[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]
తమ వీరుల సామర్థ్యం గురించి తండ్రితో చెప్పిన దుర్యోధనుడు
తండ్రి చెప్పినదంతా విని దుర్యోధనుడు తండ్రితో “అడవుల్లోనూ, కొండల్లోనూ పడి పెద్ద ఆపద వల్ల రూపాలు చెడిపోయినవాళ్లని; కృష్ణుడు శిక్షణ లేని పిరికివాళ్ల గుంపుని ఒక గుంపుగా కూరిస్తే పాండవులు యుద్ధం చేస్తారా? రాజా! ఎందుకయ్యా అంత భయం నీకు? మా బలపరాక్రమాల్ని నువ్వు తక్కువ అంచనా వెయ్యకు. ఎలాగయినా మేమే గెలుస్తాము.
భీష్ముడు పరశురాముణ్ని గెలిచిన శూరుడు. రాజులు భీష్ముడి పేరు వినగానే పారిపోతారని నీకు తెలియదా? ఇతడికి కోపం వస్తే పాండవులంటే ఎంత? కృపుడు, ద్రోణుడూ అయోనిజసంభవులు, అమిత బలసంపన్నులు. యుద్ధ క్రీడలో ఆరితేరినవాళ్లు. వీళ్లకి కోపం వస్తే హరుడు కూడ ఎదుర్కోలేడు.
ఈశ్వరుడి వరం వల్ల పుట్టినవాడూ, సూర్యుడి తేజస్సు వంటి తేజస్సు గలవాడూ, అస్త్రవిద్యా సంపన్నుడూ అయిన అశ్వత్థామ ఉండగా మనకి యుద్ధ భయం ఎందుకు? రాజా! సహజమైన కుండలాలు కలవాడూ, పరాక్రమం కలవాడూ, గొప్ప భుజబలం కలవాడూ అయిన కర్ణుడు ఇక్కడ ఉన్నాడు. ధర్మరాజు దగ్గర ఇతడికి ప్రతి అనదగినవాడూ ఉన్నాడేమో ఆలోచించు.
రాజా! కర్ణుడి గొప్పతనం చెప్తాను విను. ఇంద్రుడు వచ్చి ప్రేమతో శచి కోసమని తనని కోరితే, తీసికొమ్మని కుండలాల జత ఇవ్వడం విశ్వమంతా తెలుసు. ఇప్పుడు నేను చెప్పిన వీరులు ఆ ధర్మరాజు మొదలైనవాళ్లతోనే కాదు, మరెవ్వరితోను ఓడిపోరు అనేది స్పష్టంగా అర్థమవుతోంది. బాహ్లికుడూ, సోమదత్తుడూ, భూరిశ్రవుడూ, శల్యుడూ, సైంధవుడూ, శకుని మొదలైన మహావీరులు వాళ్లకంటే బలవంతులు.
తక్కిన రాజులు, సహాయపడడానికి వచ్చిన వివిధ దేశాల రాజులూ నాతోపాటు సుఖ దుఃఖాలకి అంగీకరించి నిప్పుల్లోనైనా ఉరకడానికి, సముద్రాన్ని కూడ ఈదడానికి ఉత్సాహంతో తెగించి విజృంభిస్తారు. కనుక, పాండవులకి మా వైపు తేరిపార చూడడానికి సమర్థులు కారు. సందేహించకు.
ఇలా కాకుండా మాకు ఎవరూ లేకుండా, చుట్టాలూ, స్నేహితులూ విడిచిపెట్టి, తోడు వచ్చినవాళ్లు కూడా వెళ్లిపోయి, సేవకులూ అసంతృప్తితో ఉండి, ఆ పాండవులకే వీరులు, బంధువులు, మిత్రులు, సహాయులు, ప్రజల అనురాగము దొరికేటట్లయితే, అది మా ప్రారబ్ధం. అంతేకాని, ఇంక మేము వాళ్ల పాదాలు పట్టడం గాని, పారిపోవడం గాని చెయ్యలేము. అన్ని విధాల యుద్ధం చేస్తాము. ఇదే మా అభిప్రాయం. నేను అనుకున్నట్లుగా అయినా, కృష్ణుడు అనుకున్నట్లుగా అయినా జరుగుతుంది. ఎలా జరిగినా మంచిదే. ఇంతవరకూ నిశ్చయం” అని చెప్పాడు.
ఇంకా ఇలా చెప్పాడు “కులంలో అవమానకరమైన, సిగ్గు చేటయిన కూడు తినమని పంపించాలని చూస్తున్నావు. ఒకళ్లని బాధించినవాళ్ల మీదకి ఆ బాధించబడ్డవాళ్లే దండెత్తి వస్తే ‘మేము యుద్ధం చేయలేము’ అంటే ధైర్యం పోతుందే కాని, సఖ్యం కుదురుతుందా? నువ్వు వాళ్లని దీనంగా వేడుకుని, నీ కొడుకుల చావుకీ, హానికీ ఓర్వక, ఇలా నోరు విడిచి విలపిస్తే లోకులు అసహ్యించుకోరా? నిన్ను నేను ఏమనగలను?
రాజా! నువ్వు భీముడిని ఇంత గొప్ప చేసి అనేక విధాల చెప్పావు. అతడు బలం గలవాడు. గదాయుద్ధంలో నేర్పరి అంటూ ఎంతో భయపడుతున్నావు. అతడు నాతో సరిసమానుడు కాదని నీకు తెలియదా? గదాయుద్ధంలో నాతో సమానమైనవాడు మూడు లోకాల్లోనూ నాకు కనిపించడు. పొగరెక్కిన అ భీముడు పంతమెక్కువై నన్ను యుద్ధంలో ఎదుర్కుంటే, వజ్రం గట్టిగా తగిలితే కూలిపోయే కొండలాగా, వాడిని నేల మీద పడేట్టు కొడతాను. ఇది నా కోరిక కదా! చాలా కాలానికి గదాయుద్ధం వచ్చింది.
భీముడు నేలగూలితే ఇంక ఆ సేనలో ఎదుట నిలబడి యుద్ధం చెయ్యడానికి ఇంకెవ్వడూ లేడని స్పష్టంగా చెప్పగలను. ఇదంతా చూసే కదా ధర్మరాజు ‘మాకు అయిదు ఊళ్లైనా చాలు’ అంటున్నాడు! భీముడు పోతే అర్జునుడు ఉన్నాడు కదా అనుకుంటున్నావేమో! కర్ణుడు పొందిన శక్తాయుధం ఉన్నంతకాలం, అర్జునుడు యుద్ధంలో బతుకగలడా? అదీకాక, అతడిని భీష్ముడు మొదలైన వీరుల సాటిలేనివి, అమితమైన శక్తి కలిగినవీ అయిన దివ్యబాణాలు మింగెయ్యవా?
దుశ్శాసనుడూ, దుష్ప్రహుడూ, దుర్ముఖుడూ, వివింశతీ, వికర్ణుడూ, చిత్రసేనుడూ మొదలైన నీ కొడుకులు ఒక్కొక్కడే అన్ని లోకాల్నీ జయించగలరు. ఇంక అందరూ ఏకమై కలిసి నడిస్తే అర్జునుడిని ఒక్కడినే కాదు, పాండవులనందరినీ ఒక్క పెట్టున ఎగుర గొట్ట గలరు.
అదీకాక, మాకు సైన్యం పదకొండు అక్షౌహిణులు ఉన్నాయి. వాళ్లకి ఏడే ఉన్నాయి. మా సైన్యం సారవంతమైంది, వాళ్లది నిస్సారం. వాళ్లు మిమ్మల్ని ఎలా జయించగలరు? ఈ ఎక్కువ తక్కువల్ని నువ్వు చూడట్లేదు. అనవసరమైన భయం పెట్టుకుని తెలివితక్కువగా బాధపడుతున్నావు. మేము తక్కిన పనులన్నీ చేయగలం కాని, నిన్ను ఏడవకుండా మాత్రం చేయలేము” అన్నాడు.
దుర్యోధనుడు సంజయుడివైపు చూసి “అనేక దేశాల్లో ఉన్న గొప్ప వీరుల్ని క్రోధ బుద్ధితో కలుపుకుని ధర్మరాజు ఏమన్నాడో చెప్పు. అతడి సంగతి చూద్దాము” అన్నాడు.
దుర్యోధనుడికి ధర్మరాజు నిశ్చయం గురించి చెప్పిన సంజయుడు
దుర్యోధనుడు అడిగినదానికి సంజయుడు “ధర్మరాజు యుద్ధం అనగానే మూరెడు లేస్తాడు. అతడి తమ్ముళ్లు ఎంతో సంతోషంతో ఒక పెళ్లికి వెడుతున్నంత సంతోషంగా వెడతారు. వాళ్ల ఉల్లాసం ఎక్కడైనా ఉందా?
వాళ్ల పక్షంలో ఉన్న నాయకులు ‘మా చేతుల దురద తీర్చుకోడం ఎప్పుడా?’ అని ఉవ్విళ్లూరుతుంటారు గాని, కొంచెం కూడా చలించరు. ఆ పక్షంలో ఉన్న సైన్యం అర్జునుడి పాశుపతము మొదలైన బాణాల గొప్పతనము, భీముడి గద గొప్పతనము మీద నమ్మకంతో అందరూ గుమిగూడి ఎప్పుడు పోరాడదామా అని ఎదురుచూస్తూ ఉంటారు” అన్నాడు.
సంజయుడు చెప్పింది విని దుర్యోధనుడు “సంజయా! నువ్వు పాండవుల్ని బాగ పొగుడుతావు. అది సరే, పాండవులు యుద్ధసాధనాలుగా వేటిని ఉపయోగించి కౌరవుల మీదకి నిర్భయంగా దండెత్తుతారు?” అని అడిగాడు.
దుర్యోధనుడితో సంజయుడు అర్జునుడి దివ్యరథమూ, తెల్లగుర్రాలూ, కపిధ్వజమూ, దేవదత్తమనే శంఖమూ అనే వాటి మహత్యాలు ప్రత్యేకంగా వివరించి చెప్పాడు. ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుల రథాలూ, మొదలైన ఉపకరణాలూ ఇల్లాంటి ఇల్లాంటివి అని వివరంగా చెప్పాడు. విరాటుడూ, ద్రుపదుడూ మొదలైన వాళ్లకి కావలసిన సాధనల లోటు లేదని చెప్పాడు.
అది విని ధృతరాష్ట్రుడు “కౌరవ పక్షంలో మహావీరుల్ని ఎవరూ సాధించలేరు. వీళ్లని జయించే విధానం వాళ్లు రూపుదిద్దుకున్నారా?” అని అడిగాడు.
ధృతరాష్ట్రుడు అడిగినదానికి సంజయుడు “ధృతరాష్ట్ర మహారాజా! భీష్ముడు శిఖండి వంతు. ఆ శిఖండికి విరాటుడి సైన్యం అండ. ద్రోణుడు దృష్టద్యుమ్నుడి వంతు. అతడికి ఉపపాండవులు అయిదుగురూ తోడ్పడుతారు. దుర్యోధనుడూ, అతడి తమ్ముళ్లూ భీముడి వంతు. యువ వీరులంతా అభిమన్యుడి వంతు. శకుని, సైంధవులూ, అశ్వత్థామ, కర్ణుడూ – ఇతరులకి లొంగని మహాశూరులైన వాళ్లు అర్జునుడి వంతు. సోమదత్తుడు చేకితానుడనే యాదవరాజు వంతు. యుద్ధానికి ఇలా నిర్ణయించుకున్నారు.
ధృతరాష్ట్ర మహారాజా! నకులుడూ, సహదేవుడూ శకునినీ, ఉలూకుడు మొదలైన కొడుకులనూ, సారస్వతులనూ ప్రసిద్ధమైన బలం కల కాళింగులనూ చంపుతారు. రాజా! కేకయులు మనతో కలిసిన కేకయుల్ని జయిస్తారు. పుణ్యాత్ముడూ, సుశ్లోకుడూ అయిన ధర్మరాజు లోకోత్తరుడైన శల్యుడిని గెలుస్తాడు.
ఆ మాటల సందర్భంలో అక్కడ కొందరు జనులు ధర్మరాజుతో “ధర్మరాజెక్కడ? శల్యుడెక్కడ? ఇతడికి అతడు సమానుడా?” అనగానే వారికి అతడే శల్యుడి అమిత బలపరక్రమాలని గురించి చెప్పాడు.
“ఇలాగే కాక, ఎవరిని ఎవరు ఎదుర్కుంటారో, వారిని వారే గెలవగలుగుతారు” అన్నారు. ఈ విధంగా గర్వం అతిశయించి కొదవలేని సాహసంతో వారు ప్రకాశిస్తున్నారు. ఇంక నీకూ నీ కొడుకుకీ ఏం చెయ్యాలని అనిపిస్తే అది చెయ్యండి” అన్నాడు.
సంజయుడు చెప్పింది విని ధృతరాష్ట్రుడు “ఇంక నా కొడుకులకి బతుకెక్కడిది? ఎంత ఆలోచించినా, ఇక్కడ కూడుకుని ఉన్న సైనికులు, ఇప్పుడు నువ్వు చెప్పిన వీరుల సమూహాన్ని- వీర సైనుకుల్ని గెలవడం సాధ్యపడుతుందా? ఇంక నేను అనేది ఎముంది? రాజు ధర్మరాజయి, కృష్ణుడు తాను స్వయంగా జయం కలిగించబోతుండగా ఆ సైన్యాన్ని దుర్యోధనుడు లక్ష్యపెట్టక పోవడం కేవలం నా పుట్టుకలోనే దుఃఖించమని ఉండడం వల్ల మాత్రమే! నాకు దుఃఖించే యోగం ఉండడం వల్లనే సుమా!
ఇప్పుడు నేను ఎలా మాన్పించగలను? ఇక్కడ చేరిన ఈ రాజులకి ఆయువు మూడింది. సంజయా! నీకు ఈ శ్రమ ఎందుకు? ఇంక చెప్పకు” అన్నాడు.
ధృతరాష్ట్రుడి మాటలు విని దుర్యోధనుడు తన తండ్రితో “మేమూ పాండవులూ ఒకే కులంలో పుట్టి ఒక్కచోట జతగా కలిసి ఉన్నవాళ్లం. అలాంటప్పుడు గొప్ప బలపరాక్రమాలూ, గర్వమూ వాళ్లకే ఉన్నాయని, వాళ్లే యుద్ధంలో గెలుస్తారనీ నిర్ణయం నీకు ఎలా కలిగింది? పాండవుల్నీ, వాళ్ల వాళ్లనీ తెగ పొగుడుతావు గాని, మమ్మల్నీ, మా వాళ్లనీ పట్టించుకోవు. ఈ భూమి వాళ్లకి కాదనీ మాకే మొత్తం చెందాలనీ విధి మొదటే నిర్ణయించాడు. ఈ విధి నిర్ణయాన్ని ఎవరూ తప్పించలేరు. నిష్కారణంగా మనసులో ఇంత బాధ పడతావెందుకు?” అన్నాడు.
దుర్యోధనుడి మాటలు విని ధృతరాష్ట్రుడు సంజయుడితో “నా కొడుకు పిచ్చి, పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఇంతేకానీ, సత్యమూ, ధర్మమూ, నీతీ, పరాక్రమమూ, సహాయమూ కలిగిన పాండవులని తను గెలవగలడా? తాను గొప్ప బలవంతుడయినా కూడా కలహం ఎప్పటికీ కీడే కాని మేలు కలిగించదు కదా!
అది అలా ఉంచి, సంజయా! నిన్ను ఒకటి అడుగుతాను చెప్పు. యుద్ధానికి పురికొలుపుతూ మా మాట ఎత్తగానే సూటి పోటి మాటలతో వాళ్ల మనసుల్ని వేడెక్కిస్తూ పాండవుల్ని ప్రోత్సహించేవాళ్లు అక్కడ ఎవరో?” అని అడిగాడు.
ధృతరాష్ట్రుడి మాటలు విని సంజయుడు “ప్రభూ! దృష్టద్యుమ్నుడు ఏదో మాటతో పాండవుల కోపాన్ని నెయ్యి పోసిన నిప్పులా రగుల్కొలుపుతాడు.
అతడు ధర్మరాజుతో ‘భీష్మద్రోణులు అనే క్రూర మృగాలతో నిండినదీ, ఏనుగుల గుంపు అనే కొండల గుట్టలతో కూడుకొన్నదీ, గుర్రాల సమూహం అనే అలలతో భయంకరమైనదీ అయిన కురుసేన అనే సముద్రానికి నేను ఒక గట్టునయి నిలుస్తాను’ అన్నాడు.
అతడు అలా అనగానే ధర్మరాజు ‘నువ్వు అన్నంతా చెయ్యగలవని ఎవరికి తెలియదు? ఎలా అయినా యుద్ధంలో మమ్మల్ని ఆదుకో’ అన్నాడు.
ఇలా పొగిడితే, దృష్టద్యుమ్నుడు నా వైపు చూసి ‘సంజయా! మీ వాళ్లకి అందరికీ తెలిసేలా చెప్పు. ఈశ్వరుడు మొదలైన దేవతలు సమకూర్చిన యుద్ధ పరికరాలు గల అర్జునుడితో జయింపబడిన గొప్పవాళ్లు ఎంతోమంది ఉండడం నీకు తెలిసిందే కదా? మనుషులు అతడికి ఏమి తక్కువ? ఇటువంటి శూరుడి వెనకాల ఉండి చూడగలవాడు కాబట్టి, మావంటి వాళ్లం పారిపోకుండా నిలబడి యుద్ధం చేస్తాం.
అప్పుడు యుద్ధం తలకి మించిన బరువై ప్రాణాంతకమవుతుంది. దానికంటే గొప్ప దయగల ధర్మరాజుని శరణు వేడి బతకండి అని చెప్పు. అంతలేసి తప్పులు చేశాం అని భయపడద్దు. ఎంతటి తప్పులు చేసినా ధర్మరాజు శాంతికి చంద్రుడు కాబట్టి శరణంటే రక్షిస్తాడు’ అని చెప్పాడు.
అది విని ధృతరాష్ట్రుడు దుర్యోధనుడితో “నీకూ నీ పరివారానికీ ఈ భూమిలో సగం చాలు, తక్కిన సగం న్యాయబద్ధంగా ధర్మరాజుకిచ్చి హాయిగా బతుకు” అని చెప్పాడు.
