[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]
ధృతరాష్ట్రుడికి ఆధ్యాత్మిక తత్త్వాన్ని చెప్పిన సనత్సుజాతుడు
ఎటువంటి మాటలు వింటే ఆధ్యాత్మిక దృష్టి ఏర్పడుతుందో అటువంటి మాటలు చెప్పమని అడిగిన ధ్రుతరాష్ట్రుడికి విదురుడు “ధృతరాష్ట్ర మహారాజా! నాకు తెలిసినవన్నీ యథాశక్తి చెప్పాను. ఎంతో రహస్యాలైన విషయాలు ఏ కాలం నాటి వాడో అయినా కూడా యువకుడే అయిన సనత్సుజాతుడు చెప్పగలడు కాని, ఇంతకంటే నాకు తెలియదు” అన్నాడు.
విదురుడి మాటలు విని ధృతరాష్ట్రుడు “ఆ మునీశ్వరుడు నాకెంతో దూరం. నాకు అందుబాటులో లేనివాడు. అవి కూడా నువ్వే చెప్పు” అన్నాడు.
రాజు మాటలు విని విదురుడు “నేను శూద్రుడిని. వేదాంతులకి మాత్రమే తెలియతగిన విషయలు నాకు తెలియవు. ఆ మహాత్ముడి మనస్సు నాకు తెలుసు. దేవతలకి కూడా తెలియని విషయాలు అతడికి తెలుసు. అతడు వివరంగా నీకు చెప్పగలడు” అని చెప్పాడు.
విదురుడి మాటలు విని ధృతరాష్ట్రుడు కుతూహలంతో “మనకిప్పుడు అతణ్ని చూసే మార్గం కూడా తెలియదే” అన్నాడు.
విదురుడు తన మనస్సులో, ఆశ్రయించిన వాళ్లని వాత్సల్యంతో చూసే సనత్సుజాతుణ్ని అతి భక్తితో తలుచుకున్నాడు. విదురుడు స్మరించుకోగానే ఆధ్యాత్మిక జ్ఞానంతో గౌరవింపతగిన మునిశ్రేష్ఠుడు సనత్సుజాతుడు వెంటనే ప్రత్యక్షమయ్యాడు. విదురుడు అతడి రాక తెలియచేస్తూ ఎదురు వెళ్లి సాష్టాంగ నమస్కారం చేసి ఉన్నతమైన పీఠం వేసి, అర్ఘ్యపాద్యాలతో పూజించాడు.
అతడు వచ్చిన విషయం తెలుసుకుని ధృతరాష్ట్రుడు సంభ్రమంగా ఎదుర్కోలూ, నమస్కారమూ చేసి నిలబడి ఉన్న ధృతరాష్ట్రుణ్ని చూపించి “స్వామీ! ఈ ధృతరాష్ట్ర మహారాజు మీ దయవల్ల వేదాంత తత్వాన్ని తెలియచేసేవీ, సుఖాన్ని కలిగించేవీ అయిన మీ బోధలు వినాలని అడగడం వల్ల మిమ్మల్ని భక్తితో స్మరించాను. దయతో మీరు కూడా వచ్చారు. గురువుని ఆశ్రయించినవాళ్లు దేనివల్ల సుఖదుఃఖాలూ, లాభాలాభాలూ, ప్రియద్వేషాలూ మొదలయినవాటి యందు తగుల్కోకుండా బతుకుతారో అటువంటి తత్త్వాన్ని ఉపదేశించి ఇతణ్ని ధన్యుణ్ని చేసి కాపాడాలి” అని ప్రార్థించాడు.
ధృతరాష్ట్రుడు కూడా తగిన మాటలతో ఆ మహర్షిని పూజించాడు. ప్రసన్నుడైన సనత్సుజాతుడు ఆధ్యాత్మిక విషయాలన్నీ ఒకదాని తరువాత ఒకటి వరుసగా సూక్ష్మార్థాలతో బోధిస్తూ, ధృతరాష్ట్రుడు అడిగిన వాటిని స్పష్టంగా తెలియపరుస్తూ హృదయ పద్మంలో ఉండే పరమాత్మ అనుగ్రహింతో రహస్య వాక్కుల్ని అనుగ్రహిస్తున్నాడు. అంతలో తెల్లవారిపోవడంతో ఆ దేవముని ధృతరాష్ట్ర, విదురుల్ని విడిచి అదృశ్యమయ్యాడు.
(ఇక్కడ ప్రాతఃకాల వర్ణన వదిలి కథలోకి ప్రవేశించడం జరిగింది). అప్పుడు తుర్పు కొండ అనే అశోకవృక్ష సమూహంతో కాంతి వ్యాపించగా, పూసి మొదటిసారిగా బయటికి వచ్చిన ప్రకాశించే పూలగుత్తేమో అన్నట్లు సూర్యుడు ఉదయించాడు.
సూర్యోదయం అవగానే ధృతరాష్ట్రుడు తను చేయవలసిన పనులన్నీ పూర్తి చేసుకుని, తగిన విధంగా అలంకరించుకుని, నిండు సభలో కూర్చున్నాడు. ద్రోణుడూ, కృపుడూ, కృతవర్మా, అశ్వత్థామా మొదలైన నాయకులూ; భీష్ముడూ, విదురుడూ, బాహ్లికుడూ, సోమదత్తుడూ, భూరిశ్రవుడూ మొదలైన బంధువులూ; దుర్యోధనుడూ, దుశ్శాసనుడూ మొదలైన కుమారులూ; ఇంకా ఉన్న పరిజనులు అందరూ వచ్చి కూర్చున్నారు.
ఆ సమయంలో సంజయుడు వచ్చి ద్వారం దగ్గర నిలబడి ద్వారపాలకులతో తను వచ్చినట్లు తెలియచేశాడు. తరువాత తనకి కేటాయించిన స్థానంలో కూర్చున్నాడు.
ధృతరాష్ట్రుడికి పాండవుల విషయం చెప్పిన సంజయుడు
తన స్థానంలో కూర్చున్న సంజయుడు తను చెప్పే మాటలు వినాలని తొందర పడుతున్న సభని అన్ని వైపులా చూశాడు. తరువాత “ధృతరాష్ట్ర మహారాజు పంపించగా పాండవుల దగ్గరికి వెళ్లి, ధర్మరాజుని చూశాను. అతడు ప్రేమతో కౌరవుల యోగక్షేమాలు పేరు పేరునా అడిగాడు. ఇంకా తగినవాళ్లందరినీ వాళ్లకి తగినట్లుగా నమస్కారమూ, వినయమూ, బంధుత్వమూ, స్నేహభావమూ, వాత్సల్యమూ, అనుగ్రహమూ చూపించి ఆదరించాడు.
నేను కూడా రాజు బోధించిన విధంగా లోపం లేకుండా బంధుత్వానికి అవసరమైన విధంగా మాట్లాడాను. తరువాత వచ్చిన పని ప్రస్తావించి, నేను మాట్లాడిన మాటలకి ధర్మరాజు మాట్లాడిన మాటలు ఎంతో బాగున్నాయి” అన్నాడు.
ధృతరాష్ట్రుడు అడిగిన తరువాత తాను ఆ ధర్మరాజుతో అన్న మాటలూ, వాటికన్నింటీకీ అతడు చెప్పిన సమాధానమూ చెప్పాడు. తరువాత ధృతరాష్ట్రుడికీ, భీష్ముడికీ, దుర్యోధనుడికీ వరుసగా వాళ్లతో చెప్పమన్న మాటలన్నీ స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పాడు. సంజయుడు ఇంకా చెప్తూ “నేను ఉపప్లావ్య నగరానికి వెళ్లి మొదట కృష్ణార్జునులని చూశాను. వాళ్లు నీతిమార్గం తప్పకుండా ఉండే విధంగా మాట్లాడారు. నేను చెప్పేది ఆదరంతో వినండి” అన్నాడు.
సంజయుడి మాటలకి ధృతరాష్ట్రుడు “ఆ కృష్ణుడి మనసు ఎలా ఉంది? అతడు ఏమన్నాడు?” అని అడిగాడు.
సంజయుడు అతడితో “ఆ శ్రీకృష్ణుడు తనూ, సత్యభామా, ద్రౌపదీ, అర్జునుడూ రహస్యంగా మాట్లాడుకుంటూ, కొడుకులు కూడా సమీపించని చోట భార్యలు సేవిస్తూ ఉండగా, ఆనందంగా ఉన్న సమయంలో కూడా నన్ను పిలిపించాడు. అతడికి నీ మీద ఎంత ప్రేమో! వాళ్లు ఎలా ఉన్నారో ద్వారపాలకుల ద్వారా వినడం వల్ల నేను చొక్కా, తలపాగా ధరించి పెద్దమనిషి తరహలో వెళ్లాను.
అప్పుడు కృష్ణార్జునులు అనేక మణులు పొదిగిన అలంకారాలతో ఒక శయ్యపైనే ఉన్నారు. కృష్ణుడు పడుకుని కాళ్లు చాపుకున్నాడు. అతడి పాదాల్ని తన తొడల మీద పెట్టుకుని అర్జునుడు కూర్చున్నాడు. సత్యభామా, ద్రౌపదీ పీఠాల మీద కూర్చున్నారు. నేను సవినయంగా సాష్టాంగ నమస్కారం చేశాను. కృష్ణుడు నన్ను ఆదరించాడు. మణులతోను, బంగారంతోను చేసిన పాద పీఠం మీద నుంచి తన పాదాలు తీసేసాడు. కృష్ణుడి చేతి సంజ్ఞతోను, అర్జునుడి ఆజ్ఞతోను ఇద్దరు స్త్రీలు ఆ పాదపీఠాన్ని తెచ్చి నాకు వేశారు.
నేను ఆ పాదపీఠాన్ని చేతితో తాకి, నేల మీద కూర్చున్నాను రెండు చేతులూ జోడించి నుదుటిమీద పెట్టి, నల్లని శరీరపు రంగుతో భుజ పరాక్రమ గర్వితులై ఏనుగుల జంటలా ఉన్న ఆ కృష్ణార్జునులని చూస్తుంటే నాకు ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఒళ్లు పులకరించింది. తరువాత భయం కూడా వేసింది.
ఆ సమయంలో నేను ‘ఈ కృష్ణార్జునులు తాను ఏ పని చెపితే ఆ పని చేస్తారట. ఇంక ధర్మరాజుకి నెరవేరని కోరికంటూ ఏముంటుంది? అన్ని మాటలెందుకు? ఒక్క మాటలో చెప్పాలంటే అతణ్ని యుద్ధంలో ఎదిరించడం అంటే యమధర్మరాజు శిరస్సుని ఖండించడమే కదా?’ అని అనుకుంటున్నాను.
ఆ మహాత్ములు నన్ను ఆదరించి తాము ఉపయోగించే అన్నపానాలు, తాము కట్టదగిన వస్త్రాలు, తాము ధరించే ఆభరణాలూ ప్రేమగా నాకు ఇచ్చారు. నేను వెళ్లిన పని వాళ్లకి చెప్పాను. అర్జునుడు తీక్షణమైన ముఖంతో దానికి సమాధానం చెప్పబోతుంటే కృష్ణుడు అతణ్ని అపాడు.
ధృతరాష్ట్రుడికి కృష్ణుడు చెప్పిన మాటలు తెలియచేస్తున్న సంజయుడు
శ్రీకృష్ణుడు సంజయుడితో “సంజయా! విను! ధృతరాష్ట్ర మహారాజు నిండు సభలో అతడి కొడుకులూ, ద్రోణుడూ, కృపుడూ , భీష్ముడూ మొదలైనవాళ్లు అందరూ వింటూ ఉండగా నువ్వు ఇలా చెప్పు ‘ఆ అజాతశత్రుడికి కోపం రావడం అంటే , నీళ్లల్లో నిప్పు పుట్టడం వంటిది. దాన్ని ఆర్పడానికి మీకు ఉపాయం లేదు. ఇక మీదట నేర్పుతో మీరు చేయవలసిన పనులు వినండి. మీరు చేయవలసిన పనులు ఏమిటి? అని అడుగుతావేమో. ఉన్న వస్తువులన్నీ యోగ్యులైనవాళ్లకి ఒప్పుగా పంచిపెట్టండి. స్నేహితులనీ, చుట్టాలనీ, ఆశ్రితులనీ రప్పించి సంతోషం అతిశయించగా సన్మానించండి.
మీ కోరికలకి అనుకూలంగా హృదయాలు ఆనందించేట్లు ఇంద్రియసుఖాలు అనుభవించండి. మీ బార్యల్నీ, బిడ్డల్నీ ఎవరికి ఏ విధంగా అనుకూలంగా ఉంటుందో.. ఆ విధంగా ప్రేమగా ఆదరించండి. ఇంకా – ఎవరి మనస్సు దేనిమీద తగిలి ఉంటుందో అదంతా కావలసిన విధంగా స్వేచ్ఛగా చేసి సంచరించండి. ఇంక అలస్యం చేయకుండా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని యుద్ధానికి బయలుదేరండి.
ఇదంతా ఎందుకు చెప్తున్నానంటావేమో.. పాండురాజు కోడలు – ద్రౌపది ఎప్పుడూ ఎవరూ పడని ఎంతో కష్టం వస్తే దుఃఖించి ఎక్కడో దూరంగా ఉన్న నన్ను ‘గోవిందా! రక్షించు’ అంటూ ఏడవడం తీర్చలేని అప్పులా.. బరువుగా నా మనస్సులో ఎప్పుడూ నిలిచే ఉంది.
ద్రౌపదికి అప్పుపడి ఉన్న నేను రథం తోలుతుండగా గొప్పదైన గాండీవాన్ని పరాక్రమంతో ఎక్కుపెట్టి రెండు అంపపొదుల్ని ధరించి అర్జునుడు ఈ వేళ రేపట్లో యుద్ధానికి వస్తాడు. ఇక మీరు ఎక్కడికి పోతారు?’ అని చెప్పాడు.
ఆ మాటలు విని వాళ్ల నిర్ణయము, నీ కొడుకు వాళ్లకి ఇవ్వవలసింది ఇవ్వలేకపోవటమూ తలుచుకుని నేను భయపడ్డాను. ఇతడికి వాళ్ల సంగతి తెలియదు. భీష్మ ద్రోణుల అండా, కర్ణుడి గర్వమూ తనని గెలిపిస్తాయనే ధీమాతో ఎదిరిస్తాడు” అన్నాడు.
సంజయుడి మాటలు విని ధ్రుతరాష్టుడు “అర్జునుడు ఏమన్నాడు?” అని అడిగాడు.
అతడితో సంజయుడు “ధృతరాష్ట్ర మహారాజా! కోపం వచ్చినా అర్జునుడు చలించక తన కళ్లలో ఉన్న ఎర్రటి జీరల కాంతి వల్ల ఎర్ర తామరల కాంతి వంటి కాంతి కలిగిన కళ్లతో ‘సంజయా! ఆ దుర్యోధనుడూ అతడికి సాయపడడానికి వచ్చిన రాజుల సమూహమూ వింటుండగా నా మాటలుగా వాళ్లకి చెప్పు. ధర్మరాజు భాగం ఇవ్వమని అడిగితే ఒప్పుగా ఇవ్వకపోతే, మేము ఇంకో మాట అనడం ఎందుకు? అదే మంచిది. ఇంతకు ముందు దుర్యోధనుడు మహాగర్వంతో చేసిన ఎన్నో పనులకన్నింటికీ నేను భీముడూ సంతోషించేట్లుగా మెరుగు పెట్టినట్టు ఉంటుందిలే! దుర్యోధనుడు నాతోనూ భీముడితోనూ యుద్ధం చెయ్యడానికి అంగీకరిస్తే ఇంక మాకు కావలసింది ఏమిటి?
ధర్మరాజు అనుకున్నది నెరవేరినట్లే. అలా జరిగితే మంచిదే కదా! దుర్యోధనుడు యుద్ధంలో అమ్ముల పాన్పు మీద పడకుండా ఉంటే, ధర్మరాజు వనవాస సమయంలో నేలమీదే పరుండి పడిన ఆయాసం పోతుందా? సత్యాన్నే పట్టుకుని, కష్టాల్ని లెక్కచేయక, లోపలే అణుచుకున్న కోపాగ్నిని ఎండిపోయి ఉన్న దట్టమైన అడవి మీదకి ప్రసరించే దారుణమైన కార్చిచ్చులా శత్రు సమూహం పైకి వ్యాపింప చేస్తేనే కాని, ధ్రుతరాష్ట్రుడి కొడుకులు యుధిష్ఠిరుడిని లెక్కచేయరు.
భీముడు ప్రళయకాలంలో విశేషంగా చలించే యముడిలా గద త్రిప్పుతూ, మదించిన ఏనుగుల సమూహం ముక్కలు ముక్కలు అవగా, గొప్పవైన అనేక రథాల సమూహలు నలిగిపోగా, గొప్పదైన గుర్రాల సమూహం పాడైపోగా, ఉద్రేకంతో పెరిగిన శరీరం కలవాడై సమీపించడం చూసి దుర్యోధనుడు రాజ్యంలో భాగం తప్పకుండా ఇస్తాడు!
ఆకలిగా ఉన్న పులి పరాక్రమంతో క్రౌర్యంతో లేళ్ల మీదకి ఉరికినట్లు ఉరికి; పెద్ద గాలి మేఘాల గుంపు మీద భయంకరంగా వీచినట్లు; రెచ్చిపోయిన మృత్యుదేవత అనుకున్నట్టుగా ప్రాణుల మీద క్రూరంగా పడి విజృంభించినట్లు; ఆకలితో ఉన్న ప్రళయకాల రుద్రుడు ఆగ్రహంతో అన్ని లోకాల్నీ అక్రమించినట్లు; నకులుడూ, సహదేవుడూ, సాత్యకీ, అభిమన్యుడూ తమని ఎదుర్కున్న శత్రుబలమంతా బెదిరిపోయి, చెల్లాచెదరు అయిపోయేటట్లు; విసుగు చెందేటట్లు; అనేకమంది చచ్చిపోయేటట్లు చేస్తే, చూసి కౌరవులు సంధి చేస్తారు.
సాటిలేని పరాక్రమవంతులైన ఉపపాండవులు ఐదుగురూ సంతోషంతో కొదమ సింహాలు ఒక్కసారిగా మదించిన ఏనుగుల గుంపుని ఆక్రమించినట్లు శత్రుసైన్యాన్ని ఆక్రమించి నెత్తురు అనే నీటిలో తేలుస్తే ఆ యుద్ధాన్ని చూసి మీ రాజు దుర్యోధనుడు శాంతిస్తాడు. స్నేహితులూ, చుట్టాలూ, ఇష్టసేవకులూ మహా యుద్ధంలో ప్రాణాలు దాచుకోకుండా ప్రకాశిస్తూ వెంట వస్తుండగా విరాటుడూ, ద్రుపదుడూ విజృంభించి, సేనల్ని విజృంభించేలా చేస్తూ, వాళ్ల రౌద్రాన్ని పెంచుతూ అనేక అయుధాలతో భయంకరంగా ఎదుర్కోడం చూసి కాని, మాటలతో వెనక్కి తగ్గుతారా కౌరవులు?
తనని శత్రువులు చుట్టుముట్టుతూ ఉన్నప్పుడు శిఖండి ఎవరివైపూ చూడకుండా విజృంభించి పరాక్రమంతో తన పని మీదే ధైర్యంతో మనస్సు నిలిపి, రథం వేగంగా నడుపుతూ కురురాజు (దుర్యోధనుడు) అనే బ్రహ్మకి వెయ్యేళ్లు నిండి మరణించాక, భీష్ముడి మీదకి ఉరికితేనే కాని మాకు మీరు రాజ్యంలో సగం ఊరికే ఇస్తారా?
విద్యుద్దండంలా విల్లు అందంగా ఉండగా, మా యోధుల మనసుల్లో యుద్ధం చెయ్యాలన్న ఉత్సాహం పెల్లుబుకగా, దృష్టద్యుమ్నుడు పనిగట్టుకుని ద్రోణుణ్ని పరాక్రమంతో సమీపించగా చూసికాని, మీరు భయంకరమైన యుద్ధం చెయ్యడం ఎందుకు మానేస్తారు?
గాండీవమనే వింటి అల్లెతాటి ధ్వని క్రమక్రమంగా పెరగడమూ; బాణాలు సమూహంగా ఆకాశాన్ని కప్పేయడమూ; శత్రువుల బాణాలు ముక్కలై రాలడమూ; శత్రు సేనల్లో ఏనుగులు మొదలైన చతురంగ బలాలూ తూట్లు పడి అవయవాలు తేడా తెలియకుండా ముక్కలైపోయి, రక్తంతోనూ, మజ్జతోనూ, ఎముకలతోనూ, మాంసంతోనూ, కండలతోనూ కలిసి యుద్ధభూమి భయంకరంగా మారడమూ; కపిధ్వజమూ, తెల్లగుర్రాలూ ప్రకాశిస్తుండగా బండి కాడికట్టుకర్రల మీద తొట్టెలో కృష్ణుడు కూర్చుని ఉండగా దేవదత్తమనే శంఖం మోగుతుండగా కనబడే రథం చూసి కాని రాజరాజు దుర్యోధనుడు తెలుసుకోలేడు.
పిల్లలాటలో భయంకరమైన రాక్షస సమూహాన్ని చంపలేదా? ప్రతిరోజూ భక్తితో మూడు లోకాలూ పూజించట్లేదా? అటువంటి పరాక్రమం అలంకారంగా కలిగిన మహాత్ముడైన శ్రీకృష్ణుణ్నే తను లెక్కచెయ్యడు. ఇంక మమ్మల్ని ఎందుకు లెక్క చేస్తాడు అయినా ఆ దుర్యోధనుడిలో తప్పేముంది?
మేము భీష్ముడికీ, ద్రోణుడికీ, కృపుడికీ నమస్కరించి, మా రాజ్యభాగం కోసం యుద్ధం చేస్తాము. కౌరవుల కోసం ఎవరేనా మాతో యుద్ధం చేసినా, వాళ్ల శస్త్రాలూ, అస్త్రాలూ ధర్మపరంగానే నిరోధించబడతాయని భావిస్తాము. పన్నెండేళ్లు అడవిలో అలా కష్టాలు అనుభవించి, గ్రామంలో పదమూడో ఏడు అజ్ఞాతవాస కష్టం కూడా అలాగే అనుభవించి, మా తండ్రి వాటా కోసం పోరాడే మమ్మల్ని, ఇంద్రాది దేవతలు తోడు వచ్చినా కౌరవులు గెలిస్తే ధర్మం కంటే అధర్మం బలవత్తరం అన్నమాట.
ఇంతేకాని, మేము చేసేది తప్పు కాదు. మేము కృష్ణుడిని ముందు పెట్టుకుని నడుస్తాము కాబట్టి, ఈ యుద్ధంలో గెలుపు మాదే! అన్ని విధాలుగానూ కర్ణుడితో సహా కౌరవుల్ని వధించి మేము రాజ్యాన్ని దక్కించుకోడం తప్పదు. గాండీవం లాగకుండానే వంగిపోతోంది. బాణాలు మేము తియ్యకుండా తమంతట తమే అమ్ములపొదిలోంచి బయటికి వచ్చేస్తున్నాయి. కుబుసం విడిచే భయంకరమైన సర్పంలా ఖడ్గం తనంతట తనే ఒరలోంచి బయటికి వచ్చేస్తోంది. కాబట్టి మాకు తప్పకుండా యుద్ధం జరిగే తీరుతుంది.
పాశుపతము మొదలైన దివ్యాస్త్రాలతో కురుపక్షంలో ఉన్న వాళ్లని నశింపచేసి శాంతిస్తాం. సంజయా! నువ్వు భయపడకుండా ఇదంతా స్పష్టంగా చెప్పాలి. ఈ మాటలు విని కురువృద్ధుడైన బాహ్లికుడూ, తాత అయిన భీష్ముడూ, గురుడైన ద్రోణుడూ, ఆచార్యుడైన కృపుడూ, గురుపుత్రుడైన అశ్వత్థామా, బుద్ధిమంతుడైన విదురుడూ, ధర్మనిర్వహణ దక్షుడైన శల్యుడూ, ఏది నిర్ణయించి చెపుతారో అది జరిగి తీరుతుంది. దుర్యోధనాదులు దీర్ఘాయువులవుతారు కాక!’ అన్నాడు” అని సంజయుడు చెప్పాడు.
