Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మహాప్రవాహం!-36

[శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘మహాప్రవాహం!’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[దుబాయిలో వీర వుడ్ వర్క్ చేస్తున్న రిసార్టు పూర్తవుతుంది. షార్జా మినిస్టర్ ఒకాయన దాన్ని చూసి, సుల్తానేటులో ఒక భవనంలో అలా చేసివ్వమని అడుగుతాడు. తన వద్ద పని పూర్తయింది కదా, ఇక నీ ఇష్టమని అంటాడు షేక్. దుబాయి రిసార్టు ప్రారంభోత్సవానికి ఇండియా నుండి హీరో సల్మాన్ ఖాన్ వస్తాడు. ఆయన రిసార్టులోని వుడ్ వర్క్ అంతా చూసి అబ్బురపడి వీరని అభినందిస్తాడు. బొంబయి వచ్చేస్తే ఆర్ట్ డైరక్టర్‍ని చేస్తానంటాడు. ఐతే వీరకివన్నీ ఇష్టం లేదు. తొందరగా ఇండియా వెళ్ళిపోయి అమ్మానాన్నలతో కలిసి ఉండాలని అనుకుంటాడు. షేకు చెప్పిన మీదట షార్జా వెళ్ళి ఎనిమిది నెలలు ఉండి, సుల్తానేటు భవనంలో కూడా వాళ్ళు అడిగినట్టు గొప్పగా వుడ్ వర్క్ చేసిస్తాడు. వాళ్ళు ఎంతగానో మెచ్చుకుని డబ్బుతో పాటు బంగారు గొలుసు, బ్రాస్‍లెట్, ఉంగరం బహుమతిగా ఇస్తారు. డబ్బుని అదోనిలోని స్టేటు బ్యాంకుకు ట్రాన్స్‌ఫర్ చేయించుకుంటాడు వీర. పనులన్నీ ముగిసాకా, ఇండియా వచ్చేస్తాడు. అదోనిలో వీరకి ఘన స్వాగతం లభిస్తుంది. ముందు గౌసుమియ శిన్నాయన ఇంటికిపోయి పిన్ని చేతి వంట తింటాడు. తరువాత బస్సులో కోడుమూరు వెళ్ళి, అక్కడ్నించి ఉళిందకొండ బస్సులో బొమ్మిరెడ్డిపల్లెకి వెళ్తాడు. అక్కడ వీరని చూడడానికి చాలామంది వస్తారు. అమ్మతో తనకి ఇష్టమైనవి చేయించుకుని తింటాడు. మళ్ళీ ఆదోనికి వెళ్ళి దినకర్‍రెడ్డిని, ఎమ్మెల్లే రత్నరాజప్పని కలిసి – కాళ్ళకి మొక్కుతాడు. ఇప్పుడేం చేద్దామని అని దినకర్ రెడ్డి అడిగితే, ఆదోనిలోనే ఏదైనా.. అని వీర చెప్తుంటే రత్నరాజప్ప జోక్యం చేసుకుని నీ ప్రతిభకి ఈ ఊరు సరిపోదు. హైదరాబాదు గాని, బెంగుళూరు గాని వెళ్ళి స్థిరపడు అని చెప్తాడు. ఆయన సూచన మేరకు, ఆయన తోడల్లుడి సహాయంతో బెంగుళూరులో ఇంటీరియర్ డిజైనింగ్ షాపు తెరుస్తాడు వీర. మంచి పేరు, డబ్బు సంపాదించుకుంటాడు. తల్లిదండ్రులను, గౌసుమియ, కాశింబీలను తనతో బెంగుళూరులోనే ఉంచుకుంటాడు. అమ్మ చూపించిన అమ్మాయిని పెళ్ళి చేసుకుంటాడు. కాలక్రమంలో ఇద్దరు కూతుర్లు పుడతారు. వైభవంగా సాగిపోతుంది వీర జీవితం. బెంగుళూరులోని ఓ వృద్ధాశ్రమంలో ఉంటారు సంజన్న గౌడు, విమలమ్మ. కొడుకు ప్రదీప్ అమెరికాలో స్థిరపడిపోవడంతో, వీళ్ళను చూసుకునేవారెవరు లేకపోవడంతో ఇక్కడ చేరుస్తాడు. వీళ్ళు నాలుగో అంతస్తులో ఉంటే, రాజమ్మ అదే అంతస్తులోని డార్మిటరీలో ఉంటుంది. ఆ రోజు రాత్రి టివి చూడ్డానికి వీళ్ళ గదికి వస్తుంది రాజమ్మ. ఆ సమయంలో కొడుకు ప్రదీప్ అమెరికా నుంచి వీడియో కాల్ చేస్తాడు. కాసేపు మాట్లాడుతాడు. మనవరాలు, కోడలు పలకరిస్తారు. ఆఫీసులకి బయల్దేరాలని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ప్రదీప్. ఇక చదవండి.]

తొమ్మిదిన్నరైంది. రాజమ్మ ఆవులించబట్నాది. “పోయి పడుకోపోత్తా” అన్నాడు సంజన్న. తిరిపాలు ఐదేండ్ల కిందట దగ్గు బుస (బ్రాంకైటిస్) తోని బాదపడి, సచ్చిపోయినాడు. కొన్ని రోజులు రాజమ్మ ఒక్కతే బతికింది. వీండ్లను కొడుకు ఈడ జేర్పించేటప్పుడు ఆమెను గూడ తీసుకచ్చినారు. డార్మిటరీలో ఐతే శార్జీ శానా తక్కువ. రాజమ్మ బజ్జీల బండి మింద సంపాయిచ్చిన డబ్బులు కొంచెం ఉండిన్నాయి. నెల నెలా ఆమెకు గుడ్క ప్రదీపే కడ్తాడు.

ఇమలమ్మ తొందరగానే నిద్రబోయినాది. కానీ సంజన్న గౌడుకు నిద్ర బట్టల్యా. జరిగిపోయిన రోజులు కండ్ల ముందు కదులాడబట్నాయి. ఒక్కటా రెండా, సుమారు పద్నాలుగేండ్ల కాలము!

ప్రదీపు కొడిగెనహళ్లిలో టెంతు పూర్తి చేసినాడు. పార్వతీశం సారు చెప్పిన ప్రకారము, ఎ.పి.ఆర్.జె.సి (ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్) వాండ్ల ఎంట్రన్సు వ్రాసినాడు. టెంతుల ఐదు వందల ముప్ఫై ఆరు మార్కులు తెచ్చుకున్నాడు.

ఎ.పి.ఆర్.జె.సి పరీచ్ఛల గూడ మంచి ర్యాంకు వచ్చింది. కృష్ణా జిల్లా నిమ్మకూరు కాలేజీలో సీటు వచ్చింది. ఎం.పి.సి. గ్రూపు తీసుకున్నాడు. మల్లా పార్వతీశం సారే పోయి చేర్పించి వచ్చినాడు.

సాజంగా శానా తెలివైనోడు ప్రదీపు. ఎ.పి.ఆర్.జె.సి లల్లో ఆ కాలంలో చదువు శానా బాగా చెప్పేవాండ్లు. ఆస్టలు, తిండి శానా బాగుండేవి. ఇంటర్మీటులో స్టేటు ఏడో ర్యాంకు వచ్చింది వానికి. మొదటి పది ర్యాంకులు వచ్చినాండ్లకు, రాజస్తాన్ లోని బిర్లా ఇన్‍స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సె‌స్ (బిట్స్ పిలాని) లో ఇంజనీరింగులో సీట్లు వచ్చేటివి.

ఇంతవరకు గవర్నమెంటు రెసిడెన్సియల్ స్కూల్లో, కాలేజిలో చదివినాడు కాబట్టి సంజన్న గౌడుకు అంత బారమనిపించల్యా. దీంట్లో చదవాలంటే శానా డబ్బులు గావాల.

“ఇటువంటి అవకాశము అందరికీ రాదు సంజన్నా, ఎట్లైనా గాని ప్రదీపును బిట్స్ పిలానీలో చేరుద్దాము. అట్టాంటి పిల్లోనికి అదీ సరైన చదువు” అన్నాడు పార్వతీశం సారు. మొదట్నించి కొడుకును నడిపిస్తూన్న ఆ గురుదేవుడు చెప్పిన మాట సంజన్నకు వేదమయినాది.

అప్పటికి వైనుశాపు శానా బాగా నడుస్తాంటాది. డోనులో, గుత్తి రోడ్డులో రెండు ముక్కాలు సెంట్ల స్తలం తీసుకోని మంచి ఇల్లు గూడ్క కట్టించుకున్నారు. శేతిలో డబ్బులుండాయి. ఇంకెందుకు ఎనకాడడం తియ్ అని కొడుకును ఆడ చేర్పించినాడు.

ప్రదీపు ఇంజనీరింగు చదివిన నాలుగేండ్లలో దగ్గరున్న డబ్బులు కాకుండా వైను శాపు ఆదాయములో నుంచి గుడ్క వాడాల్సివచ్చింది.

“ఇంకెంత? ఈ సంమచ్చరం వాని సదువైపోతే, వానికి పెద్ద ఉద్యోగమొస్తాదని పార్వతీశం సారు చెప్పినాడు. శగితి ఉన్నంత కాడికి యాపారం చేసి, మెత్తబడినంక ఇద్దురుము బోయి వాని కాడ అయిగ ఉండొచ్చు” అని ఆచోశన జేసినారు సంజన్న, ఇమలమ్మ.

అన్నీ మనమనుకున్నట్లయితే, బాగనే ఉంటాదిగాని, కాల మహాప్రవాహము మనల్ని గుంజుకపోయినట్లు పోవాల్సొస్తాది. దానెంబడి పోయేటోల్లమే గాని, మల్లబడలేము గదా!

పరీక్షలు రాసి ఇంటికొచ్చినాడు కొడుకు. చదువుతో, సంస్కారముతో పిల్లోడు ఎలిగి పోతాన్నాడు. ఇమలమ్మ వానికి దిష్టి తీసినాది. ఇష్టమైనవన్నీ చేసి పెట్టినాది.

ఆకరు సంమచ్చరము లోనే, శానా పెద్ద పెద్ద కంపెనీలు పిలానీలో సదివే పిల్లలకు, ఆడికే వచ్చి, ఇంటర్వ్యూలు చేసి ఉద్యోగాలిస్తాయని, ఇంజనీరింగ్ సర్టిపికెట్లు వచ్చినంక ఉద్యోగాల్లో చేర్చుకుంటాయని, పార్వతీశం సారు చెప్పినాడు సంజన్నకు. అట్లే, రెండు కంపెనీల్లో సెలెక్ట్ అయినానని చెప్పినాడు ప్రదీపు. వాని కొచ్చే జీతం ఇని నోరెల్లబెట్టినారు అమ్మా, నాయినా, ఇద్దురు.

అప్పటికే కొడుకు సదువు కోసరం కొంత అప్పు జేసినాడు సంజన్న. ఉద్యోగం వచ్చిన సంతోశము కొడుకులో కనబడల్యా. ఏందబ్బా ఈడు ఇట్లుండాడని అనుకోబట్నారు.

ఒక దినము కుండ పగలేశినాడు ప్రదీపు. పొద్దున కాపీలు తాగి కూసొని ఉన్నారు ముగ్గురు. “నాయినా, అమ్మా, ఒక ముక్య విసయము మీతో చెప్పాలని వచ్చినప్పటి నుంచి అనుకుంటున్నాను. మీరు టెనషను పడకుండ ఇనాల” అన్నాడు.

“టెనశను ఎందుకు పడతాము రా నాయినా, చెప్ప. ఏందది?”

“నేను ఉద్యోగము చెయ్యను. ఇంకా పై చదువులు చదవడానికి అమెరికాకు పోవాలని అనుకుంటున్నాను. ఇంజనీరింగ్ తర్వాత అక్కడ ఎమ్.ఎస్. అని ఒక కోర్సున్నాది. అది రెండేండ్లు. టెక్సాస్ యూనివర్సిటీ అని శానా మంచిది. దానికి అప్లయి చేసుకున్నాను. సీటు వస్తుందని నమ్మకము ఉంది. అది చదివితే, మనము కలలో కూడ ఊహించని జీవితము, జీతము! పిలానీలో నా క్లాసుమేట్లు కొందరు కూడ పోతున్నారు.”

“దేశంకాని దేశంలో ఇంకా పెద్ద సదువులు సదువుతావా?” అనింది ఇమలమ్మ.

“మీ నాయిన తన శగితికి మించి ఇంతవరకు నిన్ను ఇగ్గుకొచ్చినాడు. అంత పెద్ద సదువులు సదివించనీకె మాకు స్తోమతుండద్దా! ఇక్కడికి సాలించి ఉద్యోగములో చేరి స్తిరపడు నాయినా!”

సంజన్నగౌడు కొడుకు మాటల ప్రభావము నుంచి ఇంకా తేరుకోల్యా!

ఆకరికి సొంతు పెగలించుకోని అన్నాడు “మనతోని యాడయితాదిరా ప్రదీపూ! మంచం ఉన్న కాడికే కాల్లు సాపుకోవాల నాయినా.”

“లేదు నాయినా, మీకు ప్రపంచం తెలియదు. ఒక్క రెండేండ్లు అమెరికాలో ఎమ్.ఎస్. చదివితే, పెద్ద ఉద్యోగమొస్తాది. ఐదారేండ్లు బాగా సంపాదించుకోని ఇండియాకు రావచ్చు.”

“మొత్తం ఎంతయితాది రా?” అన్నాడు నిస్సహాయముగా సంజన్న.

“ఫీజులు, కర్చులు, అంతా కలిసి రెండేండ్లకు ముపై లక్షలవుతాది. చదువుకుంటూ గూడ చిన్నచిన్న ఉద్యోగాలు చేసి పై కర్చులకు సంపాయిచ్చికుంటారు.”

“ముపై లచ్చలా!” అని అరిసినారు ఇద్దరూ.

ప్రదీపు నవ్వినాడు. “అదేమంత పెద్ద విషయము కాదు నాయినా. బ్యాంకులు ఎడ్యుకేషన్ లోను యిస్తాయి. కానీ అది చాలదు. మన డబ్బు పదేను లక్షలన్నా ఉండాల. మన డోన్‍లో భూముల ధరలు బాగా పెరిగినాయంట గదా! మన మొరుసు చేను అమ్మేస్తే ఆ మాత్రం రాకపోదు. హైవేను నాలుగు లైన్ల రహదారిగా విస్తరించిన తర్వాత రియల్ ఎస్టేటు బాగా పుంజుకుందని విన్నాను. కర్నూలు నుంచి డోను వరకు హైవే మీద దాబాలు, ఇండ్ల స్థలాలకు వెంచర్లు వేస్తున్నారంట. రియలెస్టేటోండ్లు పొలాలు కొనుక్కుని ప్లాట్లు ఏస్తన్నారంట. రోడ్డు కానుకొని ఉన్న పొలాలు ముపై నలభై లక్షలు, కొంచెం లోపలకున్నవి ఇరవై వరకు పలుకుతున్నాయంట. అక్కడ పొలముంచుకుని ఏం చేస్తాము? పెద్దగా గుత్త డబ్బులు గూడ రావడం ల్యా అని నీవే అంటుంటావు గదా! ఇట్లన్నా పనికొస్తాది. మిగతాది లోను తీసుకుందాము. నాకు వుద్యోగము వచ్చిన తర్వాత లోను కట్టుకునేది పెద్ద సమస్యే కాదు.”

బొమ్మిరెడ్డిపల్లెలో భూముల దరలు బాగా పెరిగినాయని సంజన్నకూ తెలుసు. రుక్మాంగద రెడ్డి రోడ్డు కానుకుని ఉన్న పొలాలను వెంచర్లకిచ్చినాడనీ తెలుసు. తమ మొరుసు చేను లోపలికుంటాది. కానీ అమ్మితే ప్రదీపు చెప్పినంత కాకపోయినా పదైదు లక్షల వరకు వస్తాది. లోను వాడే తీర్చుకుంటానన్నాడు కాబట్టి పరవాల్యా. ఒక్క గానొక్కడు వాని కోసరం గాకపోతే ఇదంతా తాము కట్టుకపోతామా అని అనుకన్నాడు సంజన్న.

“సరే రా ప్రదీపూ! అట్లనే గానీ! నీ బవిశ్యత్తు కంటే మాకు కావల్సిందేంది? రేపే మనూరికి బోయి శేను అమ్ముతామని పదిమందికీ చెప్పొస్తా!” అన్నాడు. ‘మా నాయిన మంచాడు!’ అంటూ తండ్రిని కరుచుకున్నాడు వాడు. వాని మొగంలో ఒక వెలుగు. ఇమలమ్మ నవ్వుతా చూచింది తండ్రీ కొడుకులను.

వెల్దుర్తి వాండ్లే సంజన్న చేనును పద్దెనిమిది లక్షలకు కొనుకున్నారు. డోను ఆంధ్రా బ్యాంకులో ఎడ్యుకేషనల్ లోనుకు అప్లయి చేసినారు. పదిహేను లక్షలకు. “ఇస్తాము గాని, ‘తండ్రివి ఆస్తిపాస్తులేవైనా శ్యూరిటీ’ గ పెట్టాలి” అన్నాడు మేనేజరు. వైను శాపున్న స్తలాన్ని గూడ సంజన్న గౌడు ఐదారేండ్ల కిందట కొనుక్కోని తన పేర రిజిస్ట్రేషను చేయించుకున్నాడు. అది చాలదంటే, ఇంటిని గూడ శ్యూరిటీగ బెట్టి కొడుక్కు లోను దీసిచ్చినాడు.

పాస్‌పోర్టు ముందే తెప్పించుకోని ఉన్నాడు. టెక్సాస్ యూనివర్సిటీలో సీటు వచ్చింది. వీసా కూడా వచ్చింది. అమ్మకు నాయినకు మొక్కి, విమానమెక్కి ఎల్లిపోయినాడు ప్రదీపు.

ఈ డబ్బులు సాలక అక్కడ పెట్రోలు బంకుల్లోన, రెస్టారెంట్లలోన పనిచేసుకోని పై కర్చులు సంపాయించుకుంటున్నానని ఫోను చేసేవాడు. సంజన్నకు ల్యాండ్ లైను ఫోను ఉండేది. ‘పాపం! ఎంత కస్టపడుతున్నాడో పిల్లోడ’ని బాదపడేవారు. బాదపడడం తప్ప చేసేది ఏముండాది?

రెండేండ్లు గడిచినాయి. ఎమ్మెస్ అయిపోయింది. ఇంటికి వచ్చినాడు. మనిసి రంగు తేలి, నునుపు దేరినాడు. వీండ్ల ఆనందం చెప్పడానికి అయ్యేట్లు లేదు. తనకు మంచి కంపెనీలో ఉద్యోగము కూడా వచ్చిందనీ, నెలనెలా లోను కట్టుకుంటాననీ చెప్పినాడు. నెల దినాలుండి ఎల్లిపోయినాడు.

సంమచ్చరం తర్వాత వచ్చినాడు ఈసారి కోడల్ని వెంటబెట్టుకోని. ఆ యమ్మి పేరు మాధురి అంట. బిట్స్ పిలానీలో క్లాసుమేటు. వాండ్లది బీహారు. యాదవులు. వాండ్ల నాయినకు భాగల్పూరులో పెద్ద హోల్‌సేల్ బట్టల షాపుందట. ఆయన పేరు శంతను యాడవ్ అంట. ఒక్కతే బిడ్డ.

ఇద్దరూ ప్రేమించుకున్నారంట. ఉద్యోగాల్లో సెటిలయినాక పెండ్లి తీసుకోవాలని చూపెట్టుకొని ఉన్నారంట. ఆ పిల్ల గూడ టెక్సాస్ లోనే ఎమ్.ఎస్. చేసిందంట. వేరే కంపెనీలో ఆ యమ్మికి గూడ ఉద్యోగమయిందంట. “అమ్మా, నాయినా, మమ్మల్ను ఆశీర్వదించండి” అని కాల్లకు మొక్కుతుంటే ఏం మాట్లాడలేక పోయినారు.

“చల్లగా ఉండండి” అని దీవించినారు.

పెండ్లి బీహారులోనే అయింది. విమానంలో ఇద్దర్నీ తీసుకుపోయినాడు కొడుకు. వీండ్లకు ఆ బాష రాక జరిగేది చూస్తా ఉన్నారు. వియ్యంకుడు శానా దనవంతుడని అర్తమయినాది. పెండ్లి ఘనంగ చేసినారు. వీండ్లకు పట్టుబట్టలు పెట్టినారు.

డోనులో చిన్న రిసెప్షను మాదిరి పెట్టి నలుగురినీ పిలిచి బోజనాలు పెడదామన్నాడు సంజన్న. అంత టైము లేదనీ, ఉద్యోగాల్లో చేరాలనీ చెప్పి, అమ్మనూ నాయిననూ డోనులో ఇడిసిపెట్టి రావడానికి ఒక మనిసిని పంపించినారు.

సంవత్సరం గడిసినాది. మనవరాలు పుట్టిందని ఫోన్ చేసినాడు ప్రదీపు. కాన్సు చెయ్యనీకె మాధురి వాండ్లమ్మ, నాయన వచ్చినారనీ, ఆరు నెల్లు ఉంటారనీ చెప్పినాడు.

ఇంకో సంవత్సరం తర్వాత పాపను తీసుకోని వచ్చినారు. బంగారుబొమ్మ మాదిరి మెరిసిపోతూన్న మనమరాలిని జూసి, ఆనందపడినారు. వారం రోజులుండినారంతే. పింకీ వీండ్లకు యింకా చేరిక కాకముందే, బీహారుకు వెళ్లిపోయినారు. ప్రదీపు తండ్రికి యాభై వేల రూపాయలు ఇయ్యబోతే, వద్దన్నాడు సంజన్న. “పని బడినప్పుడు అడగతాలే” అన్నాడు. ఈసారి వచ్చినపుడు అమ్మనూ నాయిననూ తనతోని అమెరికాకు తీస్కపోయినాడు కొడుకు. కోడలు, మనుమరాలు రాలేదు. ఒక్కడే వచ్చినాడు.

ఆ రోడ్లు, బిల్డింగులు, సల్లని ఆ వాతావరణము, కొడుకు యిల్లు, కారు, అన్నీ కొన్ని రోజులు బాగానే ఉన్నాయి. ఇంట్లో ఎవరూ ఉండరు. పాపను తాము చూసుకుంటామంటే కోడలు ఒప్పుకోలేదు. విచిత్రమేమంటే దానికి బీహర్ హిందీ వచ్చు, ఇంగ్లీషు వచ్చు, తెలుగు మాత్రం రాల్యా! కోడలి తెలుగు వింటూంటే వాండ్లకు ఇంతంగా ఉంటాది.

ఆ పాపను క్రెష్‌లో దించి ఇద్దరూ ఆపీసులకు బోతారు. శనాదివారాలు సెలవు. అంత సంపాయించుకుంటున్నా పనిమనుషులుండరు. ఆ రెండు రోజులూ సెలవులని పేరే గాని, ఇల్లు శుభ్రము చేసుకోవడం, బట్టలు ఉతుక్కోవడం, కార్పెట్లు దులుపుకోవడంతోనే సరిపోతుంది. ఒకేసారి సాదకాలనీ వండుకోని, పెద్ద ఫ్రిజ్జులో పెట్టుకొని, తినే ముందు వేడి చేసుకుంటారు.

పొద్దున్న బ్రెడ్ టోస్ట్, బ్రెడ్ శ్యాండ్‌విచ్, న్యూడిల్స్ ఇట్లాంటివి తింటారు. పండ్లరసం తాగుతారు. అవేవీ వీండ్లకు నచ్చవు. ఇంట్లో పనులు చేద్దామన్నా, వంట చేద్దామన్నా అన్నీ మిశిన్లతో పని. వీండ్లకు రాదు. “పొరపాట్న, ఒకదానికొకటైందంటే ప్రమాదము, వద్దులెండి” అంటాడు కొడుకు.

కోడలు మంచిదే. నవ్వుతూ పలకరిస్తుంది. ఏం కావాలో కనుక్కుంటుంది. మనమరాలు కూడా బాగానే చేరికయ్యింది.

కాని సోమవారం నుంచి శుక్రవారం వరుకు దుర్భరంగా ఉంటుంది. తలుపులు బిగించుకోనే ఉండాల. సొంతంగ బయటకుపోనీకి లేదు. పెద్ద టివి ఉన్నాది. దాన్ని ఎట్టా పెట్టాల్నో, మార్చాల్నో తెలియదు. కొడుకో కోడలో పెట్టి ఇస్తే కుంచేపు చూస్తారంతే.

మధ్యలో రెండు మూడు సార్లు గుల్లకు, గోపురాలకు తీసుకపోయినాడు కొడుకు. కొన్ని సూడదగిన ప్రదేశాలు చూపించినాడు. ఆరు నెల్లు ఉందామని వచ్చినోల్లు మూడునెల్లకే తిరుగు పయనమైనారు. తెలిసినోల్లు ఇండియాకు బోతుంటే వాండ్లతోబాటు అమ్మనూ నాయిననూ పంపించేసినాడు. డోను చేరుకున్నంక వాండ్లకు పానం తెరిపిన పడినట్లయినాది. వయసు మిందబడే కొద్దీ, ఒంట్లో శగితి సన్నగిల్ల బట్నాది ఇద్దరికీ. సంజన్నకు బీపీ ఉంది. అది శానా ముదిరేంత వరకూ పట్టించుకోల్యా.

ఆకరికి ‘మైల్డుగ’ పచ్చవాతం వచ్చి, ఎడం కాలు, చెయ్యి గుంజక పోయినాయి. కర్నూలులో సారంగధర రెడ్డి డాక్టరు కాడ చూపించుకొన్నారు. ఆ యప్ప మందులు రాసిచ్చినాడు. పిజియోతెరపీ.. అని కొన్ని వ్యాయామాలు నేర్పించినాడు. పూర్తి సచ్చుబడల్యా గాని మొత్తానికి కాలు చెయ్యి అదవ (దెబ్బతిన్న) అయినాయి. శ్రీశైలములో ఆయుర్వేద వైద్యుడున్నాడని ఇని ఆయన కాడికి బోయినారు. ఆ యప్ప యావో కొన్ని తైలాలు కలిపిచ్చి, రోజూ మర్దన చేయించుకోమన్నాడు.

మొత్తానికి పరాదీనము గాకుండ గడ్డన పడినాడు సంజన్న. చేతి కట్టె వచ్చినాది. ఎడమ కాలు కొంచెం ఈడుస్తాడు. కొడుకు వచ్చి చూసిపోయినాడు. వైద్యాలకు డబ్బులిచ్చినాడు.

“నాయినా, నాలుగైదేండ్లు పని చేసి సంపాయిచ్చుకోని మన దేశానికి వస్తానంటివి గద రా! ఇంక వచ్చేయిరా ప్రదీపూ. మేమిద్దరం దిక్కులేని పచ్చుల మాదిరి ఉండాము రా” అన్నాడు సంజన్న.

కొడుకు ఏం మాట్లాడల్యా. “మొన్ననే ఇద్దరం కంపినీలు మారినాము. ఇల్లు కట్టిస్తున్నాము. ఇంక ఇక్కడికొచ్చే ఆలోశన లేదులే నాయినా” అన్నాడు పోయేముందు. వీండ్ల మనసులు ఆక్రోశించినాయి.

మరో రెండేండ్లు గడిసినాయి. ఇమలమ్మకు మునుపటి ఓపిక లేదు. వంటమనిసిని పెట్టుకోండి, పనిమనిసిని పెట్టుకోండి, నేను డబ్బులు పంపిస్తానంటాడు ప్రదీపు. అదీ అయ్యింది. నాల్రోజులొస్తే, నాల్రోజులు మానేస్తారు వాండ్లు.

వైనుశాపు ఇంతకముందు మాదిరి చూసుకోలేక బ్యారాలు తగ్గబట్నాయి. శాపులో పనిచేసే బాలక్రిష్ణ ఇది గ్రయించి దొంగలెక్కలు చెప్పడం, సరుకు మాయం చెయ్యడం ఇట్లాంటివి మొదలుబెట్నాడు. ఆకిరికి తిరిపాలు సచ్చిపోయింతర్వాత రాజమ్మను గూడ బజ్జీల బండి మానిపించి ఇంట్లో తెచ్చిపెట్టుకున్నారు. వాండ్లకు ఈమె తోడు, ఆమెకు వీండ్లు తోడు.

పోనుపోను శానా కస్టమయినాది, ముక్కునొచ్చినా, ముకం నొచ్చినా చూసే దిక్కు లేదు. ముగ్గురికీ డెబై దాటినాయి. ఆకరికి ప్రదీపే ఈ నిర్నయం దీసుకున్నాడు. వైను శాపు బాలక్రిస్నే తీసుకున్నాడు. వీండ్లను మోసం జేసి ఎంతెనక ఏసుకున్నాడో మరి! ఇల్లు బాడిక్కిచ్చేసి, బెంగుళూరు లోని ఈ ‘ఓల్డ్ హోము’ లో చేర్పించి పోయినాడు కొడుకు. నెలకు ఇరవైవేలు కడతాడు వాండ్ల కోసరము. “మాతో పాటే రాజమ్మ” అని పట్టుపడితే ఆ యమ్మను గూడ్క డార్మిటరీలో అదే ఆశ్రమములో పెట్టినాడు. ఆమెకు గూడ్క నెలకు ఐదు వేలు కడతాడు ప్రదీపు. మంచోడు గాదా మరి?

వాని పరిదితో వాడు చేయగలిగినంత చేస్తున్నాడు. సంజన్నకూ, ఇమలమ్మకూ ఏదో వెలితి! కాలం ఆ విదముగా ఈ కుటుంబం మింద తన పవరేందో చూపించినాది. ఎవరయినా దాని అధికారానికి తలవంచాల్సిందే! తప్పదు మల్ల!

(ఇంకా ఉంది)

Exit mobile version