Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మధురగీతాలు – మనోహరదృశ్యాలు-65

[సంచిక కోసం ‘శంతనూ – శర్మిష్ఠ’ ప్రత్యేకంగా రచిస్తున్న సినిమా పాటల శీర్షిక.]

ఎవరి కోసం? ఎవరి కోసం?
ఈ ప్రేమ మందిరం, ఈ శూన్య నందనం
ఈ భగ్న హృదయం, ఈ అగ్నిగుండం?
ఎవరి కోసం? ఎవరి కోసం?

ప్రేమనగర్’ సినిమా చివరలో వచ్చే ఈ పాట భగ్న ప్రేమికుల జాతీయ గీతం లాంటిది. ప్రేయసి నిరాకరణను మాత్రమే కాదు, ఎన్నో  ఆశలు పెట్టుకున్న తరువాత అది అడియాస అయితే హృదయ సాంత్వన కోసం పాడుకునే ‘లేపనం’ లాంటిది ఈ పాట. ‘ప్రేమనగర్’ సినిమాలో ఎన్నో హిట్ పాటలున్నాయి. ‘నీ కోసం వెలిసింది’, ‘తేట తేట తెలుగులా’, ‘ఎవరో రావాలి’, ‘మనసు గతి ఇంతే’ లాంటి హిట్ పాటలున్నా చిత్రీకరణ పరంగా, సందర్భం పరంగా, ప్రేక్షకులపై చూపిన ప్రభావం పరంగా కూడా మిగతా పాటలన్నిటికన్నా పై మెట్టు పై ఉంటుంది ఈ పాట.

సినిమా మామూలు ప్రేమ కథ. ఓ ధనవంతుడు, అహంకారి, కానీ సున్నిత మనస్కుడు అయిన హీరో,  పేద అయినా ఆత్మాభిమానం కల హీరోయిన్.. ఇద్దరి మధ్య ప్రేమ. ఆమె కోసం అతడో ప్రేమ మందిరం కట్టిస్తాడు ఆమె పై ప్రేమ సూచకంగా. అతడి దురలవాట్లను ఆమె మాన్పిస్తుంది. ఇంతలో అతడి బంధువులు కుట్రలు పన్ని నాయకుడికి నాయికకు  నడుమ అపోహలు కల్పిస్తారు. వారు వేరయిపోతారు. నాయకుడు మళ్లీ దురలవాట్ల పాలవుతాడు. ఆమె వేరే అతడితో పెళ్ళికి సిద్ధమవుతుంది. ఇది తెలిసి నాయకుడు ఆమెని ఆశీర్వదించి, ఆమె కోసం కట్టిన ప్రేమ భవంతి లోకి వచ్చి,  విషం తాగి పాట పాడతాడు. అతడి తల్లి వెళ్లి నాయికను వెనక్కు తెస్తుంది. ఈ సందర్భంలో, ప్రేమ మందిరాన్ని చూస్తూ, ఎవరి కోసం కట్టించానీ భవంతిని? అని ఆవేశంతో, ఆవేదనతో, ఆక్రోశిస్తూ, పాట పాడతాడు హీరో.

ఆత్రేయ ఈ పాటను తనకలవాటయిన రీతిలో అద్భుతంగా రాశాడు. నాయకుడి నిరసనను, ఆవేశాన్ని, భగ్న హృదయంలో సుళ్లు తిరిగే భావాలను అత్యద్భుతంగా, సినిమా కథను అనుసరిస్తూ, సందర్భోచితంగా వ్యక్తపరచాడు. ‘నీ కోసం వెలసింది ప్రేమ మందిరం’ పాటను అనుసరిస్తూ ‘ఎవరి కోసం ఈ ప్రేమ మందిరం, ఈ శూన్య నందనం?’  అంటూ పాటను ఆరంభించాడు. అంటే పాట ఆరంభంలోనే అతడు కన్న కలలు కల్లలయ్యాయని ఆ ఆవేశం, ఆవేదనలే ఈ పాట అని చెప్పేశాడన్న మాట గేయ రచయిత.

నీ కోసం వెలిసింది ప్రేమ మందిరం
నీ కోసం విరిసింది హృదయనందనం

ఇది ఆనంద సమయంలో పాడిన పాట.

ఎవరి కోసం ‘ఈ ప్రేమ మందిరం, ఈ శూన్య నందనం?’ అనటం తోటే ఇతడి కలలు భగ్నమయ్యాయనీ ఆమె మాట తప్పిందనీ తెలుస్తుంది. ఆ తరువాత అతడి భగ్న హృదయం ప్రసక్తి వస్తుంది.

హృదయం భగ్నమయిన తరువాత అంతా ఆవేశాగ్ని,  నిరాశాగ్నియే. కాబట్టి, అగ్నిగుండం అతడి హృదయం.   ఆ భవనం ‘అగ్ని గుండం’. ప్రపంచమే అగ్ని గుండం. మనసేం చూడాలని అనుకుంటే, మెదడు అది చూపిస్తుంది. కన్ను అది చూస్తుంది. అతడి భగ్న హృదయాన్ని, అగ్నిగుండం లాంటి ఆవేదనను దృశ్యం మనకు చూపిస్తుంది.

ఈ పాటను సంగీత దర్శకుడు ప్రధానంగా కల్యాణ రాగంలో రూపొందించాడు. కానీ ఈ రాగం సాధారణంగా మంగళకరమైనది. ఆనందమయమైనది. ‘యమన్ కళ్యాణ్’గా కూడా పిలిచే ఈ రాగంలో ఆనంద భావనలో అంతర్లీనంగా విషాదం ఉంటుంది. ఈ పాటలో కరుణరసాన్ని, విషాదాన్ని కలిగించేందుకు ఈ రాగాన్ని ఒక ఆయుధంలా వాడేడు సంగీత దర్శకుడు.  అక్కడక్కడా శివరంజని ఛాయలు కనబడటంతో విషాదం మరింత పెరుగుతుంది. అందమైన భవంతి, విశాలమైన భవంతి, పలు రకాల శిల్పాలు, అలంకారాలు  ఉన్న భవంతి. దానిలో ఒంటరిగా, గమ్యం లేకుండా పిచ్చివాడిలా తిరుగుతూ, తూగుతూ  పాడుతున్న హీరో.. దాంతో హీరో విషాద  భావన  ప్రేక్షకుడి మనస్సులో రెట్టింపయి తోస్తుంది.

పాట చిత్రీకరణను ‘master class’ అనవచ్చు. సరిగ్గా పాట పాడే సమయానికి ఉరుములు, మెరుపులతో వర్షం రావటంతో, భీభత్స భయానక వాతావరణం, హీరో మానసిక స్థితిని ప్రతిబింబిస్తున్నట్టనిపిస్తుంది. దాంతో సంగీత దర్శకుడికి వయెలిన్లు విహ్వలంగా రోదిస్తున్నట్టు  వినిపించే వీలు చిక్కింది. పాట లయ ఆవేశంతో వేగంగా కొట్టుకునే గుండె లయను తలపిస్తుంది. దాంతో పాటకు ఒక ఊపు వస్తుంది. సాధారణంగా, యుద్ధ సన్నివేశాలలో వినిపించే సంగీతం లయలో, ఆవేశంతో పాటు విషాదాన్ని చొప్పించటంతో హీరో ఆవేశం, కసి, వేదన, విషాదం అన్నీ కలగలసి ప్రేక్షకుడి మనస్సు అనుభవిస్తుంది.

ఇక ఘంటసాల పాడే విధానం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇదే పాటను తమిళంలో సౌందర  రాజన్, హిందీలో కిషోర్ కుమార్‍లు పాడేరు. మూడు భాషలలో పాటలు హిట్ అయ్యాయి. తమిళంలో నటుడు శివాజీ గణేశన్ నటనా విధానాన్ని అనుసరించి గాయకుడు నాటకీయతను చూపించాడు. పాటలో విషాదం కన్నా ఆవేశాన్ని అధికంగా ప్రదర్శించాడు. మధ్యమధ్యలో అరుపులు కూడా . హిందీలో రాజేశ్ ఖన్నా నటనను అనుసరించి కిషోర్ కుమార్ తాత్వికంగా,  మాట్లాడుతున్న రీతిలో పాటను పాడేడు. విషాదం కన్నా తాత్వికత ధ్వనిస్తుంది పాటలో. తెలుగులో ఘంటసాల పాటలో ఆవేశం ప్రదర్శించాడు. విషాదం ధ్వనింపచేశాడు. అతి తీవ్రమైన ధుఃఖాన్ని వినిపింపజేశాడు. కసిని ధ్వనింప చేశాడు. చివరికి తను జీవించి లాభం లేదన్న తాత్వికతను, నిర్లిప్తతను, తెగువను పలికాడు. అంటే తన స్వరంతో పాటను ఒక ‘ఒపేరా’లా మలచాడన్నమాట ఘంటసాల. అందుకే అదే బాణీ అయినా తమిళంలో వింటుంటే బాగున్నదనిపిస్తుంది కానీ ‘అద్భుతం’ అనిపించదు. హిందీలో కిశోర్ కుమార్ అంటే ప్రాణాలచ్చే అభిమానులు సైతం, ఘంటసాల పాట విని, మౌనంగా ఉండిపోతారు. ఏ భాషలో వింటే ఆపాటే  గొప్పగా అనిపించినా, ఏ గాయకుడి ప్రత్యేకత ఆ గాయకుడిదే అయినా,  ‘ఘంటసాల’ స్వరంలో పాట విన్న తరువాత ఇతరుల గానాన్ని మెచ్చటం కొంచెం కష్టం.

ఇక్కడే చిత్రీకరణ ప్రాధాన్యం తెలుస్తుంది. విశాలమైన భవంతిలో పాటను చిత్రీకరించారు.  ముఖ్యంగా, నాయకుడి ఒంటరితనాన్ని, బాధను ప్రేక్షకుడికి చేరువ చేయాలి. అందుకని పాటలో అధికంగా wide tracking shots, slow pan shots ద్వారా ఎంత విశాలమైన భవనమో, మనుషులు లేకుండా ఎంత ఖాళీగా ఉందో, హృదయానికి హత్తుకునే రీతిలో చూపించాడు కెమేరామన్ విన్సెంట్. ‘Low angle shots’ ద్వారా పై కప్పు ఎంత ఎత్తుగా ఉందో, నాయకుడు భవంతిలో ఎంత ఒంటరివాడో చూపిస్తూ, ఎంత ధనం ఉన్నా ఏం లాభం, మనశ్శాంతి లేకపోతే? అన్న భావనను కలిగిస్తాడు. ఇక క్లోజపుల ద్వారా బరువైన కళ్లు, విషాదంతో ఎర్రబారిన కళ్లు, ముఖంలో ఆవేదన, ఆవేశం, కసి వంటి భావనలన్నీ ప్రేక్షకుల అనుభవానికి తెస్తుంది కెమేరా.

ప్రేమ భిక్ష నువ్వే పెట్టి, ఈ పేద హృదయం పగుల గొట్టి
పిచ్చివాణ్ణి పాత్ర లేని బిచ్చగాణ్ణి చేశావు
నువ్వివనిదీ తాకలేనూ.. ఇంకెవరినీ అడుగలేనూ
బ్రతుకు నీకు ఇచ్చాను.. చితిని నాకు పేర్చావు

వారిద్దరి నడుమ అనుబంధం పాట చక్కగా ప్రదర్శించింది. పాట ఆరంభం సంగీతం వస్తునప్పుడే కెమేరా భవంతి గోడలను చూపుతూ విషాదంగా చూస్తున్న నాగేశ్వరరావును చూపిస్తుంది. నాయిక  పెద్ద ఫోటో ముందు నిలబడి ఎంగేజ్‌మెంట్ ఉంగరాలు తీసి, హాలు మధ్యలో నిలబడి పాటను అందుకున్నప్పుడే, లాంగ్ హై షాట్ లోనే నాయకుడి విషాదాన్ని ఒంటరితనాన్ని ప్రస్ఫుటం చేస్తుంది పాట.

ఇక పాటంతా అయోమయంలో  ఉన్న వాడిలా,వేలు ఎత్తి చూపుతూ, చేయి సాచి చూపుతూ, ఊగుతూ తన కలవాటయిన రీతిలో నాగేశ్వరరావు నటిస్తాడు. పాటను ప్రేక్షకుడికి చేరువ చేసేవి కెమేరా కదలికలు, ఘంటసాల స్వరం. ముఖ్యంగా, ‘ఎవరి కోసం? ఎవరి కోసం?’ అంటున్నప్పుడు నేపథ్యంలో పగులుతున్న అద్దాల  ధ్వనులు విపించటం గొప్ప ఎఫెక్టునిస్తుంది.

పాట ‘ఎవరి కోసం?’ అంటూ  పల్లవి కాగానే సుడిగాలి శబ్దాలు, మెరుపులు, ఉరుములు, ఏదో అయిపోతున్నట్టు సంగీతం వినిపించి, ఒక్క సెకనులో అంతా నిశ్శబ్దంగా ఉంచి, చరణం అందుకోవటం గొప్ప ఎఫెక్టును ఇస్తుంది. బయట ప్రళయం, లోపల పాట.. ఇక్కడ నాయకుడి హృదయంలో ప్రళయం, పెదవులపై పాట అన్న మాట.

ఓర్వలేని ఈ ప్రకృతి ప్రళయంగా మారనీ
నా దేవి లేని ఈ కోవెల తునాతుకలై పోనీ
కూలిపోయి ధూళిలో కలసిపోనీ
కాలిపోయి బూడిదే మిగలనీ..

పాటను గేయ రచయిత నిర్మించిన విధానం గమనించదగ్గది. పల్లవిలోనే పరిస్థితి చెప్పేశాడు. నాయకుడికి ఇక ఏ గమ్యం, ఏ ఆశలూ లేవని నిరూపించేశాడు. మొదటి చరణంలో ఆమె చేసిన అన్యాయం చెప్పేశాడు. ఇప్పుడు తమ ప్రేమకు ప్రతీక అయిన ఆ భవనం తునాతునకలయి, కూలిపోయి ధూళి అవ్వాలని, కాలిపోయి బూడిదవ్వాలనీ నిరాస నిస్పృహలతో కూడిన కసిని చూపించేశాడు.

చిత్రీకరణ కూడా తగ్గట్టుగా ఉంటుంది. నాయకుడు వేలు చూపించగానే ఆ వైపు భవంతిని, టిల్టింగ్ షాట్తో చూపించటం, అంతా అల్లకల్లోలమై నాశనమౌతున్న భావనను కలిగిస్తుంది. గాలికి ఊగే పరదాలు, వణికే భవంతి, మెరుపులు, ఉరుములు గొప్ప ఎఫెక్టునిస్తాయి. పాటను సందర్భాన్ని ఎంచుకోవటమే కాదు, తగ్గ మూడ్‌ను సృష్టించటంతో,  అదీ ఉద్విగ్నభరితమైన క్లైమేక్స్ కావటంతో పాట మరపురానిదిగా నిలుస్తుంది.

మమత నింపమన్నానూ, మనసు చంపుకొన్నావూ
మధువు తాగనన్నాను, విషం తాగమన్నావూ
నీకు ప్రేమంటే నిజం కాదు, నాకు చావంటే భయం లేదు
నీ విరహంలో బ్రతికానూ, ఈ విషంతో మరణిస్తానూ..

పాట చరణాల నడుమ నాయిక కారులో రావటం, వర్షం, అడ్డంకులు, ఏడుస్తున్న వాణిశ్రీ వదనం అన్నీ పాట ప్రభావాన్ని పెంచుతాయి. ఈ చరణం పాటలో కీలకమైనది. ఆమె చేసిన అన్యాయం,  అన్నీ ధ్వంసం చేసే కసి అయిన తరువాత ఇప్పుడు నాయకుడి స్వీయ వినాశక మనస్తత్వాన్ని చూపించాడు గేయ రచయిత. నాగేశ్వరరావు కూడా వర్షంలో తడుస్తూ, ఏడుస్తున్న మొహం పెట్టి, ‘విషం తాగమన్నావు’ అన్నప్పుడు ఏడుస్తూ ఉక్రోషంతో ఫిర్యాదు చేసే పిల్లవాడిలా గొప్పగా నటించాడు. ఘంటసాల కాదు తానే పాడుతున్న భ్రమను స్థిరపరిచాడు. ‘నీకు ప్రేమంటే నిజం కాదు’లో ఘంటసాల స్వరంలోని కసి, నాగేశ్వరరావు చూపకపోయినా, వంగి తూగుతూ, వర్షంలో తడుస్తుండటం సరిపోతుంది. ‘మరణిస్తాను’ అని రెండోసారి అన్నప్పుడు నాగేశ్వరరావు కన్నా ఘంటసాల స్వరం ద్వారా బాగా నటించాడనిపిస్తుంది.

మొత్తానికి చిన్న చిన్న వాక్యాలలో పెద్ద పెద్ద భావనలు, భగ్న హృదయపు ఆవేశకావేశాల ఘోషలను ఇమిడ్చిన  ఆత్రేయ, తగిన రీతిలో చిత్రీకరించిన దర్శకుడు కె.ఎస్.ప్రకాశరావు, కెమేరామన్ విన్సెంట్. సంగీత దర్శకుడు కె.వి.మహదేవన్, నాగేశ్వరరావు, ఘంటసాలు కలసి ఒక మరుపురాని, అత్యంత ప్రభావవంతమైన దృశ్యాన్ని సినీ ప్రపంచానికి అందించారు.

తమిళంలో కె.వి.మహదేవన్ సంగీత దర్శకుడిగా, పాటను ఇదే బాణీలో రూపొందించినా శివాజీ గణేశన్ నాటకీయ నటనను దృష్టిలో ఉంచుకుని వాయిద్యాల గమనంలో సున్నితమైన మార్పులు చేశాడు. పాటలో పదాల దృష్టి కూడా మారింది. చిత్రీకరణ  కూడా మారింది. నాటకీయత నటనలోనే ఉండటంతో మరీ ఓవర్ డ్రమటిక్‌గా చిత్రించకుండా, నటుడి హావభావాలు కదలికలపై దృష్టి కేంద్రీకరించింది కెమేరా. ‘ప్రేమ పోపో’ అన్న అరుపును జోడించారు. ఇంటర్లూడ్ సంగీతం కూడా మారింది. పాట బాణీల మధ్యలో వచ్చే బీభత్సం నటనలోనే వచ్చేసింది. నాగేశ్వరరావులో కనిపించిన దైన్యం  శివాజీలో కనిపించదు. కసి, ఆవేశం అధికంగా కనిపిస్తాయి. నాగేశ్వరరావు ఒంటరిగా అనిపిస్తే, శివాజీ భవంతితో పోరాటం చేస్తునట్టునిపిస్తాడు.

(‘యారుకాగ్గే’ పాటని యూట్యూబ్‌లో చూడవచ్చు
https://www.youtube.com/watch?v=5KF2KXfv7Rs)

‘హిందీ’లో రాజేశ్ ఖన్నా పూర్తిగా భిన్నమైన నటుడు. పాట ధోరణి కూడా మారింది. ‘జా ముఝె అబ్ నా యాద్ ఆ’ అంటూ సాధారణ రాజేశ్ ఖన్నా పాటగా మారింది. యమన్ కళ్యాణ్ రాగంలో ఎస్డీ బర్మన్ పాటను తనకు అలవాటయిన ధోరణిలో రూపొందించాడు. హీరోలో కసి, క్రోధం బదులు తనకు జ్ఞాపకం రావద్దని నాయకను వేడుకుంటాడు నాయకుడు.  దాంతో విడిగా వింటే  బాగానే  ఉందనిపించే పాట – తెలుగు, తమిళ పాటలతో పోలిస్తే తేలిపోతుంది. హైగా పాట నడుమ ఆ మహల్‌లో హేమమాలినిని చూపిస్తుండటంతో తెలుగు, తమిళ పాటల్లోని ‘ఒంటరితనం’ భావన హిందీలో కలగదు, పైగా, కిశోర్ కుమార్ స్టయిలిష్ పాట, రాజేశ్ ఖన్నా స్టయిలిష్ నటన ఆ సందర్భంలోని ‘ఎమోషన్స్’ తీవ్రతను తగ్గిస్తాయి. పాట సాధారణం అనిపిస్తుంది.

(‘జా ముఝె అబ్ నా యాద్ ఆ’ పాటని యూట్యూబ్‌లో చూడవచ్చు
https://www.youtube.com/watch?v=-AlooPi4GyE)

ఈ మూడు పాటలలో సెట్ నిర్మాణాన్ని గమనించాల్సి ఉంటుంది. తెలుగులో ‘ప్రేమనగరం’ అన్న భవంతిని ‘ప్రేమ మందిరం’లా రూపొందించారు. ‘వసంత మాళిగై’ అంటే ‘వసంత భవనం’ అనుకోవచ్చు. అందుకని ఓ రాజభవనంలో ఉండే ఐశ్వర్యం భవనంలో చూపించారు. హిందీలో దృష్టి అంతా ఒక జమిందారు ఇల్లు లాంటి ధనవంతమైన భవనం, మెట్లు చూపటం పైనే ఉంది.

తెలుగులో నాయకుడు నాయిక చిత్రపటం చూసి పాట మొత్తం ఆమెతో సంభాషణలా పాడతాడు. తమిళంలో నాయిక విగ్రహం చుట్టు కోపంగా తిరుగుతాడు. హిందీలో అద్దాలు, గ్లాసులు, పగలగొడుతూ తన నిస్సృహను, నిరాశను ప్రదర్శిస్తాడు నాయకుడు. అంటే సినిమా ఒకటే అయినా ప్రాంతాన్ని బట్టి, భాషను బట్టి, నటీనటులను బట్టి, గేయ రచయితలు ఆ సందర్భాన్ని అర్థం చేసుకుని పాటలో పొదిగిన భావాలను బట్టి, సంగీత దర్శకుడు, కెమేరామన్, కళాధర్శకుడు, దర్శకుడు వీరందరి అభిరుచిని బట్టి పాట మారుతుంది. నటన మారుతుంది. దృశ్యం మారుతుంది. కానీ ప్రేక్షకులపై, సమాజంపై ప్రభావం మాత్రం ఒక్కటే.

సినిమాలో నాయికా నాయకుల వ్యక్తిత్వాలు, ప్రవర్తనల ప్రభావం సమాజంపై ఎలాగో ఉంటుంది. కానీ, ఆకర్షణీయమైన పాటకు, అంతే ఆకర్షణీయమైన చిత్రీకరణ తోడయితే, సినిమాతో సంబంధం లేకుండా పాట ప్రభావం ప్రత్యేకంగా ఉంటుంది. ‘ఎవరికోసం’ పాటలో భగ్న ప్రేమికుడి మనస్తత్వంలోని న్యూనతా భావం, తనకు అన్యాయం జరిగిందన్న ఆక్రోషం, తనను మోసం చేసింది, తాను మోసపోయాడన్న ఉక్రోషం, ఒంటరితనం భావన, జీవితం శూన్యం అన్న విలాపం, ఇక తన జీవితం వ్యర్ధం అన్న నిస్పృహ, స్వీయనాశన లక్షణాలన్నిటినీ, గేయ రచయిత, ప్రధాన పాత్ర మానసికంగా ఒక్కో మెట్టు దిగజారటం చక్కగా, పద్ధతి ప్రకారం చూపించాడు తన గేయంలో. చివరి దశ “ఈ విషంతో మరణిస్తాను” అనటం. అంటే, ప్రేయసి లభించకపోతే, విషం తాగి మరణించటం తప్ప మరో దారి లేదన్నమాట. ఇది సమాజానికి తప్పుడు సంకేతం ఇస్తుంది. ఆత్మహత్యను ఎప్పుడూ ఆకర్షణీయంగా, అదే పరిష్కారం అన్నటు చూపకూడదు. అందుకే, హారతీయ కళలన్నీ సుఖాంతాలయి, ఆనందం కలిగించేందుకే ప్రాధాన్యం ఇస్తాయి.

భగ్న ప్రేమల జాతికి పిత ‘దేవదాసు’. ప్రేమ విఫలం అయితే తాగి జీవితం నాశనం చేసుకుని చావటం ‘అమర ప్రేమ’ అన్న భావన సమాజంలో స్థిరపరచింది ‘దేవదాసు’. 1939లోనే దేవదాసు వల్ల సమాజంపై పడే దుష్ప్రభావాన్ని గ్రహించి దానికి అడ్డుకట్ట వేయటం కోసం, ప్రేమలో విఫలమైతే తాగి నాశనం అవటం కాదు, తన జీవితానికి అర్ధం కల్పించుకోగలిగినవాడే  అసలైన మనిషి అని నిరూపిస్తూ శాంతారామ్ ‘ఆద్మీ’ అనే సినిమా నిర్మించాడు. కానీ నీరు పల్లానికి జారటం సులభం. అదే ఎత్తులు అధిరోహించాలంటే ఎంతో శక్తి అవసరం. ‘దేవదాసు’కు లభించిన ఆదరణ ‘ఆద్మీ’కి లభించలేదు. భగ్నప్రేమ అంటే ‘తాగటం’అన్నది స్థిరపడిపోయింది.

తరువాత భగ్నప్రేమికుడంటే కసిగా ‘విషం’ తాగటం, కోపంతో అన్నీ విసిరేయటం,  విరగొట్టటం అయింది. తాను ‘విషం’ తాగటం ద్వారా తనను కాదన్న ఆమెలో  ‘నేరభావన’ కలిగించటం అన్నది ‘ప్రేమ’ అయింది. ఆమె కోసం కట్టించిన భవనం నాశనమయిపోవాలి, కాలిపోయి బూడిదయిపోవాలి, అన్న కసి  తనని కాదంటే చంపటం, దాడి చేయటం, యాసిడ్ పోయటం వంటి క్రూరమైన ఆలోచనలకు దారి తీస్తుంది. తరువాత ఇదొక  ట్రెండ్ అయింది. ప్రేమ భావనకే కాదు, ప్రేమ ఫలవంతమవకపోతే వ్యక్తి ఎలా ప్రవర్తించాలో కూడా సినిమాలే సమాజానికి బోధిస్తున్నాయి. ఆ బోధనలో  ఇలాంటి ప్రతిభావంతమైన పాటలు, దృశ్యాలు తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి. కళ వ్యాపారమై, ఆకర్షణీయమై బాధ్యతను మరచినప్పుడు ఇలానే జరుతుంది. దాని దుష్ఫలితాలు తరువాత తరాలు అనుభవిస్తాయి.

ఈ సినిమా సుఖాంతం అయింది. కానీ, నాయిక కాదంటే, విషం తాగేయటం ఒక రకమైన ‘ఎమోషనల్ బ్లాక్ మెయిల్’ లాంటిది. ఆ బ్లాక్ మెయిల్ బెదిరింపులకు నాయిక లొంగిపోవటం కూడా సమాజంలో ఒక తీవ్రమైన తప్పుడు సంకేతం పంపిస్తుంది. మన సినిమాల్లో, తాము చూపించినవాడిని కూతురు పెళ్ళి చేసుకోనంటే, చస్తామని తల్లిదండ్రులు బ్లాక్ మెయిల్ చేయటాన్ని నేరంగా చూపిస్తారు. కానీ, అదే నేరం చేసే హీరో, గొప్ప ప్రేమికుడు, త్యాగి.  నాయిక పరుగున వచ్చేస్తుంది. నిజానికి, ఆత్మగౌరవం, ఆత్మాభిమానం ఉన్న నాయిక అయితే, ” నేను లేకపోతే, ఎందుకూ పనికిరాక, జీవితం  వ్యర్ధం అనుకునే దౌర్బల్య మనస్కుడిని పెళ్ళి చేసుకుని లాభం ఏమిటి, జీవితాంతం, బ్లాక్ మెయిల్ చేస్తూనేవుంటాడు” అని తన జీవితం తాను చూసుకుంటుంది. కానీ, అలాగంటే, సినిమాలెలా నడవాలి? అమరప్రేమలెలా నిలవాలి?

మానవ మనస్సు చాలా సున్నితమైనది. ఆ సున్నితమైన మనస్సుకు అతి శక్తివంతమైన సూచనలు అతి సున్నితంగా, ప్రభావం చేసే రీతిలో  అందిస్తుంది కళ. కళ ప్రభావం అందరి పైనా ఒకేరకంగా  ఉండదు. మనస్సుపై నియంత్రణ లేని వారిపై ఈ సూచనలు అధికంగా ప్రభావం చూపించి, కార్యోన్ముఖులను చేస్తాయి. కళ ఉత్తమమై ఉన్నతమైన సూచనలిస్తే ప్రభావం సమాజంపై ఉత్తమంగా ఉంటుంది. లేక పోతే కళ ఉన్నత స్థాయిదైనా, అందించే  సూచనలు ప్రమాదకరమైతే,  ‘ఎవరి కోసం? ఎవరి కోసం?’ అని పాడుకోక తప్పదు సమస్త సమాజం.

~

(‘ఎవరి కోసం? ఎవరి కోసం?’ పాటని యూట్యూబ్‌లో చూడవచ్చు
https://www.youtube.com/watch?v=iq16LZmEARc)

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version