి పొంగి పొర్లే దృష్టాంతాలు చూపినా, ఎలాగయితే ఎంత ఎత్తు ఎగిసినా ఆకాశాన్ని అందుకోలేమో, గాలిని గుప్పెట్లో బంధించలేమో అలాగే మాతృత్వం అన్నదాన్ని కాదనలేము. అది స్త్రీకి భగవంతుడిచ్చిన వరం, బాధ్యత .
ఇటీవల ప్రతి విషయంలో అసంతృప్తులు కలిగించి, అలజడి రేపి, అల్లకల్లోలం జరిపి తమ వ్యక్తిగత బలహీనతలను, భయాలను, సిద్ధాంతాల ముసుగులో సార్వజనీనం చేసి, పంచతంత్రం కథల్లో నీలినక్కలా ప్రవరించే వారి వల్ల మాతృత్వాన్ని శాపంలా భావించే వారు కొందరు ప్రస్తుతం సమాజంలో ఉన్నారు. కానీ, అది వారి వ్యక్తిగత అభిప్రాయం. అధిక శాతం మాతృత్వాన్ని వరంలా భావిస్తారు. మాతృత్వం కోసం తపిస్తారు. మాతృత్వాన్ని సంతోషంగా స్వీకరిస్తారు. ఆనందిస్తారు. తమ కళ్లముందే పసి బిడ్డడు ఎదిగి ప్రపంచంలో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకోవటం చూసి సంతృప్తి చెందుతారు. తమ జీవితానికి సార్ధకత లభించిందని సంతృప్తి చెందుతారు.
‘కులగౌరవం’ సినిమా కథ ప్రధానంగా సంతానం చుట్టూ తిరుగుతుంది. ఓ నర్తకిని వివాహమాడేడని కొడుకును బహిష్కరిస్తాడు తండ్రి. ఆ కొడుకు తనకు ఇష్టమైన ఆమె ద్వారా సంతానాన్ని పొందుతాడు. ఆమె గర్భవతి అవటాన్ని భార్యాభర్తలిరువురూ కలసి సంతోషిస్తు సంబరపడే సందర్భంలో వస్తుందీ పాట. ఈ పాటలో సంబరం కన్నా, మాతృత్వ తత్వాన్నీ, స్త్రీ పురుషుల జీవితాలకు సంతానం ద్వారా ఒక నిండుతనం రావటాన్నీ ప్రదర్శించటం కనిపిస్తుంది. కొసరాజు పాటను అతి చక్కగా, క్లిష్టమైన భారతీయ సామాజిక తత్త్వాన్ని అతి సులువైన పదాలలో పొందుపరచాడు. సంగీత దర్శకుడు టి.జి.లింగప్ప. ఇది కన్నడ సినిమా ‘కులగౌరవ’ ఆధారంగా తెలుగులో నిర్మించిన సినిమా. ‘మాతృత్వంలోనే ఉంది’ పాట తెలుగు సినిమాకే ప్రత్యేకం. తెలుగు సినిమాలో ఎమోషన్స్‌ను మరింత సాంద్రంగా ప్రదర్శించేందుకు ఈ పాటను రూపొందించారు. ఎందుకంటే, ఈ పాట ద్వారా నాయికా నాయకులిద్దరికీ మాతృత్వం గురించి లోతైన అవగాహన, తమ కర్తవ్యం, బాధ్యతల గురించి, మానవ ప్రపంచం ముందుకు సాగటంలో తాము పోషించిన పాత్ర పట్ల ఆలోచనలున్నాయని ఈ పాట ద్వారా తెలుస్తుంది. తరువాత సినిమాలో అపార్థాల వల్ల నాయిక భర్తకూ, కొడుకుకూ దూరమైనప్పుడు ఆయా పాత్రల మానసిక సంఘర్షణలను ప్రేక్షకులు మరింతగా అనుభవించేందుకు ఈ పాట దోహదపడుతుంది. అందుకే పాట ఆరంభంలోనే ‘మాతృత్వం’ గురించిన అభిప్రాయాన్ని స్పష్టం చేశాడు గేయ రచయిత.
ఈ పాట ప్రాధాన్యాన్ని పాటలో పొందుపరచిన తాత్విక సామాజిక సత్యాల గాంభీర్యాన్ని గుర్తించిన సంగీత దర్శకుడు పాటను ఏ ఒక్క ప్రత్యేక రాగం ఆధారంగా రూపొందించలేదు. మిశ్రరాగాల మాలికగా రూపొందించాడు. మోహన, శంకరాభరణ రాగాలతో పాటు ఖరహరప్రియ రాగం ఛాయను కూడా తలపింప చేస్తాడు. ఈ పాట భార్యభర్తల నడుమ సంభాషణ లాంటి పాట. కాబట్టి రాగాల నియమాల ప్రకారం పాటను రూపొందించటం కన్నా భావ ప్రాధాన్యంగా, పాటను రూపొందించాడు. దాంతో పాట మాధుర్యం మరింత పెరిగింది. భావ గాంభీర్యం మరింత ప్రస్ఫుటమయింది.
పల్లవి పాట సారాన్ని సున్నితంగా ప్రతిబింబిస్తుంది కాబట్టి మృదువుగా అనిపించే మోహన రాగం వాడేడు. చరణాలలో ఎమోషన్స్ ఎక్కువగా ధ్వనిస్తాయి. అందుకని శంకరాభరణం, ఖరహరప్రియ, మాయమాళవగౌడల నడుమ పాట నర్తనమాడుతుంది. ‘ఇదీ రాగం’ అని చెప్పటం కష్టం. ఎందుకంటే రెండు చరణాలు వేర్వేరు స్కేల్‍ళ్ళలో వేర్వేరు బాణీలలో ఉంటాయి.
స్త్రీ, పురుషులు ఒకరినొకరు ప్రేమిస్తారు
సృష్టికి ఒక వింత శోభ కలిగిస్తారు
మబ్బు వెంట నీరు వలె, పువ్వునంటు తావి వలే
అనుశృతముగా వచ్చును ఈ సంబంధం, ఈ అనుబంధం
ఆలుమగలు బ్రతుకున పండించుకున్న పరమార్థం
“ఆలుమగలు బ్రతుకున పండించుకున్న పరమార్ధం”. సంతానాన్ని పొందటాన్ని ఎంత గొప్పగా వర్ణించాడు!!!! భారతీయ ధర్మంలో దాంపత్య ధర్మాన్ని సూటిగా, సున్నితంగా, సరళంగా అద్భుతంగా చెప్పాడు కవి. పాటలోని భావానికి తగ్గట్టుగా మృదు గాంభీర్యంగా, భావాల్ని ప్రస్ఫుటం చేసే గమకాలతో తన వంతు పాటను ఘంటసాల అలంకరించాడు. వివాహం ప్రథమోద్దేశం, పరమార్థం సృష్టి కొనసాగింపు మాత్రమే. స్త్రీ, పురుషులు చెరి అర్ధభాగాలు. ఒకరినొకరు కలవందే, చెరి అర్ధం భాగాలు కలవందే, వారి వారి జీవితాలు సంపూర్ణంగా కావు. అంటే స్త్రీ లేని పురుషుడు, పురుషుడు లేని స్త్రీ జీవితాలు అసంపూర్ణం అన్నమాట. అందుకని ఒకరి పొందుకోసం మరొకరు తపిస్తారు. వారి కలయిక నూతన సృష్టికి శ్రీకారం చుడుతుంది. ప్రతి ఒక్క పిల్లవాడూ ఒక్క విశ్వం. ఒక నిండు కలల జగత్తు. పిల్లలు అంటే అషామాషీ కాదు. ఒక నూతన విశ్వాన్ని జాగృతం చేసినట్టు. ఈ నూతన విశ్వంలో తండ్రి వైపు ఎన్నో తరాలు, తల్లి వైపు ఇంకెన్నో తరాలు కలసి ఉంటాయి. అందుకే తన సంతానం ద్వారా తల్లిదండ్రులు చిరంజీవులవుతారు. తమ పూర్వీకులను చిరంజీవులుగా నిలుపుతారు. సృష్టికి వింత శోభను కలిగిస్తారు.
అందుకే స్త్రీ, పురుషులు ఒకరినొకరు ప్రేమిస్తారు. ప్రేమ వెనుక లైంగిక భావన కన్నా సంతానోత్పత్తి భావన అధికంగా ఉంటుంది. సంతానోత్పత్తి జీవి ధర్మం. పిల్లవాడికి విద్య నేర్పటం, సంస్కారాలు నేర్పటం, పిల్లవాడు ఉత్తమ మానవుడిగా ఎదిగి తన శక్తిని సంపూర్ణంగా గ్రహించి, సమాజానికి ఉపయోగపడేట్టు, నూనత జీవితాన్ని అర్థవంతంగా గడిపేట్టు చేయటం తల్లిదండ్రుల కర్తవ్యం, ధర్మం. ఇది భగవన్నిర్దేశిత ధర్మం, కర్తవ్యం. పైగా, ప్రతి పిల్లవాడు, మగ అయినా ఆడ అయినా, తల్లి దండ్రుల ప్రేమ ప్రతిఫలం. ఇది ఏ మనువో, ఏ బ్రాహ్మణుడో ఏర్పరచిన సంబంధం కాదు. ఇది అనుశృతంగా వస్తున్న బంధం. సంబంధం. భారతీయ సమాజంలో గృహస్తు దశ అత్యుత్తమ దశ. సంసారం నడిచేది దాంపత్య ధర్మం వల్లనే. అందుకే ఈ ధర్మానికి అన్నిటికన్నా అధిక ప్రాధాన్యం భారతదేశంలో.
ఒక తరాన్ని ప్రసవించటమంటే తమాషా కాదు
ఒక నిండు కలల జగత్తునే మేల్కొల్పటం
ఎన్నో అవ్యక్తాత్మలు, చిత్రవిచిత్రానుభూతుల ఒడిలో
స్పందన పొందిన తరుణాలు, ఈ స్వరాలు
ఇది ‘సంతానం’ గురించి గుంటూరు శేషేంద్ర శర్మ భావన. అటు వైజ్ఞానికంగా, ఇటు తాత్వికంగా భారతీయ ఆధ్యాత్మిక భావనను, ధర్మాన్ని వ్యక్తపరుస్తాయి ఈ పంక్తులు. ఇదే భావనను ఇంకా సరళంగా చెప్తున్నాడు కొసరాజు.
ఈ పాట ప్రకటిస్తున్న జీవిత సత్యాన్ని, ఆ సత్యం వెనుక తాత్వికతను, పాటలోని గంభీరమైన భావాన్ని, పవిత్రమైన ఆలోచనను ప్రస్ఫుటం చేస్తూ, సంగీత వాయిద్యాలు ఆ భావనలకు అడ్డుపడకుండా, మూడ్‌ను మరింత ఆలోచనామయం చేస్తూ పవిత్ర భావన కలిగించే రీతిలో అత్యద్భుతమైన రీతిలో ‘ఆర్కెస్ట్రా’ ను రూపొందించాడు సంగీత దర్శకుడు.
ఇంటర్ల్యూడ్ లోని వయెలిన్లు పాటకు సాంద్రతను అపాదిస్తాయి. పాట ఆరంభంలోనూ, నడుమన వినిపించే వేణువులు పవిత్రతను, పచ్చని పచ్చికలను, ప్రకృతిని స్ఫురింపచేస్తుంది.
వీణ, సితార్, మృదంగం, తబలాలు దాంపత్యంలోని అనురాగాన్ని, సాంప్రదాయంలోని ప్రశాంతతను, గృహస్థ జీవితంలోని ఆనందాన్ని, సౌఖ్యాన్ని తలపింపచేస్తాయి. ఈ రకంగా మొత్తం పాటను ఒక ఆత్మీయమైన అనుభవంలో పవిత్రమైన భావనలా మనిషి ప్రకృతిలో ఒక భాగమైన ఆలోచను కలిగేలా సంగీతాన్ని రూపొందించాడు సంగీత దర్శకుడు.
చిత్రీకరణ కూడా పాట గాంభీర్యాన్ని అనుసరించి ఉంటుంది. మాతృత్వ భావనలో ని అందమైన అనుభూతికి కెమేరా క్లోసప్పుల ద్వారా మరింత చేరువ చేస్తుంది. నాయికా నాయకుల నడుమ ఉన్న ప్రేమానుబంధాన్ని ఈ క్లోజప్పులు ప్రేక్షకుడు అనుభవించేట్టు చేస్తాయి. దాంపత్య బంధంలోని సౌఖ్యాన్ని, భద్రతను, పవిత్రతను ప్రతిబింబించేందుకు అతి మృదువయిన లైటింగును వాడటంతో దృశ్యం ఎంతో ఆత్మీయంగా అనిపిస్తుంది. అప్పుడప్పుడు జూమ్ చేసి ప్రకృతిని చూపించటం పాటలో కవి ప్రదర్శించిన భావానికి దృశ్యరూపం.
ప్రకృతి కాంత పురుషుని ఒడిలోన పరవశించినది
భూమాత మురిసి పచ్చపచ్చగ నవ్వుతున్నది
అంతా అనురాగమయం ఆనందానికి నిలయం
పతి హృదయమే సతికి నిత్య సత్యమైన ఆలయం.
పూజించే దేవాలయం
భర్తయే భార్యకు ఇలలో వెలసిన దైవం.
ప్రకృతి కాంత పురుషుని ఒడిలోన పరవశించటం, భూమాత మురిసి పచ్చ పచ్చగా నవ్వటం అద్భుతమైన రీతిలో దాంపత్య ధర్మాన్ని ప్రదర్శిస్తుంది. సాంఖ్య సిద్ధాంతం ప్రకారం ప్రకృతిలో పురుషుడి సాన్నిహిత్యంతో సృష్టి ఆరంభమవుతుంది. ప్రకృతిని స్త్రీకి, పురుషుడిని పురుషమానవుడికి ప్రతీకగా చేసి వీరిరువురి కలయిక వల్ల నూతన సృష్టి సంతానం సంభవమవుతున్నదని గొప్పగా చెప్పాడు కవి. భూమాత మురిసి పచ్చపచ్చగా నవ్వటం గొప్ప ప్రతీక. భూమి స్త్రీలాంటిది. ఆలుమగలు బ్రతుకున పండించుకున్న పరమార్ధం వారి సంతానం. భూమికి పంట ఎలాగో, స్త్రీకి మాతృత్వం అలాగ. భూమి పంటలు పండించకపోతే, జీవులు ఆహారం లేక నశిస్తాయి. స్త్రీ సంతానాన్నికి జన్మనివ్వకపోతే సృష్టి స్థంభించి అంతరిస్తుంది. సాంఖ్య సిద్ధాంతంలో పురుషుడిలో సృష్టి వల్ల ఎలాంటి మార్పు ఉండదు. మార్పు సంభవించేది ప్రకృతిలో. జీవుల్లో కూడా మార్పు సంభవించేది స్త్రీలోనే. ఇదే సృష్టిలో స్త్రీ ప్రాధాన్యం. స్త్రీ మాతృమూర్తి కానిదే సృష్టిలేదు. ఆలుమగలు బ్రతుకున పండించుకునే పరమార్ధం ఇదే!
‘భర్తయే భార్యకు ఇలలో వెలసిన దైవం’ అంటే, ప్రియుడిన వదలుకోలేక భర్తను నీలి డ్రమ్ముల్లో కుక్కేవారికీ, పర్వత శిఖరాల నుంచి త్రోసి చంపేవారికీ, విషం పెట్టి ప్రియుడితో కలసి చంపేసే వారికి, అకారణ ద్వేషం ప్రదర్శిస్తూ అడ్డమయిన బూతులను అలవోకగా మాట్లాడేవారిని సమర్ధించేవారికీ అర్థం కాదు. కోపం వస్తుంది. సరిగ్గా సంపాదించటం లేదనో, బట్టతల ఉందనో, ఏదో అడిగింది ఇవ్వలేదనో, ‘విడాకులు’ అని అరచేవారికి కోపం ముంచుకు రావటమే కాదు, నవ్వు కూడా వస్తుంది. భార్యాభర్తలను పీడితులు పీడకులుగా విభజించే కళ్ళద్దాలవాళ్ళు, పనిగట్టుకుని సంసారంలో అహంకారాలు, స్వార్థాలు, పంతాలు, పట్టుదలలు, అసహనం, ప్రదర్శించటమే అభ్యుదయం, అభివృద్ది, గొప్పతనం, గొప్ప వ్యక్తిత్వానికి నిదర్శనం అనేవారు, సిద్ధాంతరాద్ధాంతాలు, వాద వివాదాలు, నిరసన ప్రదర్శనలు, దూషణలు ఆరంభిస్తారు. అయితే ‘భర్తయే భార్యకు ఇలలో వెలసిన దైవం’ కావాలంటే తాను ‘దైవం’ లా వ్యవహరించాలనీ, దైవంలా కాకపోయినా కనీసం మనిషిలా మానవత్వంతో అవగాహనతో, సానుభూతితో, జీవిత భాగస్వామి అన్న అవగాహనతో గౌరవంగా ప్రేమగా తన స్త్రీతో వ్వవహరించాలనీ, ఆమె గౌరవం విశ్వాసం పొందేట్టు వ్వవహరించాలని పురుషుడు అర్థం చేసుకోకపోతే, స్త్రీ ఎంత సహనం అవగాహన ప్రదర్శించి రాజీపడినా లాభం లేదు. పైగా, సంసారమంటే పురుషుడికేదో ఆధిక్యం ఉంటుందనీ, భార్య పురుషుడికి దాసీ అనీ, అహంకారంతో, మూర్ఖుడిలా, పశువులా వ్యవహరించే పురుషులకు స్త్రీ అంటే అర్ధంకాకపోవటమే కాదు, వారు పురుషుల రూపంలో ఉన్న పశువులు అన్నమాట. రెండు వైపులా గౌరవం, అనురాగం, ఆప్యాయత, బాధ్యతల ఆలోచనల కలగాలంటే వారికి దాంపత్యమూ గురించిన అవగాహన ఉండాల్సి ఉంటుంది. దాంపత్య ధర్మం ఒక అహంకారాల పోటీకి వేదికగా, స్వార్ధపుటాటల మైదానంలా భావించేవారికి అనురాగమయం, ఆనందాలకు నిలయం అంటే బోధపడదు.
మై న రూహూంగీ, తమ్ న రహో గే
ఫిర్ భీ రహేంగీ నిషానియాఁ..
‘ప్యార్ హువా ఇక్‌రార్ హువా’ అనే, ‘శ్రీ 420’ అనే హిందీ సినిమాలోని ప్రేమగీతం ఇది. రాసింది శైలేంద్ర. ‘నువ్వుండవు, నేనుండను, కానీ మన గుర్తులుగా మన సంతానం ఉంటుంది’ అంటుంది నాయిక. భారతీయ దాంపత్య ధర్మ తత్వాన్ని, సంతానం ద్వారా వ్యక్తులు చిరంజీవులుగా మిగలటాన్ని చక్కగా చెప్తుందీ ప్రేమగీతం.
(‘ప్యార్ హువా ఇక్‌రార్ హువా’ పాట యూట్యూబ్‌లో )
మేరె బాద్ భీ ఇస్ దునియామే
జిందా మేరా నామ్ రహేగా
జో భీ తుఝ్‌కో దేఖేగా
తుఝే మేరా లాల్ కహేగా
తేరే రూప్ మే మిల్ జాయేగా
ముఝ్‌కో జీవన్ దోబారా
‘ఏక్ పూల్ దో మాలీ’ సినిమాలో మన్నా డే పాడిన పాట. ప్రేమ్ ధావన్ రాసిన పాట ఇది. తన సంతానం ద్వారా తనకు నూతన జన్మ లభిస్తుందటున్నాడు.
“తుఝె సూరజ్ కహూ, యా చందా” పాటను ఈ క్రింద లింకులో చూడవచ్చు.
https://www.youtube.com/watch?v=LhFh_O5ZuF4
థోడా హమారా, థోడా తుమ్హారా
ఆయేగా ఫిర్ సే బచ్‍పన్ హమారా
ఇది ‘తేరే మేరే సప్నే’లో నీరజ్ రాసిన యుగళ గీతం. ‘కాస్త నీది, కాస్త నాది కలసి మన ఇద్దరి బాల్యం సంతానం రూపంలో తిరిగి వస్తుంద’ని పాడుతుంటున్నారు దంపతులు. వారే కాదు, వారి పూర్వీకులు కూడా సంతానం ద్వారా సజీవంగా నిలుస్తారు. ఇది నిజం. ఇది విజ్ఞానం శాస్త్రం. ఇది భారతీయ తత్వం.
“జీవన్ కి బగియా మహెగీ” పాటను ఇక్కడ చూడవచ్చు.
అయితే, ప్రేమ అంటే ‘ఫస్ట్ నైట్’, ‘లైంగిక చర్యకు లైసెన్స్’ అన్నట్టు ప్రేమ అనగానే లైంగిక చర్య ఆరాటం తప్ప మరొకటి ప్రదర్శించని సినిమాలు, పరిణతి రాని పదహారేళ్ల ప్రేమకే పవిత్ర ప్రేమలనీ, అడ్డుపడేవారు ప్రేమ శత్రువులనీ, పసిపిల్లల ప్రేమ దైవమనీ ప్రచారం చేసి, పసి పిల్లలు సైతం బూతులు మాట్లాడటం లైంగిక సౌంజ్ఞల సూచనలు బహిరంగంగా చేయటమే ‘విముక్తి’, ‘స్వేచ్ఛ’ అని సిద్ధాంతాలు చేప్పి ప్రచారం చేసేవారు మేధావులుగా పెద్దలుగా చలామణీ అయ్యే సమాజం ‘మాతృత్వం లోనే ఉంది ఆడజన్మ సార్థకం’ అంటే అక్షేపించి ఆందోళన చేయటంలో ఆశ్చర్యం లేదు. శిశువుకు జన్మనివ్వడం అన్నది స్త్రీకి నూతన జన్మ లాంటిది. నూతన జీవితం లాంటిది. కొందరికి పలు కారణాలవల్ల కష్టమవ్వచ్చు. వారు పిల్లలను కనటం, వారికి బాధ్యతను వహించటం పట్ల నిరసన ఉండవచ్చు. అది కొందరికి వర్తిస్తుంది. అందరికి వర్తించదు. దాన్ని అందరికీ వర్తింప చేయాలని, అంటే, ప్రకృతికి వ్యతిరేకంగా ప్రవర్తించాలని కొందరు భావించవచ్చు. ఇటీవలి కాలంలో, అనేక సామాజిక పరిస్థితులవల్ల, సంతానం అనేది బాధ్యత కన్నా బరువుగా భావించటం కనిపిస్తున్నది. పిల్లల్నిమోయటం, కనటం, చదువులు చెప్పించటం, పెళ్ళిళ్ళు. అమ్మో ఇదంతా పడలేమని కొందరు, తమ ఆనందాలకూ, కెరీర్ లో ఎదుగుదలకు పిల్లలు ప్రతిబంధకాలని కొందరు, ఇలా పలుకారణాలవల్ల మాతృత్వం పట్ల విముఖత ప్రదర్శిస్తున్నారు. కానీ అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపలేక పోవటం ఎంత నిజమో, ‘మాతృత్వంలోని ఉంది ఆడజన్మ సార్థకం’ అన్నది కూడా అంతే నిజం. ఈ నిజం ఆందోళన జీవులకు అర్ధం కాదు. మహిళలకు ఈ పాటలోని సత్యం అనుభవమే!
~
(‘మాతృత్వంలోని ఉంది ఆడజన్మ సార్థకం’ పాటని యూట్యూబ్‌లో వినవచ్చు:
https://www.youtube.com/watch?v=g9_MvvuVotA)
(మళ్ళీ కలుద్దాం)
