[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]
పాండవులకి సంజయుడితో ధృతరాష్ట్రుడి సందేశం
ధృతరాష్ట్రుడు చెయ్యవలసిన పని గురించి వివరంగా చెప్పి సంజయుణ్ని ఉపప్లావ్యనగరానికి పంపించాడు. సంజయుడు బయలుదేరి ఉపప్లావ్యనగరంలో ప్రవేశించాడు. శ్రీకృష్ణుడి భవనంలో అంతఃపురపు వేడుకల్లో అర్జునుడితో కలిసి ఉన్న అతడికి తను వచ్చిన వార్త తెలియచేశాడు. లోపలికి వెళ్లి భయమూ, భక్తీ, వినయాలతో వాళ్లిద్దర్నీ పలకరించాడు. ఆ మహనీయులు చేసిన మర్యాదలు పొంది సంతోషంతో ధర్మరాజు పెద్ద కొలువు తీర్చే సమయం కోసం కాచుకుని ఉన్నాడు.
తరువాత అతడిని దర్శించి, సాష్టాంగ నమస్కారం చేశాడు. ధర్మరాజు సంజయుణ్ని ఆదరించి దగ్గర కూర్చోబెట్టుకున్నాడు. సంజయుడు ధర్మరాజుతో “నిన్ను చూడగలగడం నా అదృష్టం. పుణ్యవంతుడైన మీ తండ్రి ధృతరాష్ట్ర మహారాజు మీరు ఇక్కడ ఉండడం విని ప్రేమతో తమ్ముళ్లూ, నువ్వూ, ద్రౌపదీ, నీ కొడుకుల క్షేమ సమాచారం తెలుసుకోడానికి నన్ను ఇక్కడికి పంపించారు” అన్నాడు.
ధర్మరాజు సంజయుడు చెప్పింది విని “ధృతరాష్ట్ర మహారాజుకి మా మీద ఉన్న దయవల్ల మేము ఇక్కడ ఇలా సుఖంగా ఉన్నాము. నిన్ను ఇక్కడికి పంపించి మా మీద చూపించిన వాత్సల్యానికి నా మనసు సంతోషించింది. రాజైన ధృతరాష్ట్రుడు క్షేమమేనా? అతడి కొడుకులు దుర్యోధనుడు మొదలైనవాళ్లు క్షేమంగా ఉన్నారా? మనుమలు సంతోషంగా పెరుగుతున్నారా? పట్టణాల్లోను, పల్లెల్లో ఉండే ప్రజలందరూ సంతోషంగా ఉన్నారా?
ద్రోణుడూ, కృపుడూ, అశ్వత్థామ సుఖంగా ఉన్నారా? సుప్రసిద్ధుడైన భీష్ముడు క్షేమంగా ఉన్నాడా? కౌరవులు అతడికి పెద్దరికం ఇచ్చి నడుచుకుంటున్నారా? బ్రాహ్మణులకి ఆదరం ఉన్నదా? మేము ఇష్టంతో వాళ్లకిచ్చిన జీవనోపాధులు కొనసాగుతున్నయా? ఇతరులనుంచి ఏ బాధలు లేవు కదా? అక్కడ కలతలు పుట్టినప్పుడు వాళ్లు గాండీవి బాహుపరాక్రమం తలుచుకుంటారా? భీముడి గదాయుధ యుద్ధ నైపుణ్యాన్ని ప్రశంసిస్తారా? నకుల సహదేవులు భయంకరులైన శత్రువుల భూముల్ని క్రమక్రమంగా ఆక్రమించడం స్తుతించబడుతోందా?
ఒక్క రోజా! వాళ్ల ఎదుట ఎన్నోసార్లు ఆటోపంతో నేల కుంగిపోయేలా యుద్ధాల్లో గెలవడం కళ్లారా చూసి కౌరవులు పాండవుల్ని ప్రశంసించకుండా ఉంటారా? గంధర్వులు పెద్దపెట్టున ఘోషయాత్రకి వచ్చిన ఆనాటి వృత్తాంతం మర్చిపోతారా? సంజయా విను! మనిద్దరం మధ్యవర్తులం. యుద్ధంలో అర్జునుడిని ఎదిరించి ఇంతకుముందు ఎప్పుడైనా, ఎవరికైనా మానప్రాణాల్ని రక్షించుకోగలగడం సాధ్యపడిందా? నువ్వే చెప్పు. దుర్యోధనుడి ఇంట్లో వచ్చే పేచీ పూచీలకి నేనున్నానంటూ నేర్పు ప్రకటించే కర్ణుడి పెత్తనం బాగా సాగుతోందా?” అన్నాడు.
అంతా నిన్న సంజయుడు “దుర్యోధనుడి దగ్గర అవినయపరులూ, నీతిమంతులూ, సత్త్వగుణసంపన్నులూ, దురభిమానులూ ఇంకా ఎన్నో రకాలవాళ్లు చేరి ఉంటారు. వాళ్లు ఒకళ్ల మాట ఇంకొకళ్లు వినిపించుకోరు. కాబట్టి, వాళ్లని గురించి ప్రస్తావించడం అనవసరం. నా మనవి శ్రద్ధగా అలకించు. నువ్వు చంద్రుడిలా చల్లనైన నిర్మలహృదయంతో సంధి చేసుకోవాలని అనుకున్నావు. వారికందరికీ క్షేమం ఇంతకు ముందు లేకపోయినా ఈరోజు మొదలుకుని కలుగుతుంది.
ధృతరాష్ట్రమహారాజు ముదిమివల్ల, మనసు ఒకే విధంగా ఉండకపోవడం వల్ల అప్పుడు కొడుకుల ఔద్ధత్యం మానిపించలేక పోయాడు. ఇప్పుడశాంతుడయ్యాడు. ధర్మబద్ధమైన హృదయం కలిగిన ధర్మరాజా! ఇటువంటి దుర్మర్గాలన్నీ నువ్వు కరుణ కలిగిన మనస్సుతో సహిస్తే సమసిపోతాయి. నువ్వు అజాతశత్రువు అనే విషయం అన్ని లోకాలకి తెలిసిందే కదా?
బ్రాహ్మణులంటే అన్ని లోకాల్లో ఉండే అంధకారాన్ని పారద్రోలడానికి బ్రహ్మ చక్కగా నిలిపిన వెలుగే! అటువంటి వాళ్లకి సత్పురుషులు కలిపించిన జీవనోపాధుల్ని ఎటువంటి దుర్బుద్ధులయినా నశింప చేస్తారా? అలా చేస్తే ఎక్కువకాలం బతకరు, బతికినా నిర్భాగ్యులవుతారు కదా! ఒక్కొక్కప్పుడు శత్రువులు ఎదుర్కున్నప్పుడు జనుల మనస్సులలో నిండి ముఖాల్లో కనిపించే అమిత దుఃఖంతో ‘అయ్యో! ఇప్పుడు భీముడైనా, మన అర్జునుడైనా మాద్రి కొడుకులైనా ఏ ఒక్కడు ఉన్నా ఈ శత్రువుల్ని ఒక చిటికెలో రూపుమాపరా’ అనుకుంటారు.
ధర్మరాజా పాండవులకి అధికంగా కోపం వచ్చినా, అధర్మం మాత్రం చెయ్యరు. వాళ్లు వారించలేని పరాక్రమం కలవాళ్లయినా శాంత స్వభావులు అని ప్రజలంటారు. ధర్మరాజా! నీ నలుగురు తమ్ముళ్లూ, నీ ఆత్మీయులూ, కృష్ణుడూ వింటుండగా నీకు నేను సభలో మనవి చేయవలసిన మాటలు ఉన్నాయి. వాటిని మొదటి నుంచి చివరిదాకా విను” అన్నాడు.
అతడి మాటలకి ధర్మరాజు “తమ్ముళ్లూ, ఆత్మీయులూ, కృష్ణుడూ ఇరుగో ఇక్కడే ఉన్నారు. సభలో ఉన్న మిగిలినవాళ్లు అందరు ఇరుగో వింటుంటారు. తండ్రి ఏమి చెప్పమని నిన్ను ఇక్కడిక పంపించాడో స్పష్టంగా చెప్పు” అన్నాడు.
ధర్మరాజు గడుసుగా మాట్లాడిన విధానానికి సంజయుడు మనసులో భయపడ్డాడు. శ్రీకృష్ణుణ్ని భక్తితో చూసి; భీముణ్నీ, అర్జునుణ్నీ, నకులసహదేవుల్నీ, దృష్టద్యుమ్నుణ్నీ వినయపూర్వకంగా చూసి; ద్రుపదుణ్నీ, విరాటుణ్నీ ఇష్టంగా చూసి సావధనంగా వినమని చెప్పి, ధర్మరాజుకి చేతులు జోడించి చెప్పాడు. “ధృతరాష్ట్ర మహారాజు శాంతం వహించి, పని విషయంలో మిక్కిలి ప్రసన్నత పొంది, నన్ను ఇక్కడికి ప్రీతితో పంపించేటప్పుడు ఎంతో వేడుకతో తనే నేర్పుని స్పష్టంగా బోధించి, నాకు రథం సిద్ధపరిచమని ఆజ్ఞాపించాడు. ఈ విధంగా పొత్తు కోసం ఇంత శ్రద్ధ వహించాడు.
ఈ అదనులో మనం తెలివి కలిగి వ్యవహరించడం మంచిది. అన్ని ధర్మాలూ, తెలిసినవాళ్లూ, శాంతస్వభావులూ అని పేరుపడ్డ మీ వంటి వాళ్లకి ఏ విధంగా చూసినా లాఘవాన్ని కలిగించే పని చెయ్యాలనుకోవడం ధర్మమవుతుందా? కార్య నిర్వహణలో నేర్పు చూపే ధర్మరాజా! పరిశుద్ధమైన వస్త్రంలా, మసి అంటుకున్నట్లు మీ సద్వంశంలో దుర్యోధనుడి మూలాన మచ్చ ఏర్పడింది. దాన్ని పోగొట్టడానికి నువ్వే సమర్థుడివి.
కరుణాసముద్రా! ధర్మరాజా! రాజులందరూ నశించి, పర్యవసానంలో జయపజయాలు రెండూ లాభదాయకం కాని ఈ పనికి సజ్జనులు పూనుకుంటారా? అదీకాక, నువ్వు యుద్ధంలో వృద్ధుల్నీ, పిల్లల్నీ, మిత్రుల్నీ, బంధువుల్నీ, గురువుల్నీ చంపితే ఆ సుఖాలన్నింటి వల్ల ప్రయోజనం ఏముంటుంది? నీకు శ్రీకృష్ణుడు పెట్టని కోట; భీముడూ, అర్జునుడూ యుద్ధంలో ప్రజ్వలించే మంటలు; సాత్యకీ, విరాటుడూ ఆపాటి వీరులే. మేరుపర్వతంతో సమనుడైన ద్రుపదుడు కూడా భయంకర యుద్ధంలో ప్రకాశించేవాడు. యుద్ధానికి ఇష్టపడవు గాని, దేవతలకయినా నిన్ను ఇలా అలా అనడానికి శక్యమా?
ఇంక కౌరవ పక్షంలో ద్రోణుడూ, భీష్ముడూ, కృపుడూ, అశ్వత్థామ, కర్ణుడూ, శల్యుడూ తమ ప్రాణాలు ఆ దుర్యోధనుడివే అంటారు. తమ్ముళ్లు గొప్ప పరాక్రమవంతులూ, కొడుకులు జయించడానికి శక్యం కానివాళ్లు. బాహ్లికుడూ, సోమదత్తుడూ శివుడికి కూడా భయపడరు. వాళ్లని జయించడం ఎవరికీ శక్యం కాదు.
ధర్మరాజా! ఇటువంటి మీరు ఒకళ్లతో ఒకళ్లు పోరాడడం వల్ల మేలు కలుగుతుందని నాకు అనిపించదు. ఇంకా రెండు పక్షాలవాళ్లకీ సంతోషాన్నీ, శ్రేయస్సునీ అకాంక్షించే వాళ్లని అడిగి చూడు” అని చెప్పి సంజయుడు ఒకసారి సభ మొత్తం చూశాడు.
మళ్లీ చెప్పాడు “కృష్ణుడికి మొక్కుతాను, అర్జునుడికి చేతులు జోడిస్తాను; తక్కిన మిత్రుల, బంధువుల, హితుల, ప్రియుల, మంత్రుల, వయస్యుల సమూహానికి సవినయంగా మనవి చేస్తాను. కోపాలు మాని అనుమతించండి. ఈ దయాళుడైన ధర్మరాజుని కోపోపశమనానికి నేను ఇదుగో శరణు వేడుతాను” అన్నాడు.
నమస్కారం చేస్తూ ధర్మరాజు వైపు చూస్తూ “దేవా! శాంతించడం మంచిది. దీనికి భీష్ముడు కూడా సంతోషిస్తాడు. అతడికి సమ్మతమైన విధానం లోకాలన్నింటికీ సమ్మతమవుతుంది” అన్నాడు మళ్లీ.
అతడి మాటలు విని ధర్మరాజు “సంజయా! యుద్ధానికి నువ్వు భయపడుతున్నావు. ఇప్పుడు నేను చెప్పినదాంట్లో చెలిమి తప్ప వేరొకటి నీకు వినిపించిందా? మాకు కూడా యుద్ధం లేకుండా జీవించడం తగిన పనే కదా? యుద్ధం లేకుండా ప్రయోజనం కలిగితే ఏ వెర్రివాడయినా దాని వల్ల వచ్చే ప్రయోజనాన్ని వదులుకుంటాడా?
ప్రజలకి మేలు చేసేవి, ధర్మాన్ని అనుసరించేవి అని ప్రశంసించతగిన పనులు చేసే భీమార్జునులు చెడు పనుల్ని అసహ్యించుకోకుండా ఉంటారా? జ్ఞానం లేని జనాలు దురాశకి లోబడి ఆలోచించకుండా మనస్సుకి కలిగే సంతోషం కోసం ఉత్సాహం కలిగించే పనులు చెయ్యడానికే ఉత్సాహం చూపిస్తుంటారు. సముచితమైన ఆశతో, తగిన విధంగా మంచిమార్గాన్ని అనుసరించేవాళ్లు క్రూరమైన పనులు ఎలా చేస్తారు?
యుద్ధాలు దుఃఖాలు కలిగిస్తాయే కాని, సుఖాలు కలిగించవు కదా? సుఖాలు వద్దా? అని అనుకుంటే.. వస్త్రాలు కట్టుకున్నప్పుడు, పూలమాలలు ధరించినప్పుడూ, గంధపు పూతలు పూసుకున్నప్పుడూ, నేర్పరులు నృత్త గీత వాద్యాలు చేసేటప్పుడు మేము దూరంగా ఉంటే మా తండ్రి ధృతరాష్ట్రుడికి ఏం బాగుంటుంది? అతడు కొడుకుల్నే పట్టుకుని మమ్మల్నెందుకు పొమ్మంటాడు?
అయినా ఒక మాట చెప్తాను పక్షపాతం లేకుండా విను. అయ్యో! ధృతరాష్ట్రుడు తనేమో అప్పుడు కుటిలుడై నీతిమార్గం విడిచిపెట్టాడూ! మమ్మల్నేమో సన్మార్గంలో నడవడానికి ప్రయత్నించండి! అంటూ ఇప్పుడు బుద్ధులు చెప్తున్నాడూ! ఎదుటివాళ్లని కూడా తమలాగే మనసులో భావిస్తే కుదురుతుంది కాని, ‘మాకు మొత్తం కుడుమంతా ఇవ్వండి, ఇదిగో మీరు ముక్క పుచ్చుకోండి’ అని పరిహాసం చేస్తే మనసులు చక్కగా కలుస్తాయా?
ఐశ్వర్యం పోగొట్టుకుని బలహీనులమై ఉన్న మమ్మల్ని పిలిచి పూజించడానికి ధృతరాష్ట్రుడు అంత వెర్రివాడా? చెప్పేవాళ్ల బుద్ధిని అప్పుడే ఆదరించలేదు. ఇంక ఎందుకు కుదురుతుంది. నువ్వు లేనిపోని ఆశలు పెట్టుకుని వచ్చి మమ్మల్ని ఊరికే బాధపెట్టకు. అతడి ప్రవర్తన నీకూ, మాకూ కొత్తా? ధృతరాష్ట్రుడు మంచి మాటలకి ఎప్పుడైనా సరే అంటాడా? కొడుకైన దుర్యోధనుడిని పరాక్రమవంతుడనే నమ్మకంతో విషం మింగినా ఊరుకుంటాడు.
జూదం వల్ల వచ్చే సంపదకి ఆశ పడకూడదని విదురుడు చెప్పినప్పుడు విని ఉంటే, కర్ణుడు మొదలైనవాళ్ల మాటలు ధృతరాష్ట్రుడు ఆదరించకుండా ఉండి ఉంటే దానితో తీరిపోయేది. ఇకమీదట కూడా ధృతరాష్ట్రుడు తన కొడుకులు దుర్యోధన దుశ్శాసనులూ, శకునీ, కర్ణుడూ ఎలా చెప్తే అలాగే నడిచి వాళ్ల మార్గంలోనే నడుస్తాడు కాని, మారుతాడా? ఇదీ అసలు స్వరూపం.
నీకు ఆ దుర్యోధనుడి చెడు నడవడిక మాన్పించడం శక్యం కాదని తెలియకపోవడం వల్ల నువ్వు అలా పెద్దమనిషి తరహాలో మాట్లాడుతున్నావు. ఇది వివేకం అనుకోవాలా? అవివేకం అనుకోవాలా? దుర్యోధనుడు చక్రాయుధుడైన శ్రీక్రుష్ణుణ్ని లెక్కించడు; పరాక్రమామనికి నిధి అయిన అర్జునుడికి కర్ణుడి బహుపరాక్రమాన్ని ప్రతిగ భావించి రాజ్యన్నంతా చక్కబరచుకోవాలని అనుకుంటున్నాడు” అని చెప్పి ఆగాడు.
కొంచెం కోపంతో ధర్మరాజు “ద్రోణుడూ, భీష్ముడూ, కృపుడూ, అశ్వత్థామా, కర్ణుడూ, దుర్యోధనుడూ.. వీళ్లందరికీ ఇంతకుముందు యుద్ధం ఏమిటో తెలియదా? రాజ్యకాంక్ష మొదలై ఆశల పాశాలు చుట్టుకుంటే యుద్ధాలు ఎలాగూ తప్పవు. వాళ్లు బలం తెలిసి కూడా చావడానికే ఎదుర్కుంటున్నారు. అర్జునుడి కపిధ్వజ కాంతులే వాళ్లని గుడ్డివాళ్లుగా చేస్తాయి.
సంజయా! విను. ముందు మమ్మల్ని పొగిడి తరువాత వాళ్లని యుద్ధంలో గెలవడం అసాధ్యమని పొందికగా నీవన్న మాట నేను అంగీకరించను. పక్షపాత బుద్ధి వదిలిపెట్టు. అర్జునుడి గాండివపు అల్లెతాటి ధ్వని అంతటా వ్యాపించినా, భీముడి బాహుదండం విజృంభించి ప్రకాశిస్తున్న గదని వేగంగా తిప్పుతూ కనబడినా, నకుల సహదేవులు ఏనుగుల జంటలా కలిసి విజృంభించినా కౌరవసంబంధీకులకి చావకుండా, పారిపోకుండా, భయంతో మూర్ఛపోకుండా ఉండడం శక్యమా?
యుద్ధంలో కౌరవుల్ని గెలవడం శక్యం కాదు అనే విషయం పక్కన పెట్టు. మంచివాడివి నువ్వు వచ్చావు అధికంగా ఉన్న కోపం తగ్గేటట్లు మాట్లాడావు. ఇంక మేము సహనంగా ఉంటాము. ఇంతకు ముందు మేము వాళ్ల అవగుణాల్ని సహించి ఉండడం నీకూ కొంచెం తెలుసు. అంతెందుకు, ఇకమీద కూడా అలాగే సహించి ఉంటామని అనుకో. మేము ఒక్క అపకారం కూడా చెయ్యము.
అటువంటి అనుమానాలు విడిచిపెట్టు. తండ్రి అయిన ధృతరాష్ట్రుడికి వివేకం కనుక ఉంటే, మళ్లీ బంధుత్వం కలిసేలా మామీద దయ ఉంచి మమ్మల్ని ఎక్కడికీ వెళ్లనీయకుండా తన గొప్పతనాన్ని లోకులు ప్రశంసించేలా.. మమ్మల్ని రండి! అని పిలిపించి; వాళ్లకి భాగస్వామ్యం ఇవ్వండి అని తన కొడుకులకి చెప్పి; ఇంద్రప్రస్థమో లేదా ఇంకో నగరమో మాకిచ్చి పంపించడం మంచిది కదా?” అన్నాడు.
