Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మహాభారత కథలు-133: ద్రౌపదిని ఊరడించిన సుదేష్ణ

[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]

ద్రౌపదిని ఊరడించిన సుదేష్ణ

సైరంధ్రి ఏడుస్తూ ‘నన్ను దుష్టుడైన కీచకుడి ఇంటికి వెళ్లమన్న ఆ ధూర్తురాలికి నాకు జరిగిన అవమానాన్ని చెప్పి నిందించాలి’ అనుకుంటూ ధారాపాతంగా కారుతున్న కన్నీళ్లతో, బావురుమని ఏడుస్తూ కంపిస్తున్న శరీరంతో తూలుతూ సుదేష్ణ దగ్గరికి వెళ్లింది.

సైరంధ్రిని చూసి సుదేష్ణ తనకేమీ తెలియనట్లు నటిస్తూ బాధపడుతున్నట్టుగా “సైరంధ్రీ! నీ శరీరం దుమ్ముకొట్టుకుని కాంతి పోయినట్టు ఉంది. మనస్సులో బాధ వల్ల నీ ముఖం చిన్నబోయింది. నీ కళ్లు కన్నీళ్లతో నిండి ఉన్నాయి. నీకు ఎవరైనా, ఎక్కడైనా, ఎప్పుడైనా అపకారం చేశారా? వాళ్లకి ఎంత ధైర్యం? వాళ్లని చంపుతాను, అవమానాలపాలు చేస్తాను, కష్టాలపాలు చేస్తాను, రూపుమాపుతాను. అసలు ఎలా జరిగిందో చెప్పు” అని అడిగింది.

ఆమె మాటలు విని సైరంధ్రి “అన్నీ తెలిసీ తెలియనట్లు అడిగితే నేనింక ఏమని చెప్పాలి? నువ్వు నన్ను మద్యం తెమ్మని కీచకుడి ఇంటికి పంపావు. నేను వెళ్లాను. ఆ సమయంలో అతడు అవినీతి చెయ్యబోతుంటే నేను విరాటమహారాజు కొలువుకి పరుగుతీసాను. కోపంతో నా వెనకాలే వచ్చి నన్ను పట్టుకుని తన్నాడు. ఇంతకంటే ఏం చెప్పను?” అంది.

సుదేష్ణ సైరంధ్రిని ఓదారుస్తూ “కీచకుణ్ని నేను దండిస్తాలే!” అని చెప్పింది. ఆమె మాటలు విని సైరంధ్రి “సుదేష్ణాదేవీ! నువ్వు కోపపడవలసిన అవసరం లేదులే! నా కష్టాల్ని, లోకుల దుఃఖాన్నీ కొంచెం కూడా మిగలకుండా పగదీర్చగల సమర్థులు నా భర్తలు ఉన్నారులే!” అంది.

సైరంధ్రి మాటలు విని సుదేష్ణ, ఆమె పరిచారికలు భయపడ్డారు. ఎన్ని ఓదార్పు మాటలు చెప్పినా ద్రౌపది కోపం తగ్గలేదు. స్నానం చెయ్యలేదు, తినడం తాగడం మానేసింది. సుదేష్ణ ఏమీ చెయ్యలేక భయంతో ఆశ్చర్యంతోను ఏమీ మాట్లడకుండా ఉండిపోయింది. మిగిలినవాళ్లు కీచకుడి చెడు స్వభావం తెలుసు కనుక వాడికి కీడు కలగడమే మంచిదని మనసుల్లో అనుకున్నారు. ద్రౌపది అవమానంతో రగిలిపోతూ తన గదిలోకి వెళ్లి నడుం వాల్చింది. అయినా అమె కళ్లల్లోంచి కన్నీరు ధారగా కారుతోంది. అనేక ఆలోచనలు ఆమెని చుట్టుముట్టుకున్నాయి. ‘కీచకుడు చాలా బలవంతుడు. అతణ్ని జయించగల సమర్థత ఒక్క భీముడికే ఉంది. అతడికి భుజబలశక్తికి తోడు దైవబలం కూడా సహకరిస్తుంది’ అనుకుంది.

భీముడితో చెప్పుకుని బాధపడిన ద్రౌపది

రాత్రి సమయంలో ద్రౌపది లేచి, శరీరం మీద ఉన్న దుమ్ము కడుక్కుని ఉతికిన చీర కట్టుకుని వంటింట్లో నిద్రపోతున్న భీముడి దగ్గరికి వెళ్లింది. హాయిగా నిద్రపోతున్న భీముణ్ని చూసి ‘మీ అన్న ధర్మజుడు సాహసం చూపించడానికి తగిన సమయం కాదని చెప్పడం వల్ల సుఖంగా నిద్రపోతున్నట్టున్నావు’ అని మెల్లగ అనుకుంటూ అతణ్ని చేతితో తాకింది.

ఆ స్పర్శకి భీముడు లేచి “ఎవరు?” అని అడిగాడు. తను ద్రౌపదినని చెప్పింది. భీముడు మనసులో ‘కీచకుడు చేసిన దుర్మార్గం తనకి చెప్పి కీచకుడి మీదకి యుద్ధానికి పంపించాలని అనుకుని ఉంటుంది. తనే చెప్తోందిగా చెప్పనియ్యి’ అనుకున్నాడు.

కొంచెం ఆగి “ద్రౌపదీ! ఇంత పొద్దుపోయాక వచ్చావు.. ఏదైన పని ఉందా? ఎవరూ చూడకుండా వచ్చావా?” అని అడిగాడు. అతడి మాటలకి ద్రౌపది “భీమసేనా! తెలిసి కూడా ఎందుకు అడుగుతున్నావు. కొలువులో జరిగినదాన్ని చూశావు కదా? ఇంతలోనే మర్చిపోతే నువ్వు వినక్కర్లేదు, నేను చెప్పక్కర్లేదు. అలా కాకుండా జరిగినదంతా నా నోటితో చెప్పించాలని అనుకుంటే జరిగినదంతా విపులంగా చెపుతాను.

విరాటుడి బావమరిది కీచకుడు అక్క సుదేష్ణకి నమస్కరించాలని వచ్చి నాతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి సిగ్గులేకుండా నన్ను సమీపించాడు. నాకు అసహ్యం కలిగింది. అయినా వదలకుండా నన్ను కోరాడు. నేను సమయానికి తగినట్టు మాట్లాడి తప్పించుకున్నాను. అప్పటికి అతడు వెళ్లిపోయాడు. సుదేష్ణ కీచకుడి ఇంటికి వెళ్లి కల్లు తెమ్మని పంపింది. నేను అక్కడికి వెళ్లనని ఎన్ని కారణాలు చెప్పినా ఆమె బలవంత పెట్టింది. ఎక్కువ ఘర్షణ పడడం మంచిదికాదని, మనసులో అవసరమయితే బలసంపన్నులైన మీరు ఉన్నారని తలుచుకుని నన్ను ఎవరూ ఏమీ చెయ్యలేరని నిశ్చయించుకుని కీచకుడి ఇంటికి కల్లు తెద్దామని వెళ్లాను.

వాడి అసందర్భపు మాటలతో నా చెయ్యి పట్టుకోబోతూ ఉండగా వాడిని తోసి వచ్చేశాను. దుర్మార్గుడైన కీచకుడు నన్ను వెంబడించాడు. నేనప్పుడు వేగంగా మీరున్న చోటికి వచ్చాను. కులభ్రష్టుడైన కీచకుడు నన్ను వెంబడించి వచ్చి పట్టుకున్నాడు. సభలో ఏం జరిగిందో నీకు తెలుసు. నీ అన్న పెద్దరికాన్ని చూశావు. ఇంక అంతకంటే ఏం చెప్పగలను? మీరు బలపరాక్రమాలు నిరర్థకమన్నట్లు ధృతరాష్ట్రుడి కొలువులో దుశ్శాసనుడు నన్ను అవమానించాడు. సైంధవుడు నన్ను నిర్భయంగా తీసుకుని పోయినా చెల్లిపోయింది. ఇప్పుడు విరాటుడి కొలువులో సభాసదులందరు చూస్తుండగా ఇలా చేశాడు.

అయినా మిమ్మల్ని అనుకుని ఏం ప్రయోజనం? దుఃఖపడడం నాకు ఈ రోజు కొత్త కాదుకదా? స్త్రీ దుఃఖాన్ని, గోవు అరుపునీ విని పరాయివాళ్లైనా వాళ్లని పట్టించుకుని రక్షించడం లోకపరిపాటి. అటువంటిది సభలో కీచకుడు నన్ను తన్నినా ధర్మరాజు చూస్తూ ఎలా ఉండిపోయాడు?” అని అడిగింది.

ద్రౌపది చెప్పింది విని భీముడు “ద్రౌపదీ! కీచకుడు నిన్ను పరాభవించడం చూసి కోపావేశంతో ఒళ్లు తెలియని నన్ను ధర్మరాజు అడ్డుపెట్టకపోతే కీచకుడిని, విరాటుడిని, అతడి సైన్యాన్ని అక్కడే నాశనం చేసి ఉండేవాడిని. ఆ ఉద్రిక్త పరిస్థితిలో అజ్ఞాతవాస ప్రతిజ్ఞాపాలన చెడిపోయి ప్రజలు మనల్ని గుర్తిస్తే మళ్లీ అరణ్యవాసం చేయవలసి వచ్చేది. అది నువ్వు, నేను కలిసి కల్పించిన ఆపదగా ప్రజలు అనుకుని ప్రజలు మనల్ని నిందించేవాళ్లు. ఆడిన మాటకి కట్టుబడే ధర్మరాజు ప్రశంసించతగ్గవాడే కాని నిందింపతగినవాడు కాడు” అన్నాడు.

మళ్లీ భీముడు ద్రౌపదితో “ఇప్పటికైనా మించిపోయింది లేదు. నిన్ను అవమానించిన కీచకుడిని చంపి నీ బాధ పోగొడతాను. మనం లోకులకి అనుమానం రాకుండా ఉపాయం ఆలోచించాలిగాని, కీచకుణ్ని చంపడం లెక్కలోది కాదు” అన్నాడు.

భీముడి మాటలు విని ద్రౌపది “నా జీవితంలో నేను అత్తగారైన కుంతికిగాని, భర్తలైన మీకుగాని, భగవంతుడికిగాని భయపడలేదు. దుర్మార్గురాలైన సుదేష్ణకి సేవలు చేస్తూ అమితంగా భయపడుతున్నాను. కోపతాపాలు భరించి చెప్పుకునే వీలు లేక నేను ఎన్నో అవమానాలు భరించి పడే పాట్లన్నీ భరిస్తుండగా మూర్ఖుడైన కీచకుడి వల్ల ఆత్మగౌరవం కూడా పోగొట్టుకోవలసి వచ్చింది. ఆ బాధతో మంచీ చెడూ తెలియనిదాన్నై ధర్మరాజుని అలా అన్నానుగాని, ధర్మరాజు గొప్పతనం తెలియక కాదు. అంతేకాని, ప్రజలందరితో కీర్తింపబడే ధర్మరాజుని నిజంగా నిందించేదాన్ని కాదు” అని చెప్పింది.

భీముడితో ధర్మరాజు మహిమ చెప్పిన ద్రౌపది

“భీమసేనా! ధర్మరాజు ధర్మదీక్షవల్లే జగత్తు మొత్తం రక్షించబడుతోంది. ఆ ధర్మం వల్లనే పాండవులమైన మనం బ్రతకాలనుకోవడం సహజమే కదా! అజాతశత్రుడనే బిరుదు కలిగి ఉండి కూడా దిగ్విజయం చేసి కీర్తికెక్కడం ధర్మరాజుకి తప్ప వేరేవాళ్లకి సాధ్యమవుతుందా? రాజసూయ మహాయజ్ఞాన్ని నిర్విఘ్నంగా నిర్వహించడం మిగిలిన రాజులకి శక్యమవుతుందా? ధర్మాచారపరాయణుడు అని కీర్తించడాని అతడొక్కడే తగినవాడు కాని, ఇతరులకి అది వీలవుతుందా? సత్యదీక్షని ఎల్లప్పుడూ పాటించడం అతడిలా ఇతరులకి ఎవరికయినా వీలవుతుందా? ధర్మరాజుకున్న గాంభీర్యం, ధర్యం మరొకరిలో ఎక్కడైన కనిపిస్తాయా?

అతడు యశస్వి, కరుణామయుడు, బ్రాహ్మణుల మంచిని కోరేవాడు, చంద్రవంశంలో కీర్తిని పొందినవాడు, ఉపకారం చేసేవాడు. తనకున్న సంపదకి తగినట్లు దానం చేస్తూ శౌర్యానికి తగినట్లు సహాయ సంపత్తులు, బలగము కలిగి లోకుల హృదయాలు పట్టనంతగా ఆనందాన్ని అందించడం ఒక్క ధర్మరాజుకే చెల్లింది.

ఎవరి ఇంటి ముందు ఏనుగుల మదజలం వల్ల ఏర్పడిన బురద ఆయనను సేవించడానికి వచ్చే రాజుల అలంకారాల రాపిడి వల్ల రాలిన దుమ్ము అణచివేస్తుందో; ఎవరి ఉత్తమ ప్రవర్తన లోకాలకన్నింటికీ ఆదర్శమై మన ప్రవర్తనకి పద్ధతిని ఏర్పరుస్తుందో; ఎవరి కనుకొనలతో ప్రసరించే చూపు సందలని కలుగచేస్తుందో; ఎవరి సుగుణాలు అనే తీగలు సప్తసముద్రాలు దాటి చక్రవాళ పర్వతం మీదకి ప్రసరిస్తాయో; ఎవరి మహాపరాక్రమమనే పెద్ద దీపం శత్రువుల గర్వమనే అంధకారాన్ని దూరంగా పారదోలుతుందో; ఎవరి పాదాలు శత్రు కిరీటాలలో ఉండే రత్నకాంతులతో ఎల్లప్పుడూ ఆవరించబడి వెలిగిపోతూ ఊంటాయో అటువంటి ధర్మరాజు కేవలం మనిషి కాదు. అటువంటి గొప్పవాడైన ధర్మరాజు సామాన్య మానవుడిలా కూడు, గుడ్డ కోసం ఒక రాజు దగ్గర పరిచర్యలు చేయడం పేరు, వంశప్రతిష్ఠ, కులగౌరవం వదిలి గోప్యంగా ఉండిపోడం చూస్తుంటే నా ధైర్యం పోయి మనస్సు వికలమై, ఎంతో దుఃఖం కలుగుతోంది.

భీమసేనా! నీ కుడి భుజం యొక్క పరాక్రమం చూస్తే ఇంతకు ముందు భూభారం మోసిన ఆదిశేషువు, ఆదికూర్మం, ఏడు కులపర్వతాలు, ఎనిమిది దిగ్గజాలు ఊరట పొందాయి. నువ్వు గౌరవంగా చూస్తే లోకానికి పండుగ, నువ్వు కోపంతో మహోగ్రమైన రూపం పొందితే శత్రువులకి కాలం మూడినట్లే. లోకాలకి భయాన్ని, విజయాల్నీ కలిగించే నీ చేతులకి బక, హిడింబ, కిమ్మీరుల బాహుబలాలు జరాసంధుడు మొదలైన వాళ్ల గర్వాతిశయాలు లొంగిపోయాయి.

అంతటి బలవంతుడవైన నువ్వు వంటకట్టెలు విరవడానికి ప్రతిరోజు నీ భుజబలాన్ని ఉపయోగించడం చూసి దుఃఖపడుతూ ఉంటాను. ధర్మం తప్పి విరాటరాజు తన వినోదాల కోసం దున్నపోతులు, పెద్దపులులు, ఏనుగులు మొదలైన జంతువులతోను, జటీలతోను, నిర్దయగా పోటీలు పెట్టి నీతో ఆడిస్తుంటాడు. లోకులు మెచ్చుకునే నీ శరీరం ఇలా నీచపు పనులకి తలవంచడం విధి వక్రించడం కాక మరేమిటి? తెలివితక్కువవాడైన విరాటరాజు నీతో జంతువులతో పోరాటింపచేసేప్పుడు అంతఃపురకాంతల్ని కూడ వినోదం కోసం పిలిచేవాడు.

సుదేష్ణ మొదలైనవాళ్లతో వచ్చి నిన్ను చూస్తూండేదాన్ని. నువ్వు మల్లయుద్ధంలో కష్టపడుతున్నప్పుడు నేను పొందే దుఃఖాన్ని, నువ్వు బలాన్ని ప్రదర్శించి విజయం సాధించినప్పుడు నేను పొందే సంతోషాన్ని గమనించి అంతఃపురస్త్రీలు తమలో తాము ‘ఈ వలలుడిని సైరంధ్రి చూసే చూపుల తీరు చూస్తే మనసు కలిసినట్లు అనిపిస్తోంది. మన కొలువులోకి వీళ్లిద్దరూ ఒకేసారి రావడం జరిగింది. ఏమిటో ఆశ్చర్యంగా ఉంది’ అని ఒక్కొక్క విధంగా మాట్లాడుకుంటూ గుసగుసలాడుకుంటారు.

నా చూపులు మనస్సు నీ మీద లగ్నమై ఉన్నప్పుడు నిజంగానే ఒళ్లు మరిచి ఉండేదాన్ని. తెలివి తెచ్చుకుని ఒక్కోసారి వాళ్లవైపు చూడడంవల్ల వాళ్లు నన్ను గమనిస్తున్న విషయం తెలిసేది. నేను పొందిన అవమానభారానికి కోపంతో నువ్వు నిజంగా విజృంభిస్తే లోకులు మనల్ని ఇట్టే పోల్చుకోగలరు. కనుక నీకు అనువైన పద్ధతిలో మన రహస్యం బయటపడకుండా శత్రువుని చంపాలి” అని చెప్పింది.

తరువాత మళ్లీ ద్రౌపది “పరమేశ్వరుడే ఎదిరించినా అతడిని తన భుజబలంతో తనను మించినవాడు లేడనే గొప్ప కీర్తి, ఇంద్రుడి సగం గద్దె మీద కూర్చుండగలిగే అర్హత కలవాడు అనే గట్టి కీర్తి, యమలోకంలో ప్రవేశించిన జంతువునైనా ఏదో విధంగా రక్షించగలడనే పౌరుషపు కీర్తి; ఊర్వశి తనను కోరిన స్త్రీలోలుడు కాని ఉత్తమ కీర్తి; వరుసగా తన పరాక్రమానికి, వైభవానికి, మహిమకీ, నిర్మలమైన ప్రవర్తనకీ సాక్షులై శత్రువులచేత కూడా పొగడ్తలు పొందగలగడం ఒక్కడికి మాత్రమే చెల్లింది. ఆ ఒక్కడూ అర్జునుడు.

అతడితో సమానమైనవాడు మరొకడు లేడు. ఇది నిజం. అర్జునుడు భరతవంశానికే పేరు తెచ్చినవాడు, దేవేంద్రుడి కుమారుడు, పరాక్రమశాలి, అస్త్రశస్త్ర విద్యానిధి, పొగడదగిన ప్రవర్తన కలవాడు అయిన ఆ గొప్పవాడు ఇప్పుడు ఆపదలపాలయ్యాడు. అభిమానధనుడైన అర్జునుడు నాట్యరంగంలో నిలబడి రాజకుమార్తెలకి నాట్యం నేర్పవలసిన పరిస్థితి రావడం దయనీయంగా ఉంది.

దేవేంద్రుడి కుమారుడైన అర్జునుడు కడుపు నింపుకోడానికి ఇటువంటి నీచవృత్తికి పాల్పడడమా? విధి చేస్తున్న చేష్టలు చూశావా? ‘ఓ బ్రహ్మదేవా! ఇంద్రకుమారుణ్ని బలపరాక్రమశాలిని పేడివాడిగా చేసి ఆడిస్తున్న నీ చేష్టలు నిందించతగ్గవి’ అని భగవంతుణ్ని నిందిస్తాను. భరించలేని దుఃఖం నన్ను ఆవహిస్తోంది. ఈ కష్టాలు ఎప్పుడు గట్టెక్కుతాయో? అయినా చేసేదేముంది?

తన అందాన్ని ఎదుటపడి చూస్తే ఎవరికైనా తిరిగి చూడాలని అనిపించే అందగాడు తన ప్రవర్తన గురించి వింటే మహర్షులకి కూడా దాన్ని అనుసరించాలని అనిపించే ఆదర్శవంతుడు, యుద్ధంలో తన పరాక్రమాన్ని చూస్తే శత్రువులకి కూడా అనేకసార్లు కీర్తించాలని అనిపించే శూరుడు, తన విశేషాల గురించి వింటే కల్పవృక్షాలు కూడా తలలూపే దానశీలుడు నకులుడు. అతడు ఇతరుల సేవలో గుర్రాలకి శిక్షకుడుగా ఉండతగినవాడా? అతడి పరిస్థితికి నాకు కళ్లనీళ్లు వస్తుంటాయి.

తప్పించుకోలేని విధిని తలుచుకుని మనస్సులో బాధపడుతుంటాను. మాద్రి చిన్న కొడుకైన సహదేవుడు సామాన్యుడా? అతడి రూపం నిర్వికారం, బాహుబలం గర్వం లేనిది. పరాక్రమం దయరసంతో నిండినది. పెద్దలకి ఇష్టంలేని పనులు చేసి వివాదాలకి తావివ్వకుండా ఉండే వివేకం కలవాడు. అతడు వయసులో చిన్నవాడైనా గుణాలలో పెద్దవాడు. అతి కోమలంగా ఉండే సహదేవుడు ఆపుల కాపరిగా ఉంటూ అడవుల్లో తిరుగుతూ ఉంటే నాకే కాదు శత్రువులకి కూడా దుఃఖం కలుగుతుంది.

మనమందరం వనవాసానికి బయలుదేరినప్పుడు కుంతి నన్ను దగ్గరికి తీసుకుని ‘కోడలా! నిన్ను నమ్మి అతికష్టం మీద సహదేవుణ్ని మీతో వనవాసం చేయడానికి పంపడానికి ఒప్పుకుంటున్నాను’ అని కన్నీరు కారుస్తూ సహదేవుణ్ని నాకు అప్పగించింది. ‘ఈ సహదేవుడు చాలా చిన్నవాడు. అవును కాదు అని కూడా చెప్పలేనంత చిన్నవాడు. చాల సున్నితమైన స్వభావం కలవాడు. అకలిగ ఉన్న తెలుసుకోలేడు. నేను పిలిచి అన్నం పెట్టడమే గాని తనకు తాను అన్నం పెట్టమని అడగలేదు. అటువంటివాణ్ని అడవులకి వెడుతుంటే నా మనసు విలవిలలాడుతోంది’ అని నాకు చెప్పి, ‘ద్రౌపదీ! ఎక్కడైనా, ఎప్పుడైనా అన్నిటా ఎట్లా చూసుకోవాలో అట్లా చూసుకో. అలసి, సొలసి, కష్టపడి మర్చిపోడమనేది లేకుండా అతడి మనస్సు కనిపెట్టి కాపాడు. నా దీవెనలు నీకు ఎప్పుడూ ఉంటాయి’ అని చెప్పి నాకు అప్పగించింది. నేను అరణ్యవాసంలో మీ అందరి గారాబు తమ్ముడు సహదేవుడిని కంటికి రెప్పగ కాపాడాను. ఇప్పుడు అజ్ఞాతంగా ఉన్న సమయంలో అతడి శ్రమ పోగొట్టడం నాకు చేతకావడం లేదు. అందుకు చేసేదేమీ లేక బాధ పడుతున్నాను.

ఇక నా సంగతికి వస్తే ద్రుపదమహారాజు తన కొడుకులకంటే నన్నే ఎక్కువ గారాబంగా పెంచి పెద్ద చేస్తే గౌరవంగా పెరిగాను. కుంతీదేవి తన కోడళ్లందరికంటే నన్నే ఎక్కుగగా పొగిడితే అనందించాను. మీరు అయిదుగురు సమానంగా పంచిన ప్రేమానురాగాలతో మసిలాను. తల్లిదండ్రులకి బదులుగా లోకులందరు నన్ను భక్తితో సేవించేలా ప్రవర్తించాను.

రూపగుణ బలపరాక్రమాల్లో పేరు పొందిన కుమారులకి తల్లినయ్యాను. భరతవంశంలో నా కుటుంబమే గొప్ప కుటుంబంగా ఉండేలా ప్రకాశించాను. అందరితో న్యాయబద్ధంగా ఉండి బంధువుల పొగడ్తలు అందుకున్నాను. లోకంలో గొప్పదైన రాజసూయ యాగంలో బ్రాహ్మణులందరికి దక్షిణలిచ్చి సంతృప్తి పరిచి వాళ్ల ఆశీర్వాదాలతో ప్రశాంతమైన మనస్సుతో ఉన్నాను. ’పాండురాజు కోడలు పుణ్యవంతురాలు’ అని పెద్దవాళ్లందరూ పొగిడే విధంగా కీర్తిని పొందాను.

ఇవన్నీ మీరిచ్చిన ఆదరాభిమానాలవల్లే లభించాయి. నేను మానాభిమానాలు లేకుండా పొట్టకూటికోసం దీనంగా ఇలా సుదేష్ణదగ్గర పరిచారికగ చేరి ఆమె కనుసన్నల్లో ఉండి పరిచర్యలు చెయ్యడం మీకు ఏమాత్రం దుఃఖం కలిగించకపోతే నేనేం చెయ్యగలను? అది నా దురదృష్టం.

పట్టమహిషిగా వేలమంది పరిజనులతో సేవ చేయించుకోడమేగాని, ఒకళ్ల దగ్గర పని చెయ్యడం నాకు తెలియదు. అత్తగారు కుంతీదేవి కూడా నాకేదేనా పని చెప్పాలని అనిపిస్తే అజ్ఞాపిస్తున్నట్లు కాకుండా పని నేర్పడానికి చెప్పినట్టు పనులు చెప్పేవారు. సుదేష్ణ మొదలైన రాణులు ఇతరులు తీసిన గంధాన్ని ఇష్టపడరు. నేనే శ్రమపడి చెమటలు పట్టేలా అరగదీసి మెత్తటి చందనాన్ని మీ తల్లికి భక్తితో అద్దినట్లు వాళ్లకి అద్దుతున్నాను. ఈ స్థితిని కలిగించిన బ్రహ్మని లోపల నిందిస్తూ ఉంటాను.

నలుగుపిండిని మెత్తగ నూరి గంధంలా మైపూతలు పూసి వివిధ సుగంధ ద్రవ్యాల్ని మిశ్రమంగా కలిపి సిద్ధంగా ఉంచి రాణిగారి కనుసైగలతోనే పరిచర్యలు చేస్తున్నాను. అందమైన సుకుమారమైన నా అరచేతులు ఎలా కాయలు కాచాయో చూశావా?” అని ఏడుస్తూ భీముడి గుండెల మీద తలవాల్చి దుఃఖించింది. ఆమె బాధ చూసి భీముడు కూడా బాధపడ్డాడు. తనను తాను ఓదార్చుకుంటూ భీముడు ద్రౌపది కన్నీళ్లు తుడిచాడు. బాధపడుతున్న భీముణ్ని చూసి ద్రౌపది “దాయాదులు పన్నిన మాయజూదమనే వలలో చిక్కుకుని ధర్మరాజు జూదమాడి పణంగా ఓడిపోడం వల్ల ఇప్పుడు మనమందరం ఇన్ని రకాల కష్టాలు పడ్డాం. ధర్మరాజే మన వంశానికి వచ్చిన ఈ కష్టానికి కారణం.

భగవంతుడా! నేను అవమానించబడి కూడా చావకుండా ఆశతో ఇంకా బతికి ఉన్నాను. పూర్వజన్మలో ఎవరినో కష్టాలు పెట్టి ఉంటాను. అందుకే ఎప్పుడూ దుఃఖపడుతూనే ఉన్నాను. ఈ దుఃఖం నుంచి బయటపడి గట్టెక్కడం ఎలా సాధ్యపడుతుందో? మీరు ప్రాణాలతో ఉండగానే ఒక మూర్ఖుడి చేత సభలో అవమానపడ్డాను కదా! అయినా మీరు మాత్రం ఏం చేస్తారు. విధిని తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. సంసారులు ఆయా సమయాల్లో వచ్చే శుభాశుభాల్ని అనుభవించి తీరాల్సిందే. దాన్ని నివారించడం ఎవరికీ సాధ్యం కాదు.

కనుక, నేను మీ గౌరవాన్ని, గొప్పతనాన్ని మనసులో కోరుకుంటూ ఆపదల్ని ఎలాగైనా ఓర్చుకుంటాను. అంతవరకు ఫరవాలేదు. ఆ పొగరబోతు కీచకుడు చిన్న చిన్న ప్రయత్నాలతో ఆగక విజృంభించి నన్ను పట్టుకోవడంతో భయపడి పోతున్నాను. భీమసేనా! నువ్వు ఆ కీచకుణ్ని చంపకపోతే నేను నీ ఎదురుగానే ప్రాణత్యాగం చేస్తాను. ఉరి వేసుకునిగాని, నీళ్లలో దూకిగాని, అగ్నిలో పడిగాని, విషం తినిగాని శరీరం విడిచిపెడతాను. నీ మీద ఒట్టు” అంది ద్రౌపది.

Exit mobile version