[కర్ణాటక లోని మధ్య రంగనాథస్వామి ఆలయం సందర్శించి ఆ అనుభవాలను పాఠకులతో పంచుకుంటున్నారు డా. మజ్జి భారతి.]
శివనసముద్రం జలపాతాలు, మధ్య రంగనాథస్వామి ఆలయం- కర్ణాటక
కర్ణాటక రాష్ట్రంలోని, దేశంలోని అతిపెద్ద జలపాతాలలో ఒకటైన శివనసముద్రం జలపాతాలను, కావేరి నది ఏర్పరిచిన మూడు ద్వీపాలలో ఒకటైన శివనసముద్ర ద్వీపంలో ఉన్న మధ్య రంగనాథస్వామి ఆలయాన్ని సందర్శించేందుకు, జూన్ 11వ తేదీన కుటుంబ సభ్యులతో బెంగుళూరు నుండి బయలుదేరాను.
కర్ణాటకలోని, కావేరీనది దక్షిణాన కొన్ని కిలోమీటర్ల దూరంలో రెండుగా చీలిపోవడంతో, పశ్చిమ శాఖ 90 మీటర్ల ఎత్తునుండి జాలువారే గగనచుక్కి జలపాతాలైతే, తూర్పు శాఖ 69 మీటర్ల ఎత్తునుండి జాలువారే బారాచుక్కి జలపాతాలయింది. ఈ రెండింటినీ కలిపి శివనసముద్ర జలపాతాలంటాం. ఇవి చామరాజనగర జిల్లా, మాలవల్లి, మాండ్య మరియు కొల్లేగాల సరిహద్దులలో కావేరి నది వెంబడి ఉండి, చామరాజనగర, మాండ్య జిల్లాల మధ్య సరిహద్దుగా ఉంటాయి. బెంగుళూరుకు 140 కి.మీ, మైసూరుకు 80 కి.మీ. దూరంలో ఉంటుంది.
కావేరీనదిలో చాలా ద్వీపాలు ఏర్పడినా, వాటిల్లో మూడు ద్వీపాలలో రంగనాథస్వామి ఆలయాలుంటాయి. అందులో రెండు (శ్రీరంగపట్నం, శివనసముద్రం) కర్ణాటక రాష్ట్రంలో ఉంటే, ఒకటి (శ్రీరంగం) తమిళనాడులో ఉంటుంది. వాటిల్లో కొలువైన శ్రీరంగనాథుని ఆది, మధ్య, అంత్య రంగనాథునిగా పిలుచుకుంటాం. ఈ మూడు ఆలయాల్లో రంగనాథుడు శయనమూర్తిగానే మనకు దర్శనమిస్తాడు. ఈసారి నేను శివనసముద్రంలో కొలువైన మధ్య రంగనాథుని దర్శనాన్ని చేసుకున్నాను. అంతకుముందు శ్రీరంగపట్నం, శ్రీరంగం దర్శించడం జరిగింది.
వాటిని సందర్శించడానికి, మేము బెంగళూరు నుండి ఉదయం ఏడు గంటలకు కారులో బయలుదేరాం. నగరశివార్లలో ఉన్న సిటీహౌస్ కలర్స్‌లో టిఫిన్ చేసి బెంగళూరు మైసూర్ ఎక్స్‌ప్రెస్ వే ఎక్కాం. ఈ మార్గంలో ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఒకప్పటి నేషనల్ హైవే 275, బెంగళూరు మంగళూరు ఎకనామిక్ కారిడార్ 34 లో భాగంగా, బెంగళూరు మైసూర్ ఎక్స్‌ప్రెస్ వే అని పిలవబడుతుంది. టూ వీలర్స్, త్రీ వీలర్స్, పాదచారులు లేకపోవడంతో జర్నీ ఒకే స్పీడులో జరిగింది.
కొండలను కొట్టి, వేసిన మార్గం చాలా చోట్ల కనిపించింది. రోడ్డుకిరువైపులా పచ్చని చెట్లతో, కొండలతో.. బోర్లించిన గిన్నెల్లా ఎండలో మెరిసిపోతున్న రాతి కొండలే ఎక్కువ. మరికొన్ని చెట్ల ముసుగుని కప్పుకొని పచ్చగా మెరిసిపోతున్న కొండలు. కనుచూపుమేరా కొబ్బరి తోటలు, అరటి తోటలు, టేకు వృక్షాలు, మధ్య మధ్యలో పంట పొలాలు.. అక్కడక్కడా పలకరిస్తున్న గ్రామాలు, టౌన్లు.. డాబాలు, మేడలతో పాటు, ఎక్కువగా బంగాళా పెంకులతో నిర్మించబడిన ఇల్లులు.. పైకి చూస్తే వెండిమబ్బులతో కప్పబడిన నీలి మేఘం.. అందమైన పూల మొక్కలతో డివైడరు. ఈ హైవేలో ప్రయాణం ఆహ్లాదకరంగా సాగింది. మద్దూరు దగ్గర, హైవే నుండి లెఫ్ట్ సైడ్ తీసుకున్నాం. ఇక్కడి నుండి సర్వీస్ రోడ్డులో సుమారు పది కిలోమీటర్ల ప్రయాణం చేస్తే మద్దూరు టౌను వచ్చింది. అక్కడ లెఫ్ట్ సైడ్ తీసుకున్నాం.
కావేరి నదిని క్రాస్ చేసాం. కావేరి ట్రిబ్యూటరీ శింష నదిని దాటాక, మద్దూరు ఊర్లో నుండి, ఎడమ వైపు తిరిగి స్టేట్ హైవేలోకి ప్రవేశించాం. రోడ్డు కిరువైపులా పచ్చని పొలాలు (ఎక్కువగా చెరుకును పండిస్తున్నారు), కొబ్బరి తోటలు, మధ్య మధ్యలో గ్రామాలు.. టోల్ గేట్ దాటాక, పచ్చని కొండలు ఒకవైపు, ఇంకొక వైపు కనుచూపుమేరా కొబ్బరి తోటలు, చెరుకు పొలాలు.. కావేరీ నది.. బారా చుక్కి వాటర్ ఫాల్సుకు స్వాగతం అన్న బోర్డు దాటుకొని ముందుకెళ్తే కావేరి నదిపై కొత్తగా కట్టిన బ్రిడ్జిపై నుండి రాకపోకలు సాగుతున్నాయి (రాళ్లతో కట్టిన, పాతబ్రిడ్జి ప్రస్తుతం వాడుకలో లేదు). రెండు పాయలుగా చీలిన కావేరీనదిని ఈ బ్రిడ్జి పై నుండి చూడవచ్చు.
బారాచుక్కి వాటర్ ఫాల్స్:
లోపలికి వెళ్లడానికి, కారుకు టికెట్టు ₹40. సుమారు అర కిలోమీటర్ లోపలికి వెళ్తే పార్కింగ్ ప్లేస్, ఒక ప్రక్క చిల్డ్రన్ పార్క్, ఇంకో దగ్గర ఎత్తైన వ్యూ పాయింట్. అక్కడ నుండి లోపలికి వెళ్లడానికి టికెట్టు (మనిషికి ₹10) తీసుకుని కొంత దూరం ముందుకెళ్తే, కొండల మీద నుండి జాలువారుతున్న వాటర్ ఫాల్స్ కనిపిస్తాయి. కూర్చుని వీక్షించడానికి, సిమెంట్ బెంచీలున్నాయి. క్రిందకు వెళ్లడానికి మెట్లున్నాయి. పైనుండి పడే నీటి ప్రవాహాన్ని బట్టి, మెట్ల మార్గాన్ని ఎంతవరకు ఎలవ్ చెయ్యాలో నిర్ణయిస్తారు. మెట్లమార్గం మధ్యలో కూడా వ్యూ పాయింట్లున్నాయి. అక్కడనుండి చాలామంది ఫోటోలు తీసుకుంటున్నారు.
బారాచుక్కి వాటర్ ఫాల్స్
విశాలమైన రాతి కొండలపై నుండి క్రిందకు ఉరుకుతున్న కావేరి జలాలు.. అవి చేసే గలగల శబ్దం.. ఆ జలాల చుట్టూ అడవిలా దట్టంగా పెరిగిన వృక్ష సముదాయం.. ఈ ప్రకృతి అందాలను చూస్తూ, జలపాతపు హోరును వింటూ ఎంతసేపైనా గడపవచ్చు. మేము వెళ్ళిన సమయంలో, నాలుగైదు జలపాతాలు సన్నంగా ఉండి కనిపించాయి. అదే వర్షాకాలంలో వెళ్తే జలపాతాల సౌందర్యాన్ని ఇంకా బాగా వీక్షించవచ్చు.
మధ్య రంగనాథ స్వామి ఆలయం:
పురాతనమైనది. ఏడు అంతస్తులతో, పైన కలశాలతో కూడుకొని ఉన్న రాజగోపురం ఠీవిగా కనిపిస్తుంది. అది దాటి లోపలికి వెళ్తే, రంగనాథుని పాదాలు, ఎత్తైన రాతి దీపస్తంభం, ఇత్తడితో కప్పబడిన ధ్వజస్తంభం, బలిపీఠం కనిపిస్తాయి. ఆలయం పురాతనమైనది గాని, చిన్నగానే ఉంటుంది. ముఖమంటప పైభాగం మధ్యలో శయనించిన రంగనాథుడు, అటూ ఇటూ దశావతారాలు ఉన్నాయి. రాతి పలకలపై నిర్మించబడిన ముఖమంటపం పెద్ద హాలులా ఉంది. హాలుకు ఇరువైపులా ఆళ్వారుల, గరుత్మంతుడు, ఆంజనేయస్వామి ఉపాలయాలున్నాయి. శిల్పకళా సంపద ఎక్కువగా అగుపించలేదు.
మధ్య రంగనాథ స్వామి ఆలయం
గర్భగుడిలో మూడు చుట్టలు చుట్టుకుని ఉన్న శేషువు పడగవిప్పి ఉండగా, ఐదారడుగుల పొడవున్న శ్రీరంగనాథుడు, దానిపై శయనించిన భంగిమలో ఉంటారు.
విశాలమైన నేత్రాలతో చూడముచ్చటగా ఉన్నారు స్వామి. ఈ స్వామిని యవ్వనంలో ఉన్న మూర్తిగా భావించి మోహనరంగ, జగన్మోహన రంగ అని పిలుచుకుంటారు. స్వామి కాళ్లవైపు భూదేవి, వక్షస్థలం దగ్గర శ్రీదేవి మూర్తులున్నాయి. మూలవిరాట్టు ముందు, శ్రీదేవి భూదేవిలతో కూడిన రంగనాథుని ఉత్సవ మూర్తులున్నాయి. భక్తుల రద్దీ చాలా తక్కువ ఉన్నందువలన, చక్కగా దర్శనాన్ని చేసుకున్నాం.
మధ్య రంగనాథ స్వామి ఆలయ గోపురం వద్ద రచయిత్రి
దర్శన వేళలు ఉదయం ఏడున్నర నుండి మధ్యాహ్నం ఒంటి గంటన్నర వరకు, మధ్యాహ్నం మూడు నుండి సాయంకాలం ఆరు గంటల వరకు. తరువాత దర్శించబోయే సోమేశ్వర ఆలయానికి కూడా ఇవే దర్శన వేళలు.
శ్రీ చక్రాంకిత ప్రసన్న మీనాక్షి సమేత సోమేశ్వర ఆలయం:
రంగనాథ ఆలయానికి అర కిలోమీటర్ దూరం లోపు ఉంటుందిది. రోడ్డుమీదకు ఆలయ వెనుకభాగం కనిపిస్తుంది. ఇక్కడి ప్రవేశద్వారంపై పెద్ద నంది ఉంటుంది. గోపురంలా ఉండదు ప్రవేశద్వారం. ఇక్కడ నుండి మనకు ఆలయ గోపురం కనిపిస్తుంది. లోపలకు వెళ్తే, కుడివైపు బిల్వ వృక్షం, తర్వాత సుబ్రహ్మణ్యస్వామి ఉపాలయం కనిపిస్తాయి.
సోమేశ్వర శివలింగం రెండడుగుల ఎత్తుతో ఎత్తైన పానిపట్టంపై ఉంది. గర్భగుడికి కుడివైపు విఘ్నేశ్వర ప్రతిమ ఉంది. ఈ ఆలయానికి కుడివైపు మీనాక్షి అమ్మ ఆలయముంది. ఈ సోమేశ్వర ఆలయం రంగనాథుని ఆలయానికన్నా పురాతనమైనదని, సప్తఋషులు ఈ సోమేశ్వర లింగానికి పూజలు చేసేవారని భక్తుల విశ్వాసం.
ప్రసన్న మీనాక్షి ఆలయం:
అమ్మవారు ప్రసన్న వదనంతో మరీ మరీ చూడాలనిపించేంత అందంగా కనిపించారు. అమ్మవారి ముందు ఆదిశంకరాచార్యుల వారు స్థాపించిన శ్రీచక్రం ఉంటుంది. ఆలయం ఎదురుగా జమ్మి చెట్టు. మూడుసార్లు ప్రదక్షిణ చెయ్యమని అక్కడున్నవారు చెప్పారు.
భైరవనాథ స్వామి ఆలయం:
ఈ ఆలయానికి శివనసముద్ర ఊర్లో నుండి వెళ్ళవచ్చు. ఇక్కడ కూడా ఆలయ ప్రవేశద్వారంపై పెద్ద నంది ఉంది. లోపల ఆలయం చిన్నదే. మేము పదకొండున్నరకు వెళ్లిన సమయంలో ఆలయం మూసి ఉంది. చుట్టూ చెట్లతో, విశాలమైన ప్లాట్‌ఫామ్‌తో ఉంది. ప్రశాంతంగా అనిపించి, చాలాసేపు కూర్చున్నాం.
భైరవనాథ స్వామి ఆలయం
మనం ముందు బారాచుక్కి జలపాతం చూసి వెనక్కి వస్తుంటే, ప్రసన్న మీనాక్షి సోమేశ్వర ఆలయం, తర్వాత మధ్య రంగనాథ ఆలయం, తర్వాత భైరవనాధ ఆలయం, ఆపై రోడ్డు ప్రక్కనే ఉన్న కావేరీనది కనిపిస్తాయి.
కావేరీ నది:
చుట్టూ, దట్టమైన వృక్షాలతో నిండి ఉన్న కొండలతో, అఖండ జలరాశితో.. చూస్తూనే ఉండాలనిపిస్తుంది. తెప్పపుట్టి (Coracle) రైడింగ్ ఉందిక్కడ.
గగనచుక్కి జలపాతం:
మాలవల్లిలోని 90 మీటర్ల ఎత్తునుండి జాలువారే ఈ జలపాతం మన హృదయాలను దోచుకుంటుందంటే అతిశయోక్తి కాదు. బారాచుక్కికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుందిది. శివనసముద్ర జలవిద్యుత్ కేంద్రం ఆఫీసులు, స్టాఫ్ క్వార్టర్లు దాటుకొని వెళ్తే ఈ జలపాతం కనిపిస్తుంది. ఇక్కడ విజిటర్స్ చాలా తక్కువమంది ఉన్నారు. లోపలకు వెళ్లడానికి టికెట్టు లేదు.
గగనచుక్కి జలపాతం
ఇక్కడ మనం సుమారుగా జలపాతం ఎత్తులోనే ఉంటాం. క్రిందకు మెట్లుంటాయి. వాటి ప్రక్కన కూర్చుని వీక్షించడానికి వీలుగా, ఓపెన్ ఆడిటోరియంలోని మెట్లలా కట్టారు. మెట్లకు ఎడమ వైపునున్న వ్యూ పాయింట్ నుండి చూస్తే ఒక వైపు జల విద్యుత్ కేంద్రం, జలపాతాల వెనుక దర్గా హజ్రత్ మర్దానే గైబ్, అక్కడున్న ఊరు, జలపాతాలు కనిపిస్తాయి. వర్షాలు లేవు కనుక, ఒక రెండు పెద్ద జలపాతాలు, సన్నటి మరో రెండు జలపాతాలే ఉన్నాయి. అదే వర్షాకాలంలో అయితే, కొండ మధ్యలో ఉన్న చెట్లు కాక, మిగిలిన భాగమంతా జలపాతమై క్రిందకి ఉరుకుతూ, క్రిందనున్న లోయగుండా ముందుకు సాగుతుంది.
దర్గా హజ్రత్ మర్దానే గైబ్:
ఈ దర్గా ముస్లింలనే కాకుండా హిందువులను కూడా ఆకర్షిస్తుంది. శివసముద్రంలోని గగనచుక్కి జలపాతానికి వెనుక భాగంలో ఉంటుందిది. హెచ్చరిక బోర్డు ఉన్నా, ఇక్కడ నుండి జలపాతాన్ని వీక్షించడానికి ప్రజలు రాళ్ళపైకెక్కి ప్రయత్నించడంతో ప్రమాదాలు జరిగే అవకాశాలెక్కువ.
శివనసముద్ర జలవిద్యుత్ కేంద్రం:
కోలార్ బంగారు గనులకు విద్యుత్ సరఫరా చేయడానికి, ఆసియాలోని మొట్టమొదటి జలవిద్యుత్ ప్రాజెక్ట్ 1902లో శివనసముద్ర (గగనచుక్కి) జలపాతం వద్ద ప్రారంభించబడింది. శేషాద్రి అయ్యర్ గారు, విశ్వేశ్వరయ్యగారు ఈ ప్రాజెక్టును రూపొందించారు.
శివనసముద్ర జలవిద్యుత్ కేంద్రం
మేం పదిన్నరకు శ్రీ రంగనాథ ఆలయాన్ని చేరుకుని అక్కడ గంటసేపు గడిపి, సరైన అవగాహన లేక భైరవనాథ ఆలయం చూసుకొని, అక్కడ నుండి ప్రసన్న మీనాక్షి సోమేశ్వర్ ఆలయానికి, తర్వాత బారాచుక్కి జలపాతాలకు వెళ్ళాం. భైరవనాధ్ (ఆలయం ఉదయమే తెరిచి ఉంటుంది కనుక), రంగనాథ, ప్రసన్న మీనాక్షి సోమేశ్వర్ ఆలయాలు చూసుకొని, బారాచుక్కి జలపాతాలకు వెళ్లి, వెనక్కి వచ్చేటప్పుడు కావేరి నది చూసుకొని, గగనచుక్కి జలపాతాలకు వెళ్తే సమయం వృథా కాదు.
మేం వెళ్లిన రోజు ఎండ ఎక్కువగా లేకపోవడంతో, పైన చెప్పిన స్థలాలనన్నిటిని హాయిగా, ప్రశాంతంగా చూసుకుని, గగనచుక్కి దగ్గర లంచ్ (ఇంటి నుండి తీసుకువెళ్లిన) చేసి, రెండున్నరకు తిరుగు ప్రయాణమై ఆరు గంటలకు ఇంటికి చేరుకున్నాం.
చెప్పుకోవాల్సిన విషయమేమిటంటే, బెంగుళూరు చుట్టుపక్కల ప్రదేశాల గురించి సెర్చ్ చేస్తుంటే శివనసముద్రం గురించి తెలిసింది. దాని చుట్టుపక్కల ప్రదేశాలు ఏమున్నాయని చూస్తుంటే, మధ్య రంగనాథుని గురించి తెలిసింది. శ్రీరంగపట్నం, శ్రీరంగాలను అది వరకు రెండుసార్లు దర్శించినా, వాటిని ఆది, అంత్య రంగనాథులు అంటారని, మధ్య రంగనాథ ఆలయం ఒకటుందనే విషయం నాకప్పుడు తెలియదు. ఇప్పుడు తెలియడం, దానిని సందర్శించుకోవడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. మీరు ఈ ప్రదేశాలను సందర్శించాలనుకుంటే, వర్షాకాలం తర్వాత వెళ్తే జలపాతాలు మరింత అద్భుతంగా కనిపిస్తాయి.

