Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మహాభారత కథలు-150: భీష్ముడి మీద కోపంతో అస్త్రసన్యాసం చేసిన కర్ణుడు

[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]

భీష్ముడి మీద కోపంతో అస్త్రసన్యాసం చేసిన కర్ణుడు

తరువాత మళ్లీ మాట్లాడుతూ “నీకు నా బలం తోడు లేకుండా ఉండాలి. నువ్వు చచ్చేవరకు నేను యుద్ధభూమిలో అడుగుపెట్టను. అస్త్రాలు వదిలిపెట్టేశాను. ఆ తరువాత నువ్వు చనిపోయిన తరువాత విజృంభించి నా బలపరాక్రమాలు చూపిస్తాను” అని కర్ణుడు అస్త్రసన్యాసం చేశాడు.

తరువాత సభలో ఉండడం ఇష్టం లేక వెంటనే లేచి వెళ్లిపోయాడు. అప్పుడు భీష్ముడు నవ్వుతూ దుర్యోధనుడితో “కర్ణుడు అందుకు తగ్గవాడు కాడా? ఇంకెప్పుడూ ప్రతిజ్ఞ చేసి తప్పడు. ఇంతటి మహావీరుడు అలిగితే యుద్ధంలో పాండవులు ఎలా బతకగలరు?” అన్నాడు.

భీష్ముడు ఇంకా ఇలా అన్నాడు “నువ్వు అతడి మాటలు పట్టుకుని, అతడి ‘భరోసా’ చూసుకుని ధర్మరాజుతో ఎలాగూ యుద్ధం చేసి తీరుతావు. నీ అనుమానం తీరేట్లు నువ్వు నన్నూ, అతడినీ చూద్దువుగాని. మా ఇద్దరి పరాక్రమాల తారతమ్యం నీకిప్పుడు నిస్సందేహంగా బోధపడుతుంది” అనే అర్థంతో అన్నాడు భీష్ముడు.

ఇంకా చెప్తూ “నేను బాహ్లికుడూ, ద్రోణుడూ మొదలైనవాళ్లు చూస్తుండగా అనేక వేలమంది శత్రువీరుల్ని చంపుతాను. తరువాత కర్ణుడి యుద్ధనైపుణ్యం కూడా చూద్దువుగాని” అన్నాడు.

భీష్ముడి మాటలు విని కర్ణుడి పక్షపాతి, వినయం లేనివాడు అయిన దుర్యోధనుడు “తెలిసో తెలియకో అందరూ ‘పాండవులు పరాక్రమ గర్వంతో యుద్ధంలో గెలుస్తారు’ అంటున్నారు. మొదట నిన్నూ, బాహ్లికుడినీ, ద్రోణుడినీ, తక్కినవాళ్లనీ నమ్ముకుని విజృంభించి యుద్ధం చెయ్యదానికి సిద్ధపడ్డాను. నా గొప్పదైన పరాక్రమంతో నేను చేసే సహాయం మీకు సరిపోదా? కర్ణుడూ, దుశ్శాసనుడూ ఉండగా నాకు మిగిలినవాళ్లు ఎందుకు? గొప్ప వీరులతో ఉన్న శత్రుసేనల్ని మేమే గెలవగలం. ఈ సముద్ర పర్యంతము ఉన్న భూమి మా అడ్డులేని పరాక్రమం వల్ల మాకే దక్కుతుంది. ఇదీ మా నిశ్చయం. అవినీతో, నీతో చివరికి చూడు” అన్నాడు.

దుర్యోధనుడి మాటలకి దుఃఖం కలిగిన ధృతరాష్ట్రుడు కొడుకుని ఏమీ అనలేక విచారంగా విదురుడితో “అయ్యో! నా కొడుకు తనకంటే అధికుడు ఎవరూ లేక కర్ణుడితో కలిసి మృత్యుపాశాలలో చిక్కుకున్నాడు, నశిస్తున్నాడు. ఇంక మనకి చేయదగింది ఏదో చెప్పు” అన్నాడు.

ధృతరాష్ట్రుడి మాటలు విని విదురుడు “మనవాళ్లు అసలే బలహీనులు. తమలో తాము పోట్లాడుకుంటూ దుర్భాషలాడుకుంటూ ఇలా ఉండడం అది అర్జునుడికి లాభం. ఇంతే తప్ప ఏమంటాం? పాండవులు ఏకాభిప్రాయులై ఉన్నారు. పనికిమాలిన ఈ పిచ్చిమాటలు కట్టిపెట్టి పాండవుల్ని పిలిపించి న్యాయం చెయ్యడం తప్ప మనం చేయవలసింది ఇంకోటి లేదు” అని చెప్పాడు.

సంజయుడు చెప్పిన రాయబారపు మాటలు మిగిలినవి కూడా వినాలని అనుకుని ధృతరాష్ట్రుడు “సంజయా! ముందు తన మనస్సులో ఉన్నవన్నీ క్రమంగా నువ్వు వినేటట్లు చెప్పి, సముచితంగా నిన్ను పంపించేటప్పుడు అర్జునుడు తుది నిర్ణయంగా ఏమన్నాడో చెప్పు చూద్దాం” అన్నాడు.

సంజయుడు అతడితో “మహారాజా! అర్జునుడు చివరగా నిర్ణయించి, దుర్యోధనుడితో ఇక్కడున్న పెద్దలందరూ వింటూ ఉండగా చెప్పమన్న మాటలు చెప్తాను. కురువంశ శ్రేష్ఠుడైన ధర్మరాజు స్వయంగా- ‘మా తండ్రి వాటా భూమిలో సగం నా వాటా నాకు ఇవ్వాలి’ అని. అంటే ‘వినీ గర్వంతో ఇయ్యకపోయారో, ధృతరాష్ట్రుడి కుమారుల్ని వరుసగ, మాకు రాజ్యభాగం తప్పనిసరే అయ్యేటట్లు నా చంచలమైన బాణాలు అనే అగ్ని జ్వాలల్లో హోమం చేస్తాను’ అని చెప్పి కౌగలించుకుని అలంకారాలు, వస్త్రాలు మొదలైన వస్తువులు ఇచ్చాడు. నేను పాండవుల్ని, కృష్ణుణ్నీ వదిలిపెట్టి జరిగినదంతా చెప్పాలని వేగంగా వచ్చేశాను” అన్నాడు.

సంజయుడి మాటలు దుర్యోధనుడు గౌరవించక పెడచెవిని పెట్టాడు. ధృతరాష్ట్రుడు నిశ్చేష్టుడై ఉండిపోయాడు. అప్పుడు ఆ ఇద్దరి దగ్గర సంజయుడు ఒక్కడు తప్పఅక్కడ ఉన్నవాళ్లు అందరూ వెంటనే లేచి తమ తమ ఇళ్లకి వెళ్లిపోయారు. కొడుకు మాటలమీద నమ్మకంతో ఉండే ధృతరాష్ట్ర మహారాజు తన కొడుకు యుద్ధంలో పాండవుల్ని చంపగలడా? అనుకున్నాడు.

సంజయుడితో “ఈ రెండు సైన్యాల్లో ఉన్న తరతమ భావాలు నీకు తెలుసు. యుద్ధం జరిగితే ఎవరు గెలుస్తారో నిర్ణయిద్దామా? ఏ సైన్యంలో ఉపాయమూ, పౌరుషము కలవాళ్లు ఉన్నారో చూద్దాం చెప్పు” అన్నాడు.

సంజయుడు “రాజా! నన్నడిగే మాటయితే ఒంటరిగా అడగవద్దు. మీ తండ్రి వ్యాసుడు ఇక్కడికి వచ్చేటట్లు ఆయనని భక్తితో ధ్యానించు. గాంధారిని పిలిపించు. వాళ్లు మర్యాదస్థులు, ధర్మం తెలిసిన మనస్సు కలవాళ్లు. నీకు మనస్సులో అసూయవంటివి కలిగితే వాటిని పోగొట్టగల సమర్థులు” అన్నాడు.

ధృతరాష్ట్రుడి దగ్గరికి వచ్చిన కృష్ణద్వైపాయనుడు

సంజయుడు చెప్పినట్లు ధృతరాష్ట్రుడు కంచుకిని పిలిచి గాంధారిని రప్పించాడు. భక్తిపారవశ్యంతో వ్యాసభగవానుణ్ని ధ్యానించాడు. దివ్యజ్ఞాన మహానుభావుడైన వ్యాసుడు వచ్చేశాడు. అందరూ సాష్టాంగ నమస్కారాలు చేసి ఉన్నతమైన పీఠం మీద కూర్చోబెట్టారు. అర్ఘ్యం, పాద్యం మొదలైన సత్కారాలతో పూజించారు.

ధృతరాష్ట్రుడు ఏదీ చెప్పకుండానే ధృతరాష్ట్రుడి, సంజయుడి మనస్సులో ఉన్న భావాల్ని తెలుసుకున్నాడు. సంజయుణ్ని అనుగ్రహ దృష్టితో చూసి “నీకు అన్నీ తెలుసు కనుక నువ్వు ఊరుకోకూడదు. ధృతరాష్ట్రుడు అడిగిన ప్రశ్నకి సమాధానం నేను వినేటట్లు స్పష్టంగా చెప్పు” అన్నాడు.

వ్యాసుడు చెప్పినది విని సంజయుడు ‘సంతోషం!’ అని ధృతరాష్ట్రుడితో “మహారాజా! నువ్వు నన్ను పాండవుల సేనకి, కౌరవుల సేనకి తారతమ్యం అడిగావు. పాండవుల సేనలో కృష్ణుడు ఉన్నాడు. ఈ కౌరవ సేనలో అతడితో సమానుడైన వాడిని నాకు చూపించు. కృష్ణుడు ఎలాంటివాడో చెప్తాను విను.

లోకాలన్నింటీనీ తనకి అధీనాలుగా చేసుకున్న వీరుడూ; దేవేంద్రుడి పారిజాత వృక్షాన్ని అవలీలగా తీసుకుని వచ్చాడు. కృష్ణుడి పరాక్రమం అందరికీ తెలిసినదే కదా? ఎంతో కష్టమైన పనుల్ని ఒక ఆటలా అవలీలగా చేస్తాడు. అంతేకాదు, అతడు పూర్వజన్మలో అర్జునుడికి స్నేహితుడు కాబట్టి, అర్జునుడితో కలిసి చెయ్యవలసిన ఒక ప్రయోజనం కలిగి ఉంటాడు. అటువంటి కృష్ణుడి సుదర్శనం తన మాయా బలంతో పాండవుల యుద్ధోపకరణాలన్నింటిలోనూ సూక్ష్మ రూపంలో వ్యాపించి, వాళ్లకి విజయం చేకూరుస్తుంది.

కృష్ణుడి గొప్పతనం ఇంకా మనవి చేస్తాను విను. లోకాలన్నీ ఒకవైపు, కృష్ణుడు ఒక్కడూ ఒక వైపు నిలబడితే అంతా నిస్సారమై అతడి ఒక్కడి సారమూ మిక్కిలి గొప్పదవుతుంది. ధృతరాష్ట్రా! కృష్ణుడు సంకల్పించగానే లోకాల సృష్టి, స్థితి లయలను చెయ్యగల సమర్థుడు. సత్యం ఎక్కడ ప్రకాశిస్తుందో, ధర్మం ఎక్కడ నడుస్తుందో, న్యాయం ఎక్కడ ఉంటుందో అక్కడ కృష్ణుడు ఉంటాడు. అతడున్న చోటే జయం కలుగుతుంది. కృష్ణుడు సకల లోక స్వరూపుడు. అన్ని జీవరాసుల్లోను ఉండి పనులు సాగిస్తుంటాడు.

మాయని అవలంబించి ఈ లోకాల్లో ఒక్కొక్కసారి పుట్టి, పెరిగి తన జన్మలకి అనుగుణమైన కర్మల్ని స్వీకరించి ప్రవర్తిస్తాడు. శిష్టుల్ని రక్షించడమూ, దుష్టుల్ని శిక్షించడమూ అతడి పనులు కావడం వల్ల పాండవుల నెపంతో అధర్మపరులైన నీ కొడుకుల్ని ఆ మహాత్ముడు శిక్షించాలనుకున్నాడు. ఇది జరిగే తీరుతుంది. ఇటువంటి మహనీయుడిని తెలుసుకుని అతణ్ని ఎవరు ఆశ్రయిస్తారో వాళ్లు బతుకుతారు” అని చెప్పాడు.

సంజయుడు చెప్పినది విని ధృతరాష్టుడు “ఇప్పుడు విష్ణువుని నేను తెలుసుకోలేక పోవడానికి, నువ్వు తెలుసుకోగలగడానికి కారణం ఏమిటో స్పష్టంగా చెప్పు” అన్నాడు.

సంజయుడు “ధృతరాష్ట్ర మహారాజా! విద్య అనీ, అవిద్య అనీ రెండు ఉన్నాయి. అవిద్య వల్ల చెడిపోయి, తమోగుణంతో ఆక్రమించబడినవాడు విష్ణువుని తెలుసుకోలేడు. విద్యాసంపన్నుడు విష్ణువుని తెలిసికోగలడు” అన్నాడు.

సంజయుడు చెప్పింది విని ధృతరాష్ట్రుడు “సంజయా! విద్య అంటే ఏమిటి? ఆ సర్వేశ్వరుణ్ని నువ్వు ఎలా తెలుసుకోగలిగావో చెప్పు. అవిద్య అంటే ఏమిటో చెప్పు” అని అడిగాడు.

సంజయుడు “మహారాజా! సత్వ, రజ స్తమోగుణాల వికారాలకి లోనుకాకుండా ధర్మం ఆచరిస్తూ, అంతశ్శుద్ధి కలిగి ఉంటాను. అందువల్లే నేను విష్ణువుని తెలుసుకోగలిగాను. ఇదే విద్య. నీకైనా, మరెవరికైనా విష్ణువుని తెలుసుకోగలిగే మార్గం ఇదే. ఇటువంటిది కానిది అవిద్య” అని చెప్పాడు.

ధృతరాష్ట్రుడు తన కొడుకుతో ఇలా అన్నాడు. “సంజయుడు మన మేలు కోరేవాడురా. ఇతడు చెప్పినట్లుగా ధర్మంతో కృష్ణుణ్ని ఆశ్రయించు నాయనా! అతణి శరణు వేడితే నువ్వు నీ తమ్ముళ్లతోను, కొడుకులతోను బతుకుతావు” అన్నాడు.

ధృతరాష్ట్రుడు చెప్పినదానికి దుర్యోధనుడు తన తండ్రితో “తండ్రీ! నేను చెప్పేది విను. ఈ లోకాలనన్నింటినీ ఒక్కసారిగా మింగినా, నిజంగానే అన్నింటినీ రక్షించినా, కృష్ణుడు అర్జునుడి చెలికాడని చెవులారా వింటూ, అతడిని ఒక కష్టం వచ్చింది కదా అని ధైర్యం నశించి ఇప్పుడు ఆశ్రయించమంటవా?” అన్నాడు.

దుర్యోధనుడు అలా అనగానే ధృతరాష్ట్రుడు గాంధారితో ఇలా అన్నాడు “గాంధారీ! నీ కొడుకు దురభిమాని, నీతిమాలినవాడు, గర్వంతో విర్రవీగుతున్నాడు. ఈర్ష్య విడిచిపెట్టి, నేను చెప్పింది వినడు. వీడు చెడిపోతాడే తప్ప బతకలేడు” అన్నాడు.

ధృతరాష్ట్రుడు అన్నది విని గాంధారి కొడుకుతో “నాయనా! దుర్యోధనా! నువ్వు ఆయుష్షునీ, సంపదల్నీ, వైభవాలనీ, మమ్మల్నీ, మిత్రులందర్నీ వదులుకోవాలని అనుకుంటావెందుకురా? ఇటువంటి అవినీతులు కూడా ఉన్నారా? దైవం భీముడి రూపంలో నిన్ను చంపబోతుంటే ఇంక ఎవరు ఆపగలరు?” అని చెప్పింది.

మాట్లాడిన మాటలు విని వ్యాసుడు ధృతరాష్ట్రుడితో “కృష్ణుడంటే నీకు ఇష్టం. నీకు కావలసిన వాడైన సంజయుణ్ని అతడి దగ్గరికి పంపించావు. అది మంచి పనే అయింది. సంజయుడు కూడా ఆ మహాత్ముడి గురించి సర్వం తెలిసినవాడు. సంజయుడి మాట విని శ్రీకృష్ణుణ్ని ఆశ్రయించు. అతడు ఏకాగ్ర చిత్తంతో ఆరాధించేవాళ్లకి దగ్గరవుతాడు. కామ క్రోధాలతో నిందించబడుతూ తమ సంపదలతో తృప్తి పొందక అన్యాయ మార్గంలో ప్రవర్తించేవాళ్లకి దూరమవుతాడు. అతణ్ని ఆశ్రయించి జీవించు” అన్నాడు.

వ్యాసుడు చెప్పినది విని ధృతరాష్ట్రుడు అలాగే చేస్తానని చెప్పాడు. సంజయుడితో “వాసుదేవుడనే పేరుకి అర్థం ఏమిటో నాకు వివరంగా చెప్పు. అతన్ని పొందే ఉపాయం కూడా నాకు ఉపదేశిస్తావా?” అని అడిగాడు.

సంజయుడు “ధృతరాష్ట్ర మహారాజా! ‘వాసుదేవుడు’ అనే పేరుకి అర్థం అన్నీటిలోనూ తాను ఉండడమూ; ప్రతిదీ తనయందే ఉండడమూ అని చెప్తారు పెద్దలు. ఇది స్పష్టం. ఈ విషయం తెలిసినవాళ్లకి తప్పకుండా శుభం కలుగుతుంది.

మనోనిగ్రహమే వాసుదేవుణ్ని పొందడానికి ఉపాయమని ఆర్యులు సెలవిచ్చారు. ఓర్పు వహించి, మనోవికారాల్ని పోగొట్టి ఏకాగ్రతతో సేవిస్తే వాసుదేవుడు ప్రసన్నుడవుతాడు. నువ్వుకూడ అనేకమైన ఇతర చింతల్ని వదిలిపెట్టి కృష్ణుణ్ని ఆశ్రయించు” అన్నాడు.

సంజయుడు చెప్పినదాన్ని విని ధృతరాష్ట్రుడు “నాకు నేత్రేంద్రియ సౌకర్యం లేదు కనుక అంత విచారం లేదు. అందరికంటే మనోహరుడైన కృష్ణుణ్ని చూడలేకపోతున్నానే అని బాధపడుతూ ఉంటాను. ఆ కృష్ణుణ్ని కళ్లారా రేయింబవళ్లు చూస్తూ ఉండేవాళ్లు ఎటువంటి తపస్సు చేశారో? ఆశ్రిత వత్సలుడూ, పాపాల్ని ఎగురగొట్టేవాడూ, ధర్మపరుడూ, దయామయుడూ, సర్వలోక ప్రసిద్ధుడూ, పావనాకారుడూ, శరణాగతరక్షకుడూ అయిన కృష్ణుణ్ని ఆశ్రయిస్తాను” అని ఎంతో ప్రశాంతంగా ఉన్నాడు.

తరువాత వ్యాసుడితో “దేవా! నేను వాసుదేవుణ్ని శరణు కోరి బతుకుతాను” అంటూ నమస్కరించాడు.

వ్యాసభగవానుడు అక్కడి నుంచి అదృశ్యమయ్యాడు. ధృతరాష్ట్రుడు, దుర్యోధనుణ్ని, సంజయుణ్ని వాళ్ల నివాసాలకి పంపించాడు. తను గాంధారితో కలిసి అంతఃపురానికి వెళ్లి తన పనుల్లో లీనమయ్యాడు” అని చెప్పాడు వైశంపాయనుడు.

జనమేజయ మహారాజు వైశంపాయన మహర్షి చెప్పింది విని “తరువాత జరిగిన విశేషాలు ఏమిటి?” అని అడిగాడు.

ఉద్యోగపర్వంలోని రెండవ ఆశ్వాసం సమాప్తం

Exit mobile version