Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మహాభారత కథలు-137: దక్షిణ గోగ్రహణం – విరాటమహారాజుతో యుద్ధానికి సుశర్మ

[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]

దక్షిణ గోగ్రహణం – విరాటమహారాజుతో యుద్ధానికి సుశర్మ

అప్పటికి పాండవులూ, ద్రౌపదీ తమని ఇతరులు గుర్తించకుండా జరిపే అజ్ఞాతవాసమనే గడ్డుకాలం పూర్తికావచ్చింది. ఆ విషయాన్ని ఎవరూ ఆలోచించలేదు. సుశర్మ దుర్యోధనమహారాజు చెప్పిన పని చేయడానికి సిద్ధమయ్యాడు. రెండు వైపుల పదునుగల కత్తిని, పరాక్రమ ప్రశంసని తెలియచేసే సూచికలైన పతాకాలు మొదలైన పరికరాలతో ఆశ్చర్యం కలిగించేలా శత్రుదేశాన్ని ఒక్కసారే మింగేద్దామన్నట్లు ముందుకి దూకుతున్న తన సైన్యాన్ని అదుపులో పెడుతూ, ఆవుల దర్శనం తల్చుకుంటూ వెనకడుగు వేయకుండా వడివడిగా ప్రయాణాలు సాగిస్తున్నా ప్రజలకి అలజడి కలగనీయకుండా, విశ్రాంతికోసం విడిది చేసే ప్రదేశాల్లో డప్పులూ, డమరుకాలు మొదలైన చర్మవాద్యాల ధ్వనుల ఆర్భాటాలవల్ల దాడి గుర్తులు బయటపడకుండా జాగ్రత్తపడుతూ, మెరుపుదాడి పద్ధతిలో వెళ్లి వేగుల వల్ల విరాటుడి గోవులుండే చోటు తెలుసుకుని త్వరగా పశువుల్ని చేరుకుని అగ్ని విజృంభించినట్టు విజృంభించి తోలాడు.

ఆ గోవుల కాపరులందరు సైనికుల్లా దర్పంగా వాళ్లని ఎదుర్కున్నారు. తమ దగ్గరున్న బాణాల్ని అతి భయంకరంగా ప్రయోగిస్తూ వెనక్కి తిరిగి వెళ్లిపోకుండా నిలబడి యుద్ధం చేశారు. త్రిగర్తరాజు సైగతో గుర్రాలమీద ఉన్న సైనికులు పశువుల కాపరుల్ని తునాతునకలు చేశారు. ఎంత తెగించి పోరాడినా వాళ్ల శరీరాల మీద నుంచి రక్తం ధారలుగా కారుతూ ఒళ్లంతా గాయాలయ్యాయి. వాళ్లు ఆ గాయాలతో పరుగెత్తుతూ మత్స్యరాజు సభకి చేరుకుని వినయంతో వంగి దండాలు పెడుతూ నిలబడ్డారు. వాళ్లని చూసి విరాటరాజు ఆశ్చర్యపడుతూ వాళ్లకి అంత దురవస్థ కలగడానికి కారణం చెప్పమన్నాడు .

గోపాలురు సన్నని గొంతుతో సభలో ఉన్నవాళ్లందరు వినేలా “గుర్రాలతో, రథాలతో, ఏనుగులతో కలిసిన సేనతో సుశర్మ బలాలు అంతులేని సంఖ్యలో వచ్చి వేగంగా మీదకురికాయి.

గోపాలురందరు ఎదురుదాడి చేశారు. త్రిగర్తులు వాళ్ల మీద అస్త్రశస్త్రాలు అనేకం ప్రయోగించి చంపేశారు. తరువాత గోవుల్ని తీసుకుని వాటి వెనక వేగంగా వెళ్లిపోతున్నారు. వాళ్లని అడ్డుకునే ధైర్యం మనకుంటే వాళ్లు ఊరి పొలిమేరలు దాటకమునుపే అడ్డుకోవాలి” అని చెప్పారు.

వాళ్లు చెప్పింది విని విరాటుడు “మీరు చెప్తున్నది నిజమేనా? త్రిగర్తరాజు పూర్వం మన చేతిలో తిన్న దెబ్బలు మర్చిపోయాడా?” అని మనసులో కోపాన్ని అణుచుకోలేక మంత్రులవైపు చూశాడు.

సుశర్మ మీద యుద్ధానికి బయలుదేరబోయిన విరటుడు

విరాటుడు మంత్రులతో “మనమిప్పుడే ఆ సేనల్ని వెంబడించకపోతే మన పశువుల మందలు మనకి దక్కవు. చివరికి అవమానం, ఆపద కూడా కలగవచ్చు. మన సేనాపతుల్ని వెంటనే పిలిపించండి. తగిన పద్ధతుల్లో వీరులతో ఉండే సైన్యాన్ని మోహరించి, భూభాగ దద్దరిల్లేట్లు యుద్ధానికి సిద్ధమయ్యేలా ఆజ్ఞాపించండి” అన్నాడు.

ప్రయాణ సూచనగా తూర్యారావాలు దిక్కులు పిక్కటిల్లేలా మోగాయి. విరాటుడు యుద్ధానికి అవసరమయిన ప్రయాత్నాలు చేసుకుంటూ యోధులకి అవసరమయిన శస్త్రాస్త్రాల్ని, కవచాల్ని తీసుకుని రావడంలో నేర్పరులైన వాళ్లని ఆ పనులమీద వెంటనే పంపించాడు. రథసారథితో “నువ్వు త్వరగా వెళ్లి గుర్రాలకి కవచాలంకారాలు గట్టిగా తొడిగి వాటిని రథానికి కట్టి రథాన్ని సిద్ధం చెయ్యి. నువ్వెప్పుడూ పౌరుషాలు చెప్తుంటావు. ఇదిగో ఇప్పుడు యుద్ధం వచ్చింది. నీ ప్రతాపం చూపించే సమయం వచ్చింది” అన్నాడు. విరాటుడు అందర్నీ అజ్ఞాపించి తను కూడా యుద్ధానికి ఉచితమైన విధంగా అలంకారం చేసుకున్నాడు.

బంగారు చుక్కలు చెక్కిన కవచాన్ని ధరించాడు. అలంకరించిన రథం సిద్ధం చెయ్యబడింది. గుర్రాలు కట్టబడ్డాయి. రథసారథి రథంతో సిద్ధంగా ఉన్నాడు. యుద్ధానికి అవసరమైన వివిధ ఆయుధాలు సమకూర్చారు. విరాటుడు రథాన్ని ఎక్కాడు. పశుపాలకుల్ని అడిగి తెలుసుకుంటూ గోగ్రహణం జరిగిన ప్రదేశాన్ని అడిగి తెలుసుకుంటూ ప్రయాణమయ్యాడు.

అప్పుడు అతడి తమ్ముడు ప్రపంచమంతా పొగడ్తలందుకుంటున్న కత్తితో శత్రుసేనల్ని చీల్చి చెండాడగల భుజబల సంపదతో, చతురంగ బలాలతో, సాటిలేని మేటి సేనలతో, సాటిలేని మేటి సేనకి అలంకారంగా కనిపించే ఎత్తైన జెండాలతో, ఆకర్షణీయంగా కనబడే యుద్ధ ప్రయత్నాల శోభతో సేనలన్నీ ఉప్పొంగుతుండగా శతానీకుడు యుద్ధగర్వంతో రంగప్రవేశం చేశాడు.

శతానీకుడి తమ్ముడు మదిరాశ్వుడు. అతడికి అంతులేని గజసేన ఉంది. ఆ గజబలం చెవులాడిస్తూ నడుస్తూ ఉంటే కలిగే శబ్దాలతో పాటు రేగిన దుమ్ము ఆకాశాన్ని బూడిదరంగుకి మార్చేసింది. అంత గొప్ప గజబలం వెంట వస్తుండగా తన బంగారు కవచంనుంచి ప్రసరిస్తున్న కాంతి కిరణాల గుంపులు పడి కత్తులు పసిడి కాంతులు ప్రసరించేలా చేస్తున్నాయి. సైనికులతో కలిసి మదిరాశ్వుడు యుద్ధం చెయ్యడానికి వచ్చాడు.

మదిరాశ్వుడి తమ్ముడు సూర్యదత్తుడు. గొప్ప అస్త్రశస్త్రాల్ని ధరించిన సైనికులు వెంటరాగా త్వరత్వరగా అట్టహాసంగా యుద్ధరంగానికి వచ్చాడు. విరాటుడి కొడుకు శంఖుడు తెల్లటి కవచం ధరించి భయంకరంగా నినాదం చేస్తూ అడవి జంతువులు కొలుస్తుంటే వచ్చే మృగరాజు సింహంలా ఠీవిగా శత్రువుల్ని హతమార్చగల శౌర్యంతో ప్రకాశిస్తూ వచ్చాడు.   అనేకమంది యుద్ధ వీరులు అనేక వాహనాలమీద యుద్ధానికి తగిన సన్నాహాలతో వస్తున్నారు. విరాటుడు సేనల్ని కూర్చుకోడానికి ఊరి బయట కొంతసేపు నిలబడ్డాడు.

ఆ సమయంలో ధర్మరాజు, భీముడు, నకుల సహదేవుల్ని అక్కడక్కడ ఆగమని సమాచారం పంపించి తను కూడా విరాటుడి దగ్గరికి వెళ్లాడు. “రాజా! ఒకానొక ఋషి వల్ల శస్త్రాస్త్ర ఆయుధప్రయోగాల్ని మంత్ర సహితంగా నేర్చుకున్నాను. యుద్ధానికి సమర్థత కలిగినవాడిని. నువ్వు బంధువులతో కలిసి ఆలమందల్ని తెచ్చుకోడానికి వెడుతుంటే నేను ఇక్కడే ఉండిపోవడం భావ్యం కాదు. కనుక నాకు కూడా ఒక రథాన్ని సిద్ధం చేయించు” అన్నాడు. అందుకు అంగీకరించిన రాజుతో తనతోపాటు భీమ నకుల సహదేవుల్ని కూడా వెంటబెట్టుకుని వెళ్లాలని అనుకున్నాడు.

“రాజా! మన వలలుడు బలంలోను, పరాక్రమంలోను మహావీరుడని పేరు తెచ్చుకున్నాడు. మహావీరుడైన తామగ్రంథి యుద్ధాన్ని ఆటలాగా ఆనందించగల నేర్పు కలవాడు. తంత్రీపాలుడు శత్రుసంహారం చెయ్యగల నేర్పు, భుజబలం కలవాడు. ఇదివరకు వాళ్లు ముగ్గురు ప్రదర్శించిన బలపరాక్రమాలు నేను చూసాను. వాళ్లకి తగిన రథాల్ని ఇచ్చి వాళ్లని కూడా తీసుకుని వెళ్లడం మంచిదని నాకనిపిస్తోంది” అన్నాడు.

కంకుడు విరాటుడి సంతోషం నిండిన ముఖంతో శతానీకుడితో  “కంకుడు, వలలుడు, తామగ్రంధి, తంత్రీపాలుడు నలుగురుకి తగిన రథాల్ని ఎంపిక చేసి సిద్ధం చేయించండి. వేగము, శక్తీ కలిగిన మేలుజాతి గుర్రాల్ని ఆ రథాలకి కట్టించండి. యుద్ధానికి తగిన ధనస్సుల్ని, చీల్చడానికి వీలుకాని గట్టి కవచాల్ని వాళ్లకి  ఇవ్వండి. యుద్ధక్రీడలో తగిన విధంగా నా కోరిక నెరవేర్చగల శక్తి, భుజబలము వీళ్లకుంది” అన్నాడు.

వాళ్లకి అవసరమైనవన్నీ శతానీకుడు అమర్చాడు. వాళ్లు నలుగురూ రథసారథి పనులు కూడా తామే చేసుకుంటూ బయలుదేరారు. విరాటరాజు తన సేనని చూసుకుని ఉత్సాహంతో, ధైర్యంతో ఆవులమందలు వెళ్లిన మార్గంలో తన సైన్యాన్ని నడిపించాడు. విరాటుడి సైన్యం సుశర్మ సైన్యం ఒకళ్లనొకళ్లు ఎదుర్కున్నారు. రెండు సముద్రాలు ఒకదానితో ఒకటి ఘర్షణ పడినట్టుగా ఉంది.

విరాట సుశర్మల సైన్యం చేసిన యుద్ధం

రెండు సైన్యాల మధ్య భీకరమైన యుద్ధం నడుస్తోంది (యుద్ధాన్ని వర్ణించలేదు). ఒకళ్లతో ఒకళ్లు వెనుకాడకుండా పోరు సాగిస్తున్నారు. విరాటుడి తమ్ముడు శతానీకుడు భయంకరమైన అనేక శస్త్రాలు ప్రయోగించి సాటిలేని పరాక్రమంతో రథికులతో, సారథులతో, గుర్రాలతో ఉన్న నూరు రథాల్ని క్షణకాలంలో  పొడి పొడి చేశాడు.

మదిరాశ్వుడు తన అన్న శతానీకుడిని మించి ధనుర్విద్యని ప్రదర్శించి వేగంగా నాలుగు వందల రథాల్ని నుగ్గు నుగ్గు చేశాడు. తన ప్రతాపంతో ఆకాశంలో దేవతలు మెచ్చుకునేట్లు ఏనుగులు, గుర్రాలు, పదాతి సమూహల్ని చెదరగొట్టాడు. అదే సమయంలో సూరదత్తుడు రథాన్ని మండలచారిగా (గుండ్రంగా) తిప్పుతూ మదపుటేనుగుల సైన్యాన్ని ఎదుర్కున్నాడు.

విరాటుడి కొడుకు శంఖుడు పెళ్లికి వెడుతున్నట్టు వెలిగిపోతున్న ముఖంతో శత్రువుల కళ్లు మిరుమిట్లు గొలిపేలా తన రథాన్ని ఆకాశమార్గంలో తిప్పుతూ యుద్ధరంగంలో భయంకరంగా యుద్ధం చేశాడు. వీళ్ల ధాటికి తట్టుకోలేక సుశర్మ సైన్యం తికమకపడింది. మిగిలిన సామంతులు కూడా విజృంభించి యుద్ధం చెయ్యడం మొదలుపెట్టారు.

విరాటుడు తనతమ్ముళ్లు, కుమారుడు, మంత్రులు, సుశుక్షితులైన సైనికులు, ఆప్తులు చేస్తున్న యుద్ధాన్ని చూసి మనస్సులో సంతోషపడుతూ, ఉత్సహంతో వంగి సారథివైపు చూసి “ఆ మహాసైన్యానికి మధ్యలో వెలుగుతున్న సుశర్మ రథ జెండా చూశావుగా? మన రథాన్ని అక్కడికి పోనియ్యి” అన్నాడు. సారథి విరటుడు చెప్పినట్లు చేశాడు.

విరాటరాజు అయిదు వందల రథాల్ని కూల్చివేశాడు. విరాటుడి ఉత్సాహం చూసి సైన్యమంతా విజృంభించి తిరుగులేని ఉత్సాహంతో కుంతాలు, భూశండులు, తోమరాలు, గదలు, ఖడ్గాలు మొదలైన శస్త్రాస్త్రాలతో తీవ్రవిహారం చేస్తూ, శత్రువుల్ని ఎదుర్కుంది. ఆ సన్నివేశాన్ని చూసి కలహప్రియుడైన నారదుడు చేతితో కుంచె ఆడిస్తూ నాట్యంచేశాడు.

సుశర్మ వెనక్కి తిరిగి వెళ్లిపోతున్న తన సైన్యాన్ని చూసి కోపంతో విజృంభిస్తూ యుద్ధరంగంలో విరాటుడి సైన్యాన్ని ముట్టడించాడు. త్రిగర్తసైన్యాలు తమ రాజుని చూసి విరటుడి సైన్యాన్ని భయంకరంగా ఎదిరించాయి.

సుశర్మ  విరాటుల యుద్ధం

విరాటుడు సుశర్మలు మూర్తీభవించిన కోపాలా.. అన్నట్టు గర్వాహంకారాలతో ఒకళ్లని ఒకళ్లు జయించాలన్న కోరికతో భయంకరంగా పోరాడారు. తమ రాజుల యుద్ధం చూసి యుద్ధరంగంలో ఇరువైపుల ఉన్న సేనలు ఉత్సాహంతో యుద్ధం చేస్తున్నారు. సైనికుల గాయాలనుంచి విస్తారంగా కారిన నెత్తురు మట్టి దుమ్ముని అణిచివేసి చీకటిని పోగొట్టే వెలుతురులా ప్రకాశించింది. (వర్ణనలు లేకుండా కథలుగా నడుస్తున్నది కనుక ఈ మహాభారతకథల్లో  యుద్ధం వర్ణించలేదు). సైనికులు యుద్ధంలో బాగా అలిసిపోయారు.

అప్పటికి సూర్యుడు అస్తమించాడు. చీకటి దట్టంగా వ్యాపించడం వల్ల ఇరువైపుల సైనికులు యుద్ధాన్ని ఆపి విశ్రాంతి తీసుకున్నారు. తిరిగి సూర్యుడు ఉదయించగానే విరటుడు సుశర్మలు ఉత్సాహంతో యుద్ధానికి తలపడ్డారు. సుశర్మ వేగంగా విరాట మహారాజుని పట్టుకుని తన రథం మీద కూర్చోబెట్టుకున్నాడు. విజయం కలిగిందన్న ఆనందంతో దుందుభులు మోగాయి. సుశర్మ విరాటున్ని తీసుకుని వెళ్లిపోతున్నాడు.

ధర్మరాజు భీముడితో “ఈ విరాటుడి వల్లే మనమంతా బతికి ఉన్నాము. కనుక, భయంకరమైన శత్రువుల బారిన పడకుండా విరాటుణ్ని విడిపించడం మన ధర్మం. వెంటనే వేగంగా సుశర్మని వెంబడించు” అన్నాడు.

భీముడు వీరావేశంతో ధర్మరాజుతో  “అదిగో ఆ కనిపించే మద్దిచెట్టుని పెరికి వేగంగా తిప్పుతూ శత్రువుల్ని చంపి సుశర్మ బలాన్ని అణిచి, నా యుద్ధ పరక్రమాన్ని ఇతరులు కూడా మెచ్చుకునేట్లు విరాటుణ్ని విడిపిస్తాను. నువ్వు నీ తమ్ముళ్లు ఒక పక్కన నిలబడి చూస్తూ ఉండండి” అన్నాడు.

ధర్మరాజుకి కీచకవధ గుర్తుకు వచ్చి భీముడివైపు చూసి నవ్వుతూ “నువ్వు చెట్టు పీకి యుద్ధం చేస్తే రెండువైపుల సైన్యం నువ్వు భీముడవని తెలిసిపోతుందేమో. అలా చెయ్యకు. నకుల సహదేవుల్ని నీ రథానికి రక్షకులుగా చేసుకుని అస్త్రశస్త్రాలతో పోరాడి త్వరగా విరాటుణ్ని విడిపించు” అన్నాడు. ధర్మరాజు మాటలు విని భీమసేనుడు కొంత నిరుత్సాహపడినా “మీరు చెప్పినట్టే చేసి శత్రువుల్ని హతమార్చి విరాటుణ్ని విడిపించుకొచ్చి మీకు అప్పగిస్తాను” అని రథాన్ని పరుగులు తీయించాడు.

విరాటరాజుని విడిపించిన పాండవులు

ధర్మరాజు తాను ముందు ఉండి రథాలన్నింటినీ ఒక్కసారిగా శత్రుసేనల మీదకి దాడి చేయించాడు. త్రిగర్తదేశ సైన్యం కూడా ధర్మరాజు సైన్యాన్ని ఎదుర్కున్నారు. రెండువైపుల సైన్యం విజృంభించి యుద్ధం చేస్తున్నారు. భీముడు శత్రువీరుల్లో ఉన్న రథికులు, గుర్రాలు, సారథులు నేలకూలేలా రెండు వేల రథాల్ని నేల కూల్చాడు.

నకులుడు ఏడువందల రథాల్ని నేలకూల్చాడు. సహదేవుడు మూడువందల రథాల్ని నాశనం చేశాడు. ధర్మరాజు వేయిమంది గొప్ప రథికుల్ని చంపేశాడు. ధర్మరాజు సుశర్మని వెంటాడి అతడి రథసారథిని, గుర్రాల్ని చంపాడు. సుశర్మ రథంలో ఉన్న విరాటుడు ఉత్సాహంగా ఒక గదాదండాన్ని తీసుకుని రథం మీదనుంచి కిందకి దూకి గదతో సుశర్మని కొట్టాడు.

భీముడు సుశర్మ రథం మీదకి దూకి సుశర్మని పట్టుకుని అతడి చేతులు వెనక్కి విరిచి కట్టి పెద్దగ సింహనాదం చేశాడు. భీముడి చేతిలో సుశర్మ ఓడిపోవడంతో అతడి చక్రరక్షకుడైన శోణాశ్వుడు, ఆప్త సేవకులు, సుశర్మ తోబుట్టువులు, బంధువులు, పలాయనం చిత్తగించారు. వాళ్లని వెన్నంటి తరిమి పశు సంపదని రక్షించి తీసుకుని వచ్చి అన్నకి అప్పగించాడు.

అందరితో కలిసి ధర్మరాజు విరాటుడి దగ్గరికి వచ్చాడు. గౌరవము, తొట్రుపాటు, సంతోషము కలుగుతుండగా విరాటుడు మంచి మనస్సుతో వాళ్లని ఆదరించాడు. ధర్మరాజు వైపు చూసి “ఈ శరీరము, సంపద నువ్విచ్చినవే కనుక, నీకే సపర్పిస్తున్నాను. ఈ మత్స్యరాజ్యాన్ని స్వీకరించి రక్షించు. నన్ను నీ వాడిగా మన్నించి ఆజ్ఞాపించి కాపాడు” అన్నాడు.

ధర్మరాజు విరాటుడితో “మహారాజా! నా మీద మీకున్న గౌరవం అటువంటిది. శత్రుసంహారం చేసి విజయోత్సాహంతో నువ్వు మత్స్యదేశరాజధానికి తిరిగి వెళ్లడం కంటే వేరే తేజస్సు, సంపద, గొప్పదనం ఇంకేముంటుంది? నేనిక్కడ నీకు చేసింది ఏముంది? చిన్నపనికి ఇంతగా నువ్వు చెప్పాలా?” అన్నాడు.

ధర్మరాజు మాటలు విని విరాటరాజు ధర్మరాజుతో “శత్రువులతో నువ్వు యుద్ధం చెయ్యడానికి కారణం ఏమై ఉంటుందో అని ఆలోచిస్తున్నాను. నాకు ఉపకారం చెయ్యాలన్న ఉదార స్వభావమా? వీరత్వాన్ని ప్రదర్శించుకుందామన్న పౌరుషభావమా? దయని చూపించే మృదువైన మనస్సా? నీ సహజమైన గొప్పతనమా? మనిద్దరి మధ్య ఉన్న స్నేహమా? వీటిలో కారణం ఏమై ఉంటుందో తెలుసుకోలేకపోతున్నాను. అగ్నిహోత్రంలా ప్రజ్వరిల్లుతున్న శత్రుసమూహాన్ని వెంటనంటి నాశనం చేసిన వంటవాడి గొప్పదైన పరాక్రమాన్ని ఎక్కడా చూడలేదు. యుద్ధంలో ఇతడే నన్ను వెంటనే గెలిపించగలిగాడు. తామగ్రంథి కోపంతో శత్రువులమీద దాడి చేస్తే, శత్రువుల కంఠాలు తెగి అందంగా పండిన తాటిపండ్లలా తలలు తెగి నేల మీద రాలతాయి.

యుద్ధరంగంలో తంత్రీపాలుడు ఒక్కడే ఎటు చూసినా తనే కనబడుతూ శత్రుసేనల్ని ఆశ్చర్యం కలిగించేలా సంహరించాడు. ఈ నలుగురు తప్ప మన సైన్యంలో గాయం తగలని భటుణ్ని మనం చూడం. మిత్రుడికి ఆపద కలిగినప్పుడు తనంతట తానుగా ముందుకి వచ్చి ఆదుకునేవాడే అసలైన మనిషి!  మీకు ఏనుగులు, గుర్రాలు, నవరత్నాలు, ఆభరణాలు, దేవతాస్త్రీలని పోలిన అందగత్తెల్ని ఏం కావాలంటే వాటిని మీకిస్తాను కోరుకోండి!” అన్నాడు.

విరాటుడు చెప్పింది విని పాండవులు “పుణ్యాత్ముడా! మమ్మల్ని ఆదరించి రక్షించావు. ఇంతకంటే మాకు కావలసిన ధనం ఇంకేముంది? మమ్మల్ని పరాయివాళ్లుగా చూడవద్దు. నగరానికి వెళ్లాక నీకు ఎలా గౌరవించాలని అనిపిస్తే అలా గౌరవించు” అన్నారు.

వాళ్లల్లో కంకుడు  “విరాటమహారాజా! నేను నిన్ను ఒకటి కోరుతున్నాను. దాన్ని నువ్వు నెరవేర్చడం మంచిది. సుశర్మని చతురంగ బలాలతో సహా ఇప్పుడే విడిచిపెట్టు. ఇదే నాకు సంతోషాన్ని కలిగిస్తుంది. వేగంగా వెళ్లగలవాళ్లని మన నగరానికి పంపించు. వాళ్లు నగరానికి వెళ్లి మన విజయవార్తని చాటింపు చేయించాలి. విజయధ్వజాలు ఎత్తించాలి. మంగళవాయిద్యాలు మోగించాలి. ప్రజలు ఒకళ్లమీద ఒకళ్లు సుగంధజలాలు చల్లుకునేలా వేడుకలు జరిపించాలి” అన్నాడు.

విరాటరాజు సంతోషంతో దర్మరాజు మాటలకి అంగీకరించి దూతల్ని నగరానికి పంపించాడు. వాళ్లు తెల్లవారేసరికి విజయవార్తని చాటించారు. పట్టణాన్ని అలంకరించి శుభాలంకారాలు చేయించారు. వైశంపాయనుడు జనమేజయుడికి ఈ కథని వివరించి చెప్పగా విని, తరువాత జరిగిన విషయాలు కూడా చెప్పమని ఆసక్తిగా అడిగాడు.

విరాటపర్వంలోని మూడవ ఆశ్వాసం సమాప్తం

Exit mobile version