[శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘మహాప్రవాహం!’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]
[భోజనమయ్యాకా చిన్న కునుకు తీసి లేచిన కొండారెడ్డి ముఖం కడుక్కుని భార్య ఇచ్చిన బెల్లం టీ తాగి కమ్మరిసాలకి వెళ్తాడు. వడ్లాయన రామబ్రెమ్మం, ఆయన కొడుకు వీరబ్రెమ్మం, ఆయన బార్య సిద్దమ్మ కస్తిగ పని చేస్తూ ఉంటారు. అక్కడ చాలామంది రైతులు తమ పనిముట్లను సరిజేయించుకోడానికి వేచి ఉంటారు. కొండారెడ్డిని చూడగానే రామబ్రెమ్మం ఆప్యాయంగా ఆహ్వానిస్తాడు. అక్కడున్న వారంతా కొండారెడ్డిని పలకరిస్తారు. సుబ్బారెడ్డి తన పొలం గురించి ఏదో అడిగితే, అతనికి చక్కని సలహా ఇస్తాడు కొండారెడ్డి. ఆ రాత్రి రాములవారి గుడిలో ఆ ఊరి పురోహితుడు పద్మనాభశాస్త్రి అందరికీ మంచి మాటలు చెబుతుంటాడు. ఆయన ఓ శ్లోకం చెప్పి దాని భావం వివరిస్తుంటే, సంజన్న గౌడ్ – అక్కడ లేని ఓ వ్యక్తి గురించి వ్యాఖ్య చేస్తాడు. ఇంకొందరు వేరే కబుర్లు అందుకుంటారు. దూరంగా కూర్చున్న వీరకేశవరెడ్డి వాళ్ళని మందలించి పద్మనాభయ్య చెప్పేవి వినమంటాడు. ఒకచోట వ్యాఖ్యానంలో పద్మనాభయ్యకి సందేహం వస్తే కొండారెడ్డి తనకి తోచిన విధంగా ఆ శ్లోకాన్ని అన్వయిస్తాడు. తన మనసులోనూ అదే మెదిలిందని పద్మనాభయ్య కొండరెడ్డిని అభినందిస్తారు. కాసేపటికి ఎవరిళ్ళకి వారు వెళ్తారు. సంజన్న గౌడ్ ఇంటికి వెళ్ళి తండ్రి దగ్గర కాసేపు కూర్చుంటాడు. తమ వృత్తి గురించి ఆయన కొడుకుని ప్రశ్నలు అడిగి, కొడుకునో కోరిక కోరతాడు. మర్నాడు సంజన్న గౌడ్ లద్దగిరి, గోరంట్ల సెంటర్లలో తమ కల్లు అమ్మించి, తనకి, భార్యకి, పిల్లాడికి, తండ్రికి కావల్సిన వస్తువులు కోడమూరికి వెళ్ళి కొనుక్కుని ఇంటికి చేరుతాడు. సంజన్నకి రాజకీయాలంటే ఇష్టం. బొమ్మిరెడ్డిపల్లెలో రాజకీయాలు అంతగా లేవు. కల్పవృక్షం లాంటి తాటివనం ఉండగా, రాజకీయాలెందుకని సంజన్న తండ్రి అంటూంటాడు. గుడిలో మంచి మాటలు చెప్పడమయ్యాక, పద్మనాభయ్య ఇంటికి వెళ్తాడు. కొడుకుని పలకరిస్తాడు అందరూ కలిసి పలహారానికి కూర్చుంటారు. ఎలా చదువుతున్నావని కొడుకు కేదారని అడిగితే, బాగా చదువుతున్నానని చెప్పి, తెలుగు సారు చెప్పిన ఒక పద్యాని అర్థం చెప్పమని తండ్రిని అడుగుతాడు. పలహారం అయ్యాకా, కేదారకి కావల్సిన పద్యాన్ని చదివి వినిపించి, ప్రతిపదార్థం చెప్తాడు పద్మనాభయ్య. తాత్పర్యం తాను రాసుకోగలనని అంటాడు కేదార. పద్మనాభయ్య మంచం మీద వాలితే కాసేపు తండ్రి కాళ్ళు పడతాడు కేదార. తర్వాత అందరూ నిద్రిస్తారు. ఇక చదవండి.]
పొద్దున ఐదు గంటలకంతా పద్మనాభయ్య నిద్ర లేచినాడు. మీనాక్షమ్మ అంతకు ముందే లేచినాది. గొల్ల మద్దిలేటి పెండ్లాం శేషమ్మ లీటరు పాలు తెచ్చిపోసినది. బొగ్గుల పొయ్యి రాజేసి కంచుగిన్నెలో పాలు పొయ్యి మీద పెట్టినాది మీనాక్షమ్మ. బొగ్గులు బాగా రాజుకునేంత వరకు పొయ్యి క్రింద ఇసనకర్రతో యిసిరినాది.
పద్మనాభయ్య కాలకృత్యాలు తీర్చుకున్నాడు. బోరింగు దగ్గర నీళ్లు కొట్టుకొని అక్కడే స్నానం చేసినాడు. స్నానం చేస్తూన్నంత సేపూ ఆయన నోటి వెంట ఏవో మంత్రాలు వస్తానే ఉండాయి. స్నానమయిన తరువాత వంటింట్లో దండెం మీదనున్న ధావళి (మడి వస్త్రం) ధోవతి మాదిరి కట్టుకున్నాడు. పైన అంగవస్త్రము కప్పుకున్నాడు. నుదుటన విభూతి రేఖలు, కుంకుమ పెట్టుకున్నాడు. గంధం చెక్కను రాతిపలక మీద అరగదీసి చిన్న వెండి గిన్నెలోకి గంధం తీసినాడు. దొడ్లో పూసిన చామంతులు, గన్నేరుపూలు ఒక సిబ్బి (వెదురు గంప చిన్నది) లో తెచ్చిచ్చింది మీనాక్షమ్మ.
మందహాసము పీఠము మీద స్ఫటిక లింగము, సాలగ్రామములు ఉన్నాయి. ఇత్తడితో చేసిన వినాయకుడు, దత్తాత్రేయస్వామి, వెంకటేశ్వర స్వామి విగ్రహాలున్నాయి. సర్పరూపంలో సుబ్రమణ్యస్వామి విగ్రహం వెండిది కూడా ఉంది. ఇవన్నీ ఒక చిన్న ఇత్తడి ప్లేటులో ఉన్నాయి. మందహాసము నాలుగువైపులా ఉన్న స్తంభాలు నూనెతో రోజా తుడవటం వలన మెరుస్తున్నాయి. పైన గోపురం నుండి క్రిందకు ఒక ఒక జీరో బల్బు వేలాడుతుంది. దక్షిణామూర్తి, రాఘవేంద్రస్వామి, శ్రీరాములవారు పటాలలో కొలువుదీరి ఉన్నారు
పద్మనాభయ్య దేవుండ్లందరినీ తడిగుడ్డతో తుడిచినాడు. “సాజ్యం త్రివర్తి సంయుక్తం” అన్న శ్లోకాన్ని చదువుతూ ఇత్తడి సెమ్మెలలో నూనె పోసి దీపారాధన చేసినాడు. కలశపూజ, పీఠపూజ చేసి, అందర్నీ పేరుపేరునా ఆవాహనం చేసినాడు. తర్వాత పంచామృత, శుద్ధోదక, పురుష సూక్త సహిత అభిషేకము జరిపినాడు. విగ్రహాలనన్నింటినీ శుభ్రంగా పొడిగుడ్డతో తుడిచి, గంధం కుంకుమ, పూలతో అలంకరించినాడు.
అగరువత్తి (ఊదొత్తి) వెలిగించి, రెండరటి పండ్లు నైవేద్యం పెట్టి, ‘దూపార్తి’లో కర్పూరము అంటించి గంట వాయిస్తూ హారతిచ్చినాడు. తర్వాత మంత్రపుష్పము చదివి పూజను ముగించినాడు. మొత్తం పూజ పూర్తిగావటానికి గంట పట్టింది. మీనాక్షమ్మ కూడ ఈలోగా స్నానం ముగించి మడిచీర కట్టుకొని వచ్చి, హారతి, తీర్థం, ప్రసాదం తీసుకున్నది.
పద్మనాభయ్య ధావళీ వదిలి మామూలు పంచ కట్టుకున్నాడు. వంటిట్లోకి వెళ్లి పీట వాల్చుకుని కూర్చున్నాడు. ఇత్తడి గ్లాసులో కాఫీ ఇచ్చింది మీనాక్షమ్మ.
“మరి నీకు?” అని అడిగినాడాయన.
“వాడు లేచింతర్వాత ఇద్దరం తాగుతాము లెండి” అన్నదామె.
ఇంతలో బయట నుండి ఎవరో “సామీ! ఓ సామీ! సామి లేడా అమ్మయ్యా!” అంటూ అరుస్తాండారు. కర్నూలు జిల్లాలో బ్రాహ్మణ స్త్రీలను ‘అమ్మయ్యా’ అని పిలుస్తారు.
మీనాక్షమ్మ బైటికిపోయి చూసింది. మానుకింది మద్దయ్య. నోరంతా తెరిచి నవ్వుతూ, “సామి లేడా అమ్మయ్యా!” అనడిగినాడు.
“ఉన్నారు నాయినా, కాఫీ తాగుతున్నారు. వస్తారు కూచో!” అన్నదామె.
పద్మనాభయ్య పంచాంగం, ముహూర్త దర్పణం, తీసుకొని బయటకి పోయేసరికి మానుకింది మద్దయ్యతో బాటు మరి కొంతమంది సిరిసాపల మింద కూసునుండారు. సామిని జూసి అందురూ లేసి నిలబడిరి. ఆయనకు దండం పెట్టారు. “కూచోండి రా” అన్నాడాయన. “చెప్పండి!”
మద్దయ్య అన్నాడు “సామీ మాది ఈరన్నగట్టు కింద నల్లర్యాగడి ఉండాది గదా! దాన్ని దుక్కి జెయ్యాల. పేరు బలం చూసి యానాడు మంచిదో చెప్పవా సామీ”
వాండ్లకు జన్మనక్షత్రాలు గురించి అంత అవగాహన ఉండదు గాబట్టి నామ క్షత్రం ప్రకారం చూశారాయన.
“ఒరేయ్ మద్దయ్యా, నీ పేరు మీద అంత బాగలేదు గానీ, నీ కొడుకు పేరు చెప్పు”
“వాని పేరు ఓబులేశు గద!”
మళ్లీ ఓబులేశు నామనక్షత్రాన్ని బట్టి, చేను ఉన్న దిశను బట్టి గణించాడాయన.
“రేపు బాగుంది. నీ కొడుకును గెడం కట్టుకుని పోయి పొద్దున ఎనిమిది గంటల లోపున దుక్కి మొదలు బెట్టమను. తర్వాత రాహుకాలం వస్తాది! ఇంతకూ వానికి దున్నడం వచ్చుగద!”
“అయ్యో సామి! అంత మాటంటివి! మా మానుకిందోల్ల మందరం రైతులమే గదా! మా ఓబులేశు గుడ్క మా సెడ్డ పనోడే సేద్దం జేయడంలో!” అన్నాడు మద్దయ్య. ఆ మాటల్లో కొడుకు మీద అతనికున్న వాత్యల్యము కనబడ్డాది.
“సర్లే అయితే, పోనీవు. పటమటి దిక్కు ముకంగా ఎద్దులుండాల జూడు”
మద్దయ్య మూడు తమలపాకులు, వక్కలు, ఒక రూపాయ బిల్ల తాంబూలంలో పెట్టిచ్చి సామికి మొక్కి ఎల్లిపాయ.
“నీవేం పని మీద వచ్చినావురా?” అని సరెడ్డి హనుమంత రెడ్డి నడిగె సామి.
“సామి, నా బిడ్డను ప్యాపిలికిచ్చినాము గద. దానికి ఒడిబియ్యం పెట్టి మూడేండ్లు గావచ్చె. పిల్లను తోలుకుని రానీకె, ఒడిబియ్యం పెట్టనీకె మంచి దినం సూడు..’
“ఎన్ని దినాల్లో గావాల?”
“ఒక వారం దినాల్లో అయితే శాన”
సామి అనుమంత రెడ్డి బిడ్డ పేరడిగి, “వచ్చే సోమవారం విదియ బాగుంది. ఆ రోజు పిల్లను తోలుకొచ్చుకోండి. బేస్తవారం (గురువారం) పంచమి ఒడిబియ్యానికి మంచి రోజు. సాయంత్రం నాలుగు గంటల నుండి ఆరు వరకు పెట్టవచ్చను. అవునూ, నీ బిడ్డకెంత మంది రా పిల్లలు?”
“ఇద్దురు సామి ఒగ కొడుకు ఒక బిడ్డ. నీ దయవలన బాగుండారులే్!”
“నాదేముంది నాయనా! అంతా పరాత్పరుని కృప!” అంటూ ఆకాశం వైపు జూసి చేతులు జోడించినాడు పద్మనాభయ్య. “అల్లుడేం జేస్తాడు?”
“ఆ యప్ప గుత్తిలో ఒక బుడ్డలనూనె మిల్లు గుమాస్తా. ప్యాపిలిలో సొంత యిల్లుండాది. మూడెకరాలు ఎర్రన్యాల కూడ ఉండాది లే సామి!”
“సంతోషం నాయినా! వెళ్లి రా మరి।”
అనుమంతరెడ్డి ఒక చిన్న సంచిలో తెచ్చిన కందులు, ఒక గుమ్మడికాయ సామికి సమర్పించి, మొక్కి వెళ్లిపోయినాడు.
ఇంక మాలగేరి దాసప్ప మిగిలినాడు. ఆ యప్ప అరుగు మింద కూచోకుండా కిందనే నిలబడి ఉండాడు.
“ఏమిరా! కింద నిలబడితివి! పైకివచ్చి కూచో నాయినా,” అన్నాడు సామి.·
“ఆ అనుమంత రెడ్డి, మానుకింద మద్దయ్య ఒప్పుకుందురా సామి! ఎవురు యాడుండాల ఆడనే ఉండాల గద!”
“పిచ్చివాడా! ఆ పరాత్పరుని దృష్టిలో అందరూ సమానమేరా! సరేలే, వాండ్లు లేరు గదా! వచ్చి కూర్చో పరవాలేదు!”
దాసప్ప కృతజ్ఞతతో సామికి చేతులెత్తి మొక్కినాడు కానీ పైకి రాలేదు. తరతరాలుగా అణగదొక్కి ఉంచిన కారణంగా అతనికి సంక్రమించిన న్యూనతాభావం పోలేదు.
“సరే చెప్పు! ఏం పని మీదొస్తివి?”
“సామి, మాది ఎనుము (గేదె) రెండ్రోజుల్నుండి కనపడడం లేదు. మామూలుగ రైలుకట్ట నానుకొని బీట్లో మేపుతాము. అదంతకదే కట్టు గొయ్య కాడికొచ్చి నిలబడతాది. చూలుతో ఉండాది సామి! అది ఈనితే ఇంటిల్లపాదిని బతికిచ్చాదని ఆశతోని ఉండాము. ఏమయిపాయనో ఏమో?” అంటూ కండ్ల నీళ్లు బెట్టుకున్నాడు దాసప్ప.
దాసప్పను ఓదార్చినాడు పద్మనాభయ్య. “ఎక్కడికి పోతుందిలేరా? నీవు మొదట్నించి ఒకరికి అపకారం చేసినోడివి గాకపోతివి” అంటూ దాసప్ప ప్రశ్న అడిగిన సమయాన్ని బట్టి గుణించినాడు.
“ఒరేయ్, నీ పసరం దక్షిణదిక్కున ఉన్నట్లు తోస్తున్నది. మన బొమ్మిరెడ్డి పల్లెకు దక్షిణాన మల్లేపల్లె, అల్లుగుండు గ్రామాలున్నాయి. ఆ ఊళ్లల్లో బందెలదొడ్లలో చూడు. పదిమందిని విచారించు. ఏం కాదులే పో”
దాసప్ప మొలలో నుంచి అర్ధరూపాయి తీసి సామికి ఇవ్వబోతూండగా ఆయన వారించినాడు.
“వద్దు లేరా! నీ ఎనుము దొరికిన తర్వాత ఇద్దువుగాని” అన్నాడు సామి. దాసప్ప ఆయనకు మొక్కి వెళ్లిపోతూండగా, ఆయన, “ఒరే నాయినా, చిన్నపని. నేను రమ్మన్నానని మన కొండారెడ్డికి చెప్పిపో” అన్నాడు
“అట్లనే సామి” అని చెప్పి వెళ్లి పోయినాడు దాసప్ప.
పద్మనాభయ్య ఇంట్లోకి వచ్చినాడు. కొడుకు లేచి తయారై, నిన్న రాత్రి మిగిలిన ఉప్పుడుపిండి తిని బయటకి పోతున్నాడు.
“నాయినా, పోయొస్తా” అని చెప్పి వెళ్లిపోయినాడు కేదార.
తర్వాత ఆయన కొంసేపు జంధ్యాలు వడకినాడు. పదకొండు గంటలకు మీనాక్షమ్మ వచ్చి అడిగింది.
“భోజనం చేస్తారా?”
“వడ్డించు పద! వస్తున్నా”
ఆయన మళ్లీ ధావళీ కట్టుకొని, పైన అంగవస్త్రం కప్పుకొని భోజనానికి కూర్చున్నాడు. అంతకముందే దైవ నివేదన చేసింది మీనాక్షమ్మ.
విస్తరిలో మామిడి కాయముక్కల పచ్చడి, చింతాకు పప్పు వేసింది. అన్నం వడ్డించి నెయ్యి వేసింది. ఆయన విస్తరి చుట్టూ పరిషేచనం చేసి తినసాగినాడు.
“చింతచిగురు బాగా పుల్లగా ఉందే మీనాక్షీ!” అన్నాడు.
“అవును. అందుకే మరి చింతపండు వేయలేదు” అన్నదామె.
తర్వాత కట్టుచారు, మజ్జిగతో భోజనం ముగిసింది. ఉత్తరాపోశనం బట్టి,
“అమృతాపి ధానమసి
రౌరవే పుణ్యనిలయే
పద్మార్బుధనివాసినాం
అర్ధీనాముదకం నిత్యం
అక్షయ్యముప తిష్టతు” అన్న మంత్రం చదివినాడు.
తర్వాత అదే ఆకులో మీనాక్షమ్మ భోజనం చేసింది.
బయట కొండారెడ్డి నిలబడి, “సామీ! రమ్మన్నావంట! దాసప్పగాడు చెప్పె” అని అంటున్నాడు.
పద్మనాభయ్య కొండారెడ్డిని పడసాలలోకి ఆహ్వానించినాడు. ఎందుకంటే అరుగుల మీదకు ఎండ వచ్చినాది. రెడ్డి లోపలికివచ్చి కింద కూర్చున్నాడు. పద్మనాభయ్య నవారు మంచం మీద కూర్చున్నాడు.
మీనాక్షమ్మ వచ్చి కొండారెడ్డిని పలుకరించింది – “ఏం నాయనా, ఇంట్లో అంతా బాగున్నారా?”
“మీ దయవలన అంతా బాగుండాములే అమ్మయ్యా!”
“అంతా ఆ పరమాత్ముని దయ నాయనా! నాగరత్నమ్మ, పిల్లలు బాగుండారు గద!”
“అంతా బాగే అమ్మయ్య”
“కొంచెం మజ్జిగ తాగు నాయనా, ఎండలో వస్తివి!”
“అంతకంటే బాగ్గెమా! ఇయ్యి తల్లీ”
ఒక సత్తుగ్లాసులో మజిగ తెచ్చిస్తే, నోటికానించుకోకుండా గ్లాసు పైకెత్తి తాగేసినాడు కొండారెడ్డి. కమ్మని మగ రుచిని ఆస్వాదించిన తృప్తి ఆ యప్ప మొగంలో కనబడింది.
“అమ్మయ్యా, కొంచెం నీల్లు బొయ్యమ్మా” అని అడిగి, గ్లాసును శభ్రంగా కడిగి తొలిచి, బోర్లించి పెట్నాడు కొండారెడ్డి. దాని మీద నీల్లు చల్లుకొని లోపలికి తీసుకోబోయింది ఆ యిల్లాలు.
పద్మనాభయ్యకు సుంకులమ్మ గుడికి వెనుక, కొండారెడ్డి సేనుకు అనుకుని మూడెకరాలు ఎర్రనేల ఉండాది. దాన్ని కొండారెడ్డి సాగు చేసిస్తాడాయనకు, ఎద్దులు, సేద్యం కొండారెడ్డివి. విత్తనాలు, కూలీలు ఎరువులు చెరిసగం బరించుకుంటారు. పంట చెరిసగం. దీన్ని ‘సరికోరు’ అంటారు. అంటే పద్మనాభయ్య తన సేనిని కొండారెడ్డికి ‘కోరు’ కిచ్చి నాడన్నమాట. ఇంకో పద్ధతుంది. దాన్ని ‘గుత్త’ కియ్యడం అంటారు. అందులో సేద్యం, ఖర్చులన్నీ గుత్తకు తీసుకున్న రైతే పెట్టుకుని, సాలుకిన్ని గోతాలు దాన్యమో, బుడ్డలో, లెక్కో, సేను సొంతదారునికిస్తాడు.
కొండారెడ్డి తాత కాలం నుండీ, పద్మనాభయ్య వాండ్ల చేనును కోరుకు చేస్తూన్నారు.
“మరి మన చేను దుక్కి అయిందిగదా! గుంటక పాపనం చెయ్యొద్దూ!” అన్నాడు పద్మనాభయ్య.
“ఔ సామీ, నిన్నటితో నా సేను పాపనం అయిపాయ. గుంటక బ్లేడు గుడ్క సరిపిచ్చినాలే. రేపో ఎల్లుండో మన సేనులో గుంటక దోల్తా. సరేగాని సామీ, వర్షాలు ఎక్కువై ఈరన్నగట్టు చెరువు నిండకముందే మనం చెరువు లోని ఒండుమట్టిని సేనుకు తోలాల. అది మంచి సత్తువనిస్తాది. గిత్తలు బండి నావి ఉంటాయిగాని, బండికి మన్ను ఎత్తడానికి, మల్లా సేనులో దిగనూకి, సేనంతా గంపలతో జల్లడానికి ఒక మనిసి గావాల.”
“తప్పకుండా తోలదాం, మనిసిని మాట్టాడు. కూలీ ఎంత ఉందో యిప్పుడు?”
“మజ్జాన్నం బువ్వ పెట్టి, రోజుకు ఐదు రూపాయలు అడుగుతూంటారు. సామీ, కొందురైతే బీడీ కట్ట, అగ్గిపెట్టి, వక్కాకు డబ్బులు ఎగస్ట్ర అడుగుతూండారు.”
పద్మనాభయ్య నవ్వి అన్నాడు “ఇద్దాము లేరా, కాయకష్టం చేసేవాండ్లకు ఆ మాత్రం ఇస్తే తప్పేమి లేదులే. మన దాసప్పనే పెట్టుకుందాం. నేను చెప్పినానని చెప్పు”
“అట్లనే సామి! గుంటక తోలడం ఐనంక చెరువు మట్టి తోలదాము. రోజూ పొద్దున్నించి పైటాలవరకు నాలుగు తూర్లు తిరిగితే, వారం రోజుల్లో సేనంతా మట్టి పరవచ్చును.
“దాసప్పను మద్యాన్నం పనయింతర్వాత మాయింటికే రమ్మను. మా అమ్మయ్య బువ్వపెడతాది”
“సరే సామి! నేనా పని మీదుంటా మల్ల” అని సామికి మొక్కి ఎల్లిపోయినాడు కొండారెడ్డి. పద్మనాభయ్య కాసేపు కునుకు తీసి లేచినాడు. మళ్లీ మూడుగంటల నుండి పంచాంగమనీ, మంచి రోజులనీ జనం వస్తారాయన దగ్గరకు. సాయంత్రం సంధ్య వార్చుకుని ప్రదోషపూజ నిర్వర్తించి, రాముల దేవళానికి బోయి పదిమందికి నాలుగు మంచి మాటలు చెబుతాడు ఆయన.
(ఇంకా ఉంది)
శ్రీ పాణ్యం దత్తశర్మ 1957లో కర్నూలు జిల్లా వెల్దుర్తిలో పుట్టారు. తండ్రి శతావధాని శ్రీ ప్రాణ్యం లక్ష్మీనరసింహశాస్త్రి. తల్లి శ్రీమతి లక్ష్మీనరసమ్మ. టెంత్ వరకు వెల్దుర్తి హైస్కూలు. ఇంటర్, డిగ్రీ, ఎం.ఎ. (ఇంగ్లీషు), ఎం.ఎ. (సంస్కృతం), ఎంఫిల్, పిజిడిటియి (సీఫెల్), ప్రయివేటుగానే.
దత్తశర్మ ఇంటర్మీడియట్ విద్యాశాఖలో లెక్చరర్‌గా, ప్రిన్సిపాల్‌గా, రీడర్‌గా, ఉపకార్యదర్శిగా సేవలందించారు. కవి, రచయిత, విమర్శకులు, గాయకులు, కాలమిస్టుగా పేరు పొందారు. వీరివి ఇంతవరకు దాదాపు 50 కథలు వివిధ పత్రికలలో ప్రచురితమై వాటిలో కొన్ని బహుమతులు, పురస్కారాలు పొందాయి.
వీరు ‘చంపకాలోచనమ్’ అనే ఖండకావ్యాన్ని, ‘Garland of poems’ అన్న ఆంగ్ల కవితా సంకలనాన్ని, ‘దత్త కథాలహరి’ అన్న కథా సంపుటాన్ని ప్రచురించారు. వీరి నవల ‘సాఫల్యం’ సంచిక అంతర్జాల పత్రికలో 54 వారాలు సీరియల్‌గా ప్రచురితమై, పుస్తక రూపంలో ప్రచురింపబడి అశేష పాఠకాదరణ పొందింది. 584 పేజీల బృహన్నవల ఇది. ‘అడవి తల్లి ఒడిలో’ అనే పిల్లల సైంటిఫిక్ ఫిక్షన్ నవల సంచిక డాట్ కామ్‌లో సీరియల్‌గా ప్రచురించబడింది.
వీరికి ఎ.జి రంజని సంస్థ కవి సామ్రాట్ విశ్వనాథ పురస్కారాన్ని, ‘తెలంగాణ పాయిటిక్ ఫోరమ్’ వారు వీరికి ‘Poet of Profundity’ అన్న బిరుదును, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంవారు వీరి సిద్ధాంత గ్రంథానికి అవార్డును, సి.పి. బ్రౌన్ సమితి, బెంగుళూరు వారు వీరికి ‘NTR స్మారక శతకరత్న’ అవార్డును బహూకరించారు.
ఇద్దరు పిల్లలు. ప్రహ్లాద్, ప్రణవి. కోడలు ప్రత్యూష, అల్లుడు ఆశిష్. అర్ధాంగి హిరణ్మయి. సాహితీ వ్యాసంగంలో రచయితకు వెన్నుదన్నుగా ఉన్న గురుతుల్యులు, ప్రముఖ రచయిత వాణిశ్రీ గారు. వీరు – తమ సోదరి అవధానం లక్ష్మీదేవమ్మ గారు, మేనమామ శ్రీ కె. సీతారామశాస్త్రి గార్లకు ఋణగ్రస్థులు.