[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]
శ్రీకృష్ణుడు పాండవులు సంజయుల సంభాషణ
ధర్మరాజు చెప్పింది విని సంజయుడు అతడితో “నువ్వు పోనీలే అని ఎటువంటి తప్పుల్నైనా ఉపేక్షించి సహనమే వహిస్తావు కనుక, నువ్వు వినేట్లు ఇన్ని మాటలు చెప్పికూడా నేను తృప్తి పడక ఇంకా మనవి చేస్తున్నాను. అహింసా, నిందించడానికి శక్యంకాని నీ నడవడికలే నీకు ఐశ్వర్యం కాని వేరేమీ కాదు. కౌరవులు దుష్టస్వభావంతో మీకు రాజ్యభాగం ఇవ్వకుండా చెడిపోవాలనుకున్నా చెప్తున్నాను విను. మీ మంచి నడవడికకి భయంకరమైన నెత్తుటి కూడు తినడం కంటే, భిక్షమెత్తుకుని తినడం మేలు. అది ఎలాగని అడుగుతావేమో.. రాజసూయ యాగం అంత వైభవంగా; బ్రాహ్మణోత్తములకీ, దేవతలకీ సంతృప్తి కలిగించి; నీ శాంతి, నీ కర్మేంద్రియ నిగ్రహము, లోకాలతో ప్రశంసించబడేలా బ్రతికిన పుణ్యాత్ముడివి నువ్వు. ఇటువంటి నీ నడవడిక హింసతో కలుషితం కాకుండా ఉంటే ఎంత బాగుంటుంది?
నీతి లేకుండా కపటంతో జూదమాడడానికి ఏర్పాట్లు చేసి అంత ఘోరాలు చేసినవాళ్ల గర్వం ఎందుకు చెల్లనిచ్చావు? లోకులచేత తిట్లు తినేటట్లు ఎందుకు చేశావు? అడవుల్లో ఎందుకు అన్ని కష్టాలు పడ్డావు? ఓర్పే ధనంగా అన్ని పాట్లు పడ్డావు. అటువంటి బతుకు బతికి, చివరికి క్రూరమైన యుద్ధమార్గం అవలంబించి బంధువుల్నీ, పెద్దలనీ వెదికి చంపడం వల్ల కలిగే సుఖం ఎందుకు? ఆ సౌఖ్యం పెద్దలతో నిరసింపబడేది, నిలకడలేనిదీ. క్షుద్రులకి మింగడానికి చేదుగా ఉండే హాలాహలంలా పొంగే కోపాన్ని దిగమింగడంలో నీలకంఠుడి తరువాత నువ్వే అని చెప్పవచ్చు. అటువంటి నువ్వు కోపాన్ని తగ్గించుకోకపోతే నీకు పేరెలా వస్తుంది?” అన్నాడు.
సంజయుడు చెప్పినవన్నీ విని ధర్మరాజు సంజయుడితో “నువ్వు చెప్పినట్టే కొన్ని పనులు పైకి ధర్మాల్లా కనిపించి, తెలిసినవాళ్లు పరిశీలిస్తే ధర్మాలు కాకుండా పోతాయి. మరికొన్ని మొదట ధర్మాలుగా కనిపించక చివరికి ధర్మాలుగానే ఉంటాయి.. కనుక, నన్ను నిందించాలని అనుకుంటే ధర్మమో, అధర్మమో నిర్ణయించి మరీ నిందించు. కోపం విడిచిపెట్టాల్సిందే. అహింసే పరమ ధర్మము. అయినా వంశానికి చెడ్డపేరు తెచ్చేవాళ్లూ, లోకానికి బాధ కలిగించేవాళ్లూ అయిన దుర్మార్గుల్ని సమూలంగా నాశనం చెయ్యాలని పెద్దలంటారు.
అదంతా అలా ఉంచు. యుద్ధం రాజులకి ధర్మమో కాదో నువ్వే చెప్పు. అదీకాక, ఇది చెయ్యవచ్చు, ఇది చెయ్యకూడదు అని మనకి అజ్ఞాపించడానికి శ్రీకృష్ణుడు ఉన్నాడు. మనకి ఈ సందేహం ఎందుకు? ఇతడు ధర్మవేత్తలకే పెద్ద. కార్యాకార్య నిర్ణయాలకి గురువు. ఉచితానుచితాలు తెలిసినవాళ్లకి విశదీకరించి చెప్పగలిగినవాడు. ఇతడు అజ్ఞాపించడం వల్లే కద యదు, భోజాంధక, వృష్టి, సృజయ, కేకయ మొదలైన రాజులందరూ మంచిమార్గంలో నడుస్తున్నారు ముఖ్యంగా అతడి జ్ఞానమే ధర్మార్థ కామ మోక్షాలన్నింటికీ మూలాధారం అవడం వల్ల ఇతడి మాట మాకు తప్పక అనుసరణీయం (అనతిక్రమణీయం)” అన్నాడు.
ధర్మరాజు చెప్పింది విని శ్రీకృష్ణుడు సంజయుడితో “నేను ఎప్పుడూ నా మనసులో పాండవుల మంచిని కోరుకుంటాను. ధృతరాష్ట్రుడు కూడా కొడుకులు, మనుమల ఐశ్వర్యము అనే గొప్పతనంతో ప్రకాశిస్తున్నాడు. ఎవరికీ చెడు జరగకుండా ధృతరాష్ట్రుడు జ్ఞానం తెచ్చుకుని పాండవుల్ని ఓదార్చడానికి నిన్ను నిండు మనస్సుతో ఇక్కడికి పంపించాడని సంతోషించాను. నువ్వు కూడా తగినట్టుగా స్నేహమూ, ధర్మమూ, మర్యాదగా మృదువుగా చెప్పి వీళ్లు శాంతించే మార్గం ఏర్పడేలా మాట్లాడడం కూడా నాకు సంతోషం కలిగించింది.
పాపరహితుడా! సంజయా! ఇన్ని విషయాలు మాట్లాడుకున్నాక ధర్మరాజు చెప్పినది విన్నావు కదా! ధర్మరాజు మాటల తీరు చూస్తే సంధి కుదరదని అర్థమవుతోంది. ధర్మరాజు అభిప్రాయం సరయినదే! జరగవలసినవన్నీ జరిగిపోయాక సంధి ఎలా కుదురుతుంది?
ఎటుచూసినా దుర్యోధనుడు మహాగర్వి. ధృతరాష్ట్ర మహారాజు హృదయం మనకి కొంచెం తెలుసుకదా! ఆ రాజు ధృతరాష్ట్రుడు చూపించే స్నేహమూ, ఆదరమూ నువ్వు ఎంతో మధురంగా చెప్తావు. వీళ్లు తమ రాజ్యభాగం పొందకుండా వట్టినే చతురంగా మాట్లాడితేనే తృప్తి పొందుతారా? నువ్వే చెప్పు. పాండవులు పూర్వం జరిగినవన్నీ పెద్దగా పట్టించుకోకుండా ఏదో ఒక పద్ధతికి అంగీకరించి ఊరట చెంది శాంతం వహించి కౌరవులతో కలిసి జీవించడానికి అంగీకరించారంటే అది గొప్పతనమూ, ఓరిమీ, కనికరమూ, ధర్మమూ కాదా? లోకాచారాన్ని బట్టి తమ తండ్రి భాగం ఇవ్వట్లేదని తెగించి దండెత్తితే దండెత్తుతారు, అది ద్రోహమెలా అవుతుంది?
సంజయా! విను, పరాభవం పొంది ఇలా దీనంగా జీవిస్తూ పొందే పొగడ్తలకంటే, తేజస్సుతో ఎదుర్కొంటేనే మంచిది. ఇదంతా చూస్తుంటే వీళ్లకి యుద్ధమే మంచిదని నాకు అనిపిస్తోంది. ‘యుద్ధం క్షత్రియులకి ధర్మం అవునా కాదా చెప్పమని’ నిన్ను ధర్మరాజే అడిగాడు కదా! బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకి యజ్ఞం చేయడం, చేయించడం మొదలైన పనులు విభజన ధర్మశాస్త్ర గురువులు చెప్పేటప్పుడు (విధించేటప్పుడు) రాజులు ఇచ్చేవాళ్లేకాని, పుచ్చుకునేవాళ్లు కారని చెప్పడం లోకానికంతకీ తెలుసుకదా! అన్ని ధర్మాశ్రమ ధర్మాల్ని కాపాడవలసిన రాజులు తమే తమ ధర్మాన్ని విడిచిపెడతారా?
అదీకాకుండా, న్యాయం ఆర్జించిన తమకు కలిగిన సంపదని అనుభవిస్తూ సన్మార్గంలో నడుస్తున్నప్పుడు, తమకు ఎవరేనా అపకారం చేస్తున్నప్పుడు ఉపయోగించడానికే కదా ఈ శాస్త్రాస్త్రాల ధర్మాలు ఇంద్రుడు మొదలైన పెద్దలు నిర్ణయించారు? నువ్వు చెప్పే ధర్మాలు కౌరవులకి చెప్పవద్దా? వాళ్లు కదా రాబోయే అనర్థాలు తెలుసుకోకుండా కాని పనులు ఆచరిస్తూ అపమార్గంలో నడుస్తున్నారు?” అన్నాడు.
కొంచెం ఆగి శ్రీకృష్ణుడు మళ్లీ సంజయుడితో “ఎంత పోకిరితనం కాకపోతే సభలో వేలమంది ఎదురుగా ద్రౌపదిని ఆ విధంగా అవమనిస్తారా? ఎటువంటి దుర్మార్గులో తెలియట్లేదా? ఎక్కడా జూదం ఆడరా? ఎవరైనా ఇలా చేశారా?” అన్నాడు.
శ్రీకృష్ణుడి మాటలు విని సంజయుడు “దేవా! ఈ విషయాన్ని నీ మనస్సులో పెట్టుకుని ఇంతగా పట్టించుకుంటే కార్యం సఫలమవుతుందా?” అన్నాడు.
సంజయుడు అన్నదానికి కృష్ణుడు “ద్రౌపదిని కౌరవులు అవమానించేటప్పుడు భీష్ముడూ మొదలైన అక్కడి పెద్దలందరూ ధృతరాష్ట్రమహారాజు అభిప్రాయం తెలియకపోవటం చేత నోరు మెదపకుండా ఊరుకున్నారు. ఆ ధృతరాష్ట్రుడు కొడుకుల్ని కోపగించుకోలేదు. అతడే కనుక, వాళ్లని వారించి ఉంటే నా మనసే కాదు లోకుల మనసులన్నీ సంతోషపడి ఉండేవి కదా?
దుశ్శాసనుడు తిడుతూ వెళ్లి అ సభలో ఉన్న పెద్దల మధ్యకు ద్రౌపదిని అలా నిర్దాక్షిణ్యంతో జుట్టుపట్టుకుని ఈడుస్తుంటే మామగారయిన ధృతరాష్ట్రుడు ఎలా సహించాడు? పతివ్రత ఏడుపు విని ఎలా సహించగలిగాడు? మళ్లీ ఇప్పుడు క్షేమం తెలుసుకుని రమ్మని నేర్పుగా దూతని ఎలా పంపించాడు? ఆడుదాన్ని జుట్టుపట్టుకుని సభలోకి ఈడ్వడం మంచిది కాదని అడ్డుపడే ధైర్యం లేక సభలో ఉన్న వాళ్లందరు మనస్సుల్లో బాధపడి ఉన్న సమయంలో ఆ పతివ్రత తనను తానే కాపాడుకోగలగడం వల్ల అవమానం జరగక పాండవులు బ్రతికిపోయారు.
కాని, అటువంటి అవమానాన్ని రాచబిడ్డలు సహించవలసిందేనా? సంజయా! నువ్వు వినలేదా? ఆ సమయంలో కర్ణుడు అందరి చెవులకి గుచ్చుకునేట్లు ‘నీకు ఇక్కడ భర్తలు లేరు. నీ భర్తలు అని చెప్పబడే ఈ అయిదుగురూ నిన్ను జూదంలో ఓడిపోయి వదిలేశారు. అందువల్ల ఓ పద్మాక్షీ! నీ మీద అనురాగం కలిగిన భర్తని ఇంకొకడిని వెతుక్కో!’ అనలేదా?
కర్ణుడి మాట అర్జునుడికి వాగ్రూపమైన బాణంలా జృదయంలో నాటుకుని ఊపిరాడక ఎంతో బాధ కలిగించినా చాలాకాలంగా దానికి ప్రతిక్రియ చెయ్యకుండా ఉండిపోయేడు కదా! నువ్వే చెప్పు! పగ తీర్చుకోగలిగినా కర్ణుడి మీద అర్జునుడు పగ తీర్చుకున్నాడా? ఇంకా దుశ్శాసనుడు ‘వీళ్లందరూ – ఈ పాండవులంతా, నిష్పలులు, పౌరుషహీనులు, వీళ్లల్లో పౌరుషవంతుడైన మనిషి ఎవరు? అన్నాడు. అతడు చెప్పినట్టుగా ఎంతో కాలంగా వీళ్లే నిష్ఫలంగా ఉండిపోయారుగాని, వీళ్ల వల్ల వాళ్లకి ఏ నష్టం కలిగింది? ఇంకా ఆ సమయంలో పుట్టిన మాటలు పైకి అనవలసినవి కావు. ఈ సంధికార్యం జరగడం మిక్కిలి కష్టం. దీన్ని కుదర్చడం అసాధ్యం అని భావిస్తున్నాను.
అయినా పాండవుల్ని బతిమాలి నేనే అక్కడికి వచ్చి కౌరవులకి బుద్ధి కలిగి ఉండమని చెప్పి రాజ్య భాగం ఇప్పిస్తే వాళ్లు చావు తప్పించుకుంటారు కదా? నేను కలగచేసుకుని న్యాయమూ నేర్పూ చూపించడం నాకు తగిన పనేనా? వాళ్లు నా మాట వింటారు. అన్యాయంగా మాట్లాడనప్పుడు వాళ్లు అంగీకరించకుండా ఉంటారా? అలా కాకుండా వంకర మాటలు మాట్లాడితే వాళ్లని చుట్టుముట్టేది పాండవుల బాణాలనుంచి వచ్చే అగ్నికాదు.. తమని తమ దురాశ అనే చిచ్చే దహించేసి నాశనమయి పోతారు. బహుశా ఇదే జరుగుతుంది. దుర్యోధనుడు క్రోధరూపంలో ఉన్న మహావృక్షం. కర్ణుడు దాని పెద్ద కాండం (బోదె). శకుని దాని కొమ్మ. దుశ్శాసనుడు దానికి పువ్వులు, పళ్లు. అతడి తండ్రి ధృతరాష్ట్రుడు దాని మూలబలం.
ధర్మరాజు ధర్మమనే మహావృక్షం. అర్జునుడు దాని పెద్ద బోదె (కాండం). భీముడు దాని కొమ్మ. నకుల సహదేవులు పూలు, పళ్లు. నేనూ, బ్రాహ్మణులూ, వేదాలూ దాని వేళ్ల సమూహం. ఈ రెండింటినీ పరిశీలించి చూసి ఇది సారవంతమైందీ, ఇది నిస్సారమైందీ అనే విషయం తెలుసుకోవాలి.
అయినా ఏమయితేనేం ఈర్ష్య ఎందుకు? ధృతరాష్ట్రుడూ, అతడి కొడుకులూ వనం. పాండవులు సింహాలు. సింహాలు లేని అడవిని కొట్టేస్తారు. అడవిలో లేని సింహాలకి హాని కలుగుతుంది. ఈ రెండూ మనమే. వనమూ, సింహాలూ కూడా సుఖంగా ఉండాలంటే చక్కగా కలిసి ఉండడం మంచిది.
పాండవులు కౌరవులకి పరిచర్యలు చేస్తూ ఉంటారు. శత్రువుల వల్ల వాళ్లకి ఏదయినా ఆపద కలిగినప్పుడు వాళ్లని ఆదుకుంటారు. అందువల్ల ధృతరాష్ట్రుడు వీళ్లని కూడ తన కొడుకుల్ని చూసుకున్నట్టు చూసుకోవాలి. నేను ఈ కౌరవ, పాండవ సంధి కార్యం కోసం వస్తాను. ధృతరాష్ట్రుడు అంగీకరిస్తాడో లేదో? మేము దాన్ని బట్టే ప్రవర్తిస్తాము. ఆ రాజుకి మా అభిప్రాయం చెప్పు” అన్నాడు.
శ్రీకృష్ణుడు చెప్పింది విని సంజయుడు ధర్మరాజుని చూసి “అలా అయితే మరీ మంచిది కదా? నే వచ్చిన పని నెరవేరినట్లే. మీ అనుమతితో సెలవు పుచ్చుకుంటాను” అని శ్రీకృష్ణుడికి కూడా చెప్పాడు.
తరువాత భీమార్జున నకులసహదేవుల్ని, సాత్యకి ద్రుపద విరాటుల్ని చూసి మీ అనుమతితో “నేను అన్న మాటలు ఏవీ అనుచితమైనవి లేవు కదా” అని అడిగాడు.
అప్పుడు ధర్మరాజు సంజయుడితో “వెళ్లిరా! ఇక్కడ ఉన్న అందరూ వినేటట్లు నువ్వు స్పష్టంగా మాట్లాడావు. నీ మాటల్లో ఒక్కటి కూడా అనుచితమైన మాటల్లేవు. మాట అంటే అలాగే ఉండాలి. ముందుగా ఎదుటివారు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడితే నువ్వు చివరికి బాధపడవు. నీతికోవిదుడా! నువ్వు ఎప్పుడూ, నీతిలేని, పరుషమైన నిస్సారమైన మాట మాట్లాడవు. ఇటువంటి పనులు నువ్వో, విదురుడో చెయ్యాలి కాని, రావడానికి అర్హత కలవాళ్లు ఇంకెవరయినా ఉన్నారా? ఇతరులకి ఈ విషయ నైపుణ్యం ఉండదు కదా? నువ్వు అక్కడికి వెళ్లాక అక్కడ ఉన్న పెద్దలైన బ్రాహ్మణులనందర్నీ చూసి ఆదరంతో వాళ్ల క్షేమం చక్కగా తెలుసుకుని, తరువాత ద్రోణ, భీష్మ, కృపుల్ని దర్శించు. వాళ్లకి నేనంటే ఎంతో ఇష్టం. వాళ్లకి ప్రేమతో, గౌరంతో భక్తితో నేను నమస్కరించినట్లు నమస్కరించు.
మా తండ్రి అయిన ధృతరాష్ట్రుణ్ని చూసి సంతోషంతో నేను నమస్కరించినట్లు సాష్టాంగ నమస్కారం చెయ్యి. చెడు నడవడిక కలిగి ఉండే ఆ దుర్యోధనుడి క్షేమసమాచారం అడిగానని చెప్పు. అతడి తమ్ముడు అనిపించుకోడానికి తగిన దుశ్శాసనుడి క్షేమం తెలుసుకో. తక్కిన కుమారులనీ, అందరినీ, స్త్రీలనీ తగిన విధంగా సుఖంగా ఉన్నారేమో తెలుసుకో.
విదురుణ్నీ, శల్యుణ్నీ చూసి వినయంగా మాట్లాడు. అశ్వత్థామని ఆలింగనం చేసుకున్నానని చెప్పు. బాహ్లిక, సోమదత్త, భూరిశ్రవులని కలిసి సంతోషం కలుగచెయ్యి. ఇంకా కులీనులూ, వయస్సుచేత పెద్దవాళ్లూ అయిన రాజుల్నీ; కృతవర్మ, కర్ణుడు, శకుని, సైంధవుడు మొదలైనవాళ్లనీ; తక్కిన రాజసమూహాన్నీ; యుద్ధంలో సహాయపడడానికి వచ్చిన అన్ని దేశాల ప్రభువుల్నీ చూసి ఎవరితో ఏ విధంగా నమస్కారం, వినయం, బంధుత్వం, స్నేహం, వాత్సల్యం అనే వాటితో చెప్పాలో ఆ విధంగా నా మాటలుగా చెప్పి తగిన రీతిలో ప్రవర్తించు.
దాసీజనాల్నీ, దాసజనాల్నీ చూసి మనకెందుకులే అని ఊరుకోకుండా నేను, వెంటనే మిత్రులతో కలిసి శత్రువుల్ని జయించి తమను కాపాడుతానని చెప్పు. వెళ్లీ వెళ్లగానే అక్కడ నువ్వు చెయ్యవలసినదంతా నీకు చెప్పాను. తరువాత మా తండ్రి నిండుసభలో మొహమాటపడకుండా ఇలా అనాలి “పాపరహితుడా! నీ బలం వల్లే పాండవులు కొంచెమైనా కష్టమనేది లేకుండా, తన బంధువులతోను, మిత్రులతోను సుఖంగా ఉన్నారు. వాళ్లని బాల్యంలోనే వాళ్ల తండ్రి సింహాసనం మీద సంతోషపడేట్లు కూర్చుండబెట్టి రాచరికమిచ్చి తగిన విధంగా ప్రసిద్ధంగా కాపాడావు.
బాల్యంలో అలా ఆదరించి ఇప్పుడు నిర్లక్ష్యం చేసి ఏమాత్రము దయ లేకుండా వాళ్లు అధమదశలో ఆపద పొందగా చూస్తూ ఊరుకోడం తగినపనా? ఇప్పుడు అంతటితో సంతోషించకూడదు. అంతకంటే అధికంగా కోరినా సరిపోదు. పగవారి పొగరు అణిగేట్లు మనం కలిసి బతకడం మంచిది కాదా?” అని చెప్పు అన్నాడు.
అదే సమయంలో భీష్ముడితో ఇలా చెప్పు. ‘ఇదివరకు నువ్వు శంతనుడి వంశం అంతరించి పోకుండా నిలబెట్టావు. ఇప్పుడు నువ్వే నీ ఇష్టప్రకారం సంధి కుదిర్చి మనుమలని కలిపి, వాళ్లు నిందకీ, అన్యాయానికీ, చావుకీ దూరంగా ఉండేటట్లు బతికిస్తే భూలోకంలో ఉన్న ప్రజలు, రాజులూ, బ్రాహ్మణులూ నిన్ను మెచ్చుకుంటారు కదా!’ అని చెప్పు” అన్నాడు.
మళ్లీ సంజయుడితో మళ్లీ ఇలా చెప్పాడు. “శంతనుడి కుమారుడా! భీష్ముడా! ఇంతలేసి ఘోరాలు జరిగిన సందర్భంలో కూడా ధర్మరాజు శాంతిని కోరుకుంటాడేగాని, యుద్ధానికి వెళ్లడానికి అంగీకరించడు” అని చెప్పు.
నువ్వు ధృతరాష్ట్రుడి సభలో ఇక్కడి సంగతులన్నీ చెప్పేటప్పుడు అక్కడున్నవాళ్లంతా వినేటట్లు దుర్యోధనుడితో ‘భుజబలపరాక్రమ సంపన్నులైన పాండవులు పరాక్రమం లేనివాళ్లని వెళ్లగొట్టినట్టు ఊళ్లోనుంచి వెళ్లగొట్టిన మీ వెర్రితనమూ; ఎంతోకాలం అడవుల్లోనూ, కొండల్లోనూ బాధలు పెట్టిన మీ క్రూరత్వమూ; సభలో ద్రౌపదిని జుట్టుపట్టుకుని నిర్దాక్షిణ్యంగా ఈడ్చిన మీ తుంటరితనమూ ధర్మరాజు సంహించాడు అనేది నిజం. నువ్వు యుద్ధంలో కౌరవుల్ని నాశనం చేసుకోకు. ఇతరుల సంపదల కోసం ఆశించకూడదు. వాళ్ల భాగం వాళ్లకి ఇచ్చివెయ్యి. వాళ్లతో కలిసి బతుకు’ అని చెప్పు.
మేము యుద్ధం చెయ్యడానికి అంగీకరించకుండా సఖ్యం కోరుకోవడం అతడికి మంచిది. తన మనసులో రగిలే పేరాశ అనే అగ్నిని ఆర్పడానికి ఇతరులు ఎవరూ రాకపోవడం వల్ల నేను చెప్పవలసి వచ్చింది. అతడి దగ్గర ఉన్నంతమంది యుద్ధవీరులు మా దగ్గర లేకపోవడం స్పష్టమే అయినా, మాకు తోడుగా ధర్మం ఉంది. అదలా ఉంచి, నేను భీముడూ మొదలైనవాళ్లకి, తమకీ కూడా పెద్దవాడిని అవడం వల్ల వీళ్ళూ, వాళ్లూ నా కోరికని అనాదరణ చెయ్యకుండా, నా శాంతినీ, ఓర్పునీ (దాంతినీ) ఆదరించి నన్ను బాధించకుండా, యుద్ధం మానేసి, తమ తమ సొమ్ములు అనుభవిస్తూ సుఖంగా ఉండడం మన పెద్దలకీ తక్కిన బుద్ధిమంతులకీ సంతోషం.
అంత ఎక్కువగా ఇవ్వకపోతే కుశస్థలమూ, వృకస్థలమూ, వాసంతీ, వారణావతమూ సరిపోతాయి. లేకపోతే మరెక్కడయినా ఏదో ఒకటి తన సోదరులు అయిదుగురికీ నివసించడానికి చోట్లు అయిదు ఇస్తే సంపూర్ణ శాంతి అవుతుంది.
అలా అయితే అక్కడి, ఇక్కడి బంధువులూ, మిత్రులూ, తోడ్పాటు కోసం వచ్చినవాళ్లూ కలిసి నవ్వుతూ తుళ్లుతూ ఉండడం మన మనస్సులకి సంతోషం కలిగిస్తుంది. కురు, పాంచాల, యాదవ, మాత్స్యులు ఒకళ్ల ప్రేమని మరొకరు సంపాదించుకుని జీవించాలని నా కోరిక. ఇదంతా ఆ మహనుభావుడికి స్పష్టపడేలా చెప్పు!” అన్నాడు.
ధర్మరాజు చెప్పింది విని సంజయుడు “దేవా! అంత నువ్వు చెప్పిన ప్రకారమే చేస్తాను. మీ తండ్రి మీకూ, తమ్ముళ్లకీ, శ్రీకృష్ణుడికీ ఎలా ఇష్టమో అలాగే చేస్తాడు” అని నమస్కరించాడు.
సంజయుడితో అర్జునుడు “నువ్వు నాకు బాల్యస్నేహితుడివి. నీ మంచితనం నాకూ, మేము నీతివిడిచి దుస్స్వభావులం అవడం నీకూ చిన్నతనం నుంచీ ముందు తెలియదా? సంజయా! అజాతశత్రువైన ధర్మరాజు దయతో కూడిన తెలివితక్కువతనమే అప్పుడు అంకుశమయి, భీముడనే మత్తేభం విజృంభణాన్ని ఆపుచేసింది. చివరికి ఇప్పుడు కూడా ఆ భీమగజం ఆవేశాన్ని అణచడానికి అదే సరిపడగా, ఆ కౌరవులకి నీతి పరాక్రమానికి తగిన ఆలోచనలు చేసే కష్టం ఎందుకుంటుంది?” అని పలికి ధర్మరాజు అనుజ్ఞతో సంజయుడికి పరిజనసమేతంగా తగిన విధంగా స్నానాహారలు చేయించి, పూలమాలలు, మైపూతలు మొదలైన సన్మానాలు జరిపించి, రత్నాలంకారాలు, మనోజ్ఞములయిన వస్త్రాలు సమర్పించి, సెలవిచ్చి పంపగా సంజయుడు పాండవుల్నీ, శ్రీకృష్ణుడినీ విడిచి వెళ్లాడు” అని వైశంపాయనుడు చెప్పాడు.
ఉద్యోగపర్వంలోని మొదటి ఆశ్వాసం సమాప్తం
