[కాదాసి అమరేందర్ గారు రచించిన ‘మధ్యతరగతి గుండె చప్పుడు – విద్యే బతుకు త్రాడు’ అనే కవితను పాఠకులకు అందిస్తున్నాము.]
చిన్న ఇంటి గోడల మధ్య పుడతాయి పెద్ద పెద్ద కలలు,
ఆ కలలను మోస్తూ సాగుతాయి మధ్యతరగతి బతుకులు.
రెక్కల కష్టాన్ని నమ్ముకుని కనే ఆశల కెరటాలు,
చదువనే వెలుగుతోనే సాధ్యమౌతాయి ఆ గెలుపు తీరాలు.
నాన్న జేబులోని ఖాళీలు చూపిస్తాయి ఎన్నో పాఠాలు,
అమ్మ కళ్లల్లోని ఆశలు పెంచుతాయి మన లక్ష్యాలు.
నగలు తాకట్టు పెట్టినా సరే చదువును ఆపని నైజం,
బిడ్డల విజయమే ఆ తల్లిదండ్రులకు అసలైన రాజ్యం.
సొంత ఇల్లు కట్టాలనేది నాన్న కనే ఒకే ఒక్క కల,
ఆ కలను నిజం చేయాలనేదే బిడ్డల చదువుల గెల.
అద్దె కొంపల కష్టాలను దాటేందుకు చదువే ఒక రథం,
ఆ అక్షరాల అడుగులే మారుస్తాయి మన బతుకు పథం.
కోట్లు ఉన్నోడికి కలలు కొనడం చాలా సులువు,
కానీ మధ్యతరగతి వాడి కలలకు ప్రాణం పోసేది చదువు.
కన్నవారి కలలను కళ్ల ముందే నిజం చేసి చూపుదాం,
అక్షర దీపంతో మధ్యతరగతి ఇళ్లల్లో వెలుగులు నింపుదాం.
