[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]
కువలాశ్వుడి చరిత్ర
ధర్మరాజు “మహర్షీ! ఇక్ష్వాకు వంశంలో పుట్టిన కువలాశ్వుడికి ధుంధుమారుడు అనే పేరు ఎలా వచ్చిందో దయచేసి చెప్పండి” అని అడిగాడు.
మార్కండేయ మహర్షి “మహారాజా! శివుడితో సమానమైనవాడు, ప్రజలకి మంచి చేసేవాడు, దయ కలిగినవాడు, ఎదురులేనివాడు, ఉదంకుడు అనే మహర్షి దీక్షతో విష్ణుమూర్తి గురించి తపస్సు చేశాడు.
అతడి భక్తికి మెచ్చి శ్రీమహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు. ఉదంకుడు విష్ణుమూర్తికి నమస్కరించి ఆయన్ని అనేక విధాలుగా కీర్తించాడు. విష్ణుమూర్తి ప్రసన్నంగా ఏం కావాలో కోరుకోమన్నాడు.
“దేవా! నువ్వు నాకు సాక్షాత్కరించడమే చాలు. ఇంతకంటే నాకు కావలసింది ఏముంది?” అంటూ అనేక విధాలుగా విష్ణుమూర్తిని కీర్తిస్తూ ‘నా మనసుఎప్పుడూ సత్యం మీద, ధర్మం మీద, ఇంద్రియనిగ్రహం మీద ఏకాగ్రత కలిగి నీ యందు భక్తితో లగ్నమై ఉండాలని అనుగ్రహించు’ అని పార్థించాడు.
విష్ణుమూర్తి ఉదంకుడు అడిగినవి ఇచ్చి అతడికి గొప్ప జ్ఞానం కూడా సిద్ధిస్తుందని చెప్పాడు. మూడు లోకాలకి విపత్తు కలిగిస్తున్న ‘ధుంధుడు’ అనే రాక్షసుణ్ని సంహరించడానికి బృహదశ్వుడి కుమారుడైన కువలాశ్వుడిని సిద్ధం చెయ్యమని చెప్పాడు.
ఆ రాజుకి తన అనుగ్రహం వల్ల శక్తి లభిస్తుందని ఉదంకుడు నియోగించడం వలన ఆ రాక్షసుణ్ని చంపగల శక్తి వస్తుందని, లోకాలన్నీ సంతోషపడతాయని కూడా చెప్పి విష్ణుమూర్తి అంతర్ధానమయ్యాడు.
ఉదంకుడు మళ్లీ తపస్సు చేసుకోవడం మొదలుపెట్టాడు. ఈ భూమండలాన్ని ఏలి స్వర్గలోకానికి వెళ్లిన పుణ్యాత్నుడైన ఇక్ష్వాకుడి వంశవృక్షం- ఇక్ష్వాకుడి కొడుకు శశాదుడు; అతడి కొడుకు కకుత్ స్థుడు; అతడి కొడుకు అనేనసుడు; అతడి కొడుకు పృథుడు; అతడి కొడుకు విష్వగుడు; అతడి కొడుకు ఆర్ద్రుడు; అతడి కొడుకు యువనాశ్వుడు; అతడి కొడుకు శ్రావస్తుడు; అతడి కొడుకు బృహదశ్వుడు; అతడి కొడుకు కువలాశ్వుడు.
అతడి కొడుకులు ఇరవైఒక్క వేలమంది. వాళ్లందరు గొప్ప బలం కలిగినవాళ్లు. అస్త్రశస్త్రాలకి సంబంధించిన విద్యలో ఆరితేరినవాళ్లు.
ధర్మాత్ముడు, పరాక్రమవంతుడు, సంతానవంతుడు అయిన కువలాశ్వుడికి రాజ్యభారాన్ని అప్పగించి బృహదశ్వుడు తపోవనానికి వెళ్లాలని అనుకున్నాడు. ఆ విషయం తెలుసుకున్న ఉదంకుడు అయోధ్యా నగరానికి వచ్చి “బృహదశ్వ మహారాజా! నువ్వు నీ రాజ్యంలో ఉన్న ప్రజల్ని ప్రేమతో రక్షించు. అడవికి వెళ్లి తపస్సు చెయ్యడం వల్ల పుణ్యం వస్తుందా? ప్రజల్ని రక్షించడమే రాజుల కర్తవ్యము, పరమధర్మము. ఆ ధర్మాన్ని ఆచరించడం అడవిలో కుదరదు కదా! పూర్వకాలంలో కూడా గొప్ప రాజులు ప్రజల్ని రక్షించే ధర్మాన్నినెరపేర్చడం వల్లనే పుణ్యాన్ని సంపాదించారు.
నువ్వు కాపాడుతూ ఉండడం వల్లే సాధువులైన మావంటి తపస్వులు ఈ భూమి మీద ప్రతిరోజు తమవంతు ధర్మకార్యాలు యథావిధిగా నెరవేర్చగలుగుతున్నారు. ఇది కూడ మీరు చెయ్యవలసిన పనే కదా? మీకు ఆశ్చర్యం కలిగించే ఒక విషయాన్ని చెప్తాను.
పూర్వకాలంలో మధుకైటభులు అనే రాక్షసులు ఉండేవాళ్లు. వాళ్ల కుమారుడు ధుంధుడు. చాలా గొప్ప పరాక్రమం కలవాడు. అతడి తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ని మెప్పించి వరాలు పొంది దేవతల్ని, రాక్షసుల్ని, గంధర్వుల్ని లెక్కచేయకుండా తిరుగుతున్నాడు.
అతడు ఇప్పుడు మా ఆశ్రమానికి దగ్గరగా విశాలంగా ఉన్న సముద్రపు ఇసుకగుట్టలో సొరంగాన్ని ఏర్పాటు చేసుకుని నిద్రపోతున్నాడు. ఇసుకతిన్నెల్లో ఉండే అతడి శరీరం నుంచి అతడు పీల్చిన తరువాత విడిచిన గాలి భయంకరంగా పొగతో కలిసి అగ్నిశిఖల్లా సంవత్సరానికి ఒకసారి భయంకరంగా బయటకి వస్తుంది.
అందువల్ల అక్కడికి దగ్గరలో ఉన్న నేల, కొండలు, అడవులు ఏడు రోజుల దాకా వణికిపోతూ ఉంటాయి. అందువల్ల మా ఆశ్రమంలో ఉంటున్నవాళ్లకీ జీవించడం చాలా కష్టంగా ఉంది. ఆ దుర్మార్గుణ్ని చంపి మాకు మేలు చేసి తరువాత తపోవనానికి వెళ్లు.
మహారాజా! ధుంధుడు అనే ఈ రాక్షసుణ్ని చంపడానికి ఎవరు ప్రయత్నిస్తాడో అతడికి తన శక్తిసామర్థ్యాలు ఇచ్చి విజయం కలిగిస్తానని విష్ణుమూర్తి నాకు చెప్పాడు. కనుక నువ్వు ఈ పనికి ప్రయత్నించు. సాటిలేని విష్ణు బలం నిన్ను ఆవహిస్తుంది. గొప్ప ధైర్యసాహసాలు కలిగిన నువ్వు తప్ప ఇటువంటి గొప్ప పనిని ఎవరు చెయ్యగలరు? లోకాన్ని కాపాడే ఈ పని నీకు గొప్ప పుణ్యాన్ని, కీర్తిని కలుగచేస్తుంది” అని చెప్పాడు.
మహర్షి మాటలు విని బృహదశ్వుడు “మహర్షీ! నిర్మలమైన మనస్సుతో నేను అస్త్రసన్యాసం చేశాను. ఇంక ఆయుధాలు ముట్టుకోను. తపస్సు చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. తపోవనానికి వెళ్లడం నాకు తప్పనిసరి.
నా కొడుకు కువలాశ్వుడు పుణ్యాత్ముడు, గొప్పబలవంతుడు. మంచివాళ్లకి మేలు చేస్తాడు. ధైర్యసహసాలు కలిగి గొప్ప పేరు ప్రతిష్ఠలు పొందినవాడు. అతడి కొడుకులు కూడా అతడికి తీసిపోని పరాక్రమం కలవాళ్లు.
కువలాశ్వుడు అతడి కొడుకులు విజృంభించి ధైర్యసాహసాలతో రాక్షసుణ్ని చంపి నీ కోరిక తీరుస్తారు. మీరు కోరిన పనికి నా కుమారుణ్ని నియోగించాను. నాకు తపస్సు చేసుకోడానికి అనుమతి ఇవ్వండి” అని చెప్పాడు బృహదశ్వుడు. ఉదంకడు సంతోషించి బృహదశ్వుణ్ని అభినందించాడు. అతడు తపోవనానికి వెళ్ళిపోయాడు” అని చెప్పాడు.
మధుకైటభులు చరిత్ర
పూర్వకాలంలో సముద్రాలన్నీ ఒకే సముద్రంగా ఏర్పడిన విష్ణుమూర్తి ఒక్కడే ఆదిశేషుడి మీద పడుక్కుని యోగనిద్రాముద్రలో తన్మయుడై ఉన్న సమయంలో మధుకైటభుల అరాచకాన్ని తెలుసుకుని యోగముద్ర నుంచి మేలుకున్నాడు.
దారుణమైన పరాక్రమంతో భయం లేకుండా విర్రవీగుతున్న రాక్షసులు విష్ణుమూర్తికి కనిపించారు. “నీ వరాలు మాకు వద్దు కాని, నీకు మేమే వరాలు ఇస్తాము ఏం కావాలో అడుగు” అన్నారు.
వాళ్ల మాటలు విని విష్ణుమూర్తి ఆడినమాట తప్పని వాళ్లు కనుక, నన్ను అడగమన్నారు కనుక, నేనే మిమ్మల్ని వరం అడుగుతున్నాను. లోకానికి మంచి జరగడం కోసం మీరిద్దరూ ఇప్పుడే నా చేతిలో మరణించండి” అని అడిగాడు.
మధుకైటభులు ఇద్దరు ఒకళ్ల మొహం ఒకళ్లు చూసుకుని విష్ణుమూర్తితో “మా ప్రతిజ్ఞ విను. మేము నవ్వులాటకైనా అన్న మాటని తప్పేవాళ్లం కాదు. మేము గొప్ప పరాక్రమము, ధైర్యసాహసాలు కలవాళ్లం. ఎవరూ జరగవలసినదాన్ని ఆపలేరు. మా గురించి ఎందుకుగాని, నీకు ఇష్టమైనట్టు మా ప్రాణం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం.
అందుకు మేము మనస్సులో ఎటువంటి బాధ పడట్లేదు. మా నియమం ప్రకారం నువ్వు మమ్మల్ని చంపాలని అనుకుంటే మమ్మల్ని నీరు లేని చోట చంపాలి. అలా అయితే నీతో చంపబడ్డానికి మేము సంసిద్ధంగా ఉన్నాము” అన్నారు.
వాళ్ల మాటలు విని విష్ణుమూర్తి తన తొడల్ని వేదికగా చేసి వాళ్ల తలల్ని వాటిపై ఉంచి తన సుదర్శన చక్రంతో నరికేశాడు. ధర్మరాజా! ఆ మధుకైటభుల కొడుకే ధుంధుడు అనే రాక్షసుడు. పరాభవం వల్ల కలిగిన శౌర్యంతో దేవేంద్రుడు మొదలైన దేవతల్ని అందరినీ అవమానించాడు.
బృహదశ్వుడు చెప్పగా అతడి కొడుకు కువలాశ్వుడు ఉదంకమహర్షిని మార్గదర్శకుడిగా ఉంచుకుని యుద్ధానికి వెళ్లాడు. రథాలు, ఏనుగులు, గుర్రాలు, కాల్బలాలు అనే నాలుగు అంగాలు కలిగిన సేనతో భూమండలం కంపించేట్లుగా బయలుదేరాడు.
అప్పుడు రాక్షసులకి శత్రువైన విష్ణువు తన శక్తిని కొంత రాజులో ప్రవేశపెట్టాడు. దేవేంద్రుడు మొదలైన దేవతలు, మహర్షులు సంతోషించారు. వారి ఆశీస్సులతో కువలాశ్వుడు తేజస్సుతో వెలిగాడు. స్వర్గలోకంలో మంగళవాయిద్యాలు మొగాయి. పూలవాన కురిసింది. పిల్ల తెమ్మెరలు వీచాయి.
అనేక శుభశకునాలు కనిపించాయి. ఆకాశంలో దేవతల విమానాలు గుమిగూడి కనిపించాయి. కువలాశ్వుడు సైన్యంతో సహా బయలుదేరి సముద్రతీరం చేరుకుని అక్కడ తాత్కలికంగా శిబిరాలు ఏర్పాటు చేసుకున్నాడు.
అస్త్రశస్త్రాలు ప్రయోగించడంలో నేర్పు కలిగిన తన కుమారుల్ని అనేకవేలమందిని సముద్ర తీరంలో ఇసుకతిన్నెల్ని తవ్వడానికి నియోగించాడు. కువలాశ్వుడి కొడుకులు పట్టిసాలు, గదలు, కత్తులు, గండ్రగొడ్డళ్లు, బల్లేలు చేత పుచ్చుకుని ఆ రాక్షసుణ్ని చుట్టుముట్టారు.
ఆయుధాలతో మోదగా మోదగా ఆ రాక్షసుడు కదిలి ఒక్కసారిగా భయంకరంగా నోరు తెరిచి ఆవులించాడు. అతడి కళ్లనుంచి, నోటినుంచి, ముక్కునుంచి అగ్నికణాలతో ఉన్న జ్వాలలు బయటికి వచ్చాయి.
భయంకరమైన అగ్నిజ్వాలలనుంచి తప్పించుకోడానికి వీలు లేక ఒకప్పుడు సగరుడి కొడుకులు కపిలమహర్షి కోపానికి ఆహుతి అయినట్టు కువలాశ్వుడి కొడుకులు అందరూ నశించారు
కువలాశ్వుడి కొడుకుల్లో దృఢాశ్వుడు, కపిలాశ్వుడు, భద్రాశ్వుడు అనే ముగ్గురు తప్ప మిగిలిన అందరూ మరణించారు. కువలాశ్వుడు కోపంతో ప్రళయకాలంలో సూర్యుడిలా విజృంభించి ఆ రాక్షసుణ్ని చుట్టుముట్టి యుద్ధం చేశాడు.
రాక్షసుడు కూడా గుహనుంచి బయటికి వచ్చి బల్లెం పట్టుకుని కువలాశ్వుడి మీదకి దుకాడు. రాజు యోగశక్తివల్ల పుట్టిన జలప్రవాహంతో రాక్షసుడి దేహం నుంచి మండుతున్న అగ్నిజ్వాలల్ని ఆర్పేసి అతడి మీద బ్రహాస్త్రాన్ని ప్రయోగించాడు.
దివ్యశక్తి కలిగిన బ్రహ్మాస్త్రం ఆకాశము, దిక్కులు మిరుమిట్లు గొలిపేట్లుగా వెలుగులు విరజిమ్ముతూ వచ్చి రాక్షసుడి శరీరాన్ని బుగ్గి చేసింది.
ధర్మరాజా! రాక్షసుణ్ని చంపిన కువలాశ్వుణ్ని దేవతలు మునులు “రాజుల్లో గొప్పవాడా! నువ్వు దేవతలకి విరోధి అయిన ధుంధుణ్ని సంహరించి లోకానికి మంచి చేసిన మహావీరుడివి. ఇప్పటినుంచి నువ్వు ‘ధుంధుమారుడు’ అనే పేరుతో విలసిల్లు!” అని అభినందించారు.
సంతోషపడిన ఇంద్రుడు మొదలైన దేవతలు, ఉదంకుడు నాయకుడుగా ఉన్న మహర్షులు కువలాశ్వుణ్ని అభినందించి వరాలు కోరుకోమని చెప్పారు. మహారాజు తనకు బ్రాహ్మణులయందు పూజ్యభావము, పరోపకార బుద్ధి, దానగుణము, విష్ణుభక్తి కలిగి ఉండేట్లు వరం కావాలని అడిగాడు.
అతడికి వరాలు ఇచ్చి అందరు తమ ప్రదేశాలకి వెళ్లిపోయారు. కువలాశ్వుడు రాక్షసుడి మీద కలిగిన విజయంతో ప్రకాశించాడు” అని మార్కండేయమహర్షి ధర్మరాజుతో కువలాశ్వుడికి ధుంధుమారుడనే పేరు బిరుదు వచ్చిన విధానం గురించి వివరించాడు. ఈ కథని సర్పయాగ సమయంలో జనమేజయమహారాజుకి వైశంపాయనమహర్షి వినిపించాడు.
(అరణ్యపర్వం నాలుగవ ఆశ్వాసంలో 141 పద్యలవరకు వ్రాసినది నన్నయభట్టు. తరువాత 142వ పద్యము నుంచి అరణ్యపర్వంలో ఏడవ ఆశ్వాసం వరకు చివరివరకు వ్రాసింది ఎర్రన.
అయినా కూడా ఆశ్వాసం చివరిలో ఎర్రన – ‘నన్నయభట్టు ప్రణీతంబు’ అని రాయడమే కాకుండ ఆశ్వాసాంతపద్యాల్ని నన్నయ్యకి ఆశ్రయ ప్రదాత అయిన రాజరాజనరేంద్రుడి సంబోధనలుగానే కూర్చాడు. అరణ్యపర్వం చివరి ఏడవ ఆశ్వాసాంత పద్యాలతో నన్నయభట్టు కవితారీతి తోచేట్టు అరణ్యపర్వాన్ని పూర్తి చేశానని స్పష్టంగా వ్రాశాడు).
అరణ్యపర్వంలోని నాలుగవ ఆశ్వాసం సమాప్తం