[అవధానుల మణిబాబు గారి ‘మధుశ్రీలు చదివాక’ పుస్తకాన్ని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]
‘మధుశ్రీ’ కలం పేరుతో ప్రసిద్ధులైన మధునాపంతుల వేంకటేశ్వర్లు గారు 1950-1972 మధ్య కాలంలో వ్రాసిన 58 కథలు.. 2011లో ‘మధుశ్రీలు’ పేరిట పుస్తక రూపంలో వెలువడ్డాయి.. అంటే కథల కాలం 22 సంవత్సరాలు, ఆపై 29 ఏళ్ళు! అంటే తొలికథ నాటి నుంచి సంపుటిగా వెలువడేంత వరకూ సుమారు 51 ఏళ్ళు. మనుషుల వయసుతో పోల్చుకుంటే జీవితాన పరిణతి సాధించేంత ఈడు! ఇంకో రకంగా చెప్పాలంటే విభిన్న అనుభవాలతో రాటుదేలి తనని తాను తెలుసుకుంటూ, సమాజాన్ని అవగతం చేసుకుంటూ, జీవితాన్ని ఫలవంతం చేసుకునే ప్రాయం! ఈ లక్షణాలనే సాహిత్యానికి ఆపాదిస్తే, అది నిశ్చయంగా మననానికి తావిస్తుంది.
ఆ కథలు యాభై ఏళ్ళ క్రితం మనుషులని, సమాజాన్ని కొత్తగా పరిచయం చేస్తాయి. ఆనాటి కథలను ఈనాటి పాఠకులు చదువుతున్నప్పుడు కొన్ని ఘటనలో, కొన్ని సన్నివేశాలో, కొన్ని సందర్భాలో బాగా తెలిసినవిగా అనిపిస్తాయి. ఎక్కడో చదివినట్టుగా అనిపిస్తాయి. తమకు తెలిసినవి ఈ పుస్తకంలో ఉన్నాయన్న సంతృప్తితో మామూలు పాఠకుల పఠనం ముగుస్తుంది.
ఆ పాఠకులలో కథకుడు ఎవరైనా ఉంటే ఏం చేస్తాడు? కథా రచనలో తనకి ఉపయోగపడే టెక్నిక్స్ ఏమైనా ఈ పుస్తకంలో ఉన్నాయా అని పరిశీలిస్తాడు. ఆ రచయిత శైలి, శిల్పం తనకు నప్పినా నప్పకపోయినా, ఎత్తుగడలు, సంభాషణలు, ముగింపులు.. ఎలా ఉన్నాయో గమనిస్తాడు. చెప్పాల్సిన విషయాలలో, రాయకూడనిదేదో తెలుస్తుంది. రాస్తున్నప్పుడు చెప్పకూడనిది ఏదో అర్థమవుతుంది. అలా ఏది చెప్పాలి, ఎంతవరకూ చెప్పాలి, ఎక్కడ స్పష్టంగా చెప్పాలి, ఎక్కడ అవ్యక్తంగా చెప్పాలి అనేది అవగతమవుతుంది. ఒక్కో కాలంలో ఒక్కో సందర్భానికి ఆ యా వ్యక్తులు ఎలా స్పందించారు, అలాంటి పరిస్థితులు ఇప్పుడు తాను వ్రాసే కథలలో ఎదురైతే తన పాత్రలు ఎలా స్పందించాలి? వాటికెలా రక్తమాంసాలివ్వాలనే అంశాలను కథకుడైన పాఠకుడు పట్టించుకుంటాడు. తనని తాను మెరుగుపెట్టుకుంటాడు.
ఆ చదువరి ఓ విమర్శకుడో/విశ్లేషకుడో అయితే ఏం చేస్తాడు? ఆనాటి కథలని విశ్లేషిస్తూనే, తాను చదివిన/చదువుతున్న ఈనాటి కథలను గుర్తు చేసుకుంటాడు. అప్రయత్నంగానే కొన్ని పోలికలు కనబడతాయి. సందర్భాలో, సంఘటనలో ఒకేలా అనిపిస్తాయి. కానీ రచయితల ట్రీట్మెంట్, పాత్రలు స్పందించిన విధానాలు వేర్వేరుగా ఉంటాయి. అలాంటి వాటిని పట్టుకుని ఆనాటి రచయితని నేటి రచయితలని ఒక చోటకు చేర్చి.. ఇద్దరి కథాకథన చాతుర్యాలను మన ముందు ఉంచి, ‘ఇక కానివ్వండి, మీదే ఆలస్యం’ అంటాడు. విభిన్న తరాల కథకుల ఆలోచనా రీతులను, ఉద్వేగాలను, రచనా శైలులను మన ముందు నిలిపి – మన ఆలోచనల విస్తృతిని పెంచుతాడు. నాటి, నేటి రచయితలకి మన్నన కల్పిస్తాడు.
అవధానుల మణిబాబు గారు అక్షరాలా చేసింది ఇదే! ఓ పాఠకుడిగా ‘మధుశ్రీలు’ చదివారు. ఆయనకి నచ్చాయి. ఎందుకు నచ్చాయని తర్కించుకున్నారు. ఆయా కథల ప్రాసంగిత లుప్తం కాకపోవడం వల్ల అని గ్రహించారు. ప్రాసంగిత కోల్పోకపోవడం అంటే.. ఆయా కథల్లోని సందర్భాలో, సన్నివేశాలో నేటికి సమాజంలో కొనసాగడం, వర్థమాన రచయితలు తమ రచనల్లో వాటిని తమదైన పద్ధతిలో చిత్రించడం!
కొంతమంది అనొచ్చు – వేర్వేరు కాలాల రచయితలని పోల్చకూడదు, ఫలాలే అయినా నారింజనీ, ద్రాక్షనీ పోల్చలేమని! నిజమే. ‘ఫలాలు’ అన్న పేరు, ‘కథ’ అన్న పేరు ఒకటే.. కాని నిస్సందేహంగా రుచులు వేరు.. కానీ అవి తిన్నాక/చదివాక, కలిగే అనుభూతి బహుశా ఒకటే.. అదే సంతృప్తి! అలాగే విభిన్న కాలాల కథకులను పోల్చి చూసినప్పుడు – భిన్న సృజనాకారుల ప్రతిభ వ్యక్తమై గొప్ప ఆనందం కలుగుతుంది. పైగా ఇలా సారూప్యతలను పట్టి చూడ్డం వల్ల ఇతర ప్రయోజనాలున్నాయి.
సాహిత్యం కాలాన్ని ప్రతిబింబిస్తుంది. విభిన్న తరాల సాహిత్యాన్ని పోలిస్తే – సామాజిక రీతులు, రాజకీయ వాతావరణం, తాత్త్విక దృక్పథాలలోని మార్పులు అవగతమవుతాయి. విభిన్న కాలాలకు చెందిన సాహిత్యాన్ని పోలుస్తున్నప్పుడు భాషలోనూ, పదబంధాలలోనూ, వాక్య నిర్మాణంలోనూ, వ్యాకరణంలోనూ, రూపకాలలోనూ – వ్యక్తీకరణలోనూ వచ్చిన మార్పులను తెలుసుకోవచ్చు.
ఇటువంటి తులన వల్ల కాలదోషం పట్టని – ప్రేమ, ఎడబాటు, ఆశయాలు, నిజాయితీ, సంవేదనలు, విజయాలూ వైఫల్యాలూ, స్వార్థం, హృదయ వైశాల్యం వంటి మానవ అనుభవాలను, సార్వజనీన ఇతివృత్తాలను వివిధ కాలాల రచయితలు తమ కథలలో ఎలా అన్వయించారో తెలుస్తుంది.
ఈ పరిశీలన వల్ల వేర్వేరు కాలాల రచయితల ప్రతిభ, ఆయా సందర్భాలలో వారి పరిమితులు అర్థమవుతాయి. మొత్తం మీద వేర్వేరు కాలాల రచయితలను తులనాత్మకంగా అధ్యయనం చేయడం వల్ల చరిత్ర, సంస్కృతి, మానవ స్వభావాలు గ్రహింపుకొస్తాయి.
ఆ కోణం నుంచి చూసినప్పుడు, చక్కని విశ్లేషణకీ, ఓ సుదీర్ఘ వ్యాస రచనకీ అవకాశం దొరికింది మణిబాబు గారికి. 58 కథలను పరామర్శిస్తూ, అలాంటి వస్తువుతో అల్లిన నేటి కథలను ఉదహరిస్తూ, నాటి నేటి కథలలో సారూపత్యలని వెల్లడిస్తూ, వాటిపై తనదైన వ్యాఖ్యానాన్ని ఇష్టంగా చేశారు, ఆసక్తిగొల్పేలా రచించారు. ఆ వ్యాసాన్ని ‘మధుశ్రీలు చదివాక’ అంటూ పుస్తకరూపంలో వెలువరించారు.
తన విశ్లేషణ మరీ అకడమిక్‌గా అనిపించకుండా ఉండేలా, పర్సనల్ టచ్ ఉండేలా వ్రాశారు. ఈ పుస్తకంలో ఆయా విభాగాలకు చక్కని శీర్షికలుంచారు మణిబాబు! వాటిని చదువుతుంటే ఆత్మీయతభావం కలుగుతుంది. ‘ఇప్పుడు ఎందుకు ఇదంతా..!’ అని ప్రారంభించారు, తర్వాత ‘చిన్నగా కొన్ని కథలు చెప్పుకుందాం’ అంటూ కథా విశ్లేషణ లోకి అడుగుపెట్టారు. ‘చివరికి ఏమంటానంటే’ అంటూ ముగించారు. ఈ సుదీర్ఘ విశ్లేషణ – పాండిత్య ప్రదర్శనలా అనిపించకుండా ఉండేలా, చాలా ఒద్దికగా తన అభిప్రాయాలను ప్రకటించారు మణిబాబు.
~
మధుశ్రీ గారి కథలలోని వస్తువు, శైలి, శిల్పాలను సమగ్రంగా పరిశీలించారు మణిబాబు. మధుశ్రీ గారి కథలను విశ్లేషించడానికి వాటిని కొన్ని సినిమాలతోనో, కవితలతోనో, ఇతర కథకుల కథలతోనో పోల్చారు.
ముందుగా ‘చిన్నగా కొన్ని కథలు చెప్పుకుందాం’ అంటూ మధుశ్రీ గారి కొన్ని కథలను, వాటిలోని సన్నివేశాలను సంక్షిప్తంగా ఉదహరించి, తన అభిప్రాయం ప్రకటించారు మణిబాబు. తొలి కథ ‘పెళ్ళి పెద్ద’ కథని బాలచందర్ సినిమా ‘అంతులేని కథ’ సినిమాతో పోలుస్తారు. సినిమా కన్నా కథ ముందొచ్చిందని అంటారు. ఇదే సందర్భంలో గొల్లపూడి మారుతీరావు గారి ‘పాలు విరిగిపోయాయి’ కథనీ, తణికెళ్ళ భరణి గారి ‘కన్యా-కుమారి’ కవితని ప్రస్తావిస్తారు.
కథా వస్తువుకి సంబంధించి కట్నం కథలు, కళలు – భ్రమలు, గుమాస్తా కథలు, దెయ్యాల కథలు, స్వీయ అభిప్రాయ ప్రకటన కోసం వ్రాసిన కథలు, పురాణాలు – ప్రాచీన సాహిత్యం అన్న శీర్షికలతో, మధుశ్రీ గారి కథలను విశ్లేషించారు. కట్నం వేధింపుల కథలలో ‘నాదీ ఒక హృదయమా?’ కథ గురించి చెబుతూ, ‘ముత్యాల ముగ్గు’ సినిమాని గుర్తుచేస్తారు. ఈ సందర్భంగా పెమ్మరాజు గోపాలకృష్ణ గారి కవితని ఉదహరించడం కాస్త ఆశ్చర్యం కలిగిస్తుంది. కొందరు సంపన్నులు పేదవారిని, నిమ్నవర్గాల వారిని జంతువుల్లా లేదా అంతకంటే హీనంగా చూస్తారని చెప్పడం కోసం – ఆయా కథలలోని పాత్రల స్వభావాన్ని సూచించేదుకు ఈ కవితని ప్రస్తావించారని అర్థమయ్యాకా ‘బావుంది పోలిక’ అని అనిపిస్తుంది. ఈ సందర్భంలోనే ఆచార్య కొలకలూరి ఇనాక్ గారి కథ ‘డౌరీ డెత్’ను ప్రస్తావించడం ఎంతో ఔచితీమంతంగా ఉంది.
కలల కథలలో – ‘అనుభూతి’ అనే కథను విశ్లేషిస్తూ, ఒక అందమైన కథ, చివరి వాక్యం వల్ల మంచి కలగా ఎలా మారిందో చెప్పారు. ‘సర్పభ్రాంతి’ కథ గురించి చెప్పారు. ఈ సందర్భంలో దాట్ల దేవదానం రాజు గారి ‘మెదడు మోకాళ్ళ లోకి’ కథను, నేను వ్రాసిన ‘చోటు’ కథను ప్రస్తావించారు.
గుమస్తా కథల గురించి చెబుతూ, ఉద్యోగాల్లో సమస్యలు ఏ స్థాయి వారికి ఆ స్థాయిలో ఉంటాయని, ప్రభుత్వ/ప్రైవేటు/కార్పోరేట్ ఉద్యోగుల వెతలను ప్రస్తావించారు. ఇటువంటి ఇతివృత్తంతో వచ్చిన కత్తిమండ ప్రతాప్ గారి కథలని, కుప్పిలి పద్మ గారి కథని, శ్రీశ్రీ గారి మూడు కథలను పేర్కొని – ఇవి ఎన్ని వ్రాసినా, ఎందరు వ్రాసినా తరగని కథానిధులని వ్యాఖ్యానించారు మణిబాబు.
దెయ్యాల కథల గురించి వ్రాస్తూ, మధుశ్రీలలో దెయ్యాల కథలు చాలానే ఉన్నాయన్నారు. దెయ్యాల కథల ద్వారా రచయిత అంతర్లీనంగా ఏమైనా చెప్పారా అని పరిశీలించారు. ‘తెలిసీ తెలియని’ అనే కథని చెబుతూ, ముగింపు తెలియకపోయినా, పాఠకులకి అసంతృప్తిగా అనిపించదని అన్నారు. ‘పట్టుపడిన దెయ్యం’ కథకీ, కొరియన్ సినిమా ‘పారసైట్’కి లంకె కలిపారు. మధుశ్రీ గారి దెయ్యాల కథలను చదివాకా, పూసపాటి కృష్ణంరాజు గారి ‘దారి తప్పినా.. మాట తప్పినా..’ అనే కథ గుర్తొచ్చిందని చెబుతూ, ఆ కథ గురించి ప్రముఖ సినీ దర్శకుడు, కథకుడు వంశీ ఏమాన్నారో చెప్పి, ఆ మాటలు మధుశ్రీగారి కథలకు సరిపోతాయని తేల్చారు. పెనుమాక రత్నాకర్ గారి ‘ఆమెతో ఆఖరి క్షణాలు’ మరో మంచి ‘దెయ్యం కథ’ అన్నారు. ఈ సందర్భంగా నేను అనువదించిన ‘దెయ్యమంటే భయమన్నది’ కథనూ ప్రస్తావించారు.
‘స్వీయ అభిప్రాయ ప్రకటన కోసం వ్రాసిన కథలు’లో ‘పాత్రలెదురు తిరిగాయి’ కథ గురించి చెబుతూ, హిందీలో అదే అంశంతో వచ్చిన డా. కేదార్నాథ్ సింగ్ గారి ‘విద్రోహ్’ అనే కవితని ప్రస్తావించారు. డా. కోగంటి విజయ్ గారి ‘నన్నే వెతుక్కుంటూ’ కథ (పైనాపిల్ జామ్ కథాసంపుటి) ఈ కోవకు చెందినదేనని నేనంటాను. సత్యాగ్రాహి కథలో పాఠకుడి అసహనాన్ని, చదువరులుగా మనం కూడా ఏదో ఒక దశలో అనుభవించే ఉంటాం. ఈ విభాగంలోని కథలపై తన అభిప్రాయం చెప్పాకా, “సాహిత్యకారుల జీవిత సత్యాలను వారి రచనల ద్వారా గ్రహించలేం, ప్రతి రచనలోనూ పాఠకుడు రచయిత అనుభవాలేవో ఉన్నాయనుకోడం పొరపాటు” అని అంటారు. సందర్భోచితంగా కథాశిల్పం గురించి వల్లంపాటి వెంకటసుబ్బయ్య గారి అభిప్రాయాన్ని ప్రస్తావించారు మణిబాబు.
మధుశ్రీలలోని కథాశిల్పం గురించి చేసిన విశ్లేషణలలో మణిబాబు గారికి తెలుగు/ఆంగ్ల సాహిత్యంపై ఉన్న పట్టు తెలుస్తుంది. ఎంతలా అధ్యయనం చేశారో అర్థమవుతుంది. మధుశ్రీ కథల శైలి గురించి ‘శీర్షికలు, ఎత్తుగడలు, పలుకుబడులు’ విభాగంలో విస్తృతంగా చర్చించారు.
404 పేజీల పుస్తకంలోని 58 కథలలో కొన్ని సాధారణంగా ఉన్నాయంటారు. అంతమాత్రాన అవి ఉత్తమమైన కథలు కావని చెప్పలేమని అంటారు. మధుశ్రీ గారి ‘ప్రయత్నం – ఫలితం’ కథనీ, శ్రీ మాకినీడి సూర్యభాస్కర్ గారు 1993లో వ్రాసిన ‘బాధ్యత’ అనే కథలో పోల్చి, మధుశ్రీ గారు ఇప్పుడు ఈ కథని వ్రాస్తే, ముగింపు అప్పటిలా ఉండదని వ్యాఖ్యానిస్తారు. ఈ విశ్లేషణ మొత్తంలో కొన్ని కథలలోని లోటుపాట్లను నిష్కర్షగా పేర్కొన్నారు. ఈ సద్విమర్శలను ఆంధ్రీకుటీరం/మధునాపంతుల ఫౌండేషన్ ఎంతో హుందాగా స్వీకరించడం ముదావహం! చివరగా, మధుశ్రీ గారి కథలు మననం చేసుకోదగ్గ కథలనీ, మన్నిక గల కథలనీ పేర్కొన్నారు మణిబాబు.
ఒక కథకుడి గురించి ఓ చదువరి, రచయిత, విశ్లేషకుడు చేసిన చక్కని విశ్లేషణ ఈ పుస్తకం! కథకుడిగా ‘మధుశ్రీ’ గారి గౌరవం పెంచిన కథాపరామర్శ ఇది!
~
‘మధుశ్రీలు’ పుస్తకం చదివాక తనకేమనిపించిందో మణిబాబు చెప్పారు, మరి ‘మధుశ్రీలు చదివాక’ పుస్తకం చదివాక, మనకేం అనిపిస్తుంది? ‘మధుశ్రీలు’ చదవాలనిపిస్తుంది. కానీ ఆ పుస్తకం కాపీలు ప్రస్తుతం అలభ్యమని తెలిసి ‘అయ్యో’ అనుకుంటాం! పుస్తకం మళ్ళీ అందుబాటులోకి రావాలనుకుంటాం. మధుశ్రీ గారి కథలు చాలా వరకూ కథానిలయం వారి వెబ్సైట్లో ఉన్నాయి. కాని అన్నీ ఒకే చోట పుస్తకరూపంలో లభిస్తే బాగుండనిపిస్తుంది. కనీసం డిజిటల్ వెర్షన్ అయినా లభిస్తే బాగుంటుంది అని తలుస్తాం! డిజిటల్ వెర్షన్‌ని archives.org వంటి వెబ్సైట్లో ఉంచి భవిష్యత్తు తరాల కోసం భద్రపరచాలని మధుశ్రీ గారి కుటుంబసభ్యులను అడగాలని అనిపిస్తుంది.
“Reading is a journey where each finished book opens doors to many more, either by satisfying a craving or creating a new one.”
‘మధుశ్రీలు చదివాక’ పుస్తకాన్ని విశ్లేషించే క్రమంలో పలువురు రచయితల కథలనో, కవితలనో పుస్తకాలనో ప్రస్తావించారు మణిబాబు. వీటిని కూడా చదవాలని కోరుకుంటారు పాఠకులు. ఇది మణిబాబు పుస్తకం సిద్ధింపజేసిన మరో ప్రయోజనం! ఒక పుస్తకం చదివాకా, అందులో ప్రస్తావించిన మరో పుస్తకమో, కథలో చదవాలనిపించడం – ఒక దీపంతో మరో దీపం వెలిగించడం లాంటిదే. చుట్టూ కాంతి ప్రసరింపజేయడమే!
***
రచన: అవధానుల మణిబాబు
పేజీలు: 90
వెల: ₹ 200/-
ప్రతులకు:
శ్రీ అవధానుల మణిబాబు: 9948179437
శ్రీ మధునాపంతుల సత్యనారాయణ మూర్తి: 9704186544
శ్రీమతి రత్నప్రభ గ్రంథాలయం: 9949002477
కొల్లూరి సోమ శంకర్ రచయిత, అనువాదకులు. బి.ఎ.డిగ్రీతో గ్రాడ్యుయేషన్. మానవ వనరుల నిర్వహణలో పిజి డిప్లొమా చేసారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి భాషా ప్రవీణ పాసయ్యారు. ప్రస్తుత నివాసం హైదరాబాదు.
సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’ అనే పేరుతోను, డా. చిత్తర్వు మధు ఆంగ్లంలో రచించిన ‘డార్క్ అవుట్పోస్ట్స్’ అనే స్పేస్ ఒపేరా నవలను ‘భూమి నుంచి ప్లూటో దాకా’ అనే పేరుతోనూ అనువదించారు. ప్రముఖ హిందీ గీత రచయిత ఆనంద్ బక్షి జీవితచరిత్రని తెలుగులోకి అనువదించగా, ఇటీవల పుస్తక రూపంలో వెలువడింది.
ఓ ప్రముఖ ప్రచురణ సంస్థ కోసం అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు (అముద్రితం).
ప్రస్తుతం డా. సాధనా శంకర్ రచించిన Ascendance అనే సైన్స్ ఫిక్షన్ నవలని, డా. సుధాంశు మణి గారి My Train 18 Story ని అనువదిస్తున్నారు.
‘దేవుడికి సాయం’, ‘ఆహ్లాదపురం ఆరో వీధి’ అనే కథాసంపుటాలు, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు.

