Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మహాభారత కథలు-151: శ్రీకృష్ణుడి రాయబారము

[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]

ఉద్యోగపర్వము -మూడవ ఆశ్వాసము

శ్రీకృష్ణుడి రాయబారము

థకుడైన వైశంపాయన మహర్షి శ్రోత అయిన జనమేజయ మహారాజుతో ఇలా అన్నాడు.

ఉపప్లావ్య పట్టణంలో ఉన్న తనని వదిలి సంజయుడు హస్తినాపురానికి వెళ్లిన తరువాత ధర్మనందనుడు మరుసటి రోజు తన తమ్ముళ్లనీ, కొడుకుల్నీ, సామంతరాజుల్నీ దగ్గరికి పిలిపించుకుని వాళ్లంతా వింటుండగా “మనమంతా కలిసి మాధవుడి దగ్గరికి వెళ్లి కౌరవసభలో మన విషయాలన్నీ చర్చించవలసిందిగా ఆయనని వేడుకుందాము. అలా చెయ్యడం వల్ల మనకి ఎంతో మేలు కలుగుతుంది. ఎందుకంటే చుట్టాలతో, హితులతో, గురువులతో మనకి పోరు తప్పుతుంది. ఆనందం కలుగుతుంది” అన్నాడు.

అలా చెప్పిన ధర్మరాజు తనవారంతా వెనువెంట రాగా శ్రీకృష్ణుడున్న చోటికి వెళ్లాడు. అక్కడ ఆయన ఆదరణలు అందుకున్నాడు. పరివారమంతా తనను సేవిస్తుండగా, తగిన పరిజనంతో ద్రౌపది ఒక ప్రక్కనుండగా ధర్మరాజు కృష్ణుడితోపాటు హాయిగా కూర్చున్నాడు.

తరువాత ఇలా అన్నాడు “మహనుభావా! కష్టాలను తొలగించడానికీ, శుభాలని సమకూర్చడానికీ సమర్థుడవైన నిన్ను ఈ జన్మకి మాకు దిక్కుగా చూపించి, మా తండ్రి పాండుమహారాజు వెళ్లిపోయాడు. కృష్ణా! మిత్రులమైన మా పనిని చక్కబెట్టడానికి నీ కిది తగిన సమయం. నువ్వు రాయబారిగా వెడితే అయోగ్యుడైన ఆ దుర్యోధనుడితో మేము యుద్ధం చేయవలసిన అవసరం రాదు. మాకు వచ్చే రాజ్యాన్ని మేము అనుభవించగలం.

కృష్ణా! ప్రద్యుమ్నుడు మొదలైన నీ కుమారులు నీకు ఎలాంటివాళ్లో మేము కూడా అలాంటి వాళ్లమే. మాకు పాపాలు తగలకుండా ఉండేలా ఆలోచించి మమ్మల్ని కాపాడు” అన్నాడు.

అప్పుడు శ్రీకృష్ణుడు ధర్మనందనుడితో “నువ్వు ఏం చెయ్యమని చెప్తావో అలాగే చేస్తాను. నీ అభిప్రాయమేమిటో చెప్పు” అన్నాడు.

అప్పుడు ధర్మరాజు కృష్ణుడితో “నువ్వు హస్తినాపురం వెళ్లి కౌరవులతో తగినట్లుగా మాట్లాడి ఒకదారి ఏర్పరచాలి” అని అర్థించాడు. అందుకు శ్రీకృష్ణుడ్ని అంగీకరించేలా చేశాడు.

తరువాత కృష్ణుడితో మళ్లీ “దేవా! నిన్న సంజయుడు మాట్లాడిన మాటలవల్ల, మా తండ్రి ధృతరాష్ట్రుడి ఉద్దేశమేమిటో అతడి కుమారుడైన దుర్యోధనుడి తీరు ఎటువంటిదో నీకు తెలిసింది కదా! ఆ తండ్రీ కొడుకుల భావాలేమిటో సంజయుడికి తెలుసు. మా రాజ్యభాగం మాకియ్యకుండా, మాకు కోపం రాకుండా, కల్లబొల్లి మాటలతో బుజ్జగిస్తున్నారు. చెప్పిన ప్రకారం మేము ఏమాత్రం చేయ శక్యంగాని అరణ్యాజ్ఞాతవాసాలు పదమూడేళ్లు చేసి వచ్చాక ధృతరాష్ట్రుడు వంశధర్మం పాటించుకున్నాడు.

చెడిపోవాలనుకునే అతడు కొడుకు దారిని అనుసరిస్తున్నాడు. అతడికి కొడుకుపట్ల వల్లమాలిన దురభిమానం కాబట్టే సుయోధనుడి కుటిలత్వం మానిపించలేక పోతున్నాడు. ఇంతకంటే మాకు ఇంక ఏం విపత్తు ఉంటుంది? మా తల్లీ, చుట్టుపక్కాలూ సంతోషించేట్లూ, దుర్యోధనుడు మొదలైన వాళ్లందరూ యుద్ధం మాట ఎత్తకుండా శాంతించేటట్లూ, కౌరవులూ మేమూ కలిసి మెలిసి ఒద్దికగా జీవించేటట్లూ మార్గం తెలియక ఇలా బతకడం మాకు పౌరుషం అనిపించుకోదు.

కృష్ణా! ఇక్కడున్న చుట్టాలూ, నువ్వు ఆశ్చర్యపడి వింటూ ఉండగా సక్రమంగా మాకు అర్ధరాజ్యం పంచి ఇవ్వడానికి మా తండ్రికి మనసొప్పకపోతే ఇంద్రప్రస్థం, కుశస్థలం, వృకస్థలం, వాసంతి, వారణావతం చాలు. అందుకూ అతడు ఇష్టపడకపోతే ఎక్కడైనా మేము తలదాచుకోడానికి అయిదు ఊళ్లు ఇచ్చినా చాలు! అని చెప్పాను. తరువాత సంజయుడితో ఇంతవరకూ నే చెప్పిన మాటలలో కపటం లేదు. అంత యథార్థం సుమా!

ఆ దుర్యోధనుడు చివరికి నేను అడిగిన అయిదు ఊళ్లైనా ఇస్తాడో ఇవ్వడో తెలియదు. కాని, గౌరవం పోయేలా క్రూరమైన పనులు చెయ్యడానికి నా మనసు ఒప్పుకోదు. పోనీ, రాజ్య సంపద నాకెందుకని వారిని అడగడం మానేస్తే నన్నే ఆశ్రయించుకుని ఉన్న నా బంధు జనులకి కూటికీ గుడ్డకీ కరువు ఏర్పడుతుంది. కనుక కౌరవులూ, మేమూ ఒద్దికగా ఉండి రాజ్యసంపద పంచుకుంటే ఉభయులకీ సంతోషం కలుగుతుంది.

అయ్యో! వాళ్లు ఇతరులే అవచ్చు! విరోధులే అవచ్చు! వాళ్లని చంపాలనే ఎందుకు అనుకోవాలి? పోరాటంకంటే మరో మంచిదారి లేదా? ఆ మార్గం మంచిది కాదా? కౌరవుల పక్షంలో మా చుట్టాలూ, మిత్రులూ ఉన్నారు. వాళ్లని లక్ష్యపెట్టకుండా రాజ్యసంపద కోసం సంహరిస్తే నిందలపాలు కాక తప్పదు. పాపాలు మూటకట్టుకోక తప్పదు. ఇలా ఇహపరాలు రెండింటికీ దూరం చేసే దుర్దశని నేను భరించలేను” అని కొంచెం సేపు ఆగాడు ధర్మరాజు.

మళ్లీ చెప్తూ “ఔరా! క్షత్రియ ధర్మపాలనం ఎంతో కష్టంతో కూడుకున్నది. అంత ధర్మాచరణం రాజులకి తగదని పెద్దలంటారు. కనుక, ఆయుధాల్ని చేతబట్టి బతకడమే వాళ్లకి యోగ్యమైన పని. కాని, రాజ్యం కోసం కులనిర్మూలనం చెయ్యడం నాకు అంగీకారం కాదు. అంతేకాదు, యుద్ధం జరిగితే సంపదలు సంప్రాప్తిస్తాయి. సందేహం లేకుండా ప్రాణహాని కూడా కలుగుతుంది. అనేకమంది ఒకడి చేతిలో ఓడిపోయి పరుగెత్తుకుని వెళ్లిపోవడం, బలవంతులు బలహీనుడి చేతిలో నాశనమవడం కూడ జరుగుతుంది.

కృష్ణా! యుద్ధంలో మనమే గెలుస్తాం అనిగానీ, ఓడిపోతాం అనిగానీ చెప్పడనికి వీలు లేదు. సంగ్రామంలో అపజయమే గలిగితే అది మరణించడం కంటే గుండెని బద్దలు చేసి, భరించలేని వేదనని కలిగిస్తుంది. ఇది నిజం. యుద్ధం అన్ని అనర్థాలకీ మూలమవడం వల్ల యుద్ధం చెయ్యకుండానే ఉపాయంతో విరోధుల్ని అణిచివెయ్యగలననే ధైర్యంతో ఎవడు ప్రవర్తిస్తాడో వాళ్లు గుండెమీద చెయ్యి వేసుకుని నిద్రపోతాడు. శత్రుత్వమే ఏర్పడితే పామున్న ఇంటిలో కాపురమున్నట్లే ఉంటుందికాని, ఒక్కసారైనా మనసు నెమ్మదిగా ఉండదు. కనుక, ఎవరితోనూ ఎక్కువకాలం విరోధంతో నడుచుకోకూడదు.

విరోధాన్ని అణిచివేయడం ఎంతో మంచిది. అదే మంచిపని. విరోధం వల్ల విరోధం సమసిపోదు. ఒకడు శత్రుత్వం వహించి మరొకరికి బాధ కలిగిస్తే, బాధపెట్టిన వాడితో తలపడక ఊరుకుని ఉండడం శక్యం కాదు. పరమ సాహసంతో చివరివరకూ పగని నిర్మూలించాలని అనుకుంటే దారుణమైన పనులు చేయాల్సి ఉంటుంది. కనుక, ఎన్ని విధాల ఆలోచించినా పగవల్ల కీడేగాని ప్రయోజనం ఉండదు. కృష్ణా! ఇది నిజం. వైరం వల్ల ప్రయోజనం లేదు, కలత పడకుండా నెమ్మదిగ ఉండడమే తగిన పని.

కృష్ణా! ఆ విషయం అలా ఉండనీ, నేను సంపద కావాలనీ, యుద్ధం జరగకూడదనీ అనుకుంటున్నాను. యుద్ధం వల్ల ధననష్టం, వంశనాశనం జరుగుతుంది. ఈ రెండూ జరగని ఉపాయంతో బాగుపడడం ఎంతైనా మంచిది కదా? కృష్ణా! మా విషయంలో పక్షపాతం చూపించకూడదు. ధర్మం, నీతి అనుసరించి ఇరుపక్షాలకీ మంచి, అభివృద్ధి సమకూరే విధంగా, విదురుడు మొదలైన మంచి మనసులకి అంగీకారమయ్యేట్లుగా కొంత మృదువుగాను, కఠినమైన మందలింపులతోను కురుసభలో ఉన్నవాళ్లు అందరూ అర్థం చేసుకునేటట్లు మాట్లాడు.

న్యాయం మర్చిపోయి దుర్యోధనుడు ఏవైనా పరుషంగా మాట్లాడితే ఓర్పు వహించు. తొందరపాటుతో సభని విడిచి రావద్దు. పెద్దరికం, రాచరికం గల పెద్దల మాట సుయోధనుడు వినలేదనే నింద వాడి తలమీదే వెయ్యి. మనం గౌరవంగా కురువృద్ధులైన భీష్ముడు మొదలైనవాళ్ల మాటనీ, ఉద్దేశాన్నీ సాగనిస్తే లోకులు మనల్ని మెచ్చుకుంటారు. ఆ ధృతరాష్ట్ర మహారాజు కుమారుడి పక్షం వహించి వినయం వదిలిపెట్టి ఏ అభిప్రాయం వెల్లడించక అవినీతితో నడుచుకుంటే ఇంక ఏ మాత్రం సంధికి వీలుపడదని వెంటనే సాహసానికి పూనుకోవద్దు.

సాహసం చేయవలసి వస్తే ప్రజలందరూ పొగిడేటట్లు ధర్మ మార్గంలో ప్రకాశించి మా మనసు బాధపడకుండా ఉండేట్లు చెయ్యి. కృష్ణా! ఇన్ని సమస్యలతో ఈ విధంగా నా మనసు వికలమై వేదన పడుతోంది. నా మనస్సులో ఉన్న బాధని పోగొట్టడానికి తగిన వైద్యుడివి నువ్వు కాకుండా ఇంక ఎవరున్నారు? నువ్వు నన్ను ఏ మార్గంలో నడిపించాలని అనుకుంటున్నావో అదే నాకు అంగీకారం” అన్నాడు.

మళ్లీ మనస్సులో ఏదో భావన కలిగి “కృష్ణా! నువ్వు దుర్యోధనుడి దగ్గరికి వెళ్లడం మంచిది కాదేమో అని కూడా నామనస్సుకి అనిపిస్తోంది. అతడూ, అతడి మంత్రులూ పొగరుబోతులు. వాళ్లు నువ్వు సంధి చెయ్యడానికి చెప్పిన మాటలు వినరు. దుర్యోధనుడు మొదలైన వాళ్లు వక్ర బుద్ధి కలవాళ్లు. వినయంలేనివాళ్లు, దారుణకృత్యాలకి పాల్పడుతారు. అటువంటి తుచ్ఛుల దగ్గరికి నిన్ను పంపలేను.నిన్ను చిక్కులపాలు చేస్తే ఇంద్రపదవి వస్తుందన్నా నేను దాన్ని కోరుకోను. కనుక, నువ్వు కౌరవుల దగ్గరికి ఒంటరిగా వెళ్లడం మానెయ్యి” అన్నాడు.

ధర్మరాజు మాటలు విని శ్రీకృష్ణుడు “ధర్మరాజా! దుర్యోధనుడు ఒక్కడే కాదు, అతడి తండ్రి ధృతరాష్ట్రుడు కూడా నువ్వు చెప్పినట్టే ఉంటాడు. నీ మాట నిజం. నీ ఉద్దేశమేమిటో నేను గ్రహించాను. నువ్వు మనస్సులో ఎటువంటి సందేహం పెట్టుకోకు. నా మాటలు వినాలనిపిస్తే విను. నేను నిజంగా ఆగ్రహిస్తే అక్కడ యుద్ధంలో నన్ను గెలవగలిగినవాడు ఒక్కడైనా ఉన్నాడా? నన్ను కౌరవ సభకి పంపించు. నేను అక్కడికి వెళ్లడం ఎంతైనా అవసరం. మన పని నెరవేరుతుంది. లేదా మనకి పాపం కలిగించని మాటలు మాట్లాడడానికైనా వీలవుతుంది” అన్నాడు.

శ్రీకృష్ణుడి మాటలకి ధర్మనందనుడు “కృష్ణా! మంచిది. కురుసభకి వెళ్లడం నీకు యుక్తమని తోస్తే వెళ్లి మేమూ, వాళ్లూ కలిసి మెలిసి ఉండేటట్లుగా సంధి కుదుర్చుకొనడమే మనకి మంచిది. కృష్ణా! కౌరవులూ, పాండవులూ ఎటువంటివాళ్లో నీకు తెలుసు. కూర్మి అంటే ఏమిటో నువ్వు ఎరుగుదువు. కార్యాన్ని సాధించే విధానం నీకు తెలుసు. మాట్లాడే విధానం నీకు తెలుసు. నీకు ఉపాయాలు చెప్పడానికి నేనెంతటివాడిని? హస్తినాపురానికి వెళ్లిరా!” అన్నాడు.

ధర్మరాజుతో కౌరవుల దుర్ణయము చెప్పిన శ్రీకృష్ణుడు

ధర్మనందనుడి మాటలు విని శ్రీకృష్ణుడు “పాండురాజపుత్రా! సంజయుడు చెప్పిన మాటలూ, నువ్వు చెప్పిన మాటలూ విన్నాను. నువ్వు ధర్మమార్గంలో ఆలోచిస్తావు. కౌరవులు పగ మానరు. భీష్మ ద్రోణులు తమ పక్షంలో ఉన్నారని శూరులుగా భావిస్తున్నారు. రాజులకి అణిగిమణిగి యాచించి భుజించడం మంచి పద్ధతి కాదు. కష్టపడకుండా దొరికిన రాజ్యాన్ని రుచి మరిగిన కౌరవులు పుడమిలో పాలు పంచి నీకెందుకు ఇస్తారో నువ్వే చెప్పు.

దుర్యోధనుడు మొదలైన వాళ్లందరూ అధర్మం చెయ్యడానికి ఎన్నడూ జంకరు. నువ్వు అధైర్యం వదిలిపెట్టు. యుద్ధం చెయ్యి. శత్రువుల్ని జయించడం వల్ల ఇహపరసుఖాలు సమకూరుతాయి. శాశ్వత కీర్తి లభిస్తుంది. గురుడు, భీష్ముడు మొదలైన పెద్దలు చూస్తుండగా సభలో తుచ్ఛులైన కౌరవులు మీకు ఆనాడు అపకారం చేశారు. అంత అపకారం చేసిన తరువాత కూడా వాళ్లు చేసిన తప్పుకి ఎప్పుడూ పశ్చాత్తాపం చూపించలేదు. అటువంటివాళ్ల విషయంలో దయ, బంధుభావం విడిచిపెట్టు. ఆ దుర్మార్గుల పొగరు, క్రూరత్వం చూస్తే ఎవరైనా వాళ్లమీద కోపపడకుండా ఉంటారా?

ధర్మరాజా! కపట జూదంలో మిమ్మల్ని ఓడించి అడవులకి పంపేటప్పుడు దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని కర్ణుడు సంకోచం లేకుండా పకపక నవ్వుతూ మాట్లాడిన మాటలు నోటితో తిరిగి చెప్పకూడనివి. ఆ మాటలన్నీ విని ప్రజలందరూ ధృతరాష్ట్రుణ్ని దూషిస్తూ మీరు బలవంతులై ఉండి కూడా సత్యవంతులై అడవులకి వెళ్లడం చూసి ఆశ్చర్యపడుతూ దుఃఖించారు. నిందలపాలైనవాళ్లు దైవంతో ముందుగానే ధార్మికంగానూ, నైతికంగానూ చంపబడతారు.

అటువంటి వాళ్లని భౌతికంగా చంపడం చాలా తేలిక. దుర్మార్గులైన కౌరవులు అందరికీ చంపతగినవాళ్లే. అటువంటి వాళ్లు నీకు మాత్రం చంపకూడని వాళ్లు ఎందుకయ్యారు? హింసా స్వభావం కలిగిన పాముల్ని ఎలా ఆలోచించకుండా చంపేస్తారో అలాగే పాపపు బుద్ధి కలిగిన కౌరవుల్ని చంపడమే చేయదగిన పని.

ధర్మజా! నీ తండ్రి ధృతరాష్ట్రుడికీ, తాత భీష్ముడికీ, హృదయానందం కలిగేట్లు భక్తి చూపించడమే నీకు ఉచితం. నేను కురుసభకి వెళ్లి నీ వినయ గుణాన్ని అందరికీ తేటపడేట్లు లెస్సగా చక్కగా వర్ణిస్తాను. మిత్రులూ, బంధువులూ, నానా దేశాల రాజులూ వింటుండగా నీ పవిత్రమైన నడవడికనీ, నువ్వు ధర్మ మార్గం అవలంబించే తీరుని కౌరవ సభలో అందరికీ తెలిసేలా మాట్లాడుతాను.

నేను సభలో మాట్లాడిన మాటలకి దుర్యోధనుడు అంగీకరించక న్యాయం వదిలి మాట్లాడడం, ధృతరాష్ట్రుడు అతడి మాటల్ని తిరస్కరించకుండా ఉదాసీనతతో ఉండడం చూసి మీరు ఇంతకు ముందు పడిన కష్టాల్ని స్మరించి, సభలోవాళ్లు అందరూ ఆ కౌరవులనే ఛీ కొడతారు. ఇంతకు మించి మనకి కావలసినది ఏముంది? నా శక్తి కొలదీ అనేక విధాలుగా సంధికే ప్రయత్నిస్తాను. సంధి కుదిరితే మంచిదే. ఒకవేళ సంధి కుదరకపోతే ఆ కౌరవుల ప్రయత్నాల తీరూ, అక్కడ యుద్ధం చెయ్యగలవాళ్ల ప్రవర్తనలూ, వాళ్ల సామర్థ్యాలూ తెలుసుకుని నీకు విజయం కలిగే విధంగా తిరిగి వస్తాను

ఆ దుర్యోధనుడి ముక్కులో ఊపిరి ఉన్నంతకాలం నీకు రాజ్యభాగం ఇవ్వడు. యుద్ధం తప్పదు. యుద్ధం జరగుతుందని తెలియచేసే శకునాలు ఎన్నో నేను చూశాను. నీ యుద్ధ ప్రయత్నాలు మానవద్దు. ధర్మజా! రథాలు, ఏనుగులు, గుర్రాలు, కాలిబంటులు అనే నాలుగు రకాల సేనల్ని సంసిద్ధం చేసుకో. రాజుల్ని యుద్ధానికి ప్రేరేపిస్తూ ఆలస్యం చెయ్యకుండా యుద్ధానికి ప్రయత్నాలు చేస్తూ ఉండాలి” అన్నాడు.

శ్రీకృష్ణుడు మాటలు విని భీమసేనుడు “లక్ష్మీవల్లభా! యుద్ధం జరుగుతుందని చెప్తూ మమ్మల్ని భయపెట్టవద్దు. ఆ చెడు బుద్ధి కలిగిన ధృతరాష్ట్రుడి కొడుకైన దుర్యోధనుడు అణిగిమణిగి ఉండే పని మంచితనంతో సాధించు.

మాధవా! కుత్సితుడైన ఆ దుర్యోధనుడు పాపాత్ముడు. మదమెక్కి కన్ను మిన్ను కనిపించకుండా ఉన్నాడు. అతడి మాటకి ఒక్కళ్లు కూడ అడ్డు చెప్పలేరు. అహంకారమూ, గర్వమూ, కోపమూ, తనని పట్టుకుని ఆడిస్తుంటే ఆప్తుల్ని కూడా అతడు దుఃఖపెడుతున్నాడు. అతడేమైతే తమకెందుకులే అని అందరూ ఊరుకుంటున్నారు. అందువల్ల ఆ దుర్యోధనుడు నిన్ను కూడా చింతలపాలు చేస్తాడేమో తెలుసుకో!

నేను వెళ్లిన చోటకి తను కూడా వచ్చి నన్ను చంపాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. భుజబలంతో నన్ను లక్ష్యపెట్టడు. అతడు వట్టి తుచ్ఛుడు. ప్రభువైన ధర్మజుడు కురువంశం నాశనమవడానికి అంగీకరించక పోవడం వల్ల ఆ దుర్యోధనుడితో కపటం లేకుండా కలిసి మెలిసి జీవించాలని లేకపోయినా తప్పుకోడానికి వీలు లేకుండా ఉంది.

పాండవులూ, కౌరవులూ పాలూ నీళ్లులా కలిసి మెలిసి జీవిస్తుండగా దుర్యోధనుడు తన దుండగపు పనులతో ఒద్దిక లేకుండా పాడు చేశాడు. దుర్యోధనుడే కురువంశ వినాశనానికి కారణమని పెద్దలు చెప్తారు. ఆ మాట ఎప్పటికీ తప్పదు. అయినా కూడా నువ్వు శక్తి ఉన్నంత వరకూ చాకచక్యంతో అతణ్ని దారిలో పెట్టడానికి ప్రయత్నించు. దుర్యోధనుడు తాను చచ్చేవరకు క్రౌర్యాన్నీ, మోసాన్నీ విడిచిపెట్టడు. కీర్తితో ప్రకాశిస్తున్న భరతవంశం అపకీర్తి పాలవుతుందేమో అనే ఆలోచనే ఆ దుష్టుడైన దుర్యోధనుడికి రానే రాదు.

దుర్యోధనుడి ఆలోచనని అనుసరించి నీచత్వానికి దిగజారి అయినా మనం సంధి చేసుకుంటే అదెంతో బాగుంటుంది. కృష్ణా! మాకూ, కౌరవులకీ తాత అయిన భీష్ముడు వింటుండగా ధృతరాష్ట్ర మహారాజు కొలువులో నా మాటలుగా సుయోధనుడితో చెప్పు. ‘మనం అన్నదమ్ములమై ఉండి కూడా లోకులందరూ మనల్ని చూసి పరిహసించేలా ఒకళ్లతో ఒకళ్లు పోట్లాడుకోవడం మంచిది కాదు. హస్తినాపుర సామ్రాజ్యాన్ని పెద్దల మాట ప్రకారం పంచుకుని హాయిగా అనుభవించడం ఎంతో మంచిది కదా!’ అని చెప్పు.

పద్మనాభా! కౌరవ సభలో నా మాటలు చెప్పి ఎలాగయినా సంధి కుదిరేటట్లు ప్రయత్నించు. వాళ్లూ మేమూ కలిసి మెలిసి ఉండడం ప్రజలకి ఎంతో మంచిని, సుఖాన్ని కలగచేస్తుంది.”

భీమసేనుడి మాటలకి పద్మనాభుడు చిరునవ్వు నవ్వి “ఇంతకు ముందు ఎప్పుడూ వినని మాటలు భీముడి నోటి నుంచి ఇప్పుడు వింటున్నాను. ఇంక చెప్పవలసింది ఏముంది? ఇలా వృకోదరుడు మెత్తబడడం చూస్తుంటే అగ్ని చల్లబడినట్లు, గొప్ప పర్వతం తేలికయినట్లు ఉంది” అన్నాడు.

Exit mobile version