Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మహాభారత కథలు-15: పరీక్షిత్తు మహారాజుని చంపిన తక్షకుడు

[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]

శృంగి శాపం వల్ల ప్రేరేపించబడ్డ తక్షకుడు పరీక్షిత్తు మహారాజు దగ్గరికి వెళ్లడానికి మార్గం కోసం అన్వేషిస్తున్నాడు. పాములు భూమ్మీద ఉన్న ప్రజల్ని కాటేసి తమ విషంతో చంపేస్తున్నాయని బాధపడ్డాడు బ్రహ్మదేవుడు. పాము కరిచిన వాళ్లని ఆ విష ప్రభావం నుంచి తప్పించి తిరిగి బ్రతికేలా చెయ్యాలనుకున్నాడు. కశ్యపమహర్షిని పిలిచి మంత్రోపదేశం చేశాడు.

తక్షకుడి విషం వల్ల పరీక్షిత్తు మహారాజు మరణిస్తాడని విన్నాడు కశ్యపమహర్షి. మహారాజుని తను బ్రతికిస్తే తన కీర్తి అన్ని వైపుల ప్రసరిస్తుంది. పరీక్షిత్తుని బ్రతికించి తన విద్యలో ఉన్న శక్తిని అందరికీ తెలియ చెయ్యాలని అనుకున్నాడు. భూమండలం మొత్తాన్ని రక్షించే ప్రభువుని కాపాడితే ఎక్కువ ధనాన్ని కూడా పొందవచ్చు. అందువల్ల తనకు కీర్తి, ధనము, పుణ్యము కూడా దక్కుతాయి అనుకున్నాడు. వెంటనే పరీక్షిత్తు మహారాజు ఉండే హస్తినాపురానికి బయలుదేరాడు. ముసలి బ్రాహ్మణ రూపంతో వెడుతున్న తక్షకుడికి అడవిలో కశ్యపమహర్షి కలిశాడు.

తక్షకుడు “మహర్షీ! ఏ పని మీద వెడుతున్నావు? ఎక్కడికి వెడుతున్నావు?” అని అడిగాడు.

కశ్యపుడు “తక్షకుడు అనే పాము ఈ రోజు పరీక్షిత్తు మహారాజుని కరుస్తుందని విన్నాను. శత్రువుల్ని తరిమేవాడు, శుభప్రదుడు, సమర్థుడు, మంచి మనస్సు కలవాడు అయిన మహారాజు విషాన్ని పోగొట్టడానికి వెడుతున్నాను” అన్నాడు.

“నేనే ఆ తక్షకుణ్ని. నువ్వు అనుకుంటున్న పని మీదే వెడుతున్నాను. నువ్వు వేసే మందులు, మంత్రాలు నా మీద పని చెయ్యవు. కావాలంటే నేను ఈ చెట్టుని కరిచి ఆ విషంతో దాన్ని కాల్చి బూడిద చేస్తాను చూడు” అని తక్షకుడు మర్రిచెట్టుని కరిచాడు. తక్షకుడి నుంచి వచ్చిన విషం వల్ల పుట్టిన అగ్నితో ఆ చెట్టు కాలిపోయింది. దాని విశాలమైన ఆకులు పొడవైన కొమ్మలు కూడా పూర్తిగా కాలి బూడిదయ్యాయి.

“ఇప్పుడు నీ మంత్రం పనిచేస్తుందో లేదో చూసుకో!” అన్నాడు తక్షకుడు. కశ్యపుడు కాలిన చెట్టు బూడిదని పోగుచేసి తన మంత్రబలంతో దాన్ని మళ్లీ ఇంతకు ముందు ఉన్నచెట్టులా చేశాడు.

అది చూసిన తక్షకుడు “మహర్షీ! నీ మంత్ర ప్రభావం వల్ల ఈ చెట్టు బ్రతికి ఉండచ్చు. కాని, బ్రాహ్మణుడు, తపస్వి అయిన శృంగి శాపం వల్ల మరణించిన పరీక్షిత్తు మాత్రం తిరిగి బ్రతకలేడు. అక్కడికి వెడితే నీకు ఎంత సొమ్ము వస్తుందో అంతకంటే ఎక్కువ సొమ్ముని నేను ఇస్తాను. ఇక్కడి నుంచి నువ్వు తిరిగి వెనక్కి వెళ్ళిపో!” అన్నాడు. కశ్యపమహర్షి తక్షకుడు చెప్పింది విని తన దివ్యదృష్టితో చూసి జరిగేదేమిటో తెలుసుకున్నాడు. పరీక్షిత్తుకి మరణం తప్పదని అర్థమయింది. తక్షకుడి దగ్గర ధనం తీసుకుని తిరిగి వెళ్లిపోయాడు. కశ్యపమహర్షిని పరీక్షిత్తు మహారాజు దగ్గరికి వెళ్లకుండా ఆపాడు తక్షకుడు.

అసలు అడవిలో కశ్యపుడు తక్షకుడు మాట్లాడుకున్నారన్న విషయం మన వరకు ఎలా తెలిసిందీ? అని మనకి కలుగుతున్న సందేహం. అది అడవి కదా.. వాళ్లు మాట్లాడుకునేప్పుడు అక్కడ ఎవరూ లేరు కదా? అని అనుకోకండి. ఎలా తెలిసిందంటే.. హస్తినాపురం నుంచి ఒక బ్రాహ్మణుడు కట్టెలకోసం అడవికి వెళ్లి అదే చెట్టు మీద కట్టెలు కొట్టుకుంటున్నాడు. అతణ్ని కశ్యపమహర్షిగాని, తక్షకుడుగాని ఇద్దరూ చూడలేదు.

తక్షకుడు ఆ చెట్టుని కరిచి తన విషంతో కాల్చి బూడిద చేసినప్పుడు చెట్టుతోపాటు ఆ బ్రాహ్మణుడు కూడా కాలి బూడిదైపోయాడు. కశ్యపమహర్షి చెట్టుని మళ్లీ బతికించినప్పుడు చెట్టుతో పాటు ఆ బ్రాహ్మణుడు కూడా మళ్లీ బతికాడు. అతడు హస్తినాపురం వెళ్లి జరిగిన విషయాన్ని నగర ప్రజలకి మొత్తం చెప్పేశాడు.

పరీక్షిత్తు మహారాజుని కాపాడాలని వెడుతున్న కశ్యప మహర్షిని అడవి నుంచే వెనక్కి పంపించేశాడు తక్షకుడు. మిగిలిన సర్పాల్ని పిలిచి వాళ్లని బ్రాహ్మణ రూపాల్లోకి మారమన్నాడు. తరువాత మంచి సువాసనలు వెదజల్లే తాజా పువ్వుల్ని, రుచిగా తియ్యగా ఉండే పండ్లని మోదుగ ఆకులతో చేసిన బుట్టలో పెట్టుకుని రమ్మన్నాడు. వాళ్లందర్నీ పరీక్షిత్తు మహారాజు ఉంటున్న ఒంటి స్తంభం మేడలోకి వెళ్లమని చెప్పాడు. తను కూడా అదృశ్య రూపంలో వాళ్లని అనుసరించాడు.

అందమైన రూపం కలిగిన పరీక్షిత్తు మహారాజు వేదాలు చదువుతూ లోపలికి వచ్చిన బ్రాహ్మణ యువకుల్ని చూశాడు. వాళ్లని దగ్గరకు రమ్మని పిలిచాడు. వాళ్లు తెచ్చిన పండ్లు, పూలు తీసుకున్నాడు. వాళ్లని తగిన విధంగా సత్కరించి పంపించాడు. మనం ఎంత చేసినా.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కాలం మాత్రం దాని పని అదే చేసుకుని పోతుంది.

అప్పటికి సాయంకాలం అవుతోంది. గొప్ప బలపరాక్రమాలు కలిగిన పరీక్షిత్తు మహారాజు తనకు ఇరువైపులా కూర్చున్న మంత్రుల్ని స్నేహితుల్ని, ఆప్తుల్ని అందర్నీ చూస్తూ “శమీక మహర్షి కుమారుడు శృంగిమహర్షి శాపం ఇచ్చి ఏడు రోజులు గడిచిపోతున్నాయి. సూర్యుడు అస్తమిస్తున్నాడు” అని చెప్తూ తన దగ్గర ఉన్న పండ్ల బుట్టల్ని చూపించి వీటిని అందరికీ పంచండి” అని చెప్పాడు.

అందరికీ పంచడం అయిపోయాక ఇంకొక బుట్ట మిగిలి పోయింది. దాంట్లోంచి ఒక పండుని చీల్చాడు. అందులో ముందు నల్లగా కనబడి, అంతలోనే ఎర్రని రంగుతో పాముగా మారి, అగ్ని జ్వాలల్లా విషాన్ని చిమ్ముతూ తక్షకుడు బయటికి వచ్చి పరీక్షిత్తు మహారాజుని కరిచి వెళ్లిపోయాడు. చుట్టూ ఉన్న పరివారం మొత్తం భయంతో అటు ఇటు పరుగులు పెడుతూ చెల్లాచెదరుగా పారిపోయారు. తక్షకుడి విషం వల్ల ఒంటిస్తంభం మేడ కూడా కాలి బూడిదయింది. ఆ విధంగా నీ తండ్రి మరణించాడు.

వేదవిదులైన బ్రాహ్మణులు, పురోహితులు శాస్త్రప్రకారం పరలోకంలో ఉత్తమ గతి కలగడానికి అవసరమైన కర్మలు చేశారు.

Exit mobile version