[తమిళంలో ఎస్.కె.పి.కరుణా రచించిన కథను తెలుగులో ‘మదురై వీరుడు’ పేరిట అందిస్తున్నారు జిల్లేళ్ల బాలాజీ.]
ఒక పెద్ద రోడ్డు ప్రమాదం జరిగిన ఆ క్షణంలో మీరు అక్కడే ఉండటం సంభవిస్తే ఏం చేస్తారు? ఇదిగో! మీ ప్రశ్నకు తగ్గ ఆప్షన్స్. ఏం చెయ్యాలో తెలియక కొయ్యబారిపోయి అలాగే చూస్తూ ఉండిపోతారు. లేదూ, ఎంతో అలజడి చెంది అక్కడికీ ఇక్కడికీ పరుగెడుతారు. లేదూ, వెంటనే మిమ్మల్ని మీరు నియంత్రించుకుని గాయపడిన వాళ్లకు సాయం చెయ్యటానికి వెళ్తారు..
ఒకవేళ, ఆ క్షణంలో నేనక్కడున్న పక్షంలో ఏం చేస్తాను? అని ఆలోచించాను. ఏ మాత్రం టెన్షన్ పడకుండా పగిలిన అద్దం ముక్కలను దాటుకుని వెళ్లి, డ్రైవరు సీటు దగ్గరికెళ్లి చూస్తాను. డ్రైవరు సీట్లో లేడని స్పష్టం చేసుకున్న తర్వాత, ప్రమాదం జరిగిన సమయాన్ని తెలుసుకుని, డ్రైవరు ఎంత దూరం పారిపోయి దాక్కొని ఉంటాడని ఒక అంచనా వేసుకుంటాను. అది బస్సు అయిన పక్షంలో పాక్కుంటూ అయినా బస్సు లోపలికెళ్లి కండక్టరు దగ్గర ఉండాల్సిన డబ్బు సంచీ ఎక్కడైనా పడిపోయిందా అని వెతుకుతాను.
ప్రాణ నష్టం, వస్తువుల నష్టం వంటి వాటిని లెక్కించేలోపు, వాహనం యొక్క నష్టాన్ని అంచనా వేసి, ఇంకా ఎన్నిరోజుల్లో వాహనాన్ని మళ్లీ రోడ్డుమీదికి నడిపించగలం అని ఆలోచిస్తాను. చాలా చిన్నవయసు నుండి లారీ, బస్సు, కారు, డ్రైవరు, కండక్టరు, ప్రమాదం, గాయాలు.. ఇవన్నీ చూసీచూసీ అలవాటైపోవటంతో, ప్రమాదం అన్నది నాకు ఒక వాహనం యొక్క నష్టానికి ముందూ, తర్వాతా మధ్య కాలంలో జరిగే ఒక సంఘటన మాత్రమే.
ప్రాణం పోయినవారి బాధలూ, వేదనలూ పూర్తిగా గ్రహించలేని చిన్నవయసు నాది. టివి, ఇంటర్నెట్ వంటివి లేని, రోజులు ఎంతో నిదానంగా గడిచే కాలం అది. ప్రమాదాలు ఏర్పరిచే కలకలాన్ని అందరూ ఏదో ఒక విధంగా కోరుకుంటున్నామనే భావిస్తున్నాను. నిజం చెప్పాలంటే, మా సంస్థ యొక్క వాహనం ఏదో ప్రమాదంలో చిక్కుకుంటే, వెంటనే అక్కడకెళ్లి, బండిని సాధారణ స్థితికి తెచ్చే పని మొదలు పోలీస్టేషన్‌లో చెయ్యాల్సిన పనులు ముగించటం వరకూ గల కార్యాలను క్షుణ్ణంగా గమనించటం నా గొప్ప కాలక్షేపాలలో ఒకటి.
ఆ రోజు, మా నాన్న ఫోన్‌లో మాట్లాడుతున్నప్పుడు, నేను దగ్గరే ఉన్నాను. పాఠశాల రోజుల్లో ఒక మధ్యాహ్నం భోజనం పూర్తిచేసి ఇంట్లో నుండి బడికి తిరిగి వెళుతున్నప్పుడు ఆ ఫోన్‌కాల్ వచ్చింది. నిదానంగా నాన్న మాట్లాడటం పూర్తిచేసి నన్ను చూసి, “మణి ఎక్కడ్రా?” అన్నాడు.
మణి నాకు మేనమామ. నాన్నకు, అవసర సమయాలలో, పోరుకు సిద్దమై వెళ్లే దళపతి.
వెంటనే వెళ్లి పిలుచుకొచ్చాను.
“రేయ్ మణీ, టూరు బస్సు ఆక్సిడెంట్ అయ్యిందట. మేలూరనీ, మదురైకు దగ్గర ఒక ఊరంట. నువ్వు వెంటనే కార్లో వెళ్లి చూసి రా.” అన్నాడు.
“టో బార్ (Tow Bar) అన్నీ తీసుకెళ్లాలా?”
“బండికి ఏం కాలేదట. అడ్డుగా వచ్చిన ఒక తాగుబోతు చనిపోయినట్టున్నాడు. ఎందుకైనా మంచిది అన్ని ఒరిజినల్ పేపర్లూ తీసుకు పో.” అన్నాడు నాన్న.
ఆక్సిడెంట్ అన్న మాటను వినగానే, నా మనసంతా పారవశ్యంతో నిండిపోయింది. కాళ్లు గాల్లో తేలసాగాయి. వేగంగా ఇంట్లోకెళ్లి కలర్ డ్రెస్ వేసుకుని మా మామ ముందుకొచ్చి నిలబడి, “వెళ్దామా మామా?” అన్నాను.
“నువ్వెడికెళ్తావు రా?” అన్న అమ్మ ప్రశ్న నా ఉత్సాహం ముందు గాల్లో కలిసిపోయింది. నాన్న ఏమీ అనకుండా మౌనంగా ఉండటంతో, “కార్లో కూర్చోరా!” అని మా మామ అన్నాడు. సరిగ్గా ఇలాగే ముప్పైఏళ్ల క్రితం నా చారిత్రక ప్రసిద్ధి చెందిన మేలూరు ప్రయాణం ప్రారంభమైంది.
ప్రమాదం జరిగిన రోజు ఒకానొక స్వాతంత్య్ర దినం యొక్క ముందు రోజు. మదురైకీ, మేలూరుకూ మధ్య రహదారిలోని ఒక గ్రామంలోని బడిలో, స్వాతంత్య్ర దినోత్సవం కోసం రిహార్సల్స్‌ను చేసినట్టున్నారు. ఆ రిహార్సల్స్ వేడుక చూసి, పిల్లల దగ్గరున్న జాతీయ జెండాను లాక్కొని తన చొక్కాకు గుచ్చుకుని పక్కనున్న అంగట్లో సారా తాగి, దేశభక్తి పాట పాడుతూ గ్రామబాట నుండి మెయిన్‌రోడ్డుకు తన సైకిల్ మీద ఊగుతూ వచ్చి, ఆ సమయంలో మెయిన్‌రోడ్డుపై వెళుతున్న మా బస్సు వెనక చక్రం కిందపడి చనిపోయాడు. ఈ కథలో చెప్పబడని కథానాయకుడు (Unsung Hero) మూక్కయ్య.
మేము మేలూరు పోలీస్టేషన్‌కెళ్లి చేరేసరికి, బాగా చీకటి పడిపోయింది. ప్రమాదంలో మరణం సంభవించినందు వల్ల 304 ఎ. సెక్షన్ ప్రకారం ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేసి ఉంటారు. అన్ని ఒరిజినల్ రికార్డులూ తీసుకెళితే అధిక పక్షం రెండుగంటల సమయమూ, రెండువేల రూపాయలూ ఖర్చయ్యే విషయం అది. రాత్రి ఏడు గంటలకెళ్లి చేరాం. అధిక పక్షం తొమ్మిది గంటలకు బయలుదేరవచ్చని పథకం వేసుకున్నాం. రైటర్ దగ్గరికెళ్లి మమ్మల్ని మేము పరిచయం చేసుకుని, “మా డ్రైవరెక్కడ?” అని అడిగాం. సరిగ్గా అప్పుడే, స్నానం పూర్తిచేసి తల తుడుచుకుంటూ స్టేషన్ లోపలి నుండి బయటికొచ్చాడు మా డ్రైవరు.
“సార్, ఇదిగోండి, అన్ని ఒరిజనల్ పేపర్లూ ఉన్నాయి. ఫార్మాలిటీస్ అన్నీ రెడీ చేసెయ్యండి. పూర్తిచేసి మేము తొందరగా బయలుదేరాలి.” అన్నాడు మా మామ.
“అవన్నీ అర్థగంటలో చేసెయ్యొచ్చు. బస్సును తీసుకెళ్లటానికి డ్రైవరును తీసుకు రాలేదా?” అని అడిగాడు రైటర్.
“డ్రైవరా? ఇదిగో ఉన్నాడుగా?” అన్నందుకు, “సార్, ఇది 304 ఎ. ఈ డ్రైవరును మీరు కోర్టు జామీనులోనే తీసుకెళ్లాలి. బండిని తీసుకుని వెళ్లటానికి వేరే డ్రైవరును పిలుచుకొచ్చి ఉండాలి కదా మీరు.” అన్న సమాధానం వినగానే బిత్తరపొయ్యాం. ఉత్తర తమిళనాడులో జరిగే ట్రాన్స్‌పోర్టు ప్రమాదాలలో, పోలీస్టేషన్‌లోనే ఫైన్ కట్టేసి డ్రైవరును విడిపించుకెళ్లటం అలవాటు. దాన్ని మేము గుర్తు చేసినప్పుడు, “మదురై వీరుడు ఇప్పుడొస్తారు! ఇవన్నీ ఆయన్ను అడగండి.” అన్నాడు.
“ఎవరండీ ఆయన?” అన్నాము.
“ఊ.. ఈ స్టేషను ఇన్‌స్పెక్టరు.”
ఇన్‌స్పెక్టరు కోసం పోలీస్టేషన్‌కు బయటికొచ్చి ఎదురుచూడసాగాం. ఆ పోలీస్టేషన్ ఉన్న చోటు, సబ్ కోర్టు, తాలూకా ఆఫీసు, రిజిష్ట్రారు ఆఫీసు వంటి ఎన్నో కార్యాలయాలు కలిగిన పెద్ద ప్రాంగణం. పట్టణం మధ్యలో, పెద్దపెద్ద చెట్లమధ్య అక్కడక్కడా ఏర్పాటు చేసిన ఆ విక్టోరియా కాలంనాటి భవనాలు, ఆ రాత్రి సమయంలో నాకు ఏదో దిగులును కలిగించింది. అప్పుడు ఇన్‌స్పెక్టర్ బుల్లెట్ బండి, పెద్ద శబ్దంతో ఆ ప్రాంగణంలోకి ప్రవేశించింది.
గుమ్మంలో తన బుల్లెట్‌ను ఆపి, పక్కన నిలబెట్టిన కారుకు ఆనుకుని నిలబడున్న మమ్మల్ని ఓరకంటితో చూస్తూ, ఇన్‌స్పెక్టర్‌గారు పోలీస్టేషన్‌లోకెళ్లారు. మంచి ఎత్తూ, కండలు తిరిగిన కాయం, పోలీసు మీసం (మదురై వీరుడు) అన్నీ కలిసి ఒకటిగా రూపొందితే మొదటి చూపులోనే ఆయన గురించిన ఒక భయం ఏర్పడి౦ది.
“రేయ్, కార్లో నుండి రెండువేల రూపాయలు తీసి చొక్కా జేబులో పెట్టుకో.” అన్నాడు మా మామ.
“ఏం మామా, 304 ఎ. కు వెయ్యే కదా?” అన్నాను..
“అది మన ఊర్లోరా. ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో తెలియటం లేదు. ఎందుకైనా మంచిది రెండు వేలు విడివిడిగా పెట్టుకో.” అన్నాడు.
ఇన్‌స్పెక్టర్ గదిలోకి వెళ్లాము. “మీరేనా బస్సు ఓనరూ? కూర్చోండి.” అని, “ఉదయమే వచ్చుండొచ్చు కదా. కోర్టు పనులన్నీ పూర్తి చెయ్యటానికి సౌకర్యంగా ఉండేది?” అని అడుగుతూ మమ్మల్ని ఆహ్వానించారు.
‘వచ్చుండొచ్చు. అయితే, ఆక్సిడెంట్ మధ్యాహ్నమే కదా జరిగింది.’ అని అందామనుకున్నాను. అనలేదు.
మా మామే మొదలుపెట్టాడు. “సార్, మా ఊళ్లో అంతా 304 ఎ. అయినా, డ్రైవరుకు స్టేషన్ బెయిలే. ఎలాగూ ఒరిజినల్ లైసెన్స్ ఇక్కడే కదా ఉండబోతుంది. అంతేకాక, కంపెనీకి ఒక్క ఫోన్ చేస్తే చాలు. యజమానే మనిషిని పంపించి, కోర్టులో ఫైన్‌కట్టి కేసును ముగించేస్తారు. మీకు ఏ శ్రమా ఉండదు.”
ఏదో రాస్తూ, అశ్రద్దగా వింటున్న వ్యక్తి, “ఇది మదురై జిల్లా అన్నా. ఇక్కడ రూల్స్ వేరే. మీరు వెళ్లి, సోమవారం రండి. అప్పుడు డ్రైవరును వెంటబెట్టుకెళ్లొచ్చు.” అన్నారు.
ఆ రోజు గురువారం. మరునాడు శుక్రవారం స్వాతంత్య్ర దినం. శని, ఆది అంటూ వరుసగా మూడు రోజులు ప్రభుత్వ సెలవులు. ఈ రోజు తప్పితే, తర్వాతి మూడురోజులు డ్రైవరు స్లేషన్లోనే ఉండాలి. వేరే డ్రైవరు తమతో లేనందువల్ల, బస్సునూ తీసుకెళ్లటానికి వీలుకాదు. దాంతో మాలో ఎక్కడలేని టెన్షనూ మొదలైంది.
మెల్లగా, మా మామ నా కాలిని గోకటంతో, నేను, నా పాకెట్‌లో నుండి డబ్బును తీసి మా మామ చేతికిచ్చాను. ఆయన దాన్ని తీసుకుని, “మా వైపంతా వెయ్యే సార్. నేను రెండువేలు ఇస్తున్నాను. స్టేషన్ ఖర్చంతా వేరుగా ఇస్తాను. కాస్త చూసి పంపించండి సార్.” అని ఆయన చేతికిచ్చాడు.
వంగి రాస్తూనే, జరిగిన దాన్ని ఓరకంటితో చూసినట్టుంది. దాన్ని తీసుకుని, లేచొచ్చి, దాన్ని మళ్లీ నా చొక్కా జేబులోనే ఉంచి, “సోమవారం రండి.” అన్నారు.
ఇద్దరూ లేచి బయటికొచ్చేశాం. ఈలోపు డ్రైవరు చొక్కా తొడుక్కుని, విబూధి రాసుకుని, “పోదామా?” అంటూ మా దగ్గరికొచ్చాడు.
“యోవ్, ఉండవయ్యా. మేము ఊరికెళ్లటమే సమస్యగా ఉందిక్కడ.” అంటూ, హెడ్డయ్య దగ్గరికెళ్లాం. మమ్మల్ని ఎదురుచూస్తున్నట్టుగా హెడ్డెయ్య నవ్వు ముఖంతో కూర్చుని కనిపించాడు.
“అయితే, ఊరికెళ్లొస్తారా? లేదూ, ఇక్కడే బస చేస్తారా?” అని అడిగాడు.
“ఏంటి సార్? వేరే మార్గం లేదా?” అన్నాడు మా మామ.
“ఉండేది. ఈ మనిషి వచ్చే ముందు చాలా మార్గాలుండేవి.” అంటూ ఆగి, “ఇప్పుడంతా, మేమే మా ఇంటికి కాయగూరలు, ఇంటి సామాన్లన్నీ డబ్బిచ్చే కొంటున్నామంటే అర్థం చేసుకోండి. చాలా కరవు ప్రాంతం సార్. వెళుతున్నప్పుడు కాస్త చూసి వెళ్లండి.” అన్నాడు.
మేము లేచి బయటికొచ్చి కారుకు పక్కలో నిలబడ్డాం. మా డ్రైవరు ఈలోపు బట్టలు మార్చుకుని, లుంగీ బనియన్‌తో బయటికొచ్చాడు. జరిగిన విషయాన్ని వేగంగా అతను అర్థం చేసుకున్నట్టుగా, మేము అర్థం చేసుకోలేకపోయాం. అందులోనూ, మా మామ పోలీస్టేషన్‌కెళ్లి పని ముగించకుండా వచ్చింది లేదు అని ఒక గొప్ప సాధనను పొందిన వ్యక్తి కూడా!
స్టేషన్లో నుండి బయటికొచ్చిన ఇన్‌స్పెక్టర్ నేరుగా మా దగ్గరికొచ్చారు. తన చేతులతో మెల్లగా మా మామ, ప్యాంటు వెనకవైపు జేబులో పెట్టిన సిగరెట్టు ప్యాకెట్టును తీసి, ఒక సిగరెట్టును వెలిగించి, లోపల హెడ్డు అడిగిన అదే ప్రశ్నను అడిగారు.
“మీరే సార్, చెప్పాలి.” అన్నాడు మా మామ.
“వీలైతే ఉండిపోండి. సోమవారం మొదటిపనిగా మీ పనిని పూర్తిచేసి పంపించేస్తాను. ఇక్కడి వ్యవహారం అంటూ ఒకటుంది చూసుకోండి.” అంటూ అక్కడ నిలబడున్న ఒక వ్యక్తిని పిలిచి, “వీళ్లను పిలుచుకెళ్లి పాండియన్ మెస్సు పైనున్న లాడ్జిలో రూము బుక్ చేసివ్వు.” అని చెప్పి తన బుల్లెట్‌ను స్టార్ట్ చేశాడు.
“రారా. వెళ్లి మీ నాన్నకు విషయం చెప్పి, మనం ఊరికి బయలుదేరేద్దాం. సోమవారం ఉదయం బయలుదేరి వస్తే సరిపోతుంది. మూడు రోజులు మనకిక్కడేం పని?” అంటూ, పోస్టాఫీసుకు వెళ్లి ఊరికి ట్రంకాల్ బుక్ చేశాం. మనుషులే లేని ఆ పోస్టాఫీసులో వెంటనే ట్రంకాల్ లైన్ దొరికింది. గూడులాంటి గదిలోకెళ్లి మాట్లాడి బయటికొచ్చాడు మా మామ.
“ఏం మామా? బయలుదేర్దామా?” అన్నాను.
“ఊ.. బస్సునూ, డ్రైవరునూ అక్కడ వదిలేసి, ఇక్కడికొచ్చి ఏం పీకుతారని అడుగుతున్నార్రా మీ నాన్న? ఊ, మనకిక్కడే సొతంత్ర దినం.” అన్నాడు.
మూడు రోజులు నేను ట్యూషన్‌కు వెళ్లాల్సిన పన్లేదు అన్న ఒక గొప్ప ఆనందం ఆ క్షణం నన్ను ఆవరించటంతో, నేను ఉత్సాహవంతుడినయ్యాను.
“సూపర్ మామా. అన్ని సినిమాలూ చూసి, మూడు రోజులు జాలీగా ఉందాం.” అన్నాను. ఆ తర్వాతే, మేలూరు అన్న ఊరిని గురించి మాకు బాగా తెలిసొచ్చింది.
మేలూరు ఒక పెద్ద గ్రామం. ఒక పెద్ద అంగడి వీధి, మధ్యలో బస్టాండు. దానికి ఎదురుగా ఉండే టీ కొట్లో, బస్టాండులో కన్నా పెద్ద గుంపు ఎప్పుడూ టీ తాగుతూ ఉంటారు. ఒకే ఒక సినిమా కొటాయి (టెంటు). పోలీస్టేషన్ ఆవరణకు ఎదురుగా ఉన్న పెద్ద భవనంలోని ఒక భాగంలో ఒక ఇన్సూరెన్స్ కార్యాలయం మరియు పాండియన్ మెస్సూ ఉన్నాయి. మెస్సు పైభాగంలో లాడ్జి. అందులోనే మేము బసచేశాం. ఇవన్నీ కూడా నాకింకా గుర్తున్నాయి.
మరునాడు ఉదయం లేచి టీ తాగుతున్నప్పుడు మా మామ అడిగాడు: “సరే, నీ దగ్గర ఎంత డబ్బుంది?” చేతి సంచీ తీసి డబ్బులు లెక్కించాను. “మూడువేల రూపాయలూ, కొద్ధిగా చిల్లరా ఉంటుంది మామా.” “నా దగ్గర వెయ్యి రూపాయలున్నాయి రా. నువ్వేం చేస్తావంటే, ఆ ఇన్‌స్పెక్టర్‌కు రెండువేలు, స్టేషన్ ఖర్చుకు వెయ్యి రూపాయలు వేరు వేరుగా తీసి ఉంచుకో. నా దగ్గరున్న వెయ్యి రూపాయల్లో మన బస ఖర్చులూ, భోజనం ఖర్చులకంటూ ఒక మూడు వందల రూపాయలు, కారు డీజిల్‌కు మూడు వందలు. దీన్ని వేరేగా ఉంచు.” అంటూ నా చేతికి ఆరువందలు ఇచ్చాడు.
మేము మారు బట్టలు తీసుకు రాకపోవటంతో, పక్కనున్న బట్టల షాపుకెళ్లి నాకొక సింగపూరు టీషర్టు, లుంగీ, ఆయనకొక చొక్కా, లుంగీ కొనుక్కున్నాం. బిల్లు నూట ఎనభై రూపాయలయ్యింది. ఒక కొట్లో ఐదు సిగరెట్టు ప్యాకెట్లను కొన్నాడు మా మామ. మూడు రోజులు గడవాలి కదా!
“ఇప్పుడు రెండు వందల రూపాయలు మిగిలాయి. అందులో నీకొక వంద, నాకొక వందా, సరేనా?” అన్నాడు. సంతోషంలో నాకు మైకం కమ్మేసేలా అనిపించింది. ఆ కాలంలో నా రోజువారి ఖర్చుకోసం నాకు దక్కేది ఐదు రూపాయలే. ఇప్పుడు కేవలం మూడురోజులకు వంద రూపాయలు. ఎలా ఖర్చు చేద్దామా అని గబగబ ఒక పట్టికను తయారుచేశాను. అందులో మూడు రోజులకు కలిపి నాకు ఎంతో ఇష్టమైన ఆనియన్ ఊత్తాపం మాత్రం పదిహేను ఉన్నాయి.
అప్పుడు ఎనిమిదవ తరగతి చదువుతున్న చిన్నపిల్లవాడినైన నాకు కూడా, మేలూరి జీవితం అంత సులభంగా అనిపించలేదు. సంచిలో డబ్బును ఉంచుకుని మేలూరంతా తిరిగినా ఒక్కచోటా నాకు ఆనియన్ ఊత్తాపం దొరకలేదు. ఉన్న ఒకట్రెండు హోటళ్లలోనూ ఎక్కువగా దొరికింది ఇడ్లీలు, సాదా దోసెలూ మాత్రమే. బస్టాండుకు ఎదురుగా ఉన్న ఒక టీకొట్లో కలకండ పాలు అని రాసి ఉండటాన్ని చూశాను. రూపాయికి ఒక పెద్ద గాజుగ్లాసు నిండుగా తాటి చక్కెర పాలు ఇస్తారు. నా జీవితంలో మొదటిసారిగా దాన్ని తాగటంతో అది నాకెంతో నచ్చి, ఇరవై రూపాయలకు ఇరవై గ్లాసులు తాగేశాను.
మరునాడు, స్వాతంత్య్ర దినం రోజున, ఉదయం స్టేషన్ నుండి ఒక మనిషొచ్చి మమ్మల్ని పిలిచాడు. ఇన్‌స్పెక్టర్ మనసు మార్చుకున్నారా? అని ఆసక్తిగా మేము పరుగులు పడితే, జాతీయ జెండా ఎగరేసే కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించారు. స్టేషన్లో జెండా ఎగరేసి, ఇన్‌స్పెక్టర్ తలెత్తి గంభీరంగా ఒక సెల్యూట్ కొట్టి పూర్తి జాతీయగీతాన్ని ఆయన ఒంటరిగానే పాడి పూర్తిచేశారు. హెడ్డయ్య మాకు చాక్‌లెట్లు ఇస్తున్నప్పుడు, “ఊ.. ఈయన పోతేనే మాకు స్వాతంత్య్ర దినం.” అన్నాడు.
ఆ రోజు ఊరేగింపు, పాండియన్ మెస్ మాంసం భోజనం అంటూ సులభంగా పొద్దు పోయింది. సాయంత్రం సినిమాకు వెళదామని థియేటర్‌ను వెతుక్కుంటూ అక్కడికెళ్లాకే మొదటి షాక్ తగిలింది. అదొక టెంట్ కొట్టాయి. ఏదో పాత సినిమా ఆడుతోంది. థియేటరు బయట ఆ సినిమాకు నాలుగు ఇంటర్వెల్స్ అని రాసి పెట్టున్నారు. అలాగే వెనక్కు తిరిగొచ్చేశాం. రాత్రి భోజనానికి పాండియన్ మెస్‌కు వెళ్లినప్పుడు రెండవ షాక్ తయారుగా ఉంది. సెలవు దినాలలో రాత్రిపూట మెస్ మూసేస్తారట.
ఇంకెక్కడా మంచి భోజనం దొరకదన్న విరక్తిలో ఉన్నప్పుడు, బుల్లెట్ శబ్దం వినిపించింది. బయటికెళ్లి చూస్తే, మమ్మల్ని వెతుక్కుంటూ ఇన్‌స్పెక్టర్ వస్తున్నారు. ఆయన వెంట ఒక వ్యక్తి ఒక పెద్ద క్యారియర్‌ను తీసుకొచ్చాడు. ఇన్‌స్పెక్టర్ మమ్మల్ని చూసి, “ఏంటి? భోజనానికి ఏం చెయ్యాలా అని కంగారుపడుతున్నారా?” అంటూ క్యారియర్‌ను తెరిచారు. అందులో చికెన్, మటన్‌తో పాటు ఇడ్లీలు, దోసెలు ఉన్నాయి. నిన్న, పోలీస్టేషన్‌లో కచ్చితంగా రూల్స్ మాట్లాడిన ఇన్‌స్పెక్టర్‌గా ఆయన మాకు కనిపించలేదు. సంతోషంగా ఆయనతో మాట్లాడుతూ భోంచేశాము.
మా మాటలు ఎక్కడెక్కడికో వెళ్లి సినిమా దగ్గరికొచ్చి ఆగేసరికి, అక్కడ నుండి నేను తర్వాత ఘట్టానికి తీసుకెళ్లాను. నా సినిమా నాలెడ్జ్‌ని చూసి ఇన్‌స్పెక్టర్ ఆశ్చర్యపోయారు.
“అదెలా తమ్ముడూ, స్కూలు చదువుతున్నప్పుడే ఇన్ని సినిమాలు చూసేశావు?” అన్నాడు.
“వీడికివన్నీ మామూలే సార్. మాట్టుక్కార వేలన్ (తెలుగులో కొండవీటి సింహం) సినిమాను వందసార్లు చూసినందుకు ఎం.జి.ఆర్ దగ్గర ట్రాఫీ తీసుకున్నవాడు వీడు.” అన్నాడు మా మామ.
“అరె. తమ్ముడు నాలాగా వాద్దియార్ (ఎం.జి.ఆర్) అభిమానా?” అని మధురై వీరుడి ముఖం సంతోషంతో వెలిగిపోయింది.
తర్వాత రెండురోజులూ పగలంతా పూర్తిగా నిద్ర. రాత్రిపూట ఇన్‌స్పెక్టర్‌తో బాతాఖానీ… అంటూ బాగానే కాలక్షేపం జరిగింది. పగటిపూట షికారులో మన ఇనస్పెక్టరు గురించిన ఒక విచిత్రమైన విషయం తెలిసింది. ఈయన ఈ పోలీస్టేషన్‌కు మార్చుకుని వచ్చిన ఈ ఒక్క సంవత్సరంలోనే, మేలూరులో ఒక్క దొంగతనం సంఘటన కూడా జరగలేదంట. అది మాత్రమే కాదు, ఫుట్‌పాత్ మీది అంగళ్లు, బస్టాండు అంగళ్లల్లో కూడా ఎవరూ మామూళ్లు తీసుకోవటం లేదట. ఊరే ఈయన బుల్లెట్ శబ్దానికి కట్టుబడి ఉందట. ప్రజలలో మంచి పేరూ, తన సొంత కార్యాలయంలో చెడ్డపేరూ కలిగిన ప్రముఖుడుగా వెలుగొందుతున్నారు.
ఈలోపు, నేను ఊరికెళ్లి మూడురోజులైనా తిరిగిరాని విషయాన్ని మా అమ్మ, మా అన్నకు చెప్పేసరికి, ఆయన విచారణలో, మేలూరు పోలీస్టేషన్ ఇన్‌స్పెక్టరు దయతో మేము బ్రతుకుతున్నట్టు ఆయనకు తెలిసినట్టుంది. ఆయన చెన్నైలోని గొప్పగొప్ప అధికారులలో ఎవరో ఒకరి చెవిలో విషయం వెయ్యగా, అక్కడనుండి మదురై రక్షకభట శాఖాధికారి కార్యాలయానికి ఒక ఒత్తిడి ఇవ్వబడి౦ది.
ఆదివారం మధ్యాహ్నం మాకు ఆ విషయం చెప్పటం జరిగింది. సాయంత్రమే హెడ్డయ్య సంతోషంగా మా గదికొచ్చి, “విషయం తెలుసా సార్? రేపు డిఎస్పీ వస్తున్నారట. బయట ఊరి యజమానిని మూడురోజులుగా ఉంచుకోవటం గురించి విచారించటానికి వస్తున్నారని ఆయన ఆఫీసు నుండి నాకు సమాచారం అందింది. రేపు డిఎస్పీ మిమ్మల్ని విచారిస్తే ఇన్‌స్పెక్టర్ కోరిన డబ్బును ఇవ్వకపోవటం వల్లనే మీ కేసును సాగదీస్తున్నట్టుగా చెప్పెయ్యండి సార్, సరేనా?” అని ఒక కొత్త రూట్‌ను చెప్పారు.
సంచలనమైన మరునాడు ఉదయం కోసం ఎదురుచూస్తున్నాం. ఉదయం తొమ్మిది గంటలకల్లా FIR ను తీసుకుని మదురైకు వెళితేనే పగలు పూర్తయ్యేలోపు కోర్టు జామీను పొంది తిరిగొచ్చి, ఇక్కడ నుండి బయలుదేరటానికి వీలవుతుంది. ఇన్‌స్పెక్టరు గది బయట, ఆయనొచ్చి FIR ను ఇస్తారేమోనని ఎదురుచూస్తున్నాం. పది గంటలైనా ఆయన కనిపించలేదు. ఆయన మీదున్న అపరిమితమైన కోపంతో మా మామ అటు ఇటు తిరగసాగాడు. పదకొండు గంటలైనా ఇన్‌స్పెక్టర్ రాలేదు. అయితే, హెడ్డయ్య చెప్పినట్టుగానే ఒక జీపులో డిఎస్పీ అక్కడికొచ్చారు.
బయట నిలబడున్న మమ్మల్ని చూస్తూ పోలీస్టేషన్ లోపలికెళ్లిన కాసేపటికంతా, హెడ్డెయ్య బయటికొచ్చి మమ్మల్ని లోపలికి పిలిచారు. ఇన్‌స్పెక్టరు కుర్చీలో కూర్చోనున్న డిఎస్పీ మమ్మల్ని కూర్చోమని చెప్పి, “చెప్పండి, మీరేనా మూడు రోజులుగా ఇక్కడుంటున్నదీ? ఏం జరిగింది? చెప్పండి.” అని అడిగారు. మాలోని సణుగుడును మేము కుమ్మరించటం మొదలుపెట్టిన అదే సమయంలో, బుల్లెట్ శబ్దం వినిపించింది. లోపలికొచ్చి అసహనంగా డిఎస్పీకి సెల్యూట్ చేసిన ఇన్‌స్పెక్టరు మమ్మల్ని చూసి, ఒక చిరునవ్వు నవ్వారు.
డిఎస్పీ, ఇన్‌స్పెక్టరుతో, “ఏంటయ్యా, వీళ్లనెందుకు రీటెయిన్ చేసి పెట్టుకున్నావు?” అని అడగగానే, అందుకు ఇన్‌స్పెక్టర్, “304 ఎ. సార్! కచ్చితంగా స్టేషన్ బెయిల్ ఇవ్వకూడదని ఎస్పీ ఆఫీసు సర్క్యులర్ ఉంది. అందుకనే కోర్టు జామీను తీసుకురమ్మని చెప్పేశాను.” అని బదులిచ్చారు. డిఎస్పీ దగ్గర మరో ప్రశ్న లేదు.
మేము ఆయన ముందే డిఎస్పీకి ఏం చెప్పాలా అని తడబడుతున్న సమయంలో, ఇన్‌స్పెక్టరే మా మామను చూసి, “ఏం అన్నగారూ. అయ్య దగ్గర నా గురించి ఫిర్యాదు ఏమైనా చేస్తున్నారా?” అంటూ ఒక పేపరును మా ముందుకు చాపారు.
తీసుకుని చూస్తే, డ్రైవరుకు జామీను ఇచ్చిన కోర్టు ఉత్తర్వు అది. ఉదయం ఆయనే మదురైకు వెళ్లి ఒక న్యాయవాదిని కలిసి మొదటి కేసుగా వేసి, జామీనూ తీసుకుని తిరిగొచ్చినట్టున్నారు. ఆయన చెయ్యవలసిన అవసరమే లేని మహా గొప్ప సాయం అది. మా మామ ఏమీ చెప్పలేని నిశ్చేష్టుడయ్యాడు.
డిఎస్పీతో, “మూడు రోజులుగా ఇన్‌స్పెక్టర్ సారే మమ్మల్ని అతిథులుగా చూసుకున్నారు సార్. మాకూ ఇలాగే ఎప్పుడైనా విశ్రాంతి దొరుకుతుంది సార్. చాలా సంతోషంగానే మీ ఊళ్లో బస చేశాం.” అని మా మామ చెప్పగానే, ఆయనకు ఆపైన విచారించటానికి ఏమీ లేకపోయింది. మమ్మల్ని ఒక లాగా చూస్తూ ఆయన బయలుదేరి వెళ్లిపోయారు.
“మేము వెళ్లి గదిని ఖాళీ చేసొస్తాం. ఆలోపు అన్ని ఫార్మాలిటీస్‌నూ పూర్తిచేసి పెట్టండి.” అని హెడ్డెయ్యతో చెప్పి పాండియన్ మెస్‌కొచ్చాం. మా మామకు భలే సంతోషం.
“రేయ్, ఆ డబ్బును తీసుకుని రా. ముందుగా ఇన్‌స్పెక్టరుకివ్వాలి.” అన్నాడు మా మామ.
“తీసుకుంటారా మామా?” అన్నాను.
“ఇచ్చి చూద్దాం రా. వెళ్లి తీసుకు రా.” అన్నాడు.
నేను గబగబా పైకి పరుగెత్తుకెళ్లి చూసేసరికి, నేను వేరేగా దాచిపెట్టిన డబ్బు కనిపించలేదు.
మా మామ అదిరిపడి నిలబడిపోయాడు.
“ఏంట్రా చెబుతున్నావు. మనం బసచేసిన గది అద్దె, భోంచేసిన మెస్సుకు డబ్బు, ఊరికెళ్లటానికి డీజెల్ అన్నింటికీ ఇవ్వటానికి డబ్బు కావాలి కదరా. అన్నింటికీ మించి, స్టేషను ఖర్చు ముఖ్యం కదరా.” అన్నాడు.
అది ఇన్‌లాండ్ లెటర్, ట్రంక్ కాల్ కాలం. ఇప్పటిలాగా ఎటిఎం కాలం కాదు. కాబట్టి, ఇది నిజంగానే అదిరిపడే విషయమే.
బయట బుల్లెట్ శబ్దం వినిపించింది. కిందికి దిగి వచ్చాం. ఇన్‌స్పెక్టర్ బుల్లెట్‌మీదే కూర్చొని ఉన్నారు. వెనకే డ్రైవరుతో సహా, మా బస్సు ఆగి ఉంది. ఇన్‌స్పెక్టర్ మమ్మల్ని చూసి పెద్ద నవ్వుతో, “అన్నగారూ. మీ పనులన్నీ పూర్తయ్యాయి. మీరు ఇప్పుడు బయలుదేరవచ్చు.” అన్నాడు.
మా మామ ఆయనతో, “చాలా కృతజ్ఞతలు సార్. మీరు స్టేషన్‌కు వెళ్లండి, వెనకే వచ్చేస్తాం.” అన్నాడు.
“ఏంటీ ఫార్మాలిటీసా?” అని నవ్వుతూ మమ్మల్ని దగ్గరికి పిలిచి, “మీరు మళ్లీ స్టేషనుకు రాకండి. ఇప్పుడిప్పుడే లోపలున్న వాళ్లను కొద్దికొద్దిగా వాళ్లు తీసుకునే జీతానికి పనులు చేయిస్తున్నాను. మీరొచ్చి వేరేగా ఏదీ వాళ్లకు ఇవ్వాల్సిన అవసరం లేదు. తర్వాత, మీ గది అద్దె, మెస్ బిల్లు అన్నీ నేను సెటిల్ చేసేశాను. ఏమైనప్పటికీ మీరు నాకు అతిథులు కదా?” అని నవ్వారు.
మేమిద్దరమూ అలాగే నిశ్చేష్టులమై నిలబడ్డాం.
“మదురై నుండి వకీలు మీ చిరునామాకు బిల్లు పంపిస్తారు. దాన్ని మాత్రం మీరు, ఆయనకే నేరుగా మని ఆర్డర్‌లో పంపించెయ్యండి.” అన్నారు.
మేము ఏదో చెప్పటానికి ప్రయత్నిస్తే మమ్మల్ని అడ్డుకుని, “మీరు బయలుదేరవచ్చు.” అన్నాడు. ఈసారి మాటలు కాస్త బలంగా వినిపించాయి. ఏం చెప్పాలో తెలియక నిర్ఘాంతపోతూ మా బస్సు వెనక మేము కారులో బయలుదేరాం. పక్కనే బుల్లెట్‌ను తీసుకొచ్చి ఆపిన ఇన్‌స్పెక్టర్ నన్ను చూస్తూ, “తమ్ముడూ, తర్వాత కలుద్దాం. నన్ను మరిచిపోకండి.” అని నవ్వారు. ముప్పై ఏళ్లుగా నా జ్ఞాపకాలలో ఉన్న మదురై వీరుడి చిరునవ్వు అది. ఆయన, మొదటసారి సినిమా బయట నేను చూసిన నిజాయితీ అయిన పోలీసు అధికారి.
ఊరికి బయట బస్సును ఆపించి, అందులో కొంత డీజల్‌ను తీసి మా కారులోకి పోసుకున్నాం. తిరుచ్చికి దగ్గరలోకి వస్తున్నప్పుడు మధ్యాహ్న భోజనం సమయం దాటి చాలా సమయమైంది. మా ఇద్దరికీ ఆకలి దంచేస్తోంది. పైగా మా మామకు ఆయన సిగరెట్లు అయిపోయి చాలా సమయమైంది. తిరుచ్చి నగరంలోకి వస్తున్నప్పుడు, “చాలా ఆకలిగా ఉంది రా. ఏదైనా డబ్బు పెట్టుకోనున్నావా?” అని మా మామ నన్ను అడిగాడు.
“నా దగ్గర అస్సలు లేదు మామా.” అని నా చొక్కా జేబులో చెయ్యి పెడుతూ అన్నాను. జేబు లోపల ఏదో తగిలింది. నేను మొదటిరోజున వేసుకున్న మురికి చొక్కా అది. చేత్తో బయటికి తీసి చూస్తే, మేము తీసుకెళ్లిన మూడువేల ఆరువందల రూపాయలు భద్రంగా, అయితే నలిగిపోయి ఉన్నాయి.
తమిళ మూలం: ఎస్.కె.పి.కరుణా
అనువాదం: జిల్లేళ్ళ బాలాజీ
1961 లో జన్మించిన జిల్లేళ్ళ బాలాజీ 1983 నుండి రచనలు చేస్తున్నారు. 1983లో వీరి మొదటి కవిత ‘కామధేను’ వారపత్రికలోనూ, మొదటి కథ 1984లో ‘పల్లకి’ వారపత్రికలోనూ ప్రచురితమయ్యాయి.
వీరివి ఇప్పటి వరకూ 150 కి పైగా కథలూ, 120 కి పైగా కవితలూ పత్రికలలో ప్రచురితమయ్యాయి. వివిధ పత్రికలు, సంస్థలు నిర్వహించిన కథల పోటీలలో 19 కథలకు బహుమతులు లభించాయి. వీరి కథలు కొన్ని తిరుపతి, కడప రేడియో కేంద్రాలలో ప్రసారమయ్యాయి.
1) మాట్లాడే పక్షి 2) సిక్కెంటిక 3) వొంతు 4) ఉండు నాయనా దిష్టి తీస్తా.. 5) పగడాలు.. పారిజాతాలూ.. 6) నిరుడు కురిసిన వెన్నెల 7) కవన కదంబం (కవితా సంపుటి)మొ!! పుస్తకాలను వెలువరించారు. వీరి తొలి నవల, మరి రెండు కథా సంపుటులు ప్రచురణ కావలసి ఉంది.
వీరి సాహిత్య కృషికి గాను 1) గురజాడ కథా పురస్కారం (కడప) 2) కుప్పం రెడ్డెమ్మ సాహితీ పురస్కారం (చిత్తూరు) 3) తెలుగు భాషా వికాస పురస్కారం (పలమనేరు) 4) గురు దేవోభవ పురస్కారం (తిరుపతి) 5) ఉగాది విశిష్ట పురస్కారం (తిరుపతి) 6) శ్రీమతి కామాక్షీబాయి – శ్రీ నారాయణరావు సాహితీ పురస్కారం (చిత్తూరు) మొదలైనవి వరించాయి.
వీరి రచనలపై ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పరిశోధన జరుగుతున్నది.
తమిళ భాషపై పట్టు ఉన్నందున తమిళం నుండి తెలుగులోకి అనువాదాలు కూడా చేస్తున్నారు. ఇప్పటిదాకా వీరు… 130 కి పైగా కథలు, 10 నవలలు, 2 నవలికలు, 1 కవితా సంపుటి, 1 వ్యాస సంపుటి, 1 వచన రామాయణం.. అనువదించారు.
1) కాల ప్రవాహం 2) జయకాంతన్ కథలు 3) నైలు నది సాక్షిగా… 4) శిథిలం 5) జీవనాడి 6) నీళ్లకోడి 7) బహిర్గతం కాని రంగులు మొ!! కథా సంపుటులు వెలువడ్డాయి.
అలాగే 1) కల్యాణి 2) ఒక మనిషి.. ఒక ఇల్లు.. ఒక ప్రపంచం 3) ప్యారిస్‌కు పో! 4) యామం 5) గంగ ఎక్కడికెళుతోంది? మొదలగు నవలలు, చతుర మాసపత్రికలో మరో 3 నవలలు ప్రచురితమయ్యాయి. అలాగే 1) కాపరులు (వ్యాస సంపుటి) 2) ఫిర్యాదు పెట్టెపై నిద్రిస్తున్న పిల్లి (కవితా సంపుటి) వెలువడ్డాయి. మరో రెండు అనువాద నవలలు సాహిత్య అకాడమీ ప్రచురించవలసి ఉంది.
అనువాదంలో.. 1) ప్రతిష్ఠాత్మకమైన ‘కేంద్ర సాహిత్య అకాడెమీ అనువాద పురస్కారం’ (2010) 2) ‘నల్లి దిశై ఎట్టుమ్’ పత్రిక నుండి ఉత్తమ అనువాదకుడి పురస్కారం (2011) 3) ‘కె.ఎస్.మొళిపెయర్పు విరుదు’ పురస్కారాలను పొందారు (2023).
