[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]
ఉద్యోగపర్వము – రెండవ ఆశ్వాసము
ధర్మరాజు మాటలు ధృతరాష్ట్రుడికి చెప్పిన సంజయుడు
వైశంపాయనుడు జనమేజయుడితో “జనమేజయమహారాజా! సంజయుడు పాండవుల దగ్గరి నుంచి రథాశ్వాలని వాయువేగంతో పరుగులెత్తించి సూర్యాస్తమయ సమయానికి హస్తినాపురం ప్రవేశించాడు. అంతఃపురంలోకి వెళ్లి ధృతరాష్ట్రుడికి తన రాక తెలియచేశాడు.
అనుమతి తీసుకుని ధృతరాష్ట్రుణ్ని కలిసి పాదాభివందనం చేశాడు. ధృతరాష్ట్రుడు అతణ్ని ఆదరంగా పైకి లేపి దగ్గర కూర్చోబెట్టుకున్నాడు. సంజయుడు చేతులు జోడించి “మీరు చెప్పినట్టు పాండవుల దగ్గరికి వెళ్లి ధర్మరాజుని కలిసి వచ్చాను. గొప్ప సుగుణాలు కలిగిన పూజ్యుడైన ధర్మరాజు మీకు నమస్కరించాడు. నాకు మర్యాద చేశాడు. ఇక్కడి చుట్టాలందర్నీ తలుచుకున్నాడు. సంతోషంగా మీ సౌఖ్యమూ, సంపదా, వైభవమూ, కొడుకుల క్షేమమూ అడిగాడు” అన్నాడు.
ధృతరాష్ట్రుడు సంజయుడితో “ఆ ధర్మరాజు క్షేమమా? అతడి తమ్ముళ్లందరూ క్షేమంగా ఉన్నారా? అక్కడ చుట్టాలు, సేవకులూ, స్నేహితులూ మంత్రివర్యులు సంతోషంగా ఉన్నారా?” అని అడిగాడు.
సంజయుడు ధృతరాష్ట్రుడితో “రాజా! వాళ్లందరూ ‘నీ గొప్పబలం కారణంగా సుఖంగా ఉన్నాం’ అంటారు. నిజం చెప్పాలంటే అది నిజమే కదా! కురువంశశ్రేష్టుడా! ధృతరాష్ట్రా! ధర్మరాజుకి సుఖాలకంటే ధర్మమంటేనే ఇష్టం. అతడు ధర్మాలన్నింటిలోను అహింసాధర్మాన్ని బాగా ఇష్టపడతాడు. ధర్మరాజు పౌరుషాన్ని అంగీకరించడు. ఎల్లప్పుడూ దైవాన్నే నమ్ముకుని ఉంటాడు.
అతడు పుణ్యపాపాల్ని నీ మీదే పెట్టాడు. నువ్వు నీ కొడుకు ఇష్టప్రకారమేకాని ఇంకో విధంగా ఆలోచించవు. కార్య నిర్ణయం కర్ణ, శకునులకి వశం చేశావు. నువ్వు చేసే విధానం ఏదీ బాగుండదు అనేది స్పష్టంగా తెలుస్తోంది. పెళ్లాము, బిడ్డలు లేకుండా ఇష్టం వచ్చినట్టు తిరిగే మొద్దు కాకుండా, ఒకచోట స్థిరంగా ఉండి అన్నం తినేవాళ్లు, ఇటువంటి పొగరుబోతు చేష్టలు చేస్తుంటే చూస్తూ ఊరుకుంటారా?
కురురాజా! ధృతరాష్ట్రా! ఎక్కడా రాజులు గొప్ప తేజస్సు కలిగిన కొడుకుల్ని కనలేదా? నీవు ఒక్కడివే కన్నావా? ఈ విధంగా చెడు మార్గంలో బుద్ధి చెప్పకుండా కళ్లప్పగించి చుస్తూ ఊరుకుంటారా? ప్రజలందరూ నిన్ను పుచ్చిపోయేలా తిడుతుంటే వింటూ ఉండడం నా మనస్సుకి ఎప్పుడూ బాధాకరంగానే ఉంది. నా చెవులు పుచ్చిపోతున్నాయి. దుశ్శాసనుడూ, శకునీ మాత్సర్యంతో మిమ్మల్ని పట్టుకుని ఎలా ఆడిస్తే అలా బొమ్మల్లా నువ్వూ, దుర్యోధనుడూ ఎప్పుడూ ఆడుతూ ఉంటారు.
పాండవులే కనుక ఒకవేళ కోపగిస్తే.. ఒక్క చిటికెలో నీ చలాన్నీ, బలాన్నీ, కులాన్నీ నేలమట్టం చేసెయ్యరా? ధృతరాష్ట్రా విను! మనవాళ్లు ధర్మరాజు శాంతాన్ని చూసి భయమని భావిస్తున్నారు. అది ఎలా ఉందో తెలుసా? గొర్రెపొట్టేలు కొండని చూసి ‘ఇది నాతో ఓడిపోతుంది’ అన్నట్లు ఉంది. ధృతరాష్ట్రా! ధర్మరాజు తమ్ముళ్లకి అడ్డం వచ్చి ఏమీ చేయనీయకుండా అదుపులో పెట్టడం చూసి నువ్వు కూడా సంతోషించావు.
కాని, సాధు జంతువు విజృంభించిందంటే అది ఊరి చివరిలోనే అగిపోదు, నాశనం చేసి తీరుతుంది (పరమ సాధువైన ధర్మరాజు కోపంతో విజృంభించాడంటే నిన్ను సర్వనాశనం చేయక మానడు అని అర్థం). జూదం ఆడినప్పుడే అవినీతి ఏర్పడింది. అప్పుడు నువ్వు ఉపేక్షతో ఊరుకోవడమే మనసులో ఒళ్లు మండించింది. ధర్మరాజు మనస్సుని స్వాధీనంలో పెట్టుకోగలిగినవాడు.
పైకి ఎంతో మృదువుగా కనిపించే పులివంటివాడు. జరుగుతున్న అన్యాయాన్ని లోకులందరూ నీ మీద పెట్టేవరకు వినకుండా చూడకుండా ఏమీ ఎరగనట్టు ఉంటాడు. అటువంటి నింద పడిన తరువాత అతడిని ఆపడం నీకూ, నాకూ తరం కాదు.
ధృతరాష్ట్ర మహారాజా! నేను వేగంగా రావడం వల్ల నా అవయవాలన్నీ నెప్పి పెడుతున్నాయి. నా మనస్సు స్వాధీనంలో లేదు. చాలా పొద్దుపోయింది కూడా. ఇప్పుడు నేను వెళ్లిపోయి ఉదయం నీ కొడుకులూ, బంధువులూ, మిత్రులూ, నువ్వూ స్పష్టంగా వింటుండగా జరిగినదంతా వివరంగా వినిపిస్తాను” అన్నాడు.
సంజయుడు చెప్పింది విని ధృతరాష్ట్రుడు సరేనని అతణ్ని పంపించేశాడు. కొంతసేపు చెయ్యవలసిన పని గురించి ఆలోచించి కంచుకుణ్ని ఒకణ్ని పిలిచి వెంటనే విదురుణ్ని పిలవమని చెప్పాడు. కంచుకుడు వేగంగా వెళ్లి విదురుణ్ని తీసుకుని వచ్చాడు. ధృతరాష్ట్రుడు విదురుణ్ని ప్రేమగా తన దగ్గర కూర్చోబెట్టుకున్నాడు.
అతడితో “సంజయుడు పాండవుల దగ్గరికి వెళ్లి ఇప్పుడే వచ్చాడు. నన్ను నా ముఖం మీదే తిట్టి పొద్దున్న నాకు అక్కడి విశేషాలు చెప్తానని వెళ్లాడు. విదురా! అప్పటి నుంచి నా మనసు కలతపడి దుఃఖంతో నిండిపోయింది. శరీరం నిప్పుల్లో దొల్లించినట్లు ఉండి నిద్రపట్టలేదు” అన్నాడు.
ధృతరాష్ట్రుడు మాటలు విని విదురుడు “ధృతరాష్ట్రా! బలవంతుడు మీదపడిన దుర్బలుడూ, డబ్బు పోగొట్టుకున్నవాడూ, ఎప్పుడు దొంగిలిద్దామా అని కాచుకుని కూర్చున్న దొంగా, కామంతో మనసు కలతపడుతున్నవాడూ నిద్రపట్టక బాధపడతారు. ఈ దోషాల్లో ఏదయినా ఒకటి నీ మనసులో ఉందా? ఇతరుల ధనం నువ్వొక్కడివే అనుభవించాలని అనుకుంటున్నావా? నిద్రపట్టకపోవడానికి నిజమైన కారణం ఏమిటో చెప్పు” అన్నాడు విదురుడు.
విదురుడు చెప్పినదానికి ధృతరాష్ట్రుడు అతడితో “ధర్మరాజు ఏమన్నాడో తెలియక పోవడం వల్ల నేను బాధపడ్డాను. నువ్వు స్పష్టంగా చెప్పిన దుఃఖాన్ని పోగొట్టగలవు” అన్నాడు.
అది విని విదురుడు “అయ్యో! రాజోత్తమా! నీకు ధర్మరాజు బంధువూ, స్నేహితుడూ, తగిన భటుడూ, మంత్రీ, రక్షకుడూ అవుతాడు కదా? సత్త్వగుణం కలవాడూ, శాంతమూర్తీ, గొప్ప వినయము, వివేకము, శీలము గలిగిన అతడు తప్పుగా మాట్లాడడు కదా? నువ్వూ, నీ కొడుకు దుర్యోధనుడూ వాళ్లని అన్యాయంగా బాధపెట్టారు. అది చాలదా? వాళ్లకి న్యాయంగా ఇవ్వవలసిన భాగం పంచి ఇవ్వండి.
అంతేకాని, పిల్లి ముట్టుకున్న మాంసంలా చేస్తే ఎలా చెల్లుతుంది? నువ్వూ, నీ కొడుకూ, శకునీ, దుశ్శాసనుల మీద రాజ్యభారం మోపి ఉంటారు. ఇది చివరిదాకా జరగదు. అదెలాగంటావేమో.. తమని తాము తెలుసుకోవడం, తొందరపడకపోవడం, ఓర్పూ, త్యాగం, ఇవి కలగడం వంటివి లేని ప్రభుత్వం ఉంటుందా? ఆ కర్ణ, శకుని, దుశ్శాసనుల్లో ఎంత పరిశీలించి చూసినా పైన చెప్పుకున్న సుగుణాల్లో ఒక్క సుగుణమైనా ఉన్నవాడున్నాడా? ధర్మరాజు నువ్వు నిజంగానే తండ్రివని, ధర్మం నమ్మి ఎంతో ఓపిక పట్టి ఉన్నాడు. అది నీకే తెలుసు” అన్నాడు.
విదురుడు చెప్పింది విని ధృతరాష్ట్రుడు “సంజయుడు వెళ్లిన పని ఏమయిందో రేపు అతడు చెప్పింది విని మనకి ఏది చేస్తే క్షేమకరమో ఆ విధంగా చేయించు. ఇప్పుడు నా మనస్సులో ఉన్న కలతని ఊరడించే మాటలతో తగ్గేలా చెయ్యి. నువ్వు ధర్మాధర్మాలూ నీతి అవినీతులూ తెలిసినవాడివి. నీ అమృతమయమైన మాటలతో నాకు నిద్రలేకుండ చేస్తున్న దుఃఖాన్ని తగ్గేలా చెయ్యి” అన్నాడు.
ధృతరాష్ట్రుడికి హితబోధ చేస్తున్న విదురుడు
“రాజా! ధృతరాష్ట్రా! ప్రజలు మెచ్చుకునేలా ప్రవర్తిస్తూ లోక నిందించే పనులు చేయడం మాని, తన సంపద కంటే ఎక్కువగా ఉందని వేరొకడి సంపదకి ఈర్ష్య పడక అందరితో కలిసి మెలిసి బతకడం మంచిది. కోపమూ, పొంగిపోవడమూ, గర్వమూ, తృప్తిలేకపోవడమూ, దురభిమానమూ, ఏ పనీ చేయకపోవడమూ అనేవి దుర్జనుడి లక్షణాలు.
ధృతరాష్ట్రా! రాజునీ, భగవంతుడినీ, భార్యనీ, చుట్టాల్నీ తగిన విధంగా పూజించి మంచి స్వభావంతో సంతోషపెట్టలేని మంచి చెడు తెలియని వివేకశూన్యుడా మంచి ఫలితాల్ని ఆశించేది? ఉపాయం తెలియనివాళ్లు తమని ప్రేమించేవాళ్లని ఇష్టపడరు. తమని ప్రేమించనివాళ్ల వెనుక పడతారు. తమకంటే అధికులనీ తెలిసి కూడా వాళ్లని ఎదుర్కుంటారు.
రాజా! ధనమూ, విద్యా, ఉత్తమ వంశమూ దుర్బుద్ధులకి అహంకారాన్ని కలిగిస్తాయి. మంచిబుద్ధి కలిగినవాళ్లకి అవే గౌరవాన్ని తెచ్చిపెడతాయి. ఒక మంచి విలుకాడి బాణం ఒకడిని బాధిస్తే బాధిస్తుంది లేదా తప్పిపొతే తప్పిపోతుంది. కాని, నేర్పు కలవాడి నీతిస్ఫూర్తి శత్రురాజునీ అతడి దేశాన్ని నశింపచేస్తుంది. ప్రభుత్వాన్ని చేపట్టి, మంత్రోత్సాహములనే రెండింటినీ కదలనీయక జోడు చేసి, మిత్రులు, అమిత్రులు, అనే మూడు వర్గాలనూ సామ, దాన, భేద, దండములనే నాలుగు ఉపాయలచేతా పూర్తిగా వశపరుచుకుని, త్వక్కు, చక్షువు, శ్రోత్రము, జిహ్వ, ఘ్రాణము అనే అయిదు ఇంద్రియాలనీ జయించి, సంధి, విగ్రహ, యాన, ఆసన ద్వైదీభావములనే ఆరింటినీ తెలుసుకుని; వేట, జూదము, పానము, స్త్రీ, వాక్పారుష్యమూ, దండపారుష్యమూ, అర్థదూషణమూ అనే ఏడు వ్యసనాలను వదిలి జీవించేవాడు గొప్ప వివేకవంతుడు.
ధృతరాష్ట్రా! మధురమైన ఆహారాలు ఒక్కడే తినడమూ, అందరూ నిద్ర పొతున్నప్పుడు ఒక్కడే మేలుకుని ఉండడము, చేయవలసిన పని గురించి ఒక్కడే ఆలోచించడము, మార్గంలో ఒక్కడే నడవడమూ తగిన పనులు కాదు. మంచిప్రవర్తన అనే సముద్రాన్ని దాటించడానికి సత్యము అనే ఓడ తగినది అయినప్పుడు సత్యాన్ని మించిన గుణం ఇంకోటి ఉంటుందా?
క్షమించే స్వభావం కలిగిన వాళ్లని చూసి అసమర్థులు అని చెప్తారు. వివేకంతో ఆలోచిస్తే గొప్పదైన క్షమాగుణమే విలువైన ఆభరణము. మంచి సౌందర్యం కలవాళ్లు దాన్ని ధరిస్తారు. ఎక్కడా పరుష వాక్కులు పలకకపోవడం, పాపపు పనులు చేయకపోవడం ఈ రెండు మంచి లక్షణాలవల్ల పురుషుడు లోకంలో మంచివాడు అనిపించుకుంటాడు.
కురువంశోత్తమా! ధృతరాష్ట్రా! సముర్థుడయి ఉండి కూడా శాంతం వహించేవాడూ, బీదవాడయినా కూడా తనకున్నంతలో ఇచ్చేవాడూ పుణ్యాత్ములనీ పెద్దలన్నారు. ధృతరాష్ట్ర మహారాజా! న్యాయబద్ధంగా సంపాదించిన ధనాన్ని అనర్హులకి ఇవ్వడమూ, అర్హులకి ఇవ్వకపోవడమూ అనే వాటివల్ల రెండు విధలా కీడు కలుగుతుంది. స్త్రీ, జూదం, త్రాగుడు, వేట, వాక్పారుష్యం, దండపారుష్యం, డబ్బు వృథా చెయ్యడం అనే ఏడు వ్యసనాలయందు ఆసక్తి చూపకూడదు.
తన హోదాకి తగిన వేషధారణా, తనని తానే స్తుతించుకోవడమూ, బాధ పడినప్పుడు కూడా కీడు పలుకక పోవడమూ, దానం చేశాక ఎందుకు చేశానా అని బాధపడకపోవడమూ, తనకెంత గతి లేకపోయినా ధర్మమార్గాన్ని తప్పకుండా ఉండడమూ ప్రవర్తనకి మంచి కలిగిస్తాయి. అదే మంచి ప్రవర్తన అనిపించుకుంటుంది. ధృతరాష్ట్ర మహారాజా! స్నేహమూ, మాటా, బలమూ, వివాదమూ, యుద్ధమూ, తమతో సమానులైన వాళ్లతోనే బాగుంటుంది కాని, తమకంటే అధికులతోగాని, అల్పులతోగాని మంచిది కాదు.
మహారాజా! ఎంత తక్కువ ఉన్నా కూడా దాన్ని ఇతరులకి కూడా పంచిపెట్టి అనుభవించడం మంచిది. కష్టానికి సహించి ఇంచుక సుఖాన్ని అనుభవించడం మేలు. అడిగితే శత్రువుకైనా ఇవ్వడమే మంచిది. లోకం తనను పొగిడితే విని సజ్జనుడు పొంగిపోడు. ఇంకా ఎంతో మేలు చేస్తాడు. తాను మాత్రం ఏ కొంచెం కీడు కూడా చెయ్యకుండా ప్రవర్తిస్తాడు. ఇతరుల కీడుని పోగొడతాడు. ఇటువంటి లక్షణాలు ధర్మరాజుకి ఉన్నాయి” అని చెప్పాడు విదురుడు.
ఇంకా చెప్తూ విదురుడు పాండవుల్ని ఆ సందర్భంలో పొగిడి, నువ్వు వాళ్లని పెంచి పెద్దవాళ్లని చేసి రక్షించి, ఇప్పుడు వదిలిపెట్టి, వాళ్లు వేరుగా ఉంటుంటే చూస్తూ ఊరుకోవచ్చా? వాళ్లకి న్యాయంగా ఇవ్వవలసిన భాగం వాళ్లకి ఇచ్చి, వాళ్లని రప్పించి, నీ కొడుకులతో సమానంగా చూడడం మంచిది. మీరూ, వాళ్లూ ఒకటిగా ఉంటే మీ వైపు చూడడం దేవతలకి కూడా కష్టం” అన్నాడు.
విదురుడి మాటలకి ధృతరాష్ట్రుడు ఊకొట్టి విదురుడితో ఇలా అన్నాడు. “నాకు ఏది మంచిదో, నేను చెయ్యతగినది ఏమిటో, ధర్మరాజు పద్ధతి ఏమిటో నీకు బాగా తెలుసు. అందువల్ల నా మనస్తాపం తగ్గేలా నేను చేయవలసినదంతా చెప్పు” అన్నాడు.
ధృతరాష్ట్రుడు అడిగినదానికి విదురుడు “ఇలా నన్ను మరీ మరీ అడిగితే ఉన్న సంగతి చెప్పాలి. నిర్మలభావుడవైన ధృతరాష్ట్రా! శ్రద్ధగా విను. రాజ్యం చేతికి చిక్కింది కదానని అయ్యో! తమ్ముడి వాటా ఇవ్వకుండా నువ్వు ఒక్కడివే మింగెయ్యాలని చూస్తున్నావు. అదెలా జరుగతుంది? ఇది చేప పేరాశతో మాంసంతోపాటు గాలాన్ని కూడా మింగెయ్యాలనుకున్నట్టు ఉంది. కపటి అయిన నీ కొడుకు మనసులో అనుకున్నదంతా మాట్లాడితే అలా నెరవేరుతుందా?”
విదురుడి మాటలు విని ధృతరాష్ట్రుడు మాట్లాడకుండా కొంచెంసేపు నిశ్చేష్టుడై, ఆలోచనలు కుదరక, నిద్ర రాక, శరీరం అలిసిపోయి విదురుడితో “సౌజన్యమే నిధిగా ఉన్న విదురా! ఇప్పటి వరకు నీ మాటల వల్ల నా మనస్తాపం కొంచెం ఉపశమించింది. నువ్వే నాకు ప్రతి రోజూ నీతులు తగినట్లుగా చెపుతూ ఉండు” అన్నాడు.
విదురుడు ధృతరాష్ట్రుడితో “బాగా ముగ్గకుండానే ముందే కొస్తే పండు రుచిగా లేకపోవడమే కాదు, విత్తనం కూడా పనికిరాదు. పక్వమైన తరువాత కోస్తే పండు బాగుంటుంది. విత్తనం కూడా చెడిపోదు. కార్యం సఫలమయ్యే విధం కూడా ఇంతే. దండలు కట్టేవాడు పువ్వులు చెట్టునుంచి కోసినట్టు, తుమ్మెద పువ్వుల్లో ఉండే మకరందం పీల్చుకున్నట్లు ఒక పని ఫలితాన్ని పొందాలంటే ఎదుటివాడు బాధ పడకూడదు.
అంతేకాని, బొగ్గులకోసం చెట్టుని మొదలంటా నరికేయకూడదు. రాజా ధృతరాష్ట్రా! ఇతరుల డబ్బుకూ, విద్యాపరిపక్వతకూ, తేజస్సుకీ, బలానికీ మనస్సు కాలిపోయేట్లు ఓర్వలేని మనిషి రోగం ఏదీ లేకుండానే బాధపడతాడు. ఎదుటివాడికి మంచి జరిగేవీ, ఇష్టమైనవీ, మనస్సుకి సంతోషం కలిగించేవీ అయిన మాటలు ఎక్కువగా మాట్లాడగలిగితే మంచిది.
అలా చెయ్యలేనప్పుడు ఏమీ అనకుండా నోరు మూసుకుని ఊరుకోడం మంచిది. స్నేహ విరోధాలూ, జానాజ్ఞనాలూ, ధర్మాధర్మాలూ, ఆధిక్య నైచ్యాలూ తమ మాటల తీరుని బట్టి వస్తాయి. కాబట్టి తగిన విధంగా మాట్లాడాలి.
ధృతరాష్ట్రా! కత్తితోగాని, గొడ్డలితోగాని గట్టిగా నరికినప్పుడు తెగిపోయిన చెట్టుకి మళ్లీ చిగురు పుడుతుంది. కాని, మాటల వల్ల చెడిపోయిన పని ఏ విధంగానూ మళ్లీ చక్కబడదు. శరీరంలో నాటుకున్న బాణాల్ని ఉపాయంతో తొలగించవచ్చు. కాని చాలా ఎక్కువగా మనస్సులో నాటుకున్న మాటలు ఎన్ని ఉపాయాలతో అయినా తిరిగి బయటికి రావు.
మహారాజా! అయ్యో! ఒకప్పుడు ధర్మరాజు నోటివెంట దుర్భాష ఒక్కటి కూడా లేదు. నీ కొడుకులు ఒకళ్లని మించి ఒకళ్లు అనేకమైన నీచవాక్యాలు పలుకుతుంటే నువ్వు వాటిని వారించకుండా వింటూ ఉంటావు. నీకు ఇది తగిన పనేనా? చెడుకాలం దాపురిస్తే చెడు మాటలూ, చెడుత్రోవ పట్టిన చేతలూ ధర్మబద్ధాలయినట్లు అనిపిస్తాయి. మంచి మాటలూ, చేతలూ నీతిమాలినవని మనస్సు నిర్ణయిస్తుంది.
నీ మనస్సు పాండవుల మీద ఉండే పగ నుంచి మరలకపోవడం పాపం. ఇంతే! ఏం చేద్దాం? మన వంశంలో తేజస్సూ, ధైర్యమూ, ధర్మపరత్వమూ మొదలైన గుణాలతో గొప్పవాడైన ధర్మరాజు నీ సంపదకి దూరంగా అలా ఉండడం న్యాయమా? నీకు పెద్దరికమిచ్చి శాంతంగా ఉన్నాడు” అన్నాడు.
