Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మధురమైన బాధ – గురుదత్ సినిమా 7 – సుహాగన్

గురుదత్ నటించిన ‘సుహాగన్’ సినిమాని సంచిక పాఠకులకు పరిచయం చేస్తున్నారు పి. జ్యోతి.

‘సుహాగన్’ గురుదత్ నటించిన చివరి సినిమా. 1964లో రిలీజ్ అయిన ఈ సినిమా ఎడిటింగ్ దశలో ఉన్నప్పుడు ఈ సినిమా  టీం, గురుదత్ మరణవార్త అందుకున్నారు. గురుదత్ మరణించబోయే ముందు ఈ సినిమాతో పాటు మరో రెండు సినిమాలలో అయన నటిస్తున్నారు. సగం పైగా పూర్తి అయిన ఆ రెండు సినిమాలు వీరి మరణం తరువాత ఆగిపోయాయి. వాటిని వేరే నటులతో పూర్తి చేసారు తరువాత ఆ సినిమా దర్శకులు. అందువలన ‘సుహాగన్’ గురుదత్ నటించిన చివరి సినిమాగా నిలిచిపోతుంది.

ఈ సినిమా నేపథ్యంలోకి వెళ్ళే ముందు కొంత బొంబాయి చిత్రరంగం ఆ సమయంలో ఎదుర్కుంటున్న సంక్షోభం గురించి ప్రస్తావించాలి. బోంబాయి చిత్రరంగం కన్నా అన్ని రకాలుగా కళాత్మక విలువలతో సమృద్ధిగా ఉండేది బెంగాలీ రంగం. అయితే యాబైలలో బెంగాల్ నుండి చాలా మంది దర్శకులు, నటులు, టెక్నీషియన్లు బొంబాయి చేరారు. స్టూడియోల శకం ముగిసింది. బెంగాలీ రంగం నుండి వచ్చిన వారు హిందీ సినిమాలపై  మంచిపట్టు సాధించారు. బెంగాలీ నేపథ్యంలో, సంగీత ప్రభావంతో అద్భుతమైన సినిమాలు తీసారు వీరంతా. బిమల్ రాయ్, నితిన్ బోస్ లాంటి దర్శకులు, అనిల్ బిస్వాస్, ఎస్.డి. బర్మన్, హేమంత్ కుమార్ లాంటి సంగీత దర్శకులు చిత్ర సీమను ఏలుతున్న రోజులవి. బెంగాల్ చిత్రరంగం తన పూర్వ ప్రభను కోల్పోయింది. హిందీ చిత్రసీమను బెంగాలీ సాంస్కృతిక ప్రభావం కొన్నాళ్ళు డామినేట్ చేసింది. కొన్ని రోజులకు ప్రేక్షకులు కొత్తదనం కోరుకోవడం మొదలయింది. ఈ సమయంలో ‘చంద్రలేఖ’ అనే సినిమాను వాసన్ హిందీలో రిలీజ్ చేశారు.

అప్పటిదాకా తమ ఉనికి కోసం పోరాడుతున్న ప్రభాత్, షాలిమార్, నవయుగ్, చిత్రపట్ నిర్మాణ సంస్థలు ఇక చివరి శ్వాస తీసుకున్నాయి. బెంగాలీ చిత్రరంగ ప్రభావం క్రమంగా అంతరిస్తుంది. స్టూడియోలు మాయమయ్యాయి. బొంబాయిలో సినీ ప్రొడ్యూసర్లు చాలా మంది బైలుదేరారు. బొంబాయి చిత్రసీమ పక్కా వ్యాపార రంగంగా మారింది. ఈ సమయంలో ‘చంద్రలేఖ’ సినిమా ఇచ్చిన షాక్ బొంబాయి సినీ రంగాన్ని ఊపేసింది. ఒక్క సారిగా భారీ బడ్జెట్లు, యాక్షన్ సినిమాల వైపుకు గాలి మళ్ళింది. స్టూడియో నేపథ్యంలేని బొంబాయి సినీ ప్రోడ్యూసర్లు తమ నటులకు ఇన్‌స్టాల్మెంట్లలో డబ్బు ఇచ్చేవారు. అందువలన నటులు పూర్తి రెమ్యూనరేషన్ అందుకునేసరికి సినిమా ఫెయిల్ అవడం అలా ఆ డబ్బు పూర్తిగా రాకుండా అగిపోవడం జరిగేది. ఇది నటుల భుక్తికి ఇబ్బందిగా మారింది. దక్షిణ భారతదేశపు నిర్మాతల తీరు మాత్రం మరోలా ఉండేది. వీరు పూర్తి పేమెంట్‌తో నటులను బుక్ చేసుకునే వారు. ఇది నటులకు చాలా లాభసాటిగా ఉండేది. హిందీ చిత్రరంగంలో భాగం అవ్వాలనే కోరిక కారణంగా వారు డబ్బు విషయంలో చాలా ప్రోత్సాహకరంగా ఉండేవారు. ఇది ఆ సమయంలో చాలా మంది నటులకు ఊరట నిచ్చిన విషయం. సినీ రంగంలో నిలిచి ఉండడానికి కూడా ఉపయోగ పడిన అవకాశం.

బాబు రావ్ పటేల్ లాంటి క్రిటిక్స్ కూడా దక్షిణ ప్రాంతపు సినిమాలను ఈ సందర్భంలో ప్రోత్సహించడం మొదలెట్టారు. దిలీప్ కుమార్ లాంటి నటులు కూడా మద్రాస్ చిత్ర పరిశ్రమ వైపుకి మళ్ళారు. మద్రాసు ప్రొడ్యూసర్లు పూర్తి రెమ్యూనెరేషన్ ఇచ్చి హీరోలను బుక్ చేసుకోవడం, బొంబాయి చిత్ర పరిశ్రమను బాగా దెబ్బ కొట్టింది. దక్షిణ భారత సినీ ప్రొడ్యూసర్లు హిందీ చిత్రరంగంలో ప్రవేశించసాగారు.

ఈ సయయంలోనే గురుదత్ దర్శకత్వం నుంచి తప్పుకున్నారు. అతని వ్యక్తిగత జీవితంలోని సమస్యలు, అతని స్టూడియో నుండి వహిదా రెహ్మన్ వెళ్ళిపోవడం, గీతా దత్‌తో దూరంగా ఉండవలసి రావడం, ఇవన్నీ ఆయనలోని సృజనాత్మకతను దెబ్బ తీసాయి. కాని గురుదత్ స్టూడియోలో పని చేస్తున్న స్టాప్ బాధ్యత అతనిపై ఉంది. గురుదత్ స్టూడియోతో పని చేసే వారంతా ఆయనను నమ్ముకుని జీవిస్తున్నారు. వీరు మరో చోట పని చేసిన వారు కాదు. గురుదత్ సినిమాలు నడిచినా నడవకపోయినా వారికి జీతాలిస్తూనే ఉన్నారు. ఇప్పుడు స్టూడియో నడవాలి. తమకంటూ కొత్త కథలు లేవు. కథలు నిర్మించే సృజన శక్తి పోగొట్టుకున్నారు గురుదత్. అయినా ఎన్నో కథలను ఆ సమయంలో కొన్నారు. ఆయన పరిస్థితి చూసి సినిమాలకు పనికి రాని కథలను ఆయనకు అంట గట్టి డబ్బు తీసుకున్న రచయితలు చాలా మంది తయారయ్యారు. ఆ కథలను మార్చి తమకు అనుగుణంగా మరల్చుకునే వ్యవ్యధి గురుదత్ టీంకు లేదు. ఆ శక్తి గురుదత్‌లో నశించింది. ‘కాగజె కే ఫూల్’ సినిమా ప్లాప్ అవడంతో పూర్తిగా అత్మవిశ్వాసాన్ని పోగొట్టుకున్నారు గురుదత్. క్లాసిక్ కథలను స్క్రీన్ పైకి తీసుకు రాగలననే నమ్మకం లేకుండాపోయింది. ఆయన పరిస్థితిని తమకు అనుకూలంగా మరల్చుకుని కథలను అమ్మిన రచయితలే తప్ప, ఆయనకు సహయపడే శక్తి ఉన్న రచయితలు ఆయన చుట్టూ లేరు. ఆ సమయంలో కూడా   స్టూడియో నడపడం తన బాధ్యత అనుకున్నారు గురుదత్. అప్పుడు దక్షిణాది నుండి వస్తున్న సినిమా ఆఫర్లను ఒప్పుకోవడం ఒక్కడే ప్రత్యామ్నాయం అయింది.

కొత్త కథలు లేకపోవడం, అతనిలో సినిమా నిర్మాణం పట్ల ఆసక్తి తగ్గిపోవడం, వ్యక్తిగతంగా మానసికమైన ఒత్తిడి, వీటన్నిటి నుండి బైట పడడానికి దక్షిణాది ప్రొడ్యూసర్ల సినిమాలు ఆ సమయంలో గురుదత్‌కి కొంత ఉపశమనం కలిగించాయి. అలాంటి సంక్లిష్ట సమయంలో గురు దత్ నటించిన సినిమా ‘సుహాగన్’.

దక్షిణాది ప్రొడ్యూసర్లు తమిళంలో లేదా తెలుగులో హిట్ అయిన సినిమా కథలనే హిందీలో నిర్మించేవారు. చాలా వరకు ఆ దర్శకులే హిందీ సినిమాకు పని చేసేవారు. అలా తమిళంలో వచ్చిన ‘శారద’ అనే సినిమాను హిందీలో నిర్మించాలని అనుకున్నారు సినీ నిర్మాత ఏ. ఎల్. శ్రీనివాసన్. తమిళంలో, కె. ఎస్. గోపాల కృష్ణన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను హిందీలో ఆయన దర్శకత్వంలోనే తీయాలనుకున్నారు శ్రీనివాసన్. ఇందులో హీరోగా గురుదత్‌ని తీసుకున్నారు. అంత గొప్ప దర్శకుడు తన మాట వింటారా అని గోపాల కృష్ణన్ మొదట భయపడ్డారట కూడా. కాని గురుదత్ వారిని పిలిచి తాను దర్శకత్వం నుండి ఎప్పుడో తప్పుకున్నానని, ఇప్పుడు కేవలం నటుడినని, తన నుండి కావలసింది రాబట్టుకోవడం గోపాల కృష్ణన్ బాధ్యత అని చెప్పి అతనికి పూర్తిగా సహకరిస్తానని చెప్పారట. కోమల్ స్వామినాధన్ ఈ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశారు. అతను తమిళ రచయిత కూడా. ఈ సినిమా చిత్రీకరణ అప్పుడు గురుదత్‌తో వారికి మంచి స్నేహం ఏర్పడింది. ఈ చిత్రం షూటింగ్ సంగతులను గురుదత్ వ్యక్తిత్వాన్ని ఆయన ఒక సందర్భంలో ప్రస్తావించారు కూడా. శ్రీనివాసన్ గారి కోడలు జయంతి కన్నప్పన్ కూడా అప్పటి జ్ఞాపకాలను పంచుకున్నారు. గురుదత్ మరణం తరువాత రిలీజ్ అయిన ఈ సినిమా గొప్ప హిట్ సినిమా కాదు కాని నిర్మాతకు లాభాలనే తీసుకొచ్చింది. కే. అప్పసామి అప్పట్లో ఏ.ఎల్.ఎస్ ప్రొడక్షన్స్‌కి పని చేసే వారు. ఈ సినిమాకు ఆయనే గురుదత్ అటెండెంట్‌గా ఉన్నారు. గురుదత్ మృదు స్వభావం గురించి ఆయన ఎన్నో సార్లు ప్రస్తావించారు.

అయితే ఈ సినిమా చూస్తున్నంత సేపూ గురుదత్ లోని దర్శకుడు, ఆర్టిస్టు కాక ఒక ఆవరేజ్ దర్శకుడి చేతిలో మర బొమ్మగా నటించిన సాధారణ నటుడు కనిపిస్తారు. గురుదత్ సినిమాలన్నీ చూస్తున్నప్పుడు అరవై తరువాత ఆయన జీవించి ఉన్న ఆ తరువాతి నాలుగు సంవత్సరాలలో ఒక మరణించిన ఆర్టిస్టు ఆత్మ ఆయన చేసిన పాత్రలలో కనిపించి బాధ పెడుతుంది. ఒక ఆర్టిస్టు అంతగా తన జీవిత కాలంలో తనలోని కళత్మకతను, సృజన శక్తిని పోగొట్టుకోవడం మరెవ్వరిలో ప్రత్యక్ష్యంగా ఇంతగా స్క్రీన్‌పై కనిపించదు. ‘ప్యాసా’, ‘మిస్టర్ అండ్ మిసెస్ 55’ లోని హీరో ఈయనేనా అనిపించక మానదు. ఆయన కళ్ళల్లో జీవం ఉండదు. ఒక ఆర్టిస్టుగా కళ్ళను అంత గొప్పగా ఉపయోగించుకున్న నటుడు, దర్శకుడు మరొకరు హిందీ ప్రపంచంలో లేరు. అలాంటిది వీరి తరువాతి సినిమాలలో జీవితం పీల్చి పిప్పి చేసిన ఒక అశక్తుడిని చూస్తాం. ఇది తట్టుకోవడం గురుదత్‌ని అభిమానించే వారికి చాలా కష్టం. ఉత్కృష్టమైన నటన, అంతర్జాతీయ స్థాయిలో ఉండే ఆ డైరెక్షన్, కథను ట్రీట్ చేసే విధానం, అత్యద్భుతమైన సాహిత్యం, సంగీతాల సమ్మేళనం, గానం, అభినయం, ఫోటోగ్రఫీ వీటన్నిటిని ముందు సినిమాలలో చూసిన తరువాత, అంత అభావంగా గురుదత్‌ని చూడడం మనసును చాలా బాధపెడుతుంది. ఒక ఆర్టిస్టు జీవించి ఉండే సర్వం పోగొట్టుకోవడం, అది ప్రత్యక్ష్యంగా చూడడం కళను అభిమానించే వారికి పెద్ద శిక్ష. ఇలాంటి స్థితికి కూడా కళాకారులు వస్తారా అనిపించక మానదు. వారింతలా జీవం పోగొట్టుకుని స్క్రీన్‌పై కనిపిస్తే చూసే వారికే ఇంత బాధగా ఉంటే, దాన్ని ప్రత్యక్ష్యంగా అనుభవిస్తున్నగురుదత్ ఆ సమయంలో ఎంత హింస పడి ఉంటారో కదా అనిపించక మానదు. ఒక కళాకారుడు అతనిలోని సృజనాత్మకత మాయమయినప్పుడే నిజంగా మరణిస్తాడు. ఆ తరువాత అతని జీవితం, మరణం పెద్ద విషయాలు కావు. గురుదత్ చివర్లో నటించిన చిత్రాలను చూస్తే అతని కళేబరాన్ని చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది తప్ప ఆ పాత గురుదత్ కనిపించరు. ‘సుహాగన్’ సినిమా నా లాంటి గురుదత్ అభిమానులు జీర్ణించుకోలేని చిత్రం. జీవచ్చవం ఎలావుంటుందో చూడాలని వున్న వారు గురుదత్ చివరి దశలోని సినిమాలు భరోసా, సుహాగన్ వంటివి చూడాలి.

తమిళంలో 1962లో వచ్చిన శారద సినిమాలో ఎస్.ఎస్. రాజేంద్రన్, సి.ఆర్.విజయ కుమారిలు నటించారు. ఈ సినిమా అప్పట్లో పెద్ద హిట్. దీనితో గోపాల కృష్ణన్ తమిళంలో అప్పటి పెద్ద దర్శకుల జాబితాలో చేరారు. ఈ కథను హిందీలో గురుదత్ మాలా సిన్హా లతో 1964లో ‘సుహాగన్’ గా తీస్తే, ఇదే ‘సుమంగళి’ పేరుతో 1965లో తెలుగులో సావిత్రీ, ఏ.ఎన్. ఆర్. గార్లతో తీసారు. మళ్ళీ ఇదే కథ కన్నడంలో 1971లో ‘సొతు గెద్దవళు’ అనే పేరుతో సినిమాగా వచ్చింది. తెలుగులో ఈ సినిమాకు ఆదుర్తి సుబ్బారావు గారు దర్శకత్వం వహించారు.

శారద అనే ధనవంతుడి  కూతురు విజయ్ అనే ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందిన లెక్చరర్‌ని ప్రేమించి పెళ్ళి చేసుకుంటుంది. ఆమెపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆమె తండ్రి ఈ పెళ్ళి ఇష్టపడడు. కాని శారద తండ్రిని అతని ఆస్తిని కాదని విజయ్‌ని వివాహం చేసుకుని వెళ్ళిపోతుంది. వివాహం అయిన వెంటనే కాలేజ్‌లో ప్రమాదవశాత్తు పై అంతస్తు నించి జారి పడి విజయ్ ఆసుపత్రి పాలవుతాడు. అతని వెన్నెముకకు బలమైన దెబ్బ తగులుతుంది. సంసార సుఖానికి అతను దూరంగా ఉండాలని. అతను లైంగికంగా ఎవరితోనన్నా కలిస్తే అతని ప్రాణానికి ప్రమాదమని డాక్టర్ చెబుతాడు. ఇది తెలియక భార్యతో దగ్గర అవ్వాలని అతను ప్రయత్నించడం, అతని నుండి తప్పించుకోలేక శారద పడే బాధ, అతని కోపానికి ఆమె గురి అవడం, వీరిద్దరి మధ్య విజయ్ తల్లి నలిగిపోవడం, చివరకు ఏ దారి లేక అతని ఆరోగ్యం గురించి శారదే విజయ్‌కి చెప్పడం జరుగుతుంది. తనతో కలిసి జీవించడానికి శారద, కోరికలను నియంత్రించుకోవడానికి పడుతున్న బాధను ప్రత్యక్ష్యంగా చూస్తున్న విజయ్ చివరకు భార్యకు మరో వివాహం చేయాలనుకుంటాడు. శారదను ఆమె వివాహానికి ముందు ప్రేమించిన వ్యక్తితో విజయ్‌కి స్నేహం ఏర్పడుతుంది. అతన్ని ఈ పునర్వివాహానికి ఒప్పిస్తాడు విజయ్. ఈ విషయాన్ని అతని తల్లి కూడా సమర్థిస్తుంది. కాని మరో వివాహం చేసుకోలేక శారద ఆత్మహత్య చేసుకుంటుంది.

ఈ సినిమా కథ ఒక రకంగా అప్పట్లో చాలా ప్రోగ్రెసివ్ ఆలోచనలను చర్చకు పెట్టింది. వివాహంలో సెక్స్ ముఖ్యం అని. స్త్రీ శరీరానికి కూడా కోరికలు ఉంటాయని, వాటిని గౌరవించాలని, వివాహ వ్యవస్థ పురుషునికి ఏర్పర్చిన వెసులుబాటును స్త్రీ విషయంలో కూడా అమలు పరచాలని మొట్టమొదట చర్చించిన సినిమా ఇది. సంసారానికి భార్య పనికి రాదంటే భర్తకు వెంటనే పునర్వివాహానికి అనుమతి ఇచ్చే సమాజం స్త్రీ విషయంలో మాత్రం అది పాపం అనడం ఏ మాత్రం న్యాయం అన్నది ఇందులో చర్చకు వచ్చిన ప్రశ్న. ఈ సినిమాలో శారద అత్త పాత్రలో నటించిన లీలా చిట్నిస్ నటన బావుంటుంది. కోడలు పడుతున్న మానసిక బాధను ఒక స్త్రీగా ఆమె గుర్తించి, ఆమెకు అండగా నిలిచి కోడలిని కూతురుగా స్వీకరించి ఆమెకు వివాహం చేయలనుకోవడం అప్పట్లో ఎవ్వరూ ఊహించలేని పరిణామం. కాని స్త్రీ అభ్యుదయానికి స్త్రీలే మానసికంగా సిద్దపడి లేరన్నది ఆలోచించవలసిన మరో ముఖ్య కోణం. ఇందులో శారద మరణం ఆ విషయాన్ని స్పష్టపరుస్తుంది. సాంప్రదాయవాదుల్ని తృప్తి పరుస్తుంది. అయితే సినిమాలో ఎక్కడా కథాపరంగా తప్పులు కనిపించవు. శారదకు న్యాయపరంగా తన మెడికల్ సర్టిఫికేట్ ఆధారంగా విడాకులు ఇస్తాడు విజయ్. తరువాత ఆమెకు మరో వివాహం చేయాలనుకుంటాడు. ఇది ఆమెకు న్యాయం చేయడం అని, ఆమె జీవితం తనతో కరిగిపోరాదని అతను అనుకోవడంలో ఎక్కడా నాటకీయత కనిపించదు. స్త్రీ శారీరిక అవసరాలను ఇంత గౌరవంగా ప్రస్తావించిన చిత్రాలు చాలా అరుదు. ఈ రోజుల్లో కూడా బాలెన్స్‌డ్‌గా డీల్ చేయలేని విషయాన్ని సుమారు యాభై సంవత్సరాల నాడే చిత్రంగా తీసుకురావడం హర్షించదగ్గ పరిణామం. ఇటువంటి విషయాలపై చర్చ అవసరమనే ట్రెండ్ ఈ సినిమాతో మొదలయిందని చెప్పవచ్చు. అయితే విజయ్ చెల్లెలి వివాహం చూట్టూ అల్లిన కథ కొంత సాగతీతగా అనిపిస్తుంది. దేవన్ వర్మ తల్లి పాత్ర చేసిన నటి ఆయన కంటే చిన్న పిల్లగా కనిపించడం కొంత హాస్యాస్పదంగా అనిపించక మానదు. శారద పాత్రలో మాలా సిన్హా బాగా నటించారు కాని తెలుగువారు ‘సుమంగళి’ సినిమా చూసాక సావిత్రి గారికే ఎక్కువ మార్కులు వేస్తారు. ముఖ్యంగా హిందీలో ‘తూ మేరే సామ్నె హై’ పాట తెలుగు సినిమాలో ఆ సన్నివేశంలో ‘వలపు వలే తీయగా’ అని వస్తుంది. ఆ పాటలో సావిత్రి గారి అభినయం అత్యద్భుతం. మాలా సిన్హా బాగా చేసినా సావిత్రి గారు ఫెర్మామెన్స్ రేంజ్ వేరే అన్నది అందరం ఒప్పుకుని తీరవలసిందే. ఇక మరో చిన్న పాత్రలో ఫిరోజ్ ఖాన్ కనిపిస్తారు. ఫిరోజ్ ఖాన్, గురుదత్, మాలా సిన్హా ముగ్గురు ‘బహురాణి’ అనే సినిమాలో కూడా కలిసి నటించారు. ‘సుహాగన్’ వారి ముగ్గురి కాంబినేషన్‌లో వచ్చిన రెండవ సినిమా.

ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా మదన్ మోహన్ పని చెసారు హస్రత్ జైపురి ఈ సినిమాకి పాటలను రాసారు. తలత్, మొహమ్మద్,  రఫీ, మన్నాడే, లత, ఆ పాటలను గానం చేశారు. తలత్ మెహమూద్, లతల డ్యూయెట్ ‘తుమ్హి తో మేరి పూజా హో’, ఇప్పటికీ రేడియోలో వినిపిస్తూ ఉంటుంది. గురుదత్‌కి తలత్ మెహమూద్ పాడిన ఒకే ఒక డ్యూయెట్ ఇది. రఫీ పాడిన ‘తు మెరె సామ్నె హై’, ‘మెరె ప్యార్ మె తుఝె క్యా మిలా’ హిట్ పాటల జాబితాలోనే వస్తాయి.

ఈ సినిమాలో మాలా సిన్హాకు తండ్రిగా నాజిర్ హుసేన్ నటించారు. వారి భార్యగా ఎస్. వరలక్ష్మి గారు కనిపిస్తారు.  ఆ పాత్ర వేసింది ఇంద్రాణి ముఖర్జీ అని కనిపిస్తుంది. తెలుగు సినిమాలతో పరిచయం ఉన్న వారు ఎస్. వరలక్ష్మి గారిని గుర్తు పడతారు. దక్షిణాది నటుల పట్ల ఎంతైనా కొంత నిర్లక్ష్యం ఉంటుంది ఉత్తరాది వారికి. సినిమా క్రెడిట్లలో ఎస్. వరలక్ష్మి గారి పేరు ఉంటుంది. వీరు చాలా తెలుగు సినిమాలలో తన పాటలు తానే పాడుకునేవారు. వారి గాత్రం గుర్తు పడతాం కాబట్టి ఈ సినిమాకు వారికి ఎవరో డబ్బింగ్ చెప్పారు అన్నది అర్థం అవుతుంది, ఆవిడ పలికిన డైలాగులు వింటుంటే. స్వతహాగా ఎస్. వరలక్ష్మి గారి గొంతులో ఉండే జీర ఇందులో కనిపించదు.

ఈ చిత్రం క్రెడిట్స్‌లో వారికి సినిమాను అంకితం ఇస్తున్నానే శ్రీనివాసన్ గారి ప్రకటన కనిపిస్తుంది. ఎంతో పాత సినిమాలు కూడా కొందరిని మంచి స్థితిలో ఇప్పటికీ యూ ట్యూబ్‌లో కనిపిస్తాయి. 1964లో వచ్చిన ఈ సినిమా ప్రింట్ మాత్రం చాలా అతుకులతుకులుగా కనిపిస్తుంది. గురుదత్ నటించిన చివరి చిత్రాలు నిర్లక్ష్యానికి గురి అయ్యాయన్నది నిజం. ఒక గొప్ప దర్శకుడి చిత్రాలను అవి అంత ఆడకపోయినా కాని జాగ్రత్త పరచవలసిన అవసరం ఉంది. గురుదత్ పై ఎన్నో పుస్తకాలు వస్తున్నాయి. ఆయన పట్ల చాలా మందిలో ఇప్పుడు ఆసక్తి కనిపిస్తుంది. వారి చివరి చిత్రాలలో ఆయన ప్రతిభ కనిపించకపోయినా వాటిని భద్రపరచడం బాధ్యతగా జరగకపోవడం బాధిస్తుంది. కళాకారుడి ఉన్నతమైన సృజన శక్తి, వెనువెంటనే సృజన కోల్పోయిన ఒక అభాగ్య కళాకారుడు, ఈ రెండు పార్శ్వాలను వీరి సినిమాలను అధ్యయనం చేసే క్రమంలో చూడవచ్చు. ఇంతటి వైరుద్యం మరే దర్శకుడిలో కనిపించదు. ఎక్కడ ‘ప్యాసా’ లో గురుదత్, ఎక్కడ ‘సుహాగన్’, జీవితంలో తమ ఎమోషన్స్‌పై నియంత్రణ కోల్పోతే మనిషి ఎంత అధోగతి పాలవుతాడో చెప్పడానికి గురుదత్ జీవితాన్ని మించిన మరో ఉదాహరణ కనిపించదు.

Exit mobile version