Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మగువా.. నీకిదే వందనం

[శ్రీ జి.ఆర్.భాస్కర బాబు రచించిన ‘మగువా.. నీకిదే వందనం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

నందపు చిరుప్రాయం
అరవిరిసిన మందారం కౌమారం
సొగసులు విరిసిన ప్రౌఢత్వం
జాణతనం కలసిన యవ్వనం
సప్తపదితో అనంతమైన ఆశలు
అమ్మతనం అనుభూతించిన మధుర స్వప్నం
ఇలకేతించిన సుందర స్వర్గం..
కూతురుగా, అక్కగా, చెల్లిగా
ఇల్లాలిగా, మామ్మగా, అమ్మమ్మగా..
అనేకానేక వర్ణాల యవనికలు
జారిన జీవన సృజనలు..
గతంలో నుంచి వర్తమాన
పట్టకంలోకి వక్రీభవించిన తిరోగమన
శ్వేత కాంతి పుంజం
ముడుతలు పడినఒడలు
ఎన్నో అనుభవాల సమాహారం
మనో వల్మీకంలో
మందంగా కదులుతున్న
ఆలోచనల సర్పాలు
కాళ్ళ కింద నలిగిపోయిన
కాలం ఆనవాళ్లు
వాలిపోతున్న జీవంతప్పిన
గాజు కళ్ళ రెప్పలు‌..
మనసులో మాత్రం
అభ్రక ధవళ స్వచ్ఛ ఆనందం
ఏదో.. ఎంతో.. సాధించిన
సాఫల్య దరహాస రేఖ!!!
అనంతంగా సాగుతున్న
జీవన చక్ర భ్రమణంలో
మగువా.. నీకిదే వందనం.

Exit mobile version