Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మహాభారత కథలు-120: ఇంద్రజిత్తుణ్ని సంహరించిన లక్ష్మణుడు

[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]

ఇంద్రజిత్తుణ్ని సంహరించిన లక్ష్మణుడు

రావణుడు అనుమతించగానే ఇంద్రజిత్తు వేగంగా రథాన్ని ఎక్కి లంకాపట్టణం వదిలి యుద్ధభూమికి చేరుకున్నాడు. అతణ్ని చూసి వానరసేనలు ఎదురు వెళ్లాయి. వాటిని లెక్కచేయకుండా లక్ష్మణుడిని యుద్ధానికి పిలిచాడు. మదించిన ఏనుగుని చూసిన సింహంలా లక్ష్మణుడు ఇంద్రజిత్తు మీదకి లంఘించాడు.

గెలవగల నేర్పు, సముద్రమంత ధీరత్వము, విలువిద్యలో నేర్పరితనము, గొప్ప విజయాలు సాధించాలన్న తపన కలిగి, గెలవడానికి శక్యంకాని శత్రువుల్ని సంహరం చేసే సుమిత్ర కొడుకు లక్ష్మణుడు, ఇంద్రజిత్తు మూడు లోకాలు భయపడే విధంగా సింహనాదాలు చేస్తూ ఒకళ్లతో ఒకళ్లు పోటీపడ్డారు.

వారి యుద్ధం చూస్తుంటే విలువిద్యలో ఎవరు తక్కువకాదు అనిపించేలా ఉంది. ఆ సమయంలో వాలి కొడుకు అంగదుడు పెద్ద చెట్టు తీసుకుని లక్ష్మణుడి ముందుకు వచ్చిఇంద్రజిత్తు తలమీద కొట్టాడు. ఇంద్రజిత్తు వాడిగా ఉన్న ఈటె తీసుకుని అంగదుడు మీదకి విసిరాడు, లక్ష్మణుడు అతడి ఈటెని మధ్యలోనే తన బాణంతో ఖండించాడు.

అంగదుడు మద్దిచెట్టు తీసుకుని ఇంద్రజిత్తు రథాన్ని, రథ సారథిని ముక్కలు చేశాడు. ఇంద్రజిత్తు ఏమీ చెయ్యలేక వెంటనే ఆకాశంలోకి ఎగిరిపోయాడు. ఇంద్రజిత్తు మాయాయుద్ధంలో ఆరితేరినవాడు.

అతడి మీద రామలక్ష్మణులు శబ్దభేది అనే బాణాల్ని ప్రయోగించారు. ఇంద్రజిత్తు ప్రయోగించిన బాణాలకి రామలక్ష్మణులు మూర్ఛపోయి నేల మీద పడ్డారు.

వానరసేన భయంతో గజగజ వణికారు. నేలమీద పడిన రామలక్ష్మణులు సూర్యచంద్రుల్లా శోభిల్లారు. ఇంద్రజిత్తు సింహనాదం చేశాడు.

సుగ్రీవుడు, సుషేణుడు, జాంబవంతుడు మొదలైన వానరనాయకులు రామలక్ష్మణుల దగ్గరికి వచ్చి ఏడుస్తున్నారు. విభీషణుడు అక్కడికి వచ్చి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి రామలక్ష్మణుల్ని నాగపాశాలనుంచి బంధవిముక్తుల్ని చేశాడు.

మళ్లీ యుద్ధానికి బయలుదేరిన శ్రీరాముడికి నమస్కరించి విభీషణుడు “శ్రీరామా! స్వేతుడు అనేవాడు కుబేరుడు మీ కోసం పంపించిన దివ్యజలాల్ని తీసుకుని వచ్చాడు. వాటిని మీ కళ్లకి రాసుకుంటే కళ్లకి కనిపించని పదార్థాలన్నీ మీకు స్పష్టంగా కనిపిస్తాయి” అన్నాడు. శ్రీరాముడు విభీషణుడు చెప్పినట్టు చేశాడు.

మాయాజల ప్రవీణుడైన ఇంద్రజిత్తుణ్ని రామలక్ష్మణులు స్పష్టంగా చూడగలిగారు. ఇంద్రజిత్తు వాళ్లిద్దర్నీ చూసి ఆశ్చర్యపడి మళ్లీ అభిచారహోమం చెయ్యాలనుకున్నాడు.

అది గ్రహించిన శ్రీరాముడు “లక్ష్మణా! ఇతడు మళ్లీ అభిచారహోమం చేస్తే ఇతణ్ని చంపడం కష్టం. ఇతణ్ని వెంటాడి సంహరించు” అన్నాడు.

లక్ష్మణుడు ఇంద్రజిత్తు మీద పదునైన బాణాలు ప్రయోగించాడు. ఇంద్రజిత్తు కూడా లక్ష్మణుడి మీద వ్యవధి లేకుండా బాణాలు ప్రయోగించాడు. రాక్షససేనలు, వానరసేనలు యుద్ధం చెయ్యడం ఆపి ఇంద్రజిత్తు, లక్ష్మణుల యుద్ధాన్ని చూస్తూ ఉండిపోయారు. వాళ్లు రెండు గొప్ప ఏనుగుల్లాగా, రెండు భయంకరమైన పెద్దపులుల్లాగా, రెండు సింహాల్లాగా భయంకరమైన యుద్ధం చేస్తున్నారు.

పదునైన రెండు బాణాలు ప్రయోగించి లక్ష్మణుడు ఇంద్రజిత్తు రెండు చేతులూ ఖండించాడు. వెంటనే భయంకరమైన అగ్నిజ్వాలల్లా వెలుగుతున్న పదునైన బాణాల్ని ప్రయోగించి ప్రకాశిస్తున్న కుండలాలతో వెలుగుతున్న ఇంద్రజిత్తుడి శిరస్సుని ఖండించాడు.

ఇంద్రజిత్తు యుద్ధభూమిలో కొమ్మలు నరికిన వృక్షంలా కూలిపోయాడు. రాక్షససేనలు భయంతో పారిపోయాయి. వానరసేనలు సింహనాదాలు చేశాయి.

రావణాసురుణ్ని సంహరించిన శ్రీరాముడు

తన కొడుకు మరణించిన వార్త విని రావణాసురుడు పెల్లుబికి వస్తున్న దుఃఖంతో పది నోళ్లూ తెరిచి బిగ్గరగా ఏడ్చాడు. పుత్రశోకాన్ని భరించలేక రావణుడు అశోకవనానికి వెళ్లి పతివ్రత అయిన సీతాదేవిని సంహరించాలని ఒరనుంచి కత్తి చంద్రహాసాన్ని బయటికి లాగాడు.

అప్పుడు వయసులోను, వినయంలోను పెద్దవాడయిన అవింధ్యుడు రావణుణ్ని వారించాడు. “రావణా! స్త్రీని సంహరించడం మహావీరుడు చెయ్యదగిన పని కాదు. నువ్వు దేవేంద్రుణ్ని ఇతర దేవతల్ని యుద్ధంలో ఓడించినవాడివి. గొప్ప కీర్తి పొందినవాడివి. నీకు శక్తిసామర్థ్యాలు ఉంటే రంఘువంశస్థుడైన శ్రీరాముణ్ని యుద్ధంలో జయించు. ఆడదాన్ని చంపితే మంచి జరగదు” అన్నాడు.

అవింధ్యుడి మాటలు విన్నాక రావణుడి కోపం తగ్గింది. యుద్ధప్రయత్నాలు చేశాడు. అవసరమైన ఆయుధాలు సమకూర్చుకున్నాడు. సమస్త సైన్యాన్ని తీసుకుని లంకాపురం వదిలి యుద్ధరంగానికి వెళ్లాడు.

రావణుడి ముందు వస్తున్న సేనలతో సుగ్రీవుడు మొదలైన వానరవీరులు విజృంభించి చెట్లు రాళ్లు పట్టుకుని తోకలు తిప్పుతూ భయంకరమైన యుద్ధం మొదలుపెట్టారు.

అది చూసి మాయలన్నింటిలో నేర్పరి అయిన రావణుడి శరీరం నుంచి వేలకివేలు రాక్షసవీరులు భయంకరమైన శక్తులు, గదలు, కత్తులు, ధనుస్సులు మొదలైనవి పట్టుకుని పుట్టుకొచ్చారు.

వాళ్లందరినీ కౌసల్య కొడుకు శ్రీరాముడు సంహరించాడు. రావణుడు మరోసారి మాయచేసి రామలక్ష్మణుల్లా ఊండేలా అనేకమందిని సృష్టించాడు. రామలక్ష్మణులు మొదట ఆశ్చర్యపోయినా వాళ్ల మాయారూపాల్ని ఖండించాడు.

అంతలో దేవేంద్రుడి రథసారథి మాతలి ఉదయించే సూర్యబింబంలా ప్రకాశిస్తూ, వేగంగా పరుగెత్తగల గుర్రాలు కట్టబడిన, ‘వైజయంతి’ అనే పేరుగల జెండాకాంతులతో విరాజిల్లే దేవేంద్రుడి రథాన్ని తీసుకుని వచ్చాడు.

“శ్రీరామా! ఇది దేవేంద్రుడి రథం. ఈ రథాన్ని ఎక్కి భయంకరమైన యుద్ధంలో జంభుడి విరోధి అయిన దేవేంద్రుడు చాలామంది రాక్షసవీరుల్ని చంపాడు. దేవేంద్రుడు పంపించిన ఈ రథాన్ని ఎక్కి అతినేర్పుతో నేను నడుపుతుండగా మూడు లోకాల్ని ఓడించిన అహంకారంతో తిరుగుతున్న ఈ రావణాసురుణ్ని సంహరించు” అన్నాడు.

అతడి మాటలు విని శ్రీరాముడు మాతలిని అభినందించి ఆ రథాన్ని ఎక్కి విజృంభించి అధికమైన ఉద్రేకంతో శత్రుసైన్యాల మీద బాణాలు గుప్పించాడు. ఆ విధంగా రాముడికి, రావణుడికి మధ్య భయంకరమైన యుద్ధం సాగింది.

రావణుడు తన సేనని శ్రీరాముడివైపు నడిపించాడు. రావణుడు ఆగకుండా వరుసగా కొన్ని వందల వేల శూలాలు, నాళికాస్త్రాలు, చిల్లకోలలు, బాణాలు ప్రయోగించి ఆకాశాన్ని అస్త్రాలతోను, శస్త్రాలతోను నింపేశాడు.

రాక్షససేనలు సంతోషంతో వాద్యాలు మోగిస్తూ ఆనందాన్ని ప్రకటించారు. శ్రీరాముడు తన బాణ పరంపరలతో రావణుడి అస్త్రశస్త్రాలన్నింటినీ కార్చిచ్చులా ఆక్రమించిన రావణుడి బాణాల్ని మేఘుడిలా విజృంభించి నాశనం చేశాడు.

వానరసైన్యం ఆనందంతో చేసిన కోలాహలం ఆకాశాన్నంటింది. అందమైన బంగారు పింజల కాంతితో దేదీప్యమానంగా ప్రకాశించేది, వాడిగా ఉన్న కొన కలిగింది, దేవతలజాతివాళ్లైన సిద్ధులు, సాధ్యులు, యక్షులు, ఋషులు సంతోషించే అమ్ముని వీరుడైన శ్రీరాముడు బ్రహ్మాస్త్రమంత్రంతో జోడించి వేగంగా ప్రయోగించాడు.

ఆ బాణం ప్రళయకాలంలో అగ్నిలా దశకంఠుడైన రావణుణ్ని కమ్ముకుని, సారథి రథం అశ్వాలతో పాటు ఒక్క క్షణంలో బుగ్గి చేసేసింది. జగాలన్నీ జయజయధ్వానాలు చేశాయి. ఆకాశంలో దేవదుందుభులు మంగళతూర్యారావాలు చెలరేగాయి.

రాక్షసులు బాధతో యుద్ధభూమినుంచి వెళ్లిపోయారు. గంధర్వులు గానం చేశారు. అప్సరసలు నాట్యం చేశారు. ఇంద్రుడు మొదలైన దేవతలు శ్రీరాముడిని పొగిడారు. అన్ని లోకాలకి బాధలు కలిగిస్తున్న రావణుడు శ్రీరాముడితో సంహరించబడడం వల్ల మూడు లోకాలు సంతోషంతో పండుగ చేసుకున్నాయి.

పుణ్యాత్ముడూ, రాక్షస సమూహాన్ని కాపాడగలిగిన విభీషణుడిని తమ్ముడు లక్ష్మణుడితో కలిసి సంతోషంగా లంకాపురానికి ప్రభువుగా పట్టాభిషేకం చేశాడు. తరువాత అవింధ్యుడు సీతాదేవిని తగిన వాహనం మీద కూర్చోబెట్టుకుని తీసుకుని వచ్చి శ్రీరాముడితో “దేవా! దేవిని పరిగ్రహించు!” అని గౌరవంతో చెప్పాడు.

అయోధ్యకి చేరిన సీతరామలక్ష్మణులు

మాసిన శరీరం కలదాన్ని, చిరిగిపోయిన మాసిపోయిన వస్త్రం ధరించినదాన్ని, ఎప్పుడూ కన్నీళ్లు కార్చడంవల్ల చారికలు కట్టిన చెక్కిళ్లు కలదానిని, చిక్కుపడి జడలుగా ఉన్న జుట్టుని ముడివేసుకుని ఉన్నదానిని, ఎంతో కాలంగా దుఃఖభారంతో బాధపడినదానిని తనకి ఇష్టమైన భార్య సీతాదేవితో.. గొప్ప నడవడిక కలిగిన శ్రీరాముడు కఠినమైన మనస్సుతో “సీతాదేవీ! ఎంతో చెడునడవడిక కలిగిన రావణుడి ఇంటిలో నువ్వు ఉన్నావు. అందువల్ల నిన్ను నేను స్వీకరించలేను.

నిన్ను నేను స్వీకరిస్తే నా నడవడికకి కళంకం ఏర్పడుతుంది. ధర్మానికి కీడు కలుగుతుంది. రావణాసురుణ్ని చంపడం నాకు జరిగిన పరాభవాన్ని పోగొట్టుకోడానికే గాని, నీ కోసం కాదు.

నీ ప్రవర్తన మంచిదైనా, చెడ్డదైనా నిన్ను నేను స్వీకరించలేను. నీ పరిస్థితి కుక్క ముట్టుకున్న హోమద్రవ్యంలా అయింది. ఇంక నువ్వు నీ ఇష్టం వచ్చిన చోటుకి వెళ్లవచ్చు” అన్నాడు.

శ్రీరాముడి మాటలు విని సీతాదేవి అప్పటి వరకు ఉన్న సహనం పోయి మొదలు నరికిన చెట్టులా నేలమీద పడిపోయింది. అక్కడున్న సైనికులందరు రాముడి మాటలు విని ఆశ్చర్యంతోను, వెలవెలపోయిన ముఖాలతోను, ఆవేదనతోను కొయ్యబారిపోయారు.

సీతాదేవి కొంతసేపటికి తెప్పరిల్లి కన్నీరు కారుస్తూ చేతులు జోడించి శ్రీరాముడితో “ప్రజలకి ప్రభువైన మహారాజా! ధర్మహాని నీకు కలగకుండా, ప్రజలకి నా గురించి సత్యం తెలిసేలా నేను అగ్నిప్రవేశం చేస్తాను. దయచేసి నా కోరిక తీర్చు” అని వేడుకుంది.

“నా మనస్సు ఎప్పుడూ నీ పాదాలనే స్మరిస్తుంది. నేను వేటినీ గురించీ స్మరించను. ఈ మాటకి పంచభూతాలే సాక్షులు. అది కాకపోతే ఈ భూదేవి, అగ్నిదేవుడు, వాయుదేవుడు, చంద్రుడు, సూర్యుడు నన్ను ఈ క్షణంలోనే దహించివేస్తారు. దేవతలు చెడుని అంగీకరించరు కదా!” అంది.

సీతాదేవి పంచభూతాల్ని సాక్షులుగా చెప్పగా భూమి మొదలైన పంచభూతాలు తమ పేర్లు చెప్పుకుని “శ్రీరామా! మా మాటలు విను. పంచభూతాలమైన మాకు అన్ని విషయాలు తెలుసు. ప్రజలు మమ్మల్ని మోసం చెయలేరు. జనకమహారాజు కుమార్తె సీత ఉత్తమురాలు. మహాపతివ్రత. ఇందులో ఎటువంటి సందేహము లేదు” అంటూ సీత మహాపతివ్రత అని సాక్ష్యం చెప్పారు.

దేవతలు, మహర్షులతో పాటు బ్రహ్మదేవుడు అక్కడికి వచ్చాడు. శ్రీరాముడు వాళ్లని సత్కరించాడు. బ్రహ్మదేవుడు “శ్రీరామా! నువ్వు సకలభూత కంటకుడైన రావణాసురుడిని చంపి విశ్వానికే మంచిని కలగచేశావు. నేను చెప్పేది సావధానంగా విను. రావణుడు నలకూబరుడి శాపం వల్ల పరస్త్రీలని బలాత్కారంగా మానభంగం చెయ్యలేడు.

నీ ధర్మపత్నిలో ఎటువంటి దోషం లేదు. సీతాదేవి మహాపతివ్రతాశిరోమణి. ఎటువంటి ఆలోచనలు లేకుండా నువ్వు ఆమెని తీసుకుని నీ రాజధాని అయోధ్యానగరానికి వెళ్లు” అని చెప్పి యుద్ధంలో మరణించిన వానరులందరని బతికించి వెళ్లాడు.

దేవేంద్రుడి రథసారథి మాతలి వేయి గుఱ్ఱాల రథాన్ని తీసుకుని శ్రీరాముడి అనుమతితో స్వర్గలోకానికి వెళ్లిపోయాడు. శ్రీరాముడు సీతాదేవిని తీసుకుని పుష్పక విమానం మీద ఎక్కి అయోధ్యానగరానికి వెళ్లాడు. శ్రీరాముడిని చూసి భరతుడు మొదలైన బంధువులందరు సంతోషపడ్డారు. వశిష్ఠుడు, వామదేవుడు మంచి ముహూర్తం నిర్ణయించి పట్టాభిషేకం చేశారు. సుగ్రీవుడు, విభీషణుడు మొదలైన మిత్రులకి కానుకలిచ్చి శ్రీరాముడు వాళ్లని సగౌరవంగా సాగనంపాడు.

తరువాత శ్రీరాముడు అనేకవేల సంవత్సరాలు భూమిమీద శాంతిభద్రతలు ఉండేలా చూసి, భోగాలు అనుభవించి, దానాలు చేసి, అనేక యజ్ఞాలు చేసి కీర్తిని పొందాడు. ఇది శ్రీరాముడి చరిత్ర.

ధర్మరాజా! విన్నావుగా శ్రీరాముడి చరిత్ర? ఈ విధంగా శ్రీరాముడు అడవుల్లో నివసించి, ఆవేదన అనుభవించి, శత్రువులు చేసిన అపకారాలు భరించి, చివరికి శుభాన్ని పొందాడు. అలాగే నువ్వు కూడా వనవాస బాధలు గడిచిపోయాక భూమండలమంతా విస్తరించి ఉన్న సామ్రాజ్యాన్ని పాలించి సర్వసౌఖ్యాలు అనుభవిస్తావు” అని చెప్పాడు.

మార్కండేయ మహర్షి చెప్పిన రామాయణ కథని విని ధర్మరాజు శ్రీరాముడి పరక్రమాన్ని, సీతాదేవి పాతివ్రత్య గొప్పతనాన్ని మెచ్చుకున్నాడు.

Exit mobile version