Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మహాభారత కథలు-141: వృత్రాసురుడితో యుద్ధం చేసిన ఇంద్రుడు

[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]

వృత్రాసురుడితో యుద్ధం చేసిన ఇంద్రుడు

వృత్రుడు గొప్ప భుజబలంతో ప్రకాశిస్తూ ఇంద్రుడితో యుద్ధం చెయ్యడానికి వెళ్లాడు. ఇంద్రుడు అతడితో యుద్ధం చెయ్యడానికి ఎదురు వెళ్లాడు. ఇద్దరికీ ఆశ్చర్యకరమైన యుద్ధం జరుగుతోంది. వృత్రుడు పట్టుదల, బలమూ చూపిస్తూ దేవతలు భయపడేలా ఇంద్రుణ్ని ఆకలి వేసినవాడు మింగినట్టు మింగేశాడు. దేవతలు వెంటనే రాక్షసుణ్ని ఆవులించేలా చేశారు. రాక్షసరాజు వృత్రుడు బడలికతో ఒళ్లు విరుచుకుని ఆవులించాడు. వెంటనే ఇంద్రుడు శరీరాన్ని చిన్నదిగా చేసుకుని వేగంగా బయటికి వచ్చేశాడు. మళ్లీ పట్టుదలతో యుద్ధనికి దిగాడు కాని, త్వష్టయొక్క నిర్మలమైన తపస్సు వల్ల వృత్రుడి భుజబలం దేవతలు భయపడేలా ఇంద్రుడి శక్తికి మించినదయింది.

వృత్రుడి అమితమైన బలానికి తట్టుకోలేక ఇంద్రుడు మందరపర్వత శిఖరానికి వెళ్లిపోయాడు. దేవతలు కూడా ఇంద్రుడి దగ్గరికి వెళ్లి వృత్రుడిని చంపేందుకు ఉపాయం ఆలోచించమన్నారు. ఇంద్రుడు ‘అందరం కలిసి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్లి ఆయన ఎలా చెయ్యమంటే అలాగే చేద్దాము’ అన్నాడు.

అందరూ మునులతో కలిసి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్లారు. రాక్షసుడి విషయం చెప్పి “ఓ భూతనాథా! ఎంతో ఉత్సాహంతో ఎప్పుడూ రాక్షసుల గర్వం అణిచి దేవేంద్రుడి సంపదల్ని అభివృద్ధి చేయడం నీకు సహజం కదా! లోకాలు ఆనందించేలా శత్రుసంహారం చెయ్యి!” అని ప్రార్థించారు.

వాళ్లు చెప్పినది విని విష్ణుమూర్తి “నేను ఒకటి చెప్తాను వినండి. అతడికి దేవేంద్రుడితో సంధి చేయండి. ఆ సమయంలో నేను కూడా వజ్రాయుధం అంచులో రహస్యంగా దాగి ఉంటాను. నా తేజస్సు వల్ల ఇంద్రుడికి ఉత్సాహం కలుగుతుంది. అప్పుడు శ్రమ లేకుండా శత్రువుని జయించవచ్చు” అన్నాడు.

అందరూ సంతోషంగా తిరిగి వచ్చి మునుల్ని సంధి కోసం వృత్రాసురుడి దగ్గరికి పంపించారు. మునులు అక్కడికి వెళ్లి “ఇంద్రుడు గొప్ప భుజబలం కలవాడు. అతణ్ని జయించడం సాధ్యం కాదు. అలాగే నున్ను జయించడం కూడా సాధ్యం కాదు. మీ ఇద్దరిలో గెలుపు ఎవరికీ లభించదు. మరి మీరిద్దరూ విజృంభించి యుద్ధం చేసి లోకాల్ని బాధపెట్టడం ఎందుకు? స్నేహం కంటే శత్రుత్వం గొప్పది కాదు. ఇంద్రుడి సంపదకి యోగ్యుడివిగా ఉండి అనందంగా అతడితో స్నేహంగా ఉండు.. ఇదే ఇద్దరికీ మంచిది” అని చెప్పారు.

అది విని వృత్రాసురుడు “గొప్పతనం కోసం (తేజోవిశేషం కోసం) ఆశించే మాకిద్దరికీ స్నేహం కుదురుతుందా” అన్నాడు. మునులు “సజ్జనులకి మైత్రి లభించినప్పుడు చెయ్యకపోవడం నీతి కాదు. మహేంద్రుడు లోకాలన్నీ మెచ్చుకునే మంచితనం కలవాడు. కనుక, అతడితో బంధుత్వం మంచిది” అన్నారు.

వృత్రుడు వాళ్లు చెప్పినదానికి అంగీకరించి “నేను ఒక పద్ధతి చెప్తాను. మీరు దాన్ని కాదనకుండా చేసి ఇంద్రుడికీ నాకు సంతోషం కలిగేలా తగినట్లు దృఢంగా సంధి చేయండి” అన్నాడు.

మునులు “అదెలా?” అని అడిగారు. వృత్రుడు “తడిసినదానితోగానీ, ఎండినదానితోగానీ, కర్రతోగానీ, రాయితోగానీ, శస్త్రాలతోగానీ, అస్త్రాలతోగానీ, పగలుగానీ, రాత్రిగాని నేను చావకూడదు” అన్నాడు.

వాళ్లు అందుకు అంగీకరించి అతడు అడిగినట్లే వరాలిచ్చి వృత్రుడికీ, ఇంద్రుడికీ సంధి చేసి ఇంద్రుడి దగ్గరకు వెళ్లి జరిగినది చెప్పి తమ నివాసాలకి వెళ్లిపోయారు. ఇంద్రుడు సుఖంగా ఉన్నా కూడా ఎంతో కాలంగా ఉన్న విరోధాన్ని సహించలేకపోయాడు. విష్ణుమూర్తి ప్రయత్నమూ, మునులు చేసిన సంధి విధానమూ గ్రహించి శత్రువుని ఓడించే మార్గాన్ని వెతుకుతూనే ఉన్నాడు.

ఒకరోజు సముద్రతీరంలో తన విరోధి అయిన వృత్రుణ్ని చూశాడు. తనలో ఆలోచిస్తూ “ఇప్పుడు వీడిని నా భుజబలంతో వజ్రాయుధంతో సంహరిస్తాను. ఇది రాత్రి కాదు; పగలుకాదు; గొప్ప పరాక్రమం ప్రదర్శించడానికి తగిన సమయం. నా బలాన్ని పట్టుదలని చూపించడానికి సరిపడిన సాధనం ఏది దొరుకుతుందో కదా!” అనుకున్నాడు.

ఇంద్రుడు అక్కడ ఉన్న సముద్రపు నురుగుని చూశాడు. “ఇది తడిదీ కాదు; పొడిదీ కాదు” అంటూ వజ్రాయుధంతో కూర్చి జతపరిచి మిక్కిలి వేగంతో వృత్రుణ్ని కొట్టడానికి సంకల్పించాడు. వెంటనే విష్ణుమూర్తి అనువుగా ఆ సముద్రపు నురుగులోకి ప్రవేశించి అ రాక్షసుడిని సంహరించాడు.

ఇంద్రుడు మిక్కిలి భక్తితో విష్ణుమూర్తిని మనస్సులో పూజించాడు. లోకాలన్నీ సంతోషించాయి. ఆ విధంగా విజృంభించి శత్రువుని సంహరించి ఇంద్రుడు తన నగరానికి వెళ్లిపోయాడు. కానీ, పంచభూతాలు ఏకమై “ఇలా బ్రహ్మహత్య చేయవచ్చునా?” అని అతడిని నిందించాయి.

అతడి సంపదంతా పోయింది. అటువంటి హీనస్థితిలో అక్కడ ఉండలేక ఇంద్రుడు నిషధపర్వతానికి వెళ్లి దాక్కున్నాడు. దేవతలందరూ భయపడి తమ స్వర్గ సంపదల్ని కాపాడడానికి తగిన గొప్పతనం కలవాడు కావాలని అందుకు నహుషుడు తగినవాడని నిర్ణయించుకున్నారు.

సురరాజ్యానికి అభిషిక్తుడైన నహుషుడు

దేవతలు నహుషుడి దగ్గరికి వెళ్లి ఇంద్రుడి విషయం చెప్పి “ఇంద్రపదవిని స్వీకరించి మమ్మల్ని కాపాడు” అని చెప్పారు.

నహుషుడు “అటువంటి గొప్ప పని చెయ్యడానికి నాకు సామర్థ్యం ఉందా? ఎందుకు నన్ను శ్రమ పెడతారు?” అన్నాడు.

దేవతలు అతణ్ని ప్రార్థించి మునుల సభలో యముడూ, వరుణుడూ మొదలైన దేవతలు సంతోషంతో తమ తమ శక్తి సామర్థ్య గర్వాల్ని నహుషుడికి పంచిపెట్టారు. అతణ్ని మహాబలవంతుడిగా చేసి తీసుకుని వెళ్లి పూజ్యమైన దేవరాజ్యానికి ఇంద్రుడిగా అభిషేకించారు.

నహుషుడు ధర్మం తప్పకుండా కిన్నరలూ, కింపురుషులూ, గరుడులూ, గంధర్వులూ, సిద్ధులూ, విద్యాధరులూ మొదలైన దేవతలందరి తేజస్సుల అంశాలు తీసుకుని గొప్పవాడై దేవతలూ, మునులూ సేవించే దేవేంద్ర పదవిని స్వీకరించాడు. తుంబురుడూ, నారదుడూ మొదలైనవాళ్లు వినోదం కలిగిస్తుండగా; రంభ మొదలైన అప్సరసలు సేవిస్తుండగా; ఇష్టభోగాలు అనుభవిస్తూ, అహంకారంతో విర్రవీగుతున్నాడు. ఒకరోజు సాటిలేని అందం కలిగిన శచీదేవి అతడికి కనిపించింది. స్వర్గరాజ్యాధిపత్యంలో ఉన్న తన దగ్గరకు శచీదేవి రాలేదని తన దగ్గరకు రమ్మని చెప్పమని కబురు పంపించాడు. శచీదేవి బృహస్పతిని శరణు వేడింది.

బృహస్పతి ఆమెని గౌరవంగా ఆదరించి “నిన్ను నహుషుడి దుష్ప్రవర్తన నుంచి కాపాడుతాను. ఇంద్రుడు వెంటనే తిరిగి వచ్చేలా ప్రయత్నిస్తాను” అని ఓదార్చాడు.

నహుషుడు కోపంతో మహర్షుల్ని “నేను శచిని రమ్మని పిలిస్తే బృహస్పతి ఆమెని తన ఇంటిలో ఉంచడం తగిన పనేనా?” అని అడిగాడు. అందుకు మహర్షులు “అయ్యో! నీ గొప్పతనానికి పరస్త్రీని కోరడం మంచి పని కాదు” అని చెప్పారు. వాళ్ల మాటలు విని నహుషుడు “పూర్వం ఇంద్రుడు గౌతమ మహర్షి భార్య అహల్యని మనస్సులో కోరుకున్నప్పుడు మీరు ఇలా జ్ఞానాన్ని ఎందుకు బోధించలేక పోయారు?” అని అడిగాడు.

మహర్షులు, దేవతలు నహుషుడి మాటలకి భయపడి బృహస్పతి దగ్గరికి వెళ్లి “మహానుభావా! నహుషుడు ఇప్పుడు దేవేంద్ర పదవిని అలంకరించాడు. అతడు శచిని కోరడం ఉచితమే. అతడి కోపం తగ్గి, లోకాలకి మేలు కలిగేట్లు ఆమెని అతడి దగ్గరికి పంపించు” అన్నారు.

వాళ్ల మాటలు విని శచిదేవి దుఃఖంతో బాధపడుతూ బృహస్పతితో “నన్ను మీరు నహుషుడి దగ్గరికి పంపితే దోషం కాదా? నింద రాదా? పాపం కాదా? మీరందరూ ఇన్నాళ్లనుంచి నా పవిత్రతని పొగడడం వట్టి మాటలేనా?” అంది.

బృహస్పతి చిరునవ్వు నవ్వుతూ “నహుషుడు అజ్ఞాపించేవాడట! ఈ మునులూ, వేల్పులూ విధిని ఆచరించడంలో ఆసక్తి కలవాళ్లట. అది లోకాలకి మేలు కలిగిస్తుందట! ఇంత గొప్ప పనిని మనం చెయ్యకుండా ఎలా ఉండగలం?” అని ఎత్తిపొడిచాడు. దేవతల్నీ, మునుల్నీ చూసి “పూర్వం బ్రహ్మలోక శ్రేయస్సుకోసం శరణన్నవాళ్లని కపాడగలిగి ఉండీ పొమ్మని పంపేస్తే పుణ్యలోకాలు ఉండవనీ, పుణ్యకార్యాలు ఫలించవనీ అనలేదా?” అన్నాడు.

అది విని మహర్షులు “అలా అయితే ఇప్పుడు ఏం చెయ్యాలో ఆలోచించు” అన్నారు. బృహస్పతి “శచీదేవి అతడు కోరినట్టుగా రావడానికి వ్యవధి కావాలని అడిగి రావాలి! తరువాత మనందరం ఇంద్రుడికి మంచి జరిగేలే చేద్దాం!” అన్నాడు.

శచీదేవి నహుషుడి దగ్గరకి వెళ్లి నెమ్మదిగా “ఇంద్రుడు ఉన్నాడో లేదో తెలియదు. బాగా వెతికించి స్పష్టంగా తెలుసుకుని నిర్భయంగా ఇక్కడికి రావడం బాగుంటుంది. నా మనస్సు సందేహంతో భయపడుతూ ఉండగా తొందరపడడం ఎందుకు? నీకంతా తెలుసు. ఇప్పుడు వ్యవధి ఇవ్వడం మంచిదని నా అభిప్రాయం”అని నహుషుణ్ని ఒప్పించి, కొంతకాలం వ్యవధి అడిగి వచ్చింది. దేవతలతోను, మునులతోను కలిసి రహస్యంగా విష్ణుమూర్తి దగ్గరికి వెళ్లింది. ఇంద్రుడి పాపం పోగొట్టమని అడిగింది. విష్ణుమూర్తి శచీదేవి అడిగినదానికి “అశ్వమేధయాగం చేసి నాకు ప్రీతి కలిగిస్తే ఇంద్రుడికి పుణ్యం కలుగుతుంది” అని చెప్పాడు.

నహుషుడి తేజస్సుకి ఆశ్చర్యపడిన ఇంద్రుడు

ఇంద్రుడు తన బ్రహ్మహత్యాపాతకం పోగొట్టుకున్నాడేగాని, నహుషుడికి ఉన్నంత బలం తనకు లేదని బాధపడి ఎక్కడికో వెళ్లిపోయాడు. ఇంద్రుడి భార్య శచీదేవి ‘ఇంద్రుడు ఇప్పుడు ఎక్కడికి వెళ్లాడో’ అని మనసులో బాధపడుతూ రాత్రివేళ ఉపశ్రుతిని పూజించింది. ఉపశ్రుతి నిజరూపంలో దర్శనమిచ్చింది. శచీదేవికి ఆమె ఎవరో తెలియలేదు.

ఆమె శచీదేవితో “నేను ఉపశ్రుతిని, నీ పాతివ్రత్యానికి, శుచిత్వానికి సంతోషించి వచ్చాను. నీకు ఇంద్రుడిని చూపిస్తాను రా!” అని వెంటబెట్టుకుని హిమవంతానికి ఉత్తరంగా ‘ముంజుమంతం’ అనే పర్వతం దగ్గరికి వెళ్లి, దానిలో నూరామడల వైశాల్యం కలిగిన ఒక కొలనులో ప్రవేశించి, అక్కడ వికసించిన అయిదు సుందర పద్మాలలో ఒకదాని కాడని చీల్చి తను ముందు ప్రవేశించింది. శచీదేవి కూడా అమె వెంట వెళ్లి దాని దారాల మధ్య సూక్ష్మరూపంలో ఉన్న ఇంద్రుడిని చూసింది. వెంటనే ఉపశ్రుతి మాయమైపోయింది. భర్త దగ్గరికి వెళ్లి ఆశ్చర్యంగా అతడిని చూస్తూ అంతకు ముందు అతడు చేసిన మంచి పనుల్ని పొగుడుతూ మాట్లాడింది.

ఇంద్రుడు అమెని చూసి “గుణవంతులలో ఉత్తమురాలా! శచీ! నేనిక్కడ ఉన్నట్లు నీకు ఎలా తెలిసింది? నువ్వు నన్ను చూడ్డానికి వచ్చిన కారణం ఏమిటి?” అని అడిగాడు.

శచీదేవి నహుషుడు పోయిన పోకడలూ, వాటిని తప్పించుకున్న విధమూ, ఉపశ్రుతి వృత్తాంతము కూడా చెప్పింది. తరువాత “దేవా! నువ్విప్పుడు బయటికి వచ్చి నీ ప్రతాపంతో నహుషుణ్ని అవమానించి, నన్ను రక్షించకపోతే, వంచకుడైన అతడి దుష్ట నిర్ణయం వల్ల ఆపద కలుగుతుంది” అని చెప్పింది.

భార్య చెప్పినది విని ఇంద్రుడు “నహుషుడి భుజబలగర్వం మునుల సముజ్జ్వలమైన ఆదరం వల్ల బాగా వృద్ధి పొందింది. అందువల్ల అతడిని జయించడానికి కొంతకాలం వేచి చూస్తున్నాను. సమయం వచ్చేదాక శత్రువుని సహించడం రాజనీతి. నువ్వు నేను చెప్పినట్లు చెయ్యి. నువ్వు అతడితో నన్ను పొందాలనే ఉద్దేశం నీకు ఉంటే మహర్షుల్ని వాహనంగా చేసుకుని నా దగ్గరికి రా! అని చెప్పు. అంతటితో అతడి పని పూర్తవుతుంది” అన్నాడు.

శచీదేవి భర్త చెప్పినదానికి అంగీకరించి అతడి దగ్గర సెలవు తీసుకుని, నహుషుడి దగ్గరికి వచ్చింది. నహుషుడు ఆమెని చూసి సంతోషంతో మళ్లీ తన కోరికని తెలియచేశాడు. శచీదేవి నహుషుడితో “మనం ఏర్పరుచుకున్న సమయానికి ఇంకా కొంత వ్యవధి ఉంది. ఆ సమయం వచ్చినప్పుడు నిన్ను వరిస్తాను. నువ్వు మహర్షులని వాహనంగా చేసుకుని రావాలి. అది నాకు ఇష్టం. ఎవరికీ లేని వాహనం నీ తేజస్సుని పెంచుతుంది” అని చెప్పింది.

శచీదేవి మాటలు విని మనస్సులో సంతోషపడుతూ నహుషుడు “నాకు తప్ప ఇతరులకి ఎవరికైనా అటువంటి వాహనం ఎక్కడం సాధ్యమయ్యే పనేనా? నీకు ఇష్టం కలిగేట్లు సప్తర్షులు నా వాహనం మోస్తుండగా నీ దగ్గరికి వస్తాను” అని శచీదేవికి చెప్పాడు.

తరువాత మహర్షుల్ని రప్పించి వాళ్లని వాహనంగా చేసుకుని అన్ని చోట్లా తిరిగాడు. శచీదేవి బృహస్పతి దగ్గరికి వెళ్లి “నహుషుడు ఎదురుచూసే సమయం ఇంకెంతో దూరంలో లేదు. ఈ సమయంలో ఏకాగ్రమైన మనస్సుతో ఇంద్రుడిని అనుగ్రహించాలి. మిమ్మల్ని శరణు కోరి వచ్చిన నన్ను రక్షించాలి” అంది.

బృహస్పతి శచీదేవి అభ్యర్థన విని “ఆ నహుషుడి వల్ల నీకు ఆపద రానివ్వను. అతడికి ఆపద కలిగేట్లు నేను హోమం చేస్తాను. దానివల్లా, మునివాహనం ఎక్కడం వల్లా అతడు నిలకడ కోల్పోతాడు. ఉపాయంతో నీ భర్త ఉన్నచోటు తెలుసుకుంటాను” అని ఊరడించాడు. వెంటనే అగ్నిదేవుణ్ని పూజించి, ఇంద్రుడి వృత్తాంతం చెప్పి, అతడిని వెదకడానికి పంపించాడు.

Exit mobile version