Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మహాభారత కథలు-153: శ్రీకృష్ణుడితో తను పడిన భంగపాట్లు చెప్పిన ద్రౌపది

[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]

శ్రీకృష్ణుడితో తను పడిన భంగపాట్లు చెప్పిన ద్రౌపది

ర్మరాజు మాటలు తన మనస్సుకి వేదన కలిగించగా ముఖంలో దీనత్వంతో అక్కడున్న అందరి మాటలూ వింటూ అక్కడే ఉన్న ద్రౌపది కోపంతో శ్రీకృష్ణుణ్ణి చూసి డగ్గుత్తికతో “కౌరవులు అటువంటి కాని పనులు చేసి, అడవులకి తరిమేసి, ఇప్పుడు సంజయుడితో ఊరడించే మాటలు చెప్పి పంపిస్తారా? ధర్మనందనుడు ఆ మాటలకి మనసులో ఎంతో సంతోషించాడు. దుర్యోధనుడు అంత తేలికగా అన్నదమ్ములు అయిదుగురికీ ఐదు గ్రామాలు ఇస్తాడా? ఇవ్వకపోగా దయలేని మనస్సుతో అతడు ఈ అన్నదమ్ముల్ని ఇంకా బాధిస్తాడు కాబోలు!

కృష్ణా! ప్రభువైన ధర్మరాజు తమ్ముళ్లైన దుర్యోధనుడు మొదలైన కౌరవుల మీద తనకున్న గొప్ప ప్రేమతో తాను ఇంతవరకు సహించిన అవమానాల్ని సహిస్తే సహించనీ! మంచిదే! కాని, రాజ్యంలో భాగం తీసుకోకుండా వాళ్లతో సంధికి అంగీకరిస్తే మాత్రం లోకులు పాండవులెంత అవివేకులు! ఎంత అసమర్థులు! ఎంత సిగ్గులేనివాళ్లు! అని నిందించరా? గౌరవం పోయేలా తాము తక్కువవాళ్లమని తమకి తామే నిరూపించుకోడం ఎందుకు?

బాగా ఆలోచిస్తే సంధి వల్ల కౌరవులకే లాభం. తమనూ కౌరవులనూ పోల్చుకున్నప్పుడు కుంతీపుత్రులు పని నెరవేర్చుకోలేరా? సంధి కుదరనప్పుడు యుద్ధంలో దండించే ఉద్దేశమే వీళ్లకి ఉంటే గెలవడంలో అనుమానించడానికి అవకాశమే లేదు. ఏ తప్పు చేసినా క్షమించి వదిలిపెట్టడానికి దుర్యోధనులు మొదలైనవాళ్లు బ్రాహ్మణులా ఏమిటి?

కృష్ణా! సుయోధనుడి మనసులో కొంచెం కూడా భయం లేదు. నువ్వు చెప్పే మంచి మాటలు వింటాడా? ఎప్పటికైనా అహంకారమే ప్రదర్శిస్తాడు. ఆ కురుసభలో యుద్ధం జరిగే సూచనలు కనిపిస్తే పాండవులు అప్పటికైనా యుద్ధం చెయ్యాలని అనుకుంటారో.. అడవుల్లో నివసించడానికి వెడతారో ఏమో! అన్నాను. నేను ఇలా అన్నానని అనుకోవద్దు.

ఇంక నువ్వూ, ధర్మజుడూ, అతడి తమ్ముళ్లూ కలిసి ఏది మంచిదో చూసి, మన పని, మీ మంచితనమూ చెడిపోకుండా ఏదో ఒక విధంగా సరిపెట్టుకోకుండా తగిన విధంగా మీకు ఇష్టమైన పద్ధతిలో మీ నేర్పు అర్థమయ్యేలా కౌరవులతో పొత్తు కుదుర్చుకోండి” అని చెప్పింది.

ద్రౌపది మళ్లీ మాట్లాడుతూ “నేను నిందలపాలవడమూ, ఆ ఫలితాన్ని అనుభవించడమూ చూసి కూడా మాట్లాడం లేదు కనుక కర్త నేను అనడం కంటే పాండవులు అనడమే సరయినది. నా భర్తలు మాట్లాడకపోవడం వల్ల, చెప్పిన మాటే మళ్లీ మళ్లీ చెప్తూ మనసులో మాటలు దాచుకోలేక నేను ఏదో నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాను. అంతులేని కోపం వల్ల ఏది చెయ్యతగిన పనో, ఏది చెయ్యకూడని పనో తెలుసుకోలేకపోతున్నాను.

కృష్ణా! నేను దేవతా వర ప్రసాదం వల్ల జన్మించాను. భరతవంశంలో మెట్టాను. భరతకుల మహారాజు పాండురాజుకి కోడలయ్యాను. ప్రజలందరితో పూజింపబడే భర్తలని పొందాను. రాజనీతిలోనూ, శౌర్యంలోను చలించని కుమారుల్ని కన్నాను. తోబుట్టువుల తోడు కూడా నాకు ఉంది. నేను ఇన్ని విధాలుగా ప్రఖ్యాతి పొందాను.

అంతేకాకుండా పద్మనాభా! నువ్వు నన్ను నీ చెల్లెలు సుభద్ర కంటే ఎక్కువ స్నేహము, గౌరవంతో ఆదరిస్తావు. ఇటువంటి నన్ను రాజసూయ యజ్ఞదీక్ష పూర్తయిన తరువాత మంగళ స్నానంతో పవిత్రమైన నా జడని పట్టుకుని ఒకడు నా భర్తలు అయిదుగురూ చూస్తూ ఉండగా సభలోకి ఈడ్చి తెచ్చాడు. ఇల్లాలిని ఇలా పరాభవించవచ్చా? నువ్వే చెప్పు. ముకుందా!

ఆనాడు ఒంటి చీరతో ఉన్న నన్ను కురుసభకి బలాత్కారంగా తెచ్చి దుశ్శాసనుడు బాధిస్తుంటే నా భర్తలు అయిదుగురు దిగ్భ్రాంతి చెంది ఏమీ చెయ్యలేక నా మీద ఆశలు వదులుకుని బొమ్మల్లా కదలక, మెదలక, ఉంటే నా మనస్సు నమ్మకంతో నిన్ను ధ్యానించింది. ఆ విషయాన్ని నువ్వు సంధి చేసే సమయంలో గుర్తుకి తెచ్చుకో.

అన్నా! ముందు వెనుకలు ఆలోచించక కోడలని కూడా భావించక అప్పుడు నన్ను దాసిని చేసిన ఆ పెద్దమనిషి ధృతరాష్ట్ర మహారాజు దగ్గరికి నా భర్తలు వెళ్లినప్పుడు, వారి వెంట నేను కూడ వెళ్లి ఆ పెద్దలకి కోడరికం చెయ్యాలో లేక న్యాయ ప్రకారం వాళ్లకి దాస్యమే చెయ్యాలో నువ్వే నిర్ణయించి చెప్పు” అంది.

వెంటనే ద్రౌపది ముడి వేసుకున్నశిరోజాల్ని వెంటనే విప్పి నల్లని రంగుతో నిగనిగలాడే పెద్ద పాములా వ్రేలాడుతున్న శిరోజాల్ని కుడి చేత్తో పట్టుకుని మనస్సులో చెలరేగుతున్న దుఃఖాన్ని, కోపాన్ని ఆపుకోలేక కళ్లల్లో నిండిన నీళ్లతో ఒక్కసారిగా లేచింది. కృష్ణుడి ముందుకి వెళ్లి కృష్ణా! ఈ శిరోజాలు దుశ్శాసనుడు నన్ను బలాత్కారంగా సభకి ఈడ్చినప్పుడు అతడి చేతి వేళ్లలో చిక్కుకుని సగం తెగిపోగా మిగిలినవి. నువ్వు కౌరవుల దగ్గర సంధి కోసం మాట్లాడుతున్న సమయంలో వీటిని జ్ఞాపకం చేసుకోవాలి.

యుద్ధంలో మొట్టమొదట నా తలవెంట్రుకలు పట్టి సభలోకి ఈడ్చి తెచ్చిన ఆ దుశ్శాసనుడి హస్తం, అతడి దేహం ముక్కలు ముక్కలుగా చెల్లాచెదరై నేల మీద పడి రూపు నాశనమయినప్పుడు చూసినప్పుడే నా మనసులో ఆవేదన చల్లారుతుంది. ఆ రకంగా పరాభవం పొందిన ధర్మనందనుడూ, నేనూ దుర్యోధనుడి శవాన్ని కళ్లారా చూడలేకపోతే, కొండంత గదని భుజం మీద వేసుకుని తిరిగే భీమసేనుడి భుజబలమూ, గొప్పగా గాండీవమనే పేరుగల పెద్ద వింటిని ధరించి తిరిగే పాండవ మధ్యముడి శౌర్యమూ తగులపెట్టడానికా? చెడ్డవాళ్లని శిక్షించడానికీ, మంచివాళ్లని రక్షించడానికీ సిద్ధంగా ఉన్న నీ వంటి తోబుట్టువూ, మిక్కిలి పరాక్రమంతో ప్రకాశించే భర్తలూ ఉండి కూడా ఇంత పరాభవంతో నిండిన కోపాగ్నిని నిప్పులు ఒడిలో దాచుకున్నట్టు భయంకరమైన (రాక్షసమైన) సహనంతో భరిస్తున్నాను. ఈ అవమానాగ్నిఅణిగిపోవడమనేది ఎప్పటికీ జరగదు.”

ద్రౌపదిని ఓదార్చిన శ్రీకృష్ణుడు

కృష్ణుడితో మాట్లాడుతూ కంపిస్తున్న కంఠంతో ద్రౌపది ఏడుస్తోంది. శ్రీకృష్ణుడు ఆమెని ఓదారుస్తూ కూర్చోమని చెప్పాడు. ఆ కన్నీళ్లు తుడవడానికి, చెదిరిన చక్కటి పెద్ద కొప్పుని ముడి వెయ్యడానికి తగినవాళ్లని నియమించాడు. తరువాత ద్రౌపదితో “పాంచాలీ! నేనుండగా ఎందుకు ఏడుస్తావు? నాకు భీమార్జునులు సహాయపడుతూ ఉండగా ప్రజలతో కీర్తింపబడే ధర్మరాజు ఆజ్ఞతో నువ్వు సంతోషపడేలా శత్రువుల్ని నాశనం చేస్తాను.

మరొక మార్గం లేదు. చెడు నడవడిక కలిగిన కౌరవులు భూమిని పంచి మనకిస్తారా? అమ్మా! బాధపడకు. నువ్వెంత దుఃఖాన్ని భరించావో దుర్యోధనుడు మొదలైనవాళ్ల భార్యలు కూడా అంతే దుఃఖాన్ని అనుభవిస్తారు. వాళ్ల ఏడుపులు నువ్వు నవ్వుతూ చూసే సమయం దగ్గరపడింది.

తల్లీ! యముడి దున్నపోతు మెడలో గంటల సవ్వడి వినడానికి ఎంతో ఉబలాటపడుతున్న కౌరవులకి సంధికి సంబంధించిన శాంతంగా ఉండే మాటలు ఇష్టంగా ఉంటాయా? అసలు దైవనిర్ణయం ఇదేనని, కురుపాండవులకి పొత్తు కుదరదనీ కౌరవులకి చావు మూడిందనీ పెద్దలు చెప్తున్నారు. అలాగే జరుగుతుంది. మేరు పర్వతం బద్దలైనా నేను బుద్ధిలో ఊహించి చెప్పిన మాట వ్యర్థం కాదు.

ద్రుపదరాజ పుత్రీ! నేను శపథం చేసి చెప్తున్నాను. నా మాటలు విను. విరోధుల్ని ధ్వంసం చేసి, ప్రకాశించే గొప్పదైన పుణ్యంతో ఉండే పాండురాజు కొడుకుల అంతులేని వైభవాన్ని నువ్వు చూడగలవు. అది ఎంతో దూరంలో లేదు. నా మాట నిజం” అని శ్రీకృష్ణుడు ద్రౌపదిని ఊరడించాడు.

ఆమె దుఃఖం ఉపశమించాక పార్థుడు శ్రీకృష్ణుడితో “పద్మనాభా! బంధుత్వాన్ని బట్టి నీకు కౌరవులు, పాండవులు సమానమే! కనుక, ఎలా అయినా ఇద్దరికీ తగిన మంచి జరిగేలా చెయ్యి. కృష్ణా! ధర్మప్రకారం ధర్మపుత్రుడు చెప్పినట్టు కౌరవ సభలో గౌరవంగా అందరికీ ఇష్టమయ్యేలా మాట్లాడు. దుర్బుద్ధి కలిగిన కౌరవులు మంచి జరగాలని అనుకోకపోతే దేవుడున్నాడు. ఆ దేవుడే అన్నీ చక్కబెట్టగలడు” అన్నాడు.

అర్జునుడి మాటలు విని శ్రీకృష్ణుడు “అర్జునా! కౌరవులకి మీకూ ఇష్టమైనదాన్ని, మంచి జరిగేదాన్ని చెయ్యాలని అనుకుని కుంతీపుత్రుల్లో పెద్దవాడైన ధర్మజుడి పనిమీద ధృతరాష్ట్రుడి దగ్గరికి ఎంతో సంతోషంతో వెడుతున్నాను” అన్నాడు.

శ్రీకృష్ణుడి మాటలకి ధర్మరాజు మనసులో ఎంతో పొంగిపోయాడు. “మహానుభావా! నువ్వనుకున్నట్టే చెయ్యి. మా ఆలోచన కూడా అదే. ఈ విషయం మరిచిపోవద్దు.”

ధర్మరాజు కృష్ణుడిని కౌరవసభకి పంపించడానికి తీర్మానించి రేపు మంచిరోజని చెప్పాడు. “నారాయణా! నీ జన్మనక్షత్రం రోహిణి, వృషభరాశి. రేపు రేవతీ నక్షత్రం కనుక, చంద్రుడు మీనరాశిలో ఏకాదశ స్థానంలో శుభుడై ఉన్నాడు. కాబట్టి చంద్రబలమూ, రేవతీ నీకు సాధన తార అవడం వల్ల తారాబలం కూడా చక్కగా కుదిరాయి. ప్రయాణానికి రేపు ఉదయమే అనుకూలం” అని చెప్పాడు.

కృష్ణుడు ధర్మరాజు మాటల్ని సగౌరవంగా అంగీకరించాడు. తరువాత ధర్మరాజు సభని నాలుగువైపులా చూసి అందరూ వింటూ ఉండగా “ఇదే మన నిర్ణయం’ అని చెప్పాడు. తరువాత ధర్మరాజు తమ్ముళ్ళు, ద్రౌపది, పరివారం తమ తమ స్థానాలకి వెళ్లిపోయారు.

మరుసటి రోజు శ్రీకృష్ణుడు సూర్యోదయం అవగానే కాలోచిత కృత్యాలు పూర్తిచేసుకుని సూర్యోపాసన చేశాడు. అగ్నిని ఆరాధించాడు. బ్రాహ్మణులకి నమస్కారాలు చేసి, ప్రయాణ కాలంలో చేయవలసిన దానాలు, పూజలు చేసి వాళ్లని సంతోషపరిచాడు. బ్రాహ్మణుల దీవనలని, వాళ్లు మంత్రించి ఇచ్చిన అక్షతల్ని, దూర్వాంకురాల్ని స్వీకరించాడు. ఉచిత ప్రదేశంలో ఉండి, దామోదరుడు సాత్యకిని పిలిపించాడు. “సాత్యకీ! మన యాదవుల్లో హస్తినాపురానికి రావలసినవాళ్లని అందరినీ సన్నాహాలతో రమ్మని స్పష్టంగా చెప్పు. నువ్వు కూడా బయలుదేరి నాతో రా!” అని చెప్పాడు.

శ్రీకృష్ణుడు ఏదో గుర్తుకొచ్చినట్టు మళ్లీ సాత్యకితో “దుర్యోధనుడు చెడ్డ మనసు కలవాడు. అతడు దగ్గరికి తీసే మనుషులంతా వంకరబుద్ధి కలవాళ్లు. కాబట్టి నువ్వు చక్రం, గద మొదలైన అయుధాల్ని రథంలో పెట్టించు” అని చెప్పాడు.

అదే సమయంలో సారథి దారుకుడు వచ్చి నిలబడ్డాడు. శ్రీకృష్ణుడు “నువ్వు రథాన్ని సిద్ధం చెయ్యి” అని ఆజ్ఞాపించాడు.

దారుకుడు మణుల కాంతితో ప్రకాశిస్తున్న రథానికి శైబ్యం, సుగ్రీవం, మేఘపుష్పం, వలాహకం అనే గుర్రాల్ని కట్టి, రథం మీద గరుడకేతనం నిలబెట్టి రథాన్ని తీసుకుని వచ్చాడు. కృష్ణుడు ప్రయాణసన్నాహం చూసి ప్రజలు ఆనందంగా చూస్తుండగా, మంగళవాయిద్యాలు మోగుతుండగా, వింజామరలు వీస్తుండగా రథారోహణం చేశాడు. సాత్యకి యాదవ పరిజనంతో వచ్చాడు. అతణ్ని రథం మీద కూర్చోబెట్టుకుని, కుడికన్ను అదురుతుండగా అనందంగా పూర్ణకుంభం, వృషభం మొదలైన క్షేమకర పదార్థాల్ని చూస్తూ, ముత్తైదువలు అక్షతలు చల్లుతుండగా ప్రసన్నమైన మనస్సుతో కృష్ణుడు బయలుదేరాడు.

పాండవులు, యాదవులు, పాంచాల రాజైన ద్రుపదుడు, కేకయరాజు, పాండ్యవల్లభుడు, విరాటరాజు మొదలైనవాళ్లు భద్రజాతికి చెందిన ఏనుగులు, గుర్రాలు, రథాలతో మిక్కిలి ఆసక్తితో వచ్చారు. వాళ్లని చూసి శ్రీకృష్ణుడు వాళ్లందరితో ఆదరంగా మాట్లాడాడు. మెల్లమెల్లగా నిలిచి ఉన్న సేనల్ని దాటాడు. శ్రీకృష్ణుడు వెడుతున్న సమయంలో ధర్మరాజు తన రథాన్ని అతడి రథం దగ్గరికి పోనిచ్చాడు.

శ్రీకృష్ణుడితో “మా తల్లి కుంతీదేవి కురువంశాన్ని పవిత్రం చేసే ప్రవర్తన కలది. మధుసూధనుడు వచ్చాడన్న సంగతి తెలిస్తే ఆమెకి ప్రాణం లేచి వచ్చినట్టు ఉంటుంది. ఆమె పడ్డ శ్రమంతా పోతుంది. నువ్వు మా అమ్మ దగ్గరికి వెళ్లి మా అందరి బదులుగా నమస్కరించి, గట్టిగా కౌగలించుకుని, కుప్పకూలిన ఆమె మనసులో ఉన్న బాధని నివారించు. అడవులకి వెళ్లేప్పుడు మమ్మల్ని పంపించడానికి మాతో చాలా దూరం నడిచి వచ్చింది. ముఖంలో దీనత్వం, కళ్లల్లో కన్నీళ్లు కనిపించాయి.

అటువంటి మా తల్లిని హస్తినలో విడిచిపెట్టి వెళ్లవలసి వచ్చింది. పాలల్లో పడిన బల్లిలా ఆమె ఇప్పటికే దుఃఖంతో ఎంతో శుష్కించిపోయి ఉంటుంది. లాక్షాగృహదహనం జరిగింది మొదలు దిక్కులేనిదానిలా మా అమ్మ దైన్యంతో మా కోసం అనేక కష్టాలు అనుభవిస్తోంది. దుఃఖాలు అనుభవించడం అయిపోయింది, అవి పోయే సమయం వచ్చింది అని మా అమ్మతో నేను చెప్పినట్లు చెప్పు. కృష్ణా! మీ మేనత్తని ఊరడించు. నువ్వే ఎప్పుడూ ఆమెకి ఆధారమని చెప్తూ ఉంటుంది” అని చెప్పాడు.

ధర్మరాజు మళ్లీ కొంచెం ఆగి “కృష్ణా! గురువైన ద్రోణాచార్యులు, బాహ్లికుడు మొదలైన కురువంశంలో పెద్దలు, చెలికాండ్రు, చుట్టాలు, రాజులందరు సంతోషించేట్లు ఎవరి పట్ల ఏది ఉచితమో, ఆ విధంగా నమస్కారాలు చెప్పానని నా మాటగా వాళ్లకి చెప్పు. నాకు బదులుగా ప్రేమతో విదురుణ్ని కౌగలించుకుని గొప్పబాంధవ్యంతోను, ఆదరంతోను మాట్లాడు. అతడు పక్షపాతం లేకుండా కౌరవుల్ని, పాండవుల్ని సమానంగా చూసే మహానుభావుడు” అన్నాడు.

తరువాత అర్జునుడు “ప్రజలందరూ వింటూ ఉండగా ‘రాజ్యంలో సగభాగం మేము తీసుకుంటాం’ అని ధర్మరాజు తీర్మనించాడు. ఆ తీర్మానానికి అంగీకరించి దుర్యోధనుడూ, అతడి తమ్ములూ, అతడి స్నేహితులూ అర్ధరాజ్యమిస్తే మేము అందుకు అంగీకరిస్తాము. ఇందుకు మరో విధంగా చెపితే కౌరవపక్షంలో ఉన్నవాళ్లందర్నీ సుతులతో, హితులతో కూడ గోతులు తవ్వి పూడ్చి పెడతాను” అన్నాడు.

అర్జునుడి మాటలు పొగుడుతూ “ఇతడు చెయ్యవలసిన పని గురించి ఎంతో స్పష్టంగా చెప్పాడు” అని గంభీర కంఠధ్వనితో అవయవాలు పొంగగా గొప్ప ఘీంకారధ్వని చేస్తూ మత్తగజంలా ప్రవేశించాడు భీముడు. నకుల సహదేవులు అందుకు సంతోషించి ‘పొత్తో’ లేకపోతే ‘పోరో’ నిర్ణయించుకుని వెంటనే రమ్మని శ్రీకృష్ణుడికి చెప్పారు.

Exit mobile version