Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మహాభారత కథలు-140: ఇంద్రుణ్ని వెతికి బృహస్పతికి తెలియచేసిన అగ్నిదేవుడు

[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]

ఇంద్రుణ్ని వెతికి బృహస్పతికి తెలియచేసిన అగ్నిదేవుడు

బృహస్పతి చెప్పిన పని మీద అగ్నిదేవుడు స్త్రీ వేషం ధరించి మనోవేగంతో వెళ్లి, దిక్కులూ, భూమ్యాకాశాలూ, కొండలూ, అడవులూ మొత్తం తిరిగి , ఇంద్రుడు ఎక్కడా కనిపించక తిరిగి వచ్చాడు. అగ్మిదేవుడు బృహస్పతితో “నీళ్లల్లోకి ప్రవేశించడానికి నాకు వీలుకాదు కనుక, నీళ్లల్లో తప్ప అన్ని చోట్లకి వెళ్లి వచ్చాను. నీళ్ల వల్ల నిప్పు, బ్రాహ్మణుల వల్ల క్షత్రియులూ, రాళ్ల వల్ల లోహము పుట్టాయి. వాటి ప్రతాపం అన్ని చోట్లా చెల్లుతుంది కాని తమ తమ పుట్టిన చోట్ల నశిస్తుంది. కాబట్టి నీళ్లు నాకు నాశనం కలిగించడం సహజమే!” అన్నాడు.

అగ్నిదేవుణ్ని గౌరవంతో చూసి “అగ్నిదేవా! అన్ని అచరాలూ, చరాలూ కూడా నీ వల్లనే వికసిస్తాయి. యజ్ఞవైభవాలూ, నాలుగు వేదాలూ నువ్వే. నీళ్లు కూడా నీ నుంచే పుట్టాయి. జగత్తు మొత్తం వ్యాపించిన నీకు ఒక చోటు ప్రవేశించలేనిది ఎలా అయింది? నీ గురించి నువ్వు బాగా ఆలోచించుకో. నేను కూడా వేదమంత్రాల వల్ల ఎక్కువ అభివృద్ధి కలిగేలా చేస్తాను. కనుక సందేహించకుండా నీళ్లల్లోకి ప్రవేశించు” అన్నాడు.

అగ్ని బృహస్పతి చెప్పినట్టు సముద్రాలు, గొప్ప నదులు, సరస్సులు, కొలకుల సమూహాలు వెతుకుతూ వెళ్లి ఇంద్రుడున్న సరస్సులోకి వెళ్లాడు. తామరపూవుల్ని అన్నింటినీ వెతుకుతూ ఒక తామరపువ్వు కాడదారంలో ఉన్న ఇంద్రుడిని చూశాడు. వెంటనే బృహస్పతి దగ్గరికి వెళ్లి చెప్పాడు.

బృహస్పతి సంతోషంతో దేవతల్ని, మహర్షుల్ని వెంటబెట్టుకుని ఇంద్రుడి దగ్గరికి వెళ్లాడు. ఇంద్రుణ్ని మంచిమాటలతో సంతోషపెట్టి “ఇంద్రా! నువ్వు ఉత్తమమైన నీ పని నువ్వు చెయ్యడానికి ఎందుకు అంగీకరించడం లేదు? వృత్రుణ్ని చంపడం పాపకార్యం ఎలా అవుతుందో చెప్పు. సముద్రపు నురుగులోకి విష్ణుమూర్తి ప్రవేశించి లోకకంటకుడైన వృత్రాసురుణ్ని చంపాడు కనుక, నీకు విజయం కలిగింది. ఇందులో నీకు కలిగిన దోషం ఏముంది?” అని అతడికి అర్థమయ్యేలా వివరించి చెప్పాడు. బృహస్పతి చెప్పిన మాటలకి ఇంద్రుడు పాపం లేనివాడై తన ఆకారాన్ని ధరించి, దేవతలతో మహర్షులతో కలిసి అతణ్ని గౌరవించి తను చెయ్యవలసిన పని గురించి చెప్పమని అడిగాడు. ఇంద్రుడి బదులుగా నహుషుడు ఇంద్రుడిగా ఉన్న విషయం ఇంద్రుడికి తెలిసిన విషయమే అయినా బృహస్పతి మళ్లీ వివరించాలనుకన్నాడు.

అందువల్ల ఇంద్రుడితో “నువ్వు నీ పరాక్రమం తగ్గి కుంగిపోతే, లోకాలని రక్షించడానికి తగిన వీరుడు లేకపోడం వల్ల దేవతలూ, మునులూ కలిసి నహుషుడి దగ్గరికి వెళ్లి తమ మనసులో అతడు మనిషి అనే విషయాన్ని పక్కన పెట్టి, అతడిని ఇంద్రపదవి స్వీకరించమని ప్రార్థించారు. అతడు తాను బలహీనుడిని ఇంద్రపదవికి తగిన బలం తనకి లేదని సందేహిస్తుండగా వాళ్లందరూ తమ తమ తేజస్సుల భాగాలు అతడికిచ్చి అతణ్ని సమర్థుడిగా చేసి అభిషేకించారు. గొప్ప పదవి అలంకరించానన్న అహంకారంతో ధర్మాన్ని విడిచిపెట్టి ప్రవర్తిస్తూ ఇప్పుడు తనని మొయ్యడానికి సప్తర్షుల్ని నియోగించాడు. ఇదొక్కటే కాదు, ఇంకా ఎన్నో దుర్మార్గాలు చేస్తున్నాడు. అతడితో పడలేక నిన్ను వెతుక్కుంటూ వచ్చాము. వివేకశూన్యుడైన అతణ్ని పదవీభ్రష్టుణ్ని చెయ్యడానికి ఇదే మంచి సమయం.

ఎలాగో చెప్తాను విను విష్ణుమూర్తి ఆజ్ఞతో అశ్వమేధ యాగం వల్ల నువ్వు పాపం లేనివాడివే అయినా, నహుషడి తేజస్సు నశించకపోవడం వల్ల, అతణ్ని జయించడానికి వీలుకాకుండా పోయింది. ఇప్పుడు అతడు మహర్షుల్ని అవమానించి తేజస్సుని కోల్పోయాడు. కనుక, అతడు ఇప్పుడు నీ చేతిలో నశిస్తాడు. అలా జరగడం కూడా అశ్వమేధయాగ ఫలమే. ఇంక ఉత్సాహం చూపించు” అన్నాడు.

ఆ సమయంలో యముడూ, వరుణుడూ, కుబేరుడూ చంద్రుడితో కలిసి వచ్చారు. వాళ్లని చూసి ఇంద్రుడు సంతోషించి వాళ్లు సంతోషించే విధంగా మాట్లాడి తన కర్తవ్యం గురించి చెప్తూ నహుషుణ్ని గెలిచే ఉపాయం గురించి వివరిస్తున్నాడు.

ఆ సమయంలో అక్కడికి వచ్చిన దేవతలు “ఇంద్రా! పాపాత్ముడైన నహుషుడు నష్టపోయాడు. గొప్పదైన నీ చరిత్రవల్ల దేవతలకి సంతోషం కలిగేలా నువ్వు నీ రాజ్యాన్ని స్వీకరించు” అని చెప్పారు.

అంతలో మునులలో గొప్పవాడైన అగస్త్యమహర్షి అక్కడికి వచ్చాడు. ఇంద్రుడు ఆయనకి తగిన ఆసనం చూపించి అర్ఘ్యపాద్యాదులతో గౌరవించి, వినయంగా అడిగాడు. “ఆగస్త్యమహర్షీ! ఎంతో వైభవమూ, నిరుపమానమైన సామర్థ్యము కలిగిన నహుషుడు ఏ కారణం వల్ల నిర్భాగ్యుడై సంపదల్ని పోగొట్టుకున్నాడు?” అని అడిగాడు.

నహుషుడు సంపదలు పోగొట్టుకున్నవిధం చెప్తున్న అగస్త్యమహర్షి

ఇంద్రుడితో అగస్త్యమహర్షి నహుషుణ్ని మోస్తూ బాధపడుతున్న మహర్షులు అతడితో సరదాగా మాట్లాడుతూ “బ్రాహ్మణములయిన మంత్రాలు గోసంప్రోక్షణంలో చెప్పబడి ఉన్నాయి. వాటిని నువ్వు నమ్ముతావా? అని అడిగారు.

అందుకు నహుషుడు ‘ఆ మంత్రాలు నాకు ప్రమాణాలు కావు’ అన్నాడు.

నేను ఆ మాటని నిరాకరించి “పూర్వపు గురువులు అభినందించిన మంత్రాల్ని నిందించడం అజ్ఞానం’’ అని వాదించాను. అతడు నా తలని కాలితో తన్నాడు.

అతడిని చూసి పుణ్యం పోయి, తేజస్సు నశించి దుఃఖంతో ఉండడం చూసి “నువ్వు పూజ్యులైన మహర్షుల్ని నిన్ను మోయడానికి నియోగించావు. వాళ్లు ప్రశంసించే మంత్రాల్ని నిందించావు. అదీకాక నన్ను అవమానించావు. కనుక, ఇప్పుడు ఇంద్రపదవి నుంచి భ్రష్టుడవై చాలా యేళ్లు సర్పరూపంలో భూలోకంలో ఉండు” అని శపించాను.

అంతలోనే అనుగ్రహించి “నీ వంశంలో అజాతశత్రువు అనే కీర్తి కలిగి యుధిష్ఠిరుడు అనే పేరుగల ఒక సజ్జనుడి దర్శనం వల్ల పాపాలు పోయి పుణ్యలోకం పొందుతావు” అన్నాను.

ఆ క్షణమే నహుషుడు స్వర్గలోకం నుంచి భ్రష్టుడై దుర్గతి పొందాడు. ఎక్కడైనా దుర్మార్గులకి దుర్గతీ, సన్మార్గులకి సద్గతీ కలగడంలో ఆశ్చర్యం లేదు కదా? అన్నాడు. అగస్త్యమహర్షి చెప్పింది విని దేవతలూ, మునులూ ఎంతగానో సంతోషించారు. ఇంద్రుడు ఆనందంతో అగస్త్యమహర్షిని పూజించాడు. వాళ్లిద్దరి ప్రేమభావం స్వర్గంలో ఉన్న చరాచరాలన్నింటికీ సంతోషం కలిగించింది. గొప్ప ఐశ్వర్యంతో ప్రకాశిస్తున్న ఇంద్రుణ్ని చూడడానికి అప్సరసలందరూ వచ్చారు. వెంటనే అగ్నిదేవుడు మొదలైన దిక్పాలకులూ, కిన్నరలూ, సిద్ధులూ, సాధ్యులూ, బృహస్పతీ కూడా వచ్చారు. ఐరావతమనే ఏనుగునెక్కి ఇంద్రుడు అమరావతికి వెళ్లి శచీదేవితో సుఖంగా ఉన్నాడు.

మహానుభావుడైన దేవేంద్రుడు తన అధికారానికి భంగం కలిగినప్పుడు సామాన్యుడిలా దుఃఖం అనుభవిస్తూ ఉండలేదా? ఇంద్రుడు కూడా కాలప్రభావం వల్ల అజ్ఞాతవాసం చేశాడు కదా! కనుక, మీరు అరణ్యవాస దుఃఖం అనుభవించినందుకూ, ఇతరులకి తెలియకుండా ఉండడం కోసం సేవకత్వం చేసినందుకూ మీరు బాధపడకండి” అని చెప్పాడు శల్యుడు.

తరువాత సభలో ఉన్నవాళ్లందరి వైపు చూసి “దుర్యోధనుడు కూడా ఆ నహుషుడిలాగే నశిస్తాడు. ధర్మరాజు ఇంద్రవైభవంతో విజయం సాధించి, తమ్ముళ్లతో సర్వభోగాలు అనుభవించి ప్రసిద్ధికెక్కుతాడు” అన్నాడు.

శల్యుడు ధర్మరాజుతో “అనఘా! ధర్మరాజా! శ్రద్ధగా ఇంద్రవిజయ కథ విన్నా, దాన్ని వ్యాఖ్యనించినా ప్రజలకి సౌఖ్యాలు కలుగుతాయి. ప్రపంచవ్యాప్తంగా కీర్తి కలుగుతుంది. ధర్మరాజా! యుద్ధం జరుగుతున్నప్పుడు ఇంద్రవిజయము అనే ఈ కథని విన్న రాజు సందేహం లేకుండా శత్రుసమూహాన్ని గెలుస్తాడు” అని చెప్పాడు.

శల్యుడు చెప్పిన మాటలు విని ధర్మరాజు శల్యుణ్ని గౌరవించి “మహాత్మా! మీ మాటలు వినడం వల్ల నా మనసు తేరుకుంది” అని చెప్పి అతడికి అన్ని సదుపాయాలు సమకూర్చాడు. తరువాత శల్యుడు బయలుదేరాడు.

ధర్మరాజు శల్యుణ్ని సంతోషంతో సాగనంపుతూ “యుద్ధంలో మీరు మమ్మల్ని దృష్టిలో పెటుకుని కర్ణుణ్ని నిరుత్సాహపరుస్తూ మాట్లాడడం మర్చిపోకూడదు” అన్నాడు. శల్యుడు ధర్మరాజుని ఊరడించి అతన్ని గట్టిగా కౌగలించుకుని, అతి వేగంగా సైన్యంతో హస్తినాపురానికి వెళ్లిపోయాడు.

పాండవుల దగ్గరికి సేనాసమేతంగా వచ్చిన సాత్యకి మొదలైనవాళ్లు

సర్వశత్రుభీకరుడూ, ఉత్సాహవంతుడూ, భుజబలపరాక్రమగర్వం కలిగినవాడు సాత్యకి ఒక అక్షౌహిణీ సేనని తీసుకుని భూమి మొయ్యలేదేమో అనిపించేట్లు పాండవుల దగ్గరికి వచ్చాడు. చేదిదేశపు రాజైన దృష్టకేతుడూ, జరాసంధుడి కుమారుడు సహదేవుడూ ఒక్కొక్క అక్షౌహిణీ సేనతో వచ్చారు. సోదరులైన అయిదుగురు కేకయరాజులు ఒక అక్షౌహిణీ బలంతో వచ్చారు. వెంటనే ద్రుపదుడు కొడుకులతో, గుర్రపుదళాలతోను, ఏనుగుల గుంపులతోను, కాల్బలంతోను, రథాల సమూహాలతోను భూమి అదిరేలా గొప్ప వేడుకతో పాండవులకి సహాయం చెయ్యడానికి వచ్చాడు. అంతా కలిసి అది కూడా ఒక అక్షౌహిణీ సైన్యం అయింది.

అదే సమయంలో తమ్ముళ్ళతోను, కొడుకులతోను, పర్వతప్రాంత రాజులతోను కలిసి ఒక అక్షౌహిణీ సైన్యాన్ని తీసుకుని శత్రువుల హృదయాలు, దిక్కులు పగిలేలా శంఖధ్వని చేస్తూ మత్స్యదేశాధీశుడు విరాటుడు పాండవులకి సహాయం చెయ్యడానికి వచ్చాడు. పాండ్యదేశాధిపతి మొదలైన అన్నిపక్కలనుంచి వచ్చిన సైన్యం ఒక అక్షౌహిణి అయింది.

ఈ విధంగా వచ్చిన ఏడు అక్షౌహిణుల సైన్యం యుద్ధంలో తమ ప్రతాపం చూపించడానికి ఉవ్విళ్లూరుతూ పాండవుల దగ్గరికి వచ్చి చేరాయి. ఇలా ధర్మరాజు సైన్యం యుద్ధానికి సిద్ధమవుతోంది.

అక్కడ కౌరవపక్షంలో కిరాతకుల్నీ, ధనాన్నీ, సైన్యసమూహాన్నీ కూర్చుకుని యుద్ధానికి సిద్ధపడి ఒక అక్షౌహిణీ సేనతో భగదత్తుడు దుర్యోధనుడి దగ్గరికి వచ్చాడు. గొప్ప పరాక్రమవంతుడైన భూరిశ్రవుడూ, మహాబలుడైన శల్యుడూ ఒక అక్షౌహిణితో వచ్చారు. కాంభోజరాజైన సుదక్షిణుడు అనే యవనపతి ఒక అక్షౌహిణీ సేనతో వచ్చాడు. జయద్రథుడూ మొదలైన సింధు, సౌవీర దేశాల రాజులు ఒక అక్షౌహిణీ సేనతో వచ్చారు. మహిష్మతీ ప్రభువైన నీలుడూ, యాదవ వీరుడైన కృతవర్మా, అవంతీశ్వరులూ సోదరులూ అయిన విందుడూ, అనువిందుడూ అనే ఇద్దరు కలిసి నలుగురూ ఒక్కొక్క అక్షౌహిణితో వచ్చారు.

ఇంకా అనేక దిక్కుల నుంచి వచ్చి చేరిన సేనలు మూడు అక్షౌహిణులు అయ్యాయి. కౌరవులకి సహాయపడడానికి వచ్చిన సేనలు పదకొండు అక్షౌహిణులు అయ్యాయి. అలా యుద్ధ పరికరాలతో వచ్చి పాండవుల సేనని ఎదుర్కోడానికి వచ్చి చేరిన సేనలకి హస్తినాపురంలో విడిది చెయ్యడానికి స్థలం చాలలేదు.

ఆ సేనల నాయకులకి ఉండడానికి కూడా స్థలం చాలకపోవడం చూసి దుర్యోధనుడు సంతోషంతో సైన్యానికి అనేక చోట్ల విడిది ఏర్పాటు చేశాడు. ఈ రకంగా కురుజాంగకంలోను, రౌహితకారణ్యంలోను, మరుదేశంలోనూ, అహిచ్ఛత్రంలోనూ, కాలకూటంలోనూ, గంగాకులంలోనూ, వారణావతంలోనూ, వటస్థనంలోనూ స్వేచ్ఛగా విడిదికి ఏర్పాటు చేసి ధనము, ధాన్యము మొదలైన వస్తువులన్నీ సమృద్ధిగా ఉండడం వల్ల దుర్యోధనుడు సంతోషంగా ఉన్నాడు.

Exit mobile version