[సంచిక కోసం ‘శంతనూ – శర్మిష్ఠ’ ప్రత్యేకంగా రచిస్తున్న సినిమా పాటల శీర్షిక.]
మీ నగుమోము, నా కనులారా
కడదాకా కననిండు
ఈ సూత్రముతో ఈ కుంకుమతో
నను కడతేరీ పోనిండు..
కొన్ని పాటలు వింటుంటే మనసు ఎంతగా సంతృప్తితో స్తబ్ధమైపోతుందో, ఆనందంతో అంతగా ఉప్పొంగుతుంది. తీవ్రమైన మనోభావాలతో ఎంతగా ఉక్కిరిబిక్కిరి అవుతుందో, అంతే లోతైన అలవి కాని విషాదంతో బరువెక్కుతుంది. దీర్ఘమైన నిట్టూర్పులు విడుస్తుంది. ఏదో తెలియని తీపి బాధ హృదయపు లోలోతుల్లోంచి ఉబికి ఉబికి వస్తుంది.
ఎటువంటి కళాకారులు వారు? మానవ జీవితాల్లోని ఆవేదనలను, ఆనందాలను, ఔన్నత్యాన్ని, ఉత్తమత్వాన్ని కాచి వడబోసి మీగడ తరగలను సమాజం ముందు ఉత్తమాదర్శంగా నిలిపారు. తమ కళాప్రతిభకు సంపూర్ణ సార్థకతను సాధించారు.
భారతీయ దాంపత్య వ్యవస్థ లోని శిఖరాయమానమనదగ్గ సంబంధాన్ని, ధార్మిక ప్రేమ భావనను ఇంతకన్నా గొప్పగా మరెవరూ ప్రదర్శించలేరన్న రీతిలో ప్రదర్శించి తరతరాలకూ ఆదర్శంగా నిలిపారు. ‘ఇదీ మనం, ఇదీ మన సమాజం, ఇదీ మన దాంపత్య ధర్మం’ అని ఎలుగెత్తి చాటారు. అదీ ఎలా? ప్రతి మానవ హృదయం స్పందించేలా! ప్రతి సున్నిత హృదయం, ఇలాంటి శిఖరాయమానమైన అనుబంధాన్ని అందుకోవాలని వాంఛించేలా!
‘బడి పంతులు’ సినిమా ఆదర్శవంతమైన అధ్యాపకుడి గురించి మాత్రమే కాదు, ఆదర్శవంతమైన అధ్యాపకుడికి వెన్నుదన్నులా నిలిచి, సుఖదుఃఖాలలో తోడునీడగా నిలిచి, అచంలమైన కర్తవ్య దీక్షతో, అనంతమైన ఓర్పు, అవగాహనతో, అత్యుత్తమమైన భారతీయ సంస్కార ప్రదర్శనతో తమ జీవితాలను సార్థకం చేసుకోవటమే కాదు, సమాజాన్ని సుసంపన్నం చేయటంలో తెరచాటు నుండి తన బాధ్యతను అత్యుత్తమంగా నిర్వహించిన అతని ధర్మపత్ని గురించి కూడా. వెరసి ఉత్తమ దాంపత్య సంబంధానికి అత్యత్తమ నిదర్శనంగా నిలుస్తుందీ సినిమా.
‘బడి పంతులు’ సినిమా కథ ప్రపంచంలో ఏ మూల అయినా, మానవ హృదయం స్పందించే స్త్రీ పురుషుల ప్రేమగాథ. మానవ సంబంధాల కథ. 1958లో వచ్చిన ‘స్కూల్ మాస్టర్’ అనే కన్నడ సినిమాకి రీమేక్ ‘బడి పంతులు’ సినిమా. కన్నడ సినిమాకు కుసుమాగ్రజ్ రాసిన మరాఠీ నవల ‘వైష్ణవి’ ఆధారం.1934లో జోస్‍ఫైన్ లారెన్స్ రాసిన ‘ఇయర్స్ ఆర్ సో లాంగ్’ అనే నవల ఆధారంగా నిర్మించిన హాలీవుడ్ సినిమా ‘మేక్ వే ఫర్ టుమారో’ అన్న సినిమాను, ‘వైష్ణవి’ నవలను, 1954లో వచ్చిన మరాఠీ సినిమా ‘ఉన్ పావూస్’ను ప్రేరణగా తీసుకుని కన్నడంలో నిర్మించిన సినిమా ‘స్కూల్ మాస్టర్’. సాహిత్యం నుంచి సినిమా ప్రేరణ పొందితే, సృజితమయ్యే నాణ్యమైన కళకు అత్యుత్తమ తార్కాణం ఈ సినిమా.
ఈ కన్నడ సినిమా 1958 లోనే ‘ఎంగల్ కుటుంబం పెరిసు’ అన్న తమిళ సినిమాగా రూపొందింది. 1959లో ఇదే సినిమా ‘స్కూల్ మాస్టర్’గా హిందీ రూపు ధరించింది. 1964లో ఇదే పేరుతో మలయాళం సినిమాగా రూపొందింది. 1972లో ‘బడి పంతులు’ పేరుతో తెలుగు సినిమా నిర్మితమయింది. ఏ భాషలో, ఏ ప్రాంతంలో, ఏ దేశంలో రూపొందినా, ‘బడి పంతులు’ సినిమా సూపర్ డూపర్ హిట్‌గా నిలించింది.
సినిమా కథలో ఉన్న మానవ జీవన చిత్రణ, ఒకే సినిమాలో మానవ సంబంధాల ఔన్నత్యం ఒక వైపు, మానవ సంబంధాలను విచ్ఛిన్నం చేసే స్వార్థం మరో వైపుగా ఉండే ఈ సినిమా, తరువాత కూడా పలు భాషల్లో పలుమార్లు పలు రూపాల్లో దర్శనమిచ్చింది. 2003లో అమితాబ్ బచ్చన్, హేమమాలిని నటించిన ‘బాఘ్‌బన్’ కూడా సూపర్ హిట్టే.
హీరో ఆదర్శవంతమైన అధ్యాపకుడు. విద్యాబోధన అతని ధర్మం. పాఠశాల అతని మందిరం. సరస్వతి అతని దైవం. అతని భార్య కూడా అతనికి అనుకూలవతి. ఆమె దైవం అతడే. అతడి ఆత్మవిశ్వాసం ఆమె. స్వంత డబ్బులతో పిల్లలకు పాఠాలు చెప్పి వారి జీవితాలను తీర్చిదిద్దే అధ్యాపకుడి పట్ల కృతజ్ఞత ప్రదర్శిస్తూ విద్యార్థులు స్వచ్ఛందంగా శ్రమ దానం చేసి ఇల్లు కట్టించి ఇస్తారు. కాలక్రమేణా ఆయన పదవీ విరమణ చేయాల్సి వస్తుంది. ఆ కాలంలో పదవీ విరమణ వయస్సు 55. అంటే ఆ వయసు వచ్చేసరికి వ్యక్తిని ‘వయసు ఉడిగినవాడి’గా భావించేవారన్నమాట. నాయకుడు కూడా అలాగే వృద్ధుడిగా కనిపిస్తాడు. రిటైరయి ఇంటికి వచ్చిన తరువాత, ఆ సందర్భాన్ని పురస్కరించి అతని భార్య పాడిన పాట ఇది. ఇది తెలుగు సినిమాకే ప్రత్యేకం. ఇతర భాషల సినిమాల్లో రిటర్మెంట్ సంబరాల్లో పాటలున్నాయిగానీ, ఇంట్లో, ఇక అతని ప్రపంచం ఆమె, ఆమె ప్రపంచం అతడు అన్నట్టు చూపే పాట తెలుగులో మాత్రమే ఉంది.
అద్భుతమైన సందర్భం. రిటైర్మెంట్ వ్యక్తి జీవితంలో, రెండవ జీవితం లాంటిది. అంతవరకు డబ్బు సంపాదనలో, సంసార సాగరంలో మునిగి తేలిన వ్యక్తి చివరి దశలో ఎలాంటి బరువూ బాధ్యతలు లేకుండా బాదరబందీలు, ఆరాటపోరాటాలు లేకుండా విశ్రాంతిగా, సుఖంగా, ప్రపంచానికి దూరంగా, తనకు నచ్చిన పని చేస్తూ, అంతవరకూ కష్టసుఖాలలో తోడునీడగా నిలిచిన జీవిత భాగస్వామి సాంగత్యంలో అనంత సౌఖ్యాన్ని అనుభవిస్తూ , ఎదిగిన పిల్లల అభివృద్ధి చూసి ఆనందిస్తూ, శేష జీవితం గడిపే సమయం అన్నమాట. ఈ సందర్భంలో ఎలాగయితే వ్యక్తి అన్నేళ్లు ఆఫీసులో తన బాధ్యతలను నిర్వహించిన విధానం గురించి విశ్లేషిస్తారో, అలాగే అతనితో తన అనుబంధాన్ని, జీవితాన్ని విశ్లేషిస్తూ భవిష్యత్తు గురించిన ఆలోచనలను వ్యక్తపరుస్తూ అతని సహధర్మచారిణి పాట పాడటం ఔచితీమంతమే కాదు, అవసరం, అద్భుతం కూడా. ఈ సందర్భంలో, ఈ పాట పాడటం అన్నది అద్భుతమైన ‘మాస్టర్ స్ట్రోక్’. తరతరాలు దంపతులు విని ఆనందించి, అనుభవించే అతి గొప్ప పాటను అందించారు మన కళాకారులు.
‘మీ నగుమోము’ అంటూ గేయ రచయిత పల్లవిని ఆరంభించటం; గేయ రచయిత ఆత్రేయ, సందర్భాన్ని, ఆ సందర్భంలో ఒదిగిన ఔన్నత్యాన్ని, సార్వజనీనతను అర్థం చేసుకున్నాడని సృష్టం చేస్తుంది. ‘నగు మోము గన లేని’ అన్న త్యాగరాజ కీర్తన వెంటనే గుర్తొస్తుంది. ఆమె దృష్టిలో అతడు దైవంతో సమానం అని అర్థమవుతుంది.
‘నగు మోము గన లేని నా జాలి దెలిసి
నన్ను బ్రోవగ రాద? శ్రీ రఘువర! నీ నగు మోము’
ఇది త్యాగరాజ కీర్తన పల్లవి. దాన్ని తిరగేశాడు గేయ రచయిత. ఇంతకు ముందు అతడి దర్శనం ఆమెకు ఎప్పుడో. ఉద్యోగంలో బిజీగా ఉండేవాడు. ఇప్పుడు అతడు ఎక్కడికీ పోలేడు. ఆమె కళ్ల ఎదురుగా ఇంట్లోనే ఉంటాడు. ఇప్పుడు ఆమె ఎప్పుడంటే అప్పుడు, ఎంత సేపంటే అంత సేపు అతడి సాంగత్యంలో తనివితీరా గడపవచ్చు. అందుకే ‘మీ నగు మోము నా కనులారా కననిండు’ అంది. గుండె ఝల్లుమని, కళ్లు చెమరించే ఆరంభం.
వైదిక సాంప్రదాయం ప్రకారం దాంపత్య ధర్మానికి ధర్మార్థకామమోక్షాలు పట్టుకొమ్మలు, సూత్రాలు. ధర్మార్థకామ దశలు దాటిపోయారు. మిగిలింది మోక్షమే. అందుకే, ‘కడదాకా’ అంటుంది. చివరిదాకా అతడిని చూస్తూ, అతని సాంగత్యంలో గడపాలన్నది ఆమె ఆకాంక్ష. ఇప్పటికీ సాంప్రదాయాన్ని పాటించే ప్రతి మహిళ ఆకాంక్ష ఇదే. మిగతావారి సంగతి వారికే తెలియాలి. ఎందుకంటే ‘ఈ సూత్రముతో ఈ కుంకుమతో’ అంటుంది తరువాతి పాదంలో. మంగళ సూత్రం, పసుపు కుంకుమలు, మెట్టెలు, గాజులు, గోరింటాకు వంటివి ‘సుమంగళి’కి అలంకారాలు. సాంప్రదాయాన్ని పాటించనివారికి ఇవి హేళనకు సాధనాలు. బానిసత్వ చిహ్నాలు. కాబట్టి అలాంటివారి సంగతి వారికే తెలియాలి. మిగతా వారికి ఈ భావన గొప్పగా అనిపిస్తుంది. కళ్లను చెమరింప చేస్తుంది. ఉదాత్తంగా తోస్తుంది.
దాంపత్య ధర్మంలో భార్యాభర్తలిద్దరూ ఒకరినొదిలి ఒకరు ఉండలేరు. కానీ ‘మరణం’ విషయం వచ్చేసరికి పునిస్త్రీలా పోవాలని స్త్రీ వాంఛిస్తుంది. ఆమె ఒడిలో మరణించాలని పురుషుడు కోరుకుంటాడు. పురుషుడిని కోల్పోయిన స్త్రీ కష్టమైనా నష్టమైనా జీవించగలదు గానీ స్త్రీని కోల్పోయిన పురుషుడి జీవితం ‘దుర్భరం’, అస్తవ్యస్తం అవుతుంది. కానీ ఒకస్థాయి దాటిన తరువాత ఒకరు పోతే మరొకరి జీవితం ముగుస్తుంది. సుదీర్ఘ కాలం కలసి జీవించిన దంపతుల్లో ఒకరు మరణిస్తే నెలలోగా మరొకరు వారిని అనుసరించి వెళ్లటం కనిపిస్తుంది. ఇది దాంపత్య ధర్మంలో ఉన్న ఆత్మీయతానురాగాలకు నిదర్శనం.
ఈ పాట బాణీ రూపొందించటంలో సంగీత దర్శకుడు కె.వి. మహదేవన్ గొప్పతనం తెలుస్తుంది. ‘నగు మోము గన లేని’ కీర్తన లానే ఈ పాటకు పవిత్రతను, ఆధ్యాత్మికతను ఆపాదిస్తూ ‘అభేరి’ రాగంలో పాటను రూపొందించాడు సంగీత దర్శకుడు. ఈ రాగం తీవ్రమైన తపనను, విషాదాన్నీ, అంతే తీవ్రమైన ప్రేమ భావనను స్ఫురింపచేస్తుంది. ఈ పాటకు ఈ రాగం ఎంచుకోవటం వల్ల ఈ పాట దాంపత్య సంబంధంలోని అతి పవిత్రమైన అనురాగాన్ని ప్రదర్శించే అతి గొప్ప గీతంగా ఎదిగింది.
పాటలోని భావాన్ని ఇనుమడింప చేయటానికి, సంగీత దర్శకుడు సంప్రదాయక వాయిద్యాలు వాడుతూ పాశ్చాత్య తీగ వాయిద్య ధ్వనులను అత్యద్భుతంగా మిళితం చేశాడు. “మీ నగుమోము” అంటూ ఎలాంటి వాయిద్యాలు లేకుండా గాయని పాట ఆరంభించటంతోటే, ఆమె భావనలకు స్పందిస్తున్నట్టు వీణా మ్రోగుతుంది. పాట అంతా, వీణ, సుశీల స్వరం పలికే భావానికి స్పందిస్తున్నట్టే మ్రోగుతుంది. గాయని స్వరం పలికే భావాలకు అనుబంధంగా ఉంటాయే తప్ప ఏ వాయిద్యంకూడా స్వరాన్ని డామినేట్ చేయదు. ఇది గాయని గాన ప్రతిభను, ఆమె ధ్వనిస్తున్న భావాన్ని శ్రోత ఏకాగ్రతతో వినే వీలు కలిగిస్తుంది. శ్రోత దృష్టిని మరలనీయదు.
ఈ సందర్భంలో సుశీల గాన సంవిధానం గురించి చెప్పుకోకుండా ఉండలేము. ఆమె తెలుగు గాయని అయింది కాబట్టి ‘భారత రత్న’ కాలేకపోయింది. కానీ, ఆమె ‘గాన సరస్వతి’ అన్నది నిస్సందేహం. సందేహం ఉన్నవారు ఈ పాట విని సందేహాలన్నీ తీర్చుకోవచ్చు. ఈ పాటలో ఆమె ఎలాంటి జిమ్మిక్కులు చేయలేదు. సందర్భ గాంభీర్యాన్ని, పవిత్ర భావనకు అర్థం చేసుకుని పాత్ర మనోభావాలను తన స్వరంలో అతి సున్నితంగా, పాటలో రచయిత రాసిన భావాలకు ప్రాణం పోసింది. ‘కనులారా’ అని పలికినప్పుడు ఆమె స్వరంలోని అతి సూక్ష్మమైన సున్నితమైన ప్రకంపన, పాత్ర మనోభావాల ఒత్తిడికి కంపించే స్వరం, ఆమె కంఠంనుండి కాదు, పాట ఆమె హృదయ లోతుల్లోంచి వెలువడుతున్నదన్న భావాన్ని వెల్లువలా ప్రవహింప చేస్తాయి.
పాట చిత్రీకరణ కూడా సందర్భోచితంగా ఉంది. జీవిత చివరి దశ సూచకంగా గదిలో కొద్దిగా వెలుతురు, సాయం సమయాన్ని తలపింప చేస్తుంది. ఎలాంటి ఆడంబరాలు, ఐశ్వర్యం లేదన్న సూచనగా గదిలో ఎలాంటి వస్తువులు కనబడవు. నలుపు తెలుపు సినిమా కావటంతో చీకటి వెలుతురులతో అద్భుతమైన ఆటలాడుకుని సన్నివేశ గాఢతను ఇనుమడింప చేశాడు కెమరా దర్శకుడు. అంజలీదేవి వదనంలో కనిపించే భక్తి బావన. అభ్యర్థనలను ప్రదర్శించేందుకు ఆమె ముఖం వెలుగుతుంది. ఎన్టీరామారావు వృద్ధాప్యం, అలసటలను ప్రదర్శించేందుకు నీడలను ఆయన వదనంపై ప్రతిఫలింపచేసి గొప్ప ఎఫెక్ట్ సాధించింది కెమేరా.
పాట అంతా లో-యాంగిల్ క్లోజప్పులతో అంజలీదేవి పాత్ర ఆత్మశక్తిని, సంపూర్ణ సమర్పణ భావాన్ని కెమేరా ప్రస్ఫుటింప చేస్తుంది. ఎన్టీరామారావు ‘ఓవర్ ది షోల్డర్ షాట్స్’ అంటే కెమేరాను, రామారావు భుజం వెనుక నుంచి అంజలీదేవిని చూపించటంతో వారిద్దరి సాన్నిహిత్యం, ఆమె అభ్యర్థన లోని తీవ్రత అర్థమవుతాయి. అంతేకాదు, రిటైర్ కావడంతో ప్రపంచం అతడి అవసరం లేదని దూరం పెట్టినట్టు భావన కలుగుతుంది. కానీ అతనే ఆమె జీవితం అన్న భావనను ఇలాంటి కోణాలు నిరూపిస్తాయి. ఇంకా ట్రాకింగ్ షాట్లు, వారిద్దరి ఒంటరితనాన్ని చూపిస్తాయి. ఈ రకంగా దర్శకుడు, గేయ రచయిత, కెమేరామేన్లు కలసి నిత్య జీవితంలోని దంపతుల భావాలను తెరపై సజీవంగా ప్రదర్శిస్తారు. ఎన్టీరామారావు, అంజలీదేవిల నటనను వర్ణించేందుకు మాటలు రావు. వారిద్దరిలో ఆ వయసు వారు తమని తాము చూసుకుంటారు. తక్కువ వయసు వారికి తమ తల్లిదండ్రులు, తాతయ్య నానమ్మలు కనిపిస్తారు. ఆవయసుకు దగ్గరగా ఉన్నవారికి తమ భవిష్యత్తు కనిపిస్తుంది.
ఉపచారాలే చేసితినో , ఎరగక అపచారాలే చేసితినో
ఒడుదుడుకులలో తోడై ఉంటిని. మీ అడుగున అడుగై నడిచితినీ..
ఈ ‘చరణం’ గురించి ఏం చెప్పాలన్నా ఓ ‘పుస్తకం’ అవుతుంది. భవిష్యత్తు లేనివారు గతాన్ని తలచుకుంటూ జీవిస్తారు. ఈ చరణం సందర్భంలో – నేపథ్యంలో వాయిద్యాలు – వారిద్దరూ చేయి పట్టుకుని అడుగులో అడుగు వేస్తున్నట్టు మ్రోగుతాయి. వేణువు, తీగ వాయిద్యాలు చెట్టాపట్టాలు వేసుకున్నాయనిపిస్తుంది. ఇక నాయికానాయకులు ఒకరి వైపు ఒకరు చూసుకోవటం, కన్నీళ్లు కారటం, నిండుగా నవ్వటం, దగ్గరకు తీసుకోవటం.. ఒకటేమిటి.. గుండెనిండుగా ఆనందం అనుభవిస్తూ, విషాదం పెల్లుబుకుతూంటే, మానవ సంబంధాలలో అత్యున్నతమూ శిఖరాయమానమైన ప్రేమ భావనకు అనుభవిస్తూ, ఇలాంటి ప్రేమ కోసమే తపించే ప్రతి హృదయం తామే పాత్రలయి పోతాయి. నిత్యజీవితంలో అనుభవించాలనుకుని, అనుభవించలేని అనుబంధాన్ని అనుభవిస్తారు. సంతృప్తితో కళ్ల నీరు పొంగుతుంది. ‘ఒడిదుడుకులు’, ‘అడుగున అడుగు’.. దృఢమైన దాంపత్య జీవితానికి అసలైన నిర్వచనం ఈ పదాలు.
“రాస్తా సాఫ్ థా తో చల్తే రహే
సాథ్ హస్తే రహే, మచల్తే రహే
మోడ్ ఆయా తో మూహ్ మోడ్ చలే..”
‘దారి బాగున్నప్పుడు నవ్వుతూ, తుళ్ళుతూ వెంటనడిచాము.. దారి మలుపు తిరగ్గానే ముఖం తిప్పుకుని వెళ్ళిపోయింది” అని విలపిస్తాడు హిందీలో భగ్న హృదయ ప్రేమికుడు.
‘ఒడిదుడుకులు’, ‘అడుగున అడుగున’.. దృఢమైన సుదీర్ఘ కాలం విజయవంతంగా నిలిచే దాంపత్య జీవితానికి తిరుగులేని సూత్రాలు.
రెక్కలు వచ్చి పిల్లలు వెళ్ళారు.. రెక్కలు అలిసి మీరున్నారు
పండుటాకులము మిగిలితిమి.. ఇంకెన్ని పండుగలు చూడనుంటిమి
ఈ చరణం ఇప్పటి తరానికి అప్పటి తరం కన్నా ఇంకా బాగా బోధపడుతుంది. వృద్ధాశ్రమాలు, వృద్ధులకే ప్రత్యేకమైన అపార్ట్మెంట్లు సర్వ సాధారణమవుతున్న ఈ రోజుల్లో ఈ పాటలో ఇమిడి ఉన్న విషాదం, మానవ సంబంధాల్లోని వైచిత్రి ఇంకా బాగా అర్ధమవుతుంది. పాట చిత్రీకరణ ఇద్దరిపై ఫోకస్ చేస్తుంది. వారిని అనుసరిస్తుంది. రెక్కలు అలసిన అతడు కుర్చీలో భారంగా కూర్చుంటాడు. ఆమె అతడిని దగ్గరకు తీసుకుంటుంది. ‘పండుటాకులము మిగిలితిమి’ అన్నపుడు ఇద్దరినీ క్లోజప్పులో చూపిస్తారు. రెండు ‘పండుటాకులు’. పాట చూస్తూ, భావాన్ని అనుభవిస్తున్నవారికి అక్కడ ఎన్టీరామారావు అంజలీదేవి కనబడరు. వారు అదృశ్యమైపోతారు. జీవితం కనిపిస్తుంది. శక్తి ఉడిగి, అగమ్యగోచరమైన భవిష్యత్తులో జీవితం ఎలా ఉంటుందోనని ఆలోచిస్తున్న జంట కనిపిస్తుంది. తన గతం, వర్తమానం, భవిష్యత్తులు ప్రతి ఒక్కరికీ తెరపై కనిపిస్తాయి.
ఏ నోములు నే నోచితినో, ఈ దేవుని పతిగా పొందితిని
ప్రతి జన్మా, మీ సన్నిధిలోనా, ప్రమిదగ వెలిగే వరమడిగిని..
ఈ చరణంలో చివరి పాదం పాడేప్పుడు గాయని సుశీల స్వరం పలికే భావాలను మాటలలో చెప్పటం కుదరదు. ప్రతి జన్మా మీ సన్నిధిలోనా.. అంటూ దీర్ఘం తీస్తున్నప్పుడు, ఆ స్వరం పలికే అభ్యర్ధన, ఆర్తి, ఆశ.. అనేకానేక భావాలను స్ఫురించేస్తుంది ఆమె రాగం తీసిన విధానం, ‘ప్రమిద’ అని పలికేప్పుడు ఆ గొంతులో సన్నగా వినిపించీ వినిపించని వణుకు, చిరుగాలికి కదిలే దీపశిఖను తలపింపచెస్తుంది. ఈ పాదాన్ని ఆమె దాదాపుగా గుసగుసలాడుతున్నట్టు పలికినా ఉచ్చారణ స్పష్టంగా ఉంటుంది. అద్భుతమయిన గాన సంవిధానం ఇది.
ఇదీ ఉత్కృష్టమైన కళాప్రదర్శన ఫలితం. వ్యక్తులు తమ అంతరంగం లోకి తరచి చూసుకుంటూ, తమని తాము గుర్తించేట్టు చేయడం, తమలో ఎవరికీ తెలియకుండా నిద్రాణ స్థితిలో ఉన్న సున్నిత భావనలను జాగృతం చేసి, మనిషిలోని మానవతలో కదలిక తేవటం కళ ప్రధానోద్దేశ్యం.
ఈ పాట చూస్తూ, అనుభవించిన వారికి, తరువాత, సినిమాలో, వీరిద్దరూ వేరౌవుతారని, ఒక్కో కొడుకుతో వేర్వేరుగా వెళ్తారన్న ఆలోచనే భరించలేనిదిగా ఉంటుంది. ఆ విషాద సంఘటనలోని అన్యాయానికి విలపించని హృదయం ఉండదు. ఆవేశం కలగని అంతరంగం ఉండదు. ఉంటే అది హృదయం కాదు! అది బండరాయి. అది బండరాయి కూడా కాదు. ఎందుకంటే రాయైనా కరగుతుంది ఈ పాటకూ, ఈ సినిమాకూ, ఈ దృశ్యాలకూ. మానవ హృదయం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు.
ఇదీ సినిమా సమాజంపై చూపగల ప్రభావం. మనస్పాక్షిని తట్టి లేపగల కళాశక్తికి చక్కని నిదర్శనం. ఇప్పటి సినిమాల్లో ఏం లోపించిందో ఎత్తి చూపిస్తాయి ఇలాంటి మధురమైన పాటల మనోహరమైన దృశ్యాలు.
(‘మీ నగుమోము’ పాటని యూట్యూబ్‌లో చూడవచ్చు:
https://www.youtube.com/watch?v=2c5w0LM2xEU)
(మళ్ళీ కలుద్దాం)
