Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మహాభారత కథలు-155: నారదుడు మొదలైన మహర్షుల్ని చూసి మాట్లాడిన శ్రీకృష్ణుడు

[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి. పాండవులు ‘పొత్తో’ లేకపోతే ‘పోరో’ నిర్ణయించుకుని వెంటనే రమ్మని శ్రీకృష్ణుడికి చెప్పిన తరువాత, హస్తినాపురానికి బయలుదేరేముందు శ్రీకృష్ణుడు నారద, తదితర మహర్షులను కలుస్తాడు. ఆ వృత్తాంతాన్ని; హస్తినలో కృష్ణుడి కోసం జరిగిన ఏర్పాట్లను ఈ ఎపిసోడ్‌లో చెప్పుకుందాం.]

నారదుడు మొదలైన మహర్షుల్ని చూసి మాట్లాడిన శ్రీకృష్ణుడు

పాండవులు శ్రీకృష్ణుడితో చెప్పవలసిన మాటలన్నీ చెప్పి అతణ్ని కౌగలించుకుని ప్రదక్షిణ చేసి సెలవు తీసుకుని వెనక్కి తిరిగారు. యాదవులు, పాంచాలురు మొదలైనవాళ్లు కూడా శ్రీకృష్ణుడి దగ్గర సెలవు తీసుకుని వెనక్కి మరలారు. తరువాత కృష్ణుడు ప్రయాణానికి కావలసిన పదార్థాలు సమకూర్చిన వాళ్లందర్నీ పలకరించాడు.

శీకృష్ణుడికి హస్తినాపురానికి వెళ్లే విశాలమైన మార్గంలో దారుకుడి నేర్పరితనం, గుర్రాల పటుత్వం వల్ల సాగుతున్న రథప్రయాణం ఆహ్లాదంగా అనిపించింది. దారిలో ఒకచోట నారదమహర్షి, జమదగ్ని, కణ్వుడు మొదలైన కొంతమంది మహర్షులు కనిపించారు.

వెంటనే గోవిందుడు రథం దిగి వాళ్లకి నమస్కరించాడు. వాళ్ల క్షేమసమాచారాలు అడిగి తెలుసుకుని “ఎందుకు వచ్చారు? మీకు నేను ఏమి చెయ్యవలసిన పనులేమిటి?” అని అడిగాడు. నారదుడు “వాసుదేవా! పుణ్యమూర్తివైన నిన్ను చూడడానికి, కౌరవ సభలో నువ్వు ఆదరంతో చెప్పే మాటలు వినడానికీ, విదురుడూ భీష్ముడూ మొదలైన వాళ్లు నీ మాటలు విని వాళ్లిచ్చే సమాధానాలు తెలుసుకోడానికీ కుతూహలంతో వచ్చాము” అని చెప్పారు.

అది విని శ్రీకృష్ణుడు “అలాగే రండి!” అని చెప్పాడు. మహర్షులు అతన్ని ఆశీర్వదించి “నారాయణా నువ్వు హస్తినాపురానికి వెళ్లు, తరువాత మేము అక్కడికి వస్తాము” అన్నారు.

కృష్ణుడు బయలుదేరి ఒక పవిత్రమైన ఆశ్రమం దగ్గర ఏటి ఒడ్డు మీద విడిది చేశాడు. అక్కడ వేదవిహితమైన అహ్నికాలు నిర్వర్తించాడు. పొద్దుపోయే సమయానికి కుశస్థలం చేరుకున్నాడు. అక్కడి బ్రాహ్మణులు నారాయణుడికి ఎదురువచ్చి తమ గృహాలకి రమ్మని ఆహ్వానించారు. శ్రీకృష్ణుడు ఇంతమంది పరిజనంతో రావడం లేదని చెప్పి అక్కడ ఒక విశాలమైన, సుందరమైన మైదానంలో గుడారాలు వేయించి అందర్నీ ఆ శిబిరాల్లో ఉండమన్నాడు. అర్హత కలిగిన కొంతమందిని తీసుకుని బ్రాహ్మణుల ఇళ్లకి వెళ్లి వాళ్లిచ్చిన ఆతిథ్యం స్వీకరించి వాళ్లని గౌరవించి తిరిగి తన విడిదికి వచ్చాడు.

హస్తినాపురంలో ధృతరాష్ట్రుడు శ్రీకృష్ణుడు వస్తున్నాడని తెలుసుకుని వెంటనే తన దగ్గరికి భీష్ముడిని, ద్రోణుడిని, విదురుడిని, దుర్యోధనుడిని, కర్ణుడిని, సైంధవుడిని, శకునినీ పిలిపించాడు. దుర్యోధనుడితో “శ్రీకృష్ణుడు పాండవుల పనిమీద  మన దగ్గరికి వస్తున్నాడు. ఈ రోజు కుశస్థలంలో ఆగాడు. ఇక్కడికి రేపు వస్తాడని విన్నాను. ఇంత అద్భుత విషయం ఉందా. లోకులంతా ఎవరి దగ్గరికి చేరాలని ఉవ్విళ్లూరుతారో అటువంటి మహానుభావుడే మన దగ్గరికి వస్తున్నాడు.

మనకి ఇంత అదృష్టముందా? అతణ్ని ఎవరు సంతోషపెడతారో వాళ్లకి శుభాలూ, ఎవరు అతన్ని ఆదరించరో వాళ్లకి అశుభాలూ జరుగుతాయనేది నిజం. కాబట్టి ఆయనకి అన్ని సపర్యలూ చెయ్యడానికి కావలసిన ఏర్పాట్లు అన్నీ చేయించు. భవనాలు అలంకరించడం వంటి మంగళకరమైన పనులకి ఆదేశాలియ్యి. అతడి మనసు ఆనందపడేటట్లు నీ వైభవానికి తగినట్లు తన మీద నీకున్న ప్రేమ వెల్లడి అయేట్లు అన్నీ సిద్ధం చేయించు” అన్నాడు.

ద్రోణుడు, భీష్ముడు ధృతరాష్ట్రుడి మాటలకి సంతోషించి ఇలా చెయ్యడం సరయిన పనే అన్నారు. దుర్యోధనుడు సేవకుల్ని పిలిపించాడు. వాళ్లతో “సభాసదనంలో నేలని కస్తూరితో అలకండి. కర్పూరంతో ముగ్గులు పెట్టించండి. గోడల్ని కుంకుమతో అద్దండి. ద్వారాలకి మణుల దండలు వ్రేలాడదీయండి.

ఒక్క సభా మందిరమే కాదు నగరమంతా అలంకరించండి. మీ కళాచాతుర్యంతో మన భవనంలోనూ, దుశ్శాసనుడి భవనంలోనూ మనోహరమైన చిత్రాలు వేయించండి. వృకస్థలంలో పందిళ్లు వేయించండి. వృకస్థలం శ్రీకృష్ణుడు విడిది చెయ్యడానికి తగిన చోటు” అని చెప్పి పరిచారికలతో మళ్లీ అన్నాడు “శ్రీకృష్ణుడు ఉదయమే ఇంటికి రావచ్చు. అతడు రావడానికి ముందే అన్ని పనులు చెయ్యాలి సుమా!” అని చెప్పి వాళ్లని పంపించేశాడు.

“హస్తినాపురంలో ఉత్సవం చాటండి” అని మరికొందరికి చెప్పాడు. “రకరాల సుగంధద్రవ్యాలు, పూలదండలు, రత్నాల నగలు, చిత్ర విచిత్రాలైన వస్త్రాలు సమకూర్చండి. రుచికరాలైన వంటకాలు, కమ్మని పానీయాలు సిద్ధం చేయండి” అంటూ ఆయా పనుల్లో ప్రవీణులైనవాళ్లని నియమించాడు.

శ్రీకృష్ణుడి రాక విదురుడితో చెప్పి సంతోషించిన ధృతరాష్ట్రుడు

ధృతరాష్ట్రుడు విదురిడితో “నేను శ్రీకృష్ణుడికి మణులు పొదిగిన రకరకాల రథాల్ని, వేగంగా పరుగెత్త గల గుర్రాల్ని, భద్రజాతికి చెందిన ఏనుగుల్ని, రత్నాల ఆభరణాల్ని, అనేకమంది పరిచారికల్ని ఇస్తాను. విదురా! మన గృహంలో గాని, సుయోధనుడి మందిరంలోగాని, దుశ్శాసనుడి భవనంలోగాని శ్రీకృష్ణుడి కళ్లకి ఏ వస్తువు ఇంపు కలిగిస్తుందో ఆ వస్తువుని మనం సంతోషంగా ఆయనకి సమర్పించాలి” అన్నాడు.

ధృతరాష్ట్రుడి మాటలు విని విదురుడు “మహారాజా! పరమాత్ముడైన శ్రీకృష్ణుణ్ని సంతోషపెట్టడం కంటే మంచి పని మరొకటి ఉంటుందా? అది మనకెంతో మంచిది. కాని, పాండు కుమారులు న్యాయపద్ధతిలో అయిదు గ్రామాలు ఇవ్వడానికి తగిన శక్తిలేని మనకి శ్రీహరికి ఇష్టమైన వాటిని సమర్పించడానికి తగినంత సంపద ఉన్నట్లుండి మనకి ఎలా వచ్చిందో చెప్పు.

మహారాజా! నీ ఉద్దేశం నేను గ్రహించాను. ఏవో కానుకలు సమర్పించే వంకతో శ్రీకృష్ణుడికి లంచమిచ్చి పాండవుల విషయంలో జరిగే పనిలో ఆయన్ని వశం చేసుకోవాలని చూస్తున్నావు. నువ్వు ఎంత తెలివి లేనివాడివో చెప్పలేను. నువ్వు మేరు పర్వతంతో సమానమైన ధనం సమర్పించినా శ్రీకృష్ణుడు అర్జునుణ్ని విడిచిపెట్టడు. వాసుదేవుడి మీద పార్థుడికి ఉన్న భక్తి ప్రపత్తులెటువంటివో వాసుదేవుడి గొప్పతనం ఎటువంటిదో తెలియనివాడివా నువ్వు?

అర్జునుడు శ్రీకృష్ణుడికి ప్రాణంతో సమానమైనవాడు. మంగళాచారానికి జలపూర్ణ కుంభానికి మించినది, కాళ్లు కడుగుకునే నీళ్లకి మించినది, యోగక్షేమాలు పరామర్శించడానికి మించినది అతడికి మరేవీ ఇష్టం కాదు. మహారాజా! నా మాటలు విను. శ్రీకృష్ణుడు నీ దగ్గరికి ఏ పని మీద వస్తున్నాడో ఆ పని నెరవేర్చడం అతడికి ఇష్టం. ఆ పని కాదని మనం ఎన్ని చేసినా లాభం ఏముంటుంది?” అన్నాడు.

విదురుడి మాటలు విని దుర్యోధనుడు ధృతరాష్ట్రుడితో “శ్రీకృష్ణుడి తత్త్వం ఎలాంటిదో విదురుడు చెప్పాడు. అతడు పాండవుల్ని ఎప్పటికీ విడిచిపెట్టడు. అతడి మనస్సు తెలియక కానుకలిస్తే మనం బయపడ్డామని అంటారు. పనిలో న్యూనత కలిగితే అందరూ నవ్వుతారు. శ్రీకృష్ణుడు పూజించతగ్గవాడని నాకు తెలుసు. కాని అతడికి మనం సంపదలిస్తే మన అల్పత్వం బయటపడుతుంది. శత్రువులూ ఇంకా అహంకారం చూపిస్తారు. ఇందువలన విరోధం అణిగిపోదు” అన్నాడు.

దుర్యోధనుడు మాట్లాడిన తరువాత భీష్ముడు ధృతరాష్ట్రుడిని చూసి “నువ్వూ, నీ కొడుకూ ఏమైన ఇస్తే ఒక రకంగానూ, ఇవ్వకపోతే మరొక రకంగానూ భావిస్తాడా శ్రీకృష్ణుడు? కుమారా! నారాయణుడు చెయ్యాలనుకున్న పనిని తప్పించడం మనవల్ల కాదు. ఆయన పాండవుల్ని ఉద్ధరించడానికి ఇక్కడికి రావడం సమంజసమే. ఆ మహాత్ముడి అజ్ఞ శిరసావహించు! శ్రీకృష్ణుడు ధర్మయుక్తంగా చెప్పే మాటలు నువ్వూ, నీవాళ్లూ విని గౌరవంతో ఆ ప్రకారం చేస్తే పనులన్నీ సఫలమవుతాయి” అన్నాడు.

భీష్ముడి మాటలు విని దుర్యోధనుడు ఆయనతో “శ్రీకృష్ణుడు పాండవులకి అర్థరాజ్యం ఇమ్మని చెప్తాడు. నేను ఇవ్వను. ఇంక ఆ విషయం వదిలి పెట్టండి. మరొక పని చెయ్యాలని అనుకుంటున్నాను. పాండవులకి గురువు, తల్లీ, తండ్రీ, పురుషుడూ, విద్యా, దైవం, దాత అయి అన్ని విధాలుగానూ రక్షిస్తున్న శ్రీకృష్ణుణ్ని పట్టి బంధిస్తే వాళ్లు రెక్కలు తెగిన పక్షులవుతారు. నాకు అణిగి మణిగి ఉంటారు. పాంచాలరాజు, యాదవులు మొదలైనవాళ్ల చుట్టుపక్కాలు, మిత్రులు, నేను చెప్పినట్లు వింటారు. దేశాలన్నీ నేనే ఏలుతాను. ఇందుకు తగిన ఉపాయాన్ని సిద్ధపరుచుకుంటాను. ఇంక నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు” అన్నాడు.

అతి దారుణంగా ఉన్న అతడి ఆలోచనకి మంత్రులతో కలిసి సభ తీరి ఉన్న ధృతరాష్ట్రుడు విని ఉడికిపోతున్న మనస్సుతో దుర్యోధనుడితో “అయ్యో! శ్రీకృష్ణుణ్ని బంధిస్తానని చెప్పడం లోకానికంతటికీ కీడు చెయ్యడమే కదా! ఈ దురాలోచన మానెయ్యి. రాయబారిగా వచ్చినవాడిని, మహాత్ముడిని న్యాయం కోసం పాటుపడేవాడిని బాధించకూడదు.

రాయబారం చెయ్యడానికి వస్తున్నవాడు, గొప్పవాడు, ధర్మ నిలబెట్టడం కోసం పాటుపడేవాడు అయిన శ్రీకృష్ణుణ్ని నొప్పించకూడదు. అతడు సామన్యుడనుకున్నావా? సకల లోకాల్ని వ్యాపించి ఉన్న శ్రీమన్నారాయణుడు. అంతేకాదు, అతడు రావడం వల్ల మన కురువంశానికి జరుగుతున్న హాని ఏముంది? పాపీ! పట్టి బంధించడానికి అతడు చేసిన తప్పేమిటి?” అని గట్టిగా మందలించాడు.

భీష్ముడు ధృతరాష్ట్రుడితో “నీ కొడుకు ప్రాణసంకటమైన పని చెయ్యాలని అనుకుంటున్నాడు. గోవిందుడికి కీడు చెయ్యడానికి ప్రయత్నిస్తే తను, తన వాళ్లూ కూడ నాశనమయిపోతారు. ఈ పని చేసినా చెయ్యకపోయినా మహాపురుషుడికి ఇలా అపకారం చేస్తాను అని అనుకున్న దుష్టులు నాశనమై పోతారు. నేనిలాంటి మాటలు వినలేను” అని చెప్పి ముఖం ముడుచుకుని అక్కడినుంచి వెళ్లిపోయాడు

ధృతరాష్ట్రుడు కొడుకుతో “ఇటువంటి కాని పనులు మనసులో అనుకున్నావంటే అప్పుడే వాటిని చేసి తీరుతావు. నాయనా! ఇటువంటి పాడుపని చేస్తే కీడు మూడుతుంది. ఈ పని మానుకో!” అని చెప్పి అతడినీ, మిగిలినవాళ్లందర్నీ వెళ్లిపొమ్మని చెప్పి ఒక్కడే కూర్చుండిపోయాడు.

మర్నాడు శ్రీకృష్ణుడు ఉదయమే తన విధులన్నీ పూర్తి చేసుకుని హస్తినాపురానికి బయలుదేరాడు. కుశస్థలపురంలో నివసిస్తున్నవాళ్లు సాగనంపడానికి వచ్చారు. వాళ్లందరినీ నిలిచిపొమ్మని చెప్పి శ్రీకృష్ణుడు బయలుదేరాడు. దుర్యోధనుడు పంపించిన పిండివంటలు, పళ్లు, చందనము, పూలదండలు దారిలో అక్కడక్కడ ప్రేమతో ఆయనకి తెచ్చి ఇచ్చారు.

ఇచ్చినవాటిని తీసుకున్నట్టుగా నటించాడు నారాయణుడు. అలా శ్రీహరి హస్తినాపురానికి వస్తుంటే ధృతరాష్ట్ర మహారాజు- బాహ్లికుడు, భీష్ముడు, ద్రోణుడు మొదలైన బంధువుల్ని, మిత్రుల్ని, సకల రాజసమూహాన్ని, తన కుమారుల్ని ఆయనకి ఎదురుకోలు చెప్పడానికి పంపించాడు.

(వచ్చే వారం – హస్తినలో దుర్యోధనుడితో శ్రీకృష్ణుడు ఏం మాట్లాడేడో తెలుసుకుందాం.)

Exit mobile version