Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మధ్యాహ్నార్కుడూ మానవలోకము

మధ్యాక్కర-

౧. ఎండలో నొకచెంప కంద, హింసగా తోచెనే రమణి

మండెనే హృదయమ్ము మేను, మానినీ వినుమునా బాధ

బండలన్ పగులగా కొట్టు, పాటును పడువారి తలువ

నిండెనే నా కండ్లు చెలియ, నీరుగా కరుగ, నా మనము.

***

౨.ఇండ్లను కట్టెడు వేళ నిద్ధర నున్నట్టి చెట్లఁ –

గండ్లను, బుద్ధిని మూసి కాటువేసిన పాపఫలము

ముండ్ల చెట్లనుఁ గూడ నిచట ముదమార కానంగలేము,

పండ్లనుఁ బండించి యిచ్చు పాదపముల వెన్ని గలవు?

***

౩. పాదమిట్టుల కాలుచుండ పరుగునుఁదీసెడు వేళ

పాదరక్షలు కొన లేని బడుగుజీవులఁ నెట్లు మరతు?

మీదుమిక్కిలినేటికేడు మిన్నయగుచునుండె వేడి,

పోదమనగ వేరు గలదె భూమిని వీడినన్ మనకు?

***

౪. మల్లెపూలని, మామిడి యని మదిని మురిపెమందరాదొ!

యెల్ల తావుల తావుఁ బఱపు హేరాళ సుమరాశి గనవొ!

యుల్లము రంజిల్లదేమొ! యొప్పు కొనగ నెట్టి బెట్టొ!

చల్లని కుండల నీటి చక్కటి రుచినెఱుంగవొకొ!

***

౫.గొడుగులు, వీవనల్ దెచ్చి కొందరికైనను పంచి,

వడలక వాడక యుండ పచ్చని చెట్లను తడిపి,

కుడువగ నీటిని నింపి కొన్ని కుండలనైన యుంచి,

నడకదారులఁ బెట్టఁ దగును, నడచిపోయెడు వారికొఱకు.

***

౬.ఆటపాటల పసి వాండ్రు హాయిగా నుందురో గాదొ!

మాటమాటకు మురిపించి మాయలఁ జేయగా రారొ!

పేటలో పెండ్లిండ్ల, పల్లె పేరంటముల కళ లేదొ!

తోటలో నుయ్యాల లూగ తొందర కలుగునో లేదొ!

***

౭.చెమటలుఁ బట్టుచునున్న చింతలేమియు లేని వారు

గుములు గుములు జేరిరదిగొ కూడినాడుకొనగ, శలవు

తమ బడులకటంచు మురిసి-  దగ్గరకుఁ బిలిచి పాట

కమనీయముగ నేర్పుమోయి, ఖండనమండనలేల?

***

౮. ద్విపద
లోటులనెంచగా లొసుగులునటులె
నోట మంచి పలుక నూరును నటులె.

Exit mobile version