Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మహాభారత కథలు-154: ధృతరాష్ట్రుడి మందిరానికి వెళ్లిన శ్రీకృష్ణుడు

[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]

ధృతరాష్ట్రుడి మందిరానికి వెళ్లిన శ్రీకృష్ణుడు

ధృతరాష్ట్రమహరాజు దుర్యోధనుడిని తప్ప తక్కినవాళ్లని అందరినీ మంగళవాయిద్యాలతో వాసుదేవుణ్ని ఎదుర్కోడానికి పంపించాడు. శ్రీకృష్ణుడు తనని ఆహ్వానించడానికి వచ్చినవాళ్లందర్నీ తగిన విధంగా, కృతవర్మ తమవాడు కనుక అతణ్ని ప్రత్యేకంగా ఆదరించాడు. కృతవర్మ తన వెంట వస్తుండగ ప్రజలందరూ చూట్టూ చేరిపోయి నడుస్తుండగా తన రాక సందర్బంగా చక్కగ అలంకరించబడిన, కలకళలాడుతున్న ప్రజలతో నిండిన హస్తినాపురంలోకి ప్రవేశించాడు.

అతడు రాజమార్గంలో వెడుతూ ఉండగా మంచి సువాసనలు గల ముత్యాలు కలిపిన తలంబ్రాలు, పూలు వాసుదేవుడి మీద చల్లారు. సంతోషిస్తూ, నమస్కరిస్తూ శ్రీకృష్ణుణ్ని చూడగలుగుతున్నందుకు పరవశిస్తూ స్త్రీలందరు మార్గానికి రెండు వైపులా ఉన్న మేడలమీద నిలబడి చూస్తూ తమలో తాము మాట్లాడుకుంటున్నారు.

 “ప్రాణలతోపాటు రాక్షసి పూతన దగ్గర పాలు తాగిన గడసరి పిల్లాడు ఇతడే. చిటికెలో మల్లవీరుడైన చాణూరుణ్ని విరిచి పోగులు పెట్టి లోకాల్ని మెప్పించిన శూరుడు ఇతడే! దుర్మార్గుడైన కంసుణ్ని చంపి, తండ్రి ఉగ్రసేనుడికి మధురా రాజ్య పట్టాభిషేకం చేసిన ప్రభువు ఇతడే! పారిజాతం వృక్షం మీద సత్యభామకి కలిగిన కోరిక తీర్చిన రసికుడు ఇతడే! వెన్నలతోపాటు గోపికల మనసుల్ని దోచిన శ్రీహరి ఇతడే. ఉపనిషత్తులకి తన పాదపద్మ పరిమళాన్ని సంధింప కలిగిన జాణ ఇతడే సుమా!” అంటూ ఆసక్తితో చెప్పుకుంటున్నారు.

శౌరిని దర్శించాలన్న కోరికతో పిల్లలు, ముసలివాళ్లతో సహా ప్రజలందరూ వేడుకతో అయన రథం చుట్టూ గుమిగూడారు. ప్రజల్ని తప్పించడానికి బెత్తాలు ఝళిపిస్తున్నవాళ్లని వారించి శ్రీకృష్ణుడు మందగమనంతో మణితోరణంతో విరాజిల్లుతున్న రాజమందిర ద్వారంలోకి ప్రవేశించాడు.

లోగిళ్లు దాటుకుంటూ వెళ్లి ఏనుగుల చావడిలోకి ప్రవేశించి అక్కడ రథం దిగాడు. అక్కడి నుంచి గోవిందుడు తిన్నగా నడిచి వస్తుంటే అంతకు ముందే అక్కడికి వెళ్లిన భీష్ముడు, ద్రోణుడు మొదలైనవాళ్లు ధృతరాష్ట్రుణ్ని పొదివి పట్టుకున్నారు. ధృతరాష్ట్రుడు విదుర సంజయులతో నడిచి వచ్చి ముకుందుడికి ఎదురు వెళ్లాడు.

మాధవుడు ధృతరాష్ట్రుణ్ని కౌగలించుకున్నాడు. విదురుడు మొదలైన పెద్దల్ని ఆదరంతో మృదువుగా చూస్తూ గౌరవంతో అలింగనం చేసుకున్నాడు. శ్రీకృష్ణుడు అందరి యోగక్షేమాలు అడగడానికి సాత్యకిని నియమించాడు. అంతకు మునుపే ధృతరాష్ట్రమహారాజు ఆజ్ఞతో ఎత్తైన బంగారు పీఠాన్ని తెచ్చి ఉంచారు. దానిమీద శౌరిని కూర్చోబెట్టాడు ధృతరాష్ట్రుడు.

తరువాత శాస్త్రంలో చెప్పబడిన ఆచారం ప్రకారం శ్రద్ధగల రాజపురోహితులు రాజుగారి అనుమతితో శ్రీకృష్ణుడికి అర్ఘ్యం, పాధ్యం, మధుపర్కం మొదలైన మర్యాదలు చేశారు. శ్రీకృష్ణుడి తమ్ముడు సాత్యకిని కూడా తగిన పీఠం మీద కూర్చోబెట్టి పూజించారు. తరువాత ధృతరాష్ట్రుడు తక్కిన పెద్దలు తమ తమ ఆసనాల మీద కూర్చున్నారు.

సూర్యోదయ కాలంలో విరిసిన పద్మాలతో నిండిన సరస్సులా సభ కళకలలాడుతోంది. అప్పుడు శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుడికీ, అర్హులైనవాళ్లకీ ధర్మరాజు మాటలుగా అతడి నమస్కారాలూ, ఆలింగనలూ మొదలైన మర్యాదలు అందచేసి మాట్లాడ్డానికి ఉపక్రమించాడు.

శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుడికి ఆనందం కలిగించే గౌరవమైన మాటలతో బంధు మిత్రులతో ఉత్సాహం కలిగించేలా, కురుకుమారుల్ని అందర్నీ పలకరించాడు. వాళ్లతో పరిహాసాలాడుతూ చనువునీ, స్నేహాన్ని పంచాడు. కొంచెంసేపు అక్కడే ఉండి, “విదురుడి ఇంటికీ, ఇంకా వెళ్లవలసిన చోట్లకీ వెళ్లి వస్తాను” అని ధృతరాష్ట్రుడి దగ్గర అనుమతి తీసుకుని బయలుదేరాడు.

విదురుడు వేగంగా ముందుకెళ్లి తన ఇంటి దగ్గర ఎదురువెళ్లి శ్రీహరికి స్వాగతం చెప్పాడు. భయం, భక్తి, వినయం, స్నేహం, సంతోషం ఉప్పొంగుతుండగా దేవతోపచారాలతో, అనేక విధాలుగా పూజలు చేశాడు. కుంతీపుత్రుల యోగక్షేమాలు అడిగాడు. అతడికి శ్రీకృష్ణుడు పాండవుల సంగతి అంతా పూసగుచ్చినట్లు చెప్పాడు. అప్పుడు విదురుడు సంతోషంతో “వంట చేయిస్తాను” అని శ్రీహరితో అన్నాడు. “అట్లాగే చేయించండి” అని చెప్పాడు శ్రీకృష్ణుడు. ఆ తరువాత శ్రీకృష్ణుడు కుంతి ఇంటికి వెళ్లాడు.

శ్రీకృష్ణుడు కుంతీదేవి ఇంటికి వెళ్లి అమెని దర్శించాడు. ఆమె అతడి వెన్నంటే వచ్చే నీడలా ఉండే తన కొడుకులు గుర్తుకొచ్చి దుఃఖంతో మేనల్లుణ్ని పట్టుకుని ఏడ్చింది. ముకుందుడు ‘అత్తా’ అని సంబోధించి ఊరడించాడు. కుంతీదేవి కొంత తెప్పరిల్లి మేనళ్లుడికి కూర్చోడానికి పీఠం వేసి ఉపచారాలు చేయించి కూర్చోబెట్టింది.

తను కూడా తగిన పీఠం మీద కూర్చుని బొంగురుపోయిన గొంతుతో “కృష్ణా! నీ కట్టుబాట్లలో పెరిగినవాళ్లు అవడం వల్ల పాండవులు నీతిమంతులు, పుణ్యపరులు, వీరులయ్యారు. వాళ్లు కుడివైపు, ఎడమవైపు అనేకమంది సేవకులుండి సేవిస్తుండగా సుఖంగా ఉండవలసిన వాళ్లు కష్టాల్ని అనుభవిస్తూ భయంకరమైన అరణ్యాల్లో నివసించారు? నన్నిక్కడ వదిలిపెట్టి నా మనస్సుని వాళ్లతో తీసుకుని వెళ్లిపోయారు.

నేను వడ్డిస్తుంటే కడుపునిండా తిని, పట్టుపరుపుల మీద పడుక్కుని మాగధుల మంగళ గానాలతో భద్రగజాల ఘీంకార ధ్వనులతో మేల్కొనే నా బిడ్డలు పొదలలో, గుట్టలలో పడి ఉండే పక్షి కూతలకి, జంతువుల అరుపులకి మేల్కొంటున్నారు కదా! అయ్యో! వాళ్లకెన్ని కష్టలొచ్చాయి? తండ్రిలేని పాండవుల తల్లినైన నన్ను కూడా విడిచి చాలకాలం అడవుల్లో కష్టాలు అనుభవించారు.

ఆ తరువాత విరాటుడి దగ్గర భంగపాటు, దుఃఖపాటు, సంకటపాటు కలిగాయి” అంది. మళ్లీ మాట్లాడుతూ “దానదయాగుణాలు కలిగిన ధర్మరాజు క్షేమంగా ఉన్నాడా? సింహపరాక్రమం కలిగిన భీమసేనుడు కుశలంగా ఉన్నాడా? అస్త్ర శస్త్ర విద్యల్లో ఆరితేరిన అర్జునుడు బాగున్నాడా? వినయసంపద కలిగిన నకులసహదేవులు నెమ్మదిగా ఉన్నారా? అయ్యో! పాంచాలి పరమ సాధ్వి- ఆమె సుఖంగా ఉందా? కొడుకుల కంటే కోడలంటే నాకు చాలా ఇష్టం.

కొడుకులు చూపించే ప్రేమ కంటే కోటి రెట్లు ఎక్కువ భక్తితో నాకు సేవలు చేస్తుంది. పాంచాలి పవిత్రమైన నడవడిక కలది. వంశంలో గొప్ప పేరు తెచ్చుకుంది. ఆమె అందరు చూస్తుండగా కురుసభలో అంత అవమానం పొందడం చూసి దుఃఖపడ్డాను. ఆ నాడు పాంచాలికి జరిగిన అవమానాలు చూసి సహించగలిగిన నేను ఎంతైనా ఓర్చుకోగలను. ఆమె అనుభవించిన కష్టాల్ని మించిన కష్టాలు లోకంలో ఇంకెవ్వరు అనుభవించి ఉండరు. విదురుడు ఒక్కడు తప్ప నాటి సభలోని వాళ్లలో ఒక్కళ్లైనా పాంచాల్ని పరాభవించడం ధర్మం కాదు, తప్పు అని చెప్పినవాళ్లే లేరు. ఆలోచిస్తుంటే విదురుడి మంచి స్వభావమే జగత్తుకి ఆధారం” అని చెప్పింది.

మేనల్లుడు శ్రీకృష్ణుడితో తన ఆలోచనలన్నీ పంచుకుని కొంచెం కుంగిన మనసుతో “కృష్ణా! ఈ పడిన కష్టాలూ, అనుభవించిన దఃఖాలూ అన్నీ ఒక ఎత్తు. ఈ పదమూడేళ్లూ నాకు బావ కొడుకు పెట్టే దయమాలిన తిండి తినడం ఒక ఎత్తుగా ఉంది. నేనేం చెప్పగలనయ్యా? కృష్ణా! దుర్యోధనుణ్ని, అతడి తోబుట్టువుల్ని నా కడుపున పుట్టిన పిల్లల్ని చూసుకున్నట్టే చూసుకుంటాను. నాకు భేదభావం లేదు.

అందుకు దేవుడే సాక్షి అని చెప్తున్నాను విను. ధృతరాష్ట్రుడు పాండవుల మేలుకోరేవాడు కాడని అనడం వల్ల ఏమి లాభం? అతడి కొడుకు దుర్యోధనుణ్ని తిట్టడం వల్ల ఏం లాభం? కౌరవుల్లో పెద్దవాడయిన బాహ్లికుణ్ని నిందించడం ఎందుకు? భీష్ముడి మీద తప్పు మోపడం న్యాయం కాదుగా! ఇటువంటి దుర్మార్గుల ఇంటికి పంపించినందుకు నా కోడలి పుట్టింటి వాళ్లని అనాలి.

అలా వాళ్లని నిందించడం కూడా సమంజసం కాదేమో? పార్థుడు పుట్టినప్పుడు ‘ఇతడు లోకాలన్నీ జయిస్తాడు అనే కీర్తి ఆకాశాన్ని అంటుతుంది. ఇతడు కౌరవుల్ని యుద్ధంలో గెలుస్తాడు. తానూ, తన తోబుట్టువులూ గొప్పదైన సామ్రాజ్యాధిపత్యాన్ని పొందుతారు’ అని అశరీరవాణి పలికింది. అవసరమైతే అలా చెప్పిన ఆ అశరీరవాణినే నిందించాలి. మరెవ్వళ్లనీ కాదు. లోకంలో ధర్మము ఉంటే అశరీరవాణి చెప్పిందే నిజమవుతుంది.

కృష్ణా! ధర్మోద్ధారకుడివి నువ్వున్నావు. నువ్వు మన్నించే నీ అనుగు నెచ్చెలికాండ్రకి చెప్పవలసిన మాటలున్నాయి విను. ముందుగా ధర్మరాజుతో ‘దీనులై యాచించి గడించిన సంపదలెందుకు? క్షత్రియ కుమారులు శరీరంలో ఉండే ప్రతాపం విడిచిపెడితే నిప్పులు వేడిని విడిచిపెట్టినట్లే అవుతుంది. ప్రజలు అటువంటి ప్రతాపహీనుల మాటలకి భయపడతారా?’

భీముడికి, అర్జునుడికి చెప్పు ‘క్షత్రియ కన్య పెళ్లి చేసుకుని కొడుకుని ఎందుకు కంటుందో, అటువంటి ప్రతాపాన్ని ప్రదర్శించేదుకు తగిన సమయం వచ్చింది. ఆలస్యం చెయ్యడం ఇంక తగదు. అప్పుడుగాని, మిమ్మల్ని ప్రజలు మగవాళ్లు అని అనరు’. మాద్రి పుత్రులైన నకుల సహదేవులతో చెప్పు ‘బాహుబలంతో బతకడం క్షత్రియ ధర్మమని అణిగిమణిగి ఉండడం దుఃఖించతగినదని చెప్పు. తమ కర్తవ్యమేమిటో ద్రౌపదిని అడిగి తెలుసుకోమని పాండవులందరితో చెప్పు’.

కోపగిస్తే భీమార్జునులకి అడ్డం లేదని నాకు తెలుసు. అంతంత అవమానాలు పొంది ఆ కసి తీర్చుకోవద్దా? ఆ పని పాండవులు చెయ్యగలరు. నువ్వు ఎలా చెయ్యమంటే వాళ్లు అలా చేస్తారు. మంచి ఆలోచన చెయ్యగల నువ్వు నా బాధ తీర్చు. ఈ దుఃఖాలనుంచి నన్ను ఎలా అయినా కడతేర్చు” అని కుంతి తన మనస్సులో చెలరేగుతున్న భావాల్ని వెల్లడించింది.

కుంతీదేవిని ఊరడించిన శ్రీకృష్ణుడు

కుంతి మనస్సులో బాధని అర్థం చేసుకుని శ్రీకృష్ణుడు “అత్తా! నువ్వు గుణవంతురాలివి. పుట్టినింటికీ, మెట్టినింటికీ మంచి పేరు తెచ్చేలా యోగ్యమైన నడవడికతో ప్రవర్తించే పుణ్యాత్మురాలివి. ధైర్యవంతురాలివి. అటువంటి నువ్వు మనసులో విచారాన్ని అణుచుకోకపోతే ఇంక ఈ లోకంలో దుఃఖాన్ని సహించేవాళ్లు ఎవరుంటారు? అమ్మా! బాధపడకు. నీ మనస్సులో బాధని నేను పోగొడతాను.

అత్తా! నీ కొడుకులు, కోడలు క్షేమంగా ఉన్నారు. అమితమైన భక్తితో నీకు సాష్టాంగ నమస్కారం సమర్పించారు. మనసులోనే నిన్ను కౌగలించుకున్నారు. అత్తా! నీ కొడుకులు లోకంలో ఉండే సాధారణమైన సుఖాలు అనుభవించాలని కోరుకోరు. వీరత్వంతో లభించే సౌఖ్యమే తమ మనసులో కోరుకుంటారు. వాళ్లు చెడ్డమార్గంలో నడిచేంత నీచబుద్ధి కలవాళ్లు కాదు. పాండవులు విరోధి వంశాన్ని కూకటివేళ్లతో పెల్లగించి, ఉన్నతమైన సామ్రాజ్యాధిపత్యమనే పండుగని జరుపుకుంటుంటే నువ్వు సంతోషంగా చూస్తావు. ఇంక బాధపడకు” అన్నాడు.

శ్రీకృష్ణుడు చెప్పింది విని కుంతీదేవి ముఖం వికసించింది. “కృష్ణా! పాండుకుమారులకి తండ్రి, గురువు, దైవం నువ్వే కదా! నీ మనసులో ఏది న్యాయమో, ఏది మంచిదో దాన్ని వాళ్లకి నిర్దేశించి చెప్తే వాళ్లు దాన్ని పాటించి బాగుపడతారు. నిన్ను ఆశ్రయించుకున్నవాళ్లకి ఎటువంటి బాధలు రావు కదా! మాధవా! ఒక్క పాండుకుమారులకే అనడం ఎందుకు? కౌరవులకీ, ఈ లోకంలో అందరికీ నువ్వే దిక్కు. సమస్త లోకాలకి నీ మాటే వేదం కదా!” అంది.

కుంతీదేవి మాటలు విని శ్రీకృష్ణుడు ప్రశాంతమైన ముఖంతో ఆమె దగ్గర సెలవు తీసుకుని ఆమె నివాసం నుంచి బయటికి వచ్చాడు. తన రాక కోసం అందంగా అలంకరించబడిన దుర్యోధనుడి భవనానికి కృతవర్మతోను, సాత్యకితోను కలిసి బయలుదేరాడు. శ్రీకృష్ణుడు రావడం చూసి కావలివాళ్లు వేగంగా వెళ్లి దుర్యోధనుడికి చెప్పారు. ఆయన ఆదేశాన్ని అనుసరించి వాళ్లు శౌరిని వినయంగా తీసుకుని వెళ్లారు.

సుయోధనుడు కైలాస శిఖరంలా ఉన్న ఎత్తైన సౌధంలో బాహ్లికుడు, భీష్ముడు, ద్రోణుడు, మొదలైనవాళ్లు; కర్ణుడు, శకుని, సైంధవుడు మొదలైనవాళ్లు; దుశ్శాసనుడు, వికర్ణుడు, దుర్ముఖుడు మొదలైనవాళ్లు; ఇంకా అనేక దేశాల ప్రభువులూ తన దుట్టూ చేరి ఉండగా సింహాసనం మీద కొలువుతీరి ఉన్నాడు.

శ్రీకృష్ణుడు వస్తుండగా ఎదురుగా వెళ్లి దుర్యోధనుడు, తన తమ్ముళ్లు ఆలింగనం చేసుకుని మర్యాదలు చేశారు. దుర్యోధనుడు చూపించిన ఎత్తైన బంగారు మంచం మీద గొప్ప వైభవంతో కూర్చున్నాడు. అతడు చేసిన సత్కారాలతో పూజలు అందుకున్నాడు.

Exit mobile version