[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]
భీష్ముడు చెప్తున్నాడు
సంజయుడు చెప్పిన మాటలు విని భీష్ముడు అందరూ వింటుండగా దుర్యోధనుడితో “బ్రహ్మ నిండు సభ తీర్చి ఉండగా ఇంద్రాదుల చూపులన్నీ ఒకచోట నిలిచిపోయాయి. మెరిసిపోయే తెజస్సుతో కళ్లు మిరిమిట్లు గొలిపేట్లు ఒకళ్లనొకళ్లు రాసుకుంటూ ఇద్దరు వెడుతూ కనిపించారు.
వాళ్లని చూసి బృహస్పతి “వీళ్లిద్దరూ ఎవరు? మీరు ఇక్కడే ఉండగా మిమ్మల్ని లక్ష్యపెట్టకుండా ప్రవర్తిస్తున్నారు?” అని బ్రహ్మని అడిగాడు.
బృహస్పతి అడిగినదానికి బ్రహ్మ “తపశ్శక్తి, బలమూ, పరాక్రమమూ, గర్వమూ కలిగి లోకుల్ని రక్షించడం కోసం ప్రతి యుగంలోను నరుడూ, నారయణుడూ, అని ప్రసిద్ధికెక్కిన మునులు సంచరిస్తారు. దేవతలకి మేలు చేస్తారు, రాక్షసుల్ని నాశనం చేస్తారు. అధర్మ యుద్ధం జరిగే చోట ధర్మాత్ములైన జనుల్ని ఎంతో సంతోషంతో గెలిపిస్తారు (పటాటోపం). దేవదానవ యుద్ధంలో ఇంద్రుడు వెళ్లి ఈ నరనారాయణుల్ని పూజించి సహాయం చెయ్యమని అడిగితే, వచ్చి పౌలోములు, కాలకేయులూ మొదలైన ఎంతోమంది దైత్యుల్నీ, దానవుల్నీ చంపి ఇంద్రుడికి విజయం సంపాదించి పెట్టారు.
అప్పటినుంచి వీళ్లు అందరికీ తెలుసు. ఇది ఒక్క తేజస్సే. రెండు విధాలుగా ప్రకాశిస్తూ ఉంటుంది” అని చెప్పాడు. “వేడుక కోసం మరో జన్మనెత్తిన ఆ మహాత్ములే ఈ అర్జునుడూ శ్రీకృష్ణుడూ. అర్జునుడు సముద్రతీరస్థమైన హిరణ్యపురాన్ని ప్రవేశించి అరవైవేలమంది నివాతకవచుల్ని జయించి ఇంద్రుడికి సంతోషం కలగచేశాడు.
కంసుడు, నరకాసురుడు మొదలైన దుర్మార్గుల్ని సంహరించిన కృష్ణుడి పరాక్రమం మనకి తెలిసిందే కదా? ఇప్పుడు జరగబోయేదేమిటో చెప్తాను విను. ఆ కృష్ణార్జునులిద్దరూ ఏకమై యుద్ధం చెయ్యడమే జరిగితే వెయ్యి మాటలెందుకు? మనకే కాదు.. ఎదురుగా నిలబడి పరాక్రమంతో జయించడం ఆ పరమేశ్వరుడికి కూడా సాధ్యం కాదు. ఒక కృష్ణుడు సారథీ, ఇంకో కృష్ణుడు (అర్జునుడు) రథికుడూ అయి రథం మీద మిక్కిలి భయంకరమైన తేజస్సుతో కనిపించినప్పుడైనా నువ్వు ధైర్యంగా చూసి తెలుసుకుంటావులే” అని కొంచెం ఆగాడు.
భీష్ముడు దుర్యోధనుడితో మళ్ళీ చెప్తూ “నా మాటకి నువ్వు మనస్సులో కొంచెం కూడా భయపడవు. ఏది చెయ్యాలనుకున్నావో అదే చేస్తావు. కౌరవులకి పోగాలం వచ్చిందేమో లేకపోతే ఇటువంటి పొగరుబోతువి నిన్ను ఏమంటాను? దుర్మార్గులూ, పాపులూ, నీచస్వభావులూ అయిన ఈ కర్ణ, శకుని, దుశ్శాసనులు ముగ్గురూ చేసే జ్ఞానబోధలేగాని ఇంకొకటి వినడానికి ఇష్టపడవు. ఏం చెయ్యగలం?” అన్నాడు.
భీష్ముడి మాటలకి కోపగించి కర్ణుడు భీష్ముడితో “నువ్వు ఇలా మాట్లాడవచ్చా? నేను ఏం చేశానని? వాళ్లని సేవిస్తూ వాళ్ల ఉప్పు తింటున్నాను కనుక న్యాయంగా ఏదో నాకు తోచిన ఉపాయం చెప్పడమూ, వాళ్ల కోసం మాట్లాడ్డమూ తప్పు కాదుగా? నేనెప్పుడూ ధృతరాష్ట్ర మహరాజుకీ, అతడి కొడుకులకీ, మనుమలకీ మంచి జరిగే విధంగానే ప్రవర్తిస్తాను. నాది దుర్మార్గమే అయితే రాజు దుర్యోధనుడు నన్ను ఇంతటి గొప్పవాడుగా ఎందుకు చేస్తాడు? నిండు సభలో ఇంత అన్యాయపు మాటలు నీ నోటి నుంచి రావచ్చా?” అన్నాడు.
కర్ణుడి మాటలు విని భీష్ముడు ధృతరాష్ట్రుడితో “ఒక్క విషయంలోనైనా పాండవుల్లో ఒకడిలో చిన్న తునుకంత కూడా సరిపోడు. సిగ్గులేకుండా పాండవుల్ని నేను గెలుస్తాను అంటూ ఉంటాడు ఈ కర్ణుడు. వీడి పనికిమాలిన మాటలు దుర్మార్గులు ఆసక్తిగా వింటారు. పరాక్రమంలో పాండవులకి కర్ణుడు సరితూగుతాడని నమ్మి ఈ దుర్యోధనుడు పాండవులతో శత్రుత్వం వహించి సకలగుణ సంపన్నులూ, పరాక్రమవంతులూ అయిన వాళ్లని అవమనించాడు.
పాండవులు ఒక్కొక్కళ్లు అనేక యుద్ధాల్లో విజయాలు పొందినవాళ్లు. వీడు ఎక్కడ ఏం చేశాడు? ఇతడి తమ్ముణ్ని కూల్చి విజృంభించిన అర్జునుడి మీదకి ఉరికాడా? అతడు గోవుల్ని మరల్చుకునిపోతే, వీడు అక్కడ లేడా? ఘోషయాత్రలో నీ కొడుకుని ఓడిపోయేలా చెయ్యలేదా? ఈ దుష్టుడు చేయవలసిన పనేమిటో తెలియక అవినీతిపరుడై ఇష్టం వచ్చినట్లు ప్రేలుతూ ఉంటాడు. నువ్వు కూడా ఒప్పుకుని ఊ కొడుతూ ఉంటావు. మంచిదే!” అన్నాడు.
భీష్ముడి మాటలు విని ద్రోణాచార్యుడు ధృతరాష్ట్ర మహారాజుతో “భీష్ముడు అటు పాండవులకీ, ఇటు కౌరవులకీ మొత్తం కురువంశ సంతతికి అంతటికీ కావలసినవాడు కదా! అతడి మాటలు ఎంతో మంచిని కలిగిస్తాయి. యుద్ధం చెయ్యడం మంచిదికాదు. ధర్మరాజుతో సంధి చేసుకోవడమే మంచిది. అర్జునుడు సంజయుడితో చెప్పినదంతా చెయ్యగల సమర్థుడు.
ఖాండవ వన దహనం మొదలైన అతడు చేసిన వీరకృత్యాలు గుర్తు చేసుకోవడం మంచిది. విల్లమ్ములు ధరించేవాళ్లే లేరా ఏమిటీ? ఇతరులు పౌరుషమూ, శక్తీ కలిగి యుద్ధంలో గెలుపొందరా? అర్జునుడికి ఒక్కడికే విజయుడనే పేరు ఎందుకు వచ్చింది? మన దేశంలోనే కాదు, ఈ అర్జునుడితో సమానుడైన విలుకాడు ఎక్కడా లేడనే విషయం అందరికీ తెలిసినదే! అతణ్ని ఎదిరించడం అసాధ్యం” అని చెప్పాడు.
మంచిని బోధించిన బీష్మద్రోణుల మాటలు గౌరవించక, వాళ్లకి తగిన సమాధానాలు చెప్పక, వాళ్లతో వాటికి తగినట్టుగా మాట్లాడక ధృతరాష్ట్రుడు మళ్లీ పాండవుల గురించిన విషయాలు అడగడానికి సంజయుడి వైపు చూశాడు. అది చూసి కౌరవుల పక్షంలో ఉన్న వీరులంతా తమ ప్రాణాల మీద ఆశ వదులుకున్నారు. ఆ ధృతరాష్ట్ర మహారాజు సంజయుడితో “ధర్మరాజు కౌరవుల పక్షం గురించి ఏమనుకుంటున్నాడు? ఇక్కడ సైన్యాలన్నీ మొహరించి ఉండడం అతడికి తెలుసా? అతడు ఎవరిని తోడు తీసుకుని కౌరవులపైకి దండెత్తి వస్తున్నాడు?” అని అడిగాడు.
ధృతరాష్ట్రుడు అడిగినది విని సంజయుడు వేడిగా నిట్టూర్చి, నిశ్చేష్టుడై, మనస్సు కుంచించుకునిపోయి మూర్ఛపోయినవాడిలా కొయ్యబారిపోయి, కొంతసేపటికి తెప్పరిల్లి మనస్సు గట్టి చేసుకుని ‘అయ్యో! ఈ రాజు ఇంత వెర్రివాడా? యుధిష్ఠిరుడు ఎవరిని తీసుకుని దండెత్తి వస్తాడని అడుగుతున్నాడు? ఇంత తెలియనివాడు ఎంత చెపితే తెలుసుకోగలుగుతాడు? ఇతడె ఇలా ఉంటే ఇంక కొడుకుల సంగతి వేరే చెప్పడం ఎందుకు? ఇంక నేను ఏం చెప్పగలను? అయిన నన్ను అడిగినదానికి సమాధనం చెప్పాలి కదా?’ అనుకున్నాడు.
ధృతరాష్ట్రుడితో “ధృతరాష్ట్ర మహారాజా! విను. ధర్మరాజు సంధి చేసుకోడానికే మనస్సులో కోరుతున్నాడు. మీరు తన తండ్రి సగం భూమిని ఇవ్వకపోతే తప్ప, ముందే ఏ కీడూ తలపెట్టడు. బలంతోనే భూమిని పుచ్చుకోవలసి వస్తే, మీ బలాన్ని కొంచెం కూడా లక్ష్యపెట్టడు. ధర్మరాజు ఎవరిని తోడు తెచ్చుకుని దండెత్తి రాబోతున్నాడని అడిగావు. నీకు తెలియనివాళ్లు అక్కడ ఎవరు ఉన్నారు? అయినా చెప్తాను విను!
బకాసురుడిని చంపినవాడూ, జటాసురుడని అంతమొందించినవాడూ, హిడింబుడనే రాక్షసుడి ప్రాణాలు అంతు చూసినవాడూ, కీచకుణ్ని తుదముట్టించినవాడూ, యుద్ధమంటే ఉత్సాహన్ని చూపించేవాడూ, పదివేల ఏనుగుల బలం కలవాడని పొగడబడే భయంకరమైనవాడూ, శత్రువుల వ్యూహాల్ని నాశనం చేసేవాడూ అయిన భీముడిని భుజపరాక్రమ విజృంభణ చూపించడానికి వెంటబెట్టుకుని ధర్మరాజు వస్తాడు.
నిటలాక్షుడిని ద్వంద్వయుద్ధంలో చూసిన అర్జునుడి బాహుబల పరాక్రమం ఎంత అని లెక్కపెట్టడం ఆకాశాన్ని తాకిన మనిషి పొడవు ఎంత? అని అడగడంలాంటిది. అంతటివాడిని వెంటబెట్టుకుని ధర్మరాజు యుద్ధానికి రావడానికి ఎందుకు సందేహిస్తాడు? మీ సైన్యాలు వెనక్కి తిరిగి పారిపోవలసిందే.
ధృతరాష్ట్ర మహారాజా! నకులుడినీ సహదేవుడినీ తీసుకుని ధర్మరాజు కౌరవులపైకి దండెత్తాలని పనిగట్టుకుని సమయం చూసి రావడం సింహాలని తీసుకుని వేటాడడానికి రావడం వంటిదే కదా? ద్రౌపది కొడుకులూ, సుభద్ర కొడుకు అభిమన్యుడూ ఉక్కుముక్కలు కాదా? ధర్మరాజు ఆ గొప్పవాళ్లైన కుమారుల్ని వెంటబెట్టుకుని మీ పైన యుద్ధానికి వస్తాడు.
ఆలోచించగా నీకు ఎలా తెలియట్లేదు? నిజమేనని అనిపించడం లేదు? ధృతరాష్ట్ర మహారాజా! వృష్టివంశ కుమారుల్లో శ్రేష్ఠుడూ, కృష్ణుడి తమ్ముడూ సాత్యకీ, కార్చిచ్చులా అమితమైన వేడి అనే పరాక్రమంతో ప్రకాశించే ద్రౌపదీ సోదరులు సామాన్యులా? ఇంకా చెప్తాను విను!
శౌర్యంతో ప్రకాశించే ద్రుపదుడూ; గొప్ప పరాక్రమం కలవాడైన విరాటుడూ; గొప్ప ధైర్యం కలిగిన అతడి తమ్ముళ్లూ; గొప్ప తేజస్సు కలిగిన అతడి కుమారులూ; అన్నదమ్ములూ, అమితమైన పరాక్రమం కలిగిన కేకయరాజులూ; ఎంత పోరాడినా అలిసిపోని జరాసంధుడి కుమారుడు సహదేవుడూ; జయత్సేనరాజూ, శిశుపాలుడి కుమారులూ; పరాక్రమమే ధనంగా కలిగిన ధృష్టకేతుడు, వృషభుడూ; ఎంత పెద్ద యుద్ధమైనా వినోదంగా అనుకునే యాదవరాజు చేకితానుడూ; పరాక్రమగర్వంతో ఘనుడైన శైబ్య నృపాలుడూ ఉన్నారు కదా!
భీముడి కొడుకు ఘటోత్కచుడు తండ్రి కంటే బలపరాక్రమాలు కలవాడు. మాయాబలంతో మన మన సైన్యాన్ని కకావికలంగా చేస్తాడు. ఇంకా తూర్పునా, ఉత్తరానా ఉన్న రాజులు అనేక సేనలతో వచ్చి నిప్పయినా సరే పిడికిట్లో పట్టుకుందాం అనేలా యుద్ధం చేస్తారు.
ధృతరాష్ట్ర మహారాజా! లోకాలన్నింటినీ అరచేతిలోకి తీసుకుని రాగలిగే శక్తి సంపన్నుడు దేవకి కొడుకు శ్రీకృష్ణుడు ధర్మరాజుకి ఉన్నాడు. ఇంక ధర్మరాజు దండెత్తి రాకుండ ఉంటాడా?” అన్నాడు సంజయుడు.
భీముడి పరాక్రమం తలుచుకుని దుఃఖించిన ధృతరాష్ట్రుడు
సంజయుడు చెప్పిన విషయాలన్నీ విని ధృతరాష్ట్రుడు “పాండవ పక్షంలో నువ్వు చెప్పిన రథికులందరూ చాలా బలవంతులే, అయినా ఆ బలాన్ని అంచనా వేసి చూస్తే వాళ్లంతా ఒక ఎత్తు, ఆ భీముడు ఒక్కడూ ఒక ఎత్తు. భీముణ్ని తలుచుకుంటే నాకు గుండె బేజారెత్తిపోతూ ఉంటుంది. రాత్రులు కొంచెం కూడా నిద్ర పట్టడం లేదు. అతణ్ని పరాక్రమంతో ఎదుర్కోగలిగేవాడు ఈ సైన్యంలో లేడు.
అతడు కోపంతో గదాదండాన్ని ఎత్తితే అది యమదండమే అవుతుంది. అతడు అడ్డులేకుండా కౌరవ సమూహంలో విహరిస్తాడు. ఆ భీముడు చిన్నప్పుడు కూడా నా మాట వినేవాడు కాదు. ఈ కౌరవులు పగతో కయ్యానికి కాలు దువ్వుతారు. ఆ భీముడి చేత బాధ పొంది కూడా పగ విడిచి పెట్టరు. కౌరవులకీ, పాండవులకీ మధ్య ఉన్న శత్రుత్వానికి ఇదే కారణం. యుద్ధంలో రాక్షసులు కూడా భీముణ్ని ఎదిరించలేరు. బాహు యుద్ధంలో జరాసంధుణ్ని ఒక్క రెప్పపాటు కాలంలో చంపాడు. ఇంక మిగిలిన రాజులు అతడి ఎదుట ఎలా నిలబడగలరు?
కోపంతో కనుబొమలు ముడిపడి, అమితమైన కోపం పొంగుకు వచ్చి, భుజాల కొనలు పొంగి, కురుసేనలో నాకు ఎదురెవ్వరు అని పరాక్రమం రాణించగా, అడ్డగించలేని విధంగా వచ్చే భీముణ్ని చూసి ధైర్యం కోల్పోయిన కౌరవసేనలు నా కళ్లకి కట్టినట్లు కనిపిస్తునాయి. కత్తి, గద మొదలైన సాధన సామగ్రి లేకుండానే కేవలం భుజబలంతో ఏనుగులా విజృంభించే భీముడి ఎదుట ఎవరైనా నిలబడగలరా? ప్రళయ కాలంలో సముద్రం పొంగి మహా భయం కలిగించినట్లు భీముడు అనే మహాసముద్రాన్ని ఈదడం నా కుమారులకి శక్యమా?
విధివశం వల్ల, మదం వల్ల, ఎదుటివాళ్లనీ, తమనీ తెలుసుకోలేరు. అగ్నికి వాయువు తోడైనట్లు, భీముడి అడ్డుకోలేని యుద్ధ విధానం తెలిసేటట్లుగా అతడికి అండగా అర్జునుడు గాండీవంతో వెంటనే వచ్చేస్తాడు. సంజయా! నీకు ఉన్న సంగతి చెప్తాను విను. అర్జునుడికి పరాక్రమంలో సాటి అయినవాడు ఏ యుగాల్లోగాని, ఎక్కడైనాగానీ ఉన్నాడని చూశామా? విన్నామా? అతడు నీతో అన్నదంతా చేసి చూపించగల సమర్థుడు. ఊరికే అంటాడా? సాటిలేని గాండీవం కీర్తిని పెంచుకుంటూ ప్రకాశిస్తుంది.
దానికి తోడు కృష్ణుడు ఇంకో ఆశ్చర్యకరమైన తేజస్సు. అర్జునుడుకి ఆ తేజస్సు అవసరం లేదు. అర్జునుడు ఒక్కడే శత్రుసైన్యాలకి మండుతున్న మంట. ఈ విధంగా ప్రతాపమూర్తులు మూడూ ఒక్క చోట చేరాయి. ఇన్ని ప్రతాపాల భయంకరమైన వేడిని తట్టుకోవడం కౌరవుల తరమా? అర్జునుడు సురాసురుల సహితంగా లోకాలన్నింటిలోనూ గెలవడం కోసమే విహరిస్తాడు.
మిక్కిలి భయంకరమైన బలం ఉండడం వల్ల అతణ్ని ఏ లోకంలో వాళ్లు అరికట్టలేరు. కౌరవ సైన్యాన్ని గెలవడం అర్జునుడికా చాలా కష్టం? గాండీవంలోంచి వచ్చే బాణాల సమూహాల నుంచి వచ్చే మంటలే విజృంభించి, దానిని శేషం లేకుండా దహించేస్తాయి.
భీమార్జునుల శక్తి గురించి భీష్మ, ద్రోణులకి తెలిసినంతగా మరెవరికీ తెలియదు. తెలిసి కూడా అభిమానం వల్ల వాళ్లు మన సేనకి ముందు భాగంలో నిలుస్తారు. కీర్తే ముఖ్యమనుకుని ప్రాణాలు విడుస్తారు. ఇంతేకానీ, చేసేది లేదు. అదీకాకుండా, మనుమలు కావడమూ, శిష్యులు కావడమూ భీష్మద్రోణులకి సమానమవడం వల్ల, వీళ్లు రెండు పక్షాలవాళ్లకీ సమానమే! మన దగ్గర ఉన్న దోషానికి మన ముందు నిలబడి తీరాలనే ఈ మాత్రానికే కదా వీళ్లకింత కావలసి వచ్చింది!
నేను విధి వశం చేత బిడ్డలకి నొక్కి చెప్పడంగాని, ఇలా నడవండి, ఇలా నడవకండి అని ఆజ్ఞాపించడం గాని చెయ్యలేకపోతున్నాను. మొదట్లో విదురుడు ఎలా జరుగుతుందని వివరంగా చెప్పాడో, అలాగే జరిగింది. జూదమాడినప్పటి నుంచి కౌరవులకి కీడు జరుగుతోంది. అంటే ఒప్పుకోరు అది ఎలా అంటవేమో… భూరాజ్యం మీకిచ్చి దిక్కుల్ని పట్టుకుని వెళ్లిపోయారా లేదా? తాము అరణ్యంలో బాధలు పడుతూ కూడా దుర్యోధనుడి ఘోషయాత్ర సందర్భంలో గంధర్వుల చెరనుంచి విడిపించడం మనకి తెలుసుకదా! ఆ సమయంలోనే పాండవుల్ని రప్పించి న్యాయం చేసి అదరించి ఉంటే, అనాడే వాళ్లు కోపం విడిచిపెట్టేవాళ్లు కదా? నీ మాటలు అతిక్రమించరు కదా? వాళ్లని ఇప్పుడైనా పిలిచి అధికారం అప్పగించు అన్నాడు’ అయినా నేను వినలేదు.” అన్నాడు.
