Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మహాభారత కథలు-131: విరాటమహారాజు కొలువులో చేరిన పాండవులు

[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]

విరాటపర్వము – రెండవ ఆశ్వాసము

విరాటమహారాజు కొలువులో చేరిన పాండవులు

జనమేజయుడు వైశంపాయనమహర్షితో “మహర్షీ! తరువాత జరిగిన పాండవుల వృత్తాంతాన్ని కూడా తెలియచెయ్యండి!” అని అడిగాడు.

వైశంపాయన మహర్షి “జనమేజయ మహరాజా! అజ్ఞాతవాసకాలంలో ధర్మరాజు గొప్పవైన పద్ధతుల్లో రాజుతో వినోద ప్రసంగాలు చేస్తూ సభ్యుల మనసుల్ని సంతోషపెట్టేవాడు. ఒక్కొక్కసారి స్నేహపూర్వకంగా ఆడిన జూదంలో గెలిచిన ధనాల్ని తమ్ముళ్లకి ఇచ్చేవాడు. భీముడు వంటకి వాడిన తరువాత మిగిలిన మాంసాల్ని అమ్ముతున్న మిషతో అన్నదమ్ములకి పంచేవాడు. అర్జునుడు సంగీత నాట్య ప్రదర్శనల సందర్భంగా మెప్పులు పొంది కానుకలుగా సంపాదించిన బంగారము, పట్టువస్త్రాలు మొదలైనవాటిని సోదరులకి ఇస్తుండేవాడు.

నకులుడు గుర్రాల దాణాలు కొనేటప్పుడు మిగిలే ధనాల్ని తోబుట్టువులకి పంచుతుండేవాడు. సహదేవుడు విరాటరాజు గోవుల్ని చూసి సంతోషపడిన సమయాల్లో కానుకలుగా ఇచ్చిన పదార్థాల్ని; పాలు, పెరుగు, వెన్న వంటి గోరసాల్ని అన్నలకి ఇచ్చి తృప్తిపరుస్తూ ఉండేవాడు. కంటికి రెప్పలా కాపాడుతూ తిరుగుతున్న పాండవుల్ని చూసుకుంటూ ద్రౌపది మసులుకుంటోంది. పాండవులు ఓర్పు, జంకు, అణిగిమణిగి ఉండడం, ధర్మం, అప్రమత్తత, మంచి నడవడిక అనే ఆరు గుణాలతో తాము పనిచేసే చోట్ల ప్రజలందరు మెచ్చుకునేలా ప్రవర్తిస్తున్నారు.

వివిధ దేశాలకి చెందిన బలపరాక్రమ సంపన్నులయిన మల్లయోధులు గర్వంగా విరాటరాజు కొలువుకి వచ్చారు. వాళ్లల్లో సింహం వంటి ఆకారంతో ఉన్న ఒక బలవంతుడు విరాటమహారాజుకి ఎదురుగా నిలబడ్డాడు. మల్లయుద్ధానికి ఆహ్వానిస్తున్నట్టు భుజాలు చరుస్తూ “మహారాజా! భూప్రపంచం నలుమూలలా ఉన్న రాజుల కొలువులన్నీ తిరిగాను. నా ముందుకు వచ్చి ఉత్సాహంగా భుజాలు చరిచి నిలబడిన వీరుడే లేడు. మల్లయోధుడితో సమానంగా బాహుయుద్ధం చేయగల వీరుడిని నేను ధర్మరాజు కొలువులో చూశాను. అతడు గొప్ప నైపుణ్యం కలవాడు” అన్నాడు.

ఆ మాటలు విని ధర్మరాజు “మహారాజా! మన దగ్గర పని చేస్తున్న వంటలవాడు వలలుడు మల్లయుద్ధంలో ఎంతోమందిని ఓడించాడు. ఆ విషయం నాకు తెలుసు. అతడు సమర్థుడు. ఇది నిజం” అన్నాడు. విరాటరాజు వంటవాడు వలలుణ్ని పిలిపించాడు. మల్లయోధుల్ని చూడగానే భీముడు ఉప్పొంగిపోయి శరీరాన్ని పెంచి మల్లయుద్ధానికి సిద్ధపడ్డవాడిలా వచ్చి నిలబడ్డాడు.

మల్లుడితో యుద్ధం చేసిన భీముడు

ఎదురుగా నిలబడిన భీముణ్ని చూసి విరాటుడు అక్కడే ఉన్న మల్లవీరుడిని చూపించి అతడితో యుద్ధానికి సిద్ధమవమన్నాడు. భీముడు ధర్మరాజువైపు చూశాడు. అతడు సరేనని కళ్లతో సైగచేశాడు. భీముడు “విరాటరాజా! నేను ధర్మరాజు కొలువులో ఉన్నప్పుడు ఆయన మనసుకి ఆనందం కలిగించడం కోసం మల్లులతో కుస్తీ పట్టేవాణ్ని. అలాగే మీకు అనందం కలిగించేందుకు ఈ మల్లుల్ని ఒక పట్టు పట్టి చూపిస్తాను” అని ఉత్సాహంతో గర్జించి మదించిన ఏనుగులా ముందుకు వచ్చాడు.

రాజు ఎదురుగా జబ్బ చరిచి నమస్కారం చేసి మల్లయుద్ధానికి సిద్ధమయ్యాడు. మల్లవీరుడు, భీముడు ఒకరి ఆకారాలు మరొకరు తేరిపార చూసుకున్నారు. మల్లయుద్ధరంగంలో ఉన్న మట్టిని తీసి నుదుటి మీద పెట్టుకుని, శరీరాల మీద చల్లుకున్నారు. మునివేళ్లతో కొంత మట్టిని తీసుకుని ఒకళ్ల మీద మరొకళ్లు చల్లుకున్నారు. ఎడమచేతుల్ని వంచి కుడిచేతులతో జబ్బలు చరుచుకున్నారు. ఇద్దరు ఒకేసారి చరుచుకోవడం వల్ల ఒకే చప్పుడుగా వినిపించింది. ఎవరిస్థానంలో వాళ్లు నిలబడి ఒక్కసారి ఇద్దరూ కలియబడ్డారు.

మల్లయోధులిద్దరూ ఒకళ్లతో ఒకళ్లు కుస్తీపట్లు ప్రారంభించారు. మల్లయుద్ధంలో ఆరితేరిన యోధుడు వలలుడు అనేక విన్యాసాలు చూపిస్తూ మల్లుడిని నేలమీద పడేశాడు. తన మీదకి వచ్చినప్పుడు అదుపుచేసేవాడు. అనేక రకాలుగా జెట్టీల నేర్పుని చూపిస్తూ వలలుడు కుస్తీపట్లు పడుతున్నాడు. ఎన్నో రకాలుగ ఉత్సాహంగా పట్లు పడుతూ రాజుకి ఆనందం కలిగించాడు. మల్లుడి దట్టీ పట్టుకుని కాళ్లూచేతులూ వేలాడుతూ మదించిన ఎనుగులా ఉన్న మల్లుణ్ని పిడికిలితో గుద్ది ముక్కునుంచి, నోటినుంచీ నెత్తురు కారుతుంటే నేలమీద ఎత్తి పడేశాడు. అతడి వీపు మీద మోకాలు మోపి పెట్టాడు.

మల్లుడు తాళమనే మల్లబంధంతో వలలుడ్ని పట్టాలని అనుకుని వీలు పడక నేలని చేతులతో బాదుతూ ఊపిరాడక విలవిల కొట్టుకున్నాడు. సభ్యులందరూ అనందంతో కేకలు పెడుతుండగా వలలుడు మల్లుణ్ని ఓడించాడు. మల్లుడిని ఓడించిన వలలుడికి విరాటరాజు ఆనందంతో కానుకలిచ్చాడు. వలలుడు ఆ ధనాన్ని యాచకులకి ఇచ్చి వెళ్లిపోయాడు. విరాటరాజు వినోదంకోసం వలలుడితో పులులతోను, ఏనుగులతో పోరాటం చేయించేవాడు.

అంతఃపురంలో ఉన్న పరివారం అది చూసి సంబరపడేవారు. పాండవులు తమ ప్రవర్తనలు ఇతరులు గుర్తించడానికి వీలు లేకుండా చకచక్యంగా మెలుగుతూ తమ అజ్ఞాతవాసాన్ని గడుపుతున్నారు.

పాంచాలిని మోహించిన కీచకుడు

పాండవులు ద్రౌపదితో కలిసి విరాటనగరంలో తమ అజ్ఞాతవాసాన్ని గడుపుతున్నారు. సంవత్సరంలో ఇంకా కొంత భాగం మిగిలి ఉన్న సమయంలో విరాటరాజు బావమరిది తన అక్క సుదేష్ణకి గౌరవంగా నమస్కరించడానికి వచ్చాడు. అతడు నూట అయిదుగురు కీచకులకి అన్న, అందమైన రూపం కనబడితే అభిమానిస్తాడు. అనేక రకాల అలంకారాల్ని ధరించే స్వభావము కలవాడు, వివేకం లేనివాడు, బలగర్వం కలవాడు.

తన అక్కకి దగ్గరలో ఉన్న ద్రౌపదిని, ఆశ్చర్యం కలిగించే ఆమె అందాన్ని చూసి చూపులు తిప్పుకోలేక నిశ్ఛేష్టుడుగా నిలబడిపోయాడు. సింహబలుడు ‘ఇటువంటు సౌందర్యరాశిని మనుషులు ఎవరూ ఎక్కడా చూసి ఉండరు. నేనే కాదు ఆ దేవేంద్రుడి కొడుకు జయంతుడు కూడా ఈమె అందాన్ని చూడక మానడు. ఈ సుందరాంగి పొందు దొరకడం నిజంగా పూర్వజన్మ పుణ్యఫలం. ఈ సుందరికి జన్మనిచ్చిన పుణ్యదంపతులు ఎవరో! ఈమె పేరుగా రూపొందడానికి నోములు నోచిన అందమైన అక్షరాలు ఏవో! ఈమె భర్తగా లోకంలో అందచందాలతో వెలిగే భాగ్యవంతుడు ఎవరో! ఈమె నివసించడం వల్ల ఆమె అందాన్ని ఇనుమడింప చేస్తున్న ఆ మందిరం ఏదో! ఈమెను పొందే మార్గం కోసం నాకు సహయపడే ఆప్తుడిని నేను ఎలా వెతికి పట్టుకోవాలి?’ అని అనేక రకాలుగా ఆలోచిస్తున్నాడు.

జంకుగొంకులు లేకుండా తనవైపే చూస్తున్న కీచకుణ్ని చూసి ద్రౌపది భయపడింది. విధి నాకెప్పుడూ అనుకూలంగానే ఉండదేమో. ఇటువంటి సమయంలో తనకి ఎవరూ దిక్కులేరని భయంతో చెమటలు పట్టాయి. అది చూసి కీచకుడు అదంతా తన మీద కలిగిన ఇష్టమనుకుని మురిసిపోతున్నాడు. అక్కడున్న పరిచారికలందరూ తనవైపే చూస్తున్నా మర్యాద మర్చిపోయి ద్రౌపది వైపే చూస్తూ ఒక యంత్రపు బొమ్మలా కనిపించాడు.

ద్రౌపది వృత్తాంతం తెలుసుకున్న కీచకుడు

సుదేష్ణని అడిగి ద్రౌపది వివరాలు తెలుసుకోవాలని ఎలాగో ఆమె మీదనుంచి దృష్టి మరల్చుకుని అక్క దగ్గరికి వచ్చి నమస్కారం చేశాడు. సుదేష్ణ పరిచారికల్ని పంపించి తమ్ముడికోసం బంగారు గద్దెని వేయించింది. ప్రేమతో తమ్ముడితో మాట్లాడుతోంది. అతడు అమె మాటలు పట్టించుకోకుండా ద్రౌపది వైపు చేయి చూపిస్తూ “అక్కా! ఈమె కులమేమిటి? ఎలాంటిది? పేరేమిటి? ఊరేమిటి? దీని భర్త ఎవరు? ఎక్కడ ఉంటోంది? ఏ పని మీద ఇక్కడికి వచ్చింది? ప్రేమగా చూసుకుంటున్నావా?” అని అడిగాడు.

సుదేష్ణకి తమ్ముడి మనసు అర్థమయింది. మాట మార్చడానికి ప్రయత్నించింది. కీచకుడు అవివేకంతో లేచి వచ్చి ద్రౌపది చుట్టూ తిరుగుతూ ఆమెతో “ఇంత అందమైన వనితని ఈ భూమి మీద చూడలేదు. నువ్వు ఎవరి కూతురివి? నీ భర్త ఎవరు? నీ పేరేమిటి? చెప్పు” అన్నాడు. ద్రౌపది కీచకుడి మాటలు విననట్లు నటిస్తూ మాట్లాడకుండా నిలబడింది.

అతడు వదలకుండా ఆమె వైపు చుస్తూ ఆమెకి దగ్గరగా వచ్చి మాట్లాడించడానికి ప్రయత్నించి ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని తన కోరిక చెప్పాలని అనుకున్నాడు. మోహావేశంలో ఉన్న కీచకుడు ద్రౌపది మనస్సు తెలుసుకోవాలని అనేక విధాలుగా ప్రశ్నించాడు.

తన కోరిక బయటపెట్టిన కీచకుణ్ని చూసి ద్రౌపదికి కోపం వచ్చింది. దాన్ని పైకి కనిపించకుండా తనని తాని నిగ్రహించుకుని, వీడు దురంహకారి తొందరపాటు మంచిదికాదని అనుకుంది. “అన్నా! కష్టాల్లో ఉన్న నా పరిస్థితిని నువ్వు అర్థం చేసుకోవడం లేదు. నా శరీరము, నా కట్టు, బొట్టు, తీరు ఎంత అసహ్యంగా ఉన్నాయో ఆలోచించు. ఈ పరిస్థితిలో ఉన్న నా మీద నీకు మోహం కలగడం భావ్యంకాదు. నువ్వు మంచివాడివి, తోబుట్టువులు ఉన్నవాడివి. కనుక, అందర్నీ ఆడపడుచులుగా అనుకుని అసలే మాట్లాడకూడదు. అంతేకాదు, తక్కువ కులంలో పుట్టినదాన్ని, పతివ్రతనయిన నన్ను ఇలా అడగవచ్చా?” అంది.

కీచకుడు ద్రౌపది మాటలు అర్థం చేసుకునే పరిస్థితిలో లేడు. ఆమెతో “నువ్వు నీచజాతిదానివి కాదని చెప్పడానికి నువ్వే సాక్షి. నేను పరస్త్రీ సాంగత్యం వల్ల కలిగే పాపాన్ని ఓర్చుకోగలను కాని కోరికవల్ల కలిగే బాధని ఓర్చుకోలేకపోతున్నాను” అన్నాడు. కీచకుడి మాటలకి ద్రౌపది వీడు భయపెడితేగాని వినడని అనుకుని కోపంతో “కీచకా! ఓడించడానికి వీలుకాని భుజబల పరాక్రమం కలిగి గర్వంతో శత్రువుల్ని అవలీలగా వధించే విద్యలో ప్రవీణులైన గంధర్వులు నా అయిదుగురు భర్తలు. వాళ్లు అవలీలగా నీ మాన ప్రాణాలు హరిస్తారు” అని చెప్పింది

సైరంధ్రి మాటలు విని కీచకుడు “నీ భర్తలేకాదు నన్ను ఎదిరించేవాళ్లు మూడులోకాల్లోను ఎవరూ లేరు” అన్నాడు. అతడు అహంభావంతో మాట్లాడిన మాటలు విని ద్రౌపది “కీచకా! నీకు వివేకం లేక మాట్లాడుతున్నావు. ఈ పని చెయ్యతగిందా కాదా అని ఆలోచించకుండా అందని చెట్లకి కాసిన పండ్లని కోరుకున్నట్టు లభించనివాటిని కోరుకుంటున్నావు. ఇది నీకు మంచిది కాదు. పూర్వం రావణుడు మొదలైనవాళ్లు ఇటువంటి కోరికలవల్ల చెడిపోయారని ఎప్పుడూ వినలేదా?” అని అడిగింది.

ఆమె మాటలు విని కీచకుడు వివేకం లేనివాడై బాధ పడుతూ చిన్నబోయిన ముఖంతో అక్క దగ్గరికి వెళ్లాడు. అతడి బాధ అర్థం చేసుకున్న సుదేష్ణ ‘వీడు సైరంధ్రిని కోరుకుంటున్నాడు. ఏ అపాయం రాబొతోందో తెలియదు. నేను వద్దని చెప్పినా వినడు. ఇప్పుడు నాకు ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. అయినా వద్దని చెప్పి చూస్తాను’ అనుకుంది. తమ్ముడితో “మనసుని మరపించే మాటలతో నిన్ను అనురాగంతో సేవించే అంతమంది అందగత్తెలు నీ ఇంట్లో ఉన్నారు. ఎటువంటి ఉత్సాహము లేని నీరసాకారంతో ఉన్న ఈ సైరంధ్రి నీకెందుకు?” అంది.

ఆమె మాటలు విని కీచకుడు “అక్కా! వాళ్లందరికంటే మించిన అందం సైరంధ్రిలో ఉంది. నువ్వు అమాయకురాలిలా ఆ విషయం గమనించకుండా మాట్లాడుతున్నావు” అన్నాడు.

సుదేష్ణ చెప్పిన మాటలు కీచకుడికి ఓదార్పునివ్వలేదు. అతడు గర్వంతో “అక్కా! నాలుగు సముద్రాల మధ్య ఉన్న ఈ నేల మీద నా బాహుబలాన్ని ఎదిరించి నిల్వగలిగినవాడు లేడని అందరికీ తెలుసుకదా! వజ్రాయుధం పర్వతాలని కూల్చినట్టు నా భుజబలంతో దాని భర్తల్ని కూల్చివేస్తాను. నువ్వు నాకు బుద్ధులు చెప్పడం మానెయ్యి. నా మేలు కోరేదానివైతే ఏదో ఒక ఉపాయం ఆలోచించి సైరంధ్రిని నా దగ్గరికి పంపించు. లేకపోతే ఈ బాధతో నా ప్రాణాలు పోతాయి” అంటూ సుదేష్ణకి సష్టాంగ నమస్కారం చేశాడు.

సుదేష్ణ ముఖం చిన్నబోయింది. సైరంధ్రిని పంపిస్తే తప్ప వీడు వినేట్లు లేడు. ఎన్ని ఆపదలు వచ్చినా ఈ పని మానడు. అమె భర్త చేతుల్లో కాకపోతే ఈ బాధతో అయినా చావక తప్పదు అనుకుని కీచకుణ్ని లేవతీసింది. కళ్లల్లోంచి కారే కన్నీళ్లని పైకి కనబడనీయకుండా “ఎందుకు ఇంత బాధ పడతావు? సైరంధ్రిని ఒప్పించి పంపించడం సాధ్యంకాని పని కాదు. ఇంక బాధ పడకుండా ఇంటికి వెళ్లిపో! ఇక్కడ తిరగద్దు. ఈరోజు పూర్తయ్యే లోపులో మద్యం తీసుకుని రమ్మని సైరంధ్రిని నీ మందిరానికి పంపిస్తాను. అప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు నీ కోరిక నెరవేర్చుకో” అని చెప్పి కీచకుణ్ని అక్కడి నుంచి పంపించింది.

Exit mobile version