[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]
కౌరవులతో యుద్ధానికి భీమసేనుణ్ని ప్రేరేపించిన శ్రీకృష్ణుడు
శ్రీకృష్ణుడు భీముణ్ని చూస్తూ ‘ఈ భీముడు తన తోబుట్టువులు యుద్ధంలో కష్టపడడానికి సహించలేక, కౌరవుల్ని చంపడానికి ఇష్టపడక, అందరితో ఉన్న స్నేహబంధానికి పొంగిపోయి కరిగిపోయాడు. ఇతణ్ని యుద్ధానికి రెచ్చగొట్టాలి’ అని మనసులో అనుకున్నాడు.
భీముడితో మాట్లాడుతూ “భయమంటే ఏమిటో తెలియని నీ వంటి ధ్యైర్యవంతుడికి ఈ పిరికితనం ఇంత బాగా అలవాటయ్యేలా చేసిన వాళ్లు ఎవరో?” అని పకపకా నవ్వాడు.
శౌరి మాటలకి భీముడు చిరునవ్వుతో వాసుదేవుడితో “కృష్ణా! పౌరుష వచనాలు నా దగ్గర మాట్లాడవద్దు. మన తండ్రి రాజ్య భాగమే మనకి చాలు అని ప్రభువయిన ధర్మరాజు పలికిన మాటలకి మేము బదులు చెప్పలేమని నీకు తెలుసు. జరగబోయే సంగ్రామంలో దుర్యోధనుడు పడే పాట్లు చూపించి ఆనాడు కౌరవసభకి వెళ్లేటప్పుడు ఉపప్లావ్యపురంలో నన్నేమన్నావో గుర్తు తెచ్చుకోమని యుద్ధంలో నిన్ను హెచ్చరించకపోనులే.
బావా! నా శక్తి సామర్థ్యాలు ఏపాటివో ఆలోచించకుండా నువ్వు మాట్లాడడం న్యాయం కాదు. నేలా, నింగీ ఇప్పటిలా కాకుండా తలకిందులైనా కూడా వెనక్కి తగ్గక నేను ముంజేతులు అడ్డం పెట్టి వాటిని వాటి స్థానాలకి తోస్తాను సమా!” అన్నాడు.
భీముడి మాటలు విని వాసుదేవుడు “పవనపుత్రా! నేనేదో పరిహాసం కోసం మాట్లాడిన మాటలకి ఇంత రాద్ధాంతమా? నువ్వు అసామాన్య వీరుడివి. ఇంతటి పరాక్రమవంతుడవైన నువ్వు దుర్యోధనుడు మొదలైనవాళ్లు ఇంతకు ముందు చేసిన అపకారాల్ని తలుచుకోకుండా పౌరుషం లేని మాటలు మాట్లాడ్డం చూసి, నీ వంటి రాజకుమారుడికి తగిన మాటలు కాదని అన్నానే గాని, మరేమీ కాదు.
నీ భుజపరాక్రమము, శక్తీ, నువ్వు ఇంతకు ముందు చేసిన సాహసకృత్యాలూ- హిడింబాసుర, బకాసుర, కీచక, జరాసంధుల్నిచంపిన విషయాలూ నాకు తెలియనివి కాదు కదా!” అన్నాడు.
మళ్లీ భీముడివైపు చూసి “అర్జునుడు యుద్ధంలో తనకి సారథ్యం చెయ్యమని నన్ను అడుగుతున్నాడు. అందుకు నేను ఒప్పుకున్నాను. కనుక, యుద్ధాన్ని కోరుకుంటున్న మాకు యుద్ధరంగంలో నీ సహకారం ఎంతో అవసరం. శత్రువుల్ని గెలవడం వల్ల కాకుండా కీర్తి, అన్ని ప్రయోజనాలు మరొక విధంగా దొరకవు కదా?” అన్నాడు.
శ్రీకృష్ణుడి మాటలకి భీముడు “ఎట్టెట్టా? అర్జునుడూ, నువ్వూ గొప్ప శూరులై రాబోతున్న కురు సంగ్రామాన్ని మీ భుజశక్తితో అడ్డుకుంటుంటే మేమందరం చేతులు ముడుచుకుని పెద్ద మిట్ట ఎక్కి ఆశ్చర్యంతో మిమ్మల్ని చూస్తూ కూర్చుంటాములే! నువ్వు ఇప్పటికి కురుసభకి వెళ్లి రావయ్యా! ఇలాంటి సమయంలో భీముడు వ్యర్థంగా మాట్లాడే మాటలకి కోపగించి గౌరవం పోగొట్టుకోడు సుమా!” అన్నాడు.
శ్రీకృష్ణుడి పరిహాసంగానే అయినా కార్యానికి అనుకూలంగా మాట్లాడిన మాటలకి భీముడు తనుకూడా సరసపు మాటలతోనే సమాధానం చెప్పాడు. అంతటితో తృప్తి కలగక “కృష్ణా! యుద్ధం జరిగితే ఏనుగుల తలలు బ్రద్దలు చేస్తాను. గుర్రాల్ని వరుసగా భూమట్టం చేస్తాను. రథ సమూహాల్ని నుగ్గు నుగ్గు చేస్తాను. ఇంత చేశాక కూడా బడలిక చెందని నన్ను చూసి నువ్వు ఆశ్చర్యపడక మానవు. నా గదతో పండుగ చేయాలనుకున్న దైవ సంకల్పం అప్పుడే కదా సఫలమవుతుంది!” అన్నాడు.
భీముడి మాటలు విని శ్రీకృష్ణుడు “వాయునందనా! నువ్వు చెప్పినదానికంటే ఎక్కువగానే చేస్తావు. నువ్వు చాలా గొప్ప వీరుడివి. నిన్ను తెప్పగా చేసుకుని కష్టాలకి భయపడకుండా మేము దుఃఖమనే సముద్రాలు ఈది గట్టెక్కాము. ఇప్పుడు ఏర్పడిన సంకటం తొలగించి మమ్మల్ని సుఖపెట్టు. గుణరత్న నిధివైన భీమా! నేనిప్పుడే కురుసభకి వెడతాను. పాకానికి వచ్చేటట్లు వాళ్లతో మాట్లాడి సంధి కుదిరేట్లు చూస్తాను. అలా ప్రయత్నించడం నాకు అంగీకారమే. ఒకవేల సంధి కుదరని పక్షంలో మాకు అన్నింటికీ ఆధారం నువ్వే సుమా!” అన్నాడు.
శ్రీకృష్ణుడితో తన అభిప్రాయం చెప్పిన అర్జునుడు
కృష్ణుడు భీముడితో మాట్లాడిన మాటలు విన్న తరువాత అర్జునుడు కృష్ణుడితో “ధర్మనందనుడు నీకు చెప్పవలసినదంతా చెప్పాడు. ఆయన మాటలన్నీ నువ్వు విన్నావు. ప్రత్యేకంగా మేము చెప్పవలసిన మాటలు లేవు. అయినా నాకు తోచిన మాటలు నేనూ చెప్తాను.
కృష్ణా! ధృతరాష్ట్రుడు పరమ దురాశాపరుడు. అతడు మాకు రాజ్యభాగం ఇవ్వడానికి అంగీకరించడు. అతడి కొడుకు కూడా కర్కశుడు. మరి సంధి కుదరటం అసంభవమని ముందుగానే నీకు సందేహం కలిగింది. నా గాండీవం, దివ్యాస్త్రాలు ఉన్నవి ఉన్నచోట ఉండగానే మేము ఏ విచారమూ లేకుండా ఉండే మార్గం చూపించలేవా?
స్వామీ! నువ్వు చెయ్యాలనుకున్న పనికి ఎప్పుడూ హాని జరగదు. కొన్ని పనులు ముందు జరగనట్లే కనిపించినా చివరకి జరుగుతాయి. కనుక, ముందు పని మొదలుపెట్టడం పురుష లక్షణం. చేసిన పనికి ఫలితం దక్కాలంటే దైవసహాయం అవసరం. కనుక పురుషయత్నం, దైవానుకూల్యం, కార్యం అనుకూలించడం, అనుకూలించకపోవడం అనేవి రెండూ నీ సంకల్పానికి లోబడి ఉంటాయి. ఈ మాట నిజం.
శత్రుభావంతో జూదంలో ధర్మరాజుని ఓడించి అవమానించి ఆ ఘాతుకులు చంపడానికి అర్హులని ఎవరైనా చెప్పగలరు. నువ్వు సత్పురుషులయందు వాత్సల్యం కలవాడివి కనుక, ఆ కౌరవులు మా మీద ద్వేషం పెట్టుకుని, మమ్మల్ని బాధించి, ఇంతటి దుస్థితి పాలుగావించిన కారణాన నీ హృదయంలో నెలకొన్న మిక్కుటమైన బాధతోనూ, మిక్కుటమైన కోపంతోనూ వాళ్లని సంగ్రామంలో వధించి, రాజ్యభాగం గైకొనడం యోగ్యమని చెప్పావుగాని మరేమీకాదు.
కృపాసాగరుడవైన కృష్ణా! కౌరవులని ఏం చేసినా దోషం లేకపోయినా నా మాటలు విను. ఆనాడు నిండు సభలో పాంచాలిని కొప్పు పట్టి ఈడ్చి, వలువలు ఒలిచినా ఊరుకున్నాం. దైన్యస్థితి పొందికూడా ఓర్పుతో తలవంచుకుని అడవులకి వెళ్లిపోయాం. ఇదంతా నీకు తెలుసు. కాబట్టి, వాళ్ల దుండగాలన్నింటినీ మన్నించి, నేర్పుతో కౌరవ పాండవుల్ని ఒకటిగా ఉండేట్లు చెయ్యి. పుండరీకాక్షా! తమ శక్తి ఏపాటిదో తెలుసుకొనక దుర్యోధనాదులు కావాలని మమ్మల్ని అనేక విధాలుగా బాధలకి గురి చేశారు.
చవిటి నేలలో పాతిన విత్తనాలు ఎలా మొలకెత్తవో అలాగే మా ఆశలు, ఆకాంక్షలూ హృదయంలోనే అణగారిపోయాయి. కృష్ణా! ఆ మూర్ఖుల్ని ఎలాగైనా సంధికి ఒప్పించి, మాకూ, వాళ్లకీ రాజ్యంలో చెరిసగం వచ్చేట్లుగా చేసి, ఉభయులం కలిసి మెలిసి ఒద్దికగా జీవించే ఏర్పాటు చెయ్యడం చాలా మంచిది. ఆ ఏర్పాటు వల్ల మాకు గౌరవమూ, సౌఖ్యమూ లభిస్తాయి. కృష్ణా! కౌరవులతో మేము సంధి చేసుకోడానికి మీ దివ్యచిత్తానికి సరిపడకపోతే – ఆ పద్ధతి మీకు తగదు, మీరు ఈ రకంగా ఈ పని చెయ్యండి అని స్పష్టంగా మాకు ఆజ్ఞ ఇవ్వండి.
కృష్ణా! మాకు ఇది మంచి జరిగేలా చేస్తుంది. ధర్మస్వరూపం ఇటువంటిది – అని నీకు తెలియ చెప్పడానికి నేను ఏపాటివాడిని? ఏది హితమో, ఏది న్యాయమో నువ్వే ఆలోచించి నిర్ణయించి ఈ మార్గంలో వెళ్లమని చెప్తే ఆ మార్గంలో వెళ్లి నిర్విచారంగా నువ్వు చెప్పినట్లు చేసి ఉన్నతస్థితికి రాగలం. అటువంటి పరిస్థితి ఈ రోజు కొత్తగా ఏర్పడింది కాదుకదా!” అన్నాడు.
అర్జునుడి మాటలు విని కృష్ణుడు అర్జునుడితో “ఉపాయంతో శక్తితో శ్రమించి సేద్యానికి పలు రకాలుగా మంచి చేసినా సమయానికి తగినంత వర్షం లేకపోతే పంట చేతికందదు. అలాగే ఎన్నో విధాలుగా శ్రమ పడినా కూడా ప్రేమతో దైవం ప్రసన్నమైనప్పుడే మనుషులు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నేను మాత్రం శక్తికొద్దీ సంధి సమకూర్చడానికే ప్రయత్నిస్తాను. దైవం ఏమి చెయ్యాలనుకున్నాడో చెప్పలేను. దుర్యోధనుడు ఆదరంతో రాజ్యభాగమిచ్చే న్యాయబుద్ధి కలవాడైతే చిన్నతనం నుంచీ ఎన్నో విధాల మిమ్మల్ని పాడు చెయ్యడానికి ఇన్ని దుర్మార్గపు పనులు చెయ్యడు కదా!
ఆ విషయం అలా ఉంచు. మత్స్యదేశంలో విరాటుడి గోవుల్ని కౌరవులు తోలుకుని వెడుతుండగా వాటిని మళ్లించుకుని రావడానికి నువ్వు వెళ్లినప్పుడు భీష్ముడు దుర్యోధనుడితో మాట్లాడిన మాటలివి. ‘ఆవుల్ని మరలించుకుని వెళ్లడానికి వచ్చినవాడు అర్జునుడు. తప్పక యుద్ధంలో మనమే గెలుస్తామనడానికి వీలు కాదు. రాజ్యలక్ష్మి కోసం సైన్యాలు తలపడితే రెండు పక్షాలు విజయాన్ని సాధిస్తాయా ఒకళ్లది పై చెయ్యి, మరొకళ్లది కిందచెయ్యి అవుతుంది. జయాపజయాలు భరించడానికి అంగీకారమైతే యుద్ధానికి దిగాలి. అలా కాకుండా ఆలోచించి ఏదో ఒక విధంగా సంధి చేసుకోవడం మంచిది’. అన్నాడు.
భీష్ముడి మాటలకి దుర్యోధనుడు సమాధానమిస్తూ ‘మనకీ పాండవులకీ ఎలా పొత్తు కుదురుతుంది? నేను వాళ్లకి రాజ్యంలో సగభాగం పంచి ఇవ్వను. పరాక్రమంతో యుద్ధం చేసి రాజ్యం మొత్తం ఎలుకోడానికే నిర్ణయించుకున్నాను’ అన్నాడు. దుర్యోధనుడు భీష్ముడితో చెప్పిన మాటలు తరువాత మనమంతా విన్నాము. ఆ మాటల ఫలమేమిటో అతడు ఉత్తరగోగ్రహణ యుద్ధంలో రుచి చూశాడు. యుద్ధంలో నీ చేత ఓడిపోయిన తరువాత కూడా ఆ దుష్టచిత్తుడు పట్టు విడవలేకపోతున్నాడు. దుర్యోధనుడి గుణాలు అవగుణాలు అలా ఉండనీ. ధర్మరాజు కోరినట్లు రాయబారం నడపడానికి కురుసభకి వెళ్లాలి. పొత్తు కుదర్చడానికి వెళ్లి అక్కడి వాళ్ల ప్రవర్తనలు ఎలా ఉన్నాయో తేటతెల్లంగా తెలుసుకుని తిరిగి వస్తాను” అన్నాడు.
సంధికార్యం జరిపించుకుని వస్తాను అని చెప్పిన శ్రీకృష్ణుడితో నకులుడు “నీకు ధర్మనందనుడూ, భీమసేనుడూ, అర్జునుడూ చెప్పిన మాటలు వట్టి మాటలు కావు. మా మనస్సులు అప్పుడు అరణ్యవాసకాలంలోను, విరాటమహారాజు దగ్గర గడిపిన అజ్ఞాతవాస సమయంలోనూ ఉన్నట్లు ప్రతీకార వాంఛతో ఇప్పుడు లేవు. కౌరవుల యందు కారుణ్యంతో తీవ్రత తగ్గినట్లు ఉన్నాయి.
కృష్ణా! ముందుగా తొందరపడి ఒక గోవుని కొడితే మరొకడు దాని దూడని కొట్టాలా? ఆ పని మంచిది కాదు. దుర్యోధనుడు మొదలైనవాళ్లు చెడు మార్గంలో నడుస్తే నడవనీ, మనం కూడా అదే మార్గంలో నడవాలా? వీరాధి వీరులైన తమని ఓడించి అర్జునుడు ఒక్కడే పశువుల్ని మళ్లించుకుని వచ్చినరోజు నుంచి కౌరవులు అప్పటి కరుకుదనం వదిలి మెత్తబడి ఉంటారు.
నీ దయవల్ల ఏడు అక్షౌహిణుల సైన్యం, వాటి అధిపతులూ, ధర్మరాజు పక్షంలో చేరడం వాళ్లకి తెలియదా? పాంచాల, యాదవ, పాండ్య, మత్స్య దేశాల రాజుల సాహస పరాక్రమాలు ఎటువంటివో వాళ్లకి తెలియదా? భీమార్జునుల బలవిక్రమాలు, గొప్పతనం, నీ సహాయం ధర్మనందనుడికి ఉన్నాయని వాళ్లు బయపడకుండా ఉంటారా? ద్రోణ కృపాచార్యులు, బాహ్లికుడు, భీష్ముడు, నీతి బోధించి ఎలాగైనా వాళ్లని చక్కబరచకుండా ఉంటారా? విదురుడు వింటూ ఉండగా, నువ్వు చేసే కర్తవ్య బోధన తిరస్కరించడం వాళ్లకి ఎలా సాధ్యమవుతుంది?
కృష్ణా! నువ్వు వాళ్ల దగ్గరికి వస్తే దుర్యోధనుడు మొదలైనవాళ్లు నిన్ను అవమానపరచడానికి భయపడతారు. నువ్వు వెళ్లిన వెంటనే నువ్వు వెళ్లిన పని సఫలమవుతుంది” అన్నాడు.
తరువాత సహదేవుడు శ్రీకృష్ణుడితో “ఔరా! ధర్మపుత్రుడూ, అతడి సోదరులూ తగని మాటలు మాట్లాడుతున్నారు. వాటిలో ఒక్క మాటనైన నువ్వు తిరస్కరించకుండా నువ్వు ఊ కొట్టడం అంతకన్న బాగుంది. రాక్షసుల్ని విధ్వంసం చేసిన నువ్వు కురుసభకి బిచ్చమడగడానికి కూడా వెడుతున్నావన్నమాట! చెడు బుద్ధి కలిగిన దుర్యోధనుడెక్కడ? రాజ్యంలో సగం మనకి పంచి ఇవ్వడం ఎక్కడ? అది జరిగే పనికాదు.
ధర్మరాజువంటి ప్రభువులు ఇంతటి ఒకరిని యాచించే దినత్వానికి దిగజారడం ఊహించని విషయం. ఇందుకు బంధువులూ, స్నేహితులూ నిందించక మానరు. యుద్ధానికి సన్నద్ధులై వచ్చిన పాంచాల మొదలైన దేశాధిపతులకి ఈ విధం మెప్పు కలిగిస్తుందా? లోకంలో ఇంత విడ్డూరం ఉంటుందా? ధర్మరాజు రాజ్యభాగం యాచించడం, దాన్ని పరమ పురుషుడైన శ్రీకృష్ణుడు అడగడానికి వెళ్లడం, ఆ కౌరవులు భాగమియ్యకుండా ఈర్ష్యతో యుద్ధం చెయ్యడం చూస్తుంటే- ఇన్ని విధాలుగా బాధపడి సంపాదించే తిండి అంత రుచికరమైందా?
అచ్యుతా! మా వాళ్లు న్యాయమార్గమేమిటో విపులంగా చర్చించినా అందుకు కౌరవులు అంగీకరించి, ఏదో కొంత మాకిచ్చినా ఈ సంధి గౌరవం కలిగించదు. మాకు యుద్ధమే తగినది. వంకర మాటలు నాకు తెలియవు. కనుక, ధృతరాష్ట్రుడికి కొలువులో నా మాటగా చెప్పు. మా తండ్రి పాండురాజు గడించిన రాజ్యంలో సగం నువ్వు కూడా తీసుకో. పన్నెండేళ్లు అరణ్యవాసం, మారు పేర్లతో ఎవరికీ తెలియకుండా ఒక సంవత్సరం అజ్ఞాతవాసం మొత్తం పదమూడేళ్లు గడిపిన మేము ప్రాణాలతో తిరిగి వచ్చాక రాజ్యంలో భాగం మాకు ఇవ్వక తప్పదు. నువ్వు అలా రాజ్యభాగం ఇవ్వడానికి ఇష్టపడకపోతే వీరత్వంతో మాతో యుద్ధం చెయ్యి. ఇంక నీ టక్కుటమారాలు సాగవు అని దుర్యోధనుడి మనస్సులో నాటుకునేటట్లు చెప్పు” అన్నాడు.
సహదేవుడు చెప్పిన మాటలకి సాత్యకి సంతోషించి “ఇతడు తగిన విధంగా మాట్లాడాడు. దుర్యోధనుడు చెడు నడత కలవాడు. అతడికి నీతులు చెప్పడం వల్ల ప్రయోజనం ఉండదు. అంతేకాదు, మన గౌరవం కూడా పోతుంది. సంతోషంతోనూ, ఉత్సహంతోనూ ఉన్న ఈ వీరులందరికీ యుద్ధమే ఇష్టం. ఏ విధంగ ఆలోచించినా మనకి యుద్ధమే మంచిది” అన్నాడు.
సహదేవుడూ, సాత్యకీ చెప్పిన మాటలు విని రథికశ్రేష్ఠులందరూ “ఆహా! సహదేవుడు ఎంత చక్కగ మాట్లాడాడు! సాత్యకి మాటలు ఎంత బాగా ఉన్నాయి? తక్కినవాళ్ల మాటలు ఏమి మాటలు? విరోధుల్ని యాచించడానికి వెళ్లడం మంచిదట! వాళ్లు చేసిన అవమానానికి ప్రతీకారం చెయ్యకూడదట!” అంటూ అక్కడ ఉన్న అనేక మంది అనేక విధాలుగా వీరత్వంతో మాట్లాడుతుండగా సభంతా ధ్వనితో నిండిపోయి ఆ కంఠధ్వనులు ఆకాశాన్నంటాయి.
