[సంచిక కోసం ‘శంతనూ – శర్మిష్ఠ’ ప్రత్యేకంగా రచిస్తున్న సినిమా పాటల శీర్షిక.]
ఏ పారిజాతమ్ములీయగలనో సఖీ
గిరి మల్లికలు తప్ప గరికపూవులు తప్ప
ఏ కానుకలను అందించగలనో చెలీ
గుండెలోతుల దాచుకున్న వలపులు తప్ప
యువకులందరికీ ప్రేయసి గురించి సంస్కారవంతమైన, అత్యుత్తమమైన ఆలోచనలను, ఊహలను కలిగిస్తుందీ కవిత. ఇంతకన్నా గొప్పగా యువతి సౌందర్యాన్ని వర్ణించటం కుదరదు అనిపించేంత అద్భుతమైన కవిత ఇది. ‘ఏకవీర’ సినిమాలో నారాయణ రెడ్డి రాసిన ఈ కవితకు బాణీ కట్టి, సంగీతం చేర్చి ‘పాట’ భావనను కలిగించాడు సంగీత దర్శకుడు కె.వి. మహదేవన్. బాలసుబ్రహ్మణ్యం తన సినీ గాన జీవితంలో అత్యుత్తమంగా పాడిన పాటలలో అగ్రశ్రేణిలో నిలుస్తుందీ కవితాగానం.
‘ఏకవీర’ సినిమా కథ చిత్రమైనది. ప్రపంచంలో ఉన్న అన్ని ప్రేమ కథలనూ తనలో ఇముడ్చుకున్న ప్రేమ కథ ఇది. ఏ ప్రేమ కథ అయినా ఈ కథను కొద్దిగా మార్పు చేస్తే వస్తుంది. ఇద్దరు హీరోలు ఎన్టీరామారావు, కాంతారావు; ఇద్దరు హీరోయిన్లు కె. ఆర్. విజయ, జమునలు ఈ సినిమాలో. నాయకులిద్దరూ ప్రాణస్నేహితులు. ఒకరు ప్రేమించినామెను, ఇంకొకరు వివాహమాడతారు. విషాదాంతం ఈ సినిమా.లోతైన మానసిక సంఘర్షణలను ప్రేక్షకులు మెచ్చే రీతిలో ప్రదర్శించలేకపోవటంతో సినిమా విజయవంతం కాలేదు. అద్భుతమైన పాటలు. కానీ వాటికి సరైన సందర్భాలు, సరైన చిత్రీకరణ లేకపోవటంతో, పాటలు విడిగా వింటే కలిగిన అనుభూతి, సినిమాలో తెరపై చూస్తుంటే కలగకపోవటం కూడా సినిమాని దెబ్బతీసింది. అద్భుతమైన పాటకు, అతకని చిత్రీకరణకు చక్కటి ఉదాహరణ ఈ పాట.
నాయికను చూసి ‘భూపతి’ తన్మయుడవుతాడు. ఆమె చిత్రపటం గీస్తుంటే ఆమే వస్తుంది. గుడిలో పూజలు చేస్తుంది. తన చిత్రపటంపై దోసిలిలో పూలు పట్టుకున్న బొమ్మ వేస్తుంది. అది చూస్తాడు నాయకుడు. చిత్రపటం వైపే చూస్తూ, ఆమె అందం కలిగించిన భావావేశంతో కవితాగానం ఆరంభిస్తాడు.
పాత్ర భావావేశాన్ని తాను అనుభవిస్తూ, పాత్ర సామాజిక స్థాయి, పాత్ర కాలం వంటివన్నీ దృష్టిలో ఉంచుకుని అత్యుత్తమ స్థాయి కవితను రచించాడు నారాయణ రెడ్డి. ప్రేయసి ముందు ప్రియుడు ఎప్పుడూ పేదవాడే. ప్రియుడు ఎప్పుడూ అభ్యర్థించేవాడే. ప్రేయసి కరుణాకటాక్ష వీక్షణాలపై అతని ప్రాణాలు ఆధారపడి ఉంటాయి. ఆమెకు బహుమతి ఇవ్వాలని ఉన్నా ఏమివ్వగలడు? ఈ భావనను పారిజాతాలు, గిరిమల్లికలు, గరికపూలు వంటి చక్కటి పదాలతో ప్రకటించాడు కవితలో.
ఈ కవితలో నారాయణ రెడ్డి చక్కని శబ్ద, అర్ధ అలంకారాలు గుప్పించాడు. దివ్యమైన వస్తువులకు పోలికగా, సామాన్యమైన అంశాలనుంచాడు. పారిజాతాలకు బదులుగా, గిరిమల్లికలు, గరికపూవులు, విలువైన కానుకలకు బదులుగా గుండె లోతుల దాచుకున్న వలపులు…ఇలా దివ్యమైన వస్తువులకు సామాన్యమైన వస్తువులతో పోలిక తేవటం వ్యతిరేక అర్ధాలంకారం. తప్ప అన్న పదాన్ను పదే పదే వాడటం, గిరి, గరిక, గుండె…వంటిపదాలలో ‘గ’ అన్నపదం పదే పదే రావటం శబ్దాలంకారంలో వృత్త్యనుప్రాసాలంకారం. ఇలా అడుగడుగునా అలంకారలతో కవితను అందంగా అలంకరించాడు సినారే.
ఇలాంటి కవితలకు బాణీ కట్టటం చాలా కష్టం. అందుకని అతి తక్కువ వాయిద్యాలతో రాగయుక్త కవితా పఠనంలా కవితను మలచాడు సంగీత దర్శకుడు. చారుకేశి, మిశ్ర శివరంజని రాగాలను కలిపి వాడుతూ పాటలో పలు భావాలను ప్రతిభావంతంగా ప్రదర్శించేవీలు గాయకుడికి ఇచ్చాడు సంగీత దర్శకుడు. చారుకేశి రాగం ఒకవైపు ఆశను, ఆనందాన్ని, మరోవైపు విషాదము, సమర్పితభావాలను స్ఫురింపచేస్తుంది. శివరంజని విషాదాన్ని ఇనుమడింపచేస్తుంది. హైపిచ్ లో పాడే వీలుకల్పిస్తుంది. అతి తక్కువ వాయిద్యాలతో, అవసరమైన చోట, భావాన్ని ప్రస్ఫుటం చేసేందుకు అవసరమైనంత మేరకే పరిమితంగా వాయిద్యాలు వినిపిస్తాయి. అంటే, పాట నిలబడేది గేయ రచయిత ప్రతిభ, గాయకుడి గాన నైపుణ్యంతో పాటు పాట చిత్రీకరణపైనే అన్నమాట!
గాయకుడు బాలసుబ్రహ్మణ్యం లేత స్వరం, పాటలోని మృదుమధుర భావనలకు ఎద స్పందింపచేసే రీతిలో ఉంటుంది. ముఖ్యంగా, పదాలను అనుభవిస్తున్నట్టు, స్పష్టంగా పలకటం, కవితను మరింత చేరువ చేస్తుంది. ఒక్కొక్క పదాన్ని ఉచ్చరించటం , రాగాలు తీయటం, భావాన్ని ప్రకటించటం అత్యద్బుతంగా ఉంటుంది.
పాటకు సన్నివేశం చక్కగా కుదిరింది. తాను గీసిన బొమ్మను, ఆ బొమ్మకు ప్రేరణను ప్రత్యక్షంగా చూస్తూ, ఆమెను వర్ణిస్తూ పాడే పాట ఇది. ఒకప్పటి సినిమాల్లో నాయిక బొమ్మ గీస్తూ, దాన్ని చూస్తూ పాట పాడటం, పాటకు సందర్భాన్నిచ్చేది. నాయిక చిత్రపటాన్ని చూస్తూ ఆమెను వర్ణిస్తూ పాడటం కూడా చక్కటి సందర్భం. కానీ, దర్శకుడు ఈ అత్యద్భుతమైన కవితను ముక్కలు చేసి చూపిస్తాడీ సినిమాలో. అది కవిత మాధుర్యాన్ని సినిమాలో అనుభవించటంలో పెద్ద ప్రతిబంధకంగా నిలుస్తుంది.
జగతిపై నడయాడు చంచలా వల్లికా
తరుణి ఆకృతి దాల్చు శరదిందు చంద్రికా..
పాట ఆరంభానికి ముందు ‘అంతఃపుర కాంతలు వస్తున్నారు, తప్పుకోండి’ అని పూజారి, బొమ్మను గీసుకుంటున్న భూపతిని తరిమేస్తాడు. ఆమె వచ్చి బొమ్మను చూస్తుంది. కానీ అతడు అక్కడే దాక్కుంటాడు. వాళ్ళు వెళ్ళిపోయే సమయానికి అతడు వచ్చి బొమ్మను చూస్తాడు. పాట ఆరంభిస్తాడు.
కెమెరా చిత్రపటాన్ని చూస్తున్న భూపతి వైపు జూమ్-ఇన్ అవుతుంది. పాట సాగుతూండగా జూమ్-అవుట్ అవుతుంది. ఇక్కడే పాట వింటుంటే కలిగిన ఆనందం, చూస్తుంటే కలగకపోయేందుకు బీజం పడుతుంది. కొన్ని పాటలను, తగ్గట్టు చిత్రీకరించటం చాలా కష్టం. దాదాపుగా అసంభవం. హిందీలో ‘బహారో ఫూల్ బర్సావో’ ఇలాంటి పాటే. ఎంత అద్భుతమైన ఊహాదృశ్యాలను ఈ పాటలు మనోఫలకంపై చిత్రిస్తాయంటే, ఎంత సుందరంగా చిత్రీకరించినా, ఈ పాటల దృశ్యరూపాలు మెప్పించటం కష్టం.
ఎందుకంటే, పాటలో ‘తరుణి ఆకృతి దాల్చు శరదిందు చంద్రికా’ అంటున్నప్పుడు ఆమె అందానికి అతనిలో కలుగుతున్న ఆశ్చర్యానందాలను ప్రేక్షకులకు చేరువ చేసేందుకు కెమెరా ఆర్క్ షాట్ (180 డిగ్రీలలో కెమెరా తిరుగుతుంది, Arc Shot) లో అతడి వదనం చూపిస్తూ, ఆమె వైపుకు వెళ్తుంది. తరువాత కెమెరా క్రేన్‍పై ఆమె వైపు వెళ్తూ గాలిలో తేలుతున్నట్టు వెళ్తుంది. అయితే, ఇక్కడ కవితలో ఉన్న వర్ణన కలిగించే భావాలు అక్కడ నాయికను చూస్తే కలగవు. నాయిక అందంగా ఉన్నా, ఆమె హావభావాలు కృత్రిమంగా ఉండి భావాన్ని విరిచేస్తాయి, ‘సిరివెన్నెల’ సినిమాలో ‘వెన్నెలలో బృందావనం’లా.
పాట రచనలోని గొప్పతనం, కవి ప్రదర్శించే అత్యుత్తమము, అత్యున్నతము అయిన భావాలు, వాడిన పదబంధాలు ఒకవైపు వరం అయితే, మరోవైపు శాపంగా పరిణమించాయన్నమాట. లైటింగ్ తో నాయికా నాయకుల వదనాలు ఎంతగా వెలిగేట్టు చేసినా, కవిత అందం ముందు, పాడిన స్వరం ముందు అన్నీ దిగదుడుపే!
నీవు లేని తొలి రాతిరి నిట్టూర్పుల పెను చీకటి
నీవు లేని విరి పానుపు నిప్పులు చెరిగే కుంపటి
విరులెందుకు, సిరులెందుకు
మనసు లేక మరులెందుకు
తలపెందుకు, తనువెందుకు
నీవు లేక నేనెందుకు..
‘ఏ పారిజాతమ్ములీయగలనో సఖీ’ బయట రికార్డులో మొత్తం వింటాం. సినిమాలో ‘శరదిందు చంద్రికా..’ దగ్గర పాట ఆగిపోతుంది. రసభంగం అవుతుంది. నిరాశ కలుగుతుంది. ఆ నిరాశ నుంచి తేరుకోవడం కష్టం. ఇప్పుడు ‘కుట్టాన్ సేతుపతి’ వంతు. అతడు తాను ప్రేమించిన అమ్మాయిని కాక, వేరే అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు. తాను ప్రేమించినామెను మరచిపోలేడు. భార్యతో ఉదాసీనంగా ఉంటాడు. ఈ కవిత గానం చేస్తాడు. బాలసుబ్రహ్మణ్యం చక్కగా పాడేడు. కానీ ఎన్టీరామారావుకు ఈ స్వరం ఈ సినిమాలో సరిపోలేదు. పైగా, కాంతారావు అంతకు ముందే, ‘ఏ పారిజాతమ్ములీయగలనో’ అని చక్కగా ఎమోషన్స్ చూపిస్తూ పాడేడు. దాంతో ఎమోషనల్‍గా పండి, పాత్రలపై కలగాల్సిన సానుభూతి కలగదు.
పాత్రల నిరాశ, నిస్పృహలు, ఒంటరితనాలను ప్రేక్షకులకు చేరువ చేయాలని కెమెరా క్లోజప్పులు, దూరం వెళ్ళటం, లో-యాంగిల్‍లో చూపటం ద్వారా ఎంతగా ప్రయత్నించినా, ఎన్టీరామారావుకు లేత బాలసుబ్రహ్మణ్యం స్వరం సరిపోలేదు. దాంతో, సింహానికి జింక గొంతులా అనిపిస్తుంది. పాటలో పండాల్సిన ఎమోషన్స్ పండటం అటుంచి, చైతన్యరహితం అయిపోయాయి.
కలువపూల చెంత చేరి కైమోడుపు సేతునూ
నా కలికి మిన్న కన్నులలో కలకలమని విరియాలనీ
మబ్బులతో ఒక్క మారు మనవి చేసికొందును
నా అంగన ఫాలాంగణమున ముగురులై కదలాలనీ
చుక్కలతో ఒక్కసారి సూచింతును (చూపించి నిను)
నా ప్రేయసి నల్లని వాల్జడ సందుల మల్లియలై మొలవాలనీ
పూర్ణ సుధాకర బింబమ్మునకు వినతి సేతును
నా పొలతికి ముఖ బింబమై కళలు దిద్దుకోవాలనీ
ప్రకృతి ముందు చేతులెత్తి ప్రార్ధింతును కడసారిగా
నా రమణికీ బదులుగా ఆకారం ధరియించాలనీ..
ఏం కవిత! మామూలు కవులు రాయలేరు ఇలాంటి కవితను. ఎంత భాషా పటిమ ఉన్నా, శృంగార రమణీయ భావనా బలం లేకపోతే, ఇలాంటి కవిత వెలువడదు. ప్రకృతి లోని ఒక్కొక్క అందాన్ని తన ప్రేయసి శరీరంలో ఒక్కో భాగం అవాలని కోరుతూ చివరికి ప్రకృతినే తన తరుణికి బదులుగా ఆకారం ధరించాలనే ఊహ సామాన్యమైన ఊహ కాదు. సృజనాత్మక శక్తికి పరాకాష్ఠ. బాలసుబ్రహ్మణ్యం కూడా అనుభవిస్తూ పాడేడు. పాట చిత్రీకరణలో కవి సూచనను అనుసరించి, కలువపూలు, మబ్బులు, ఫాలంపై ముంగురులు, వాల్జడలో మల్లెపూలు.. ఇలా అన్నీ చూపించినా కవిత హఠాత్తుగా ఆరంభమవడం ప్రేక్షకుడిలో తడబాటు కలిగిస్తుంది. రొమాంటిక్ భావనలను అనుభవించే సమయం ఇవ్వదు. అప్పటివరకూ భార్యవైపు ఉదాసీనంగా ఉన్నవాడు హఠాత్తుగా ఆమెనిలా వర్ణించేయటం జీర్ణం చేసుకోలకపోతాడు ప్రేక్షకుడు.
మొదటిసారి కవిత వచ్చినప్పుడు, ఇంకా వస్తుందన్న ఎదురుచూపును హఠాత్తుగా పాట ఆపి, నిరాశపరిచి, రసభంగం చేస్తాడు. మూడవసారి హఠాత్తుగా ఉరుము మెరుపుల్లెని వానలా ఆరంభమవుతుంది. ఏమవుతుందో తెలిసేలోగా పాట అయిపోతుంది. మొత్తంగా కలిపి విన్న అనుభూతి – ముక్కలు ముక్కలుగా చూపటంతో, వొరిగి, కరిగి, పొంగిపోతుంది, ఆవిరైపోతుంది.
షడ్రసోపేత భోజనాన్ని వరుసగా ఒక్కో వంటకాన్ని తింటూంటే కలిగే ఆనందం వేరు. కాస్త తిని ఓ గంట బయటకు వెళ్ళొచ్చి, మరికాస్త తిని, మళ్ళీ బయటకు వెళ్ళొచ్చి.. ఇలా ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో తింటుంటే ఆనందం కన్నా విసుగు, చిరాకు ఎక్కువ కలుగుతాయి. పైగా, కాంతారావు ఆరంభించిన పాట, రామారావుపై ముగియటం అస్సలు నప్పదు. దాంతో ప్రేక్షకుడికి ఈ కవిత వినటంలో కలిగిన తన్మయత్వం, చూస్తుంటే కలగదు. ‘ఏకవీర’ సినిమాలో పాటలను చూడటం కన్నా కళ్ళు మూసుకుని వినటంలోనే పాటల మాధుర్యం, అనుభవించగలుగుతాం. తాదాత్మ్యం చెందుతాం. రసప్రవాహంలో మునకవేస్తాం. మధురమైన గీతానికి తగ్గ మనోహర దృశ్యం తోడుకాకపోతే ఎలాంటి ఫలితం కలుగుతుందో ఈ వాసన లేని పారిజాతం లాంటి పాట నిరూపిస్తుంది.
~
కాంతారావు మీద చిత్రించిన పాట భాగం లింక్:
https://www.youtube.com/watch?v=O56DvdffQRg
ఎన్టీరామారావు మీద చిత్రించిన పాట భాగం లింక్:
https://www.youtube.com/watch?v=b6-2QjotnKs&
బాలసుబ్రహ్మణ్యం స్వరాభిషేకం కార్యక్రమంలో పాడిన మొత్తం పాట లింక్
https://www.youtube.com/watch?v=AgfpWl7-jSo&
(మళ్ళీ కలుద్దాం)
