[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]
పాండవుల్ని వెతికిన దుర్యోధనుడి వేగులు
దుర్మార్గుడైన దుర్యోధనుడు పాండవుల అజ్ఞాతవాసం భంగం చెయ్యాలని దూతల్ని పంపించాడు. దూతలు ప్రపంచమంతా చుట్టి హస్తినాపురానికి తిరిగి వచ్చారు. దుర్యోధనుడి మందిర సింహద్వార ప్రాంతం శోభయమానంగా ఉంది. గొప్ప రాజవైభవంతో ఒప్పారుతున్న రాజమందిర ప్రాంగణానికి తగిన విధంగా వచ్చారు వేగులు. ద్రోణాచార్యుడు, భీష్ముడు, కృపాచార్యుడు, కర్ణుడు, సుశర్మ, దుశ్శాసనుడు మొదలైన కౌరవ సోదరులు, సేనాపతులు, పెద్దలందరు సేవిస్తుండగా ఉన్నతాసనం మీద కూర్చున్నాడు దుర్యోధనుడు. చిరునవ్వుతో చంద్రుడివంటి ముఖంతో ప్రకాశిస్తున్నవాడిని, నాగేంద్రుడి గుర్తు గల కేతనం కలవాడిని దుర్యోధనుణ్ని దూతలు చేతులు జోడించి నుదుటి దగ్గర ఉంచి నమస్కరించారు.
తరువాత తమ సంచార విశేషాలన్నీ వినయభావంతో దుర్యోధనుడికి వినిపించారు. “దేవరవారి ఆదేశంతో పాండవులు అయిదుగురు ద్రౌపదితో కలిసి వెళ్లిన కారడవుల్ని తెలుసుకుని ముందుగా వాటిలో వెదకడానికి వేగంగా వెళ్లాము. కనబడిన పొదరిళ్లన్నీ చూశాము. పల్లపు ప్రంతాల్లో దిగి చూశాము. చెట్టు చెట్టుకీ తిరిగి ఎక్కి చూశాము. వెళ్లడానికి వీలు లేని ప్రదేశాల్లోకి వెళ్లి చూశాము. నీటి దొరువులన్నీ గాలించాము. ఇటువంటి ప్రదేశాలెన్నో తిరిగి వెతికాము.
సారథులతో మాత్రమే పోతున్న రథాల్ని చూశాము. వాటిని వెంబడిస్తూ దగ్గరకి పోకుండా ఎటువైపు వెడుతున్నాయో రహస్యంగా అనుసరించాము. ఆ రథాలు ద్వారకా నగరానికి చేరాయి. ద్వారకలో ఉంటారనే ఆశతో ద్వారక మొత్తం గాలించి పాండవుల్ని మాత్రం చూడలేకపోయాము. మేము విడివిడిగా కూడా అనేక దేశాల్లో తిరిగి అలుపు లేకుండా ఉపాయాలు ఆలోచిస్తూ ఆలస్యం చెయ్యకుండా రహస్యంగా వెతుకుతూ కష్టనష్టాలు ఎదురైనా సోమరితనం వదిలిపెట్టి అనేక స్థలాల్లో అనేక విధాలుగా పాండవుల్ని వెతికాము.
పాండవుల్ని ఎక్కడా గుర్తించలేక తిరిగి సంకేత స్థలానికి వచ్చాము. మేము వెతికిన విధానాన్ని బట్టి పాండవులు బ్రతికి ఉంటే కనిపించేవారు కనుక మరణించి ఉంటారని అనిపిస్తోంది. మేము చెప్పిన దాంట్లో నిజం ఉంది. ఒక ప్రియమైన విశేషం విని సంతోషంగా వచ్చాము. అదేమిటంటే కౌరవరాజా! మత్స్యదేశపు రాజు విరటుడి బావమరిది కీచకుణ్ని పవిత్రమూర్తి అయిన ఒక అందాలరాశి కారణంగా అర్ధరాత్రి వేళ రహస్య పద్ధతిలో ఆశ్చర్యకరంగా చంపారు. ఆయుధాలు లేకుండా చేసిన ఆ యుద్ధంలో తల, చేతులు, కాళ్లు డొక్కలోకి చొప్పించి పీనుగుని ముద్దలా చేసేశారు. దుర్మార్గులైన కీచకుడి తమ్ముళ్లని కూడా వదలకుండా క్రమ్ముకుని ఒక్కళ్లు కూడా మిగలకుండా వింత చావులు చచ్చేట్లు చేశారు.
ఎలా చంపారో తెలుసుకోడానికి వీలు లేకుండ చంపి ఎవరికీ దొరకకుండా గంధర్వులు వెళ్లిపోయారు. విరాటుడు మీకు శత్రువు కనుక మీకు తెలియచెయ్యాలని అనుకున్నాము. పాండవుల్ని వెతకడానికి మరేదేనా ఉపాయం ఉంటే ఆజ్ఞాపించండి!” అని చెప్పారు. వేగులు చెప్పింది విని దుర్యోధనుడు “ఇప్పటికి మీరు వెళ్లండి!” అని చెప్పి వాళ్లని పంపించేశాడు.
కొంతసేపు ఆలోచించి తన మంత్రులతో “పాండవులు తాము చేసిన ప్రతిజ్ఞ ప్రకారం అజ్ఞాతవాసం ముగించుకుని వచ్చి రాజ్యం కోసం అడగకముందే వాళ్లని వెతికి పట్టుకుని పూర్వంలా అరణ్య అజ్ఞాతవాస కష్టాలు అనుభవించేలా చెయ్యాలి. పాండవుల గురించి తెలిసికోవడం చాలా అసాధ్యం. వాళ్లని ఎలా వెతికి పట్టుకోగలమో మీరందరు మీకు తెలిసిన ఉపాయాలు నాకు తెలియచెయ్యండి” అన్నాడు.
దుర్యోధనుడు చెప్పింది విని కర్ణుడు “ఇతరులు ఎవరూ గుర్తించలేని వేషాలు వేసుకుని నేర్పుగా పాండవుల్ని గుర్తించగల వేలమంది దూతల్ని దేశం నలుమూలలకి పంపితే నేడో రేపో వాళ్లని గుర్తించలేరా?” అన్నాడు. కర్ణుడు చెప్పిన మాటలు ఏ మాత్రం లెక్కచేయకుండా నిర్లక్ష్య భావంతో అన్నగారి ముఖం వైపు చూసి దుశ్శాసనుడు అహంకారంతో “అసలు పాండవుల్ని వెతకాల్సిన పనిలేదు. వాళ్లు విశ్రాంతి లేకుండా తిరిగి తిరిగి బలం తగ్గి క్రూరమృగాల బారిన పడి చచ్చి ఉంటారు. వాళ్లు చచ్చిన చోట ఇప్పటికి గడ్డి కూడా మొలిచి ఉంటుంది. కనుక, ఇంక స్వేచ్ఛగా, ఆనందంగా రాజ్య సంపదల్ని అనుభవించు” అన్నాడు.
దుశ్శాసనుడు అహంకారంతో చెప్పిన మాటలు విని ద్రోణుడు చిరునవ్వుతో “పాండవులు క్షత్రియులకి ఉండవలసిన గుణాలన్నీ ఉన్నవాళ్లు; పెద్దలతో కీర్తింపబడేంత గొప్పవాళ్లు; నోరారా పొగడతగిన సోదరప్రేమ కలవాళ్లు; గొప్పదైన దైవబలంతో ప్రకాశించే పుణ్యాత్ములు; దేవతలతో కలిసి మెలిసి తిరిగేవాళ్లు; వాళ్లకా ఆపదలు కలిగేది? ఇది అసంభవం. మీకు చేతనైతే ఇప్పటికైనా ఈ లోకంలో వాళ్లున్న చోటుని వెతికేందుకు మీ నేర్పుతో ఉపాయాలు ఆలోచించి చెప్పండి” అన్నాడు.
దుర్యోధనుడికి ధర్మరాజు సుగుణాలు చెప్పిన భీష్ముడు
ద్రోణుడి మాటలు గౌరవిస్తూ భీష్ముడు “ఆహా! రాజు ముందు ద్రోణుడు ఒక్కడే చాలా స్పష్టంగా నిజం చెప్పాడు. పాండవులు బాహుబలం, బుద్ధిబలం, దైవబలం కలిగినవాళ్లు. అటువంటి మహాత్ములకి ఆపదలు ఎక్కడినుంచి, ఎందుకు, ఎలా వస్తాయి? వాళ్లు మహానుభావులు కనుక వాళ్లని గుర్తించడం అసాధ్యమే అవుతుంది. పాండవులు, కౌరవులు నాకు సమానమే. కాని, చేయవలసిన పని గురించి నన్ను అడిగాడు కనుక నాకు తెలిసిన నిజాన్ని తెలియచెప్పాలి. నా మాటలు మంచిని కలిగించేవిగా అనుకుని తప్పకుండా ఆచరిస్తానంటే చెప్తాను. ధర్మరాజు ఎప్పటికీ నశించిపోని ధర్మాలు సాధించిన మహానుభావుడు.
అతడు ఏ దేశంలో ఉంటాడో ఆ దేశపు ప్రజలు పుణ్యకార్యాలు చేస్తూనే ఉంటారు. వాళ్లు బ్రాహ్మణులంటే భక్తి, ఇతరులకి సేవ చేసే శక్తీ, నిష్కల్మషమైన బుద్ధి, నీతి వర్తనంలో అనురక్తి, నిజం మాట్లాడడం, మంచివాళ్లని గౌరవించడం, చాలా కాలం నిలిచేలా దానాలు చెయ్యడం, సేవించతగిన గుణము, మంచి నడవడికని కాపాడడం, దుష్టుల్ని శిక్షించడం, న్యాయమైన దారిలో ప్రగతిని సాధించడం, అంతులేని దయ, బంధుజనుల మీద అభిమానం, శుభకరమైన ఐశ్వర్యం, శాస్త్రవిజ్ఞానం, ఇంద్రియనిగ్రహం వదలకపోవడం, మంచివాళ్లు మెచ్చుకునే మంచితనం, న్యాయంగా ఆర్జించిన ధనధన్యాలు కలిగి ఉంటారు.
మరొక విశేషం చెప్తాను విను. ధర్మరాజు ఉన్నచోట గోసంపద ఎప్పుడూ అభివృద్ధి చెందుతుంటాయి. ఆవుల పొదుగుల నుంచి పాలు ధారలుగా కారతాయి. ఎప్పుడూ పాడి తరగకుండా ఉంటుంది. కాబట్టి, ప్రస్తుతం అటువంటి లక్షణాలు ఉన్న దేశమేదో గుర్తించి, అందులో పాండవుల్ని గుర్తించాలి” అని భీష్ముడు చెప్పాడు.
తరువాత కృపాచార్యుడు “ప్రస్తుత కర్తవ్యం పాండవుల్ని వెతికించే పద్ధతుల్ని పరిశీలించడం. ఆలస్యం లేకుండ ఆ పని జరగాలి. చాలా రకాలుగా వెతికిస్తే తప్పకుండా దొరుకుతారు. ఆ సంగతి అలా ఉంచుదాం. పాండవులు మాట ప్రకారం వనవాసం చేశారు. అజ్ఞాతవాస సంవత్సరం కూడా దాదాపుగా అయిపోయింది. ఆ మహావీరులకి రాజు మీద కోపం బాగా ఉంది. కనుక, మీరు ఊరుకోడం భావ్యం కాదు. శత్రువు అల్పుడైనా అతడి పట్ల జాగ్రత్త వహించాలని అంటారు. పాండవులు గర్వంతో కూడిన భుజబలం కలవాళ్లు. మనం మన సంపదల్ని నమ్ముకుని ఉపేక్షించడం మంచిదికాదు.
మన సైన్యాన్ని విరోధులకి లొంగకుండా ఉండేలా సిద్ధం చేసి, సహాయంగా వచ్చే సైన్యాలకి క్రమక్రమంగా తగిన విధంగా చెప్పి వాళ్లు వచ్చేటట్లుగా వర్తమానం పంపించి విస్తారమైన సైన్య సమీకరణ చేసి, అప్రమత్తంగా ఉండడమే కురురాజు చెయ్యవలసిన పని. పాండవులు చేసిన ప్రతిజ్ఞని అనుసరించి నడుచుకుని గడువుని పూర్తి చేసుకున్న తరువాత యుద్ధానికి సిద్ధం కాకుండా ధర్మరాజుతో దుర్యోధనుడు శాంతితో సంధి చేసుకోవడం మంచిది. పాండవులు సంధి కాదని పట్టుదలతో ఒంటికాలిమీద లేవాలని చూస్తే అప్పటికి మనకి ఏ పద్ధతి మంచిదని తోస్తే ఆ పద్ధతిని అనుసరించాలి.
అది అలా ఉంచి పాండవులు లేరనే అనుకుందాం.. అప్పుడు శత్రురాజుల్ని తగిన విధంగా వశం చేసుకోవాలన్నా మనకి అపర బలసంపద ఉందని లోకానికి చాటవలసిన అవసరం ఉంది. ఇది అందరు ఆమోదించవలసిన విషయమని అనుకుంటున్నాను” అన్నాడు. సభలో ఉన్నవాళ్లు ఎవరికి తోచిన పద్ధతుల్ని వాళ్లు చెప్పారు. దుర్యోధనుడు అందరు చెప్పినవి విన్నాడు.
బాగా ఆలోచించి చెయ్యవలసి కార్యాన్ని సభలో వాళ్లందరు వింటుండగా చెప్పాడు. “కీచకుడు, భీమసేనుడు, శల్యుడు, బలరాముడు నలుగురూ సమానమైన బలం కలవాళ్లు. ఒకళ్లనొకళ్లు జయించుకోవాలన్న ఉత్సాహంతో ఉండే గర్విష్టులు, మల్లయుద్ధంలో ఇష్టం ఉన్నవాళ్లు. ఈ నలుగురి భుజబలాలతో సరిసమానమైన భుజబలం మరెవ్వరికీ లేదు. కాబట్టి ఈ నలుగురిలోనే ఒకళ్లమీద ఒకళ్లకి గెలవడం సాధ్యమవుతుంది. శల్యుడు, బలరాముడు సింహబలుడికి చాలా దూరంలో ఉన్నారు. భీమసేనుడు ఒక్కడే అవసరం వస్తే సింహబలుడి బలాన్ని అణచగలిగినవాడు. అతడు విరటుడి పట్టణంలో ఉండి ఉంటాడు. ఆ ఇల్లాలు ద్రౌపది అయి ఉంటుంది. భీముడు తప్ప యుద్ధంలో కీచకులందరినీ ఒక్కసారిగా మట్టుబెట్టలేడన్న సంగతి మీకూ తెలుసు.
భీముడే గంధర్వుల నెపంతో చిమ్మ చీకట్లో రహస్య పద్ధతిలో గర్వంతో కళ్లు మూసుకుపోయిన కీచకుణ్ని అతడి బంధువులతో సహా చంపి ఉంటాడు. అతడికి తప్ప ఈ పని చెయ్యడం ఎవరికీ సాధ్యం కాదు. తాతగారు భీష్ముడు చెప్పిన గుర్తులు అన్నీ విరటుడి దేశంలో ఉన్నాయని వింటున్నాము. మారు వేషాల్లో పాండవులు విరటుడి దేశంలో నివసిస్తున్నారేమో.
విరాటుడు మనకి విరోధిలా నడుచుకుంటూ మనల్ని ధిక్కరిస్తూ ఉంటాడు. కనుక, అతడి మీదకి దండెత్తి వెళ్లి అతడి గో సంపదని గ్రహిస్తే ధర్మరాజు అతడి తమ్ముళ్లూ మనల్ని అడ్డగించడానికి వస్తారు. అప్పుడు వారి అజ్ఞాతవాసం భంగమయి పోయిందని చెప్పి పాండవుల్ని మరో పన్నెండేళ్లు వనవాసం చెయ్యడానికి పంపుదాము. అలా చేసి ఈ భూవలయాన్ని మొత్తం ఆక్రమించుకుని అపార కీర్తిని పొందుదాము. వాళ్లు అక్కడ లేకపోతే విరాటుడి సంపద మొత్తాన్ని కొల్లగొడదాము.
అది కూడా మనకి లాభమే. అన్ని విధాలుగా ఆలోచించి చూస్తే మనమిప్పుడు చేయగలిగిన పని ఇదే. మీరందరు అంగీకరిస్తే దీనికి తగినట్లు ప్రయత్నం చేయండి.” అని దుర్యోధనుడు చెప్పగానే త్రిగర్తదేశానికి అధిపతి అయిన సుశర్మ లేచి కర్ణ దుశ్శాసనులతో ముందుగా మాట్లాడి వాళ్ల అనుమతి పొంది దుర్యోధనుడితో ఇలా చెప్పాడు. “కేకయ, సాళ్వుల సహాయంతో కీచకుడు యుద్ధంలో నన్ను ఓడించాడు. కాని, అతడు చచ్చేలోగా ఒక్కసారి కూడా అతడితో యుద్ధం చేసే అవకాశం నాకు కలగలేదు. ఓటమితో కుంగిపోతున్న నన్ను విరాటుడి మీదకి పంపు. విరాటదేశానికి దగ్గరలో నా రాజ్యపు పొలిమేరలలో ఉండే వాళ్లకి ఇచ్చిన జీతాల గ్రామాలున్నాయి. విరాటుడు ఆ ఊళ్లపైన పడి పీడిస్తూ ఉంటాడు.
ఇప్పుడు అతడిని మట్టుబెట్టే సమయం వచ్చింది. నేను విరాటనగరాన్ని ముట్టడిస్తాను. ఆ రాజ్యంలో ఉన్న సప్తాంగాల్ని (స్వామి, అమాత్యుడు, మిత్రుడు, కోశం, రాష్ట్రం, దుర్గం, సైన్యం అనే ఏడు అంగాలతో ఉండే రాజ్యం) కొల్లగొట్టి తీసుకుని వస్తాను. అతడి గర్వాన్ని అణిచి తిరిగి వస్తాను. వెంటనే గోవుల్ని నిశ్శేషంగా మరలించి తెస్తాను. విరటుడు వెనకాల వచ్చి అడ్డుపడితే పాండవుల్ని గుర్తిస్తాను. దీనికి నేనే తగినవాడిని” అన్నాడు.
సుశర్మ మాటలు విని కర్ణుడు “త్రిగర్తరాజు ఇలా ధైర్యంగా చెప్పడం సముచితంగానే ఉంది. రాజు ఎలా ఆజ్ఞాపిస్తే, పెద్దలు ఎలా అంటే అలా చెయ్యడమే చివరికి కర్తవ్యం అవుతుంది” అన్నాడు.
కర్ణుడి మాటలు విని దుర్యోధనుడు అందరిని కలయచూశాడు. తరువాత దుశ్శాసనుడితో “పెద్దలందరు నీకు అనుమతి ఇచ్చారు. చతురంగ బలాల్ని సిద్ధం చేసి రెండు విధాలుగా నడపాలి. ఈ త్రిగర్తదేశపు సైన్యాలు ముందుగా బయలుదేరిపోవాలి. మరునాడు మనం మన సైన్యాలతో వెడదాము” అన్నాడు.
దుర్యోధనుడు చెప్పినది విని దుశ్శాసనుడు రెండు చేతులు జోడించి నుదుటిమీద పెట్టుకుని “అలాగే చేస్తాను” అన్నాడు. తరువాత దుర్యోధనుడు తను తీసుకున్న నిర్ణయం అందరికీ తెలియాలని చేయవలసిన కార్యక్రమం అందరికీ స్పష్టంగా తెలియాలని అనుకున్నాడు. తన చుట్టూ ఉన్న ప్రముఖులందరినీ గొప్ప ఆదరగౌరవాలతో చూస్తూ ఇలా అన్నాడు. “ముందుగా సుశర్మ తన బలంతో వెళ్లి గోవుల్ని పట్టుకుంటే విరాటుడు తన సైన్యమంతటినీ తీసుకుని తన బలపరాక్రమాలు ప్రకటించాలని వెంటనే యుద్ధానికి వస్తాడు. అప్పుడు మన కౌరవులు ఇక్కడ కొన్ని గోవుల్ని ముట్టడిస్తే పాండవులే యుద్ధానికి తరలి వస్తారు.
దాడికి దిగిన త్రిగర్త సేనలు సంకేతస్థలంలో గుమికూడుతాయి. మీరందరు వేరొకచోట యుద్ధానికి సిద్ధంగా సేనలను సమీకరించండి. అందరు ఎవరి సైన్యాల్ని వాళ్లు వెంటబెట్టుకుని వేగంగా వార్తలందే సమయానికి ముందే అక్కడికి చేరి గోధనాన్ని మహా భయంకరంగా చుట్టుముట్టాలి” అని చెప్పి సుశర్మవైపు చూశాడు.
కొంచెంసేపు ఆగి “ఈ కృష్ణపక్షంలో అష్టమిరోజు సుశర్మ సన్నాహంతో గోవుల్ని పట్టుకుంటాడు. మనం నవమి రోజు పట్టుకుందాం” అని దుర్యోధనుడు నిర్ణయించాడు. ఆ మాటలకి ఉప్పొంగి పోయి అందరూ యుద్ధానికి సిద్ధమయ్యారు.
