[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]
శ్రీకృష్ణుణ్ని సహాయకుడుగా కోరుకున్న అర్జునుడు
హస్తినాపురంలో దుర్యోధనుడు రాజులందరి దగ్గరికి వెళ్లినట్లే శ్రీకృష్ణుడి దగ్గరికి రాయబారిని పంపించాలా తనే వెళ్లాలా? అని ఆలోచించి, కొంతమంది సేవకులతో గొప్ప వేగం కలిగిన గుర్రాల మీద తనే బయలుదేరి వెళ్లాడు. దుర్యోధనుడు ద్వారకలో ప్రవేశించాడు. అదే రోజు అర్జునుడు కూడా శ్రీకృష్ణుణ్ని చూడాలని వచ్చాడు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు పడుకుని ఉన్నాడు. దుర్యోధనుడు ముందుగా వెళ్లి అతడి తలవైపు ఉన్న ఉన్నతమైన ఆసనంమీద కూర్చున్నాడు. తరువాత వచ్చిన అర్జునుడు కాళ్ల దగ్గరికి వెళ్లి వినయంగా నిలబడ్డాడు.
శ్రీకృష్ణుడు నిద్ర లేచి ముందుగా అర్జునుణ్ని చూసి, తరువాత దుర్యోధనుణ్ని చూశాడు. ఇద్దరినీ ఒకే విధంగా సమయానికి తగినట్లు ఆదరించి వచ్చిన పని చెప్పమన్నాడు. దుర్యోధనుడు “యుద్ధం చేసే ఉద్దేశ్యంతో నీ సహాయం కోరి నీ దగ్గరికి వచ్చాము. కౌరవులమైన మేము, పాండవులైన వీళ్లూ మనసులో నీకు బాగా దగ్గర చుట్టాలము కనుక, నీకు ఇద్దరమూ సమానమే! ముందుగా నేను నిన్ను చూడాలని వచ్చాను. మంచివాళ్లు మొట్టమొదట చూసినవాళ్లని ప్రేమతో తగినవిధంగా ఆదరిస్తారు. నువ్వు కూడా ఎంతో మంచివాడివి. కనుక, లోకంలో ఉన్న న్యాయాన్ని అనుసరించి నువ్వు నాకు సహాయపడాలి” అని అడిగాడు.
దుర్యోధనుడి మాటలు విని శ్రీకృష్ణుడు “ఇక్కడికి నువ్వు ముందే వచ్చావు. ఇది నిజమే! కాని, నేను ముందుగా అర్జునుణ్ని చూశాను. కనుక, మీకు ఇద్దరికీ సగౌరవంగా సహాయపడడం మంచిది. ఇందుకు క్రమపద్ధతిలో నేను ఒక విభాగం చేస్తాను. నువ్వూ, ఇతడూ, మీ మీ కోరికల ననుసరించి కోరుకోండి. యుద్ధపాండిత్యం వల్ల కలిగిన భుజబలగర్వంతో అందమైన ఆకారాలు కలిగినవాళ్లు, విల్లూ మొదలైన ఆయుధాల విద్యలో నేర్పు కలిగినవాళ్లు నా అంతటివాళ్లు పదివేలమంది గోపాలురు ఉన్నారు. నారాయణ నామధేయం గలిగిన ఆ గోపాలురు యుద్ధం చేస్తారు. నేను ఆయుధాల జోలికి వెళ్లకుండా మంచి ఆప్తుడిగా ఒకచోట ఊరికే ఉంటాను. ఆ పదివేలమంది నారాయణ నామం కలిగిన గోపాలకులు ఒక పక్షం, నేనొక్కడినీ ఒక పక్షం. ఈ రెండు విధాలలోను ఎవరికి ఏది ఇష్టమో చెప్పండి. ముందుగా చిన్నవాడు కోరుకోవడం న్యాయం” అన్నాడు.
శ్రీకృష్ణుడు అర్జునుణ్ని చూసి “మీ ఇద్దరిలో నువ్వు చిన్నవాడివి కనుక ముందు నువ్వు కోరుకోవడం ధర్మం” అన్నాడు.
అది విని అర్జునుడు సంతోషంతో శ్రీకృష్ణుణ్ని కోరుకున్నాడు. అర్జునుడు పదివేలమంది గోపకుల్ని కాకుండా కృష్ణుడిని కోరుకున్నందుకు దుర్యోధనుడు మనసులో పొంగిపోయాడు. గోపకుల్ని కష్టం లేకుండా దక్కించుకున్నట్టే అనుకుని సంతోషంతో పొంగిపోయాడు.
బలరాముడి సహాయం కోరిన దుర్యోధనుడు
దుర్యోధనుడు శ్రీకృష్ణుడి దగ్గరనుంచి కాంతి నిండిన ముఖంతో తన సేనల్ని తీసుకుని అనందంగా బలరాముడి ఇంటికి వెళ్లాడు. బలరాముడు అతడికి అతిథి సత్కారం చేశాడు. తరువాత దుర్యోధనుడు తను వచ్చిన పని చెప్పాడు. బలరాముడు దుర్యోధనుడితో “అభిమన్యుడి పెళ్లికి వచ్చినప్పుడు రాజులందరూ సమావేశమై ఉండగా ఆ సభలో నేను నీ పక్షమని చెప్పాను. హస్తినాపురంలో నువ్వు ఈ మాట వినలేదా? నా మాటలు భరించలేక కొందరు పాండవులమీద పక్షపాతంతో వ్యతిరేకించి మట్లాడారు. ఆ మాటలు శ్రీకృష్ణుడికి ఇష్టంగా అనిపించాయి. కృష్ణుణ్ని వదిలి ఉండలేక పోవడం వల్ల, నిరసనగ మాట్లాడడం ఇష్టం లేకపోవడం వల్ల ఏమీ అనలేదు. అది మొదలుకుని ఒక నిర్ణయం తీసుకున్నాను. మీకూ, వాళ్లకీ యుద్ధం జరిగేటప్పుడు జయపజయాలు ఎవరికైనా నేను తటస్థంగా ఉరుకుంటాను. ఎవరికీ సహాయం చెయ్యను. ఇది నిజం” అన్నాడు.
బలరాముడి మాటలు విని దుర్యోధనుడు అందుకు అంగీకరించి వినయంగా అతడి దగ్గరనుంచి వచ్చి శ్రీకృష్ణుడిని మళ్లీ పలకరించి కృతవర్మ దగ్గరికి వెళ్లాడు. కృతవర్మ “ఒక అక్షౌహిణీ సేనతో నీకు సహాయపడడానికి వస్తాను” అని చెప్పాడు. అక్కడినుంచి దుర్యోధనుడు హస్తినాపురానికి వెళ్లిపోయాడు.
అర్జునుడితో కలిసి ధర్మరాజు దగ్గరికి వెళ్లిన శ్రీకృష్ణుడు
శ్రీకృష్ణుడు అర్జునుడితో “దుర్యోధనుడు గొప్ప పరాక్రమవంతులు, నారాయణ అనే పేరుగల గోపకుల్ని అడిగాడు కదా.. యుద్ధం చేయను అంటున్న నన్ను కోరుకోడం వల్ల నీకు ఎటువంటి మేలు కలుగుతుంది?” అన్నాడు.
శ్రీకృష్ణుడు మాటలు విని అర్జునుడు “నేను యుద్ధానికి సహాయం అడగను. ఎంతో గొప్పవాడివైన నువ్వు యుద్ధం చేస్తే పేరు నీకే వస్తుంది. ప్రతిపక్షంలో ఉంటే నిన్ను గెలవడం కష్టం. విజయానికి ప్రధాన కారణం నీ సహాయమే. అదే తప్పకుండా అవసరం. నువ్వు యుద్ధం చేయకుండా ఉండడం నాకు కూడా ఇష్టమే! అందుకే నిన్ను కోరుకున్నాను. సద్గుణవంతుడవైన శ్రీకృష్ణా! నువ్వు కరుణించి అన్ని విధాలుగాను నా రథానికి సారథ్యం చెయ్యి. ఈ గౌరవాన్ని ఎప్పటినుంచో నేను కోరుకుంటున్నాను. నా కోరిక తీర్చు” అన్నాడు.
అర్జునుడి మాటలు విని శ్రీకృష్ణుడు “పాపరహితుడా! నీ కోరిక తీర్చడం నా వ్రతం. అసమానమైన యుద్ధకేళిలో నేను నీకు సారథ్యం చేస్తాను” అన్నాడు. తరువాత చెయ్యవలసినదాన్ని గురించి ఆలోచించడానికి అర్జునుణ్ని వెంటబెట్టుకుని ధర్మరాజు దగ్గరికి వచ్చాడు.
తరువాత శల్యుడి దగ్గరికి వెళ్లిన దూతలు అతడిని చూసి తగిన పద్ధతిలో మాట్లాడి యుద్ధంలో సహాయం చెయ్యమని అడిగారు. శల్యుడు సంతోషంగా పుత్రులతోను, మిత్రులతోను కలిసి గొప్ప సేనని తీసుకుని ప్రయాణం చేస్తూ పాండవుల దగ్గరికి వెడుతున్నాడు.
దుర్యోధనుడు పాండవులకి సహయం చెయ్యడం కోసం శల్యుడు బయలుదేరాడన్న వార్త విన్నాడు. వెంటనే సమర్థులూ, విశ్వాసపాత్రులూ అయినవాళ్లని శల్యుడు వెడుతున్న దారికి పంపించాడు. దారిలో చల్లటి పందిళ్లూ; విశాలమూ, అందమూ, నిర్మలమూ, తియ్యటి తెల్లటి నీళ్లు కలిగిన నడబావులూ; పొడవైన మూడు వంచలతో ఏనుగులకీ, గుర్రాలకీ చావళ్లూ; ముందు బయలుగలిగిన సుందరమైన ఆస్థాన మండపాలూ; బియ్యాలూ; నెయ్యి; పెరుగూ; కూరగాయలూ; వంటకట్టెలూ; గడ్డీ; ఉలవల దాణాలూ అన్నింటినీ సమకూర్చాడు. రహస్యంగా తను కూడా వెళ్లాడు.
విడుదుల ప్రయాణాలకి అధికంగా సౌకర్యాలు సమకూర్చిన వస్తువుల్ని చూసి శల్యుడు సంతోషించి సేవకుల్ని పిలిచి “ఇలా మనోహరంగా మనకి కావలసిన వాటిని సమకూర్చడానికి కారకులైన ధర్మరాజు మంత్రులు ఎవరో వాళ్లని తీసుకుని రండి!” అన్నాడు.
అవన్నీ సమకూర్చి రహస్యంగా దాగి ఉన్న దుర్యోధనుడు ఆ మాటలు విని అదే అదను అనుకుని వినయంగా వచ్చి శల్యుడికి తనని తను ఆ సమయానికి తగినట్టుగా పరిచయం చేసుకున్నాడు. శల్యుడు దుర్యోధనుణ్ని గట్టిగా కౌగలించుకుని బంగారు పీఠం మీద కూర్చోబెట్టి ‘ఇదంతా ఈ మహానుభావుడు సమకూర్చాడేమో’ అనుకున్నాడు.
సంతోషంతో అతణ్ని ఏం కావాలో అడగమన్నాడు. దుర్యోధనుడు ఆనందంతో “నువ్వు మంచి, చెడు తెలిసినవాడివి. నాకు మంత్రిగా ఉండి నా సైన్యాన్ని నడిపించు. నీకు పాండవులూ కౌరవులూ ఒకటే. నువ్వు నన్ను భక్తితో మన్నించి తగిన విధంగా స్వీకరించు” అన్నాడు.
దుర్యోధనుడు చెప్పినది విని శల్యుడు “నా మనస్సులో పాండవులు, కౌరవులు వేరు అనే భేదబుద్ధి లేదు. పాండవులూ మీరూ ఒక్కటే. కాబట్టి న్యాయం ఆలోచిస్తే ఇది మంచి మాట. ముందుగా నన్ను సాదరంగా చూడడానికి వచ్చిన నువ్వు అడిగినదానికి అంగీకరిస్తున్నాను. ఇంక ఏదయినా కోరిక ఉంటే చెప్పు. దాన్ని కూడా తీరుస్తాను” అన్నాడు.
దుర్యోధనుడు సంతోషంతో “నువ్వు గౌరవంతో నాకు ఈ విధంగా మంత్రిగా ఉండడం కంటే గొప్పదైన పొగడ్తకెక్కే కోరిక ఇంకొకటి ఉండదు కదా?” అన్నాడు.
దుర్యోధనుడి మాటలకి శల్యుడు వికసించిన మొహంతో “నువ్వు హస్తినపురానికి వెళ్లు. నేను తప్పకుండా పాండవుల్ని ఇష్టంగా చూడాలి. వాళ్లని చూసి తరువాత హస్తినాపురం వస్తాను” అని చెప్పాడు.
శల్యుడు చెప్పినదానికి దుర్యోధనుడు “అలాగే చేయండి. అక్కడికి వెళ్లి వెంటనే తిరిగి రండి. మీరిచ్చిన వరం మాట మర్చిపోకూడదు. మీతో కలిసి ఉంటే అభివృద్ధి చెందుతాను. దయతో నా వైపు కనిపెట్టుకుని ఉండండి” అన్నాడు.
శల్యుడు దుర్యోధనుణ్ని కౌగలించుకుని “నువ్వు సందేహపడకుండా వెళ్లు” అని చెప్పాడు. దుర్యోధనుడు మనసులో ఆనందిస్తూ హస్తినాపురానికి వెళ్లాడు.
పాండవుల్ని చూడడానికి వచ్చిన శల్యుడు
శల్యుడు ఉపప్లావ్యపురానికి వెళ్లి పాండవుల బిడారంలో ప్రవేశించి ధర్మరాజు నివాసానికి వెళ్లాడు. ధర్మరాజూ, అతడి తమ్ముళ్లూ, ద్రౌపదీ, సుభద్రా, అభిమన్యుడూ మొదలైన కుమారులూ అందరూ శల్యుడికి ఎదురు వెళ్లారు. ధర్మరాజు శల్యుడికి నమస్కరించి తీసుకుని వెళ్లి బంగారు పీఠం మీద కూర్చోబెట్టి అర్ఘ్యపాద్యాలిచ్చి, క్షేమసమాచారాలు అడిగాడు.
శల్యుడు అంతా క్షేమమే అని చెప్పి ధర్మరాజుని మళ్లీ కౌగలించుకుని “గొప్ప మనస్సు కలవాడా! జనాలు లేని అరణ్యంలో తమ్ముళ్లూ, ద్రౌపదీ, నువ్వూ ఇంతకాలం క్షేమంగా ఉండడం చాలా కష్టం. ఈ అరణ్యవాసం కంటే అజ్ఞాతవాసం మరీ కష్టం. దయ, సత్యమూ మొదలైన మీ గుణాల అతిశయం మిమ్మల్ని ఆపదలనుంచి దాటించకుండా ఉంటుందా? భూమి మీద ఉన్న ప్రజలందరూ నీ మనోవేదనకి చాలా బాధపడ్డారు. ఇప్పుడు నువ్వు ఇలా కష్టాలన్నీ గట్టెక్కినందుకు ఆనందిస్తున్నారు.” అని చెప్పి, దుర్యోధనుడు తనని ఆదరంతో చూడడము, ప్రార్థించడము, దానికి తను అంగీకరించడమూ అన్ని విషయాలూ చెప్పాడు.
అది విని ధర్మరాజు “మంచి పని చేశారు. ఒకళ్లని మెచ్చి వాళ్ల కోరిక తీర్చడమే పెద్దవాళ్ల లక్షణం కదా? అది నా మనస్సుకి ఆనందం కలిగించేదే. నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను. అర్జునుడికి శ్రీకృష్ణుడు సారథ్యం చేయబోతున్నాడు. కర్ణుడు అర్జునుడితో ఎప్పుడూ పోటీ పడుతూ ఉంటాడు. వీళ్లిద్దరికీ యుద్ధం జరిగినప్పుడు కృష్ణుడికి ప్రతిగా సారథ్యం చెయ్యడానికి మీరు తప్ప అక్కడ ఇంకొకడు లేడు. కాబట్టి, మీకు తప్పక కర్ణుడికి సారథ్యం వహించే పని అప్పగించబడుతుంది. యుద్ధ సమయంలో మీరు అనాదరంతో మాట్లాడి కర్ణుడి మనసుకి కలత పుట్టించి అర్జునుణ్ని రక్షించాలి. దీన్ని చెయ్యకూడని పని అనుకోకుండా మీరు ఎలాగైనా సరే చెయ్యాలి” అని ప్రాధేయపడి అడిగాడు.
శల్యుడు అంగీకరించి “అవును నువ్వు చెప్పింది బాగుంది. కర్ణుడికి రథం నడపడానికి నువ్వే అర్హుడివని దుర్యోధనుడు అడిగితే నేను అతడి కోరిక తీర్చవలసిందే. నేను కర్ణుడికి సారథినైనా అర్జునుణ్ని రక్షిస్తాను. అవినీతిపరుడైన ఆ కర్ణుణ్ని ఎలాగైనా కర్ణకఠోరాలైన మాటలతో యుద్ధంలో కలవరపరుస్తాను. బలగర్వమూ, తేజస్సూ నశించి భయపడే విధంగా మాట్లాడి కర్ణుడిని బాధపెడితే, బాణాలు వదలడానికి అతడికి చేతులు సహకరించవు. ఆ సమయంలో అర్జునుడు తీవ్రమైన బాణాలతో విజృంభిస్తాడు. ఇది ఒకటే కాదు, నువ్వు ఏది కోరినా దాన్ని నేను తీరుస్తాను. ఆ రోజు కురుసభలో సూతపుత్రుడు మాట్లాడిన మాటలకి నా మనసుకి బాధగా అనిపించింది. అందువల్ల నా మనసు నీ మీద పక్షపాతం కలిగేలా చేస్తోంది.
అయ్యో! అదీకాకుండా మీరు పడ్డ పాట్లు ఎవరినైనా బాధిస్తాయి కదా? ఇలా బాధలు పడినందుకు నువ్వు మనసులో విచారించకు. నీ కోరిక తప్పకుండా సంపూర్ణంగా ఫలిస్తుంది. ఒక్కొక్కప్పుడు దేవతలు కూడా కష్టాలు అనుభవిస్తారు. పూర్వం ఇంద్రుడు తన భార్యతో కలిసి అనేక బాధలు అనుభవించాడు. ఇంద్రుడి సంపద ముందు మీ సంపద ఎక్కువా? దైవం నిర్ణయించిన విధంగా అనుభవించకుండా తప్పించుకోవడం శివుడికి కూడా తప్పదు” అన్నాడు.
శల్యుడు చెప్పినది విని ధర్మరాజు “ఇంద్రుడు శచిదేవితో కలిసి అటువంటి దుస్ఠితిని ఎందుకు, ఎలా? అనుభవించాడు?” అని అడిగాడు.
శల్యుడు “ధర్మరాజా! పూర్వం జరిగినది చెప్తాను విను. దేవతలలో గౌరవించ తగిన గొప్పవాడైన ‘త్వష్ట’ అనే పేరుగలవాడు ఇంద్రుడికి హాని చెయ్యాలనుకున్నాడు. మూడు తలకాయలు ఉన్నవాణ్ని పుట్టించి విశ్వరూపుడు అనే పేరు పెట్టాడు. అతడు ఇంద్రపదవి కోసం ఘోరతపస్సు చేశాడు. ఆ తపస్సుకి భయపడి ఇంద్రుడు అతడి తపస్సు భంగం చెయ్యమని అప్సరసలని ఆజ్ఞాపించాడు. అప్సరసల వయ్యారాలూ ఆటలూ, పాటలూ, మాటలూ, చూపులూ విశ్వరూపుడిని కదల్చలేక పోయాయి. ఇంద్రుడు సిగ్గుపడి అతణ్ని వధించాడు. అధర్మపరంగా ఉంటూ ఎవరికీ తెలియనట్లు ఒక సంవత్సర కాలం గడిపాడు.
భూత సమూహాలు అరిచి చెప్పాయి. ఇంద్రుడు తను చేసిన పాపపు పని అందరికీ తెలిసిపోవడం వల్ల అసహ్యించుకుని ఒక కఠోరమైన వ్రతాన్ని చేసి తనకు కలిగిన బ్రహ్మహత్యా పాతకాన్ని సముద్రంలోనూ, చెట్లలోనూ, నేలమీదా, స్త్రీలలోనూ భాగాలుగా విభజించి పెట్టి, తన పాపం పోగొట్టుకుని, మునులతో సేవించబడుతూ సంతోషంగా ఉన్నాడు.
అలా ఉన్న ఇంద్రుణ్ని చూసి త్వష్ట కోపంతో “నిరపరాధుడూ, తపోనిధీ, గొప్ప శాంతం కలవాడూ అయిన విశ్వరూపుణ్ని చంపిన పాపిని లక్ష్యపెట్టకుండా పట్టుకుని మింగివేయగలవాడిని ఈ క్షణంలోనే పుట్టిస్తాను” అని నియమంతో హోమం చేసి అగ్నికుండంలో కుమారుడిని పుట్టించాడు. అతడికి వృత్రుడు అనే పేరు పెట్టి “నా గొప్ప తపశ్శక్తితో ప్రకాశించిన తేజస్సుతో నువ్వు జయించు” అని అజ్ఞాపించి ఇంద్రుడితో యుద్ధం చేయడానికి పంపించాడు.
